గోదావరి పడవలా మా అన్నయ్యగారు

లుపు తోసుకుని లోపలికి వచ్చినంత సులువు గాదు అన్నయ్యగారిని అర్థం చేసుకోడం. అలాగని దుర్బేధ్యపు కోట బురుజు కాదాయన. కారణం ఆయన వాక్యంలోగాని, మాటల్లోగాని నిషిద్ధాక్షరాలు, వ్యర్థ పదాలు వుండవు. అందుకే అన్నయ్య పతంజలి శాస్త్రి గారంటే చిరు బెరుకు నాకు. దాటరాని గీతల్లేని  విశాలత్వం ఆయనలో ఉండబట్టి తేడాల్లేని బోలెడు సరళ రేఖల్లాటి ముచ్చటలు పోగు చేసుకుంటూ వస్తున్నాను. పైగా, పెద్ద కళ్ళు, రెప్పలు ఉండటం మూలాన ఎదుటివారి బుర్ర వెనుక ఏముందో చూడగల ఒడుపు వుందాయనలో. అందుచేత నాదయిన బుద్ధితక్కువతనాన్ని కప్పెట్టి ఆయన వయిన మాటల్ని ఇష్టంగా, జాగ్రత్తగా వినడం అలవాటు చేసుకున్నాను.

నాకు ఊహ తెలిసినప్పటినుంచి పతంజలి శాస్త్రి గారి చేత పుస్తకం లేకపోవడం, చదవడానికి ఆయనకు వ్యవధి లేకపోడం నేను చూడలేదు. ఆయనకు నాకూ ఎనిమిదేళ్లు తేడా. బుద్ధి, జ్ఞానం విషయంలో నేను ఆయనకన్నా 800 ఏళ్ళు చిన్న! ఆయన సన్నగా, అతి శుభ్రంగా, ఆపై చిన్న మెల్ల కన్ను ధరించి కాలేజీ నుంచి ఇంటి కొస్తోంటే ‘ముందు వెనుకల ఇరు ప్రక్కల తోడై’ సహ విద్యార్థిని విద్యార్థులు కొందరు కూడా వచ్చేవారు. ఈయనగారు గురువుగారా, విద్యార్ధిగారా అర్థమయ్యేది కాదు నాకు. కాలేజీ లెక్చరర్లు అందరు అన్నయ్య అంటే ఇష్టపడేవారిని తెలిసింది. ఈ ‘స్టూడెంట్ కుర్రాడు’ సాటి మిత్ర విద్యార్థులకి షేక్స్పియర్ గారి  మాక్ బాత్ చెబుతుంటే (“హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫీల్తి ఎయిర్”). మా అద్దె ఇంటి హాల్ ఒక గ్లొబ్ థియేటర్!

అంతటి సీరియస్ రీడర్ గారు పొడవాటి ముక్కుతో  ప్రేమ వాసనలు పసిగట్టిన కాలేజీ కాలం లోనే ‘నాసికో పాఖ్యానం’, ‘తనకు తెలియని నిజం’ వంటి కథలు ఏ చేత్తోనో గుర్తు లేదుగాని రాసి పడేసాడు. అవి అచ్చయి నలుగురికి నచ్చాయి. దాదాపు అదే దశలో మా ఇంట్లోని  కేలండర్లో 12 పేజీల పాటు సాధన (ముంగురులు అనడానికి అలివిగాని కత్తిరింపు జుత్తు తో నుదుటిని కప్పెట్టే హిందీ నటి) ముఖాల మీద అంచక్కటి అక్షరాలతో కందాలు  విరచించారు అన్నగారు (మెర్లిన్ మన్రో కాదావిడ. ఆవిడ వరవర రావుగారి సౌందర్యావేశం)  ఐతే ఓ రోజు సదరు హిందీ నటిపై గల పాట ఒకటి నాకు గుర్తొచ్చి పదాల  అర్థం ఏంట్రా అని అడిగితే  …”పుస్తకంలాంటి చదరపు మొహం, గులాబీ లాంటి ఎర్ర కళ్ళు గల పిల్లా..” ( కితాబి చెహరా, గులాబీ ఆంఖే)  అని చెప్పి వెళ్లారు!

అన్నయ్య ఒంగోలు కాలేజీ దాటి పై చదువులకు తిరుపతి వెంకటేశ్వరా విశ్వ విద్యాలయం దాటుకుని  ఆపై చదువులకు పూనాలో డెక్కన్ కాలేజీలో హాస్టలీకుడయి , అందునూ లోకమాన్య తిలక్ నివసించిన గదిలో వుంటూ లంక కోసం ఆంజనేయుడికి మల్లె తిప్పలు పడ్డ ప్రొఫెసర్ సంకాలియా శిష్యరికమూ కానిస్తూ  ఇంటికి వచ్చినప్పుడల్లా ధారాపాతంగా భలే కబుర్లు బోలెడు తెచ్చి చెప్పేవారు. ఆర్కియాలజీ చదువు కావటం వల్ల ట్రంకు పెట్టె నిండా సరిపడే చిన్నా పెద్దా రకరకాల రాళ్లు పోగేసి తెచ్చేవారు. నాలుగు రాళ్లు వెనకేసుకోడం అంటే ఆయన ఉద్దేశ్యంలో ఇదే కావచ్చు. ఆపై ఆయన చాళుక్యుల నిర్మాణ శైలి విశేషాలు చెప్పే క్షణంలో ఆయన నాటి స్థపతి గారో, స్థానాపతి గారో అనిపించేది.

ఒంగోల్లో మా ఇల్లు అసలే ఓ రైల్వే స్టేషన్. వచ్చేవారు, వెళ్లేవారు – అనేక చెవులకు అనేకానేక విషయాలు వినిపించేది. జ్ఞాపకం లేదుకానీ మహా చైత్యం కింద తవ్వి తీసిన పేటికలోని నవరత్నాల్లాగా చిన్నచిన్నవే మహా మెరిసిపోయే విశేషాలు ఆయన చెబుతుంటే వినేవాడిని, ఇతర చెవులతోపాటు. కేవలం పెద్ద కబుర్లే గాక బూరెల్లాంటి తీపి కబుర్లు ఉండేవి – దాంతో ఇల్లంతా గొల్లుమన్న నవ్వులతో నిండేది. తాతగారు, అమ్మ, మేం పిల్లలం, సభలోని తదితరులూ…. ఆ ఇల్లు ఓ సకల జన సమాశ్రయం! చిత్రమేమంటే అంతటి హోరులో ఆయన మిత్రులతో వున్నట్టే వుండి  చెప్పా పెట్టకుండా మాయమై ఏదో పుస్తకం పేజీల అక్షరాల్లో నిక్షిప్తమయ్యేవాడు ఇట్టే!

ఆయనలో కళవంటి బద్ధకమూ ఉండేది. ఏరియల్ లాగ రేడియోకి పక్కనే వుండి, దానిని కట్టెయ్యమని మాకు పురమాయింపు ఒక్కోసారి పరధ్యానమో, మరోలోకమో  నిజంగా  బద్ధకపు  కదలికో నాకు తెలిసేది కాదు నాకు. అకడమిక్ విద్యానంతరం ఆయన కొంతకాలం లెక్చరర్ గా, ఇంకొంత కాలం ప్రిన్సిపాలుగా గోదారి తన వెంట ఉండేలా చూసుకుని మరీ ఉద్యోగం చేసుకున్నారు. ఆయన స్టూడెంట్ కుర్రాళ్ళు కవులు, రచయితలూ, రెండు వెరసి జర్నలిస్టులు అయినవాళ్లు అన్నయ్య ప్రసక్తి వస్తే చాలు ఆయన పాఠం చెప్పే తీరు, సాహిత్యాంశాలు  చెప్పనట్టుగా చెప్పేటప్పుడూ కనిపించే మానసోల్లాసమూ  మరీమరీ చెబుతూ ఉండటం గమనించాను. ఆయనకు ఉద్యోగం అచ్చి రాలేదు. తదనంతరం పర్యావరణం, పరస్పరాశ్రితాల గురించీ అనేక పనులమీద విశాలమీద గోదావరి పీకలవరకు వచ్చేదాకా దిగిపోయారు. మహా ఇష్టంగా, బోలెడు ప్రేమగా ఇప్పుడూ ఈదుకొస్తున్నారు.

పర్యావరణ విఘాతానికి గురయిన అనేక కొండకోనలు, గుట్టమీదిపుట్టలూ, నదుల మలుపులు, గిరిజన గుడిసెల నీలి పొగలు, రాయలసీమ నెమలిగుండ్లు, సీమ ఉష్ణరసం, ప్రాజెక్టు నిరాశ్రయుల పట్ల నిరాదరణ, ఆయనకి అన్నం రుచించనంత సంగతులేగాదు, చేదయిన వాస్తవాలు కూడా. అవి ఎన్నోవ్యాసాలయ్యాయి, కోర్టు కాగితాలయ్యాయి, అధికారులకు అర్జీలయ్యాయి. ఈ వీటన్నిటివెనుక వరుస కొండల నీడలాగా బోలెడు కథలు, కాసిని నవలలూ పచ్చి నిజాలై, తపోఫలల్లా ఆయనలోంచి పుట్టుకొచ్చాయి. తల్లి ఏనుగు పిల్లదాన్ని కాళ్ళ మధ్య ఉండేట్టు చూసి నడిచే నిదానపు తీరున కథలు రాస్తూనే వున్నారు….. జీవన ప్రతిబింబాలు !

ఎవరేనా రాసింది, చెప్పింది నచ్చకపోతే అన్నయ్యగారు అతి సున్నితంగా, దాదాపు వినిపించనంత స్వరంలో నవ్వు కలిపి తల అడ్డంగా తిప్పడం తప్ప ఒకరిని కటువుగా అనడం, చేదుగా మాట్లాడడం నేను ఎరుగను. అలాగే నన్ను గాని, మా తమ్ముళ్ళని గాని విసుక్కోడం, కోప్పడ్డం నేను చూడలేదు. మనిషి కి మహా ఓర్పు, భారతంలో తిక్కనగారు ద్రౌపదిని ఉద్దేశించి ‘రక్కసి తాల్మి’ అని అంటారు “అది అన్నయ్య పతంజలి శాస్త్రి గారికి వర్తిస్తుంది. ఇక, మా అన్నలందరూ నాకు గురువులే”.  అన్నయ్యగారి అబ్బాయితో సహా.  అన్నయ్య ముందు, మా శశి (అన్నగారి అబ్బాయి ) మిగతా అన్నలముందూ ఈశ్వరుడు దయతో నాకిచ్చిన పుష్కలమైన అజ్ఞానాన్ని సంపూర్తిగా ప్రదర్శించేవాడిని. ఆపై అన్నయ్యగారు చెప్పే కథలు, పుస్తకాలకి చేర్పువలె మా వదినగారు విజయలక్ష్మి గారు పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ అనేకానేక కథల సారాంశాలు, తానూ భావించిన కథాంశాలూ బహు నేర్పుగా చెప్పేవారు. మా కుటుంబాల విషయాల్లోకొస్తే   మాట్లాడే కళ్ళు గల అన్నయ్య మాకు తండ్రి వంటి వారే” మా పెద్దన్నయ్య వలె.

ఇప్పటికి ఇంకా ఓపికగా తిరిగే పతంజలి శాస్త్రి గారి సకల విధ రచనలు రాతలూ అక్షరాలూ మోసే అడవులు, నరనరాలా ప్రవహించే గోదావరీ అని వొట్టి సాహిత్యపు వ్యవహారం కాదు. అవి శాస్త్రి గారి రూపం, సారం, దినుసూనూ. ఇంటిపని, సొంతపని, వంట పని అని దేనికీ తేడాలుండవు. కష్టనష్టాలు, సమస్యలు పోటెత్తినప్ప్పుడు ఎప్పుడూ ఆయన నుంచి నైరాశ్యపు మాట వినలేదు నేను. పనే ముఖ్యం. పొద్దుటే తలగుడ్డ ఒకటి చంద్రవంకలా ధరించి ఇంటి మెట్లు పొడవునా కడగటం, నీళ్లు పట్టడం, పరిశుభ్ర స్నానానంతరం పౌడరతో అవభృత స్నానం, నిత్యకృత్యాలు. ఆపై అగరొత్తులు పరిమళాల చల్లదనం  తగు మోతాదులో ఆయన చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ఇప్పుడు ఇవి నిదానించాయి.

మధ్యాన్నం వేళ  పుస్తకం చదివి అలసి గాలివాటుకి ఆకులాగా మూసి తెరిచే ఆ కళ్ళు చిరు నిద్రలో కలలు సణుగుతున్నట్టు, ఆపై బోధనా క్రమంలో కదిలినట్టు ఒక చేయి నిద్ర మబ్బుల్ని తోసేస్తున్నట్టూ  కదులుతుంటుంది. అట్టిస్థితిలో హఠాత్తుగా అడిగిన ప్రశ్న తాలూకు గతంలోకి వెళ్లి మేజిక్ రియలిజాన్ని ఎక్కువమంది ఎలా అపార్థం చేసుకుంటారో వివరిస్తూనే అదే నిద్ర పోగలరు అన్నయ్య.

గొప్ప చదువు, దాని భావ శబలత, అదిచ్చే వినయాది సద్గుణాలు శాస్త్రి గారిలో నేను చిన్నతనం నుంచే గమనిస్తున్నాను. బాది లేరో, బషోనో   పై జేబులోని సిగరెట్టు లైటు గా భావించి తీసి, వెలిగించి పొగ ఊది, ఊదర గొట్టడం అన్నగారిలో  ( అవతలి వారు అంతగా చదవని విషయాన్ని వాడికి అలవోకగా చెప్పడం ప్రతి సాయంత్రం నగరంలో చూస్తూనే ఉంటాంగదా !) నేను అసలు చూడలేదు. పెద్ద చదువు పెద్ద నిశ్శబ్దాన్ని, జలద గంభీరమైన వచనాన్నో, కవితనో ఇవ్వక ఊరుకోరుగదా, కానీ, అద్దాని వెనుక ధాన్యాగారమంత తాత్విక వివేచన అంతటి విజ్ఞతనీ ఇస్తుందని శాస్త్రి గారిని చూసి, చూసి, చూసి గ్రహించాను, సారి పుత్రుని మాట శాస్త వినయంగా వింటున్నట్టే శాస్త్రిగారు ఎవరు ఏమి చెప్పినా  తీరికగా వింటారు. మహా క్షమా గుణ సారం! నిజానికి పాల్  వెలరీ నుంచి మురకామి వరకు ఏదయినా, ఎంతైనా  తీరికగా వివరించగల శాస్త్రి గారు ఎన్నడూ name dropping చేసి ఎరుగరు. ఐతే అదేమీ లేకుండా ఆయన మాట్లాడింది గమనిస్తే అనేకానేక తూర్పు, పడమటి రచయితలూ, తత్త్వ వేత్తల సారం డికాక్షన్ తీసి కాఫీ  కలుపుకుని తాగేసినట్టున్నారాయన అని అనిపించేది. పేస్ బుక్కిష్ నాలెడ్జి విద్యావంతులు, రెండో దశకం దాటని కుర్రాళ్ళ ఆత్మ కథలూ  ఫేస్ బుక్ వేదికల  నిండార చూస్తోన్న నాకు నగర తత్త్వం నుంచి తెరిపి ఉండదు. అలాగని  నగరం లోని ఒకటి, అరా పండిత మిత్రులని వినడం అంత సులువూ కాదు, అందువలన తిన్నగా బస్సు పట్టి రాజమండ్రి చేరితే కొంత సేపైనా నా తల శుభ్రమవుతుంది. (శిర విసుద్ధమగ్గ!) శాంతిస్తుంది.

ఇప్పుడు, ఇస్మాయిల్, త్రిపుర, సత్య శ్రీమన్నారాయణ, శ్రీకాంత శర్మ వంటి ఎందరో పెద్ద, చిన్నా మిత్రులందరూ తరలిపోగా శాస్త్రి గారు వంటరి పడవలా  రాజమహేంద్రి గోదావరి వొద్దు మీది  చెట్ల కవతల నది గమనాన్ని చూస్తూ పర్యావరణ విషయ పరిభ్రమణంలో వున్నారు. చేతినిండా, సదరు తలనిండ, పనిపెట్టుకున్నారు. శాంత గోదావరి అలల వరసల కింద చేపలాగా సుఖాయానం చేసే తత్త్వం ఏదో శాస్త్రిగారికి ఆనందాన్ని, ఓపికనూ ఖాయం చేసిందనిపిస్తుంది నాకు మాత్రం ఆయన సమీప హరిత శిఖరం గోదావరి పడవ.

*

తల్లావజ్ఝుల శివాజీ

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • 🙏🙏🙏 ఇంతకన్నా మాటల్లో ఇంకేమి రాయాలొ !!!!

 • ఎంత గొప్పగా రాశారో… వ్యక్తిగత పరిచయంలోంచి ప్రపంచపు పరిచయాన్నీ, ఆలోచన సాహిత్యం గోదావరి అలా జలజలా ప్రవహించాయి..

 • గోదావరి పడవ కాదు. పడవలో గోదావరేమో!!

 • గుండె లోతులనుండి వెలువడిన ఆప్త వాక్యాలు. అందరికీ వినిపించగల నిండుతనంతో పలికిన మిత్రుడు శివాజీకి ధన్యవాదాలు!

 • I met Ptanjali Sastry garu in Kakinada on Ugadi when we staged our play Barrister Parvateesam. He came to the Makeup room and introduced himself and gave me a play script.

  He was absolutely what you have described. I am a close friend of Sundaram.I adore him as theatre man. I told Patanjali Sastry garu the same. With the same unarming smile he said now you are meeting his brother. Thanks to Krishna Mohan (Mohanbabu) I started reading his stories. I talk to him occasionally.

  I like your absolutely lovely points. And thank you for your poetic write up about him.

 • భలే రాశారు సార్! తెలుగు సాహిత్యంలో అన్నగారి గురించి తమ్ముడుగారు ఇలా అక్షరలక్షలుగా రాయడం మీకే తగును. తెలుగు సాహిత్యానికి తలకట్టు వంటి తల్లావఝలవారికి నమోనమః! మీ అక్షరాలకు నమో నమః🙏👌👍

 • ఒక పారవశ్యంతో ఔన్నత్య వ్యక్తి ఆవిష్కరణ ఇది.
  ఒక సుదీర్ఘ సాంగత్యంలోని సౌశీల్య చిత్రణ ఇది.
  చిద్విలాస వాజి వాక్య చిత్రిక ఇది.
  సాహోదరమిది.
  పతంజలి గారి ఘనమైన (cube) షణ్ముఖ పరామర్శ ఇది.

 • ఎంతటి వారైనా చనువైతే చవకవుతారు. కానీ, చేరువయ్యే కొద్దీ అపురూపత్వం ఆవిష్కారం కావడమే పతంజలి శాస్త్రి గారి ప్రత్యేకత. శివాజీ గారి అద్భుతమైన వ్యాసం వల్ల పతంజలి శాస్త్రి గారు ఇంకా దగ్గరయ్యారు నాకు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు