చదువులోని సారం!

మనసు వేగంగా ప్రయాణిస్తుంది. కానీ తనతో దేన్నీ మోసుకువెళ్ళలేదు. కానీ గాలి అలా కాదు. అది వాహకము. పరిమళం దగ్గరనుంచి మరెన్నిటినో మోసుకెళ్ళగలదు. ఎంత భారమైనా ఎంత దూరమైనా తీసికెళ్ళగలదు.

కిందటి శేఫాలికలను మళ్ళీ  ఈనెలకి మాట్లాడుకోవలసిన విషయాల దగ్గర ఆపేను.

నన్నయ పదప్రయోగం ఎంతో సార్థకంగా అత్యంత అవసరంగా ఉంటుంది. ఎప్పుడు కథ గురించి చెప్పినా మనం మపాసా చెప్పిన తుపాకీ వర్ణన తాలూకు అవసరం గురించే మాట్లాడతాం. కానీ అంతకంటె పట్టుగా నన్నయ వర్ణనల అవసరం సూక్ష్మంగా పరిశీలిస్తే దొరుకుతుంది.

పాతాళం నుంచి ఉదంకుడు భూమిమీదున్న గురువుగారి ఆశ్రమానికి వెళ్ళడానికి సమయం చాలదనుకుంటే దివ్యపురుషుడు ఒక గుర్రాన్నిచ్చి దీనిమీద వెళ్ళు ‘ఇది మనసుకంటె గాడ్పు కంటె వడి కలదు’ అంటాడు.

అంటే మనసుకంటె గాలి వేగంగా వెడుతుందా? మామూలుగా లోకంలో మనం వాయువేగ మనోవేగాలంటాం కదా. మరి నన్నయ ఎందుకిలా మార్చాడు? దీనిమీద విశేషమైన పరిశోధన చేసిన శలాక రఘునాథశర్మ గారనే పండిత విమర్శకులు ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. మనకి మన రచయితల గురించి తెలుసేమోగానీ ప్రాచీన కవుల గురించి మాత్రం చాలా తక్కువ తెలుసు. చూడండి ఆయన చెప్పిన ఆశ్చర్యాలు.

మనసు వేగంగా ప్రయాణిస్తుంది. కానీ తనతో దేన్నీ మోసుకువెళ్ళలేదు. కానీ గాలి అలా కాదు. అది వాహకము. పరిమళం దగ్గరనుంచి మరెన్నిటినో మోసుకెళ్ళగలదు. ఎంత భారమైనా ఎంత దూరమైనా తీసికెళ్ళగలదు.

గమనశక్తీ వహనశక్తీ రెండూ వున్న వాయువునే ఇక్కడ ఎక్కువ చేసి చెప్పడంలో మరో రహస్యం ఉందట. దేనినయినా తీసుకుని వెళ్ళవలసి వచ్చినప్పుడు వాయువేగమని అంటే, గుర్రంమీద ఉదంకుడిని తీసుకువెళ్ళాలని కనుక వాయువేగాన్ని ఎక్కువ చేసి చెప్పారట. అలాకాక కేవలమూ వేగమే చెప్పాలంటే మనోవేగమని వాడిన సందర్భాలు ఉదాహరణలుగా చూపిస్తూ వచ్చారు శలాకవారు. అందుకే వారు పసిడి శలాకల పోగు. అదలా ఉంచుదాం.

అంతేకాక హనుమంతుడి స్తుతిలో కూడా మనోజవం, మారుత తుల్యవేగం అన్న ప్రయోగం ఇదే అంశాన్ని చెప్తుంది. మనోవేగ, వాయువేగాలు కలిగినవాడు అని ఇలా వాయువేగానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని వస్తుతత్వజ్ఞులు చెప్పారని శలాక వారు తేల్చారు. అంటే నన్నయకి ఎంత ఫిజిక్స్ తెలుసు!! దాన్ని ఎంత శ్రద్ధగా సూక్ష్మంగా కావ్యవాక్కులో ప్రయోగించాడూ!!

ఇక సశేషాన్ని పూరించడం అయింది.

ఉదంకుడి కథలో నన్నయ తపోశక్తిని ఎందుకు తక్కువ చేసాడూ అంటే దేనితో పోల్చి తక్కువ చేసాడో మరో కథ చెప్తుంది.

అది అరణ్యపర్వంలోని యవక్రీతుడి కథ. నన్నయగారి భాగంలోదే. తపస్సు గొప్పదే. ఏ పనయినా శ్రద్ధగా చేస్తే తపోనిష్టతో చేసేడంటాం. కానీ తపస్సు ఒకటే చాలదంటాడు నన్నయ వేదవ్యాసుడి ఆత్మలోంచి. దానితోపాటు ఉండవలసిన సౌశీల్యం గురించి మరీ మరీ నొక్కి చెపుతారు. కేవలం తపస్సు వల్ల సౌశీల్యం రాదా? ఈ ప్రశ్నకు జవాబే యవక్రీతుడి కథ.

యవక్రీతుడు భరద్వాజుడి కొడుకు. భరద్వాజుడు, రైభ్యుడు అన్నదమ్ములు. పక్కపక్క ఆశ్రమాలు నిర్మించుకుని ఉంటారు. భరద్వాజుడు తపశ్శీలి. నిత్యమూ తపస్సులో ఉంటాడు. రైభ్యుడు తపస్సుతోపాటు శిష్యులకు విద్యాబోధ చేస్తూ ఉంటాడు. ప్రజలు, శిష్యులు భరద్వాజునికంటే రైభ్యుడిని ఎక్కువ గౌరవించడమే కాకుండా భరద్వాజుడిని ఉపేక్షిస్తూ ఉంటారు.

ఇది భరద్వాజ కుమారుడైన యవక్రీతుడిలో దుఃఖాన్ని దానిద్వారా క్రోధాన్నీ కలిగించింది. గురువు అవసరం లేకుండా విద్య పొందే మార్గం కోసం ఇంద్రుడిని ఉద్దేశించి ఘోర తపస్సు చేశాడు. ఘోర అంటే అగ్నిలో శరీరం దగ్ధమయ్యేటంతగా. ఇంద్రుడు ప్రసన్నుడయ్యేడుగానీ అతని కోరిక ఉచితం కాదని తిరస్కరించాడు.

యవక్రీతుడు ఆగలేదు. మరింత తీవ్రంగా తపస్సు చేశాడు. రెండోసారి కూడా ఇంద్రుడు కూడదని, గురువు ద్వారా పొందిన విద్య వల్లనే శ్రేయస్సు కలుగుతుందని చెప్పాడు. యవక్రీతుడు తన కోసమే తపస్సు చెయ్యలేదు. విద్యార్థులందరి కోసమూ చేశాడు. ఏ విద్యార్థికయినాసరే తపస్సు వల్లనే సర్వవిద్యలూ రావాలని తపస్సు చేస్తూనే ఉన్నాడు.

ఇంద్రుడు మారువేషంతో అతను తపోనిష్టలో ఉన్న గంగానది ఒడ్డుకు వచ్చి ఇసుకను పిడికిళ్ళతో ప్రవాహంలో పోయడం మొదలుపెట్టాడు. యవక్రీతుడికి అది వింతగా అనిపించి ప్రశ్నించాడు. దానికి ఇంద్రుడు ఈ నదికి ఇసుక వంతెన కడుతున్నానని, అది పాదచారులకు గంగానదిని సులువుగా దాటే వీలు కలిగిస్తుందని అన్నాడు.

యవక్రీతుడు నవ్వాడు. అప్పుడు ఇంద్రుడు నిజరూపంతో కనిపించి నువు చేస్తున్న పనీ ఇదే సుమా అని నిరూపించాడు.

అయినా యవక్రీతుడు వినలేదు. అతని తీవ్ర తపస్సు వల్ల ఇంద్రుడు అతనికి మాత్రమే ఆ వరం ఇవ్వక తప్పలేదు.

అలా వరాన్ని పొంది ఆశ్రమానికి వచ్చిన యవక్రీతుడికి తండ్రి చెప్పిన మాటలు ఈ కథకి మూలం. అందుకే ఈ కథ గురించి మాట్లాడుకోవాలి. ”ఈవిధంగా కోరికలు కోరి వరాలు పొందిన మానవుడు అహంకారిగా, దీనుడిగా మారి చివరకు నశిస్తాడు” అని భరద్వాజుడు అన్నాడు. అంతేకాక నువ్వు ఈ వరగర్వంతో నీ పినతండ్రి ఆశ్రమానికి వెళ్ళి అనుచితమైన పనులు చెయ్యవద్దు అనీ హెచ్చరించాడు.

కానీ యవక్రీతుడు వినలేదు సరికదా అదే చేశాడు. రైభ్యుడు లేకుండా చూసి అతని ఆశ్రమానికి వెళ్ళి అతని కోడలిని అంటే తన మరదలిని చూసి మోహించాడు. ఆమె అంగీకరించకపోతే భయపెట్టి బలాత్కరించాడు. తిరిగి తన ఆశ్రమానికి వచ్చేశాడు. కొంతసేపటికి ఆశ్రమానికి తిరిగివచ్చిన రైభ్యుడు జరిగినదంతా గ్రహించి తన శక్తులను భరద్వాజ ఆశ్రమానికి పంపి యవక్రీతుడిని భస్మం చేశాడు. తనను ఆ శక్తుల నుంచి రక్షించుకోగల శక్తి యవక్రీతుడికి లేకపోయింది. తపస్సు ద్వారా తాను సంపాదించుకున్న విద్యలు కలిసిరాలేదు. బూడిద కుప్పగా మిగిలిపోయాడు.

పుత్ర మరణం వల్ల కలిగిన దుఃఖంతో భరద్వాజుడు కూడా అగ్నిహోత్రుడితో కలిసిపోయాడు.

తర్వాత చాలా కథ జరిగింది. ఆ కథ ద్వాపర యుగానికి పూర్వపు కథ కాబట్టి కథను యధాతధంగా ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు. పైగా పురాణ కథలను ప్రతీకాత్మకంగా చూడాలి తప్ప కేవల కథలుగా ఇప్పటి కాలానికి అన్వయించుకోవడం కుదరదు.

అలా అన్వయించే వ్యర్థ ప్రయత్నం వల్ల ఆ కథలకు చెడ్డ వ్యాఖ్యలు కూడా పుట్టుకురావడం జరుగుతోంది. ఒక పద్యాన్ని అన్వయక్రమంలో చదివి అర్థం చేసుకోవడం రానివారు కూడా పురాణ కథలను చీల్చిచెండాడాలనే ఉత్సాహంతో నడుం బిగిస్తున్నారు.

సరే శాపాలూ, యాగాలూ జరిగాక యవక్రీత, భరద్వాజులు ఇద్దరూ బతికారు.

అప్పుడు యవక్రీతుడు అగ్నిదేవతను (అగ్నిని దేవత అంటే కొందరు ఒప్పుకోరేమో) ఇలా అడిగేడు, ”నేను తపశ్శాలిని. వేదమంతా చదివాను. వేదవేత్తను. అయినా రైభ్యుడు నన్ను ఎలా చంపగలిగాడు” అని. ఇది ఎంత అనుచితమైన ప్రశ్నో.

అతను వేదవేత్త అయినా స్వస్వరూప జ్ఞానం అంటే తన లోపాలు ఎంతగా తాను తెలుసుకోలేకుండా ఉన్నాడో అర్థమవుతోంది. దానికి అగ్ని చెప్పిన సమాధానాన్ని అందరి ముందుకూ తేవడం కోసమే నేను ఈ కథ ఎత్తుకున్నాను.

”యవక్రీతా. నువు ఏమంటున్నావో అదే నిజమని అనుకోకు. గురువు లేకపోయినా నువు సమస్త విద్యలూ సుఖంగా సంపాదించేవు. కానీ ఈ రైభ్యుడు చాలా కష్టాలు పడి, మంచి పనులతో గురువును సంతోషపెట్టి విద్యలు పొందాడు”. ఇంతే అన్నాడు. కానీ ఇందులో ఇప్పటికే కాదు ఎప్పటికీ అవసరమయ్యేది ఎంతో దాచిపెట్టి ఉంది.

పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం చదువుతోపాటు ఎన్నో నేర్పేవి పూర్వం. ఇప్పటికీ అలా నేర్పేవి కొన్ని ఉన్నాయేమో! మంచి వ్యక్తిత్వం కలిగిన గురువు తన బోధలకంటే ఆచరణ ద్వారా విద్యార్థికి నేర్పేది – అలానే తప్ప మరోలా రాదు.

శుశ్రూష అంటే వినాలనే కుతూహలం. శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష అని వ్యుత్పత్తి .

ఆ కుతూహలంతో గురువు వెంట అహర్నిశలూ తిరుగుతూ నేర్చుకున్న చదువులో వినయమూ, దానివెంట ధార్మికత ప్రధానంగా అలవడవలసిన గుణాలని యవక్రీతుడికి అగ్ని చెప్పకనే చెప్పేడు.

చదువులూ, నైపుణ్యాలూ ఎంత ఎక్కువగా ఉంటే వాటివల్ల అంతగా ధనసంపాదనలు పెరుగుతున్న నేటి యువతకుగానీ, యువచైతన్యానికి గానీ నేర్పవలసినది ఈ భారత కథలో ఎంత ఉందో!

పెద్దలను గౌరవించడమూ, పాదాభివందనమూ అన్నవి పరిహాస విషయాలుగానూ, అపహాస మూర్ఖ పద్ధతులుగానూ భావించే సమాజానికీ, దీన్ని సమర్థించే పెద్దలకూ ఈ కథ ఏమయినా చెప్పగలదా?

అసలు విద్యార్థికి శీలసహితమయిన వ్యక్తిత్వాన్ని ఇవ్వగల గురువులు ఎంతమంది ఉన్నారు ఇవాళ. తలిదండ్రులు కూడా వ్యక్తిత్వ వికాసమార్గంలో పిల్లలకి గురువులే. కానీ ఆ గురుస్థానానికి ఎందరు అర్హులుగా ఉన్నారు?

కేవల తపస్సు వల్లనే ఇలాంటి హాని జరుగుతున్నప్పుడు అంతకంటె ఎంతోకింది స్థానంలో ఉన్న కేవల ధన సంపాదనే లక్ష్యం కావడం వల్ల ఇంకెంతటి ప్రమాదం పొంచివుంది!!

ఈ కథలో విద్య అంటే వేదవిద్య అంటాడు. అది ఆ కాలానుగుణమైన విద్య. ఇప్పుడు మనం దాన్ని యదాతథంగా తీసుకోవడం తెలివయిన పని కాదు. ఇప్పటి కాలంలో ఏ విద్య వినయాన్ని ఇవ్వకుండా కేవల ధనాన్నే అయిదారు అంకెలుగా కురిపిస్తోందో దానికి అన్వయించుకోగలిగితే కథాప్రయోజనం నెరవేరుతుంది.

పచ్చి కూరలు తిని, వ్యాయామాలు చేసి శరీరం గట్టిగా చేసుకున్నాక, వారికి వారి కర్తవ్యాలను బోధించేవారు మనకి లేరు. ఈ పనులు చేసితీరండి అని నసపెట్టేవారే గాని.

ఆరోగ్యం దానికదే మహాభాగ్యం కావచ్చు గానీ అది సమాజ ఆరోగ్యానికి కూడా కారణం కావాలి. అదే నిజమైన ఆరోగ్యం నిజమైన తపస్సు.

డబ్బూ ఆరోగ్యం సంపాదించాక what next – తతః కిం? – అన్నది ఇలాంటి కథలు చెప్తాయి. మనం తెలుసుకోవాలేగాని.

*

 

 

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అమ్మా చాలా చక్కని విషయాలు తెలియచేశారు.గురువు ఎందుకు అన్నీ నెట్ లో వస్తుంటే అంటూ ఉంటారు.కానీ తల్లి బిడ్డ తాగుతున్న నీటి పరిమాణాన్ని బట్టి తన అరచేయి పెదాలకి తాకించి త్రాగించినట్లు,గురువు శిష్యుని అవగాహన మేరకు జ్ఞానం అందిస్తూ ఉంటారు,అదే సమయం లో వినయము, సంస్కారం కూడా పక్కనే వస్తూ ఉంటాయి.సంస్కారం లేని చదువు ఎవ్వరికీ ప్రయోజనం కాదు👌👌👌

  • థాంక్యూ వెరీమచ్ శశికళ గారూ

 • గురువులేని విద్య గుడ్డి విద్య అని సామెత ఇలాంటి కథల వల్లే వచ్చి ఉండవచ్చు… చక్కటి విషయాలను కథాoశాలుగా తీసుకుని విసదీకరిస్తున్నందుకు ధన్యవాదాలు!!💐💐💐

  • థాంక్యూవెరీమచ్ పద్మజ గారూ

 • అద్భుతం… ‘లోనారసి ‘ చదవడం గురువు బోధన వల్లనే తెలుస్తుందని చక్కగా చెప్పారండి . వ్యాసం లా లేదు… మీరే పక్కనుండి చెప్పుతున్నట్టు ఉందండీ… కృతజ్ఞతలు.

  • గురువు బోధ కంటే సామీప్యం సంస్కారాన్ని ఇస్తుందని కూడా.
   థాంక్యూవెరీమచ్ శైలజ గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు