గుండె కింది తడి

ఆ రాత్రి ఎందుకో నా మనసు పరిపరి విధాలా పోయింది. ‘నాకు తెలియకుండానే ఏదో ఊబిలో కూరుకుపోతలేను కదా!’ అని.

‘‘గుండె లోతులో గుండు సూది గుచ్చకు…

కల గొంతు నులిమి మన్నులోన పూడ్చకు…’’

సెల్‌ ఫోన్‌ రింగు టోన్‌ విషాదంగా గొంతు చించుకుంటుంటే హన్మకొండ చౌరస్తాలో ఏదో అపార్ట్‌మెంటుకు పై నుండి వేలాడుతున్న తాడు మీద  కూర్చొని రంగులు వేస్తున్న డేవిస్‌ ఆదరబాదరాగా సెల్‌ ఫోన్‌ తీసి చెవి దగ్గర పెట్టుకొని

‘‘ఎవరు?’’ అన్నాడు.

‘‘సామెల్ మీ అబ్బాయేనా? కాజీపేట రైల్వే స్టేషన్‌ ముందట ఎవరో మీవోన్ని చావబాదుతున్నారు. తొందరగా రండి’’ అని వినిపించింది. గొంతు ఎవరిదో గుర్తుపట్టలేకపోయాడు. కానీ గొంతులో ఆందోళన అయితే విన్పిస్తోంది.  డేవిస్‌కు ఒక్కసారి ప్రాణం సొలిగి కింద పడతానేమోననిపించింది. వెంటనే పైన తాడు పట్టుకున్న రాజును కేకేసి

‘‘అరే! రాజు తాడు పైకి లాగు జెల్ది’’ అని గట్టిగా అరిచాడు.  పైనున్న రాజు ఏమైందోనని వెంటనే తాడును  తొందర తొందరగా పైకి లాగాడు. టెర్రస్‌ పైన దిగిన డేవిస్‌ ‘‘అరే రాజూ! కాజీపేట రైల్వే స్టేషన్‌ ముందట మా సామెల్ ను ఎవరో కొడుతున్నారట. పదరా తొందరగా పోదాం’’ అన్నాడు చెప్పులు  వేసుకుంటూ.

పది పదిహేను నిమిషాల్లో ఎవరిదో వెహికిల్ దొరికితే కాజీపేట రైల్వే స్టేషన్‌ దగ్గరికి చేరుకునే సరికి  సామెల్ ను ఎవరో కొంత మంది కలిసి ఆటోలో ఎక్కిస్తున్నారు. చుట్టూ చాలా మంది గుమిగూడారు.

‘‘చాలా రక్తం పోయింది…’’ అంటున్నారెవరో. ఒళ్లంతా గాయాలతో కొస ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సామెల్ ను చూసేసరికి డేవిస్‌కు ఒక్కసారి దు:ఖం పొంగుకొచ్చింది.

‘‘ఎవరు మావోన్ని గింతగనం కొట్టింది?’’ అనుకుంటూ దు:ఖం ఆగక మీద పడి ఏడుస్తున్నాడు.

‘‘మీవోడు ఎవరో పోరిని ప్రేమించిండట గదా! వాళ్ల మనుషులొచ్చి ఇష్టమున్నట్టు కొట్టిపోయిండ్రు. అప్పుడే సచ్చేటోడు. మేమే ఆగవట్టినం.’’ అన్నారెవరో. కొద్ది నిమిషాల్లోనే ఆటో ఎంజిఎం హాస్పిటల్‌కు చేరుకుంది.

 

***                        ***                        ***

ఎంజిఎం హాస్పిటల్‌ ఆవరణలోని చెట్లు కూడా ఆ యువకుడి తల్లిదండ్రుల, బంధువుల ఏడుపు, పెడ బొబ్బలకు చలించిపోతున్నాయి. అప్పటికి వారం రోజులైంది. వారి దు:ఖం ఆగడమే లేదు. ఆ యువకుడికి పదుల ఆపరేషన్లు చేసి బ్యాండేజీలు చుట్టిన డాక్టర్లు అతడు చస్తాడో, బతుకుతాడో కూడా చెప్పలేకపోతున్నారు. యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడు… అయిదు రూపాయల భోజనం తెచ్చుకొని క్యాంటిన్‌ ముందు సిమెంట్‌ గద్దె మీద కూర్చుని ఒక్క ముద్ద కలిపి నోట్లో పెట్టుకోబోతున్న డేవిస్ కళ్ల నుండి కొన్ని కన్నీటి బొట్లు రాలి ముందున్న అన్నంలో పడ్డాయి.

‘నాకే ఎందుకిట్లా అవుతుంది? అప్పుడు నాకు. ఇప్పుడు నా కొడుక్కు. నిజంగా ప్రేమించడం  నేరమేనా? మనుషులంతా ఒక్కటని, మనమంతా చదువుకొని కుల మతాలు లేని స్వర్గంలాంటి ప్రపంచాన్ని నిర్మించాలని అంటుంటారు కదా! అదంతా ఉత్త మాటలేనా? కులం, మతం, బీద, ధనిక… భేదాలు పోయి కేవలం  మనుషులు మాత్రమే ఉండే లోకం ఎక్కడుందో! అసలలాంటి లోకం ఎక్కడైనా ఉంటుందా? ఇన్నేండ్లయిపోయింది కాని మనుషులు  ఏమాత్రం మారలేదు. వాళ్ల మూర్ఖత్వం మరింత పెరిగిందే తప్ప, తరిగింది లేదు. డేవిస్ కు మెల్లమెల్లగా తన గతమంతా గుర్తుకు రాసాగింది….’

***                        ***                        ***

అవి ఒక థియేటర్‌లో ‘శివ’, మరో థియేటర్‌లో ‘సింధూర పువ్వు’ సినిమాలు ఆడుతున్న రోజులు… ఆ రోజే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా విడుదల. అదే రోజు ఇంటర్మీడియెట్‌ సెకండీయర్‌ ఫలితాల  విడుదల  కూడా. హన్మకొండ చౌరస్తా నాలుగు రోడ్లూ సినిమా ప్రేక్షకుల పాదాలతో నలిగిపోతున్నాయి. తాను చిన్న టిక్కీలాంటి పెయింటింగ్‌ షాప్‌లో రామ్మూర్తి మాస్టార్‌ దగ్గర పెయింటింగ్‌ నేర్చుకుంటున్నాడు. రామ్మూర్తి మాస్టార్‌ అంటే నా దృష్టిలో రవి వర్మ. అంతే. ఏ రంగును మరే రంగుతో కలిపితే ఇంకేరంగు వస్తుందో రామ్మూర్తి మాస్టార్‌కు తెలిసినంతగా మరే పెయింటర్‌కూ తెలియదని నా నిశ్చితాభిప్రాయం. ఒక రంగును మరో రంగుతో కలిపి అతడు చూపించే సన్నటి తేడా అద్భుతమనిపిస్తుంది. మనిషి దేహమంతా ఒకే రంగులో కనిపిస్తుంది కానీ కనురెప్పలు,  కళ్లకింద, బుగ్గల మీద, చెవుల కు వేరువేరు రంగుంటాయంటాడు మాస్టార్‌. నిశితంగా పరిశీలిస్తే ఈ  నాల్గింటి మధ్య పల్చని తేడా కనిపిస్తుంది. అది ఆర్టిస్టుకు మాత్రమే అందే తేడా. అతడు రాత్రి నుంచి నలుపును తెస్తాడు. మంచు నుంచి తెలుపును తెస్తాడు. రక్తం నుంచి ఎరుపును తెస్తాడు. కానీ తాగుడుకు బానిస. పని అంతా నా మీదే పడేది. రోజంతా కష్టపడి మనిషి దేహమంతా చాలా జాగ్రత్తగా గీసి రంగులు వేస్తానా. చివరాఖరికి కళ్లను గీసే సమయంలో మాత్రం నన్ను ఏ చాయ్‌కో, సిగరేట్‌కో పంపేవాడు. నాకు ఎక్కడ లేని కోపం వచ్చేది. ‘పంచేంద్రియానాం నయనం ప్రధానం’ అంటే ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు కానీ ఈ ప్రపంచానికి లాగా బొమ్మకు మాత్రం కళ్లే అందం.

ఆ రోజు నేను పెయింటింగ్‌ షాప్‌ ముందు చిన్న స్టూల్‌పైన కూర్చుని ‘సరస్వతి స్వీట్స్‌’ అని సరస్వతి బొమ్మ గీసి చాలా శ్రద్ధగా అక్షరాలు రాస్తున్నాను. ఇంతలో ఓ ఆడపిల్లల గుంపు ఒకటి వచ్చి దూరంగా నిలబడి నా పెయింటింగ్‌ను గమనిస్తోంది. నేను మాత్రం నా పనిలో నిమగ్నమైపోయి వాళ్లను గమనించడం లేదు. కొద్ది సేపటికి కొన్ని నవ్వుతో పాటు అమ్మాయిల  దేహ పరిమళం నా తనువును తాకింది. అసలే యౌవనం చిగుళ్ళు వేస్తున్న కాలం. పడుచు అందాలు  అంత దగ్గరగా వచ్చే సరికి దేహమంతా ఏదో తెలియని వైబ్రేషన్‌…

‘‘అన్నా! నా బొమ్మ గీసి పెట్టవా?’’ అని ఒకరు. ‘‘అన్నా! నా పేరు ఈ నోట్‌ బుక్‌లో రాయవా?’’ అని మరొకరు. ‘‘అన్నా! మా షాప్‌ పేరు రాస్తావా?’’ అని ఇంకొకరు నా మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నా చూపు మాత్రం ఆ గుంపులో వెనకగా నిలబడ్డ వెడల్పు  కళ్ల అమ్మాయి మీదే నిలిచిపోయింది. టెన్త్‌ క్లాసో, ఇంటర్మీడియెట్‌ ఫస్టీయరో తెలియదు కాని, తెలుపు రంగులో కొంచెం బ్లూ కలర్‌ మిక్స్‌ చేసి దానికి కాస్త చెమటను జోడిస్తే వచ్చే రంగు ఆమెది. తెలుపు కాదు, ఎరుపు కాదు, చామన ఛాయా కాదు. అదో వింతైన రంగు ఆమెది. నేనెప్పుడు ఇంతకు ముందు అలాంటి రంగున్న అమ్మాయిని చూడలేదు. బహుశా ఏ లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే ఆ రంగు వస్తుందేమో! నాకు సరిగా తెలియదు. కాని ఆమెది చాలా అరుదుగా కనిపించే చర్మపు కాంతి. నన్ను చూస్తూ తన ముందున్న అమ్మాయికి నవ్వుతూ ఏదో చెప్తోంది… ఆమె నవ్వితే వెన్నె నవ్వినట్లుగా ఉంది…. నేను ఇలా అమ్మాయిల మాట, నవ్వు, అందాల మత్తులో మునిగి తేలుతుండగానే ఎవరో ఇద్దరు చేతక్‌ బండి మీద వచ్చి ‘‘ఒరేయ్‌…! రామ్మూర్తి లేడా?’’ అని రోడ్‌ మీది నుండే అరిచారు. నేను అకస్మాత్తుగా ఏ స్వర్గం నుండో భూమ్మీదికి తోయబడ్డ వాడిలా ఈ లోకంలోకి వచ్చి ‘‘లేడు ఊరికి పోయిండు. ఎందుకు?’’ అన్నాను.

‘‘ఇవాళ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విడుద అవుతుంది రా… శ్రీదేవిది ఇరవై ఫీట్ల కటౌట్‌ పెట్టాలి సినిమా టాకీస్‌ ముందు. నువ్వు చేసిస్తావా? సాయంత్రానికి కావాలి. కటౌట్‌ చెక్క కొట్టడం, బొమ్మ వేయడం అంతా నీదే. ఎంతవుతుందో చెప్పు?’’ అన్నాడు ఆ ఇద్దరిలో ఒకడు. నాకు ఆ సంగతులు ఏవీ పెద్దగా తెలియవు. ఎంతో కొంత చెబుదాం లే అనుకొని ‘‘పదిహేను వేలు అవుతుంది’’ అన్నాను. ఏవో లెక్కులు వేస్తున్నట్టు ఫోజు పెట్టి.

‘‘అంతైతే మా సేట్‌ ఇవ్వడు కానీ, పదమూడు వేలు చేసుకొని పని మొదలు పెట్టు. సాయంత్రానికి కచ్చితంగా కావాలి. ఇదిగో ఐదు వేలు అడ్వాన్స్‌. బొమ్మ అయిపోయినంక నువ్వే టాకీసు దగ్గర నిలబెట్టాలి.’’ అంటూ నా చేతిలో డబ్బు పెడ్తూ…

‘‘ఇంతకూ నీ పేరేంట్రా?’’ అన్నాడు.

నా అసలు పేరైతే డేవిస్‌. కానీ మన బ్రష్‌కు కూడా ఒక పేరుండాలి కదా! అని అప్పటికప్పుడు ఏమీ ఆలోచించకుండానే ‘‘మహర్షి’’ అన్నాను.

“ఒరే..! మహర్షీ తేడా వస్తే బొక్కలిర్గుతయ్‌… సాయంత్రానికి టాకీసు దగ్గర కటౌట్‌ కనిపించాలి.’’ అంటూ వచ్చినంత వేగంగా వెళ్లిపోయారు. నేను బిత్తరపోతూనే తల ఊపుతూ మళ్లీ ఈ అమ్మాయిల  గుంపు వైపు తిరిగి… ‘‘ఓకే.. ఓకే.. మీరంతా రేపు రండి గీసిపెడ్తాను. ఇప్పుడు నాకు చాలా పని ఉంది’’ అన్నాను. చేతిలోని బ్రష్‌ను కిరోసిన్‌లో కడుగుతూ…

‘‘ఓకే.. అన్నా! రేపు తప్పకుండా గీసివ్వాలి మరి..’’ అంటూ అందరూ షాపు దాటి ముందుకు               వెళ్తున్నారు. నా కళ్లు మాత్రం ఆ చివరి అమ్మాయి మీదే ఉన్నాయి… ఆమె నడక సాధారణ నడకలా లేదు. ఏదో నది అలా ఒయ్యారంగా ముందుకు దూకుతూ కదిలిపోతున్నట్టుగా ఉంది. ఈ నడక కూడా చాలా అరుదుగా కనిపించేదే. పోతూ పోతూ ఒక్కసారి ఆమె వెనక్కి తిరిగి చూసి నవ్వింది… ఇక అంతే నా దేహంలో ప్రాణం లేదు. ఆమె నడకతో పాటే నడిచి ఆమె వెంటే పరుగుపెడుతోంది…

***                        ***                        ***

‘‘ఒరే…! డేవిసూ… లేరా! ఎవరో అమ్మాయి నీ కోసం వచ్చింది’’ అంటూ మా అమ్మ నేను కప్పుకున్న దుప్పటిని లాగి  పారేస్తోంది… నేను బద్దకంగా ఒళ్లు విరుచుకొని కళ్లు నులుముకుంటూ లేచి కూర్చున్నాను. రాత్రి శ్రీదేవి కటౌట్‌ సినిమా టాకీస్‌ ముందు నిలబెట్టే సరికి అర్ధరాత్రి దాటి ఏ రెండో మూడో అయి వుంటుంది పడుకునే సరికి. కళ్లు తెరుస్తుంటే వెలుతురుకు కుచ్చుకున్నట్లయి మండిపోతున్నాయి. బలవంతంగా కళ్లు తెరిచి చూసే సరికి ఎదురుగా కొంత దూరంలో నిన్నటి అమ్మాయి. నేను ఒక్కసారి షాక్‌తిన్నాను. ‘ఈమెకు మా ఇల్లు  ఎలా తెలుసబ్బా!’ అని

‘‘కంగ్రాట్స్‌…! నువ్వు ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యావట. నిన్న రిజల్ట్స్‌ వచ్చినయ్‌ గదా! చూసుకోలేదా?’’ అంది చేతిలోని లడ్డూ నా నోటికి అందిస్తూ. మరో చేతిలో ‘సరస్వతి స్వీట్స్‌’ డబ్బా కనిపిస్తోంది. కటౌట్‌ పనిలో పడిపోయి రిజల్ట్స్‌ చూసుకోవడమే మరిచిపోయాను.

‘‘నీకెట్ల తెలుసు?’’ అన్నాను. లడ్డూ వద్దని వారిస్తూ. ఇంకా నోట్లో బ్రష్‌ కూడా వేయలేదు అందుకని.

‘‘మీ ఫ్రెండ్‌ను అడిగితే చెప్పిండు’’ అంది వెడల్పయిన తన కళ్లను గుండ్రంగా తిప్పుతూ. మళ్లీ తనే ‘‘నా బొమ్మ గీసి పెట్టవా? నువ్వు బాగా గీస్తావటగా..?’’ అంది కాస్త బతిమాలుతున్నట్టు ముఖం పెట్టి. ఇంత సేపటి నుంచి నేను కనీసం ఆమెను కూర్చొమ్మని కూడా అనలేకపోయాను. నేను కూర్చొమ్మన్నా ఆమె కూర్చునేలా లేదు. ఎందుకంటే తెల్లని లాంగ్‌ ఫ్రాక్‌ వేసుకొని దివి నుండి అప్పుడే దిగిన దేవకన్యలా ఉంది. ఎక్కడ చూసినా దుమ్ముతో నిండిపోయిన మా ఇంట్లో బహుశా ఆమె కూర్చోవడానికి సరైన చోటు లేదేమో కూడా.

‘‘రేపు ఈవినింగ్‌ అయిదు గంటకు కిలా వరంగల్‌ దగ్గరికి రా! అక్కడ నిన్ను చూస్తూ గీస్తాను’’ అన్నాను కాస్త భయంతోనే.

‘‘సరే! అలాగే వస్తాను కాని బొమ్మ మాత్రం తప్పకుండా గీసివ్వాలి.’’ అంది మొక నవ్వు నవ్వుతూ. ఆమె నవ్వులో ఎన్ని శరశ్చంద్రికలో…

***                        ***                        ***

నీలి రంగు ఆకాశంలో తెల్లని మేఘాలు  ప్రియురాలి రాక కోసం ఎదురు చూస్తున్న ప్రేమికుని మనసులా అటు ఇటూ గాబరాగా తిరుగాడుతున్నాయి… ఒకనాడు బిగువైన అందంతో ఎంతో ఒయ్యారాన్ని ఒలకబోసిన శిల్పాలన్నీ మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సైన్యపు దాడిలో ధ్వంసమై పోయి ప్రాణం లేని శవాల్లా పడి ఉన్నాయి… కిలా వరంగల్‌ను సందర్శించిన యాత్రికులు  పొందే ఆనందమెంతో గాని గాయపడిన హృదయంతో మాత్రం తిరిగి వెళ్తారు. ప్రైమరీ కలర్స్‌  రెడ్‌, బ్లూ, గ్రీన్‌ డబ్బాలతో పాటు బొమ్మ గీయడానికి వాడే ఒక రకమైన ఖాళీ కర్ర ఫ్రేంను ఒకదాన్ని వెంట తెచ్చుకొని విరిగిపోయిన శిలాస్తంభాన్ని ఒకదాన్ని ఆనుకొని కూర్చున్నాను. ఎదురుగా మరో స్తంభం మీది నగిషీలో ఎవరో యువతీ యువకులు ఏదో భంగిమలో రాసక్రీడలో మునిగి ఉన్నారు.  అనుకున్న సమయానికి అరగంట ఆస్యంగానైనా నిన్నటి అమ్మాయి వచ్చే సరిని నా మనసు  ఉబ్బితబ్బిబ్బైపోయింది… వస్తూ వస్తూనే నన్ను గట్టిగా కౌగిలించుకొనే సరికి నేను ఉక్కిరిబిక్కిరైపోయాను… వెన్నుపూసలో వణుకు మొదలైంది… ఆమె నరాలు కూడా ఏదో భయంతో వైబ్రేట్‌ కావడం తెలుస్తోంది…. కొన్ని సెకన్లయ్యాక నన్ను విడిచి పక్కనే ఉన్న రాతిపైన కూర్చొని ‘‘తొందరగా గియ్యి మళ్లీ నేను ఇంటికి పోవాలి’’ అంది భయం, సంతోషం కలిసిన ముఖం పెట్టి.

‘‘ఓకే..’’ అంటూ నేను వంగి కర్ర ఫ్రేం, బ్రష్‌ చేతిలోకి తీసుకుంటుంటే పొరపాటున నా కాలు తగిలి రెడ్‌ కర్‌ డబ్బా కింద పడి, మూత కూడా ఎగిరిపోయి రంగంతా ఎవరో ముక్కు చెక్కబడిన నర్తకి ఒంటి నిండా పడిపోయింది. ఆమె కళ్లు ఒక్కసారిగా ఎరుపు రంగు దాల్చాయి… బొమ్మ గీసిస్తాడని ఆత్రంగా చూస్తున్న అమ్మాయి కళ్లు కూడా ఎరుపెక్కాయి.

‘‘అబ్బా! బ్లూ, గ్రీన్‌ టూ కలర్స్ తోనే బొమ్మ పూర్తి కాదు. సారీ మరోసారి గీసి పెడతాను’’ అన్నాను నొచ్చుకుంటూనే.

ఆమె అదో రకమైన కోపంతో కూడిన చూపొకటి నా మీదికి విసిరేసి వేగంగా అడుగులు  వేస్తూ కదిలిపోతోంది… ఉగ్ర రూపం దాల్చిన నది ఏదో కిలా ముపులతో పాటు సాగిపోతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా తేరుకొని…

‘‘ఏయ్‌… నీ పేరు చెప్పవా?’’ అన్నాను గట్టిగా.

‘‘శరశ్చంద్రిక’’ అంది ఆమె అంతే గట్టిగా.

***                        ***                        ***

‘‘ఒరేయ్‌… డేవిసూ…! ఎవరో రెడ్డోళ్ల అమ్మాయిని ఎంటేసుకొని తిరుగుతున్నవంట వరంగల్‌ అంతా. వద్దురా… నాయినా…! నా మాటిను. మనమేమో కిరస్తానులం. వాళ్లేమో మడి, గుడి అంటూ  గుళ్లు, గోపురాలు, వ్రతాలు, నోములు  చేసుకునే ఇందువులు. వాళ్లకు మనకు ఎక్కడ కలుసుద్దిరా…?’’ అంది అమ్మ ఏ రాత్రో ఇంటికి వచ్చి షర్ట్‌ బటన్లు విప్పుతున్న నన్ను చూస్తూ.

‘‘ఏ.. ఊకో అమ్మా…! నేనేం ఎంటేసుకొని తిరుగుతలేను. ఆ అమ్మాయే నా వెంటబడి తిరుగుతుంది. కావాలంటే కల్సినప్పుడు అడుగు. లేదంటే నేనే ఇంటికి తీసుకొచ్చి నీతో చెప్పిస్తా. అంతేగాని ఇండ్ల నాదేదో తప్పయినట్టు ఊకే నన్ను తిట్టకు’’ అన్నాను. ప్యాంట్‌ కూడా విప్పి లుంగీ  కట్టుకుంటూ కాస్త కోపంగానే.

‘‘వాళ్ల అమ్మా, నాయినకు తెలిస్తే సంపేస్తార్రా… నీకు తెల్వది రెడ్డోళ్ల జిద్దు. పరువు పోతుందంటే ఎవ్వల మెడనైనా నరకడానికి ఎనుకాడరు వాళ్లు. నీ దయరా! నా మాటిను. మాకు నువ్వొక్కనివే. నువ్వు కూడా మమ్ముల్ని ఇడ్సిపెట్టిపోతే ఇంక మేమెందుకు రా! బతికి. అయిందానికి అందరం ఒక్కసారే సద్దాం..!’’ అంది అమ్మ ఏడుపు మొదలుపెట్టి.

‘‘నువ్వూకోయే… నీకేం తెల్వది పీకది. ఆమెనే రోజూ ‘బొమ్మ గీసియ్‌.. బొమ్మ గీసియ్‌…’ అని మా షాప్‌ చుట్టు తిరిగిపోతుంది. అంతేగని నేనెప్పుడూ వాళ్ల ఇంటికి కాదుగదా! వాళ్ల వాడకట్టుకు కూడా పోలే. కావాంటే మా దోస్తులను ఎవ్వల్నయినా అడుగు.’’

ఆ రాత్రి ఎందుకో నా మనసు పరిపరి విధాలా పోయింది. ‘నాకు తెలియకుండానే ఏదో ఊబిలో కూరుకుపోతలేను కదా!’ అని.

***                        ***                        ***

డిసెంబర్‌ మాసం వెన్నెల  వెండి తీగలై సాగుతూ మహాబలిపురం బీచ్‌లోని బంగారు ఇసుక తిన్నెలపై  కన్నెపిల్ల మనసులా పడి మెరిసిపోతోంది…తీరం వెంబడి పల్లవులు నిర్మించిన పంచ రథ ఆలయాలు, అక్కడి రాతి ఏనుగులు, నాట్యకత్తెలు నిశ్శబ్దంగా సముద్రపు సవ్వడిని వింటున్నాయి… నేను, శరశ్చంద్రిక ఇంటి నుండి పారిపోయి దొరికిన ట్రైన్‌ పట్టుకొని మహాబలిపురంలో దిగే సరికి రాత్రి పదకొండు గంటలు దాటి ఉంటుంది. మా భయానికి తోడు చలి కూడా తోడవడంతో విపరీతంగా వణికిపోతున్నాం. ఎక్కడో దూరంగా నెగడు కనిపిస్తే చేతుల్లోని బ్యాగుల్ని మరింత గట్టిగా పట్టుకొని అటువైపు అడుగులు వేశాం. నెగడు పక్కన ఎవరో పాతికేళ్ల యువతి రెడ్‌, గ్రీన్‌ కలిపితే వచ్చే రంగు చీర కట్టుకొని ఇంకెవరో స్త్రీకి మణికట్టు మీద సూదులతో నెలవంకను పచ్చబొట్టుగా చెక్కుతుంది.. నెగడు దగ్గర కొంత దూరంగా నిలబడ్డ మమ్మల్ని చూసి తెలుగు  వాళ్లమని ఎలా గుర్తు పట్టిందో…

‘‘కూర్చోండి బాబు’’ అంది. మేం కొంత ధైర్యం  చేసి అక్కడ కూర్చోగానే…

‘‘ఇంటి నుండి పారిపోయి వచ్చారా?’’ అంది. మా పై ప్రాణాు పైకే పోయాయి. ఈమెకెలా తెల్సిపోయిందని. ‘కొంపదీసి శరశ్చంద్రిక బంధువులు మాకంటే ముందే మేమెక్కడి పోతున్నామో తెలుసుకొని ఇక్కడికి గాని వచ్చారా?’ అని భయమేసింది కూడా. అయినా చెదరని ధైర్యంతో…

‘‘మేం ఇద్దరం ఒకర్నొకరం ప్రేమించుకున్నాం. తల్లిదండ్రులు కాదనడంతో పారిపోయి వచ్చాం’’ అని అసలు  సంగతి చెప్పేశాను. ఆమె నవ్వి పరవాలేదు. ఏం భయపడకండి. ఈ అన్నెమ్మ ఉంది మీకు.’’ అని ధైర్యం చెప్పడంతో కొంత స్థిమిత పడ్డాం.

‘‘నేను కూడా పచ్చబొట్టు వేయించుకుంటాను’’ అంది శరశ్చంద్రిక. ఆమె ముఖంలో భయమంతా వీడిపోయి ఏదో సంతోషపు వీచిక తొణికిసలాడుతోంది… వెంటనే అన్నెమ్మ లేచి కాస్త దూరంలో ఉన్న గుడిసెలోంచి ఒక గిన్నెలో ఏదో పౌడర్‌, కొన్ని కొత్త సూదు తీసుకొచ్చి మా ఎదురుగానే ఆ పౌడర్‌లో తన రొమ్ము పాలు పిండి తగు మోతాదులో కుపుకుంది. సరిపోలేదేమో కొంచెం దూరం నుండి కాసిన్ని మంచు బిందువుల్ని తెచ్చి కలిపి నేను ఆశ్చర్యం నుండి తేరుకోక ముందే ‘మహర్షి’ అని శరశ్చంద్రిక గుండెల మీద సూదులతో రాయడం మొదలుపెట్టింది. ఎవరైనా చూస్తారని శరశ్చంద్రిక పచ్చబొట్టును అక్కడ  పొడిపించుకోవడం చూసి నేను స్థాణువునైపోయాను.

‘‘సీతమ్మవారి జాడ చెప్పరే జాజి మల్లెలా.. జాజి మల్లెలా..

శ్రీరాములవారి తెగువ చూపరే జాజి మల్లెలా.. జాజి మల్లెలా…’’

అని అన్నెమ్మ రాగం తీస్తూ పాట పాడుతుంటే శరశ్చంద్రిక నొప్పి తెలియకుండా కళ్లు మూసుకుంది… ఆ రాత్రి, ఆ  వెన్నెలతో పాటు గూళ్లలో మిథునరాగంతో ఒదిగి పడుకున్న గువ్వలు కూడా అన్నెమ్మ పాటకు పరవశించి పోతున్నాయి… తరువాత నేను కూడా మోచేతి లోపలి భాగంలో ‘శరశ్చంద్రిక’ అని రాయించుకుని పదే పదే తడుముకున్నాను…

‘‘ఈ రాత్రికి ఆ గుడిసెలో పడుకోండి. మిగతా సంగతి తెల్లవారి చూద్దాం!’’ అని అన్నెమ్మ వెళ్లిపోయింది. ఆ రాత్రి ‘శరశ్చంద్రిక’ పదహారు కళలూ నావే. ఏ వేకువ జామునో చెమటతో తడిసిపోయి, అలసిపోయి సేదతీరుతున్న మా తనువులు గుడిసె బయటకు వచ్చి వెన్నెలను తాగుతున్నాయి. నేను వెంటనే నా రంగు డబ్బాలు, కర్ర ఫ్రేం, బ్రష్‌ తీసి నా ఎదురుగా నగ్నంగా కూర్చున్న శరశ్చంద్రిక బొమ్మ వేయడం ప్రారంభించాను. కలయిక వల్ల  ఊరిన చెమటను    కలపడంతోనేమో శరశ్చంద్రిక బొమ్మ అందంగా రావడమే కాదు, అచ్చు ఆమె రంగుతో వన్నెలీనుతోంది. శరశ్చంద్రిక మళ్లీ ఒకసారి నన్ను గట్టిగా అల్లుకుపోయింది. బొమ్మ కింద ‘మహర్షి ఆర్ట్స్‌’ అని రాసిన అక్షరాలను చూసి నా తనువూ, మనసూ ఎంతో గర్వంగా పొంగిపోయాయి.

రోజులు శీతాకాలపు పగళ్లలా చాలా తొందరగా గడిచిపోతున్నాయి. శ్రీదేవి కటౌట్‌లో మిగిలిన అయిదు వేలు ఎప్పుడో కరిగిపోయాయి. మెల్లమెల్లగా శరశ్చంద్రిక ఒంటి మీది పసిడి నగలు కూడా తరిగిపోతున్నాయి… అప్పుడే నెల  రోజులు కావస్తోంది మేం ఇంటి నుండి దూరంగా వచ్చి.

 

***                        ***                        ***

ఈ నెల రోజులు శరశ్చంద్రిక బంధువులు అన్ని ఊర్లను జల్లెడ పట్టారు. ఎవరో ఉప్పందిస్తే చివరికి మేమున్న చోటు కనిపెట్టి మమ్మల్ని హన్మకొండకు తీసుకెళ్లి ‘‘మీరిప్పుడు మైనర్లు. మేజర్లయ్యాక పెళ్లి చేస్తాం లే’’ అని శరశ్చంద్రికను బుజ్జగించి వాళ్లింటికి తీసుకెళ్లారు. నా మీద మాత్రం పోలీసు కేసులు  పెట్టి కుళ్ల పొడిపించారు. వాళ్లు పెట్టిన థర్డ్‌ డిగ్రీని భరించలేక నేను పెట్టిన కేకలకు జైలు గోడలు బీటలు  వారిపోయాయి. నూలు  పోగంత ఉండే నరాలు  రోకలి బండలు  ఎక్కించినందుకు, లాఠీ దెబ్బలు  తినీ తినీ ఉబ్బిపోయి పోలీసు లాఠీ అంత వాచిపోయాయి. చాలా ఏళ్లు కనీసం నడవలేకపోయాను… ఎన్నో ఏళ్ల తరువాత అనుకోకుండా కలిసిన శరశ్చంద్రిక తనను ఎవరో మిలట్రీ వాడికిచ్చి పెళ్లి చేసినట్టు చెప్పి ఏడుస్తూ వాడు తన గుండెల్ని ఎర్రగా కాల్చిన ఇనుప కమ్మీతో ఎలా పచ్చబొట్టుపై కాల్చేశాడో చూపిస్తే నేను దేహమంతా దు:ఖ సముద్రమై కూలిపోయాను…

***                        ***                        ***

మనసేదో కీడు శంకించడంతో ఒక్కసారిగా ముందున్న అన్నాన్ని పక్కకు తోసేసి వేగంగా ఎమర్జెన్సీ వార్డులోకి పరుగెత్తాడు డేవిస్‌. అప్పటికే తన కొడుకును స్ట్రెచర్‌ మీదికి ఎక్కించి మార్చురీలోకి తరలిస్తుండడంతో కుప్పకూలిపోయాడు. బొడ్డుపేగు తెగిపోయిన బాధ ఒక్కసారి రక్తమంతా పర్చుకుంటోంది…

——

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • A beautiful story appears to be mythical but the theme is basical to our day to day reality of our stratified,inequal,pollution purity,high low ,touchable untouchable and feudal social order centric CASTE values…however the closing can’t be a pleasant one since that would go against the letter and spirit of the inhuman and inhumane caste centric Hindu social order… the beti vyavahaar and beti vyavahaar are the soul and body of the CASTE centric social hierarchy….any violation of this would invite death and destruction…..and your story is an attempt to show the society that there’s no room for any PROGRESS or Change!!!! Dr ji , nice of you for sharing this classic piece of humanity with me…Good day….What BABASAAHEB visualized for India to be free of Malignant Cancerous Caste is a mirage going by the unending and ever increasing (DIS)honour holocaust!!!

 • Excellent story. Moving and thought provoking. Indian society de facto legislates on love primarily to preserve the predatory caste system. If young people are freely allowed to choose their life partners, the caste system would disappear within a couple of generations. And along with it will go all the evils attendant on it.

 • శ్రీధర్ వెల్దండి గారూ ..కథ బాగుంది..కొన్ని వాస్తవ సంఘటనలకు అద్దం పడుతుంది..కానీ ఇలాంటి సమస్యలకు చావే పరిష్కారము అనిపించేలా ఉంది.

 • నమస్కారం లతో
  కథను అర్ధాంతరంగా ముగించి నట్లనిపించింది.
  సామెల్ ను చంపడం బాగాలేదు.అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు ఇద్దరు ఓడినట్లయ్యింది.
  కనీసం ముగింపు లో నైన బాధ తో పాటే ఇటువంటి వాటినెదురించి పోరాడి గెలవాలనే తెగింపు రక్తమంత పర్చుకుంటోంది అంటే చైతన్య వంతంగా ఉండి రచయిత గా సమాజం పట్ల మీ బాధ్యత కూడా స్పష్టమయ్యేదేమో!
  రచన లో చెట్లు కూడా చలిస్తున్నాయి.
  పాదాలతో నలుగుతున్నాయి వంటి వర్ణనలు బాగున్నాయి.ఇంత మంచి తెలుగు పదాలతో రాయగల మీరు వెహికిల్ అనడం అలవాటు లో పొరపాటు అనిపించింది.
  ఇంకా మంచి మంచి కథ లు అందించాలని ఆశిస్తూ అభినందనలు మరియు ధన్యవాదములు

 • నమస్కారం లతో
  కథను అర్ధాంతరంగా ముగిసినట్లేననిపించింది.
  అప్పుడు తండ్రి ని ఇప్పుడు కొడుకును కూడా ఓడించి రద్దయింది.ముగింపు లో కొంచెం చైతన్య వంతంగా తెగింపు రక్తమంత పరుచుకుంది అంటే బాగుండేది.రచయిత గా సమాజం పట్ల మీ బాధ్యత కు అద్దం పట్టే దేమో!
  చెట్లు చలించడం ,రోడ్లు పాదాలతో నలుగడం వంటి భాష ప్రయోగాలు బాగున్నాయి.
  పెద్దావిడ అన్నారు.మళ్ళీ రొమ్ము పాలు కలిపిందన్నారు.ఇది కొంచెం అర్థం కాలేదు
  మంచి తెలుగు రాయగల మీరు వెహికిల్ వంటి పదాలు రాయడం అలవాటు లో పొరపాటు అనిపించింది.
  ఇంకా మంచి మంచి కథ లు అందించాలని ఆశిస్తూ అభినందనలు మరియు ధన్యవాదములు

 • శ్రీధర్ సార్. ఈ కథనే కొంచెం టైం తీసుకుని ఇంకొంచెం విస్తరించి రాసి ఉంటే ఒక గొప్ప క్లాసిక్ కథ అయ్యుండేది‌‌. మహాబలిపురం ఎపిసోడ్ సూపర్.
  మంచి ఇతివృత్తం. మీలో మంచి విమర్శకుడే కాదు, మంచి కథకుడూ ఉన్నారు.

 • నమస్కారం సార్ ,
  ఈ కథపై నేను చెప్పదలచుకున్న మొదటి విషయం ‘ కథ ఆద్యంతం ఆసక్తిగా చదివించగలిగిన తీరు చాలా చక్కగా ఉంది .గతాన్ని గుర్తుచేస్తూ వర్తమానంలో కథని నడిపించిన విధానం ఇంకా చాలా బాగుంది .
  కథని చదువుతుంటే యదార్థమైన సంఘటనగా స్ఫురిస్తుంది .ఇక రెండవ విషయం కథలో నాయకుడు డేవిస్ అని నేను భావిస్తున్న ,
  నాయికా, నాయకుల మధ్య సంభాషణా చాలా స్వల్పంగా ఉంది మరియు నాయికా , నాయకునికీ అంత తొందరగా పడిపోవడానికి సరైనా కారణం తెలుపులేరనేది నా అభిప్రాయం .చివరిగా
  ఇలాంటి సమస్య నిజంగా జరిగిందే అని అనుకుంటే దానికి మీరు కథలో పరిష్కారం చెప్తారని చూసా , కానీ సమస్య పరిష్కారం కాకుండానే కథ ముగిసింది
  మొత్తానికి నేటి కాలానికి సరిగ్గా సరిపోయే కథ ఇది అని నా గట్టి అభిప్రాయం సార్

  -ఘనపురం సుదర్శన్
  పరిశోధక విద్యార్థి
  ఓయూ .

 • కథలో ఆర్టిస్ట్ జీవితం గురించి తీసుకున్న ప్రేమ బావుంది.
  ఆఖరులో ముగింపు త్వరగా ముగించినట్టుంది
  పచ్చబొట్టును అమ్మాయి యదమీద పొడిపించుకుంది అంటే వారిమధ్య ప్రేమను మరింత బలంగా కొంత చెప్పి ఉంటే బాగుండేది.
  శ్రీధరుకు అభినందనలు.

 • శ్రీధర్ వెల్దండి గారి “గుండె కింది తడి” కధకు స్పందిస్తూ … కధా మూలాంశాన్ని, అది ప్రశ్నిస్తున్న సామాజిక స్థితిగతులను అర్ధం చేసుకోవటానికి ఉపయోగపడేలా ఉన్న విలువైన అభిప్రాయాలు, సద్విమర్శలు వెలిబుచ్చిన రావుల కిరణ్మయి, ఘనపురం సుదర్శన్, చందు తులసి గార్లకు నెనర్లు.

  శ్రీధర్ గారి నుండి ఇంకా మంచి కథలు ఆశిస్తూ వారికి అభినందనలు మరియు ధన్యవాదములు.

  యీ మధ్యే ఇండ్ల చంద్రశేఖర్ రాసిన “ పచ్చాకు సీజను “ కధ గుర్తుకొస్తున్నాది యీ సందర్భం లో.

  “సాంకేతిక విప్లవంలో ఉన్న మనం ఇప్పటికైనా డీక్యాస్టీఫై కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నాయి. ఆధునికత వస్తువుల్లో, వేష, భాషల్లో కాదు మనిషి సంస్కారంలో, పరివర్తనలో, ప్రయాణంలో ఉండాలని మన దళసరి చర్మాన్ని, మనసును ʹదబ్బనాలʹతో కుచ్చి మరీ చెప్తాయి. ఇంకా మారకపోతే ఆత్మలోకంలో మనల్ని వెలివేస్తాయి. నిప్పుల కుంపట్లను నెత్తి మీద కుమ్మరించి కుదిపేస్తాయి. “ డా. పసునూరి రవీందర్ కథల సంపుటి ʹఅవుటాఫ్ కవరేజ్ ఏరియాʹ కు శ్రీధర్ వెల్దండి గారు రాసిన సమీక్ష నుండి.

  భారత రాజ్యాంగం ప్రామాణికంగా సమసమాజ నిర్మాణం ( inclusive growth ) కోసం కలలు కన్న, శ్రమించిన నాయకులెందరో మనకున్నా వాస్తవంలో పురోగతి ఇంత నత్తనడక నడవటానికి మూల కారణం ఏవిటీ అనే దాన్ని గురించి మా గొరుసన్ననో, గద్దరన్ననో అడిగి తెలుసుకోవాలని ఉంది. ఇది కేవలం కులవ్యవస్త ఉక్కుపిడికిలి వల్లనా? అట్టడుగు వర్గం వరకూ విస్తరించని విద్య, ఆర్ధికవనర్లు, వర్గ చైతన్యం లేకపోవటం వల్లన్నా?

  ~ ఇట్లు గొరుసన్న గారి తంపులమారి రావయ్య

 • కథను చదివి విలువైన సూచనలను చేసిన సహృదయ పాఠకులకు, ప్రచురించిన సారంగకు ధన్యవాదాలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు