చేనేత జీవితాలకు ‘ఉరితాళ్ళు’

ఆగష్టు 7, జాతీయ చేనేత దినోత్సవం

వి, కథకులు, విమర్శకులు దిలావర్ మహ్మద్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే స్కూల్‌ మ్యాగ్ జైన్‌ ‘ప్రగతి’ కోసం ‘తాజ్‌ మహాల్‌’ కథ రాయడం ఆ తరువాత పదవ తరగతిలో ‘ఆకలి’ కథానిక రాయడం ద్వారా చాలా చిన్ననాటనే సాహితీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. వీరు  రాసిన ‘నవ్వులు’ కవిత 1969 ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. అప్పటినుండి రాష్ట్రంలోని వివిధ పత్రికలలో కథలు, కవితలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు, పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తున్నారు.

ఇప్పటిదాకా వీరి కలం నుండి 1.వెలుగు పూలు (1974), 2. వెన్నెల కుప్పలు (1980), 3.జీవన తీరాలు (1988), 4.కర్బలా (1999), 5.రేష్మా … ఓ రేష్మా (కవితా సంపుటాలు, 2003), 6. గ్రౌండ్‌జీరో (దీర్ఘ… కవిత, 2003), 7. మచ్చు బొమ్మ (కదలసంపుటి, 2008), 8. ప్రణయాంజలి (పద్యకావ్యం,2001), 9.ప్రహ్లాదచరిత్ర – ఎఱ్రన – పోతన : తులనాత్మక పరిశీలన (1989), 11. లోకావలోకనం (సాహిత్యసమీక్షా వ్యాసాలు, 2010), ప్రతిధ్వని  (సాహిత్య వ్యాసాలు 2020). నవలలు: 1.సమిధలు (భారతి, 1985), 2.ముగింపు (కథాకళి, 1996), 3.తుషార గీతిక (జయశ్రీ, 1981), మొగులు (నవల – 2019), వేట (నవల, త్వరలో విడుదల), ఆమె (గజళ్ళు) రసరేఖలు (గజళ్ళు) లంబా హై సఫర్ మొదలైన గ్రంథాలు జాలువారాయి. వీరు పలు ప్రజా సంఘాలు, సాహితీ సంస్థల ద్వారా సన్మానాలు పొందారు. 2016లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం లభించింది. వీరు రాసిన పేదరికపు పుండులాంటి చేనేత కథ ‘ఉరితాళ్ళు’ ఈ కథ మొదట 1994లో ‘జాగృతి’ పత్రికలో ప్రచురింపబడింది.

భారతదేశం ప్రధానంగా చేతి వృత్తులు, కుల వృత్తుల పునాదుల మీద నిర్మింపబడిన శ్రమజీవన సౌందర్య  సౌధం. సమాజంలోని అన్ని వృత్తులకు వేటి ప్రాధాన్యత వాటికి ఉన్నప్పటికీ మనిషి దేహానికి సౌందర్య పరిమళాన్నద్దిన చేనేత వృత్తికి కొంచెం ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఆకులను కట్టుకొని మానాన్ని కాపాడుకున్న మానవ జాతి ప్రయాణాన్ని చేనేత వృత్తి ఒక అందమైన మలుపు తిప్పింది. చేతి వృత్తులన్నీ సౌకుమార్యమైనవే అయినా చేనేత వృత్తి అందులో మరింత లలితమైన, నాజూకైన వృత్తి. చేనేత వృత్తిలోని సంక్షోభాలను, సవాళ్లను చాలా మంది కథకులు కథీకరించారు. అందులో పద్మశాలీ కుల కథకుల కంటే పద్మశాలీ కులేతర కథకులే ఎక్కువ ఉన్నారు. వాటిల్లో డా. దిలావర్ మహ్మద్ రాసిన ఈ ‘ఉరితాళ్ళు కథ వాస్తవ జీవితాన్ని అంతే వాస్తవికంగా చిత్రించిన కథ. చేనేత జీవితాల నిండా ముసురుకున్న ‘ముసురు’ను మన మనసు  నిండా నింపి పోయే కథ.

సాధారణంగా గ్రామాలన్నీ ఏదో ఒక చేతి వృత్తిని లేదా కుల వృత్తిని నమ్ముకొని పొట్ట పోసుకుంటూ బతుకీడు స్తుంటాయి. ఆ వూళ్ళో చేనేత కార్మికుడు చంద్రం కూడా అంతే. చేనేతను నమ్ముకొని జీవికను సాగిస్తుంటాడు. అయితే అకస్మాత్తుగా అతని చేతిలోని వృత్తిని కరువు రక్కసి లాక్కొని బతుకును బజారులో నిలబెడితే ఆ ఆసహాయ చేతులేమి చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో, జీవితాలు దుర్భరంగా మారుతున్న సందర్భంలో ఊళ్ళకు ఊళ్ళు భయంతో వణికిపోతాయి. అందుకే “తెల్లవారుతున్నదంటే ఆ వూరికి గుండె దడ, తెల్లవారుతున్నదంటే ఆ వూరికి చలి జ్వరం. తెల్లవారుతున్నదంటే ఆ వూరికి పక్షవాతం వచ్చినట్లు వుంటుంది. అడవిలో ఒంటరిగా క్రూరమృగంతో పోరాటానికి సిద్ధపడ్డట్టు ఇక ఆ రోజు జీవిత పోరాటం సాగుతుంది. ఊరికంటే ముందే ఆకలి ఆవులించి మేలుకుంటుంది. దరిద్రం మేలుకుంటుంది. విషాధం మేలుకుంటుంది. కన్నీళ్లు మేలుకుంటాయి.”

అందుకే ఆ వూళ్ళో చేనేత కార్మికులు తెల్లవారినా నిద్ర లేవరు. అసలు ఆకలి వాళ్ళను పడుకోనిస్తే కదా నిద్ర లేచేది. అలాగే ముడుచుకొని మునగదీసుకొని పడుకుంటారు. “లేస్తే ఆకలితో దీనంగా చూసే పిల్లవాడి చూపుల్ని తట్టుకోవాలి. బాధతో మెలికలు తిరుగుతూ మూల్గుతున్న భార్య నిస్సహాయ స్థితిని చూసి తట్టుకోవాల. పిల్లవాడి కంటే నీళ్ళ తిత్తిలా వుబ్బిన వాడి పొట్టే ముంది కనిపిస్తుంది. కట్టె పుల్లలా వుండే వాడి కాళ్ళూ చేతులే ముందుగా కనిపిస్తాయి.  వాచి మురిగిన కప్పలా తన కొడుకు తనకే వికృతంగా కనిపిస్తాడు. ఆ జబ్బుకు అన్నమే మందట. గంజే కరువైన వాళ్ళకు మందుల గురించి ఆలోచించే శక్తి మాత్రం ఎక్కడిది?” ఇంతటి కరువు కాలంలో ఈ బాధను చూడలేక పక్కింటి తాతయ్య ఎవరో తను తినాల్సిన ముద్దను దొంగతనంగా తీసుకొచ్చి ఈ పిల్లవాడికి పెడితే ఆ కుటుంబం వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నా ఇట్లా ఎన్నాళ్లు సాగుతుంది. పండుటాకు రాలినా లోకానికి వెలితి కాదు… పూయాల్సిన కాయాల్సిన లేత మొక్కలు ఇట్లా వాడిపోతుంటే ఎట్లా?

దీనికి తోడు నెలలు నిండిన చంద్రం భార్య “పండ్లు తినాల్సిన రోజులు… ఆకలితో అలమటిస్తుంటే… దాని మానాన్ని దాన్ని యిడ్చిపెట్టి… హయ్యో.. ఏం దిక్కుమాలిన కాలం వచ్చిందిరా.. యీ మనిషి జలమ ఎంత పాపకారిదై పోయిందబ్బాయా…” ఆలోచిస్తేనే కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతాయి. “ఊళ్ళోని వారిదంతా ఇదే పరిస్థితి. ఎవరి ప్రాణాలు వాళ్ళు నిలబెట్టుకోవాలనే ఆరాటంలో ఉన్నప్పుడు పక్కవాడి గురించి ఆలోచించే తీరిక గాని ఆలోచించడం వల్ల ప్రయోజనంగానీ ఏముంటుంది? పోచంపల్లి పట్టు చీరలా నిగనిగలాడుతూ వుండేది అలివేలు. గద్వాల నేత చీరెలా పెటపెటలాడుతూ వుండేది అలివేలు. అలివేలు నవ్వితే వెండి జరీ అంచు తళుక్కున మెరిసినట్లు ఉండేది.

చంద్రం అలివేలు పడుగు పేకల్లా కలిసి వుండేవారు. తాను మగ్గం నేస్తుంటే అలివేలు రాట్నం వడికేది. తాను నూలును కుంచెతో సరిచేస్తుంటే అలివేలు రంగులు కలిపేది. ఏకులోంచి తీసిన దారంలా తన కలలకు అంతూ పొంతూ ఉండేది కాదు. కానీ  కాలం తమ కలలను ఇంత ఘోరంగా కాటేస్తుందని కలలో కూడా వూహించలేదు. ఉన్నట్టుండి నూలు కట్టల రేటు ఆకాశాన్నంటింది. రంగుల ధరలు ఆకాశంలో ఇంద్రధనస్సులా రంగులు రంగులుగా మురిపిస్తునాయే తప్ప అందుబాటులో లేకుండా అయ్యాయి. వాటితో పాటు తాము నేసిన వస్త్రాల ధరలు కూడా పెంచక తప్పలేదు. ధరలు పెరగడమే తప్ప సరుక్కు గిరాకీ మాత్రం పెరగలేదు. తళుకుబెలుకు సింథటిక్ వస్త్రాల ముందు చేనేత వస్త్రాలు వెలవెల పోక తప్ప లేదు.

గోరు చుట్టూ మీద రోకలి పోటులా సబ్సీడీ రద్దు చేస్తూ సర్కారు వారి ఫర్మానాలు. ఇబ్బడి ముబ్బడిగా విదేశాలకు నూలు ఎగుమతి చేయడం ఇంకొక సమస్య. ఆసుపత్రుల్లో, ఆఫీసుల్లో చేనేత వస్త్రాలను యూనిఫారంగా ఉపయోగించక పోవడం మరో సమస్య. నిధుల కొరత. అమ్మకాల్లేక ఆప్కోలో బట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకొని పోవటం… సాలెగూటిలో పురుగులా సమస్యల వలయంలో చేనేత సంక్షోభం…”

ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో చంద్రం భార్యను ఎలా రక్షించుకున్నాడు అనేది కథలోనే చదవాలి. అలివేలు బతికిందా? రోజూ కొద్ది కొద్దిగా చనిపోవడం కంటే ఒక్క రోజు చనిపోవడమే మేలనుకుందా? లోపలా బయటా ముసురు పడుతూనే ఉంది. అది మెల్లగా భారీ వర్షంగా కూడా మారుతోంది. ఆ వర్షానికి “నూలు కట్టలు ఎప్పుడైతే తడిసిపోయాయో అప్పుడే  తన బతుకు చివికిపోయింది. మగ్గం ఆడటం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే తన కాళ్ళూ, చేతులూ పడిపోయాయి. రాట్నం తిరగడం ఎప్పుడైతే నిశ్చలనమైందో అప్పుడే తనలోని చైతన్యం మాయమైంది. ఇక ఇంతకన్నా మరణం అంటూ ఏముంటుంది?”  అనుకుంటూ ఆలోచిస్తున్న చంద్రం చివరికి ఏం చేశాడు.

అసలు తప్పంతా ఎవరిది? వృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికునిదా? వృత్తిని ఆదరించని సమాజానిదా? ఉరితాళ్ళు బిగుసుకునేలా పరిస్థితుల్ని కల్పిస్తున్న వ్యవస్థదా? ఆకలి రోగంతో బాధ పడుతూ బాన పొట్ట వేసుకొని సత్తు గిన్నె పట్టుకొని లోకం వైపు బిత్తర చూపులు  చూస్తున్న చంద్రం కొడుకేమయ్యాడు? జవాబులు లేని ప్రశ్నలెన్నో మనసును తొలుస్తాయి.

కథ నిండా ఆకలి రొద, పేదరికపు నిశ్శబ్దపు చప్పుడు, చేనేత వృత్తి దీన స్థితి, కరువు కరాళ నృత్యం  పర్చుకొని ఉన్నాయి. కథంతా చదువుతుంటే దేహంలోని నరాలు పోగుల్లా పుటుక్కు పుటుక్కున ఒక్కోటి తెగిపోతుంటాయి.  ఇంత కుళ్ళిపోయిన సమాజంలోనా మనం జీవిస్తున్నది అని జీవితం మీద వెగటు కలుగుతుంది. ఒక వైపు మాస్టర్ వీవర్ల (శెట్టి) చీదరింపు, మరో వైపు రోగం వస్తే డబ్బులు చెల్లించనిదే కనీసం చేయి పట్టి చూడడానికి కూడా ఇష్టపడని డాక్టర్లు, ఇంకో వైపు చేతి నుండి పనిని లాక్కున్న పరిస్థితులు ఇలా అన్నీ ఒకే సారి దాడి చేసి ఆ చేత కార్మికుడిని శ్మశానం దాకా సాగనంపుతాయి. కుటుంబమంతా విచ్చిన్నమై వీధి పాలవుతుంది.

కథ ఎత్తుగడ నుంచి చివరి వాక్యం దాకా ప్రతి వాక్యం ఎంతో గాఢతతో కూడుకొని ఉంది. సంక్షుభితమైన జీవితాన్ని ఒడిసి పట్టుకొని చూపేది. చేనేత బతుకుల్లో ఎంత చీకటి పర్చుకొని ఉందో చెప్తూనే వ్యవస్థను బోనులో నిలబెట్టే కథ. ఒక చేనేత కుటుంబం యొక్క ఆకలి పోరాటంతో మొదలయ్యే కథ కొన్ని ఆ కుటుంబ యజమాని చంద్రం జ్ఞాపకాలు, కొన్ని దీన పరిస్థితులతో కొనసాగి ఎంతో విషాదాన్ని మిగిల్చి ముగుస్తుంది.

ఒక మంచి కథా వస్తువును అంతే మంచి శిల్పంతో రాయడంలో కథకుడు సక్సెస్ అయ్యాడు. అంతే కాదు అనేక ప్రశ్నల్ని మన మీదికి సంధిస్తుందీ కథ. దేశంలో ఇంకా పిల్లలు మాల్ న్యూట్రిషియన్ తో పెరుగుతున్నారంటే, ఇంకా ఆకలి చావులు కొనసాగుతున్నాయంటే, ఇంకా సరైన వైద్యం దొరకక రొగులు చనిపోతున్నారంటే మనమేం అభివృద్ధి సాధించినట్లు అని గళ్ళ పట్టి అడుగుతుందీ కథ. కథలోని చంద్రం, తాత, చంద్రం కొడుకు, చంద్రం భార్య అలివేలు పాత్రలు వ్యవస్థ మలిచిన, నిత్యం రక్తాన్ని స్రవించే గాయాలు.  ఆకలితో పోరాడీ పోరాడీ అలసిపోయిన పాత్రలు. కథలోంచి మన ముందు నిలబడి నానా గందరగోళాన్ని సృష్టించే పాత్రలు. నిస్సహాయంగా జీవితాల్ని చాలించే పాత్రలు.

ఈ దేశం లో చేనేత కార్మికుల జీవితాలు ఏ రంగులూ లేకుండా ఎట్లా తెల్లారి పోతున్నాయో ఈ కథ కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. దేశానికి అన్నం పెట్టె రైతన్న లాగే ప్రపంచానికి బట్ట అందించి మనిషిని ఎంతో నాగరికంగా తయారు చేసిన నేతన్న కూడా ఎలా మృత్యు కూపంలో కూరుకు పోతున్నాడో ఈ కథ ఒక ఉదాహరణ. దశాబ్దాలుగా చేనేత బతుకుల్లో ఇంతటి సంక్షోభం కొనసాగుతుండగా మొన్నటి మార్చి 2020 నుండి కోవిద్ – 19 వైరస్ వల్ల కరోనా సోకి చేనేత వృత్తి, పవర్ లూమ్ రంగం  మరింత అగాదంలోకి నెట్టి వేయబడింది.  పని చేయడానికి చేతుల్లో బలమున్నా చేయడానికి పని లేక, మరో పనిలోకి మారలేక, బయటకు పోలేక చేనేత కార్మికుల ఆకలి చావులు ఇంకా పెరిగి పోయాయి. చేనేత రంగం మరింత కుదేలైపోయింది. ఉత్పత్తి కులాలకు మంచి రోజులు రావాలని, ప్రతి మనిషి బాధలు లేని జీవితం గడిపి సంతోషంగా కాలం గడపాలని ఆకాంక్షించే కథ. చేనేత కార్మికుల ఆకలి చావులు ఉన్నన్ని నాళ్ళు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉన్నన్ని నాళ్ళు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేదా ఇద్దరు చనిపోయి పిల్లలు అనాథలుగా మారుతున్న పాడు రోజులు ఉన్నన్ని నాళ్ళు ఈ ‘ఉరితాళ్ళు’ కథ బతికే ఉంటుంది.

*

 

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • శ్రీధర్ సార్ మీ సమీక్ష చాలా బాగుంది కథ చదవాలనిపిస్తుంది చేనేత గురించి చేనేత కార్మికులు పడే కష్టం గురించి చాలా చక్కగా వివరించిన రచయితకు ధన్యవాదాలు

 • విశ్లేషణ చాలా బాగుంది.. అభినందనలు💐💐💐💐

 • జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా…. శ్రీధర్ గారు
  సమీక్షించిన దిలావర్ గారి ఉరితాళ్లు కథ
  ఆద్యంతం కళ్లనుండి కన్నీళ్ళ జలపాతాలు కురిపిస్తుంది కథలో పదాల అమరిక… హృదయాన్ని కదిలించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి…
  అద్భుతమైన పదసంపద తో…కథను నడిపించిన తీరు కు వందనం అభివందనం 🙏
  శ్రీధర్ గారు ఉత్తమ సమీక్షకులు గా మరో ఆణిముత్యం లాంటి కథను పాఠకులకు అందించారు… ధన్యవాదాలు శ్రీధర్ గారు 🙏🙏

 • చేనేత కార్మికుల జీవన వెతల సమాగమం “”ఉరితాళ్ళు”” చక్కగా విశ్లేషించారు దీనికి కారణం మీయొక్క సహజ జీవితమే నేనుకుంటున్న,ఏదేమైనా మీ రాబోయే తరాలకు మార్గదర్శిగా ఉంటుందని అనుకుంటూ ఇంకా ఇలాంటివి విశ్లేషిస్తూ “”గొప్ప కవిగా””రచయితగా ఎదగాలని కోరుకుంటూ…….

 • ఉరితాళ్ళు కథ బతికి ఉండడము అనేదే అసలు బాధ ఇప్పటి పరిస్తితుల్లో చాలా వృత్తులు ఉరితాళ్ళకు బలౌతాయి మనంఅవి చూడాల్సిరావడం ఇంకా బాధాకరం పాలకుల ద్వంద్వనీతి మారదు ఇవి ఆగవు ఈకథను గూర్చిన నీ విశ్లేషణ అద్భుతం రచయిత ఉద్దేశం సరిగ్గా ఒడిసి పట్టి చూపించారు కృతకృత్యులైన మీకు అభినంధనలు

 • అద్భుత నైపుణ్యంకు ఆలవాలమైన చేనేతవృత్తి కడుపునిండా తిండిపెట్టలేని దైన్యస్థితిలో ఉండడం ఒక సామాజిక విషాదం!

  పోయిన సంవత్సరం ఇదే నెలలో పోచంపల్లికి వెళ్ళినం .
  ఖరీదైన ఈ పట్టుచీరలకు చాలా డిమాండ్ ఉంది కదా, వీళ్ళ జీవితాలు మెరుగ్గా ఉంటయని అనుకున్న.
  డైరెక్ట్ మొగ్గాల కాడికే పోయినం. అక్కడ నేసేవాళ్ళను చూసిన తర్వాత పాపం వీళ్ళూ అంతకంతే అనిపించింది.
  ఆడపిల్లలూ నేస్తున్నరు రెక్కలు ముక్కలు చేసుకుంటూ.

  మా (ఎల్లారెడ్డిపేట) దగ్గరి సిరిసిల్లలో తువ్వాల నడుముకు చుట్టుకుని ‘సరి’ చేసే నేతన్నలే కళ్లల్లో కదులుతరు.

  కథ చదువలేదుకని మీ విశ్లేషణను బట్టి ఏం జరిగిందన్నది అర్థమైపోయింది.
  కథారచయిత దిలావర్ గారికి,
  సామాజిక యథార్థాల వస్తువులున్న కథలను చక్కగా పరిచయం చేస్తున్న వెల్దండి శ్రీధర్ గారికి అభినందనలు!

 • మసక బారిన నేతన్నల జీవితాలను , ముసురుమాటున గతితప్పిన మనో వ్యధలను మరొక్క సారి….. మాముందుకు తెచ్చి….. కళ్ళు ముందు ప్రతిబింబించిన….మీకు.. ధన్యవాదాలు…

 • శ్రీధర్ గారు ‘ఉరితాళ్లు’ కథ పై మీరు రాసిన సమీక్ష చదివిన. కథ ఆత్మని పట్టుకొని రాశారు. వస్తువు మీద అభిమానం ఉంటే సరిపోదు. రచయిత వస్తువులో లీనమై ఎలా రాస్తాడో విమర్శకుడు అంతే మదన పడాలి. రచయిత చెప్పని పరిష్కారం విమర్శకుడు చెప్పాలి. కథ లోని దయనీయతకు కారణమైన వ్యవస్థను నిలదీసే సత్తా ఉండాలి. అదిమీరు చేశారు. అందుకే శుభాకాంక్షలు.

 • ఉరితాళ్ళు కథ విశ్లేషణ చాలా బాగుంది.పలుగుతాడు దొరికినందుకుబర్రెను కొన్నట్టుగా మీ విశ్లేషణ ద్వారానేను మంచి మంచి కథలు చదవగలుగుతున్నాను. మీ ఎంపిక కూడ కారణం.అనిచెప్తున్నాను.ఇలాగే మంచి కథలను కథకులనుపరిచయం చేయండి.అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు