జ్వరమెప్పుడొస్తదా అని…

కవిత్వమే జ్వరవేదన–దానికితోడు నిజంగా జ్వరమే తోడయితే…ఇట్లా వుంటుందేమో ఎవరికైనా! కవిత రాయడం అనే ప్రక్రియ ద్వారా కవిత్వం  ఆ జ్వరానికి మాత్ర అవుతుందో లేదో కానీ, కవి ఇంకేదో చెప్తూనే వుంటాడు జ్వరం అనే excuse చెప్పి!
రవీంద్ర రావెళ్ల నా మటుకు నేను ఎక్కువగా వినని పేరు. చదవని పేరు. ఈ కవిత చదివాక నేనూ జ్వరం మీద రాసుకున్న సందర్భం గుర్తొచ్చింది. అన్నిటికంటే ముందు, అసలు జ్వరాన్ని కవితా వస్తువు చేసిన వాసూ గుర్తొచ్చాడు. మేమిద్దరమూ చేయలేని ఇంకో పని- అమ్మని తలచుకోవడం- రవీంద్ర కొత్తగా జతకలుపుతున్న విషయం ఇక్కడ.
 రవీంద్ర కుటుంబంలో ముందూ వెనకా ఎవరూ కవిత్వం జోలికి వెళ్ళిన వాళ్ళే లేరు. ఏడో తరగతిలో కళ్యాణి టీచర్ రూపంలో అతని కవిత్వ యాత్ర మొదలయింది. ఆ టీచర్ ఇచ్చిన శ్రీశ్రీ “మహాప్రస్థానం” అతన్ని వుక్కిరిబిక్కిరి చేసింది. ఇంతా చేస్తే, శ్రీశ్రీ కూడా జ్వరపీడితుడే కదా!
రవీంద్ర కవిత్వ యాత్రలో ఇంకో మలుపు- ఏడాది కిందట తగుళ్ళ గోపాల్ రూపంలో కనిపించింది. గోపాల్ పరిచయం తరవాత రవీంద్రకి కవిత్వం అడ్రస్ ఏదో దొరికినట్టు అనిపించింది. కవిత్వం అంటే అంత్య ప్రాసల పద విహారం కాదనీ, బతుకు వేదన అనీ అర్థమైంది. అదిగో–అక్కడ మొదలైంది రవీంద్ర వెతుకులాట!
ఇక్కడ ఈ జ్వర కవితలో అతను ఇంకో మలుపు తిరుగుతున్నాడని నాకు అనిపిస్తోంది!
~

ల మీద ఒక పెద్ద బండని పెట్టి

శరీరాన్ని ఎవరో కాల్చేస్తున్నట్టుంది

 

అమ్మా!

నువ్విప్పుడు పక్కనుంటే

తడి గుడ్డతో నా బాధని తుడిచేసేదానివి కదా

 

నాకిష్టమైన పులిహోర వండి

నన్ను మళ్ళీ నీ అల్లరి కృష్ణయ్యని చేసుకునే దానివి కదా

 

మనసుకి ముళ్ళు గుచ్చుకుంటే

నొప్పి తెలియకుండా ముళ్ళు తీయడం నీ ఒక్కదానికే సొంతమమ్మా

 

ఈ హాస్టల్ నాకెంతో ప్రేమనిచ్చింది

కాని నీ అంత ప్రేమ కాదది

 

నా గొంతుని బట్టి గుండెలో ఉన్న దుఃఖాన్ని తెలుసుకునే దానివి

గాయాలపై వెన్న రాసినంత తేలికగా

కష్టాల్ని పూడ్చేసే మార్గాల్ని చూపేదానివి

 

అందరూ నువ్వు చదువుకోలేదు అంటారుగాని

మనిషి దుఃఖాన్ని కరిగించి

నవ్వుల్ని చిగురించేలా చేసే విద్య నేర్చావని తెలవదు

 

ఎనిమిదో తరగతిలో

హాస్టల్లో ఉన్నప్పుడు

పచ్చని తోటలా ఉండే నా మనసు

ఎండిపోయినట్టుగా ఉండేది

 

జ్వరమెప్పుడొస్తదా అని

ఆశగా చూసేవాడ్ని

 

రోజుకి నాలుగుసార్లు నీకు

కాల్ చేస్తూ

కళ్ళు తుడుచుకునే నేను

ఇప్పుడు నువ్వు కాల్ చేస్తే  కట్ చేస్తూ

నీకు ముద్దదిగకుండా చేస్తున్నాను

 

నేను మారి ఉండొచ్చేమో

కాని

నీ ప్రేమలో ఎటువంటి మార్పూ లేదు

 

నాకు నీ ప్రేమ కావాలమ్మా

కావాలి….

 

మొక్కకు నీరెంతవసరమో

నాకు నీ ప్రేమంతవసరమమ్మా

లేదంటే వాడిపోతాను

 

అవును

 

ఒళ్ళు నిప్పులు కక్కుతున్నా

ఇలా నీ ప్రేమ గురించి రాస్తుంటే

తడి గుడ్డతో నా బాధని నువ్వు

తుడిచేస్తున్నట్టుంది.

*

రవీంద్ర రావెళ్ళ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • It is so true, I remember laying on my mother’s lap with typhoid, and other types fevers.
    Felt sorry for giving trouble to my mom and at the same time couldn’t fight with the fever without my mom’s hand on my forehead.

  • తమ్ముడు… శుభాకాంక్షలు. అఫ్సర్ సార్ రాసిన వాక్యాలు ఎంతో విలువైనవి. నీకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మాటలు. మంచి కవితతో ఏరువాకలో రవీంద్ర తో ప్రారంభించిన సారంగ కు వేల నెనర్లు.

  • జ్వర కవిత,బాగుంది. అచ్చంగా అమ్మ ను, గుర్తు చేసి. కరోనా జ్వరము లో, నేను ఇలానే గుర్తు చేసుకు న్నా లేని అమ్మ ను, తలచు కొని! ధన్యవాదాలండీ!