చలం…ఎందుక్కావాలి ఇప్పుడు?!

చలం గురించి మీరూ రాయండి! ఇక్కడ వ్యాఖ్యలుగా రాయవచ్చు. లేదా, విడి వ్యాసాలుగా రాయవచ్చు. కాని– రాయండి! చలం మీలోకంలోకి ఎలా వచ్చాడో, ఎంత ప్రభావితం చేశాడో రాయండి. 

ఇది చలం నెల. 1894 మే 18 నాడు చలం పుట్టారు. ఇదే నెల నాలుగున 1979లో కన్నుమూశారు.   చలం భావనకి  ఎప్పటికప్పుడు పుట్టుకే తప్ప అస్తమయం లేదు. కాని, ఎప్పుడూ ఒక ప్రశ్న వుంటూనే వుంది: చలం ఎందుక్కావాలి ఇప్పుడు? చలం అక్కర్లేదు అనుకునే సందర్భాలు మనకి లేవు కాబట్టి– చలాన్ని ఇప్పుడు ఎలా తలచుకోవాలన్నదే మన తపన. 

కేవలం స్త్రీ-పురుష సంబంధాలకే పరిమితం కాదు!

లం అవసరం ఈ రోజు తప్పక ఉంది. ఉండడం కంటే కూడా….ఇంకా అవసరం ఉండాల్సి రావడం విషాదం. చలం ఆ రోజు స్త్రీలకు సంబంధించిన ఏ అసమానతల గురించి, సమస్యల గురించి, స్వేచ్ఛ గురించి తపన చెందాడో ఆ పరిస్థితులు ఇవాళ కూడా అలాగే ఉన్నాయి. ఆయన కోరుకున్న స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ పురుష సంబంధాల్లో సమానత్వం ఇవాళ్టికీ సాధ్యం కాలేదు. కుటుంబంలో ఉన్న ఆధిపత్యాన్ని చలం ప్రశ్నించారు. దాదాపు 70 ఏళ్లైనా పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు. పురుషులు స్త్రీల పట్ల ప్రదర్శించే పితృస్వామ్య భావజాలం, స్త్రీల పైన అణచివేత, ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నాయి. కనుక ఇప్పటికీ చలం అవసరం ఉంది. ఇప్పుడే కాదు…స్త్రీ ల జీవితాల్లో మార్పు రానంత కాలం చలం అవసరం తప్పకుండా ఉంటుంది. స్త్రీల గురించే కాదు…మన బిడ్డల గురించి, వాళ్ల పెంపకం గురించి ఆయన ఎంతో ఆలోచించారు. అవి కూడా ఇవాళ చాలా అవసరమైన విషయాలు.

చాలా మంది చలం కాపురాలు చెడగొట్టడం కోరుకున్నాడని అపార్థం చేసుకున్నారు కానీ ఆయన సమానత్వం కోరుకున్నారు.  ఆయన మ్యూజింగ్స్ లో ..మానవ సంబంధాల్లో ఉండాల్సిన నిష్కపటత్వం, హిపోక్రసీ లేని తనాన్ని ఆయన కోరుకున్నారు. కానీ ఇవాళ హిపోక్రసీ ఎక్కువయ్యింది. చలం కోరుకున్న స్త్రీ సమానత్వం, స్త్రీ స్వేచ్ఛ, మానవసంబంధాలు, విలువలు ఇంకా ఏర్పడలేదు కాబట్టి…అది ఏర్పడేవరకూ చలం అవసరం ఉంటుంది. మగవాళ్ల స్వభావంలో మార్పు రానంత వరకూ చలం అవసరం ఉంటుంది. చివరగా చలాన్ని కేవలం స్త్రీ-పురుష సంబంధాలకే పరిమితం చేసి చూడొద్దు. చలం అందించిన వారసత్వాన్ని ఇప్పటి రచయితలు అంది పుచ్చుకుని కొనసాగించాల్సిన అవసరం ఉంది.

                                                                                               -ఏకే ప్రభాకర్ (సాహిత్య విమర్శకులు)

ఎవరు రాయగలిగారు-ఈ స్త్రీల కోసం ఇన్ని వేల పేజీలని !

విత్వాన్ని తూచే రాళ్లు తన వద్ద లేవన్నాడు చలం మహాప్రస్థానం గురించి. చలం సాహిత్య ప్రాసంగికతను తూచే రాళ్లు మన వద్ద ఉంటాయనుకోను. లేదూ కాలపరీక్షకు ఎంతటి వారైనా లొంగక తప్పదు అంటే, ఆ పరీక్ష నాకు చేతకాదు. అవును చలం విషయంలో నేను నిక్కచ్చిగా సబ్జెక్టివే. సౌందర్యాన్ని ధ్వంసం చేసే వాస్తవ జ్ఞానం ఏ మాత్రం సుఖం.!?  చలాన్ని ఆ నాటి సమాజమే కాదు, సాటి రచయితలూ కారాడి వదిలారు. మెరుపుల మరకల్ని, చెలియలి కట్టల్ని అడ్డు పెట్టినా సరే వాటిని అవలీలగా దాటుకుని ఈ నాటికీ బలంగా నిలబడిన నాయిక  చలం ‘రాజేశ్వరి’.  సాధించవలసిన దానిని ఏదైనా సాధించారంటే అది తిరగబడిన వాళ్లేనన్న విప్లవ కారుడు, మెజార్టీ లోకపు అంధకారాన్ని తన రచనల ద్వారా నొప్పించిన వైతాళికుడు చలం.  ఆయనలా రాసిన రచయిత మరొకరు లేరు. అంతఃబహిర్లోక యుద్దాలతో నలిగినలిగి, యాతనలు, అవమానాలు,దుఃఖాలతో  కలగికలగి ఎవరు రాయగలిగారు-ఈ స్త్రీల కోసం ఇన్ని వేల పేజీలని ! పురుషులు సరే , స్త్రీలన్నా రాయగలిగారా, ఇందులో సగాన్ని!

చలం…!నాకు అక్షరం అబ్బడానికి నువ్వు కారణం కాకపోవచ్చు. కానీ ఆ అక్షరానికున్న అనేక స్వేచ్ఛావర్ణాల్లో నువ్వొక మేలిమి రంగువి. లవ్ యూ సోమచ్  చలం..!

                                                                                                      —కె.ఎన్. మల్లీశ్వరి ( కథా, నవల రచయిత్రి)

 

                        అసలు చలం ఇపుడే కావాలి

లం రాసిన కాలం, బతికిన కాలం పోయి చాలా కాలం అయింది.  ఐనా చలాన్ని చూసి భయపడేవాళ్లు, ఆయన పేరెత్తితే జంకేవాళ్లు ఇంకా ఉన్నారు. దానర్థం ఇంకా మనం నిజాలను, జీవితాలను కాగితం మీద చూసే సాహసం చేయలేక పోతున్నామనే. చలం అనగానే కళ్లముందు కనబడేది స్త్రీ,  స్త్రీ స్వేచ్చ. ఎంత మార్చాలని ప్రయత్నం చేశాడో పాపం.! నేటికీ స్త్రీ అంటే  అణకువ, సౌమ్యతకు చిహ్నాలుగా ఉండాలనే కోరుకుంటోంది లోకం. ఆమెను శాసించకుండా, హద్దులు నిర్దేశించకుండా వదలదు సమాజం.

ఇపుడు చలం ఎవరికి కావాలి.?  సాహిత్య పరంగా ఐతే … తుప్పు పట్టిన, మూస కథలను రాస్తున్న రచయితలందరికీ అవసరం అనిపిస్తుంది. ఇటీవల చలం రాసిన “సుందరం” కథ చదివాను. అమ్మాయికి జీవితాన్నిచ్చి, పెంచి పోషించి, ఉద్యోగాన్నిచ్చే క్రమంలో చిన్నాన్న కోరే ‘కోరిక’…గురించిన కథ.

ఇలాంటి సంచలనాత్మక కథలను మాత్రమే రాయమనో, ఇలాంటి విపరీతమైన అంశాలకు వాస్తవం అనే ముసుగు వేయమనో చెప్పడం లేదు. జీవితాన్ని జీవితం లానే ఆవిష్కరించవచ్చు కదా అనేది మా ఏడుపు.  జీవితంలో వీరికి నేటికీ మధ్య తరగతి కష్టాలు, కుటుంబీకుల మనస్పర్థలు, వృద్ధుల బాల్య విశేషాలు మాత్రమే….ఎలా కనపడుతున్నాయో ఆశ్చర్యం కలుగుతుంది. చలాన్ని చదివి నేర్చుకోవాల్సింది ఆయనంత నిర్భయంగా, అందరూ అనుకునే విచ్చలవిడి గా రాయడం కాదు. పరిస్థితుల్ని అవి ఎలా ఉన్నాయో-అలాగే చూడగలగడం, అలాగే పాఠకులకు అందించడం.

-మానస ఎండ్లూరి ( యువ కథా రచయిత్రి)

చందు తులసి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • నూట ఏభై ఏళ్ల నాటి మార్క్స్ , తొంబై ఏళ్ల నాటి చలం ఈ నాడు చాలా అవసర పడుతున్నారంటే సమాజం ఇంకా బాల్యం వీడలేదని గదా అర్ధం !

  • ఈ ప్రపంచం లో అత్యంత చవక సరుకు కార్ల్ మార్క్స్

 • శ్రీశ్రీ ని పరిచయం చెసుకుందామని వెళితే చలం పరిచయం అయ్యాడు. మహాప్రస్థానాన్ని చదవనీయకుండా రెండ్రోజులు ఆపాడు నన్ను.
  ‘ఇలా కూడా ఆలోచించవచ్చా’ అనుకునేలా చేసిన రచయిత చలం నాకు. ఒక closet నుంచి నన్ను బయటకు లాగిన వాడు. rational గా ఉండటం చలం వల్లే నేర్చుకున్నాను. లోపలి hypocrisy ని పదేపదే ప్రశ్నిచుకుంటుండడం చలం తెచ్చిన మార్పు. నిర్మించుకున్న కట్టుబాట్లతోటి నియమాలతోటి ప్రమాణాలతోటి మనిషి ఎల్లవేళలా సంతోషంగా ఉండడు అని ఎంతో convincing గా చెప్పాడు నాకు చలం. చలంలోని సున్నితత్వం నన్ను అమితంగా ఆకర్షించింది. అలాగే అతని ధృడత్వం కూడా.టెక్నికల్ గా ఆకట్టుకుంటూ భాషపరంగా ఆస్వాదించేలా ఉంటూ భావం పరంగా ఆలోచించేలా రచనలు చేయగలిగిన ఒకేఒక్కడు చలం.

 • మీ విశ్లషణ చాలాబావుంది , ఐతే చివరి రోజులో భక్తి భావం అతని అభిమానుల్ని నిరాశ పర్చింది

 • చలం. నాకు మహాప్రస్థానంలో యోగ్యతాపత్రం రాసి పరిచయం అయినవాడు. ఆ కవిత్వసంపుటిలోని కవితలను,శ్రీశ్రీని పక్కనపెట్టి చదివించుకున్నాడు. తర్వాత, మైదానంలో రాజేశ్వరితో స్నేహం చేయించి ఉక్కిరిబిక్కిరి చేయించాడు. పది పదిహేను రోజులపాటు రాజేశ్వరి నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడ్డాను( ఈ సంగతి నాకూ, చలానికి మాత్రమే తెలుసు).
  ఇక తర్వాతి గొడవ. స్త్రీ పుస్తకంతో. పరిమితులు, పరిధులు లేని జీవితం స్త్రీది అని ఇప్పటికీ మూర్ఖత్వంలో ఉన్న తరానికి, శతాబ్దం ముందే చెప్పిన అమాయకుడు చలం.

  అప్పటి కాలానికి చలం ఎందుకు ఉన్నాడో తెలీదు కానీ ఈ కాలానికి చలం అవసరం, అత్యవసరం ఉంది. మాట్లాడాల్సిన వాళ్ళు మౌనంగా, గొంతుకు మర్యాదను అడ్డుపెట్టుకుని మొఖాన్ని ప్రదర్శిస్తున్నారు. మాట్లాడలేని వాళ్ళు మొఖాన్ని దాచుకుని వెళ్లిపోతున్నారు.

  ఒక కల్పనాత్మక ఆశ. ఇపుడు గనక చలం ఉండుంటే నేనెన్ని గెంతులు వేయాల్సివచ్చేదో..ఈ పితృస్వామ్య జీవితం నడ్డిమీద తన్ని తరిమేవాడేమో. అలా తన్నేపుడు నాకెంత సంబరంగా ఉండేదో….!?

 • ఎడిటర్ గారికి
  ‘దురదృష్ట కర పరిణామం’ నా మాట కాదు. నేను ‘విషాదం’ అన్నాను.
  మార్చగలిగితే మార్చండి.

 • చలం ఒక ఫ్రాయిడియన్ శ్రీశ్రీ మార్క్సియన్ .. శ్రీశ్రీ కావాలనే చలం చేత ముందుమాట రాయించాడనుకోవచ్చు.
  ఫ్రాయిడ్ని మార్క్స్ నీ కలపాలనుకునే వాళ్ళకు తప్ప చలం లారెన్స్ ని మించకపోగా ప్రభావితుడైనాడు.
  చలం ఫ్రాయిడియన్ భావజాలం ఇప్పుడు పనిచేసే ప్రభావశాలితను కోల్పోయిందని గమనించవచ్చు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు