గద్దెత్కపోయిన దళితుల బతుకమ్మ

‘జూపాక సుభద్ర అట్టడుగు సమూహాల అక్షర శిల్పి. తన కథల్లో అత్యంత అణగారిన సమాజాలను జీవింపజేసే సృజనకారి. కవయిత్రిగా, కథకురాలిగా, కాలమిస్ట్ గా, వ్యాసకర్తగా, అనువాదకురాలిగా, పరిశోధకురాలిగా, నాయకురాలిగా, అత్యుత్తమ వక్తగా, సంఘ సేవకురాలిగా, ప్రభుత్వ ఉన్నతాధికారిగా, సుభద్ర బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో ప్రజల్లో ఉన్నారు.’ సుభద్ర ఇప్పటిదాకా 2009లో ‘అయ్యయ్యో దమ్మక్కా! అనే కవితా సంపుటిని, -2014లో ‘రాయక్క మాన్యం’ అనే కథా సంపుటిని వెలువరించారు. భూమిక స్త్రీ వాద మాస పత్రికలో ‘మాక్క ముక్కు పుల్ల గీన్నే జారిపోయింది’ అనే కాలమ్ ను నిర్వహించారు. ‘చంద్రశ్రీ యాదిలో’ పుస్తకానికి సంపాదకత్వం వహించారు. ‘నల్లరేగడిసాల్లు’, ‘కైతునకల దండెం’, ‘కమ్యూనిజమా కోస్తా వాదమా?’ గ్రంధాలకు సహ సంపాదకత్వం వహించారు. ‘సంగది’ అనే తమిళ నవలను ‘సంగతి’ పేర ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేశారు. ఎన్నో పురస్కారాలను పొంది, ఎన్నో మహాసభల్లో మాట్లాడారు. పలు సంస్థలను స్థాపించడంలో కీలక భూమిక పోషించారు. తన కథల్లో ‘తెలంగాణ అణగారిన గ్రామీణ జనం మానవ గౌరవం, మెరుగైన జీవనం, మార్పు కోసం పడే తండ్లాటలను గొప్పగా చిత్రించారు. అంచులకు, అడుగుకు, వెనుకకు నెట్టబడిన జీవితాలు ఆమె కథల్లో కనిపిస్తాయి. తెలంగాణ మట్టి మనుషుల జీవ భాషలోని నుడి, వడి, పలుకుబడుల మాధుర్యం’ ఆమె కథల్లో పుష్కలంగా దొరుకుతుంది. ఈమె రాసినవన్నీ దళిత మహిళల కథలే. అందులో తెలంగాణ సాంస్కృతిక చిహ్నం, తెలంగాణ రాష్ట్ర పండుగ, పూల పండుగ బతుకమ్మ పండుగ దళితులకు ఎందుకు లేదో చర్చిస్తూ రాసిన గొప్ప ఆలోచనాత్మక కథ ‘గద్దెత్కపోయిన బతుకమ్మ’.

ఆ రోజు సద్దుల బతుకమ్మ. ‘’సెరువు సుట్టు గుంపులు గుంపులుగ సిల్కు సీరెలు, పూల సీరెలు, మెరుపు సీరెలు, సప్పట్లతోటి, పాటల్తోటి సెరువు నీళ్ళు గూడ తపుకు తపుకు మనుకుంట దరువు గలుపుతున్నయి. ఏంది దేవక్కా మీవోల్లు గా కింది మొకాన అడ్తాంటే నువ్వు గీడున్నవేంది? గౌండ్ల రామన్నడిగిండు. సెరువు కొమ్ము దిక్కు వచ్చిన దేవమ్మను జూసి.

“అగ్గో గదేమ్మాటే.. గామె గీ వూరికి సర్పంచి, గామెకిష్టమైన గుంపుకు బోయి ఆడ్తది, పాడ్తది. నిలుసున్నవేంది దేవక్కా పో ఆ గుంపుకు పోయి ఆడుపో” అన్నడు వీరేశం అనే యూత్ పిలగాడు.

“ఏ.. పిలగా సదువుకున్న మాటలా… గాల్లు బత్కమ్మాడొద్దు ఎరికేనా… వూరికి సర్పంచే కావచ్చు. బతుకమ్మగ్గాదు.”

“అగ్గో వాళ్లెందుకాడద్దే…”

“ఎందుకంటే ఆల్ల కులంల ఎవతో గర్కాసి చేసిన లెక్కలకు ఆల్లు బత్కమ్మాడకుంటైండ్రు. అన్నడు గౌండ్ల రామన్న దీర్గిచ్చి. దేవమ్మకు ఆ మాటలు కడుపుల గడ్డపారేసి దిగేసినట్లైంది”.

“ఓ… రామన్నా జెర మంచిగ మాట్లాడు. మా కులపామెను నా ముందట్నే ఎవతో గర్కాసిదంటవేంది. మీరే మా బతుకమ్మను మాగ్గాకుంట జేసిండ్రు. అని సర్పంచి దేవమ్మ నోరు నెత్తిన వెట్టుకోంగనే జనం గుంపైండ్రు. మాట మాట పెరిగింది. క్షణాల్లోనే మీకు బతుకమ్మ లేదు ఆడొద్దని ఒక గ్రూపు, ఆడి తీరుతామని మరొక గ్రూపు రెండు గ్రూపులుగా విడిపోయారు.

దేవమ్మ ఆ వూరికి సర్పంచిగా తెలంగాణ పార్టీ నుంచి గెలిచింది. పార్టీ పిలుపు మేరకు బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున వూరు, వాడా జరపాలని నిర్ణయం తీసుకుంది. కాని మీకు బతుకమ్మ ఆడే రివాజు లేదుగదా! ఎట్లాడుతరు అని వూరు వాళ్ళు ప్రశ్నిస్తారు. దేవమ్మకు చాలా కష్టమనిపించింది. “మాతోని పనులు చేయించుకునేకాడ కులం లేదు గాని… మేము ఏర్కచ్చి ఇచ్చిన బతుకమ్మ పూలకు కులం లేదు గాని… మేం బత్కమ్మలను ఆడుకునే కాన్నే కులం తక్కువైంది. మేమేమన్నా కల్సి ఆడ్తమన్నమా అనుకున్నది. అయినా పట్టువట్టి శానా పూలు దెప్పించింది. గూడెంలల్ల గూడ వేర్వేరు వాడలున్న మాదిగ, మన్నెపోల్లనేగాక డక్కలి, చిందు, మాష్టి, బైండ్ల ఆడోళ్లందరిని గూడేసి బత్కమ్మలు పట్టిచ్చి డప్పుల్తోని సెరువు కిందికి పైనంజేయించింది. గది సూసి వూరు గిస గిస కొట్టుకున్నది. కడుపు కుత కుత ఉడికింది.”

కడుపారా ఆడుకొని, పాడుకొని చివరికి బత్కమ్మను నీల్లేసుకుంట ‘పో పో బత్కమ్మ పొయ్యిరా బత్కమ్మా.. పొద్దు వాయే బత్కమ్మా.. మల్లరా… బత్కమ్మా’ అని బత్కమ్మను సాగదోలిండ్రు. తిరిగి ఇంటికి వస్తుంటే దేవమ్మ బిడ్డ స్వాతి వాళ్ళ నాయినమ్మను ‘మనకు బతుకమ్మల్లేవట ఆడద్దని లొల్లి వెట్టిండ్రు” ఎందుకే అని అడుగుతుంది.

“ఏమున్నదే ఎన్నడో ఎనుకట గీ బతుకమ్మలు మొదుగాల ఆడింది మాదిగాడోల్లెనట. ఊరోళ్ళు దగ్గెర్రానియ్యని, సిగెల బెట్టుకోని, దండ గుచ్చనీకి గూడ దూరముంచిన తంగేడు, జిల్లేడు, గునుగు, కట్ల పూలసొంటి పూలను సిబ్బిల పేర్చి బత్కిచ్చి ఆడి, పాడి బత్కమ్మను జేసింది మాదిగ వాడోల్లేనని సెప్తరు మనోళ్ళు.” ఇంట్ల పిడికెడు గింజలు కూడా లేని ఒక గూడెపామె ఓ నాడు బత్కమ్మను పేర్చి తీసుక పోతూ పంచి పెట్టనీకి ఏమీ లేక దండెం మీదున్న దొబ్బ తునుకను తీసుకుపోయింది. సెరువుకాడికి గద్దచ్చి ఆ దొబ్బను ఎత్తుక పోయిందట. “గది జూసి వూరోల్లంత సీ.. సీ.. ఏమ్మనుషులే మీరు. బత్కమ్మ మీద దొబ్బను బెడ్తారే? గద్దెత్కపోయింది మీ దొబ్బనుగాదు. మీ బత్కమ్మనే ఎత్కపోయింది. ఈ కాన్నుంచి మీరు బత్కమ్మాడద్దు. బత్కమ్మను బదునాం జేయొద్దు. బందువెట్టుండ్రి. అని కరాకండిగా తీర్మాణం జేసిండ్రట.” అని దళితులకు బతుకమ్మ పండుగ ఎందుకు లేదో వివరంగా చెప్పింది.

“నీ యవ్వా.. గా సిన్నదానికి గింత పెద్ద బత్కమ్మనొద్దంటారే.” ముసలవ్వా ఇగ గాళ్ళెవరడ్డమొచ్చినా, వద్దన్నా.. మేమైతే గీ బత్కమ్మ ఆడ్తనే వుంటాం సూడు. కాయంగా చెప్పింది స్వాతి.”

తెలంగాణ సాంస్కృతిక మూలాలను, దళితుల రాజకీయాధికారాన్ని ప్రశ్నల బోనులో నిలబెట్టిన కథ ఇది. సవర్ణులు జరుపుకునే బతుకమ్మ పండుగ దళితులకు ఎందుకు లేదో చెప్తూనే అన్యాయపు చరిత్రను కాల రాసి ఇక నుంచైనా బతుకమ్మ పండుగను జరుపుకొని తీరుతామని ఒక చైతన్యాన్ని నింపే కథ. “కష్టం జేసుకునే ఆడోల్లు ఏడు ముట్టెల్ల కాలం పాత సీరెలు, సినిగిన సీరెలు, బురద, మట్టి, సెమటతోనే తెల్లార్తరు. గీ పండుగచ్చిందంటే సిల్కు సీరెలు, సీటీ సీరెలు గట్టుకొని కడుపుల దాసుకున్న పాటలన్ని సంబురాలన్ని సప్పట్లతోని కలుపుకుంటరు.” కాని దళితులకు ఆ అవకాశం కూడా లేక పోతే ఎట్లా అని అడుగుతుంది ఈ రచయిత్రి. సర్పంచిగా రాజకీయాధికారం ద్వారా సవర్ణులు మాత్రమే జరుపుకునే బతుకమ్మను వెలి వాడకు కూడా తీసుకుపోదామని ఆ గ్రామ సర్పంచి దేవమ్మ చేసిన ప్రయత్నాన్ని సవర్ణ కులస్థులు అడ్డుకునే విధానం చర్చనీయాంశంగా నిలిచిపోతుంది. “మీకు బత్కమ్మ లేకున్నా జిద్దుకు ఆడవడితిరి మా మీద పోటీకి. గా పాపానికే సెరువుల్ల, కుంటల్ల నీల్లెండుక పోతన్నయి” అని అంటారు గ్రామస్తులు. కాని కొత్త తరం పిల్లలు బతుకమ్మ అడుడు అడుడే “రామ రామ రామ ఉయ్యాలో.. రామనే సీ రామ ఉయ్యాలో..” అని ఇంకా పాత పాటలు కాదు ఇప్పుడు రావణుని పాటలు పాడుతామని చెప్పడం వారిలో వచ్చిన స్పూర్తి దాయకమైన చైతన్యానికి నిదర్శనం. దళితులకు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించి వాళ్ళను అధికారంలోకి తీసుకురావడాన్ని మనమింకా పూర్తి స్థాయిలో జీర్ణం చేసుకోలేక పోతున్నామా? అని మనల్ని మనం ఒక సారి ప్రశ్నించుకోవాల్సి ఉంది. “ఏ… ఎవనికిరా సర్పంచి.. గదో సర్పంచి దానికో నీలుగుడు. నీయవ్వా సర్కారుకు సిగ్గుండాలె. గొడ్డు తునకల్దినే మాల మాదుగుల్నిమా తల్కాయల మీన గూసోబెట్టి తమాషా జూత్తుంది.” అని ఈసడించుకుంటారు. ఈ సంభాషణ సవర్ణుల అసహనాన్ని ముక్కు మీద గుద్దినట్లు చెప్తుంది.

కథలో వాడిన తెలంగాణ తెలుగులోని దళిత మాండలికం విన సొంపుగా ఉంటుంది. సందర్భానుగుణంగా ప్రయోగించిన “సెరువు సలికాలం ముసలమ్మ తోలోలె దగ్గెరవడ్డది”, “సంక పిల్లలు మొగోల్ల సంకలెక్కి ఎగురుకుంట మొగ్గ సేతుల్ని పూలోలె యిచ్చుకొని సప్పుడురాని సప్పట్లు కొడ్తండ్రు”, “కట్టెకు పుల్లోలె సదిరి సెప్పిండు”, “సందమామ అసోంటి పూలతోని పేర్సిన తీరొక్క పూల బత్కమ్మ”లాంటి ఉపమానాలు రచయిత్రి భావనా బలాన్ని పట్టి చూపుతాయి. శిల్ప పరంగా కూడా చాలా ఉన్నతమైన కథ ఇది. వర్తమానం, గతం, వర్తమానం టెక్నిక్ తో సాగి పోయే కథే అయినా పాఠకుడి గుండెను బతుకమ్మలా సప్త వర్ణ శోభితం చేస్తుంది. ఇదొక నయా దళిత వాద కథ. ఊరుకు, వాడకు మధ్య నలిగే దళిత జీవితం, సంఘర్షణ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అన్ని పండుగలు ఇంట్లో జరుపుకుంటాం. ఒక్క బతుకమ్మ పండుగను మాత్రమే సామూహికంగా ఇంటి బయట జరుపుకుంటాం. అలాంటి పండుగకు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో దళితులు దూరంగా ఉండడం శోచనీయం. మానవ పరిణామ గతిలో ఇన్నేండ్లు గడిచినా ఇంకా మనం మానసికంగా, సాంస్కృతికంగా ఎదగాలని ఒక కొత్త చూపును కలిగించే ఈ కథ ఎప్పటికీ నిల్చిపోతుంది.

*

Jupaka Subhadra story

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • గద్దెతుకపోయిన బతుకమ్మ కథలో శుభద్రగరు గొప్ప తెలంగాణ మాండలికం లో ఉత్పతి కులాల వాళ్ళకి బతుకమ్మ ఎందుకు లేదో చాలా బాగా విశ్లేషించారు.గ్రామాల్లో ఆధిపత్య .,కులాల రాజకీయాల్లో బతుకమ్మని కూడా ఎలా అంటరాని దానిగా చేశారో చెప్పారు.శ్రీధర్ గారు మంచి విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు అభినందనలు

 • మంచిగుంది శ్రీధర్…. బడుగుల, బహుజనుల భావాలను ఉన్నదున్నట్టుగ రాసిన అక్కకు, అండ్ల ఉన్న అసలు ముచ్చటను బయటవెట్టిన నీకు దండాలు….

 • Sir namaste…chalaa manchi sandesaanniche visleshananu chesinanduku dhanyavaadaalu.. subhadra madam gaari katha rachanalu society ni prasninche tatvaani nerpe spoorthy…thank u sir..

 • జూపాక సుభద్ర గారు రాసిన కథ గద్దెత్తుకుపోయిన బతుకమ్మ కథా విశ్లేషణ చాలా బాగా రాశారు
  కథను క్లుప్తంగా చెప్పడం చాలా బాగుంది

 • సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా
  గద్దె త్క పోయిన బత్కమ్మని ఎంచుకొని
  ఆ కథ చుట్టున్న కుల రాజకీయాల్ని
  కథతో పాటు విశ్లేషణ చేసిన
  శ్రీధర్ వెల్దం డి గారికి Thanks.

 • ఆధిపత్య కులాలు కొన్ని వర్గాలను దూరం పెట్టడం కోసం కొన్ని కథలనూ అబద్దపు వంటలనూ వండి వారుస్తారు. దేవతలు ఆవుని కోసి వండుకునే క్రమం లో కింద జారి పడ్డ తునక మళ్ళీ ఆ పాత్రలో వేసాడు అనే నెపంతో కుల వివక్ష మొదలు పెట్టారు అని అంటరాని వసంతం లో చదువుకున్నాం. ఇప్పుడు దొబ్బ. గద్ద బతుకమ్మ ను దళితుల కు దూరం చేసింది.
  బతుకు లెనోళ్లకు బతుకమ్మ లేదా ??
  బతుకమ్మ పేరు నేను యూనివర్సిటీ కి వచ్చాకే విన్నా. ఎందుకంటె అటేడు ఇటేడు తరాల లో ఇంట్లో కి , ఇంకా మాట్లాడితే మా వాడ కట్టులోకి రాని అంటరాని క్రతువు అది. కారణం ఈనాటికీ తెలియదు. అమ్మను అడిగితే కూడా ఏమీ చెప్పలేదు కానీ ఊరిలో శూద్ర కులాలు గడీలో బతుకమ్మ ను ఆడడం అనే యాది చెప్పింది.
  సప్పిడి బువ్వ తినే బ్రతుకుల్లోకి పూల కేరింతలు రంగవళ్ళు లు కావాలనే రాలేదు అనిపించింది. నాకు తెలిసి బతుకమ్మ ఒక మృత్యు పండగ అమరవీరుల వారోత్సవాల జరిపినట్టు వారం రోజులు జరిగే ఆ క్రతువు నిత్య గాయాల బ్రతుకుల్లోకి యాడాదికి ఒకసారి రావడం కన్నా గడియ గడియకూ ఒక మృత్యు జ్ఞాపకం ఉన్న బ్రతుకుల్లోకి వచ్చే బతుకమ్మ ద్వారా అదనంగా పొందే స్వాంతన లేదు.
  మేము శైవులం అని ముఖ్యంగా అక్క మహాదేవి లేదా దున్న ఇద్దాసు ఆరాధన ఉన్నట్టు మా ఇంట్లో ఉన్న ఈదెమ్మ( ఇద్దాసు) సంగయ్య,సాయయ్య,లచ్చయ్య, లచ్చమ్మ, పేర్లను బట్టి తెలుస్తోంది. ఆచరణ రీత్యా శాక్తేయ పరంపర ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. పెళ్లిళ్ల సమయం లో వీరులను( ఈరులను) కొలవడం ఉంది. బతుకమ్మ ను బహుశా దుర్గమ్మ ను చేశారు కనుక వైష్ణవ పరంపర లోకి లాగారు అందుకే మెజారిటీ దళితులు శాక్తేయులు కనుక మైసమ్మ ముత్యాలమ్మ,పోచమ్మ పెద్దమ్మ లు బతుకమ్మను ఇంట్లోకి రానియ్య లేదా అనిపిస్తోంది.
  సూటిగా శైవ వైష్ణవ అన్వయింపులో బతుకమ్మ కొన్ని గడపల్లోకి అంటరానిది అయ్యింది.
  ఈ రోజు మా ఊరిలో డి జె దరువుల్లో బతుకమ్మ సిందాడుతూ వీరంగం చేసి ఊరేగింది. కొత్తగా ఊరిలో వందలాది మంది సిపిఎం ను వీడి తెరాసా లోకి మారారు అలా బతుకమ్మ గులాబీ రంగు వేసుకుని మురిసింది.
  పెద్ద సౌండ్ తో ఆటలు పాటలు తీన్మార్ దరువుకు కడుపులో ఉన్న విస్కీ మగవాళ్ళనూ ఆడించింది. నిన్న పెద్ద పెద్ద పోలీసు మగ అధికారులు, ఇంకోదగ్గర పది బీరు బాటిల్లు బతుకమ్మ గా పెట్టి ధూలా ఆడారు అది వేరేకథ.
  కానీ మా ఇల్లు ఇంకా వాడకట్టు నిర్వికారంగా దూరంగా నిలబడి చూసారు తప్ప ముఖాన కాస్త నవ్వు కూడా లేకుండా సీరియస్ గా ఆ ర్యాలీ పట్ల కొద్ది పాటి ఆశక్తి కూడా చూపక పోవడం చూస్తే భయం వేసింది . అలా నిరాసక్తం గా ఉండడం వెనక కారణం ఏమయి ఉంటది అనిపించింది. డప్పు మోగితే ఆగని కాలు అంత పెద్ద హోరు ను కూడా కాలి కొనగోటి లా చూడడం వెనక ఏదో బలమైన గాయం ఉంది అనిపించింది.

  ఎఫ్లూ లో మలి విడత తెలంగాణ సమయం లో అది సెంట్రల్ యూనివర్సిటీ అవడం ప్రాంతీయ రాజకీయాలు మాట్లాడడం నేరం అయిన కాడ పరోక్షంగా బతుకమ్మ అనే అంటరాని క్రతువుని నేను మోసా.
  ఒక్కణ్ణే ఒగ్గుడోళ్ళు,కోలాటాలు,పేరిణి,లాంటి కళా ప్రదర్శనల తోబాటు గద్దర్, జయధీర్,కోదండ్, నర్సింగ్ సర్,విమల,గోరటి,అందెశ్రీ,మాభూమి సంధ్యక్క, అరుణోదయ,PKM, టీమ్ మొత్తం, అమరుడు pkm ప్రభాకర్ మావ, రడం శ్రీను, మాజీ MLA వీరేశం సహచరి పుష్ప,స్వర్ణ, తో బాటు పదుల సంఖ్య లో వేదిక పంచుకున్న రోజులు.
  ఒకసారి మిత్ర కూడా వచ్చినట్టు యాది .
  ఒకే వేదిక మీద ఇంత మంది ఆట పాట అబ్బో
  ఒక దశలో అది ఎంత పాపులర్ అయ్యింది అంటే రసమయి అప్పటికి MLA కాలేదు, తమ్మీ మీ బతుకమ్మ వేడుకలో మాకూ చోటు ఇవ్వు కదా అనేదాకా పోయింది.
  అంత పాపులర్ ఈవెంట్ బతుకమ్మ అవడం తో బాటు మలి విడత తెలంగాణ,ప్రజా ప్రత్యామ్నాయ రాజకీయాల (మర్చిపోయా సాయి బాబా, పవన్ అన్న కూడా అక్కడే తన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు) చోదక శక్తులు ఎఫ్లూ కేంద్రంగా ఉండడం దాచేస్తే దాగని సత్యం. యాదృచ్ఛికంగా పవన్ అన్న ఉన్న రూమ్ లొనే నేను ఉన్నా ఈ పనులన్నీ ఆ రూం కేంద్రంగా నే జరిగాయి.
  అలా ఎన్నటికీ మా బ్రతుకుల్లోకి రాని బతుకమ్మ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ రాజకీయాలు మాట్లాడడం కోసం వాడుకున్నాం. అలా దాదాపు ఐదేళ్లు జరిగింది. నేను బయటకు వచ్చాక బతుకమ్మ కూడా ఎఫ్లూ నుండి బయటకు వచ్చినట్టు అనిపించింది.
  కానీ ఆ బతుకమ్మే నాకు ఎఫ్లూ లో గణపతి ఉత్సవాలకు కౌంటర్ గా అసుర ఉత్సవాలు, ఒక దశలో మా బాచ్ అందరమూ రావణ,తాటకి,లాంటి పేర్లు అడాప్ట్ చేసుకున్నాం . ఆ విధంగా బీఫ్ ఫెస్టివల్ తోబాటు రావణ,నరకా,మహిషాశుర కౌంటర్ కల్చరల్ పాలిటిక్స్ అక్కడ చేసి దేశం లో ఏ విశ్వవిద్యాలయం లో జరగని ప్రతిఘటనా రాజకీయాల లో చరిత్ర మమ్మలని భాగం చేసుకుంది. ఎంతో మంది బుద్ది జీవులకూ దగ్గర చేసింది.
  అలా అంటరాని బతుకమ్మ మా ఇంట రానిది ఎందుకు అయ్యిందో పరిశోధన మిగిలే ఉంది.
  సద్దుల బతకమ్మ వస్తే నాటి ఎఫ్లూ సిబ్బంది ఇప్పటికీ నాటి జోర్దార్ యాది చేస్తారు

  • బతుకమ్మ వెనుకగల సామాజిక, రాజకీయ కోణాల్ని వ్యాఖ్యానించారు.. ధన్యవాదాలు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు