చచ్చిపోయిన ఇష్టాలు

“నీకేరంగంటే ఇష్టం?”

“నీలం రంగు”

మొదటి రాత్రి భార్యాభర్తలు ఇలా ఇష్టాయిష్టాలు తెలుసుకుంటే జీవితాంతం హాయిగా చిలకా గోరింకల్లా ఉంటారట. అందుకే నా ఇష్టాలు అడగ్గానే సంబరంగా చెప్పేశాను‌. ఆయన నన్ను రాణిలా చూసుకున్నట్టు, అందరూ మా గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్టు, ఆనందంగా ఎక్కడెక్కడో షికార్లు చేసినట్టు ఆ రాత్రి ఏవేవో కలలు.

విచిత్రం.. ఆ తర్వాత అవన్నీ కలల్లాగే మిగిలిపోయాయి. కొట్టడు, తిట్టడు. గట్టిగా ఓ మాట అనడు. కానీ అన్నీ నా ఇష్టాలకు విరుద్ధంగానే చేస్తాడు. నీలంరంగు చీర తప్ప అన్నీ కొనిపెట్టాడు. నాకు తీపి ఇష్టమంటే రోజూ కారం కారంగా వండమంటాడు. ఫలానా హీరో సినిమాలు నచ్చుతాయంటే.. అవి తప్ప అన్ని సినిమాలకూ తీసుకెళ్తాడు. వెంకటేశ్వరస్వామంటే భక్తి అని తెలిసి ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్లమని పురమాయిస్తాడు. ఏంటీ మనిషి? ఎందుకిలా?

ఆరు నెలల తర్వాత సాయంత్రం పూట కాఫీ చేతికిచ్చి సంతోషంగా ఓ తీపి కబురు చెప్పాను. ఆకాశం చేతికందినట్టు సంబరపడ్డాడు. ఏ లోకాన ఉన్నాడో గానీ, నాకు నచ్చిన స్వీట్ చేస్తే బాగుందంటూ తిన్నాడు.

“నీకు అమ్మాయి ఇష్టమా? అబ్బాయి ఇష్టమా?”

ఆడపిల్లలంటేనే! కాళ్లకి చిరు గజ్జెలు కట్టుకుని చిన్ని చిన్ని అడుగులేస్తూ తిరిగే ఆడపిల్లలుంటే ఎంత కళ! మహాలక్ష్మి నట్టింట్లో ఉన్నట్లుంటుంది. నోటి చివరి దాకా వచ్చిన సమాధానం బయటికి రాగానే మారిపోయింది.

“అబ్బాయంటే ఇష్టం” అనేశాను‌ కొంచెం నీరసంగా.

ఎవరైతేం ఏం? మన చేతుల్లో ఉందా!

“నాకూ అబ్బాయంటేనే ఇష్టం” అన్నాడు.

ఏమనాలో తెలీక ఊ కొట్టాను‌.

“ఒకవేళ అమ్మాయి పుడితే..!” అన్నాడు.

ఝల్లుమన్న గుండె మీద చేయి వేసుకుని ఆయన వంక చూశాను. చిన్నగా నవ్వాడు.

ఆ నవ్వుకు అర్థం నెల తర్వాత అర్థమైంది.

చిక్కటి రక్తం పారుతున్న ఆ దృశ్యం గుర్తు​కొస్తే నొప్పి కన్నా భయం ఎక్కువ వేస్తుంది నాకు. ఏడుపు.‌. పసిపాప గొంతు నొక్కితే వినిపించే ఏడుపు. రాత్రి పూట నిద్ర పట్టనివ్వని శబ్దాలు.

ఆ తర్వాత మరో ఆరు నెలలకి.. ఆపైన ఇంకో సంవత్సరానికి.. అదే భయం. అవే శబ్దాలు. పసిపాపల ఏడుపులు!

“నీకేమంటే ఇష్టం?”

అడగొద్దు. నాకిప్పుడు ఇష్టాలు లేవు. చచ్చిపోయాయి. కాదు.. చంపేశాడు.

*

విశీ

విశీ

తెలుగు కథాలోగిట్లో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న పసిపిల్లాడి ఛాయ నాది. కథలు చదవడం, చదివించడం ఇష్టమైన పనులు. మంచి కథ గురించి నావైన నాలుగు మాటలు చెప్పడం బాధ్యతలా భావిస్తాను. మన చుట్టూ ఉన్న భిన్న అంశాలను నాదైన కోణంలో చూపించేవే ఈ మైక్రో కథలు.

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు