చూసొద్దాం! ఎదురు చూద్దాం!!!

ఎక్కడైనా ఒక ఇజం వచ్చిందంటే అది ఆర్ధికమే. ఆర్ధికాంశం లేని ఇజమంటూ వుండదనేది పచ్చి నిజం.

లసలు, యాత్రలు మానవ ప్రయాణంలో, పరిణామంలో, వికాసంలో అత్యంత ముఖ్యమైన పాత్రని నిర్వహించాయి.  నిర్వహిస్తున్నాయి కూడా.  అసలు మానవుడు ఎప్పుడూ  గోడకి వేలాడే క్యాలెండర్లా ఒక చోటుకే దిగ్గొట్టుకొని వుంటే మిగతా ప్రపంచం ఎలా పరిచయం అవుతుంది?   ప్రయాణం లేని మనిషి నాగరికత లేదు.  బతుకుతూ వున్న చోటుని శాశ్వతంగా వదిలేసి బతకటానికే మరో కొత్త చోటుని వెతుక్కుంటూ వెళ్ళటం వలస.  ఎక్కడో ఆఫ్రికాలో ఊపిరి పోసుకున్న అచ్చమైన నీగ్రోయిడ్ తెగలు, మంగోలియాలో మొదలైన మంగోలాయిడ్ తెగలు అండమాన్లో కనబడతాయంటే అది వలస వల్లనే సాధ్యం.  పూర్వ కాలంలో ఆహార అన్వేషణ, భౌగోళిక మార్పులు వలసలకి ప్రధాన కారణం కాగా ఆధునిక కాలంలో బతుకుతెరువు ప్రధాన కారణమౌతున్నది.  అయితే  వున్న చోటుని తాత్కాలికంగా వదిలి అలా తిరిగొచ్చి మళ్ళీ తన చోటుకి తిరిగి రావటాన్ని యాత్ర అనొచ్చు.

వలసల్లో జ్ఞాన జిజ్ఞాస ఏమీ వుండదు.  మనుగడ అంశాలే ముఖ్యం.  ఇది వరకటి  యాత్రలకి భక్తి, ఆధ్యాత్మిక చింతన కొంత ప్రాతిపదిక కాగా జ్ఞాన సముపార్జన, వాటిని డాక్యుమెంటేషన్ చేయాలన్న ఆశయం మరికొంత ప్రాతిపదిక అవుతుంది.  దూర ప్రాంతాల్లోని గుళ్ళు, గోపురాల దర్శనం కోసం పర్యటనలు తీర్థ యాత్రలు చేపట్టేది కొందరు కాగా ఒక దూర దేశంలోనో, ప్రాంతంలోనో విలసిల్లే నాగరికతల్ని, రాజ్యాల్ని, రాజకీయాల్ని, సంస్కృతిని, కళల్ని అధ్యయనం చేసి, డాక్యుమెంటేషన్ చేసే సాహస, సాంస్కృతిక యాత్రికులు మరికొందరు.  ఫాహియాన్, హుయాంత్సాంగ్ నుండి రాహుల్ సాంకృత్యాయన్ వరకు ఎంతో మంది మేధో యాత్రికులు సుదూర దేశాల్లోని అభివృద్ధిని, సాంస్కృతిక వైభోగాన్ని, రాజకీయ ఆలోచనల్ని, రాజ్య విధానాల్ని, గృహ నిర్మాణాల్ని, కళలు, వస్త్రధారణ, భాష, శిల్పం, సారస్వతాన్ని తమ రచనల్లో ప్రతిఫలింపచేసి  ఒక కొత్త “పరిజ్ఞానాన్ని” తమ వ్యవస్థలకి పరిచయం చేయగలిగారు.  ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయారు.  ఒక రకంగా చెప్పాలంటే యాత్రికులు ప్రపంచంలోని అనేక ప్రాంతాలను అనుసంధానించే సాంస్కృతిక రాయబారులు.  అది కేవలం అభిరుచి కాదు.  వారిలో అది ఒక అర్జ్.  నౌకలలో సముద్రాల మీదకి లంఘించి, నెలలు సంవత్సరాలు తరబడి సముద్రంలోనే గడిపి సరిగ్గా లక్ష్యాన్ని చేరుకునో లేదా దారి తప్పి మరెక్కడో తేలి ఒక కొత్త భూభాగాన్ని కనుక్కొన్న నావికా యాత్రికులెందరో.  పర్వత సాణువులనధిరోహిస్తూ భూమ్మీద, జలసంధుల్ని దాటుకుంటూ నీటిలోనూ యాత్రికులు కనుక్కొన్న లేదా ప్రయాణించిన మార్గాల్లోనే దేశాల మధ్య వర్తక, వాణిజ్యాలే కాదు దండయాత్రలూ జరిగాయి.  మొత్తం మీద మానవ సహజాతంలో భాగంగా యాత్ర పుట్టుకొచ్చింది.

సాహిత్యంలో యాత్రా సాహిత్యానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం వుంటుంది. రాహుల్ సాంకృత్యాయన్ తన యాత్రల ద్వారా అద్భుతమైన చారిత్రిక కల్పనా సాహిత్యాన్ని సృష్టించారు.  ఇంక మన తెలుగులో అయితే 18వ శతాబ్దానికి చెందిన వెన్నెలకంటి సుబ్బారావు, ఏనుగుల వీరాస్వామయ్యలతో మొదలు పెడితే యాత్రలకే తన జీవితాన్నకితం చేసిన నేటి విశాఖ ప్రొఫెసర్ మాచవరపు ఆదినారాయణ వరకు ఎంతోమంది తమ యాత్రానుభవాల్ని పుస్తకాలుగా ప్రచురించారు.  వీళ్ళెవ్వరూ టూరిస్టులు కారు.  కేవలం యాత్రికులే.  ఎందుకంటే యాత్రలు వీరికి ఉల్లాసం కాదు.  వివిధ ప్రాంతాలకు తమ సందర్శనల్ని ఒక లక్ష్యంగా చేపట్టిన వారు.

ఇటీవలి కాలం వరకు యాత్రగా అనుకోబడ్డది ఇప్పుడు టూరిజంగా పిలవబడుతున్నది.  ప్రస్తుతం యాత్రలంటే తీర్థ యాత్రలే.  దేశాటనం చేయటం ప్రస్తుతం “టూరిజం” (పర్యాటకం) అయింది.   ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, ఫిల్మ్ టూరిజం, వెల్నెస్ టూరిజం, మెడికల్ టూరిజంల పేరుతో ఇప్పుడు అనేక రకాల టూరిజాలున్నాయి. వాటన్నింటి గురించి చర్చించటం లేదు.  సాధారణ పర్యాటకం గురించి మాట్లాడుకుందాం.
****

ఏ పరిణామం యాత్రని పర్యాటకం చేసింది?  యాత్రల్లో వాణిజ్యాంశం ప్రధానం కాదు.  యాత్రీకులకి దైవ దర్శనమో లేక తాము సందర్శించే వ్యవస్థల్ని అధ్యయనం చేయటమో లక్ష్యంగా వుండేది.  ఇందులో ఖర్చు ప్రధానం కాదు.  వసతులకి, విలాసాలకి పెద్ద స్థానం వుండదు.  పూటకూళ్ళమ్మ ఇళ్ళల్లో భోజనాలు, సత్రాల్లో బసలతో ఆహార, నిద్ర అవసరాలు తీరిపోయేవి.  యాత్రలనేవి వ్యవస్థ మీద ఆర్ధికంగా ప్రభావం చూపించేటంత పెద్ద విషయం కాదు.  ఇందులో సేవా రంగం స్థాయి చాలా చిన్నది.  అనుభవం, జ్ఞానం ప్రధానం.  ఆర్ధికం అప్రాముఖ్యం.  ట్రావెల్ (యాత్ర)లో ఇజం లేదు.  ట్రావెలిజం అనము.  కానీ టూర్(పర్యటన) లో ఇజం వుంది. అందుకే టూరిజం (పర్యాటకం) అయింది. ఈ వ్యత్యాసమే వ్యవస్థని ప్రభావితం చేసేది. ఎక్కడైనా ఒక ఇజం వచ్చిందంటే అది ఆర్ధికమే.  ఆర్ధికాంశం లేని ఇజమంటూ వుండదనేది పచ్చి నిజం.

పర్యాటకం ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినట్టిది.  అనుత్పాదకమైనప్పటికీ వ్యవస్థ మీద ప్రభావం చూపించగల సత్తా పర్యాటకానికుంది.  ఇందులో వాణిజ్యాంశాలు పుష్కలం.  ఈ రోజున పర్యాటకం ప్రపంచంలోనే అతి పెద్ద “పరిశ్రమ”ల్లో ఒకటి.  అది ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, ఆహారం, ఆటోమొబైల్స్ కంటే పెద్ద రంగం. సేవారంగంలోకేల్లా అతి పెద్ద పరిశ్రమ పర్యాటకం.  భారతదేశంలో 18 లక్షల కోట్ల పరిశ్రమ పర్యాటకం.  గత రెండున్నర దశాబ్దాలుగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ)అత్యంత ఎక్కువ ప్రభావం చూపించిన రంగాల్లో పర్యాటకం ఒకటి.  ఇక్కడ మనం గ్లోబలైజేషన్లో వున్న అసలు కిటుకుని తెలుసుకోవాలి.  అభివృద్ధి చెందిన దేశాలు వస్త్తూత్పత్తికి ప్రాముఖ్యమిస్తాయి.  వాటిని మార్కెట్ చేసుకోటానికి మూడో ప్రపంచ దేశాల్లో సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తాయి.  సింపుల్గా చెప్పాలంటే ప్రపంచీకరణ అంటే ఇంతే.  దానికి తొడిగే అతి అందమైన కవరింగే “ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామంగా మారింది”.  మన వస్తు ఉత్పత్తి పెరిగి మనకి విదేశీ మారక ద్రవ్యం చేకూర్చి పెట్టేదిగా ప్రపంచీకరణ వుండదు.  ప్రపంచీకరణ లక్ష్యాలకి అనుగుణంగా వాళ్ళ వస్తువుల్ని మనం కొనటానికి వీలుగా వినిమయ సంస్కృతిని పెంచి పోషించటం జరుగుతుంది.  సౌందర్య సాధనాలు, కూల్ డ్రింక్స్, ఫ్యాషన్ దుస్తులు, సినిమాలు….వీటితో పాటే పర్యాటక రంగం కూడా!
****

టూరిజం అంటే ఇప్పుడు దేశ సరిహద్దులకి పరిమితం అయినది కాదు.  టూరిజం ఇప్పుడు అంతర్జాతీయం.  అనేక విదేశాలకి మన రూపాయిల్ని డాలర్లుగా మార్చి వారి విదేశీ మారక నిల్వల్ని పెంచేది.  ఇది గ్లోబలైజేషన్ పరిణామమే. ప్రపంచమొక కుగ్రామం అవటం వెనుకనున్న అతి పెద్ద మతలబుల్లో ఇదొకటి.  భారత్, పాకిస్తాన్ వంటి మూడో ప్రపంచ దేశాలకు వచ్చే విదేశీ టూరిస్టుల కంటే ఈ దేశాల నుండి అమెరికా, యూరొప్ దేశాలకు వెళ్ళే టూరిస్టులే ఎక్కువ.  అంటే మనం వాళ్ళ వస్తువులూ కొంటాం.  వాళ్ళ దేశాల్ని చూసి వాళ్ళకి రూపాయిల్ని డాలర్లుగా మార్చి కూడా ఇస్తాం.   ఇందుకోసం రంగంలోకి దిగిన సిటీ బాంక్, హెచ్చెస్బీసి వంటి అనేక విదేశీ బాంకులు సులభ వాయిదాల పద్ధతిలో లోన్లు కూడా ఇస్తాయి.

యాత్రల్లో వున్నట్లు పర్యాటకంలో జిజ్ఞాస, అధ్యయనం వుండవు.  పర్యాటకం కేవలం ఉల్లాసాన్ని ఉద్దేశించినటువంటిదే.  విలాసం (లగ్జరీ) అనేది  పర్యాటకుడి ఆర్ధిక స్తోమతు మీద ఆధారపడి వుంటుంది.  పర్యాటకుడి బడ్జెట్ ని బట్టి ఒకే ప్రాంతాన్ని వివిధ వ్యయ స్థాయిలలో సందర్శించవచ్చు.  ఒకే స్థలంలో ఐదు వందల రూపాయిల వసతి నుండి యాభైవేల రూపాయిల హోటల్ వసతి వరకు దొరుకుతుంటాయి. విలాసం అనగానే అనేక పెడ ధోరణులు పొడసూపుతుంటాయి.  ఉన్న ఊరిలో చేయలేని అనేక పనులేవో కొత్త ప్రాంతంలో చేయాలనే తెగింపు పర్యాటకుల్లో కనబడుతుంటుంది.  ఇది వ్యక్తిత్వాల్ని దిగజార్చుతుంది.

ఏ దేశంలో అయినా టూరిజానికి ఒక ఆకర్షణ కల్పించటంలో ముందుగా బలి అయిపోయేది స్త్రీలే.  థాయిలాండ్ వంటి దేశాల్లో టూరిజాన్ని శృంగారాన్ని వేరు చేసి చూడలేం.  సోవియెట్ రష్యాలో అప్పటి రిపబ్లిక్స్ గా ముఖ్య భాగమైన మధ్య ఆసియా దేశాల్లోనూ ఈ ధోరణి క్రమేపీ పెరుగుతున్నది.  అనేక యూరోప్ దేశాల్లోనూ స్త్రీలు ఒక ప్రధాన ఆకర్షణ.  పెట్టుబడి తన విశ్వరూపాన్ని ముందుగా ప్రదర్శించేది స్త్రీల మీదనే.  గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో మద్యంతో పాటు మాదక ద్రవ్యాల వ్యాపారం యథేఛ్ఛగా సాగుతుంటుంది.  లాభాపేక్షతో విలువల్ని గాలికొదిలేసే ప్రభుత్వాలు వీటిని పెద్దగా పట్టించుకోకుండా  పరోక్షంగా హ్యూమన్ ట్రాఫికింగ్ ని, డ్రగ్ మాఫియాల్ని ప్రోత్సహిస్తుంటాయి.

పర్యాటకం వల్ల ప్రధానంగా ఏర్పడుతున్న మరో ప్రధాన నష్టం వాతావరణ కాలుష్యం.  పర్యావరణ విధ్వంసం.  మారేడిమిల్లి అటవీ ప్రాంతానికి ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు అనేక వందల మద్యం బాటిళ్ళని చూసాను.  హార్స్ లీ హిల్స్ కొండల మీద విశాలంగా పరుచుకున్న సహజ సిద్ధ రాతి చప్టాల మీద గాజుపెంకులు ఎత్తి పారబోసినట్లు కనిపించాయి.  ఇంక హిమాలయాలు, నదీనదాలు, సముద్రాలు వంటి అతి భారీ సహజ ప్రాకృతిక నిర్మాణాల్ని వాటి ముందు పిపీలికం లాంటి మనిషి ప్లాస్టిక్ వ్యర్ధాలతో, ఆహార పదార్ధాలతో, బాటిళ్ళతో నింపి తనకి జీవాన్ని, గాలిని, ఆహారాన్ని ఇచ్చే ప్రకృతికి ద్రోహం చేస్తున్నాడు.

అలాగని పర్యాటకం వల్ల ప్రయోజనాల్లేవా అంటే ఎందుకు లేవు?  ఎన్నో లక్షలమందికి పర్యాటకం ఉపాధి కల్పిస్తున్నది. వాహనరంగం, హాస్పిటాలిటీ రంగానికి చెందిన హోటళ్ళు, విమానయానం వంటి ఎన్నో రంగాలకు ఊతమిస్తున్నది. అనేక దేశాలే కాదు మన దేశంలో కూడా కాశ్మీర్, కేరళ, అండమాన్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలు పర్యాటకం మీదనే ప్రధానంగా ఆధారపడి వున్నాయి.  పర్యాటకం లేని ఈ రాష్ట్రాల మనుగడని ఊహించటం కష్టం.  పర్యాటకాన్ని నిషేధించాలనో లేదా నియంత్రించాలనో నేననటం లేదు.  కానీ వాణిజ్య ప్రయోజనాల కోసం పర్యాటకం పేరుతో మనిషిని దిగజార్చే వాణిజ్య విధానం మీద, దానికి అందిస్తున్న ప్రోత్సాహం మీదనే నా ఫిర్యాదు.  మనిషి తిరగాల్సిందే.  నేనూ పర్యాటకుడినే.  కానీ దాని దుష్పరిణామాలకి మాత్రమే వ్యతిరేకిని.  పర్యాటకంలో గొప్ప, అందమైన, అద్భుతమైన వైయుక్తిక అనుభూతులుంటాయి.  కాదనలేం.  ఐతే ఆదర్శవంతమైన ఆచరణల (బెస్ట్ ప్రాక్టీసెస్)కి ప్రధమ స్థానం ఇవ్వాలి. మొన్నీమధ్య అండమాన్ వెళ్ళాను కుటుంబంతో.  అక్కడి పరిశుభ్రతకి, ప్లాస్టిక్ నిరోధానికి, మద్యపానం, స్మోకింగ మీద వున్న నియంత్రణకి ముచ్చట పడ్డాను.  ఏ బీచ్ లోనూ ఒక్క సిగరెట్ పీక కానీ, ఒక్క బీర్ బాటిల్ కానీ కనబడలేదు.  కనీసం ఇటువంటి విషయాలపైన కూడా శ్రద్ధ చూపించలేని పర్యాటకం హానికరం.  (మోడీగారు ప్లాస్టిక్ బాగ్ భుజాన వేసుకొని అండమాన్ బీచెస్ కి వెళితే ఆయన నిరాశ చెందాల్సిందే.  ఎందుకంటే అక్కడ చెత్త దొరకదు.)

అంతర్జాతీయంగా మనం ఏం చేయగలమో లేదో కానీ కనీసం భారతదేశంలో కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టొచ్చు.  కేవలం ఏదో బోర్డులు పెట్టడం కాకుండా పర్యాటక ప్రాంతాలకి వెళ్ళే టూరిస్టులకి ఫ్లోరా అంద్ ఫానా, చారిత్రిక కట్టడాలు, సరస్సులు, నదీనదాలు, సముద్ర తీరాలు  పరిరక్షణకి సంబంధించి ఖచ్చితమైన ప్రవర్తనా నియమావళి ఏర్పరచాలి.  మేఘాలయలో గైడ్లు ఈ విషయంలో ఖచ్చితంగా వుంటారు.  అన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ సెక్స్ సర్వీసుల మీద నిఘా పెట్టాలి.  ఎందుకంటే పర్యాటక రంగ అభివృద్ధితోనే శృంగారం వ్యక్తిగత పరిధిని దాటి ఒక ఇండస్ట్రీగా పరిణమించింది.  హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రధానంగా విలాసవంతమైన పర్యాటక ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంటుంది.  ఇంకా పర్యాటక ప్రాంతాల్లో మద్యాన్ని, సిగరెట్లని కూడా నిషేధించాలి.  పర్యాటకుల ఉల్లాసంలో అవాంఛనీయమైన యాక్టివిటీస్ కి స్థానం వుండకూడదు.  ప్రభుత్వాలకి చిత్తశుద్ధి వుంటే ఈ అవలక్షణాల్ని వొదిలించ వచ్చు.

నిజమే టూరిజం వల్ల విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి.  అయితే అసలు భారతదేశం రావాలంటే విదేశీ టూరిస్టులు (ముఖ్యంగా మహిళలు) భయపడి చస్తున్నారు.  ఆ విధంగా కుటుంబాలుగా విదేశీ టూరిస్టులు రావటంలేదు. మహిళలకి భారతదేశం అంత భద్రతాయుతమైన ప్రదేశం కాదని ప్రపంచంలో చాలా దేశాలు భావిస్తుంటాయి. ఈ చెడ్డ పేరు తొలగించుకునే వాతావరణం రావాలంటే అందుకు ప్రజలు, పాలకులు తమని తాము సాంస్కృతికంగా ఎంతగానో సంస్కరించుకోవాలి.  ఆ రోజు వచ్చినప్పుడు ఈ గడ్డ మీద పరాయి దేశపు స్త్రీలే కాదు మన స్త్రీలు కూడా భద్రంగా వుండగలరు.  స్త్రీలు అర్ధరాత్రి పూటా కూడా ఒంటరిగా నడవటమే కాదు, ఒంటరిగా పర్యాటకానికి కూడా వెళ్ళగలగాలి.  ఎదురు చూద్దామా మరి!

*
అరణ్య కృష్ణ

అరణ్య కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు