చిల‌కం బొట్టు

అస‌లు నేను హిందువునా? ముస్లింనా? అనుకున్యా. క‌న్ఫూజ‌న్‌లోకి ప‌డిపోయా.

యి ఐదో త‌ర‌గ‌తి అయిపోయినాక సెల‌వ‌లు..
మాయ‌మ్మ చీనీచెట్ల కింద గ‌డ్డితీసే ప‌నికి, మా నాయిన టాక్ట‌రు ప‌నికి పోతాన్యారు. నేను పాల‌కు తోడెంటేసి గాటిపాట ఎనుములు ఇప్పుకోని బ‌డితిక్కు దావ‌లో జారేగుట్ట‌తిక్కో, న‌క్క‌ల గుట్ట తిక్కో  తోలుకోని పోతాంటి. మా మూడు ఎనుముల ఎన‌క‌ల పేడ గంప తీస్కోని పోతాంటి. బ‌డి దాటినాక న‌ర్సింహారెడ్డి క‌లంకాడ లోప‌ల బ‌రుగొడ్లు(ఎనుములు) పేడ పెడితే గ‌బ‌క్క‌ని పేడ గంప‌లో ఏసుకోని ఆ పేడ‌ను మా క‌లంకాడ ఉండే దిబ్బ‌లోకి పోచ్చాంటి. ప‌రిగిత్తుకుంట పోయి గంప ఇంట్లో వేసి మ‌ళ్లా ఎన‌మ‌ల‌కాడికి ప‌రిగిత్తాంటి. ఎనుముల ప్యాడ అంటే అంత ఇష్టం. ఏంటికంటే మా నాయిన మ‌ల్ల చేనికి ఏచ్చాడు. పంట పండుతాద‌ని.

ఒకరోజు శుక్కురారం అప్పుడు.. ఎప్పుటి మాదిరే మాయ‌మ్మ‌, నాయిన ప‌న‌ల‌కు.. నేను ఎనుములు మేప‌టానికి పోయినా. ఆ రోజు బెరీన ఇంటికొచ్చినా. ఇంటికొచ్చేలోప‌ల మాయ‌మ్మ నాకంటే ముందు ఇంటికొచ్చినాది. ఇండ్లంతా నీళ్ల‌తో తుడ్చ‌క‌చ్చింది.  ఎనుములు క‌ట్టేసింది. *బెరీన వ‌చ్చినావే* అన్యాది. *ఊపుచెత్త తిన్లాక ఇయ్యి ప‌రిగిత్త‌నాయిమా. నీళ్లు ద‌ప్పిగ‌యినాయి. బెరీన వ‌చ్చినామా* అని దిగులు మ‌గం పెట్టుకున్యా. *ఉంటేంలే.. వ‌సార్లో ప‌చ్చిగ‌డ్డి ఉండాది* అనింది. మా చెల్లెలు ప‌క్కింటి గొల్లోళ్ల ఇంట్లో ఆటాడుకుంటాంది.  సున్నం తొక్కాకు అనుకుంటా..  చెంబుతో నీళ్లు తెచ్చినాది మాయ‌మ్మ‌. గుట‌క ఆప‌కుండా తాగినా. ఇంట్లోకి పోయినా.  కొట్రీ ఇంటిలోప‌ల రెండుమూర‌ల ఎత్తువ‌ర‌కూ ఎర్ర‌మ‌న్ను పూసినాది.  బ‌య‌టికొచ్చినా.. మంచెత్తు సున్నం బ‌య‌ట‌గోడ‌లకు పూచ్చానాది మాయ‌మ్మ‌.  *మా బువ్వ‌మా* అన్యా. *రోంచేపుండు అయిపోతాది* అంటా సున్నం కుండ‌లో అద్దుకోని ప‌ర‌క‌తో పూచ్చాంది.  పాప ఎదిమా అనుకుంటా..  గొల్లోల్ల ఇంట్లోకి పోయి మా చెల్లెలును పిల్చ‌క‌చ్చినా.

ఇంట్లోకి పోయినాక మ‌ళ్లా.. *ఒమా బువ్వ ఆక‌ల‌యితాంది* అన్యా .
*దేవుడిగూడి కాడ ఎర్ర‌మ‌న్ను పూసినాక బువ్వ పెడ‌తా. కొద‌వేంటికీ. నిమ్మ‌ట్లో అయిపోతాది*అన్యాది.
నేను ఉండ‌లేక పొయ్యికాడికి పోయి కాళ్లుగాలే పిల్లిమాదిరి పోయిన‌నా. సూసినా. త‌పాల్లో బువ్వ‌కు ఎర్ర‌చీమ‌లు ప‌ట్నాయి. *మా నేను తిన‌ను పో. కురాకు లేదు.. ఏం లేదు* అన్యా ఏడుపుమ‌గం బెట్టి. గ‌బ‌క్క‌న మాయ‌మ్మ కాళ్లూ, చేతులు క‌డుక్కోని పొయ్యికాడికి వ‌చ్చింది. బూత‌పాలా  తీస‌క‌పోయి ఎండ‌లో పెట్నాది.  త‌పాలాపైన ఉండే చీమ‌ల్ని బండ‌మీద‌కి దొబ్బినా. ఎర్ర‌టి ఎండ‌కి చీమ‌లు పెనంమీద చ‌న‌క్కాయ‌లు మాడిన‌ట్లు బండ‌ల‌మీద మాడిపోయినాయి. చ‌చ్చినాయి. ఉఫ్పుమ‌ని ఊపి ఇంగ తినొచ్చు అన్యాది మాయ‌మ్మ‌. *రేత్రికి పొప్పు సేచ్చా రాజావ‌లీ.  రోంత‌సేపు ఉంటే పండుగారం నూర‌తా* అన్యాది మాయ‌మ్మ. *వ‌ద్దుపో* అని నుల‌క‌మంచం మింద ఎల్లెల‌క‌ల ప‌డినా. *అట్ల‌యితే.. బుడ్డ చెమ్ములో నెయ్యి ఉంది. తెల‌వాయికారం(ప‌ల్లీల పొడి) పై గూట్లో ఉండాది. అది తిన్దువులే* అనె మాయ‌మ్మ‌. పాణం లేచొచ్చినాది. ఉరికిత్త పోయి బుడ్డ చెమ్ము తీసుకున్యా. తెల్ల‌టి నెయ్యిలో ఎర్ర‌టి చీమ‌లు తిల్లాడ‌తానాయి. *ఈనాక్క ఈ చీమ‌లు ఈడ ఉండాయిమా* అంటి. *నీకు ఎన్ని మాట్లు చెప్పాలా.. ఎర్ర‌చీమ‌లు తింటే ఏం కాదు. కండ్ల‌కు మంచిది* అన్యాది మాయ‌మ్మ‌. ఎండ‌లోకి ప‌రిగిత్తుకుంటా పోయి బుడ్డ‌చెమ్మును ఎండ‌లో పెడితే చీమ‌లు ఆ ఏడికి నీల‌క్క‌పోయి బండ‌ల‌మీద సుండ్ర‌క‌పోయినాయి. తెల‌వాయికారంలో నెయ్యి వేసి క‌లిపి ముద్ద‌లు చేసి బువ్వ తినిపిచ్చినాది మాయ‌మ్మ‌.  తెల‌వాయికారం బువ్వ‌ను  ముద్ద‌లు చేసి నోట్లో పెడ‌తాంటే.. ముద్ద ముద్ద‌కూ రుచి ఎక్కువ‌యితాంది.  మా పాప‌కూ బువ్వ క‌లిప్పెట్టి.. మాయ‌మ్మ కూడా బువ్వ తిన్యాది.

రెండ‌ప్పుడు.. మా పాప (చెల్లెలు) చిన్న అద్దం తెచ్చుకోని వ‌సార్లో కూర్చుని … అద్దంలో సూసి చిల‌కం పెట్టుకున్యాది. మాయ‌మ్మ చూసినాది. పోయి.. *బాడుగోల్ల దానా..* అని తిడ‌తా తొడిపేసినాది. నేను వ‌సారాలో తిప్పుడుబిళ్ల (తెల్ల‌టి బెళుకు రాయి మీద మ‌ధ్య‌లో ములికి బొర‌క పెట్టి. దానికి దార‌మేసి రెండు చేతుల‌తో తిప్పుతారు)  తిప్పుతానా. *పెట్టుకోవాకు చిల‌కం. మ‌నం సుద్ద‌రోళ్ల‌మా* అంటా చెంప‌కేసి కొట్నాది మా పాప‌ను. మా పాత *వ్యా..* అంటా దీర్ఘం తీచ్చా ఏడ్చినాది. ఆప‌లా ఏడుపు. *మ‌నం పెట్టుకోకూడ‌దుమ్మా* అన్యాది ద‌గ్గ‌ర‌కు తీసుకుంటా.  మా పాప మాయ‌మ్మ తిక్కు చూసి ఇంగా ఎక్క‌వ‌గా  బ్యారుమ‌ని ఏడ్చింది. గ‌మ్మ‌న‌య్యింది.  *ఎవ‌రు ఇచ్చినారు చెప్పుమ్యా.. * అన్యాది.  *హ‌రితా వాళ్లు ఇచ్చినారు..* అంటూ  గోంగ‌లు తీసి ఏడ్చినాది. తిప్పుడుబిళ్ల ప‌క్క‌న‌బెట్టినా. *చిల‌కం పెట్టుకుంటే ఏమిమా .. త‌ప్పా? మా స్కూల్లో అంద‌రూ చిల‌కం బొట్టు పెట్టుకుంటారు. నువ్వు పెట్టుకోవు. పాప‌కు పెట్ట‌వు. ఏందిమా* అన్యా. *ఒరేయ్‌.. నీకు తెల్దు. మ‌నం సుద్ద‌రోళ్ల‌మాద్దిరి బొట్లు పెట్టుకోకూడ‌దు. మ‌నం దూదేక‌లోళ్లం. బొట్లు పెట్టుకోం* అన్యాది. *నువ్వేందిమా.. అట్లంటావు. దూదేకుళోళ్లం అయితే పెట్టుకోకూడ‌దా?  ముగ్గులు ఎయ్య‌వు ఏమీ ఎయ్య‌వు. పాప‌కు చిల‌కం బొట్టు కూడా పెట్టుకోనియ్య‌వు? * అని అడిగినా. మాయ‌మ్మ న‌గింది. *మీకు పెద్ద‌యినాక తెలుచ్చాది. ఇప్పుడు సెప్తే తెల్దు* అన్యాది. ఎర్ర‌గా పొడ‌వుగా ఉండే చిల‌కం డ‌బ్బీ చూసినా. పైన తెల్ల‌క్యాపు తిప్పినా. బొట్టుపెట్టుకోడానికి కొస్సి పుల్ల మాదిరి ప్లాస్టిక్ పుల్ల  ఉండాది. పుల్ల‌కంతా ఎర్ర‌గా ఉండాది రంగు. డ‌బ్బీలో కింద అడుగున ఒక ర‌వ్వ చిల‌కం అంటుకున్యాది. అయిపోయింది తెచ్చుకుందే అనుకున్యా.  మా కులంలో ఇట్ల ఏంటికి చేచ్చారు.. అంద‌రం మ‌నుషుల‌మే క‌దా?  ఆ పొద్దు మాపాప చిల‌కంబొట్టు పెట్టుకోల‌పాయన‌ని బాధ‌ప‌న్యా.

ఆరోత‌ర‌గ‌తికి పోయినాక నాకు కులం క‌త రోంత రోంత అర్థ‌మైతాంది. మేం అంత త‌క్క‌వ‌నా కొడుకుల‌మా?  అనుకుంటి.  గూడూరు తిర్నాల‌క‌ని ప్యాంటు ఏసుకోంటే.. ఒకాయ‌ప్ప *గ‌బ్బునూనె సాయిబు* అని ఎక్కిరిచ్చినాడు. ఏంటిక‌యితా అన్యా ఆయ‌ప్ప‌తో. ఇంటికొచ్చి మాయ‌మ్మ‌తో చెప్పినా ఆయ‌ప్ప ఇట్ల‌న్యాడ‌ని. *ఈసారి అనాకు అని నేను చెప్తాలే* అన్యాది మామ‌య్మ‌. ఎండ‌ల‌కాలంలో రాత్రిళ్ల‌పూట  బ‌య‌ట నుల‌క‌మంచం ఏసినాక‌.. మంచం మీద కూర్చోని బువ్వ తినిపిచ్చాండ మాయ‌మ్మ‌. బువ్వ‌తిన్యాక‌.. ఆకాశంలో సుక్క‌లు చూపిచ్చా *దేవుళ్లు ఆడ ఉంటారు* అంటాండె. *చుక్క‌ల‌ను చూసి పొద్దు క‌నిపెడ్తారు పెద్దోళ్లు* అని చెప్తాండె. నాక‌ర్థం అయ్యేది కాదు.  ప‌డుకోని ఆకాశంలోకి సూచ్చా..  ఎన్ని చుక్క‌లుండాయో ఎంచుకుంటాంటి.  ఎంచుకుండేదే మ‌ల్ల ఎంచుకోని మ‌ళ్లా ఫ‌స్టుకాడ‌నుంచి ఎంచుతాంటి. మా ఊర్లో చంద‌మామ‌.. యాఊరికీ పోకూడ‌దు సోమీ అని ముక్కుంటాంటి. మా ఊరి చంద‌మామ వేరే వాళ్ల ఊరికి పోకూడ‌ద‌నే అసూయ దండిగా ఉంటాండె.  ప‌డుకునేముందు కుంటికోతి, మంచి కోతి క‌థ‌, ఏడుచేప‌ల క‌థ చెప్తాండ మాయ‌మ్మ‌.  మా నాయిన వ‌సార్లో కూర్చోని ఎల్ల‌నూరు మామిడికాయ బీడీలు రెండు కొడ్తాండ‌. మేం క‌థ‌లు ఇన్యాక‌నే  ప‌నుకుంటాంటిమి. ఒక‌రోజు క‌థ‌లు చెప్పినాక‌.. *ఏందిమా మ‌న కులం ఇట్ల‌* అని అడిగితి. *దూదేక‌లోళ్ల‌కు దున్న‌పోతు ఆము( బ‌ద్ధ‌కం) అని పెద్దోళ్ల సామెత‌. మ‌నోళ్ల‌కు చ‌దువు, సంధ్య‌లేదు. తుర‌కం బాష రాదు. అందురూ ఆటికాటికే ఉండారు. మ‌న జాతికి క‌ష్టాలెక్కువ‌. మ‌నోళ్ల‌లో పేదోళ్లు ఎక్కువ‌. అయితే.. మ‌నం కాపోళ్ల మాద్దిరి జ‌మ్మంగా ఉంటాం. మ‌నం ఎవురికాడ త‌గ్గం. కాపోళ్లు మ‌న‌ల్ని త‌గ్గునాకొడుకులుగా సూచ్చారు. మీయ‌బ్బ‌(నాయిన వాళ్ల నాయిన‌), మీ నాయిన ప‌న‌ల‌కు పోతానారు. ఈళ్ల బ‌తుకు ఇంతే.  కాపోళ్ల ఇండ్ల‌కాడ‌నే ప‌నులు సేచ్చా స‌చ్చారు. నువ్వు బాగా చ‌దివి టీచ‌రు ఉద్యోగ‌స్తుడివి కావాల రాజావ‌లి. అంద‌రం ఒక‌సాట ఉండాల‌* అనేది మాయ‌మ్మ గ‌ర్వంగా. * పోమా అదికాదు..* అని అప్పుడే ఉద్యోగ‌స్తున్ని అయినంత‌గా సిగ్గుప‌డ‌తాంటి. *అది కాదుమా.. మ‌నం మ‌సీదుకు ఏంటికి పోమూ.. * అని అడిగితి. *మ‌నం పోముప్పా.. మీ నాయినోళ్ల‌కు న‌మాజు గురుంచి తెల్దు. లోమ‌డ‌బూమ్మ కొడుకులే కాదు.. ఊర్లోని న‌ట్టంతా మ‌బ్బునాకొడుకులు మ‌నోళ్లు. జ‌నాల‌కు ఉషారు లేదు. ఊర్లో పీర్ల‌పండగ‌నే కాపోళ్లకు భ‌య‌ప‌డి మానుకున్యారు* అనె మాయ‌మ్మ‌.
*ఏందిమా.. మ‌ల్ల అట్ల‌నే అంటావు* అంటి.
మ‌నం తురుకోళ్ల‌మా, హిందువుల‌మా?  అని అడిగినా.
*రోంత అదీ.. రోంత ఇదీ అన్యాది* మాయ‌మ్మ‌.
*అంటే..? *
*మ‌న పుట్టుకం, కార్యాలు(పెండ్లిళ్లు, ఫంచ‌న్లు), చావులు అన్నీ తురుకోళ్ల మాదిరి. మ‌న‌కు బాష‌రాదు. అందికే మ‌నం అంటే వాళ్ల‌కు త‌క్క‌వ చూపు. మాలా మాదిగోళ్ల‌కంటే హీనంగా సూచ్చారు. వాళ్ల తిక్కు మ‌నం పోం. వాళ్లు క‌లుపుకోరు మ‌నల్ని* అన్యాది మాయ‌మ్మ‌.
*మ‌నం ముస్లింలం కాం.  హిందువులం కాం. రెండింటికి న‌డింగ‌ల ఉండాం. థూ.. మ‌నదీ ఓ బ‌తుకేనా* అంటూ మాయ‌మ్మ నీర‌సంగా, బాధ‌గా అన్యాది.
*ఏందిమా.. అట్లంటావు. నువ్వు సంకురాత్రి పండ‌క్కు ఇండ్ల‌లికి సున్నం పూసి.. పూర్ణ‌క‌జ్జికాలు చేసినావు. శివ‌రాత్రి పండ‌క్కు గుగ్గుళ్లు సేచ్చావు.  ఉగాది పండ‌క్కు, ఇనాకుమ‌య్య పండ‌క్కు ఓలిగ‌లు సేచ్చివి. దీపావ‌ళి పండ‌క్కు ప‌టాకులు కాల్చుకుంటాం. మ‌నం హిందువులం అయితేనే క‌దా ఇట్ల సేసుకుంటాం* అంటి.
మాయ‌మ్మ న‌న్ను ద‌గ్గ‌ర‌కు తీసుకోని.. *తిక్కోడా. మ‌నం మంచ‌లం. దూదేక‌ళోల్ల ఇండ్ల‌ల్లో నువ్వూ, నేనూ పుర్తామ‌ని తెల్చా. మ‌నం ఈ కులంలో పుట్నాక ఈ కులం గొప్ప‌. మ‌న ఇంటి దేవుడు గూగూడు కుళాయ‌సోమి. ఆయ‌ప్ప‌కు హిందువుల‌ని వ‌ల‌ప‌క్రం(తేడా) లేదు. రేప్ప‌ద్ద‌న నేను ఉన్యా లేక‌పోయినా.. స‌చ్చేవ‌ర‌కూ మ‌న కులం మ‌ర్చిపోవాకు* అన్యాది.  *స‌రేలే* అని ఊకొట్నా.  *నీకు ఇప్పుడు నేను ఎంత జెప్పినా  ఏమీ అర్థం కాదులే.  వ‌య‌సోడివైనాక నీకే తెలుచ్చాది* అన్యాది మాయ‌మ్మ‌.
ఇంట‌రుకు కాలేజీకి పోయిన‌పుడు తోటి ఫ్రెండ్లు *మీకు ఉర్దూ, హిందీ భాష రాదు క‌దా.. మీరు మాలానే హిందువుల్లాగా అన్ని పండ‌గ‌లు సేసుకుంటారు* క‌దా అంటాండిరి. నాకేమి మాట్లాడాలో అర్థం కాక‌పోతాండ‌.  హిందీ రాద‌ని బాధ‌ప‌డ‌తాంటి. హిందువును కాదు.. అయినా హిందువుగా ఎందుకు ఉండాల‌ని అనుకుంటాంటి. ఆలోసిచ్చా బాధ‌ప‌డ్తాంటి. ఎవురూ పెద్ద చ‌దువులు చ‌దువుకోలేదు. ప‌ట్టించుకుండేవాళ్లు లేర‌ని అనుకుంటాంటిం. *దూదేకుల కులం.. ఏం కుల‌మురా ఇది. అంతా తిక్క‌లు మొక్క‌లు అనుకుంటా* నాలోనేను లోప‌ల‌లోప‌ల  తిట్టుకుంటాంటి. మాయ‌మ్మ చెప్పే మాట‌లు.. కులం పేరు చెప్ప‌టానికి సిగ్గుండ‌కూడ‌దు. బాగా చ‌దువుకోవ‌ల్ల‌. మ‌న కులంలో పెద్దోడివి కావ‌ల్ల అని మాయ‌మ్మ అంటాండె. మా క్యాస్టు అన్నా, మా ఇంటిదేవుడ‌న్నా నాకిష్టం ఇంకా పెరిగినాది.  గూగూడులో (అనంత‌పురం నార్ప‌ల ద‌గ్గ‌ర ద‌ర్గా. గూగూడు కుళ్లాయ‌సోమి పీరు ఉంటుంది. ఇక్కడ మా కులంవోళ్ల మాదిరే అనంత‌పురం, క‌డ‌ప జిల్లాల్లోని రెడ్లు, క‌మ్మ‌లు.. అన్ని కులాల‌వాళ్లు న‌మ్ముతారు ఈ సోమిని)  పీర్ల పండ‌గ బాగా జ‌రుగుతాది. మా ఊర్లో ఇట్ల జ‌ర‌గ‌లేదే అని బాధ‌ప‌డ్తాంటి.
మానాయిన్ను అడిగితే.. *ఎప్పుడో మీరు పిల్ల‌ప్పుడు గుండంకాడ పీర్లు నిల‌బెట్నాం. కాపోళ్లు గుండంకాడ మ‌న జోగా దెంకున్యారు. పాతోళ్లు ఎవురు లేరు మ‌నోళ్లు. అంద‌రూ పొద్దుటూరు, అనంత‌పురంకు పోయినారు. మేం ప‌న‌ల‌మీద ప‌డి అనుకోల‌. పీర్లపండ‌గ క‌తే మ‌ర్సిపోయినాం* అన్యాడు మా నాయిన‌.

ఎన్ని బాధ‌లున్నా ఆడిపిల్లోల్ల బొట్లంటే ఇష్టం ఉంటాండ‌. ఇంట‌రు కాలేజీకి పోయిన‌ప్పుడు ఆడ‌పిల్ల‌ల ముక్కుమీద ఉండే చిల‌కంబొట్లు, స్టిక్క‌ర్లు చానా అందంగా క‌న‌ప‌డేవి. బొట్టు పెట్టుకుండే ఆడ‌పిల్లోల్లంటే గౌర‌వం ఉండేది. ఎందుకో తెలియ‌క‌పోయేది.  కానీ మా చెల్లెలు బొట్టు పెట్టుకోకూడ‌దు.. మా కులం త‌ప్పోతే ఎట్లా అనుకుంటాంటి. మేం ఎప్పుడ‌యినా.. పులింద‌ల‌కో, పెండ్లిళ్లకో పోతే.. మాయ‌మ్మ‌, చెల్లెలుకు బొట్టులేంది చూసో ఏమో.. *మీరు ఏంటోళ్లు * అంటాండిరి కొత్తోళ్లు. *దూదేక‌లోళ్లం* అంటాండె మాయ‌మ్మ‌. *అదేక‌దా.. బొట్టు ల్యాక‌పోతే* అంటాండిరి వాళ్లు. *ఎందుకుమా ఇట్ల అడుగుతారు* అంటాంటి మాయ‌మ్మ‌తో. *అర్సాకు. మ‌ళ్ల చెప్తాలే* అంటాండె మాయ‌మ్మ‌. డిగ్రీ అయిపోయినా ఉద్యోగం వ‌చ్చినాది. ఎక్క‌డ చేరినా.. *నీ పేరు ఇట్లుందే. మీరు నూరుబాషాలా… మీరు మా పండ‌గ‌లు చేసుకుంటారు క‌దా.. * అని అడిగిందే అడిగి త‌ల‌కాయ తింటాండేవాళ్లు కొంద‌రు. వాళ్ల‌కు ఇచిత్రంగా ఉంటే.. నాకు బాధ‌యితాండ‌. ఊరుల‌న్నీ  దాటుకోని వ‌చ్చినాక హైద‌రాబాదులో ఇట్ల అడ‌గ‌డ‌మేందిరా?  అనుకుంటాంటి మంచులో. అయినా  గ‌ర్వంగా దూదేకులోళ్ల‌మ‌ని చెప్తాంటి. కొంద‌రైతే.. *దూదేక‌లోళ్లు అంటానావు. బాప‌నోళ్ల మాదిరి రాచ్చేవే రాత* అంటాండిరి. ఇట్లా చానామంది కులం గురించి న‌న్ను అడిగి అడిగి పెట్తారు. మాయ‌మ్మ చెప్పిన‌ట్లు ఏనాడూ కులం పేరు సెప్పుకోవ‌టానికి సిగ్గు ప‌డ‌లా. బొట్లు మేం పెట్టుకోమ‌ని గ‌ర్వంగా చెప్తాంటి.

ఛానెల్‌లో ప‌నిచేసేప్పుడే.. నాకు పెండ్లి పెత్త‌నం అయినాది.  పులింద‌ల అమ్మాయి. పేరు అనూష‌. అందంగా ఉండాది. మా పేరు కాదే.. అనుకున్యా. వాళ్ల అమ్మానాయినోళ్లు *పేర్లు పాత‌వి వ‌ద్ద‌ని అనూష * అని పెట్టుకున్యాం అనిరి. కాఫీ తాగి, స్వీట్లు తిన్యాక‌.. ఇద్ద‌రినీ మాటాడుకోమ‌న్యారు. *ఏం చ‌దివినావు* అని అడిగినా. *మాయ‌మ్మ ఆరోగ్యం బాలేద‌ని.. బిటెక్ త‌ర్డ్ ఇయ‌ర్ డిస్‌కంటిన్యూ* అనింది అనూష‌. *నేను చ‌దివిస్తాను. ఉద్యోగం చేయించ‌ను. నేనైతే ఉద్యోగం మానేసి రేప్పొద్దున వ్య‌వ‌సాయం చేసుకోవ‌చ్చు* అన్యాను. *నీకోమాట* అంది. చెప్ప‌మ‌న్నాను.  *మా పిన్ని బొట్టు పెట్టుకుంటాది. ఆ అల‌వాటు నాకొచ్చింది* అనింది. క్ష‌ణం లోప‌ల‌నే ఆశ్చ‌ర్య‌పోయినా. *ప‌ర‌వాలేదు.. * అన్యాను. ఎన్నో ఇబ్బందులు, బంధువులు త‌ల‌కాయ‌నొప్పిలు దాటుకుని అనూష‌నే పెండ్లి చేసుకున్యా. త‌న‌కి రోజూ బొట్టు పెట్టుకోవ‌టం అల‌వాటు. వాళ్ల‌మ్మ‌కు ఆ అల‌వాటు లేదు. ఆ మాటకొస్తే వాళ్ల‌ కుటుంబంలోనే ఎవ‌రికీ లేదు.  *మా ఇంటికి వ‌చ్చినాక మాయ‌మ్మోళ్ల ముందర బొట్టు పెట్టుకోవాకు* అని చెప్పినా పెండ్లి ఫిక్స‌యినాక‌. పెండ్ల‌యినాక బొట్టు తీసేయిద్దామ‌ని మ‌న‌సులో అనుకున్యా. పెండ్ల‌య్యాక త‌న‌కి బొట్టు మ‌రింత అందంగా ఉండాద‌ని నా నిర్ణ‌యాన్ని వ‌దిలేసినా. బొట్టుపెట్టుకున్నా ఏమీ అన‌లేక పోయా. మాయ‌మ్మ‌, నాయిన, బంధువులు క‌ల్చిన‌చోట త‌ను బొట్టు పెట్టుకునేది కాదు. వాళ్ల‌కి సంతోషం. ఇంట్లో మాత్రం బొట్టుపెట్టుకునేది. త‌న‌కి సంతోషం.  అనూష బొట్టుపెట్టుకుంటే కొంప‌దీసి.. యాడ మాయ‌మ్మ సూచ్చాదో అనుకుంటాంటి.. ఊరికిపోయిన‌ప్పుడు.  అస‌లు బొట్టు పెట్టుకుంటే ఏమి?  పెట్టుకోక‌పోతే ఏమీ?  బొట్టులో ఈ త‌ల‌కాయ‌నొప్పి ఏందిరా?  నాకే ఈ క‌ష్టాలు ఏంటికి అనుకుంటాంటి. రోంత‌సేపు నాలోని జ‌ర్న‌లిస్టు, నాగ‌రికుడు.. మ‌రికొంత సేపు *మ‌న కులాన్ని పోగొట్టుకుంటే ఎట్లా* అంటూ నాలో కుల‌వాది బ‌య‌లుదేరి.. మ‌ధ‌న‌ప‌డేవాణ్ణి. నేను క‌న్ఫూజ్ ప‌డుతూ.. మంచులో నాకు నేను న‌లిగిపోతూ ఉండేవాణ్ణి. ఈ బాధ చెప్పేది కాదు. చెప్పినా ఎవ‌రికీ అర్థం కాదు.

మాకు పాప పుట్నాది. పాప పేరు సాయికృతి. పిట్టోడ‌ని ముద్దుగా నేను పిల్చుకుంటా.  అనూష వ‌ల్ల పాప‌కు కూడా బొట్టుపెట్టుకుండే అల‌వాటు వ‌చ్చినాది. మా పిట్లోడు స్టిక్క‌రు పెట్టుకోనిదే బ‌డికెళ్ల‌దు. ఒక రోజు పాప అద్దం చేత్తో ప‌ట్టుకోని..  నిల‌బ‌డుకోని.. సిల‌కం బొట్టు పెట్టుకుంటానాది. *ఏం పాపా.. బుద్ధిలేదా.. బొట్టు ఏంటికీ * అనుకుంటా తొడిపేసినా. మా పాప ఉమ్‌.. అని  మూతిపెట్టి కిచెన్‌లోకి పోయి *నాన్న‌.. * అంటా ఏడ్చినాది.  అనూష బ‌య‌టికొచ్చింది.  *ఉంటేమిలే.. చిన్న‌పిల్ల * అన్యాది అనూష‌. * నీకు సుద్ద‌ర బుద్దులు వ‌చ్చినాయి. ఆ పాప‌కు నేర్పిచ్చినావు* అన్యా కోపంగా. *స్కూల్‌లో వాళ్ల ఫ్రెండ్సు పెట్టుకుంటారు. వ‌ద్దులే అని నేను చెప్ప‌లేను క‌దా.. ఇప్పుడు మ‌న క్యాస్టు గురించి చిన్న‌పాప‌కి చెప్ప‌టెమెందుకు* అన్యాది అనూష‌. త‌ను చెప్పింది క‌రెక్ట‌నిపించింది. ఆ రోజంతా.. మ‌న‌సేం బాగాలేదు.

స‌రిగ్గా.. ఇర‌వై మూడేళ్ల క్రితం మా పాప‌(చెల్లెలు) నిల‌బ‌డుకోని.. అద్దంముందు బొట్టు పెట్టుకుంటాంటే.. నేను ఏమీ అన‌లేదు. ఎందుకు పెట్టుకోకూడ‌దు.. అని అడిగినా మాయ‌మ్మ‌ను. నిల‌దీసినా. ఈ పొద్దు నా బిడ్డ బొట్టు పెట్టుకుంటాంటే.. ఇట్ల మాట్లాడినా అని బాధ‌ప‌డినా. అస‌లు నేను నేనేనా?  నేను ఎవ‌రికోసం బ‌తుకుతున్నా?   న‌న్నెవ‌రు న‌డిపిస్తున్నారంటూ.. నా రైట‌ర్ బుర్ర‌తో ఏదో ఆలోచించా.  ఏదీ అంతు చిక్క‌లేదు. క‌డుపుబాధ‌తో త‌రుక్కుపోయినాది కానీ. ఏమీ అర్థం కాలేదు.

ఒక రోజు మా ఛాన‌లు సారు ద‌గ్గ‌రికి పోయినా. *ఏమ్‌.. రాజావ‌లి. ఫేస్‌బుక్‌లో రాస్తున్నావు బాగా* అన్యాడు. *ఏం లేదు సార్ * అన్నానంతే. *నువ్వు హిందూ రైట‌ర్‌వా.. ముస్లిం రైట‌ర్‌వా.. మీ ప‌క్కూరాయ‌న ముస్లిం రైట‌ర్ అయ్యాడు. నువ్వు ఎటూకాకుండా మ‌ధ్య‌లో అలా నిల‌బ‌డిపోతే ఎవ‌రూ ప‌ట్టించుకోరు* అన్నారాయ‌న‌. ప‌ట్టించుకోక‌పోతే ఏముందీ…నేన‌మన్నా రైట‌ర్ అవుదామ‌ని ఇక్క‌డ‌కి వ‌చ్చానా?  అని మ‌న‌సులో అనుకున్యా. *ముస్లిం రైట‌ర్ అయితే త్వ‌ర‌గా ఫేమ‌స్ అవుతావు.. హిందువుల్లో క‌లిసిపోతే నువ్వు అలాగే అయిపోతావు. పాప పేరు ఏంటీ?  ఆ బొట్టేంటీ.. నువ్వేంటీ ? * అన్నారాయ‌న‌. ఎందుకో ఆయ‌న మాట‌లు విన్నాక‌.. ఆరోజంత బాధ‌ప‌డ్డా. మాయ‌మ్మ‌కి ఫోన్ చేసి *ఏందిమా మ‌న క్యాస్టు ఇట్ల‌* అని అడిగినా. *మ‌నం అట్టకాము. ఇట్ట‌కాము. న‌డింగ‌ల మ‌న‌ల్ని సంపినారు* అన్యా.  *నువ్వు ఎవ‌రేమ‌న్యా ప‌ట్టించుకోవాకు. నీకు న‌చ్చిన‌ట్లుండు* అన్యాది మాయ‌మ్మ‌.

అస‌లు నేను హిందువునా?  ముస్లింనా?  అనుకున్యా. క‌న్ఫూజ‌న్‌లోకి ప‌డిపోయా. మా కుల‌పోళ్లు.. ముస్లింల‌లాగా బిహేవ్ చేసేవాళ్లు. గ‌డ్డాలు పెంచుకోని,  బుర‌ఖాలు వేసుకోని ముస్లింల‌మే అని చెప్పుకుని తిరిగే బంధువుల‌ను చూసినాక నాలో నేను అశ‌క్తుడిని అయ్యాను. ఏదో పొగొట్టుకున్న‌ట్లు అయ్యాను. అంటే.. దూదేకుల అని అనిపించుకోవ‌టం ఇష్టంలేక జనాలు ముస్లించొక్కా ఏసుకుంటానారు అని అర్థ‌మైనాది. సిటీల‌ల్లో మ‌నోళ్లు ఇంట్లుండారుమా.. అని  ఒక‌సారి ఊరికిపోయినపుడు మాయ‌మ్మ‌కు చెప్పినా. నాకు తెల్చు అన్యాది. *మ‌నోళ్లు నైసు నేర్చుకోని, మ‌సీద‌ల‌కు పోయి గ‌డ్డాలు పెంచుతానారు. ఆడోళ్లు కూడా ఖురాన్ చ‌ద‌వుతానారు. బుర‌ఖాలు క‌ప్పుకుంటానారు. త‌రుకోళ్లు మ‌న‌ల్ని ప‌ట్టించుకోరు. మ‌న‌ల్ని క‌లుపుకోరు. అట్లాంట‌ప్పుడు మ‌న కులం మ‌నం పోగొట్టుకోకూడ‌దు. అట్ల పోతే.. మ‌నం కులం  మ‌ట్టిలో క‌లుచ్చాది బెరీన* అన్యాది మామ‌య్మ‌. హైద‌రాబాదులో ఇట్ల లేదుమా అంటి. *ఒక‌ప్పుడు మ‌సీద‌ల్లోకి కూడా రానిచ్చేవాళ్లు కాదంట‌. ఇప్ప‌డు మ‌న కులం వాళ్ల‌ను బాగ‌నే క‌ల‌ప‌క‌పోతానారు* అంటి. *ఏమో.. ఏ కాల‌మొచ్చెనో* అన్యాది మాయ‌మ్మ‌.

పాప‌.. ఎల్‌కేజీ చ‌దివేప్పుడే మాయ‌మ్మ చ‌చ్చిపోయినాది. అమ్మ‌ను ముస్లిం ప‌ద్ధ‌తిలో స్థాపం చేసినారు. ఆరోజు ముస్లిం ఆచారాలు అతి గొప్ప‌వి అనుకున్నా. మ‌సీదు పెద్ద‌తో మాట్లాడ‌టానికి జంకినా. భ‌య‌ప‌డినా. ఆయ‌ప్ప‌.. రోంత హిందీ మిక్సుచేసి మాట్లాడ‌తానాడు. అమ్మ‌ను బూడ్చిపెట్టినాక.. మూడురోజుల‌కు, ప‌దిరోజుల దినాల‌కు మ‌సీదు పెద్ద బాగా ప‌రిచ‌యం అయినాడు.
* తుర‌కం నేర్చుకోకుంటే ఎట్లా. మీడియాలో అంటున్నావు ఇబ్బందే* అన్యాడు ఆయ‌ప్ప‌. *అవును అయ్యా.. నేర్చుకోవాల‌* అన్యా. *మీ నాయిన్ను ప్ర‌తి శుక్ర‌వారం మ‌సీదుకు ర‌మ్మ‌ను* అన్యాడు. స‌రే అన్యా.  అయితే.. మా నాయిన మ‌సీదుకు పోతే.. మా కులం పోయిన‌ట్లే అనుకున్యా గ‌ట్టిగా. కోప్ప‌డినా. మా కులాన్ని గంగ‌లో క‌లిపేసుకుంటానారు అని బాధ‌ప‌డినా.

అది ద‌స‌రాపండ‌గ రోజులు. స్కూలు ప్రిన్సిపాల్‌.. యూకేజీలో ఉండే మా పాప‌కు అమ్మ‌వారి వేషం ఇచ్చింది. కృష్ణాన‌గ‌ర్‌లో సినిమావోళ్ల ద‌గ్గ‌ర అమ్మ‌వారి డ్ర‌స్సు తెచ్చినాం. రాత్రే పాప‌కు కోన్ ప‌ట్టిచ్చినాది. ప‌ద్ద‌న లేచి పాప‌ను..  అచ్చు అమ్మ‌వారిలాగానే  త‌యారు చేసింది అనూష‌.  చిల‌కం బొట్టు పెట్ట‌మ‌ని పాప అడుగుతాంది.  స‌రేలే అని చిల‌కం డ‌బ్బీ తీసుకుంటాంది అనూష‌. *ఏంటికి * అన్యా. *బొట్టు పెట్ట‌కుంటే అమ్మ‌వారికి అందం ఉండ‌దు. ఏదో మిస్స‌యిన‌ట్లు ఉంటుంద‌*ని అనూష చెప్పింది. పాప‌కి చిల‌కం బొట్టు పెట్నాది.
నేను *ఈనాడు సినిమా* పేప‌రు చ‌దువుతున్నా. పాప ద‌గ్గ‌రికొచ్చింది. *బాబూ.. * అని పిలిచింది. *ఊ..* అంటూ త‌లెత్తినా. క్ష‌ణాల్లో మా పాప నా నుదిటికి చిల‌కం బొట్టు పెట్నాది. అప్ర‌య‌త్నంగా తొడిపేసుకున్నా. *నువ్వు శుద్ధ‌రోళ్ల మాదిరి అయినావేమ్మా* అన్నానంతే. ఏం మాట్లాడానో అర్థం కాక..  *అమ్మ‌న‌వ్వు న‌వ్వింది * మా పాప‌.

ఆ త‌ర్వాత చానాసార్లు అద్దం ముందు నిల‌బ‌డి మా పాప చిల‌కం బొట్టు పెట్టుకున్యాది. నేను ఏమీ అన‌లేక‌పోయా. ఇంకోరోజు.. *ట్వ‌ల్వు క‌ల‌ర్సు ఉన్నాయి నాన్నా..* అంటూ చిల‌కం డ‌బ్బా చూపించింది మా పాప‌. నాకేమీ అర్థం కాలేదు. *ఎందుకూ.. * అన‌డిగినా. *మ్యాచింగ్‌.. మ్యాంచింగ్ * అంది.  *ఇది ప‌గ‌ల‌కొడ‌తా. పెట్టుకోవ‌ద్దు అన్నానా చిల‌కంబొట్టు* అంటూ మాయ‌మ్మ‌లాగా కోప్ప‌డినా. ప‌రిగెత్తుకెళ్లింది. కాసేపు ట‌బ్బు కుర్చీలో కూర్చున్నా. మెల్ల‌గా వ‌చ్చి మా పాప‌.. చిల‌కం బొట్టు పెట్నాది. *ఏయ్‌..* అంటూ అర్సినా. అద్దంలో సూసుకోబాబూ అన్యాది. లేచి నిల‌బ‌డి అద్దం తీసుకున్యా చేతిలోకి. *ఏంది పాపా.. ఇట్లా* అన్యా. *ఆ… ఏంది పాపా ఇట్లా.. ఆ.. చిల‌కం బొట్టు* అని న‌న్ను ఎక్కిరిచ్చినాది. ఎందుకో మాయమ్మలాగ కోపం వచ్చినాది.
*

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇంత వేదన ఎలా భరిస్తున్నావురా నాయనా ..

    అయినా సరే మీ అమ్మాయిని ఏం అనకు ,

    నీ భార్యనీ ఏం అనకు,

    ఆడ పిల్లలు రా …

    కులం మతం మగళ్ళకి మాత్రమే …

  • సంఘర్షణ అధ్బుతంగా ప్రెజెంట్ చేశావ్ వలీ! మా వూర్లో ఉన్న ఉసేనమ్మ, లాలెమ్మలు గుర్తుకు వచ్చారు. పట్నం పోతే వాళ్ళు బురఖా వేసుకొని వెళ్ళేవాళ్ళు. పాపం నిరక్షరాస్యులు. వారెంత బాధను అనుభవించి ఉంటారో?

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు