చివరి అంకం

ఒక్కటీ ఏకాంకిక కానే కాదు!

ఎన్ని అంకములున్నదో తెలియకుండానే

ఆడుతూ ఉండే నాటకమే కదా బతుకు!

 

ఏ ఘట్టం చివరి అంకం అవుతుందో

ముందుగా చెప్పబడని స్క్రిప్టు కదా బతుకు!

 

ప్రేమోధృతమూ..

బాధానందాల సమ్మిశ్రితమూ..

ఉద్రేక ఉద్వేగాల సమన్వితమూ..

ఒక అంకం ముగిసిపోతుంది!

 

నిన్నటిదాకా నీతో కలిసి నటించి..

నిన్నో.. నీ ప్రేక్షక సమూహాన్నో..

రంజిల్లజేసిన పాత్రలు..

నీ బతుకు రంగస్థలం నుంచి నిష్క్రమించి..

విశాల విశ్వ యవనిక మీదికి..

విస్తరిస్తున్న సందర్భం అది!

ఒక అంకం ముగిసిపోతుంది!!

 

కలలు కనే కన్ను

ఊట ఎరగకుండా ఉంటుందా?

కాడి మోసే భుజం

కాయ గాయకుండా ఉంటుందా?

కాపు కాసే గుండె

బండబారకుండా ఉంటుందా?

 

రెప్పదాటని జలపాతాలు..

పెదవి దాటని ప్రళయాలు..

గుండె పగలని భూకంపాలు..

 

చెక్కిళ్ళ మైదానాల మీద

పాయలు తీర్చుకుంటూ జీవనది!

 

బతుకు ప్రకృతి

కాఠిన్యంగానే ఉంటుంది!

దాక్షిణ్యమూ సౌశీల్యమూ ఎరగని

దక్షతను అది ప్రదర్శిస్తుంది!

వికల పాత్రల వివర్ణంపై

వికృత పరిహాసం ప్రతిఫలిస్తుంది!

ఒక అంకం ముగిసిపోతుంది!

 

ఆనంద విషాదాల మేకప్ పూతలను..

ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ ఉండాలి!

స్క్రిప్టు పలికించిన సకల ఉద్వేగాలను

స్మృతిలో ఎప్పటికప్పుడు చెరిపేసుకోవాలి!

అనివార్యతలెన్నో జట్టుకట్టి తోసేయగా

మరుసటి అంకంలోకి రంగ ప్రవేశం చేయాలి!

 

సకల భావావేశ పూరితమై..

సమస్త ఉద్వేగావృత భూషితమై..

రంగస్థలం-

మరుసటి అంకానికి ఆహ్వానిస్తుంది!

 

ఏ గడియ చివరి అంకమో..

ఏ పలుకు భరత  వాక్యమో..

శోషణ ఎరగని ప్రస్థానంలో..

శేషించినదెల్లా  నిత్యనటనమే!

*

చిత్రం : మునిసురేష్ పిళ్లె

మునిసురేష్ పిళ్లె

సురేష్ పిళ్లె స్వతహాగా జర్నలిస్టు. శ్రీకాళహస్తిలో పుట్టి, పెరిగి హైదరాబాదులో స్థిరపడ్డారు. కథలు, కవితలు, రాజకీయ వ్యంగ్య రచనలు, సీరియల్ నవలలు రాశారు. కార్టూన్లు గీస్తారు. వృత్తి ప్రవృత్తి ఒకటే కావడం అదృష్టం. జర్నలిజంలో పీజీ, బీఎల్ చేశారు.
Facebook :: https://www.facebook.com/kamspillai

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సార్ మీ కవిత.. చిత్రం కూడా బాగున్నాయి.. జీవిత వాస్తవాలని కళ్ళకి కట్టినట్టు చూపాయి 🌹🌹💐💐. మార్క్స్ బాబు

  • కవిత బావుంది..
    శుభాకాంక్షలు సర్💐

  • చివరి అంకం కవిత లో
    జీవిత రంగంలో నిత్యనటనల విశదీకరించటం చాలా బావుంది.
    అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు