జముకుల పాట

కరోజు రాత్రి తిళ్ళుతినే వేళప్పుడు, మా అమ్మ వంటగదిలో వడ్దనకు సిద్ధపడుతూ, తిండానికి రండని మమ్మల్నికేకేసింది.

నేను మా సీతప్ప, సూరన్నయ్య(సూర్యనారాయణ) వెళ్లి వంటింట్లో కూర్చున్నాము. మా అయ్య ఎప్పటిలాగే పెద్దగదిలో ద్వారము దగ్గర తలుపుకు చేరబడి కూర్చున్నాడు.

అప్పుడే వీధిలోనుంచి ఒక వింత శబ్దం విపడింది. అంతవరకు నేనెప్పుడూ అటువంటి శబ్దము వినలేదు. ఆశ్చర్యపడ్డాను‘ఇదేమిటబ్బా..!?’అని. మా వంటిల్లు వీధి వైపుకి దగ్గరగా వుంటుంది.

అమ్మ మాకు బువ్వలు ఒడ్డిస్తోంది.

“అమ్మా! ఏటా శబ్దము” అమ్మనే అడిగాను.

“బోనేలోడు జముకు వాయిస్తున్నాడు” అంది.

“జముకు అంటే!? అది ఎందుకు వాయిస్తున్నాడు!? అర్ధంకాక అడిగాను.

“ఈ రాత్రి బోనేల పాట పాడుతారన్నమాట. ముందుగా ఒకడొచ్చి వీధిలో అలికిరి చేస్తాడు. దాంతో రాత్రికి పాటవుతుందని. అందరికి తెలుస్తాది. కాసేపయినాక, తిళ్లు తిన్నాక, పాట వినాలనుకున్నవాళ్లు వెళతారు” అంది.

“ఎక్కడ పాడుతారు!?” అడిగాను.

“ఇక్కడే.. మన అమ్మతల్లి గుడిదగ్గరే” చెప్పింది.

నాకు బాగా చిన్నప్పటినుంచి పాటలంటే చాలా యిష్టం. మా అమ్మ గురు పూజలుకు ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంటతీసుకువెళ్లేది. అక్కడ భజనలు చేసేవారు పాటలు పాడే వారు. అలాగ నాకు పాటలంటే ఇష్టం ఏర్పడింది.

“నాకు బేగి బువ్వొడ్డించీ, నేనెలతాను” అన్నాను

“గాభరలేదు, పాట మొదలయ్యేసరికి చాలాసేపు అవుతుంది.” అంది

అమ్మతల్లి గుడి మాయింటికి పడమరవైపున వందగజాల దూరమే. అక్కడే వెన్నెల రాత్రు లప్పుడు, వేసవి తొలిరోజుల్లోనా.. రాత్రుళ్లు పెద్దవాళ్లు కబాడీ ఆటలు ఆడుతుంటారు. సంగి డీలు ఎత్తుతుంటారు.చిరతల భజనలు(కోలాటము), చెక్కభజనలు చేస్తుంటారు. అవన్నీ తెలుసు. కానీ, ఈ జముకుల పాటేమిటో  అంతవరకు తెలియదు.

అందుచేత చూడాలని నాకు చాలా తొందరగావుంది. వేగముగా వెళ్లాలని ఉత్సాహపడు తున్నాను.

గబగబా బువ్వతినేసి అక్కడికి పరుగెత్తేను.

అక్కడ ఒకవ్యక్తి వీధిలో నున్న కరెంటు స్తంభంకి ఒక ప్రక్కగా పెద్ద రాయిమీద కూర్చోని డబ్బాలాంటి ఆ జముకు వాయిస్తున్నాడు, తప్ప యింకెవరూ లేరు. జనాలు ఎవరూ రాలేదు.

నా ఉత్సాహము నీరుగారిపోయింది.

ఇంటికొచ్చి మా అమ్మతో చెప్పేను అక్కడెవలూ జనాలే లేరని.

“వస్తారు.. తొందరెందుకు” అంది అమ్మ.

మేమందరమూ బువ్వలు తిన్నాక, తాను తిని, వంటిళ్లు సర్ది, గిన్నెలు తోమి, కడిగి, అవన్నీ సర్దుకోని, తలుపులువేసి మా అమ్మ గడపలో కొచ్చేసరికి, గంట.. గంటన్నర సమయము పట్టింది. ఈలోపల నేను రెండుమార్లు గుడిదగ్గరికి వెళ్లి చూసుకోని వచ్చేను. ఏమి మార్పు లేదు.

“అమ్మా! జముకుల పాటంటె ఎలావుంటుంది” అని అడిగేను

నా ఉత్సాహాన్ని గమనించిన మాఅమ్మ, జముకులకథ ఎలావుంటుందో చెప్పింది. ఎందరుంటారు,ఎలా ఆడుతారు, ఎలాపాడుతారో..వివరించింది. రాత్రి ఒంటి గంటా రెండు వరకూ పాడుతారని చెప్పింది.

“వీళ్ళు మనవూరి వాళ్లా లేక మరేవూరి వాళ్లా” అడిగాను.

“వెళ్లి చూస్తేగానీ తెలీదు. మనవూరి వాళ్లయితే కురమాన అప్పయ్య (అప్పలస్వామి) తవిటి వాళ్ళు పాడుతారు. తవిటి పాడితే గాత్రమే తప్ప ఆటవుండదు. కానీ తవిటి గాత్రం బాగుంటాది. ముందల పాట పాడుతుంది.

పొరుగూరు వాళ్ళెవరైనా అయితే, మగవాడే ఆడవేషము వేసుకొని, ముందలపాట పాడతాడు. వాళ్లయితే పాటకు తగ్గట్టు ఆడుతారు. అని చెప్పింది.

ఆ వివరాలు విన్నకొలది నాకు తొందర ఎక్కువయింది. అది గమనించిన మాఅమ్మ అంది.

“గాభరాపడకు ఎల్దుమునే.. ఉండు, నేనూ వస్తాను” అని ధాన్యము బుట్టిమీది గోనె ఒకటి తీసింది.

“అదెందుకూ!?” అన్నాను

“కూర్చోడానికి. నిలబడి ఎంతసేపు వింటాము. ఎక్కడో ఒకదగ్గర కూర్చోవాలి గదా!                                                                          వీధిలో అంతా ఇసక, గోనె వేసుకుంటే, గంటో ఘడియో కూర్చోని వినొచ్చు” అంది.

నేను ఆగోనె పట్టుకొని సిద్దంగా వున్నాను. కాసేపు పోయాక” పదా ఎల్దుము” అంది.

మేము అక్కడికి వెళ్ళేసరికి కొద్దిగా జనాలు చేరేరు.

పాటగాల్లు ముగ్గురున్నారు. అందులో ఒకరు చీరకట్టుకొని ఉన్నారు. కానీ పూర్తిగా కనపడడము లేదు. తలమీంచి ఒక తెరలాంటిది కప్పుకున్నాడు.

 

అమ్మతల్లి గుడి దగ్గర మూడురోడ్లు కలుస్తాయి. కనుక జాగా కొంచెము విశాలంగా వుంటుం ది. పాటగాళ్లు రోడ్డు మధ్యలో పెద్ద కర్రొకటి పాతి దానిపై కిరోసిను బుడ్డీ వెలిగించారు. అది దోసకాయలాగా పొడుగ్గావుంది. రెండు చివరల రెండు ఒత్తులు వెలిగించారు. నిజానికి అక్క డ స్తంభము పైన కరెంటు బుడ్డీ వెలుగుతునే వుంది. అయినా ఆ కిరోసిను బుడ్డీ వెలిగిం చారు.

ముగ్గురూ ఒకచోట చేరి మెల్లగా పాడుతున్నారు.

నాకు సందేహమొచ్చి అమ్మను అడిగేను

“అదేటమ్మా! అలా మెల్లిగా పాడుతున్నారు.!? మనకేమి వినపడడమే లేదు” అన్నాను.

మా అమ్మ నవ్వింది. బహుశా నా ఆరాటము చూసే కావచ్చు.

“వాళ్లు పేర్దన చేస్తున్నారు. అది అయినాక గట్టిగానే పాడుతారు” అంది.

నేను ఆ ప్రార్ధన ఎలా చేస్తున్నారో అని వాళ్లవైపే చూస్తూ ఒకచెవి అటుగావేశాను.

పల్లెటూరుల తిళ్ళేల  మించిపోయాకా అంతా నిశ్శబ్దమే. కనుక ఊరంతా ప్రశాంతము గా వుంది. చుట్టూ కూర్చున్న జనాలు కూడా నిశ్శబ్దముగానే వున్నారు. ఆ నిశ్శబ్దములో వారి పాట చిన్నగా వినపడుతోంది.

 

ఇద్దరితల్లుల…ముద్దుల తనయుడా… ముద్దుల తనయుడా…

గౌరి ప్రియా తనయా..గజాననా…”  పాడుతున్నారు.

ఆడవేషము వేసుకున్నతను ముందుగా పాడుతుంటే, మిగతా ఇద్దరూ జముకు వాయి స్తూ, వెనకపాట పాడుతున్నారు. వాళ్లపాట, జముకు శబ్దము కలసి చాలా నెమ్మది గా వున్నా వినసొంపుగా వుంది. బాగుంది.

ప్రార్ధన ముగిసేకా ముందుపాటగాడు జనము వైపు తిరిగి తలమీదకప్పుకున్న తెర తీసేశాడు.

ఆశ్చర్యము. అతని ఒంటినిండా బంగారముతో మెరిసిపోతూ ఒక దేవతలాగా కనపడ్డాడు నాకంటికి.

“అమ్మా! అదంతా బంగారమేనా!?” అడిగాను. అమ్మ నవ్వింది

“అదంతా బంగారమైతే, ఆడు పాటకెందుకు వస్తాడు!? హాయిగా కాలుమీద కాలేసుకొని ఇంటిల కూకుంతాడు. అవన్నీ అట్టముక్కలే, వాటికి రంగుకాయితాలు అంటిస్తారు” అంది.

“ఒహో!” అనుకున్నాను. కానీ నాలో ఎందుకో నిరాశ కలిగింది. అవన్నీ నిజంగా బంగారమైతే బాగున్ను అనిపించింది.

పాటుకుడు దీపము చుట్టు తిరుగుతూ, సభవారికందరికీ నమస్కారాలు పెడుతున్నాడు. అదికూడా పాట రూపములోనే పాడుతున్నాడు.

“ఓ సభా సదులారా…! ఓ వైశ్యా రత్నములారా…!ఓ సూర్య సంఘంబులారా ….! ఓ పెద్దలారా! మీకు తెలియని కథలు కావు.మీరు ఎరుగని పురాణములు కావు. నాలోకానీ, నాతోటి పాటుకుల్లో కానీ, తప్పులుంటే ఒప్పులుగా భావించమని వేడుకుంటున్నాను… మా పెద్దల్లారా! అని అన్ని పైపులా తిరిగాడు.

“ అయ్యా! మేము జలగన్నె(జలకన్య)పార్వతి, అళియాదేవి కథ, రెక్కలరంభ,

మత్స్యవల్లభుడు, లవకుశ, పరుశురామ యుద్దము, శశిరేఖ పరిణయము,

సారంగధర, నల చరిత్ర,మొదలైన కతలు పాడుతాము. ఇందులో తమరు..పెద్దలు ఏది పాడమని సెలవిస్తే, ఆకతే పాడుతాము.” అని వినయంగా చెప్పాడు.

“పరుశురామ యుద్దము పాడండి, రేనుకా యల్లమ్మకత కదా!” అన్నారెవరో

“వద్దొద్దు… కుశలవుల సెరిత్ర పాడండి, శాన్నాలయిపోయింది ఆకతిని”. అంది బోసి నోటితో కొల్లోలి ముసలమ్మ (రాజనాయుడుగారి) తన నోటిలో ఒక్కపన్నూ లేదు. అక్కడున్న అందరిలోకి పెద్ద వయసున్న ముసలమ్మ. ఆమె,ఏరోజు పాటయినా తప్పనిసరిగా వస్తాదట.ఆమెకు ఈ జముకుల పాటంతే అంత ఇష్టమని అమ్మ చెప్పింది.

అందుకు ముందరి పాటుకుడు అన్నాడు.

“అమ్మా! మీరేది పాడమంతే అదే పాడుతాను.కానీ కుశలవుల సెరిత్ర శాలా పెద్దపాట. పాడితే రాములవారి జననము నుంచి పాడాలి. అది ఒకరోజులో అవ్వదు.” అన్నాడు

“అవ్వప్పోతేమి!? ఈవేల సగంపాడు, రేపు మిగతా సగంపాడు” అన్నాది.

“అయితే, నలచరిత్ర పాడరాదురా!” అన్నారు ఒకరు.

“కాదు..కాదు..శశిరేఖ పరిణయము పాడు” అన్నారు మరొకరు.

“అవన్నీ ఈమద్దిన ఇన్నకతలే, కుశలవుల సెరిత్ర సెప్పు, శానాకాలమయింది ఇని” అంది కొల్లెమ్మా( కొల్లోలి ముసలమ్మ)

చాలామంది మాట్లాడారు. కానీ చివరకు ఆ ముసలమ్మ మాటే నెగ్గింది.

అప్పుడు పాటగాడు ఇలా అన్నాడు.

“అమ్మా! ఒకేదగ్గర రెండురోజులు పాడాలంతే” అని నసిగాడు. అతని ఉద్దేశము అర్ధమయిందేమో ముసలమ్మ అంది.

“ఈ రోజు మేము రమ్మంతే వచ్చావా!? నీయంతల నువ్వొచ్చావు, ఈవేల పాడు, ఎవులే మిచ్చినా తీసుకో..రేపుటికి మట్టుకు మేము బియ్యాలెత్తి యిస్తాము” అంది.

పాటుకుడు చాలా సరదాపడ్డాడు. సంతోషంగా పాట అందుకున్నాడు .

“సూర్యవంశమునందు జన్మించి నుతికెక్కి

అయోధ్యనేలేటి రాజు దశరధుడు.

అతనికే మువ్వురూ భార్యలూ గలరయ్య..

కౌసల్య, సుమిత్ర, కడకు కైకేయి ..

అట్టి యా రాజునకు పుత్రులే లేరాయే …” పాతసాగుతోంది.

“ముందరి పాటుకుడి గొంతుకు బాగుంది.” అన్నాది అమ్మ.

నాకు కూదా పాట చాలానచ్చింది. గాయకుడు రకరకాల వరసల్లో చాలా బాగా పాడుతున్నాడు. పాటకు తగ్గట్టు నాట్యము చేస్తున్నాడు.

మా అమ్మకు కూడా పాటనచ్చింది. కొంతసేపు విన్నాక.

“బాగా పాడుతున్నాడు గానీ, అలాగని కూర్చుంటే.. తెల్లారి లెగనేను నాయనా ! పొలాని కెల్లాలి, నేను ఎల్తాను. ఎల్లి పడుకోవాలి.. నువ్వుంతావా!?.. వస్తావా!?” అడిగింది.

“నేనుంటాను” అన్నాను

“నువ్వుంటే వుండు” అని చెప్పి తన సునబగాయి తీసి, ఒక పావలాకాసు నా చేతిలో పెట్టింది.

“డబ్బులెందుకు” అడిగాను

“సివర్లో ఆరతిచ్చి, ఆరతి పళ్లెము అంతలెక్క తిప్పుతారు. అందులో వేసేయి” అని చెప్పింది.

“డబ్బు లెందుకు యివ్వాలి” నా సందేహము నాది.

“వాళ్ళు ఊరుగాని ఊరొచ్చి ఎందుకు పాడుతున్నారు!?  నలుగురూ నాలుగు డబ్బు లిస్తారనే కదా! కొందరు కొందరు రూపాయి. అద్దు రూపాయి లిచ్చి సదివిస్తారు. మనదగ్గర డబ్బుల్లేవు కాబట్టి, పావలా యిస్తన్నాను” అంది.

“ఇవ్వప్పోతే అడుగుతారా!”

“అడగరు, కానీ ఒత్తిని వినేసి ఎలా గెలిపోతాము!? తప్పుకదా! వాళ్ల కడుపాకలికే కదా, వచ్చి పాడుతున్నారు. ఎవులూ డబ్బులివ్వప్పోతే ఆలెంత బాదపడతారు.

అయినా ఒకలి కష్టం ఒకలు ఉత్తినే తీసుకోకూడదు… ఆటైనా, పాటైనా, మనం చూశాము కాబట్టి మనకు కలిగినంత మనమూ ఇవ్వాలి. లేప్పోతే మనం ఆలకి ఋణ పడిపోతాము నాయనా ” అంది.

“సరేలే” అనేశాను. అమ్మకు నాపై సందేహమొచ్చిందేమో గట్టిగా చెప్పింది

“మరిసిపోకు. ఒకేల నీకు నిద్దరొచ్చి మధ్యలో వచ్చేసినా, వాళ్ల దగ్గరికెళ్ళి డబ్బులు ఇచ్చేసొచ్చీ”  అంది.

మా అమ్మ వెళిపోయిన ఒక గంట, గంటన్నర తరువాత పాటుకుడు పాట ఆపి

“అమ్మా! ఇక్కడికి ఈ రోజు ఆపుదాము, రేపు మిగతాకథ పాడుతాను” అన్నాడు. కొల్లోలి ముసలమ్మ వైపు చూస్తూ.

అప్పటికి జనాలు కొందరు తగ్గినా యింకా చాలామంది ఉన్నారు. వింటున్నారు.

ముసలమ్మకి కోపమొచ్చింది.

“ఏటిరా! ఆపేస్తావా!” అన్నాది, బోసినోటితోనే గట్టిగా

“అమ్మా! రాత్రి రెండుజాములు మించిపోయి చాలా సమయమైపోయింది. ఎలాగూ ఈరోజు కత పూర్తికాదు. కనుక, మిగతాకత రేపు పాడుకుందాము తల్లీ”  అన్నాడు.

ముసలమ్మ ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు.

“సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అడివిలో అద్దుమద్దేనంగా వొదిలేస్తావా! ఆ ముని ఇంటికి చేర్చు(వాల్మీకి ఆశ్రమానికి) అంతవరకూ పాడు. పాడాల్సిందే” పట్టుపట్టింది.

నాకు కథ గుర్తుకొచ్చింది. అన్నగారి ఆజ్ఞమీద లక్ష్మణుడు సీతాదేవిని అరణ్యములో విడిచి పెట్టేశాడు. అంతవరకుపాడి ఆపుతామన్నాడు పాటగాడు.

“అమ్మా! రేపు వాల్మీకి మహర్షీ కలవడమూ, కుశలవుల జననమూ, రాములవారి  యాగాశ్వమును కుశలవులు అడ్డుకోడమూ,తండ్రీ కొడుకుల యుద్దము, సీతమ్మ తల్లి తనతల్లి భూదేవిలో కలిసిపోవడము, కుశలవుల పట్టభిషేకము, రాములవారు  అవతరాన్ని చాలించడము… పాడాలి. రేపటికి సరిపోతుంది”  అంటున్నాడు.

ముసలమ్మ ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు.

“సీతమ్మకు ఉన్న కష్టాలు చాలవురా!..మళ్ళీ కష్టాల్లో వొదిలేస్తావా!” అన్నాది.

“ముని దగ్గిరికి చేర్చేసి ఒదిలి” అంది.

పాటుకులు మరికొద్ది సేపు పాడేరు,వాల్మీకి మహర్షి సీతమ్మను చూసి, తన ఆశ్రమానికి తీసుకు పోయేంతవరకూపాడి, ఆరోజుకి పాట ఆపేరు.

***

రెడ్డి రామకృష్ణ

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇదేటి బావూ జముకులొల్ల పాట నాగ ఈ కథ నడి మద్దిన ఒగ్గీసేరు?

    • ధన్యవాదాలు సార్, అంతా ఓపాలే తినీలేం గదా,మరికొంచెం వచ్చేసంచిక కోసం దాసీసేను.

      • అవునా..ఆ ముక్క శివార్లో సెప్పాలి కదండీ..

        ధన్యవాదాలు సార్v

  • నిజమే సార్, చెప్పాల్సిందే.కానీ చెప్పలేదు, అలా చెప్పేస్తే ఒకటే కథ అయిపోతుంది. రెండు కథలు అవ్వాలని అనుకున్నాను సార్, లెక్క ఎక్కువ కావాలని. చిన్నపిల్లాడిని కదా సార్.

    ఏదేమైనా తప్పుతప్పేఒప్పీసుకున్నాను. ఇప్పడు పది గుంజీలు తీత్తన్నాను సార్.

    • ఓలమ్మో ..ఇదేటి కిట్ట బాబూ , ఎదో ఇకటాలకి అంతన్నాను గానీ, గుంజీలూ , గోడ కుర్సీలు దేనికి?

      • విమర్శకులంటే మాటలా సారూ, బడిలో అయ్యోరిలాంటోరు. రాసేవోలు కుర్రోల్లాంటోలు,అయ్యోరు బెత్తం పడితే కుర్రోలు బాగుపడరా! తప్పుఒప్పీసుకున్నాక తప్పుతాదేటి శిచ్చ, అందుకనే ముందే గుంజీలు తీసెత్తాను. అయ్యోర్లు సెమించేత్తారని.

  • జముకుల పాట చాలా ఆసక్తికరంగా సాగింది

    • ధన్యవాదాలు పద్మావతి గారు.
      ప్రస్తుతం మీ కథలు “కురిసి అలసిన ఆకాశం” కాదు
      “కురిసి మెరిసిన ఆకాశం” చదువుతున్నాను. “పేలిన మంచు పర్వతం” వరకూ వచ్చాను. నడుస్తోంది బండి.

      • నా కథల సంపుటి చదువుతున్నందుకు ధన్యవాదాలు రామకృష్ణగారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు