గోపి భాగ్యలక్ష్మి ‘జంగుబాయి’ కథ

ఆదిలాబాద్ జిల్లాలోని  ఓ మారుమూల గిరిజన ప్రాంతం కేంద్రంగా జరిగే ఈ కథ  గిరిజన జీవితాలపై వచ్చిన ఒక లైవ్ డాక్యుమెంటరీ.

రాసిన కొన్ని కథలతోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన కథా రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి. వీరి ప్రఖ్యాత కథ ‘జంగుబాయి’తో పాటు ఇప్పటి దాకా నాగమణి, గంగపొంగు, బాల్యాన్ని రక్షించు, బతుకు పయనం, దేవేంద్ర, భగీరథి మొదలైన ఏడు కథల్ని రాశారు. వీరి కథల నిండా గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, మైదాన ప్రాంత యువతుల్లాగే గిరిజన ప్రాంతాల యువతులు కూడా ఎదగాలనే ఆకాంక్షతో పాటు నోస్టాల్జియ కూడా అక్కడక్కడ తొంగి చూస్తుంది. ఈమె రాసిన తొలి కథ ‘జంగు బాయి కథ 1993లో ‘శ్వేతరాత్రులు’ కథా సంకలనంలో ప్రచురింపబడింది. ఆదిలాబాద్ జిల్లాలోని  ఓ మారుమూల గిరిజన ప్రాంతం కేంద్రంగా జరిగే ఈ కథ  గిరిజన జీవితాలపై వచ్చిన ఒక లైవ్ డాక్యుమెంటరీ. వస్తువు, శిల్పం, శైలీ, భాష అన్నీ సమపాళ్లలో కుదిర్చి ఒక గొప్ప కథను ఆవిష్కరించారు రచయిత్రి.

రచయిత్రి (లక్ష్మి) భర్త ఒక మారు మూల గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తుంటాడు. అక్కడికి భర్తతో పాటు రచయిత్రి కూడా వెళ్తుంది. ఈ సన్నివేశంతోనే కథ ప్రారంభమౌతుంది. బండి మీద ఊర్లోకి చేరగానే అక్కడి గోండు స్త్రీలంతా ఈమె వేషధారణను చూసి గుసగుసలాడుకుంటారు. పర్ణశాల లాంటి ఇంట్లో సామానంతా దించుకుని కొద్ది సేపు రెస్ట్ తీసుకొని నిద్ర లేచే సరికి కడుపులో ఆకలి నకనకలాడుతుంది. తాగడానికి నీళ్ళు కూడా లేవు. మంచి నీళ్ళ బావి ఎక్కడుందని అడుగుతుంది. ఇక్కడ బావులుండవు అన్నింటికీ పారే వాగు నీళ్లే అని సమాధానమిస్తాడు రచయిత్రి భర్త. “ఈ పూటకి నేను తెస్తాలే” అంటాడు రచయిత్రికి తోడుగా వచ్చిన తమ్ముడు రాజు. “నేను కూడా చూడాలి కదా” అని బిందె తీసుకొని ఇద్దరూ బయలుదేరుతారు. ఇంతలో చేతిలో బిందెతో ఒక విరగకాసిన అల్లనేరేడు పండులాంటి  అమ్మాయి వీళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమే జంగుబాయి. వయసు 16 కన్నా ఎక్కువ వుండదు. పోతుంటే జంగుబాయి అడవి పక్షి లాగా అడగనివి, అడిగినవి అన్నీ చెప్పుతూనే ఉంద…”

బంగాళాఖాతంలో వాయు గుండం లేచి ముసురు పట్టుకుంది. భర్త స్కూల్ కి వెళ్ళిపోతాడు. రచయిత్రి ఒంటరిగా, ఏదో తెలియని గుబులుతో ఇంటి చూరు నుండి కారుతున్న వర్షపు నీటిని చూస్తూ కూర్చుంది. ఎదురింటి ముందు జంగుబాయి వాన నీటిలో తడుస్తూ, గజగజ వణుకుతూ కనపడింది. ఎందుకు తడుస్తావు ఇలారా అంటే రానని తల అడ్డంగా ఊపింది. ఇంట్లో ఆ పని ఈ పని చూసికొని మళ్ళీ వచ్చి చూసే సరికి జంగుబాయి ఇంకా అక్కడే తడుస్తూ ఉంది. కాస్త దగ్గరగా వెళ్ళి విషయం అడిగింది. “బయటున్నాను ఇంట్లకు పోవద్దు” అని లోగొంతుతో చెప్పింది జంగుబాయి. జంగుబాయి తల్లి బయటకు వచ్చి రచయిత్రిని తడుస్తారు ఇంట్లోకి రమ్మని పిల్సింది. జంగుబాయి కూడా తడుస్తుంది కదా అంటే “అది అయిదు దినాల దాకా ఇంట్లకు రావద్దు” కాయిదా (ఆచారం) అంది. పోనీ మా ఇంట్లోకి తీసుకుపోతాను అంటే ఎవల ఇల్లైనా ఒకటే కదా అంటుంది. ఇంట్లోకి రాదు కానీ వసారాలో ఉంటుందిలే అని చెప్పి జంగుబాయిని తన ఇంట్లోకి తీసుకొచ్చి పాత చీర ఇచ్చి తుడుచుకొమ్మంటుంది.

“ఎప్పుడు ఇంతేనా?” అంటుంది. రచయిత్రి

“ఈ గూడాల్లో గిట్లనే నడుస్తుంది” అంటుంది జంగుబాయి. పెద్దలు పెట్టిన కట్టడి అని ఇంకా ఏదేదో చెప్తుంటుంది. రచయిత్రి మాట్లాడుకుంటూనే నిద్రపోతుంది.

నిద్ర లేచే సరికి బయట గోలగోలగా ఉంది. ఏంటని విచారిస్తే రాత్రి ఊళ్ళోకి చిరుత పులి వచ్చి మేకను చంపిందని తెలుస్తుంది. పులి ఊళ్ళోకి రావడానికి కారణం జంగుబాయి కాయిదా తప్పడమేనని గోండు స్త్రీలంతా జంగుబాయి తల్లిని నానా మాటలు అంటున్నారు. రాత్రి మేక పోయిందని బాధ పడుతున్నారు కానీ పులి జంగుబాయిని ఎత్తుకుపోతే ఎట్లా అని ఎందుకు ఆలోచించడం లేదో రచయిత్రికి ఎంతకూ అర్థం కాదు.

ఓ రోజు జంగుబాయి తన దోస్తు కమలను తీసుకొచ్చి పరిచయం చేసింది. “నీ రవికపై అద్దాలు బావున్నాయి” అంది రచయిత్రి కమలతో.

“నీది ఒక ఎర్ర రవికె ఉంటే ఇయ్యండమ్మా మంచిగా కుట్టిస్తా” అంటుంది. జంగుబాయి కూడా ఒక పచ్చీసు కుట్టిస్తానంటుంది. వాళ్ళు చాలా సేపు మాట్లాడి వెళ్తారు. వాళ్ళకు తన నుండి ఏదో కావాలి కానీ అదేమిటో ఎంత ఆలోచించినా రచయిత్రికి అర్థం కాదు.

ఒకనాడు జంగుబాయి ముఖం మబ్బులు పట్టిన ఆకాశంలా ఉండటం చూసి కారణం అడుగుతుంది. తనను తన అత్తగారు తీసుకుపోతానని కబురు పంపిందని చెప్తుంది. కానీ తనకు ఆ పెళ్లి ఇష్టం  లేదని చెపుతుంది. ఓ రోజు అన్నంత పని జరిగింది. జంగుబాయి గూడెంలోనే తనకు నచ్చిన అబ్బాయి ఇంట్లో సొచ్చి మారు మనువు చేసుకుంటుంది. జంగుబాయి తల్లిదండ్రులు దుఃఖంలో మునిగిపోతారు.

కొన్ని రోజులకు కమల అద్దాలు కుట్టిన రవిక తెచ్చి ఇచ్చింది రచయిత్రికి. ఆ పూట కమలకు తన ఇంట్లోనే భోజనం పెట్టి ఆ మాట ఈ మాట మాట్లాడి మెల్లగా పెళ్లి విషయం ప్రస్తావిస్తుంది రచయిత్రి. తను ఊరూరికి  తిరిగి బట్టలు అమ్మే ఒక యువకుడిని ప్రేమిస్తున్నట్టు చెప్తుంది కమల. ఎందుకో ఆ యువకుడు మంచి వాడు కాదేమోననిపిస్తుంది రచయిత్రికి.

వేసవి సెలవులు వచ్చాయి. రచయిత్రి, ఆమె భర్త వాళ్ళ ఊరికి బయలుదేరుతారు. ఇంటి యజమానే బండి కడతాడు. ఇంటామెతో పాటు చుట్టుపక్కల ఆడవాళ్ళంతా నీళ్ళు నిండిన కళ్ళతో సాగనంపుతారు. బండి ఊరు దాటిన తరువాత జంగుబాయి, ఆమె భర్త పరుగెత్తుకుంటూ వచ్చి రచయిత్రి అంతకు ముందు అడిగిన సారపప్పును ఆమె చేతిలో పెడుతారు. రచయిత్రి ఆత్మీయంగా చూస్తుంది. డబ్బులు ఇస్తామన్నా తీసుకోరు. బండి చాలా దూరం వచ్చింది. అయినా వాళ్ళిద్దరూ ఇంకా బండి వెనకే వస్తున్నారు. ఎంత వారించినా వెనక్కి వెళ్ళడం లేదు. వీల్లేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని రచయిత్రి భర్తకు అర్థమై “లక్ష్మి నువ్వు దిగి వాళ్ళతో మాట్లాడి రా” అని అంటాడు.

రచయిత్రి దిగి జంగుబాయి దగ్గరకు రాగానే “అమ్మ కమలకు నెల తప్పింది. వాడు పెండ్లి చేసుకుంటనని మోసం చేసిండు. రాత్రి ఉరిబోసుక సచ్చిపోయింది” అని చెప్పే సరికి రచయిత్రి షాక్ కు గురవుతుంది. రచయిత్రి ఆ రోజు వేసుకున్న జాకెట్ కమల కుట్టిందే. బండి బయలుదేరుతుంది.

బండి ప్రయాణంతో మొదలై బండి ప్రయాణంతోనే ముగిసే ఈ కథ ఎన్నో ప్రశ్నల్ని మన ముందుంచుతుంది. గిరిజనుల అమాయకత్వం, వాళ్ల దురాచారాలు, బూటకపు మంత్ర విద్యలు, మైదానప్రాంతం వాళ్ళు చేసే దోపిడి, ఎండ, వాన, చలి కాలాల్లో వాళ్ళు పడే బాధలు అన్నీ పాఠకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని సార్లు రచయిత్రితో పాటు మనం కూడా అదే అడవిలో తండాలో జీవిస్తూ అక్కడి పరిస్థితులకు చలించి పోతాం.

కాంతాబాయిలాంటి గణాచారులు ప్రజల మానసిక బలహీనతలను ఆసరాగా చేసుకొని మంత్రాలు తంత్రాలు అని బతికేస్తుంటారు. పిల్ల పెండ్లికి ఏ సావుకారు దగ్గరో ఆరేడు వందలు అప్పు చేసి ఊహించని వడ్డీతో తిరిగి అప్పు తీర్చలేక చివరికి పంట పండే చేనును అప్పు కింద కోల్పోతారు. బిడ్డ పుట్టిన మూడో రోజే తల వెంట్రుకలు తీయాలనే దుర్మార్గపు కాయిదాతో పసిగుడ్డును చేజేతులా చంపుకుంటారు. మాల మాదిగల పక్కన కూర్చుండి చదువుకుంటే తమ పిల్లలు మైల పడుతారని భావించే పటేండ్లు సార్లను హెచ్చరిస్తుంటారు. కథంతా స్త్రీ కోణంలో నడవడం వల్ల మైదాన ప్రాంతపు స్త్రీల కన్నా గిరిజన స్త్రీలు ఎంతటి హింసను భరిస్తున్నారో, తండాల్లో తేనెపట్టులతో పాటు విషముష్టికాయలు, కుట్రలు, కుతంత్రాలు కూడా  ఎలా జీవితాల్ని శాసిస్తాయో అవగతమై ఒక భయపూరిత షాక్ దేహమంతా పాకుతుంది. ఇంత వెలుతురులో ఉన్న మనమే అప్పుడప్పుడు అసహనానికి గురవుతుంటాం. అలాంటిది మనతో పాటే ఒక ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలు జీవితాంతం ఇంత చీకటిలో జీవిస్తుంటే దాని మూలాలు ఎక్కడున్నాయో అన్వేషిస్తాం. కథలోని ఉపాధ్యాయుడు కూడా ఆ పని చేస్తుంటాడు కానీ ఎక్కువ కాలం అనవసరపు పనులతోనే కాలం గడిచి పోతుంటుంది. ఇక రచయిత్రి లాంటి కౌటుంబిక స్త్రీలు కలిగించే చైతన్యం ఏపాటిది? చైతన్య పరుస్తామన్నా గిరిజనులు వాళ్ళ కాయిదాలను దాటి వస్తారా? అనేది కోటి రూకల ప్రశ్న. ఇక కథలోని పాత్రల చిత్రణను, శిల్పాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాత్రలు కేవలం పాత్రలుగా కాదు అడవిలో పూసే సహజమైన పూలలా కనిపిస్తారు. జంగుబాయి, కమల, లక్ష్మి (రచయిత్రి), లచ్చుంబాయి (జంగుబాయి తల్లి), కాంతాబాయి, గోండుస్త్రీలు అందరి జీవితాలు భయానకమే. జంగుబాయి వేసిన అడుగు విప్లవాత్మకమైతే, కమల వేసిన అడుగు శాపగ్రస్తమైంది. గిరిజన జీవితాల్ని ఇప్పటికే చాలా మంది కథీకరించినా ఈ కథ గిరిజనులు మెడలో వేసుకునే పులిగోరులాంటి కథ. సాదా సీదా వాగులా పయనిస్తూనే మనల్ని ఉప్పెనకు గురిచేస్తుంది.

         *

జంగు బాయి కథ ఇక్కడ:

జంగు బాయి కథ

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది సార్ కథా విశ్లేషణ. మాకు ఆ గూడెం లో విహరించాలనిపిస్తుంది.

  • గతంలో చదివిందే అయినా మరోసారి కథ చదివాను. ఎంత బాగుందో. మంచి కథకు గొప్ప పరిచయం . రచయిత్రిలో భావుకత తో పాటు బలంగా కథను చెప్పాలనె తపన సైతం కనిపించింది .

  • గొరుసన్నా! ‘జంగుబాయి’ కథ ను పరిచయం చేసిన డా. శ్రీధర్ వెల్దండి గారికి ఉత్తుత్తి నెనర్లు అనలేక ఆఫ్రిన్‌ ఆపా ( సయ్యద్‌ ఆఫ్రిన్‌ బేగం ) రాసిన ” రచయిత్రుల కథల్లో తెలంగాణ జీవన చిత్రణ ” అనే అద్భుత వ్యాసం ఇవ్వనా?! http://www.navatelangana.com/article/darvaaja/325431

    ముప్పై ఎనిమిదేళ్ల కిందటి పీడకల ఇంద్రవెల్లి మారణకాండ. ఏళ్ల తరబడి సాగుచేస్తున్న భూమిని రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో అటవీ అధికారులు లాక్కోవడంతో భూములు తిరిగి ఇ వ్వాలని; చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్‌ ఆధ్వర్యంలో గిరిజన రైతు కులీ సంఘం పేరిట ఇంద్రవెల్లి గిరిజనులు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వేలాదిమందితో వస్తున్న గిరిజనుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య గొడవ ప్రా రంభమైంది. పోలీసుల కాల్పుల్లో వందమందికిపైగా అడవిపుత్రులు నేలకొరిగారు. వందలమంది గాయపడ్డారు.

    1981 ఏప్రిల్‌ 20 నాడు ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లిలో అమాయక గోండులపై జరిగిన అత్యంత హేయమైన సంఘటన. మనలోని పైశాచికత్వానికి గుర్తుగా అది మన వెన్నంటే వస్తున్నది ” ~ జయధీర్‌ తిరుమలరావు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు