చావులోనూ జీవికను పంచే ‘చావు ప్యాకేజీ’

సమాజం ప్రపంచీకరణలో భాగంగా ఎంతగా కుళ్లిపోతోందో చెప్తూనే ఈ కథ మనిషి ముందు ఎన్నో ప్రశ్నల్ని నిలుపుతుంది.

జీవితం రోజు రోజుకు సంక్లిష్టం అవుతున్న సందర్భంలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నా చేయడానికి పని దొరకడం లేదు. బతుకు పోరులో ఓటమి అంచులకు చేరుకున్నప్పుడు చివరాఖరికి ఏ వృత్తినైనా చేసి ప్రాణాల్ని నిలబెట్టుకొని జీవితానికి ఎదురీదుతాం. అయితే కొన్ని పనులు మనిషికి సమాజంలో ఆత్మగౌరవాన్ని కల్గించక పోవచ్చు.  లేదా కొన్ని పనులు నీచంగా చూడబడవచ్చు. ఏ పనినైనా Dignity of Labour  అని గౌరవించక పోవడం మనలోని బలహీనత. రోడ్లు ఊడ్చే సఫాయి పని, మరుగుదొడ్లు కడిగే పాకి పని, ఇల్లిళ్లూ తిరిగి చెత్తను సేకరించి తీసుకు పోయే మున్సిపాలిటీ కార్మికుల పని ఇట్లా చాలా ఉన్నాయి.

అలాంటి ఒక కొత్త పనితో బతుకు పోరు సాగిస్తున్న ఒక సామాన్యుడి కథే డా. భైరవి వెంకట నర్సింహస్వామి (డా. బి. వి. ఎన్. స్వామి)  రాసిన చావు ప్యాకేజీ. ఈ కథ మొదటి సారి 2010లో ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితం అయింది. దాదాపు రెండు దశాబ్దాలుగా కథలు రాస్తున్న స్వామి ఇప్పటి దాకా 2004లో ‘నెల పొడుపు’ (కథలు), 2005లో ‘అందుబాటు’ (ఉత్తర తెలంగాణ కథా రచయితల పరిచయం), 2011లో ‘వివరం’ (కథా విమర్శా వ్యాసాలు), 2013లో ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ (కథలు), 2014లో ‘కథా తెలంగాణం’ (కథా విమర్శా వ్యాసాలు), 2017లో ‘కశప’ (కథ శతక పద్యం), ‘పటువ’ (సాహితీ వ్యాసాలు), 2011లో కర్ర ఎల్లారెడ్డి తో కలిసి ‘తెలంగాణ చౌక్’ తెలంగాణ ఉద్యమ కథల సంపుటికి, 2016లో కొంత మంది ఇరర రచయితలతో కల్సి ‘కుదురు’ (కరీంనగర్ కథలు)కు, 2017లో డా. సదానంద్ శారద, డా. ఎ. యం. అయోధ్యారెడ్డి తో కలిసి ‘మూడు తరాల తెలంగాణ కథ’కు సంపాదకత్వం వహించారు. అనేక విమర్శా వ్యాసాలు రాశారు. రాస్తున్నారు.

రచయిత బావ రఘు వాళ్ళ అమ్మ నిద్రలోనే చనిపోయింది. ఈ విషయమే ఫోన్ చేసి చెప్తూ తొందరగా రమ్మంటాడు రఘు. అప్పుడు రాత్రి మూడు గంటలు. నిద్ర మత్తు వదిలించుకొని గంటలో రఘు వాళ్ళింట్లో ఉంటాడు రచయిత. పోయే సరికి “అనంత లోకాలకు పయనించిన ఆమె పార్థివ శరీరం ఎవరూ తెలియనట్లు, ఏమీ ఎరగనట్లుంది” ఆమె జ్ఞాపకాలన్నీ రచయితను చుట్టు ముట్టుతాయి. అందరికీ కబురు అందించాలి లేకపోతే తప్పు తీస్తారని అంటాడు రచయిత. నాకేమీ తోచడం లేదు ఆ సంగతి నీవే చూడుమంటాడు రఘు. మెల్లమెల్లగా బంధువులు, పరిచయస్తులు వస్తుంటారు. ఇల్లంతా శోక వాతావరణం నిండుకుంటుంది. సానుభూతి వచనాలు, ఎడ్పులు, పరామర్శలు పెరిగిపోతున్నాయి. ఇక అంత్య క్రియల ఘట్టం దగ్గర పడుతుంది. అసలే కొత్త ప్రాంతం కావడం మూలంగా ఎలా చేయాలో,  ఏం చేయాలో రచయితకు తోచడం లేదు. ఇంతలోనే..

“ఏమోయ్ మనవడా! వాన వచ్చేటట్లుంది. కాష్టం పేర్చుడయిందా? రఘుకు తాత వరసయ్యే ఒకాయన కాగల కార్యాన్ని గుర్తు చేశాడు. ఈ లోపుగానే సార్ మీ అడ్రస్ చెప్పండి నేను వస్తున్నాను. అన్నీ నేను చూసుకుంటాను అని కొద్ది సేపట్లోనే వచ్చాడు శంకరయ్య అనే వ్యక్తి. పరిచయాలైన తరువాత చనిపోయింది అడనా, మగనా అని తెలుసుకొని ఆ వ్యక్తి రెండు రకాల చావు ప్యాకేజీ లను చెప్తాడు. అబ్బా గంతగనమా ఇంతకు ఏం తీసుకొస్తావు అంటాడు ఇందాకటి తాత ఆశ్చర్యపోతూ..  “మనిషి బరువును బట్టి కట్టెలు పెట్టాలె. అగర్ బత్తీలు, కిరసనాయిలు, టైర్లు, పసుపు, కుంకుమ, బుక్క గులాలు, సెంటు, పన్నీరు, ముత్యం,  పగడం, బంగారుపూస, గంధపు చెక్కలు, పేలాలు, చిల్లర, పైన తెల్లబట్ట, చీర, దండలు, పాడె బొంగులు, కుండ, సుతిలి, వ్యాను, చప్పుళ్ళు….” చావుకు కూడా ఇంత లిస్టు చదివే సరికి రచయిత సరే నీవు అడిగినంత ఇస్తామని ఒప్పుకుంటాడు.

శంకరయ్య ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అన్నీ సిద్ధం చేసి ఇంట్లో వ్యక్తి లాగా చాలా చొరవతో శవానికి స్నానం చేయించడం దగ్గరి నుండి అన్నీ పద్ధతి ప్రకారం చేసి తాను ముందుండి శవయాత్రను పూర్తి చేస్తాడు. ఒక బరువైన ఘట్టం ఏ మాత్రం శ్రమ లేకుండా పూర్తయినందుకు అందరూ ఊపిరి పీల్చుకుంటారు. దహన సంస్కారం తరువాత అందరూ ఇంటికి చేరుకున్నాక సార్ నాకు రావాల్సిన డబ్బులు నాకిస్తే నేను పోతానంటాడు శంకరయ్య.

ఇస్తగని గీ పనిలకు దిగినవేందయ్య? ఇంతకు మీది ఏ కులం అంటాడు రచయిత. మేం కోమటోల్లం అని చెప్తూనే “ఇది మాత్రం పని కాదా? వ్యాపారం కాదా?” అని ప్రశ్నిస్తాడు.

“ఖర్చులు పోనూ నీకు ఏపాటి మిగులుతాయి. మనిషి చచ్చి వాళ్ళంతా పరేశాన్ల ఉంటే నువ్వు పైసలు ఎట్లా వసూలు చేస్తవు?” అని మళ్ళీ ప్రశ్నిస్తాడు రచయిత.

“శవం అక్కడుండంగనే, చచ్చిన మనిషిని మర్చిపోయే కాలం ఇది. మల, మూత్రాల మధ్య చచ్చినోళ్లను చూసిన. అసహ్యంతోటి కాళ్ళు కడగడానికి కొడుకులు ముందుకు రాక పోతే నేను ముట్టుకొని కడిగి చూపించిన. శవం కాళ్ళు కడిగితే పుణ్యం. అన్నదమ్ములు కొట్లాడుకొని కుండ పట్టక పోతే నేను పట్టిన. కుండ పడితే ఒక యాగం చేసిన పుణ్యం. ఇవ్వన్నీ చేయకున్నా నాకు వచ్చే పైసలు వస్తయి. చేస్తే పది మందికి చేసిన పుణ్యం మిగిలుతది. అందుకే నన్ను అందరు పిలుస్తరు. నాకు ఓపిక తప్ప కోపం లేదు. ఇంత చేసినా కొంత ఎగ్గొట్టేటోల్లు ఉంటరు. వ్యాపారం అన్నాక నష్టం ఉంటది కదా అని సమాధానపడుత” అంటాడు శంకరయ్య.

ఇంకా కొద్దిసేపు శంకరయ్య వృత్తిలోని సాధకబాధకాలను తెలుసుకొని రచయిత ఆయనకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చి పంపిస్తాడు. “సారు లోకంల పాపాల సంఖ్య ఎక్కువైంది. పైన స్వర్గం, నరకంల జాగ లేదు. కనుక ప్రతీ ఒక్కరు భూమి మీదనే శిక్ష అనుభవిస్తున్నారు.” అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతాడు శంకరయ్య.

ఇప్పుడన్నీ ప్యాకేజీలమయమే. బర్త్ డే ప్యాకేజీ, మెచ్యూర్డ్ ఫంక్షన్ ప్యాకేజీ, మ్యారేజ్ ప్యాకేజీల్లాంటివి చూస్తూనే ఉన్నాం. ఈవెంట్ మేనేజర్లు పెరిగిపోయారు.  అట్లనే ‘చావు ప్యాకేజీ’ కూడా. చావును కూడా ప్యాకేజీగా మార్చి ఒక వ్యక్తి జీవించడం అదే అతని జీవిక కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

‘ఉదర పోషణార్థం బహుకృత వేషః’ అని సామెత. ఈ కథ దీనికి పరాకాష్ట. వేగవంతమైన జీవితంలో పెళ్లికైనా, చావుకైనా మొక్కుబడిగా వచ్చిపోతున్నారు కానీ సదరు కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చి వాళ్ళ వెంట ఉండేంత తీరిక, ఓపిక ఎవరికీ లేదిప్పుడు. బతికినంత కాలం ఏమీ సంపాదించకున్నా పరవాలేదు కానీ చనిపోయినప్పుడు పాడెను మోయడానికి కనీసం ‘ఆ నలుగురు’నైనా సంపాదించుకోవాలని అంటుంటారు. స్వార్థం విపరీతంగా పెరిగి పోయి ఆ నలుగురిని కూడా సంపాదించుకోలేకపోతున్నాం. అందుకే ‘మహాప్రస్థానం’ వాహనాలు బాగా పెరిగిపోయాయి. ‘నా’ అన్నవాళ్లు విదేశాల్లో స్థిరపడిపోతే ఇక్కడే మిగిలిపోయిన ముసలి ప్రాణాలు గాలిలో కలిసిపోయినప్పుడు ఈ ‘చావు ప్యాకేజీ’లే కాగల కార్యాన్ని పూర్తి చేస్తాయి. సమాజంలో విపరీతంగా పతనమైన మానవీయ సంబంధాలకు ప్రతీక ఈ కథ.  డా. బి. వి. ఎన్. స్వామి  రాసిన ఏ కథ తీసుకున్నా అందులోని పాత్రలను తన చుట్టూ వున్న సమాజం నుంచే తీసుకొని వాటికి రక్త మాంసాలను అద్ది ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు. ఈ కథలోని శంకరయ్య పాత్ర కూడా అలాంటిదే.

చావును వ్యాపారంలా చూడకుండా చనిపోయిన కుటుంబపు మనిషిలాగే వారిలో కలిసిపోయి ఒక మానవీయతతో, భయం, బిడియం లేకుండా అంత్యక్రియలను ముందుండి నడిపించడం చాలా సాహసం. ఆస్తిపాస్తులు సంపాదించలేదని, సంపాదించినా సరిగా పంపకాలు చేయలేదని కన్న వాళ్ళే వాకిట్లో శవాన్ని పెట్టుకొని కాట్లాడుకునే సందర్భంలో శంకరయ్యలాంటి మనిషితనం నిండిన మనిషి అవసరమైతే తానే శవం ముందు నడుస్తూ అగ్గి, కుండ పట్టుకోవడం ఊహకు అందని విషయం.

2000 సంవత్సరం నుండి సమాజం ప్రపంచీకరణలో భాగంగా ఎంతగా కుళ్లిపోతోందో చెప్తూనే ఈ కథ మనిషి ముందు ఎన్నో ప్రశ్నల్ని నిలుపుతుంది. ఒకప్పటి సమాజానికి, ఇప్పటి సమాజానికి గల స్పష్టమైన తేడాను కూడా చూపుతుంది. సరళమైన శిల్పంతో సాగిపోయే ఈ కథ వస్తు పరంగా విలక్షణమైందే కాదు అంతర్గతంగా కూడా ఎన్నో సమస్యల్ని చర్చించిన కథ.

చావు ప్యాకేజీ కథ:

చావు ప్యాకేజీ

 

  *

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు