ఖుష్వంత్ సింగ్ “నాయనమ్మ పదచిత్రం”

ఇద్దరి మధ్యా అదే చిట్టచివరి శారీరక స్పర్శ ఏమోనన్న దిగులు గుండెలతో ఆ పెదవుల ముద్రను పదిలంగా మనసులో దాచుకొన్నాను.

ప్రేమకీ ఆపేక్షకీ ఆకృతి లేదు. వాత్సల్యాన్ని అర్థం చేసుకోవడానికి మనిషే కానక్కర్లేదు. విశ్వమంతా ఆవరించిన ఒక మృదుస్పర్శకి మానవ రూపం, ఈ నాయనమ్మ పదచిత్రం. ఇది ఖుష్వంత్ సింగ్ ఇంగ్లీష్‌లో రచించిన పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ లేడీ అనే కథకి, దాసరి అమరేంద్ర తెలుగు సేత. కథాకాలం – 1920. కథాస్థలి – పంజాబ్.

URL – https://youtu.be/AbbX185aFPg

 

నాయనమ్మ పదచిత్రం

ఇంగ్లీష్ మూలం – ఖుష్వంత్ సింగ్

అనువాదం – దాసరి అమరేంద్ర

 

నాయనమ్మలందరిలాగానే మా నాయనమ్మ కూడా బాగా పెద్దావిడ. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ- అంటే గత ఇరవై ఏళ్లుగా – ఆవిడది ముడతలు పడ్డ శరీరమే. వృద్ధ వాలకమే. ఒకప్పుడావిడ సొగసుగా, నేవళంగా, పడుచుగా ఉండేదట. భర్త కూడా ఉండేవాడట. తెలిసిన వాళ్లు చెపుతూ ఉంటారు. నమ్మడం కష్టం. మా డ్రాయింగ్ రూమ్‌లో ప్రముఖ స్థానంలో మా తాతగారి వర్ణచిత్రం ఉంటుంది. వదులుపాటి బట్టలు, ఎదురు రొమ్మును పూర్తిగా కప్పివేసే నిడుపాటి తెల్ల గెడ్డం, బడా తలపాగా – కనీసం వందేళ్ల వయసు మనిషిలా కనిపిస్తాడాయన. భార్యా పిల్లలూ ఉండే మామూలు తరహా మనిషిలా కనిపించడు. మనవలూ మునిమనవలూ పుష్కలంగా ఉండే ముత్తాతగారిలా కనిపిస్తాడు. ఇహ మా నాయనమ్మ సొగసుగా వుండటం అన్నమాటే మాకు ఏదో అపశృతిలా ధ్వనించేది. అడపాదడపా ఆవిడ తన చిన్ననాటి ఆటల గురించి చెప్పేది. అవన్నీ వినడానికి వింతగా అనిపించేవి. ఆవిడ ఆటలాడటం అన్న సంగతి ఆవిడ గౌరవానికే భంగకరం అనిపించేది. ఆవిడ తరచూ చెప్పే రాజులూ యువరాజుల కథల్లాగానే ఇదీ ఒక కథ అనిపించేది. మతగురువుల గాథల్లాగా ఇదీ ఒక గాథ అనిపించేది.

మా నాయనమ్మ చిన్నగా, కాస్తంత బొద్దుగా, కొంచెం వంగి ఉండేది. మొహం నిండా లెక్కలేనన్ని ముడతలు ఉండేవి. అసలావిడ ఇపుడు ఎలా ఉందో – ముందట్నించీ అలాగే ఉండి ఉండేదని మా అందరికీ గట్టి నమ్మకం. ముసలి రూపు.. చెప్పలేనంత ముసలిరూపు.. ఇంకా ముసలి మనిషిగా పరిణామం చెందడానికి ఎంత మాత్రమూ ఆస్కారమే లేనంత ముసలిరూపు – గత ఇరవై యేళ్లుగా ఆవిడ ఒకే ముసలివయసు దగ్గర నిలబడిపోయిందనిపించేది. ‘సొగసుగా ఉండటం’ అన్నమాట మాకు కొరుకుడు పడకపోయినా ఆవిడ ప్రశాంత సుందరంగా మాత్రం అన్నివేళలా కనిపించేది. ఒక చేతిలో రుద్రాక్షమాలతోనూ, మరోచేతిని తనను తాను బేలెన్సు చేసుకోవడంకోసం నడుం మీద వేసుకొనీ – తళతళలాడే తెల్లని బట్టల్లో ఇంట్లో తిరుగాడుతూ కనిపించేది. పాలిపోయిన ముడతల మొహం మీద వెండి వెంట్రుకలు చిందరవందరగా కదలాడుతూ ఉండేవి. నిజంగానే ఆవిడది సుందర రూపం. శాంతీ సంతృప్తులు నిండిన ఆవిడ ధవళవర్ణపు ప్రశాంతరూపం మాకు మంచుకొండలలోని శీతాకాలపు దృశ్యాలను తలపిస్తూ ఉండేది.

నేనూ మా నాయనమ్మా మంచి స్నేహితులం. మా అమ్మానాన్నా పట్నంలో కాపురం పెట్టినపుడు నన్ను మా నాయనమ్మ దగ్గర ఉంచేశారు. మేమిద్దరం చాలాకాలం కలిసి ఉన్నాం. నా ఆలనాపాలనా చూసేది. పొద్దున్నే లేపు బడికి తయారుచేసేది. స్నానం చేయించి బట్టలు తొడిగేది. అలా తొడిగేటపుడు సుపరిచితమైన ఆవిడ గానపుబాణీలో ఉదయపు ప్రార్థన వినిపిస్తూ ఉండేది. అలా రోజూ వింటే ఆ ప్రార్థన నాకు కంఠస్థం అవుతుందని ఆవిడ ఆస. ఆవిడ గొంతంటే నాకు ఇష్టంగాబట్టి శ్రద్ధగానే వినేవాడిని. నేర్చుకొనే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు. బట్టలు తొడిగాక అప్పటికే కడిగి పసుపురంగు సుద్ద పూసి ఉంచిన చెక్కపలకను నాకు అందించేది. ఓ ఎర్రకలాన్నీ, మట్టి ఇంకుబుడ్డినీ కూడా అందించేది. వాటన్నిటినీ జాగ్రత్తగా కట్టగట్టి మరీ అందించేది. మందపాటి చల్లారిన చపాతీమీద వెన్నరాసి పంచదార జల్లి ఫలహారంగా పెట్టేది. తినడం ముగించాక బడికి బయలుదేరేవాళ్లం. తనతోపాటు ఊరకుక్కలకు వెయ్యడానికి ఓ చపాతీల బొత్తిని తీసుకువచ్చేది.

నాయనమ్మ ప్రతిరోజూ నాతోబాటు బడిదాకా వచ్చేది. ఆ బడి ఊరి గుడికి అనుబంధంగా ఉండేది. పూజారిగారే మాకు టీచరు కూడానూ! వర్ణమాల నేర్పించేవాడు. ఉదయపు ప్రార్థన నేర్పించేవాడు. పిల్లలమంతా వరండాకు అటూఇటూ బారులు తీరి కూర్చుని వర్ణమాలనో ప్రార్థననో సామూహికంగా వల్లెవేస్తూ ఉండే సమయంలో మా నాయనమ్మ గుడి లోపల కూర్చొని పురాణాలు చదువుకొనేది. మామా చదువులు ముగిశాక ఇద్దరం కలిసి ఇంటికి నడిచి వచ్చేవాళ్లం. ఊరకుక్కలన్నీ మాకు గుడి ద్వారం దగ్గర స్వాగతం పలికేవి. మేం వాటికి వేస్తోన్న చపాతీలకోసం పోట్లాడుకుంటూ కాట్లాడుకుంటూ అవి మాతోపాటు ఇంటిదాకా వచ్చేవి.

* * *

పట్నంలో అమ్మా నాన్నా నిలదొక్కుకుని స్థిరపడ్డాక మమ్మల్ని కూడా పట్నం తీసుకువెళ్లారు. మా స్నేహానికి అదో ముఖ్యమైన మలుపు. పట్నంలో కూడా మేమిద్దరం ఒకే గదిలో ఉండేవాళ్లంగానీ మా నాయనమ్మ నాతోబాటు బడిదాకా రావడం మానేసింది. స్కూలు బస్సులో కాన్వెంటుకు వెళ్లేవాడ్ని మరి. అక్కడ ఊరకుక్కలు లేవు… వాటికి చపాతీలు వెయ్యడం లేదు.. అవి మాతోపాటు ఇంటిదాకా తోడు రావడం లేదు. అయినా నాయనమ్మ మా పట్నపు ఇంతి ఆవరణలోని పిచ్చుకలకు తిండివేయడం ఆరంభించింది.

రోజులు గడిచేకొద్దీ మా అనుబంధం సన్నగిల్లసాగింది. కొంతకాలంపాటు పొద్దున్నే లేపి బడికి తయారుచేసేది. స్కూలు నుంచి తిరిగి వచ్చాక పాఠాలు ఏం చెప్పారో అడిగేది. నేను నేర్చుకొన్న ఇంగ్లీషు మాటల గురించి చెప్పేవాడిని. పద్యాల గురించి చెప్పేవాడిని. భూమి గుండ్రంగా ఉండటం, ఆర్కిమెడీస్ సూత్రం, గురుత్వాకర్షణ సిద్ధాంతం – ఇలాంటి సైన్సు సంగతులు చెప్పేవాడిని. అవన్నీ విని కలతపడేది. నేను నేర్చుకొంటోన్న కొత్త చదువుల మీద తనకు గురి లేకపోవటం కలతకు ఒక కారణం. నా చదువుసంధ్యల్లో తను సాయం చెయ్యలేకపోవడం రెండో కారణం. భగవంతుడి గురించీ, పవిత్ర గ్రంథాల గురించీ మా స్కూల్లో ఏమీ చెప్పడం లేదని బాధపడేది. ఓ రోజు మా స్కూల్లో మ్యూజిక్ క్లాసులు మొదలెట్టారని చెప్పాను. అది విని బాగా బెంగపడింది. ఆవిడ దృష్టిలో పాటలూ, సంగీతమూ గానాబజానా అంటే, అలగావాళ్లు, జులాయివాళ్లు, అడుక్కొనేవాళ్లూ చెయ్యాల్సిన పని. మర్యాదస్థుల పని కాదు. ఈమాట ఆవిడ పైకి అనకపోయినా ఆవిడ మౌనమే ఇవన్నీ విప్పి చెప్పింది. తర్వాత ఆవిడ నాతో మాట్లాడటం తగ్గించేసింది.

నేను కాలేజీలో చేరాక ఇంట్లో నాకు విడిగా ఒక గది ఇచ్చారు. దానితో నాకూ ఆవిడకూ మధ్య మిగిలి ఉన్న ఆ కాస్త అనుబంధమూ సడలిపోయింది. ఆమె తన ఒంటరితనాన్ని నిర్లిప్తంగా అంగీకరించింది. చరఖానే ఆమె ప్రపంచం అయిపోయింది. చరఖాను వదిలి ఇవతలికి వచ్చి మిగిలిన వాళ్లతో మాట్లాడటం బాగా తగ్గిపోయింది. రోజంతా కీర్తనలు పాడుతూ, చరఖాను తిప్పుతూ గడిపేది. ఒక్క మధ్యాహ్నాలు మాత్రం పిచ్చుకలకు తిండి వేస్తూ గడిపేది. వరండాలో కూర్చొని రొట్టెల్ని తుంపులుగా చేస్తున్నపుడు వందలాది పిచ్చుకలు ఆవిడ చుట్టూ చేరేవి. కిచకిచలాడుతూ నానా గందరగోళం చేసేవి. ఆవిడ కాళ్లూ చేతులమీద వాలేవి. కొన్నికొన్ని ఏకంగా ఆవిడ తలమీదే వాలేవి. ఎప్పుడూ వాటిని చెదరగొట్టేది కాదు. నవ్వి ఊరుకొనేది. మధ్యాహ్నపు ఆ అరగంటా ఆవిడకు అమిత ఆనంద హేతువు.

కాలేజీ ముగిశాక ఇంకా పై చదువులకు వెళదామనుకొన్నాను. అది నాయనమ్మకు మనస్తాపం కలిగిస్తుందని తెలుసు. అయిదేళ్లపాటు విదేశాల్లో గడపాలి మరి. పెద్దవయసుగదా – ఆవిడకు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. కానీ ఆవిడ మాత్రం ధైర్యంగా నిలబడింది. ఏమాత్రం దిగులు పడలేదు. మాతో స్టేషనుకు వచ్చింది. అక్కడా దిగులుగా మాట్లాడలేదు. విచారం కనిపించలేదు. పెదవులమీద ప్రార్థన. చేతిలో రుద్రాక్షమాల. ఆ రుద్రాక్షలను తిప్పే వేళ్లు – మౌనంగా నా నుదురు ముద్దాడింది. మా ఇద్దరి మధ్యా అదే చిట్టచివరి శారీరక స్పర్శ ఏమోనన్న దిగులు గుండెలతో ఆ నుదుటిమీది పెదవుల ముద్రను పదిలంగా మనసులో దాచుకొన్నాను.

నా అనుమానం నిరాధారం. అయిదేళ్ల తర్వాత నేను తిరిగి వచ్చినపుడు నాయనమ్మ స్టేషనుకు వచ్చింది. అదే రూపం… అవే ముడతలు – ఏం మార్పులేదు. వయసు ఒక్కరోజు పాటి కూడా పెరగలేదనిపించింది. మేం చిరకాలపు ఎడబాటు తర్వాత కలుసుకొన్న ఆ క్షణాల్లో కూడా ఆవిడ పెదవుల మీద మామూలు మాటలు పలకలేదు. నన్ను తన కౌగిలిలోకి పొదవుకొన్నపుడు పెదవుల మీద వినిపించీ వినిపించని ప్రార్థన. నేను తిరిగి వచ్చిన మొదటిరోజున కూడా పిచ్చుకలకు తిండిపెట్టడమే ఆవిడకు అత్యంత ప్రధానమైన, సంతోషదాయకమైన విషయం అవడం గమనించాను. వాటిల్ని అదిలిస్తూ, ముద్దుగా కోప్పడుతూ ఆ అరగంటా గడిపేసింది.

ఆ సాయంత్రం ఆవిడ దినచర్యలో మార్పు గమనించాను. ప్రార్థన చెయ్యడానికి బదులుగా ఇరుగూ పొరుగూ ఆడవాళ్లనందరినీ సమావేశపరచింది. ఒక పాత డోలు సంపాదించింది. దాన్ని వాయిస్తూ యుద్ధ భూమినుంచి తిరిగి వచ్చే వీరసైనికులను కీర్తించే గాథలను పడింది. అలా పాడుతూ ఉండిపోయింది. శృతి మించిన శ్రమ తీసుకొంటోందనిపించి మేమంతా ఆవిడను బతిమాలి నివారించాం. నాకు తెలిశాక ఆవిడ సాయంత్రపు ప్రార్థనలు చెయ్యకపోవడం అదే మొదటిసారి.

మర్నాటి ఉదయం నాయనమ్మకు కొద్దిపాటి జ్వరం తగిలింది. డాక్టరు మరేం పర్లేదు తగ్గిపోతుంది అన్నాడు. కానీ ఆవిడ ఆలోచన వేరు. తన చివరి క్షణాలు దగ్గరపడ్డాయని చెప్పింది. ఆ చివరి క్షణాలకు కొద్ది ఘడియల ముందే ప్రార్థన చెయ్యకపోవడం జరిగింది కాబట్టి ఇహ మిగిలి ఉన్న కాస్తంత సమయాన్ని మాతో మాట్లాడటం ద్వారా వృధా చెయ్యదలచుకోలేదని చెప్పింది.

మేం అభ్యంతరపెట్టాం. ఆమె లెక్క చెయ్యలేదు. రుద్రాక్షమాల తిప్పుతూ, ప్రార్థనలు జపిస్తూ ప్రశాంతంగా తన పక్కమీద పడుకొంది. మాకు అనుమానం కలిగేలోగానే పెదవుల కదలిక ఆగిపోయింది. రుద్రాక్షమాల జారిపోయింది. ఒక ప్రశాంత మేఘం మేలిముసుగులా ఆవిడ మొహం మీద పరచుకొంది. ఆవిడ వెళ్లిపోయిందని మాకందరికీ అర్థమయింది. మంచం మీద నుంచి దింపి సంప్రదాయం ప్రకారం నేలమీద పడుకోబెట్టి ఎర్రని ప్రేతవస్త్రం కప్పాం. కొన్ని గంటల శోకవిచారాల తర్వాత మేమంతా అంత్యక్రియల ఏర్పాట్ల కోసం గది వదిలి బయటకు వెళ్లాం.

సాయంత్రం ఓ వెదురుగెడల పాడెను తీసుకొని ఆవిడను మరుభూమికి తీసుకువెళదామని గదివేపు వెళ్లాం. సూర్యాస్తమయ సమయం. ఆ సంధ్యవెలుగులో ఆవిడ గదీ బయట వరండా బంగారు రంగులో ధగధగలాడుతున్నాయి. మేం గది దాకా వెళ్లలేక పోయాం. వరండాలోనే ఆగిపోవలసి వచ్చింది. గదిలోనూ, వరండా నిండానూ వేలాది పిచ్చుకలు. ఎర్రబట్ట మాటున ప్రశాంతంగా పడుకొని ఉన్న ఆమె చుట్టూ అసంఖ్యాకమైన పిచ్చుకలు. కిచకిచలు లేవు. అల్లరి లేదు. గందరగోళం లేదు. అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. వాటినిచూసి మాకు ప్రాణం ఉసూరుమనిపించింది. అమ్మ వెళ్లి రొట్టెలు తెచ్చింది. నాయనమ్మ చేసేట్లుగానే రొట్టెల్ని చిన్న చిన్న తునకలు చేసి పిచ్చుకలకు వేసింది. కానీ అవి ఆ తునకల్ని ముట్టుకోలేదు. మేం నాయనమ్మను పాడె ఎక్కించి బయటకు తీసుకువెళ్లాక అవన్నీ నిశ్శబ్దంగా ఎగిరిపోయాయి. మర్నాటి ఉదయం మా పనివాడు తునకలన్నిటినీ ఊడ్చి కసువుబుట్టలో వేశాడు.

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • ఒహ్! ఎంత అందమయిన కథ. నేనూ అనువదించాను. ఆ పోర్ట్రయిట్ ఒక ముగ్ధమైన అద్దం. గ్రాండ్ పేరెంట్స్ జ్ఞాపకాలు ఎంత బావుంటాయో!

    • అవునండి. తన నాయనమ్మ గురించి ఈ కథ రాసిన ఖుష్వంత్ సింగ్, గ్రాండ్‌పేరెంట్స్‌కి మనవల మీద ఉండే అపేక్షని ఎంతో హృద్యంగా వర్ణించడమే కాక, పిచ్చుకలు శ్రద్ధాంజలి ఘటించినట్లు చెప్పి, కథకి ఒక అమరత్వాన్ని ఆపాదించారు. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు