నేనొక చిత్రం గీయాలి
మనసు కేన్వాస్ ని పరిచాను
చూపుని సూదిలా చెక్కుకున్నాను
తీరా వేయాల్సిన బొమ్మ
తీరుగా రాకముందే
సూది ముల్లు పుటుక్కున విరిగింది
పదేపదే చెక్కుకుంటునే ఉన్నాను
నేనొక చిత్రం గీయాలి
కనీసం పెన్నుతోనైనా వెయ్యాలి
కలం పొందికగా వేళ్ళమధ్య
అందమైన అమ్మాయిలా
అమరికగా కూర్చొని నవ్వింది
విజిల్ వూది పరిగెత్తించాను
గీతలు గీయటం మరచిన వేళ్ళు
కాన్వాస్ నిండా అక్షరాల్ని కుప్పపోసాయి
నేనొక చిత్రం ఎలా అయినా గీయాలి
అల్మారా లోంచి రంగులపొదితీసి
కాలంతీరినవి పక్కన పడేసి
జీవం వున్న రంగుల్ని
మురిపంగా చేతుల్లోకి తీసుకున్నాను
కోరిక తీరబోతోందనుకున్నంతలో
బాటిళ్ళలోని రంగులు చేజారి
కాన్వాస్ మీద ఒలికి పోయాయి
అయ్యో అనుకుంటూ కాన్వాస్ అందుకున్నాను.
ఒక్కసారిగా నా కళ్ళు మెరిసాయి
నా ముందు రంగురంగుల వర్ణశోభితమై
కాన్వాస్ మీద జీవితం వెలుగులు చిమ్ముతోంది
అందం అయినా ఆనందమైనా
ఉండేది చూసే చూపులోనే
రాగమైనా రంగులైనా అనురాగమైనా
పరుచుకోవాల్సిందీ బతుకు కేన్వాస్ మీదే!
*
చిత్రం: శీలావీర్రాజు
కాన్వాస్ మీద జీవితం వెలుగులు చిమ్ముతోంది
గిరి ప్రసాద్ గారికి ధన్యవాదాలు
కవిత బాగుంది.
అంతర్లీనంగా మనలో మిళితమై ఉండే వర్ణాలు మనమెలా ఆహ్వానిస్తే ఆ రూపంలోనే కొలువుదీరతాయి అని కవితాత్మకంగా చెప్పారు.
సుభద్రాదేవి గారికి అభినందనలు.
ఎమ్వీ రామిరెడ్డి గారికి ధన్యవాదాలు
” అందం అయినా ఆనందమైనా
ఉండేది చూసే చూపులోనే
రాగమైనా రంగులైనా అనురాగమైనా
పరుచుకోవాల్సిందీ బతుకు కేన్వాస్ మీదే! ”
గొప్ప తాత్వికతతో చెప్పారు అక్కయ్య గారూ!!
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు రామయ్యగారూ