చిన్న మాట! ఒక చిన్న మాట!!

మనసు మోసకారి. నిజానికీ, భావనకీ వ్యత్యాస రేఖను గుర్తించదు. మనం అనుక్షణం గద్దించి చూడమనాలి, అలాంటిది వుందో లేదో ఖాయం చేసుకోమనాలి.

  కాలేజి రోజులనుంచీ కథలూ, అనువాదాలు చేస్తున్నా. ఆ తర్వాత కవిత్వమూ కొన్నాళ్ళు వ్రాశాను. తర్వాత వొక యేడాది వచ్చిన ఆకురాలు కాలం చాలా సంవత్సరాలే కొనసాగింది. నన్ను మూగవాడిగా మార్చేసింది. మళ్ళీ ఈ మధ్య ఓ రెండేళ్ళు కవిసంగమంలో “స్వరాలు తొడిగిన కవిత” పేరుతో హిందీ పాటల పరిచయం వ్రాసినా, గత యేడాదిగా వారం వారం సంచిక కు సినెమా రెవ్యూలు వ్రాస్తూ వున్నా ఇప్పటికీ వ్రాయడం ఇదివరకులా అలవడలేదు. వాక్యం ఇప్పటికీ నన్ను భయపెడుతోంది, నాతో దాగుడు మూతలాడుతోంది. కవిత్వం కొన్నాళ్ళే వ్రాసినా వొక జబ్బైతే నాకు అంటుకుంది. అదేమిటంటే యెంతో వ్రాయాలనుకున్నా నాలుగు వాక్యాలయ్యే సరికి ముగుస్తుంది. To hell with brevity. శీఘ్ర అన్న పదం వింటే మగవాళ్ళు అర్థం చేసుకుంటారు, అలాంటి దుస్థితి నాది, అదృష్టవశాత్తు కేవలం వ్రాయడం విషయంలోనే.
   అలాంటప్పుడు వచ్చిన ఆలోచన ఇది. పెద్ద పెద్ద విషయాల జోలికి వెళ్ళక, నా ప్రయాణంలో నేను గుర్తు పెట్టుకున్న చిన్న చిన్న మాటలే తలపోసుకుంటే, మీతో పంచుకుంటే నాకు రెండు విధాలుగా ఉపయోగం. వొకటి బరువు దించుకోవడం లాంటిది, మరొకటి ఆత్మీయ వాక్యం పంచుకోవడం లాంటిది. నేను యెంచుకున్న దారిలో నేను యెక్కువ పరిశోధన చెయ్యను, నడిచిన దారుల్లో కలసిన అనుభవాలను, చూసిన దృశ్యాలను మీ ముందు పెట్టడం. ఈ విధంగా నాకు యెక్కువ స్వేచ్చ దొరుకుతుంది, నేను వ్రాస్తున్న వ్రాతకు వైశాల్యమూ విస్తారమూ కూడా.
  కాలేజి రోజుల వరకూ కేవలం కాలక్షేపం పుస్తకాలు చదివా, కాలక్షేపం సినెమాలు చూశాను. 80లలో ఇండియన్ పనోరమ పేరుతో ఆ యేటి మంచి చిత్రాలను దేశంలోని వివిధ పట్టణాల్లో ప్రదర్శించడం మొదలయ్యింది. వో శుభ సంవత్సరాన విజయవాడలో కూడా. సీరియస్ సినెమా తో నా ప్రయాణం ఆ పనోరమ చిత్రాలు చూడడంతో మొదలయ్యింది. అన్నీ భారతీయ చిత్రాలే, మనకు తెలిసిన ప్రపంచం, వాతావరణం, నేపథ్యం కాబట్టి యెక్కువ కష్టపడకుండానే అర్థం అయ్యేవి. ఆ తర్వాత 1990 లో నేను ఉత్సాహం కొద్దీ పుణెలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్స్ చెయ్యడానికి వెళ్ళాను. అక్కడ వొక్క సారిగా కొత్త మాయాలోకంలోకి అడుగు పెట్టి, కళ్ళు తెరిచిన అనుభూతి. సినెమా ఆవిర్భావం నుంచీ సినెమా అన్న కొత్త కళారూపం యెలా యెదుగుతూ వచ్చింది, ఆ యెదుగుదలకు యెవరెవరు యెలా సహాయపడినది ఆ వికాస క్రమం, అందులో వివిధ అంశాలు అన్ని వొక ప్రణాళికాబధ్ధంగా చెప్పారు. కొన్ని గంటలు లెక్చర్లు, చర్చలు; మిగతా సమయమంతా సినెమాలు చూడటం.
ఇలా గేప్ లేకుండా అయిదు వారాలు. నేను తిండికి ఆగగలను కాని నిద్రకు కాదు. కొన్ని చివరి ఆటలు నిద్ర కళ్ళతో చూస్తే, కొన్ని డుమ్మా కొట్టాను. మా బేచ్ లో ఆశుతోష్ గోవారీకర్, రేణుకా శహానే, మకరంద్ పరాంజపే, సుష్మ ప్రకాష్ వగైరాలు వున్నారు. అప్పటికే వారు పేరు తెచ్చుకున్న నటులు. ఇక అక్కడి “బోధి వృక్షం” కింద చప్టా మీద యెందరో గొప్ప దర్శకులు కూర్చున్న చప్టా మీద కూర్చోవడం వొక జ్ఞాపకం. అక్కడి విద్యార్థులకి కోర్స్ అనంతరం వొక ప్రాజెక్టుగా షార్ట్ తీయాల్సి వుంటుంది. ఆ షూటింగ్ కోసం కొన్ని యేర్పాట్లు అక్కడే వున్నాయి. వొక చోఅట కొన్ని వరుసగా చెట్లు వున్నాయి. అక్కడ అడవి షాట్లు తీసుకోవచ్చు. నాకు బాగా గుర్తు, వొక రోజు చాలా సేపు ఆ చెట్ల మధ్య నడుస్తూ “తుం అగర్ జాఓ కహీఁ జాఓ కభీ వక్త్ సే కహనా జరా వో ఠహర్ జాయే వహీఁ” అని గున్‌గునాయించాను. యేం లాభం, వక్త్ యెవరి కోసమూ ఆగదు.
   FTII NFAI COMBINE అప్పట్లో పనోరమా చిత్రాలు కూడా చూపించి ఆయా చిత్ర దర్శకులతో ముఖాముఖీ కూడా యేర్పాటు చేసేవారు. అలా చాలా మందిని కలవడం వొక ఆనందం. ఆ చిత్రాలలో వొకటి ఆడూర్ గోపాలకృష్ణన్ తీసిన “మతిలుకళ్” వొకటి. వైకం మొహమ్మద్ బషీర్ వ్రాసిన నవలిక ఆధారంగా తీసిన చిత్రం. అడూర్ చెబితే తెలిసిన కొన్ని విషయాలు. ముందు ఈ చిత్రాన్ని తీయడానికి ముందుకొచ్చిన వో దర్శకుడు సినెమా మొత్తంలో యెక్కడా స్త్రీ ముఖం కూడా చూపే వీలు లేదని చెప్పి, కొన్ని ఊహల (మన సినెమాలో పాటలలాగా) దృశ్యకల్పన చేసి ఆ వంకతో అందమైన హీరోయిన్ లను చూపాలన్నది ఆలోచన. అలా చాలా మంది ముందు కొచ్చి మరీ వెనక్కు వెళ్ళిపోయారు. చివరికి ఆడూర్ తీశాడు ఆ చిత్రాన్ని వొక్క స్త్రీ పాత్ర కూడా లేకుండా.  కథ వొక జైలులో నడుస్తుంది. గోడకవతల ఆడవాళ్ళ జైలు, ఇవతల మగవాళ్ళది. అతను గోడ అవతల ఆమె రోజూ ఆటవిడుపు సమయంలో మాట్లాడుకోవడం ద్వారా దగ్గరవుతారు. అంతే తప్ప ఆమె ముఖం మనం కూడా చూడం. మతిలుకళ్ అంటే గోడలు అని అర్థం. ఆమె (నారాయణి) పాత్రకు గళం ఇచ్చింది లలిత. మనకు ఆ పాత్ర లలిత గళం ద్వారానే తెలుసు. అతను రచయిత బషీర్. బషీర్ నిజ జీవితం లో ఫ్రీడం స్ట్రగల్ లో పాల్గొని జైలుకెళ్ళిన మనిషి.
    సరే నేను చెప్పదలచిన మాట ఇప్పుడు వస్తుంది. మాటా మంతీ వుంటుంది అని చెప్పాను కదా.
సినెమా ప్రదర్శన అనంతరం మాటా మంతీ పెట్టారు. యెవరికి తోచిన విషయాలు వాళ్ళు చెప్పుకున్నారు. అడగాలనుకున్నవి అడిగారు. ఆడూర్ గారు ఓపికగా అన్నిటికీ సమాధానం చెప్పారు. వొక ప్రశ్న గుర్తుండి పోయింది. వొక అబ్బాయి లేచి, సార్ ఇందులులో చూపించిన జైలు దృశ్యాలు సహజంగా లేవు అన్నాడు. ముందైతే ఆడూర్ నవ్వేశారు. నువ్వెప్పుడన్నా జైలు లోపలినుంచి చూశావా అనడిగితే లేదు అన్నాడు. తర్వాత ఆడూర్ సుదీర్ఘంగా చెప్పాడు : మనందరికీ సినెమాలు చూసి చూసి జైళ్ళు, కోర్టులూ అంటే బాగా తెలిసిన విషయాలు, చూసిన విషయాలుగా మనసుల్లో స్థిరపడిపోయాయి. నేను ఈ చిత్రం తీయడానికి ఆ జైళ్ళు స్వయంగా చూసి పరిశోధనలు చేసి మరీ తీశాను. కథాకాలం 1947 కి ముందు. కాబట్టి రిటైర్ అయిన జైలర్లను కలిసి వారితో మాట్లాడి అప్పటి పరిస్థితులు, పధ్ధతులు, వ్యవహారం అంతా చెప్పించుకుని రికార్డు చేసుకున్నాను. తర్వాత పాత కాలపు జైలు చట్టాల చిట్టాలు సేకరించి చదివాను. అప్పట్లో కైదీలకు పెట్టే తిండి దగ్గర్నుంచి, దుస్తుల దగ్గరినుంచి, పాత్ర-సామానుల వరకూ అన్నీ అలాంటివే వుండేలా చూసుకున్నాను.  ఆ కాలంలో జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళు నా చిత్రం చూసి నువ్వు సరిగ్గా అలాగే జైళ్ళని చూపావు అని మెచ్చుకుంటే, నువ్వు ఇలా అంటున్నావు. అని తను చిత్రం తీసేప్పుడు తీసుకున్న జాగ్రతలు, పడ్డ శ్రమ అంతా వివరంగా చెప్పాడు. మూడొంతుల పని సినెమా షూట్ ప్రారంభానికి ముందే పూర్తి చేస్తానని, ఆ మూడొంతుల పనిలోనే ఇదంతా వుంటుందనీ చెప్పాడు. ముందు నవ్విన మేమంతా తర్వాత చాలా సీరియస్ గా వినడం మొదలు పెట్టాము.
   మనసు మోసకారి. నిజానికీ, భావనకీ వ్యత్యాస రేఖను గుర్తించదు. మనం అనుక్షణం గద్దించి చూడమనాలి, అలాంటిది వుందో లేదో ఖాయం చేసుకోమనాలి. ఇది ఒక పెద్ద (నా వరకు) పాఠం. తర్వాత హైదరాబాదు అఫ్జల్గుంజ్ దగ్గర వున్న లైబ్రరి మెట్లు చూస్తుంటే యెన్నో చిత్రాలకి కోర్టు దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతాయి. ఈ లొకేషన్ గొడవ చిన్నదే కాని నేను చెప్పదలచుకున్నది మనకు అనుభవం లోకి రాని విషయం కూడా మన మనసుల్లో నాటుకు పోయి వుంటాయి వేరు వేరు కారణాల వల్ల. De ja vu లాంటి అనుభూతి. నిజంగా తెలుశా అంటే లేదు. మాలో కనీసం ఇద్దరికి, ఆ ప్రశ్న అడిగిన అబ్బాయికి, నాకు ఇది మరచిపోలేని సంఘటన. ఇలాంటి చిన్ని చిన్ని మాటలే మీతో పంచుకుంటాను.
   మీకు కూడా కాలక్షేపం వుంటుంది, భారీ కథనాలు soil and graveyards వుండవు.
*
పరేశ్ దోశి

పరేశ్ దోశి

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చిన్న సవరణ. పొరపాటున సుష్మాస్వరాజ్ అని వ్రాశాను. సుష్మా ప్రకాష్ గా చదువుకోగలరు. ఆమె త్రికాల్ (శ్యామ్ బెనెగళ్ ది) లో చేసింది. పొరపాటు కు sorry.

 • ఇందుకా స్వరాలు తొడిగిన కవిత ఆపేశారు..అదే పెద్ద లోటుగా వుంది..చాలారోజులు ఆ పాటల మాధుర్యాన్ని పంచగా ..విని, చదివి ..చాలా హాయిని అనుభవించాను(ము
  ..అంటే బహువచనం కూడా)..ఐనా ఈ అనుభవమూ బాగుంది..రాస్తుండండి…ఇవి కూడా.

 • ఓహ్ చాలా విషయాలు తెలిశాయి. థాంక్ యు అండీ

 • ముందుగా, మీకుఅభినందనలు!గొప్ప చిన్న మాట మాకోసంరాసినందుకు,రాస్తునందుకు..💐👌.స్వరాలుతొడిగినకవిత లాగే,,ఇదిపాపులర్, కావాలని అవుతుంది అని మన నమ్మకం!👍paresh ji!

 • Missing your స్వరాలు తొడిగిన కవిత badly, Paresh Garu.
  Thank you for your new column.

 • మీ మధుర జ్ఞాపకాలు మాతో పంచుకుంటున్నారు. సంతోషం.
  చాలా ఇంటరెస్టింగ్ గా కూడా రాశారు..

 • బావుంది తొలాట. రాబోయే సంచికలకోసం ఎదురుచూసే అవకాశం.

 • పరేశ్ దోశి గారి రచనలు బావుంటాయి ఎఫ్‌బి లో వారి రచనలు తప్పక చదువుతాను.
  చాలా మంచి వివారాలున్నాయి ఈ రచనలో.చెప్పిన పద్ధతి చాలా బావుంది.

 • పరేష్ గారు! ధన్యవాదాలు! మరొక్క తేనెతుట్టతో మాట! చిన్న మాటతో వచ్చారు..చదివి ఎంత సంతోషం కలిగిందో! నేనూ ఈ పూణె పిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి చాలానే విన్నాను. నాకూ ఆ కోర్సు చేయాలన్న ఆశ చాలానే ఉండేది. ఇప్పుడు మీ రాతలతో ఆ లోపు తీరుతుంది! నిర్మాతల, మరియు మీ అనుభవాలు చదవడానికి కాచుకుని ఉంటాము. మీ స్వరాలు తొడిగిన కవితను ఎలా ఆనందించామో!! Thank you Pareshgaru!!!💐💐💐

 • పరేష్! ధన్యవాదాలు! చాలా మంచి పోస్ట్ ప్రారంభంచేశారు. పిల్మి ఇన్స్టిట్యూట్ గురించి విన్నాను.నాకూ ఆ కోర్స్ చేయాలన్న ఆశ ఉండింది.మీ అనుభవాలు తేనె చవిచూసినట్లు. మీ పాటల తరువాత మరొక్క మంచి అనుభవాలను పంచుకుంటున్నారు.ఎంతో ఆశక్తితో ఎదురుచూస్తుంటారు.

 • రాయడంలో తడబడుతున్నానని మీరే అంటే మేము ఏం చెప్పాలి సర్.. మీ శీర్షిక సారంగా లో చదవబోతున్నందుకకు సంతోషంగా ఉంది.

 • మనసు మోసకారి…. చాలా కాలం తర్వాత….. మనం ఈ విషయం ఓ సారి చాలా సేపే మాట్లాడుకున్నాం కూడా….. అశోక్ చికాగేసి ఇక చాలని అన్నాడు.

  నీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనుభవాలు మనమేదో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు చెప్పినట్టు గుర్తు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు