గంగమ్మ తల్లి మరింత చిక్కి పోతుందేమో…

యాత్రాస్మృతి -3

  ఉదయం 10:30 ప్రాంతంలో రుద్రప్రయాగ నుండి జీప్ లో బయలుదేరాం. అక్కడి నుండి ఊఖీమఠ్ కి ఓ గంట ప్రయాణం. ఇక్కడే పంచ కేదార్ ల విగ్రహాలకు చలికాలంలో ఆయా ఆలయాలు మూసి ఉన్నప్పుడు పూజలు నిర్వహిస్తారు.సుమారు 20 ఏళ్ల క్రితం కేదార్ ,బదరీలకు వెళ్ళినప్పుడు కన్నా ఇప్పుడు  రోడ్డు సదుపాయం బాగా మెరుగుపడింది. అప్పుడు కనిపించిన చిన్న చిన్న ఊర్లు ఇప్పుడు బాగా పెద్దవయ్యాయి. యాత్రికుల కోసం అన్ని సదుపాయాలతో పెద్ద హోటల్స్ కూడా అన్ని చోట్ల ఉన్నాయి .స్థానికంగా ఉన్న ప్రదేశాలు, ప్రజలు ఆర్థికంగా బలపడుతున్నాయే/రేమో గాని ప్రకృతి మాత్రం తన సహజ సౌందర్యాన్ని కోల్పోతోంది . ఎల్ అండ్ టి వారి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం పనుల వల్ల గంగా ప్రవాహ ఉధృతి కూడా తగ్గిపోయింది. పెరుగుతున్న జనాభా కోసం సదుపాయాలు, సౌకర్యాలు అవసరం. దానికోసం ఈ ప్రాజెక్టులు తప్పవు. ప్రకృతిని మన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోగలం. రాబోయే కాలంలో గంగ మరింత చిక్కి పోతుందేమో అనిపించింది.

ప్రయాణిస్తున్న దారిలో మీదకు వెళుతున్న కొద్ది గంగ మాకు దూరం అవుతూ ఉంది. పర్వతాలు దగ్గరవుతూ ఉన్నాయి. క్రమంగా దృష్టి  గంగ మీద నుండి ఆ పర్వతాల వాలుల్లో అక్కడ ఉన్న చిన్న చిన్న ఊర్లలో ఉండేవారు ఎలా పంటలు పండిస్తున్నారో, కొండ చరియలు ఎలా జారిపోతున్నాయో… వీటి మీదకి మళ్ళింది. బహుశా ఏదైనా ఎక్కువమంది ఉన్న గ్రూప్స్ తో వెళ్ళినప్పుడు మనం మన మనసుకి ఇంతగా ఆలోచించుకునే అవకాశాన్ని ఇవ్వవేమో! ఈ కారణం చేతనే మేము ఇలా ఇద్దరమే వెళ్లడానికి నిర్ణయించుకున్నాం.

ఉదయం 11:30 కి మేము ఊఖీమఠ్  చేరుకున్నాం. ముందుగా అనుకున్న దానిని బట్టి మా ప్రయాణం అక్కడితో ఆగిపోవాలి. అక్కడ ఉన్న ఓంకారేశ్వర ఆలయం చూసుకొని మర్నాటి ఉదయం తుంగనాధ్ ట్రెక్ మొదలయ్యే ‘చోప్టా’ అనే చిన్న గ్రామాన్ని చేరుకోవాలి.కానీ, మేము అనుకున్న దానికంటే ముందుగానే చేరుకున్నాం .పెద్దగా అలసట కూడా అనిపించడం లేదు విశ్రాంతి తీసుకోవడానికి. అందుకని ఆ రోజే చోప్టా చేరిపోవడం మంచిదని అనుకున్నాం. వాతావరణం బావుంది. వెదర్ ఫోర్ కాస్ట్ లో రాబోయే నాలుగు రోజుల్లో వర్షాలు చూపిస్తున్నాడు. అటువంటప్పుడు ఆగకుండా ప్రయాణం కొనసాగించడమే సరైనది అనిపించింది . చోప్టా మరో గంట ప్రయాణం. మళ్లీ షేర్డ్ జీప్స్ తప్పించి మరొక మార్గం లేదు.

మాతో పాటు ప్రయాణిస్తున్న ఒక జంట తుంగనాథ్ ట్రెక్కింగ్ కోసమే వస్తున్నట్టు చెప్పారు, కానీ ,వాళ్లు ‘సారి’ అనే ఊరిలో దిగి ,అక్కడే ఉండి, మర్నాడు తుంగనాథ్ ట్రెక్ చేస్తామని అన్నారు. ‘సారి’ లో ఎక్కువగా ట్రెక్కింగ్ గ్రూప్స్ వసతిని కల్పిస్తాయి. కానీ మేము వెళుతున్నట్టు ఇలా ఒకరిద్దరమే అయినప్పుడు మాత్రం ట్రెక్కింగ్ మొదలయ్యే స్థానానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. అందుకే వారిని ‘సారి’ లో వదిలి మా జీప్ చోప్టా వైపు సాగిపోయింది.

వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లటి గాలి. అంతవరకు ఉన్న చల్లదనానికి ఇప్పుడు మేము అనుభవిస్తున్న చల్లదనానికి తేడాని గమనించాం .ఇది మామూలుగా కొండల మీద నుండి వచ్చే చల్లని గాలి కాదు. మంచు పర్వతాల మీద నుండి నీటితో వచ్చే అతి చల్లటి గాలి. మేం ప్రయాణిస్తున్న కాలం వసంత కాలం కాబట్టి చెట్లన్నీ రకరకాల పూలతో ,వివిధ రకాలైన ఆకుపచ్చని రంగుల ఆకులతో నిండిపోయి ఉన్నాయి. రోడో డెండ్రాన్ చెట్లు ఆకుపచ్చగా ఉండి ఎర్రటి పూలతో ఎంత అందంగా ఉన్నాయో చెప్పలేం! ఆ పర్వతాల వాలులు పచ్చలు, పగడాలు పొదువుకున్నట్టు కనిపించేయి. మళ్లీ ఈ చెట్లు కనిపిస్తాయో లేదో అనుకున్నాం కానీ చోప్టా వైపు ప్రయాణిస్తున్న కొద్ది ఇవి ఎక్కువయ్యాయి. కొన్ని ఎర్రటి పూలు అయితే మరికొన్ని గులాబీ వర్ణానివి.పసుపు ,తెలుపు పూల అడవి చెట్లు…ఇలా ఎన్నెన్నో.కానీ ఇవేవీ మేం మా కెమెరాల్లో బంధించలేకపోయాం.వేగంగా వెళుతున్న జీప్ లో నుండి మాకు ఫొటోస్ తీసుకోవడం కుదరలేదు. మనసుల్లో మాత్రం పదిలం చేసుకున్నాం. ఇలా మధ్యాహ్నం 1:30 అయ్యేసరికి చోప్టా చేరుకున్నాం.

*

స్వాతి పంతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు