చెన్నై Pub! ఒక రౌండప్ – భాగం 3

డాన్స్ ఫ్లోర్లో ఆల్ పర్పస్ అంకుల్స్!

మీకొచ్చిన బీరుని సిప్ చేస్తూ చుట్టుపక్కల చూశారంటే.. మెల్లమెల్లగా కొన్ని జంటలు లోపలికి వస్తుంటారు. వాళ్ళలో కొందరు మొగుడు-పెళ్ళాలు. పెళ్ళాం ‘పబ్ చూడాలని’ నస పెట్టడంవల్ల వచ్చినవాళ్ళూ ఉంటారు. అడుగులకు మడుగులొత్తుతూ, పూల బొకే పట్టుకున్నంత సుకుమారంగా పెళ్ళాన్ని నడిపించుకొచ్చే మొగుణ్ణి చూసి అలాంటి జంటల్ని గుర్తుపట్టొచ్చు!

సమయం పదిన్నర కావస్తుందనగా పబ్ కాస్త ఊపందుకుంటుంది. మీరిప్పుడు మరో పింట్ బీరు చెప్పుకోండి. ఊపందుకోడానికి గల రెండు కారణాలు – కొందరు అమ్మాయిలు గుంపుగా ప్రవేశించడం ఒక కారణం అయితే, పబ్బులో అందరికీ కాస్త ఎక్కేసి ఉండటం మరో కారణం! ఇప్పుడు డీజే కొంచం వాల్యూమ్ పెంచుతాడు. చెయిర్‌లు, టేబుళ్ళు అక్కడక్కడా ఖాళీ అవుతాయి.

ముందుగా లేచి నిల్చుని తామున్నచోటే లైట్ గా చేయి, కాలు కదుపుతూ వార్మప్ చేసుకుంటారు. అందరికంటే ముందుగా లేచి డాన్స్ ఫ్లోర్ కి వెళ్ళి డాన్స్ స్టార్ట్ చెయ్యాలంటే కాస్త బిడియం, బెరుకు. ఈ స్టార్టింగ్ ట్రబుల్ని బ్రేక్ చేసేందుకు ఓ కోడెద్దుల బ్యాచ్ డాన్స్ ఫ్లోరుకు చేరుతారు. నిండుగా ఎక్కిన కైపులో ఈ బ్యాచీ తాము మగవాళ్ళమన్న సంగతి కూడా మరిచి బొడ్డు కనిపించేలా డాన్స్ పేరిట ఊగిపోతుంటారు. వీళ్ళను బౌన్సర్స్ గెంటేయలేరు. వీళ్ళు అకౌంట్ మెయిన్టెయిన్ చేసి మరీ క్రమం తప్పక వచ్చి తాగే కస్టమర్లు.

వీళ్ళు ఓపెనింగ్ చేశారు కాబట్టి ఒక్కో జంటా వచ్చి మొదలు పెతారు. కొంచం కొంచంగా డాన్స్ ఫ్లోర్లో జనం పోగవుతారు. అమ్మాయిల గ్యాంగ్ డాన్స్ ఫ్లోరెక్కగానే కచేరీ తారా స్థాయినందుకుంటుంది. అంకుల్స్, తాతలు, యవ్వన సింగిల్స్, వృద్ధ సింగిల్స్ అందరూ డాన్స్ ఫ్లోర్ ఎక్కుతారు. ఇప్పుడు అందరూ బెరుకూ, బిడియం పక్కనెట్టి అడసు తొక్కినట్టు కాళ్ళు, చేతులు ఆడిస్తారు. టేబుళ్ళ దగ్గర జనం ఉండరు. చేర్, టేబుళ్ళను జరిపి పక్కన పెట్టేసుంటారు.

ఇప్పుడు మందు కావాలసి వస్తే బార్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి తీసుకోవాలి. చెన్నై పబ్బుల్లో సంగీతం రాక్, జాజ్ అని ఒక క్రమంలో ప్లే చెయ్యరు. థీమ్ కూడా ఏదీ ఉండదు. హీట్ అయిన ఇంగ్లీషు పాట, తర్వాత బాలివుడ్ ట్రాక్ ప్లే చేస్తారు. జనం అన్నిటికీ రెండు మూడు స్టెప్పుల్నే మిక్స్ అండే మ్యాచే చేసి ఆడుతుంటారు. ఉన్నట్టుండి ‘రింగ రింగా…’ అని స్పీకర్ కేక పెట్టగానే జనం మూకుమ్మడిగా గంతులు వేస్తారు.

విదేశాల్లో పబ్బుల సంగతి వదిలేద్దాం. ఇక్కడ మన బెంగుళూర్లో కూడా రాక్, మెటల్ అని పద్ధతిగా ఆస్వాదించేలా పాటలు వేసే పబ్బులున్నాయి. పాటల్లో పెద్ద అర్థంలేకున్నప్పటికీ ఒక కాన్సెప్ట్, ఒక ఫీలింగ్, ఒక క్రమం ఉంటుంది. ఫ్రీడమ్, చొరవ, బ్రేకప్, విరహం, తిరుగుబాటు అని ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జనం ఆ పాటలను హమ్ చేస్తూ ఆ ఫీలింగుకి తగ్గట్టు డాన్స్ చేస్తుంటారు. ఇక్కడ చెన్నై పబ్బుల్లో తాగేసి ప్లే అవుతున్న పాటలకు సంబంధంలేకుండా పూనకం వచ్చినట్టు గంతులేసే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికీ, సారా కొట్టులో నాటు సారా తాగి లుంగీ ఎగ్గట్టి తీన్మార్ ఆడేవాళ్ళకీ ఏంటి తేడా? వీళ్ళని ముసలి పబ్మేట్స్ ‘ఇన్డీసంట్ ఫెలోస్’ అంటుంటారు.

గంట పన్నెండు దాటగానే సంగీతపు మోత ఇంకా పెరుగుతుంది. మీకే తెలీకుండ మీరు నాలగు బీరులు తాగేసుంటారు. అందరూ మత్తెక్కిపోయ ‘సార’వంతమైన ఘనాపాఠీలైపోవడంతో కొత్తవాళ్ళతో బెరుకులేకుండ మాటలు కలిపేందుకు ధైర్యం వచ్చేస్తుంది… అయితే… మాటలు కలపడానికి మనుషులే దొరకరు! ఉంటే అమ్మాయిలు గ్రూపుగా ఉంటారు. లేదా తమ జంటతో వచ్చుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసొచ్చిన బ్యాచీలుంటారు. ఒంటరిగా చెన్నై పబ్బుకొచ్చే అమ్మాయిని చూడటం అరుదు.

జంటగా వచ్చిందా, గ్రూపుగా వచ్చిందా అన్న పక్షపాతాల్లేకుండా పక్కన డాన్స్ చేస్తున్న అమ్మాయికి లైన్ వేస్తుంటారు కొందరు. ఆమె కూడా టీజింగా కళ్ళతో సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఆమె ముందుర చేరి డాన్స్ చేసి పటాయించేయాలన్నట్టు ప్రభుదేవా స్టెప్పులన్నీ చేస్తుంటారు. కొంచం ధైర్యం కూడబలుక్కుని ఆమె చేయందుకోబోతుండగా లఘుశంకకో, వాంతి చేసుకోడానికో వెళ్ళిన ఆమె బాయ్ ఫ్రెండ్ వచ్చేస్తాడు.

వెంటనే విడిపించుకుని వెళ్ళిపోతే బాగోదని మొహమాటానికి మరో రెండు స్టెప్పులు వేసి వాడినుండి తప్పుకుని వెళ్ళిపోతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని గంటసేపు డాన్స్ చేసి ఓ అమ్మాయికి వేసిన స్కెచ్ ఫట్ మన్నదన్న బాధను తాళలేక బార్ కౌంటర్ కెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారు.

వీళ్ళలో గౌరవం, రోషం అధిక పాళ్ళలో అంది పుచ్చుకున్న అబ్బాయిలూ ఉన్నారు. వీళ్ళు ఏ ఒక్క అమ్మాయినీ ఫోకస్ చేసి ఆకర్షించాలనుకోరు. డాన్స్ ఫ్లోర్ మధ్యలో చేరి వేలం వెర్రిగా కుప్పి గంతులు వేస్తారు. ప్రపంచమంతా తననే చూసి మురిసి పోతుందన్నట్టు ఫీలైపోతారు. తన నాట్యాన్ని మెచ్చి అక్కడున్న ఏ దేవతో తన చేయందుకుని భుజాలమీద వాల్చుకుని రూముకు తీసుకెళ్తుందన్నది వీళ్ళ ప్రగాఢ విశ్వాసం.

ఏసీలో కూడా చెమటలు కారిపోతుంటాయి. వీళ్ళను చిరాకు పరిచేలా డీజే మెలోడీ పాటలు వేసినా, వయలిన్ మ్యూజీక్ వేసినా అంతే తీవ్రతతో ఊగిపోతుంటారు. గొంతెండిపోయాక మెడ పైకెత్తి బ్లాంక్ గా చుట్టూ ఉన్న జనాన్ని చూస్తారు. డస్సి పోయి టాయ్లెట్ వైపుకు వెళ్తారు.

డాన్స్ మళ్ళీ తారా స్థాయికి చేరుకుంటున్న ఈ సమయంలో టాయ్లెట్ వైపుకెళ్ళి చుసొచ్చేద్దాం. తర్వాత, మత్తు ఫుల్ గా ఎక్కేశాక జరిగే అబ్యూజ్ లనూ, విచ్చలవిడి తనాన్నీ గమనించుదాం.

(రౌండప్ కొనసాగుతుంది)

అనువాదం: అవినేని భాస్కర్

మూలం: ‘కుంకుమమ్’ అనే అరవ వార పత్రకలో సీరీస్ గా వస్తున్న వ్యాసం. తేదీ: 02 ఆగస్ట్ 2019.

 

 

Avatar

అరాత్తు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు