గురువా మీ  పిన్ కోడ్ ఎంత ?

ఆ దొంగలు కూడా ఆ కతని పొగడ్డమే. టీవీల గొట్టాలు పగిలిపోనాయి అలాగా కవుర్లు.

గౌరవనీయులు కారా మాస్టారికి నమస్కారం….

మీరు క్షేమంగా చేరుకున్నారా? మీరు వెళిపోయి మూడు రోజులయ్యింది. మీ నుంచి ఉత్తరం వస్తాదనుకొని యెదురుచూసాను. ఎల్లగానే ఉత్తరం రాయడం  నీకు అలవాటు గద. ఉత్తరం ఒక రోజు ముందు అందాలంటే పిన్ కోడ్ రాయాలని నువ్వే నాకు సెప్పావు . అక్కడి మీ పిన్ కోడ్ రాయి గురువా!  అన్నట్టు, మర్చిపోయాను, ఇపుడు ఉత్తరాలు లేవు కదా … అన్నీ మెస్సేజ్ లే కదా .

అన్నట్టు మీకు అక్కడ సెల్ సిగ్నల్స్ బాగుంటాయా ? బిఎస్సేన్నాల్ ఉందా అక్కడ? జియో ఏనా? ఇక్కడలాగా మీరు అన్నీ ప్రభుత్వ వస్తువులే వాడతానని పట్టు బట్టకండి, మీకన్నీ నచ్చినట్టు కుదరాలంటే ఎల్లకాలం , అన్ని చోట్లా కుదరవు, సర్దుకోవాల. ఇక్కడంటే మీకు కొడుకులూ, కోడల్లూ, శిష్యులూ నీకు కావల్సినివి అమిర్సీవోరు. సీతమ్మ గారు వున్నపుడు ఈల్లెవులూ అక్కర్లేదు , సీతమ్మే సూసుకునేది.

నీకు గునుపులు లేని కాగు పుల్ల  కావాల పళ్ళు దోముకోవడానికి, లేత తమలపాకులు కావాలా కిళ్ళీకి, అరటిపండు పూరాగా పండకూడదు  అన్నీటికీ మీకొక లెక్క ఉంటాది, లెక్క మారకూడదు. ఇక్కడ జరిగినట్టు  మీకు అక్కడ జరగదు సుమా సర్దుకోవాల. మరీ ముఖ్యంగా  సరుకులు ప్రభుత్వానివే తప్ప ప్రైవేట్ వి వాడను అని పట్టుబట్టకండి .  ప్రభుత్వమయినా, ప్రైవేటైనానా ఒకటే. ఏ రాయి అయిన రాలేవి మన మూతి పళ్లే.  నీకు ఆ సంగతి తెలుసు. కుట్ర కత రాసినోడివి నీకు తెల్డా ? అన్నట్టు గురువా – ఇక్కడి ఏలినోరి  గుట్టుమట్టులు ఎలాగా ఇప్పి కతల్లోన  సూపినావో అలాగా అక్కడి ఏలినోరి గుట్టుమట్టులు గూడా కతలు రాయిమీ. రాసి పంపిమీ .

అవునుగానీ గురువా అక్కడికి ఎల్లగానే నువ్వు ముందు ఎవుల్ని కలిసి నావు? సీతమ్మగోర్నా , శ్రీశ్రీనా , కొకు.నా? రావిశాస్త్రి గార్నా? మేము పందెం వేసుకున్నాం గురువా…సేప్పవా? చింతోడు అంటాడు … ఇక్కడున్నపుడే గురువు కతానిలయానికి తాళి గట్టినోడు ,ఆలిని మరిసినోడు … సీతమ్మగోర్ని కలస్తాడా? ఆయమ్మ ఎన్ని పిలుపులు పిలాల అనంటాడు. అయితే రావిశాస్త్రినా అనంటే –శాస్త్రి బాబు  రాత్రి కొమ్మ ఏలకి గానీ దొరకడు, ఇతగాను ఎల్లీ సరికి ఏ ఇంట  ఉన్నాడో  అన్నాడు. కొసకి అంటాడు….ఆళ్ళని   ఎవురినీ కాదు, ముందగాల శీరాములు నాయుడుని కలిసి మళ్ళా పంచాయితీ ఎట్టి ఉంటాడు అని. ఇంతకీ ఎవుల్ని కలిసావు ముందు గురువా?

నువ్వు ఎల్లిన తరాత ఇక్కడ పేపర్ల నిండా నీ వోర్తలే. నువ్వు రాసిన కతల  రాతలే. రచయితల తోటి సమంగా రాజకీయ నాయకులూ నీ కతల పొగడ్తలే. కుట్రదారులు ఎవరో, కుట్ర ఎలా చేస్తారో, ప్రజలనూ, దేశాన్నీ ఎలా మోసగిస్తారో అని నువ్వు నీ కుట్ర కత లోన సూపినావ, ఆ దొంగలు కూడా ఆ కతని పొగడ్డమే. టీవీల గొట్టాలు పగిలిపోనాయి అలాగా కవుర్లు. నువ్వుగానీ ఇని ఉంటే ఎమనుకుందువు ? యేమని అని వుందువు?నువ్వు సేప్తావ?కిళ్ళీ నోట కుక్కీసి ఉలుకు పలుకు లేకుండా పుస్తకంల బుర్ర పెట్టేస్తావు, నాకు తెల్డా?

గురువా…ఇక్కడి సంగతులు అన్నీ నీకు తెలుసు కదా, అక్కడ మన వాళ్ళు ఎలాగున్నారు? అక్కడ కరోన గానీ లేదు కదా? ఉంటే ఆ ఏలినోరిని మన ప్రదానిని కలవమనండి. అతగాని నుంచి తెలుసుకోమనండి, కరోనాను ఎలాగా గెలవాలో. చప్పట్లు కొట్టడం,దీపాలు ఆర్పడం నేర్పతాడు. ఎందుకేనా మంచిది నువ్వు భౌతిక దూరం పాటించు, హాయ్ అని సెయ్యి కలిపి షేక్ హేండ్ ఇవ్వకు ఎవరికీ! దూరం నుంచి దండం పెట్టు,చాలు.

మహానుభావుడు గురజాడ గానీ కలిస్తే … గురువా ,నువ్వు మతములన్నియు మాసిపోవును ,గ్యానమొక్కటి నిలిచి వెలుగును అని అన్నావుగానీ, గ్యాన దీపం ఆరిపోయి మతం మంటలు మండతన్నాయి ఇక్కడ అని సెప్పు. దేశమంటే మట్టి కాదని,మనుషులని  అన్నావు గానీ ఆ మనుషుల్ని మట్టి చేస్తన్నారు ఏలినారు అని సెప్పు. చెరబండ రాజు గానీ కనబడితే…అంగాంగం తాకట్టు కాదు అమ్మేస్తాన్నారు దేశమాతను అని సెప్పు. రావిశాస్త్రీ గారికి సెప్పు … గురువా నువ్వన్నట్టు – అమ్మకం అమ్మకం తప్ప దేశం ల మరి ఏటి లేదని సెప్పు. పతంజలి గాని కనబడితే … భూమి గుండ్రంగానో బల్ల పరుపు గానో ఎలాగ ఉంటే ఏమి…జామి రాజుల సేతల్లో గానీ, ఎలమల సేతల్లో గానీ లేదు కార్పొరేటు కంపినీల సేతల్లో వుంది రాజా అని సెప్పు. అన్నట్టు నువ్వు వోచ్చావని తెలిస్తే   పారోస్తాడు కొండగాలి భూషణం . అతగానికి  చెప్పు…అంటుకున్న అడివి ఆరిపోయిందని నువ్వే చూసి, భూషణం  ఆ తరత కొత్త గాలి కతలు రాసేవా,ఇపుడు ఆ గాలి అడివిని,పల్లాన్ని,పట్నం,నగరం అంతట నిండిపోయిందని సెప్పు, అన్నలు   ఏరుపాట్లు  అయిపోయి ఎవులి కుంపటి ఆల్లు అన్నట్టగా వున్నారని సెప్పు. నువ్వు సెప్పడం ఎందుకు,అతగానికీ తెలుసు…! అన్నట్టు మరిసిపోనాను …మీ శిష్యుడు కవనశర్మ కి సెప్పు , ఆతగాను ఎలిపోయిన తరవాత నవ్వులు మరిసిపోయామని .

అవునుగాని గురువా … నువ్వు వీలునామా రాసినావా? రాసి వుండవు లే … అయినా ఏటి ఉన్నాయి , ఒక ఇల్లా ,పొల్లా? నీకు దిక్కు లేదు,నువ్వు కతలకి ఇల్లు గట్నావు, దాన్ని లోకానికి ఇచ్చిసి ఎలిపోనావు. లోకంమీద నీకు గురి…గాని ఒక మాట నీమీద కూడా లోకానికి గురి. నువ్వేమీ బెంగ పెట్టుకోకు,కతా నిలయం నడస్తాది,లోకం నడుపుతాది.

ఈ వుత్తరం అందగానే జేబాబు రాయి. పిన్కోడ్ యంతో రాయి మీ. ఉంటాను, నమస్కారం.

నీ అనేకమంది శిష్యులలో ఒకడ్ని .

*

 

 

అట్టాడ అప్పల్నాయుడు

17 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • పొన్నాడవరాహనరసింహులు. ఆమదాలవలస. says:

  మీరు రాసిన ఉత్తరం బాగుంది. అది ఎవరికందుతాదో! మీరూ పిన్ కోడ్ వేయటం మర్చిపోయారు. అభినందనలు.

 • వెంత మంచి ఉత్తరం రాసిసినవ్ బావ్. నిజమే ఇవన్నీ తెలుసుకోవలసినవే:
  “మహానుభావుడు గురజాడ గానీ కలిస్తే … గురువా ,నువ్వు మతములన్నియు మాసిపోవును ,గ్యానమొక్కటి నిలిచి వెలుగును అని అన్నావుగానీ, గ్యాన దీపం ఆరిపోయి మతం మంటలు మండతన్నాయి ఇక్కడ అని సెప్పు. దేశమంటే మట్టి కాదని,మనుషులని అన్నావు గానీ ఆ మనుషుల్ని మట్టి చేస్తన్నారు ఏలినారు అని సెప్పు. చెరబండ రాజు గానీ కనబడితే…అంగాంగం తాకట్టు కాదు అమ్మేస్తాన్నారు దేశమాతను అని సెప్పు. రావిశాస్త్రీ గారికి సెప్పు … గురువా నువ్వన్నట్టు – అమ్మకం అమ్మకం తప్ప దేశం ల మరి ఏటి లేదని సెప్పు. పతంజలి గాని కనబడితే … భూమి గుండ్రంగానో బల్ల పరుపు గానో ఎలాగ ఉంటే ఏమి…జామి రాజుల సేతల్లో గానీ, ఎలమల సేతల్లో గానీ లేదు కార్పొరేటు కంపినీల సేతల్లో వుంది రాజా అని సెప్పు. అన్నట్టు నువ్వు వోచ్చావని తెలిస్తే పారోస్తాడు కొండగాలి భూషణం . ”

  జవబోస్టెమాత్రం ఏతన్నారో మక్కుదా సెప్పీయి బావ్

 • గురువు తోటి మీకు గొప్ప సనువు గానీ, గురువు ఎంటనే జవాబు రాసీడు…ముందు నిబాలంగా కిళ్ళీ ఏసుకొని అన్నీ కనిపెడతాడు… ఆ తరువాత ఆల్ల గురువులు కొ.కు., రావి శాస్త్రి లు ఏటేటి బయట పెట్టారు, మిగిలినవి ఏటి… అన్నీ చూసి అప్పుడు రాత్తాడు…తెలుగు లోకం గురువు మరి లేరన్న ఊస్టం లో ఊగి పోతుంది..మంచి నివాళి వ్యాసం sir..

 • బలే తల్సుకున్నారు కదేటి..ఇంతకన్నా ఎవులు రాస్తారు చెప్మీ..మీరే కందా..నాకు తెల్దేటి..బావు..పెద్దాయన ఎళ్లిపోయాడని ఓ బెంగెట్టీదసుకోకండి..మీరంతా గుండె దిటవు చేసుకోవాల బావూ…
  .

 • మేస్టుగోరిని మరోపాలి దగ్గిట్నుండి సూసినట్టుగనిపించింది.

 • వావ్..వావ్.. ఎంతబాగా రాసారండీ.. ఇలాంటివి చదివితే దుఃఖం ఆగదు.

 • మీ ఊసులతో ఆయన్ను తలచుకోవడం సంతోషంగా ఉంది. ఆయన లేని లోటును భర్తీ చేయండి కొంతైనా

 • అద్భుతం గురువుగారూ. దుఃఖం వచ్చింది గురువుగారూ. ఆ మహానుభావుడు
  గ్నాపకాలతో దిగులు మేఘాలు అలుముకొనిపిచ్చిలా ఉంటోంది.

 • మీరు ఆకర్నో ‌ముక్క రాసినారు గాదా .. కతా నిలయం నడస్తాది .. లోకం నడుపుతాదనీ .. ఆ మాట సాలు .. ఆయన పొంగిపోతాడు .. మీ ఉత్తరం సేరగానే .. మల్లా ఉత్తరమైనా రాస్తారు .. లేదూ .. కలలో కనిపించైనా సెబుతారు .. ఇక తూరుపుకి నువ్వే దిక్కని ..! నాను నేనని నువు దిగాలు పడిపోకనీ ..! గుండె దిటం జేసుకోమనీ ..!

 • సార్! గొప్ప నివాళి. పిన్ కోడ్ లేకుండా ఉత్తరం రాయరు. మాష్టారు లెక్క తప్పని మనిసి గదా!

 • “గ్యాన దీపం ఆరిపోయి మతం మంటలు మండతన్నాయి ఇక్కడ”
  ఎంత బాగా చెప్పారు !

 • చెరబండ రాజు, కొ.కు, రావిశాస్త్రీ, కొండగాలి భూషణం ( సిక్కోలు భూషణం ), కవనశర్మ …. ఇందరు కామ్రేడ్లను కలవమని కారా మాస్టారి గారికి కబురంపి … కంటంట నీరు తిరిగేలా సేసినావు అట్టాడ అప్పల్నాయుడు బావూ.

  యీ సారి పలకరింపులో సుబ్బారావు పాణిగ్రాహి నుండి త్రిపుర వరకూ మరికొందరి ఊసులూ చెప్పవా బావూ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు