నువ్వొక కల కంటావు.
నేనొక కల కంటాను.
కలలో ఎక్కడో మనము కలుసుకుంటాము.
అదొక యవ్వన వసంత కాలం
***
నువ్వొక దారిన వెళ్తావు.
నేనొక దారిన వెళ్తాను.
ఏ కూడలిలోనో మనము కలుసుకుంటాము.
అదొక జీవన శరత్తు కాలం.
***
నువ్వొక మజిలీ చేస్తావు.
నేనొక మజిలీ చేస్తాను.
కాచుకున్న నెగడు వెచ్చదనం
ఒకేలా అనుభవిస్తాము.
అదొక శీతల సాయంకాలం
***
నువ్వొక మాటను జీవనం చేసుకుంటావు.
నేనొక మాటను జీవనం చేసుకుంటాను.
మాటలు వేరయినా మననం ఒకటేనేమో..
అదొక గ్రీష్మ ఆకాశ నిర్మల కాలం.
***
నీ కల, నా దారి
నీ మజిలీ, నా మాట
జమిలిగా ఒకటేనా వేరువేరా
నువ్వూ నేనూ
ఒకే దిక్కుకి రెండు ముఖాలా..
ఆవృతాలా..
నువ్వూ నేనూ
ఒకే కల కంటున్న రెండు దేహాలా..
ఏకాత్మలా..
మిత్రమృత్యువా..
చెప్పగలవా?
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
సూపర్
Tq
బావుంది
నైస్ భాయ్