తమకు తాము మూల రచనలు చేసే సత్తా లేని వారు, లేదా సత్తా కోల్పోయిన వారు కావ్యాల్నీ, ఇతిహాసాల్ని, చరిత్రను చదివేసి తమ ఇప్పటి భావాలతో రంగరించి, వాటిలో విప్లవాత్మక భావాల్ని జోడించి, తమ సృజనాత్మకతను మేళవించి పేరును సంపాదించుకునేవారు అనేకమంది ఉంటారు. ఇది చరిత్రను, నాటి సాహిత్యాన్నీ వక్రీకరించడం మాత్రమే కాదు, అవమానించడం కూడా. అలాంటి వారు ఎస్. ఎల్. భైరప్ప ఏమన్నారో తెలుసుకోవాలి.
“ఒక చారిత్రక రచనకు పూనుకునేవారు ఎవరైనా చిన్న చిన్న వివరాలను సమర్థించడానికి నిర్దిష్ట పరిశోధన ను నిర్వహించాలి. రచయిత సత్యానికి అనుకూలంగా ఉన్నప్పుడే అతడి విశ్వసనీయత ఉంటుంది. సత్యాన్ని ఉల్లంఘించి తనను తాను సృజనాత్మక కళాకారుడని సమర్థించుకునే నైతిక హక్కు రచయితకు ఉండదు” అని భైరప్ప తన నవల ‘‘ఆవరణ’’కు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. తన నవలలోని చారిత్రక అంశం తనదేనని చెప్పుకునే అర్హత ఉండదని, అందులోని పాత్రలు, వాటి వ్యవహారశైలికి కూడా చారిత్రక ఆధారాలున్నాయని ఆయన చెప్పుకున్నారు. తాను కళాత్మక స్వేచ్చ సరిహద్దుల్ని ఏమాత్రం ఉల్లంఘించలేదని ఆయన అన్నారు. తనదీ అని చెప్పుకోగలిగినది తానిచ్చిన రూపం మాత్రమే అని, చారిత్రక వాస్తవం నేపథ్యంలో సాహితీ ప్రతిభ ప్రకాశిస్తే తన సాహిత్య రచన విజయవంతమైనదని భావిస్తానని ఆయన చెప్పుకున్నారు. ‘చరిత్ర రాసేటప్పుడు చరిత్రకారుడే సత్యప్రకటనకు అడ్డం వస్తే ఎలా?’ అని ఆయన ప్రశ్నించారు. చరిత్రకారుడు ఒక కథా రచయిత కుండే స్వేచ్ఛ తీసుకుంటే సత్యం పరిస్థితి ఏమిటి అని ఆయన మరో సందర్బంలో అడిగారు.
మహాభారతం ఆధారంగా ‘పర్వ’ అనే నవల రచించేందుకు ముందు ఆయన దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు పర్యటించారు. ఆయన హిమాలయ ‘పర్వ’తాల్లోని గహర్వాల్ ప్రాంతంలో ఒక తండాలోను, అనేక గ్రామీణ ప్రాంతాల్లోనూ బహు భర్తృత్వాన్ని గమనించారు. స్థానికులు ఈ ఆచారం ద్రౌపది కాలం నుంచి అమలులో ఉన్నదని చెప్పుకుంటారట. పండుకేశ్వర్, బద్రి, జోషీమఠ్ ప్రాంతంలో కూడా మహాభారతంలో ఉన్న కొన్ని పాత్రలను చూశారు. మహాభారత కావ్యంలో ప్రస్తావించిన ద్వారక, ఆరావళీ ‘పర్వ’త ప్రాంతాలు, విరాట్ నగర్, మథుర, ఢిల్లీ, కురుక్షేత్ర, హస్తినావటి, బర్నావా, చక్రనగర, రాజ్ గిరి ప్రాంతాలనూ ఆయన సందర్శించారు. హరప్పా, మొహంజోదారో త్రవ్వకాలనుంచి లభ్యమైన వివరాలను అధ్యయనం చేసి ద్వారక అనే నగరం ఉండడం అసంభవం కాదనే అభిప్రాయానికి వచ్చారు. అనేక మంది పురాతత్వ శాస్త్రవేత్తలతో చర్చించారు. వైదిక సంస్కృతి చివరి దశలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, మత జీవనాలకు సంబంధించి లోతైన పరిశోధన చేశారు. వందలాది పుస్తకాలను చదివాడు. భారత దేశంలోని అనేక ప్రాంతాల్లోని గ్రామాల్లో ఆయన విస్తృత పర్యటనలు చేశారు. ఆ తర్వాత ‘పర్వ’ అనే ఒక మహాద్భుతమైన చారిత్రక నవల ను ఆయన సృజించగలిగారు. మిగతా నవలలు కూడా అలాంటి అనుభవంతో రచించినవే. మూలాలు చదివేందుకు సంస్కృతం కూడా నేర్చుకున్నారాయన.
“కీచకుని చంపిన సంఘటన నిజం కాకపోవచ్చు. కాని ప్రజల మనసుల్లో అది రేకెత్తించే భావం నిజం అసత్యం కాదు. ఇక్కడకు రచ.తకు కావల్సిన సత్యం ఏది? భార్యను చెరచడానికి వచ్చన వాణ్ణి చంపి పారేయడమనే ప్రాథమిక ప్రవృత్తి మనందరికీ లేదా ? ఈ సార్వకాలికమైన, సార్వత్రికమైన పురుష భావం, లేదా పురుషాహంకారు, పురుష యాజమాన్యం సాహిత్యానికి చెందిన సత్య వస్తువు కాదా?” అని ప్రశ్నిస్తాడు భైరప్ప.
ఎంతమందికి రచయితలకు ఈ నిజాయితీ ఉంటుంది?ఒక రచయితకు చారిత్రక జ్ఞానం, సాహిత్యం, సౌందర్య శాస్త్రం, తత్వ శాస్త్రం, సంగీతం, ప్రజల జీవితం తెలిస్తే ఎలా ఉంటాడో ఆయనే భైరప్ప.
భైరప్ప ఎవరు? తెలుసుకోవాలంటే ఆయన ఆత్మకథ ‘భిత్తి’ ని చదవాలి. హసన్ జిల్లాలోని చిన్నరాయపట్నలో సంతెశివర అనే తండాలో జన్మించిన భైరప్ప జీవితం అత్యంత దయనీయంగా ఉంటుంది. తన సోదరుడి శవాన్ని భుజంపై మోసి ఎండుగట్టి, పొదలతో అంత్యక్రియలు చేసిన వాడు భైరప్ప.చిన్న పట్టణంలో ఒక చిన్న హోటల్ లో టేబుల్ తుడిచే సర్వర్ గా, అగర్ బత్తీలు అమ్మే సేల్స్ మన్ గా, సంతలో షర్బత్ అమ్మే వ్యక్తిగా, టెంట్ సినిమాలో టికెట్ కలెక్టర్ గా, గేట్ కీపర్ గా, బొంబాయి సెంట్రల్ రైల్వేలో పోర్టర్ గా పనిచేసిన జీవితం ఆయనది. 16 సంవత్సరాల వయసులో ఆయన జీవితమంతా కూడా ఎందరో అనుభవించలేని దుర్భర జీవితాన్ని అనుభవించాడు.
ఎనిమిది మంది పిల్లలు కన్న తల్లి, అతడి ముగ్గురు సోదరులు ప్రేగు వ్యాధికి గురై మరణిస్తారు. చిన్నప్పుడు తన తల్లి అనేక కూలి పనులు చేస్తూ కూడా వినిపించిన మహాభారతం ఆయన అంతరాంతరాలలో ప్రతిధ్వనించింది. అందుకే తన ‘పర్వ’ నవలను తన తల్లికి ఆయన అంకితం ఇచ్చారు.
2018లో కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్యోత్సవంలో ఇచ్చిన వార్షిక ప్రసంగంలో ఉపనిషత్తుల్ని, బుద్దిజాన్ని, భారతీయ, పాశ్చాత్య తత్వశాస్త్రాలను అలవోకగా ఉటంకిస్తూ మాట్లాడారు. ఒకే రోజు తన చెల్లెలు, తమ్ముడు ప్లేగుకు గురై మరణించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఆయన ఇంటర్మీడియట్ లో ఫిలాసఫీ ప్రొఫెసర్ కు చెప్పి ‘దేవుడు ఎందుకు ఇలా కన్నవారిని, తోడబుట్టిన వారిని వేరు చేస్తారు?’ అని అడిగాడు. ఆయన భైరప్పకు కఠోపనిషత్ ఇచ్చి చదవమన్నారట. వేదాంత, బుద్దిజం రెండూ మరణం గురించి మరణానంతర పరిస్థితి గురించి అన్వేషణతో ప్రారంభమవుతాయని భైరప్ప ఈ ప్రసంగంలో వివరించారు. నచికేతుడు, బుద్దుడు ఒకే రకమైన ప్రశ్నలు వేశాడని చెప్పారు. రసానుభూతికి, సమాధ్యవస్థకూ తేడాను కూడా ఈ ప్రసంగంలో వివరించి అనేకమందిని ఆశ్చర్యపరిచారు.
ఆయన ప్రతి నవలా ఎన్నో జీవితాలను చిత్రిస్తుంది. వ్యవస్థ విశ్వరూపాన్ని మన కళ్లముందుంచుతుంది. కాలేజీ రోజుల్లో ఒక మల్లయోధుడి జీవితంపై రచించిన ‘భీమకాయ’ నుంచి రామాయణం ఆధారంగా రాసిన ‘ఉత్తరాకాండ’ వరకు 26 నవలలు ఒక్కొక్కటీ ఈ దేశ జీవన దృశ్యాలని చెప్పక తప్పదు. మహాభారత కాలపు చరిత్రను ప్రతిఫలించిన ‘పర్వ’,ఎనిమిదవ శతాబ్దపు సంధి కాలాన్ని, మతాల మధ్య సంఘర్షణకు అద్దం పట్టిన ‘సార్థ’, హిందూ ముస్లిం సంబంధాల్ని చారిత్రక దృక్కోణంతో విశ్లేషించిన ‘ఆవరణ’, స్వీయ జీవితానుభవాల నేపథ్యంలో భారతీయ గ్రామీణ జీవితాన్ని చిత్రించిన ‘గృహభంగ’, తరాల అంతరాలను చిత్రించిన ‘వంశవృక్ష’, కుల సమస్యను చిత్రించిన ‘దాటు’, కర్ణాటక-ఢిల్లీ-బెనారస్ లతో పాటు వ్యవస్థలోని దుర్మార్గాలను, అవినీతి సమాజాన్ని, ఎమర్జెన్సీ దారుణాలను ను చిత్రించిన ‘తంతు’, మహారాష్ట్ర నుంచి మొత్తం ఉత్తరాదిని ఇముడ్చుకున్న ‘మంద్ర’, సైన్స్ ఫిక్షన్ ను, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తలపించే ‘యాన’, గ్లోబలైజేషన్ పై రచించిన ‘కవలు’, కుల రాజకీయాలపై రచించిన ‘మతదాన’ వరకు ఒక్కొక్కటీ ఒక మహాకావ్యంగా గౌరవం పొందాయి.
“సంగీతమే నన్ను నాలోకి ప్రయాణింపచేసి నన్ను ఆత్మపరిశీలనలోకి నెట్టేస్తుంది. సంగీతానికంటే మార్మికమైన, మాంత్రికమైన, ఆకర్షించే శక్తి ఏదీ లేదు. హిందూస్తానీ సంగీతానికీ, నా అంతశ్చేతనకూ,సృజనాత్మక శక్తికీ అంతస్సంబంధం ఉన్నద”ని ఆత్మకథలో చెప్పుకున్న భైరప్ప సంగీతాన్ని దాని ఆత్మతో సహా ఆస్వాదించే పిపాసి. ‘మంద్ర’ అనే నవలలో అనేక రాగాలను వివరంగా విశ్లేషించిన భైరప్ప రాగాలనే పాత్రలుగా మలిచాడా అనేలా రచించారు.
చిన్నప్పుడు ‘భారతి’లో భైరప్ప రాసిన ఒక కథను చదివాను. “నాన్న చనిపోలేదు, దేవుడి దగ్గరకు వెళ్లాడు” అని తల్లి ఈ కథలో చిన్న పిల్లాడికి చెబుతుంది. తండ్రికి ఉత్తరాలు రాయమని, డబ్బులు పంపమని అడగమని కొడుకు వేధిస్తాడు. ‘మీ నాన్న చనిపోయాడ”న్న మిత్రుడిని కొడతాడు. తండ్రి బతికి వస్తాడని మార్కండేయుడి లాగా శివలింగం వద్ద ధ్యానం చేస్తాడు. చివరకు తల్లి అతడికి తండ్రి చనిపోయాడని, తిరిగి రాడని చెప్పాల్సి వస్తుంది. “అలా అనకమ్మా. నాన్న చనిపోలేదమ్మా, దేవుడి దగ్గరకు వెళ్లాడమ్మా..” అని కొడుకే అంటాడు. “అవును బాబూ, నాన్నగారు చనిపోలేదు. బతికే ఉన్నాడు.” అని తల్లి కొడుకును కౌగలించుకోవడంతో కథ ముగుస్తుంది. తండ్రులను కోల్పోయిన ప్రతి కుమారుడికీ ఏడుపు తెప్పించే కథ ఇది.
భైరప్ప ‘పర్వ’లోని పాత్రలు ఎద్దు మాంసం ముక్కలు నములుతూ మాట్లాడుతుంటాయి. “భూమి, స్త్రీ.. ఒకసారి అనుభవంలోకి వస్తే ఎవరు వదిలిపెడతారు?” అని ఒక ముసలి రాజు ప్రశ్నిస్తాడు. “వంశం పెరగాలని జాతరలో పెయ్య దూడల్ని తెచ్చినట్లు కోడల్ని తెచ్చారు” అంటుంది కుంతి. “ఈ వంశానికి కోడలై వచ్చాక కోడలు కనిన బిడ్డలు వంశానికి కాక పుట్టించిన వారికి చెందుతారా?”అని ప్రశ్నిస్తుంది. “మహారాజా, మీ వంశపు యుద్దంలో మేమందరం హింసల పాలయి కడుపులు పొందాము. పుట్టే బిడ్డలకు తండ్రి అని ఎవరు పేరు చెప్పాలి? అని మహాభారత యుద్దం తర్వాత మిగిలిన వేనవేల స్త్రీలు ధర్మరాజును ప్రశ్నిస్తుంది. “ఎవరి పేరు, ఎవరి పేరు?” అని ప్రశ్నిస్తుంటే సభా భావనం మారు మ్రోగుతుంది. “భవనంలో నిండిపోయిన ఆడవాళ్లకు సమాధానం చెప్పలేక బయట కురుస్తున్న వానను చూస్తూ కూర్చుంటాడు”అన్న వాక్యంతో భైరప్ప ‘పర్వ’ ముగుస్తుంది. ‘పర్వ’ నవల చదువుతుంటే ఒక ప్రాచీన యుగంలోని మహాభారత పాత్రలు మన కళ్లముందు నడుస్తున్నట్లు అనిపిస్తుంది. మహాభారతాన్ని మానవ విజ్ఞాన శాస్త్ర దృక్పథంతో, సామాజిక, చారిత్రక అవగాహనతో పునర్లిఖించిన భైరప్ప దాన్ని ఒక కథగా కాక జాతుల పరిణామక్రమంలో భాగంగా రచించారనడంలో సందేహం లేదు. ఆర్యుల, రాక్షసుల విలువల వ్యవస్థల మధ్య ఘర్షణ కూడా ‘పర్వ’లో మనకు కనపడుతుంది.
“సత్యానికి మసిపుయ్యకుండా ముఖాముఖీ చర్చలూ, నిజాయితీ కావాలి. మీరెందుకు అవకాశం ఇవ్వడం లేదు? వెనకటి ముస్లిం దొరలు, ముస్లింలు చేసిన దానికి ఇప్పటి ముస్లింలు బాధ్యులు కారు నిజం.. అయినా వెనకటి వారు చేసిన తప్పులన్నింటినీ నిర్మలంగా అంగీకరించే బాధ్యత లేకపోయినట్లయితే, వాటిని సమర్ధిస్తున్నట్లేగా? ఈ మధ్య తమ పోయినతరంలోని వారు కొరియాలో చేసిన దౌర్జన్యానికి నేటి జపాను వారు బహిరంగంగా పశ్చాత్తాపపడడానికి కారణం ఏమిటి? నాజీలు మానవత్వానికి విరుద్ధంగా చేసిన హీనకృత్యాలకు జర్మనీ వారు పశ్చాత్తాపపడి, అలాంటి తప్పుముందెన్నడూ జరగదని శపథం చెయ్యలేదూ? మన వెనకటి తరాలవారి తప్పులకు మనం బాధ్యులం కాము. భారతీయ ముస్లింలకు మీరా అవకాశం ఇవ్వడం లేదు. మనువు చేసిన తప్పుని హిందూసమాజ నాయకత్వం నిర్మలంగా ఒప్పుకున్నట్లుగా, చరిత్రలోని నిజాన్ని నిర్మలంగా ఒప్పుకునే ప్రామాణికత వస్తే వాటిని మనం ఆపరాదు. చెయ్యకూడదన్న బాధ్యత తనంతట తానే వస్తుంది” అని ‘ఆవరణ’లో ఒక పాత్రతో అనిపిస్తారు భైరప్ప. భైరప్ప ఆలోచనా దృక్పథం ఎంత విశాలమైందో ఈ వాక్యాలతో మనకు తెలుస్తుంది.
‘చారిత్రక అబద్దాల మూలంగా జాతీయ వాదం ఎప్పడూ బలపడదు..’ అని 2006లో భైరప్ప రాసిన ఒక వ్యాసం సంచలనం సృష్టించింది. చాలా మంది ఆయన మతతత్వవాదిగా భావించారు కాని భైరప్ప అన్ని ఇజాలను అధ్యయనం చేసి భారతీయ నేలలోని సారాన్ని తనలో ఇముడ్చుకున్న రచయిత అని చెప్పాలి. మన నేలలో జన్మించిన మనుషులను, మానవ సంబంధాలను, సంస్కృతిని సాహిత్యంలో చిత్రించిన భైరప్ప ను అర్థం చేసుకోవాలంటే మన వ్రేళ్లు ఈ నేలలో పాతుకుని ఉండాలి.
94 సంవత్సరాల వయసులో మరణించిన భైరప్ప కన్నడ రచయిత మాత్రమే కాదు ఆయన మొత్తం భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే రచయిత. ప్రపంచంలో ఏ ఉత్తమ రచయితకూ ప్రమాణాల విషయంలో తీసిపోని రచయిత. జ్ఞానపీఠలు, సాహిత్య అకాడమీ అవార్డులు, సరస్వతీ సమ్మాన పురస్కారాలు ఆయన సాహిత్య ప్రమాణాలను నిర్ణయించేందుకు ఏ మాత్రం సరిపోవు.
*
“భైరప్ప కన్నడ రచయిత మాత్రమే కాదు ఆయన మొత్తం భారత దేశానికి ప్రాతినిధ్యం వహించే రచయిత.”
చాలా మంచి గా పరిచయం చేశారు.