కోరిక

ఓహ్… పారిజాతమూ, అరుగూ అలాగే వున్నాయి! ఇల్లు కట్టినప్పుడే మా ఆవిడ కోరిక …పెరట్లో పారిజాతం చెట్టూ , దాని చుట్టూ అరుగూ వేయించమని …జామ చెట్టు మా అమ్మ పెట్టింది. దాని క్రింద నులక మంచం వేసుకుని సాయంకాలం సేదదీరేది.

ఉదయం పదకొండు గంటల సమయం.

భర్త సురేష్ ఆఫీసుకీ, కొడుకు రాహుల్ స్కూలుకీ వెళ్ళారు.

పొద్దున్న హడావిడి అంతా ముగిశాక తీరికగా ఆరోజు న్యూస్ పేపర్ తీసుకుని ఇంటి ముందు వరెండా లో వున్న బెత్తం కుర్చీలో కూర్చుని వార్తలు చదువుతూంది నీరజ. అక్కడ కూర్చోవడం ఇష్టం నీరజకు.

ఇంటి ముందు వున్నపూలతోటలో కంటికి ఆనందాన్నిచ్చే క్రోటను మొక్కలు కాంపౌండ్ ఆనుకుని వుంటే వాటి ముందు వివిధరకాల సీజనల్ పూలమొక్కలు, రెండు రకాల చేమంతుల మొక్కలు, బంతి మొక్కలూ విరబూసి వున్నాయి. వరెండా మెట్ల కు ఇరు వైపులా  వున్న పూల కుండీలు, గేటు నుండీ లోపలకు వచ్చే దారి కిరువైపునా నాటిన లిల్లీ మొక్కలు ఎంతో తీరుగా వున్నాయి.

ఇలా ఇంటి ముందు ఖాళీ జాగా వున్న ఇల్లు కావాలనే నీరజ కోరి ఈ ఇంటిని ఎంచుకుంది. ఇల్లు చిన్నదే కానీ పెరడు కూడా పెద్దగావుంది. ట్రాన్సఫర్ అయిన ప్రతిసారీ అద్దె ఇల్లు కోసం ముఖ్యంగా చుట్టూ స్థలం వున్న ఇంటి కోసం వెదుకుతుంది నీరజ. మొక్కలంటే ఇష్టం తనకు. పెరట్లో కూడా పారిజాతం చెట్టు, దాని చుట్టూ వున్న చిన్న అరుగు చాలా నచ్చింది. జామచెట్టు, దానిమ్మ, నిమ్మ చెట్టూ వున్నా యి. సాయంకాలం కొడుకు స్కూల్ నుండీ వచ్చే లోగా మొక్కలకు నీళ్ళు పడుతుంది నీరజ.

ఇల్లు మాత్రం చిన్నదే ! బయట ఒక చిన్న వరెండా, లోపలకు పోగానే ఒక హాలు, ఒక పక్కగా బెడ్రూము, ఇంకో వైపు కొంచెం పెద్దదే అయిన వంటిల్లు. చిన్న స్టోర్ రూమ్ లాటి మరో గది. దాటి బయటకు వెడితే ఒక పక్కగా బాత్ రూమ్, లెట్రిన్ వుంటాయి. తరువాత పెరట్లోకి వెళ్ళటమే! అటాచ్డ్ బాత్రూం లేకపోవడం బాగా ఇబ్బందే అయినా  వున్నది ముగ్గురే కాబట్టి సర్దు కుంటున్నారు.

అది చిన్న టౌను అయినా flat కల్చర్ వచ్చేసింది. ఫ్లాట్స్ లో వుంటే ఇంత పచ్చదనం ఉండదని ఎప్పుడూ ఇండిపెండెంట్ ఇల్లు కోసం వెదుకు తారు నీరజా వాళ్ళు.

కానీ ఇంకో రెండునెలల్లో ఈ ఇల్లు కూడా ఖాళీ చెయ్యాలంటే బేజారుగా వుంది నీరజకు.

పేపర్ చదవటం పూర్తి అయ్యాక పేపరూ, కాఫీ  కప్పూ తీసుకుని లోపలకు వెళ్ళబోతూ గేటు చప్పుడు అయినట్టయితే తలతిప్పి వెనక్కి చూసింది.

ఒక ముసలాయన గేటు తీస్తూ కనిపించాడు.

“ఎవరూ?” అంది.

ఆయన చొరవగా లోపలకు వస్తున్నాడు.

“ఎవరండీ??” కొంచెం రెట్టించి అడిగింది.

“అమ్మా, ఇల్లోకసారి చూడాలని వస్తున్నానమ్మా “ అన్నాడు  దగ్గరగా వస్తూ.

“ఈ ఇల్లు మేమే ఖాళీ చేస్తున్నాము. కానీ వేరే వారికి బాడుగకు ఇవ్వరండీ …”

“తెలుసమ్మా” అన్నాడు వరండా మెట్లు ఎక్కుతూ .

“తెలుసా?? ఈ ఇల్లు flats కట్టడానికి ఒప్పందం జరిగిందనీ ఓనరు ఖాళీ చెయ్యమన్నాడు. మేము 1 వ తేదీన ఖాళీ చేస్తున్నాము…”

ఆయన ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ” కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా” అని నీరసంగా కుర్చీలో కూర్చున్నాడు.

అయ్యో పాపం ముసలాయన ! అనుకుంటూ

“ఇప్పుడే తెస్తాను …కూర్చోండి “అని లోపలకు వెళ్లి ఫ్రిజ్ లోని నీళ్ళ సీసా, ఒక గ్లాసు తీసుకుని  వచ్చ్సింది.

ఆబగా తాగాడతను. ఎంత దాహం వేసిందో…

“నాకు ఈ ఇల్లు డిమాలిష్ చేసి ఫ్లాట్స్ కడతారని తెలుసమ్మా… పడగొట్టే లోపల ఒక సారి చూసి పోదామని వచ్చినా…” ఆయన మాటలకు విచిత్రంగా చూసింది నీరజ.

“అమ్మా,  నాపేరు రామా రావు. నేను ఈ ఇల్లు ఎంతో కష్టపడి కట్టించినవాడిని. అప్పట్లో వూరికి దూరంగా ఉండేది. ఇప్పుడు వూరికి కలసిపోయింది.” ఆమాటలు చెబుతున్న ఆయన కళ్ళల్లో మెరుపును గమనించింది నీరజ

“అమ్మా, నీవేమీ అనుకోనంటే ఒకసారి ఇల్లు చూడాలని వుంది..” అభ్యర్ధనగా అన్నాడు అతను.

“అలాగే బాబాయి గారూ రండి..”అప్రయత్నంగానే వరస కలిపింది నీరజ లోపలికి దారి తీస్తూ.

హాలులో కి రాగానే మధ్యలో నుంచున్నాడు ఆయన. ఎడమ వైపు గోడ చూస్తూ “ఇక్కడే మా నాయన ఫోటో  పెట్టుకున్నా…ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు తక్కువ అయినాయని అమ్మ తన చేతిలోని రెండు బంగారు గాజులు ఇచ్చింది అమ్మి వాడుకోమని …” ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. భుజాన వున్న టవలు తో కళ్ళు వొత్తు కున్నాడు. జాలిగా చూసింది నీరజ.

అతను హాలు దాటి వంటింటి వైపు నడిచాడు. ఆగ్నేయ మూలగా వున్నా ఆర్చ్ లో వున్న అరుగు మీద గాస్ పొయ్యి పెట్టుకుంది నీరజ.

“మేము అప్పట్లో కట్టెలపొయ్యి మీదే వంట. బొగ్గుల కుంపటి కూడా వుండేది. వంటింట్లోనే ఈ పక్కగా కింద పీటలు వేసుకుని భోంచేసేవాళ్ళం….”అంటూ తృప్తిగా చూసాడు చుట్టూ…

వంటిల్లు , బాత్ర్రూం దాటి పెరట్లోకి వెళ్లి

“ఓహ్… పారిజాతమూ, అరుగూ అలాగే వున్నాయి! ఇల్లు కట్టినప్పుడే మా ఆవిడ కోరిక …పెరట్లో పారిజాతం చెట్టూ , దాని చుట్టూ అరుగూ వేయించమని …జామ చెట్టు మా అమ్మ పెట్టింది. దాని క్రింద నులక మంచం వేసుకుని సాయంకాలం సేదదీరేది. పౌర్ణమి రోజున వెన్నెల బోజనాలు ఇక్కడే చేసే వారం. నా భార్య పెరట్లో కూరగాయలు, ఇంటి ముందు అందమైన పూల మొక్కలూ పెంచేది. మీరు కూడా తోట ఇష్టం గా పెంచుకున్నారమ్మా “ అని ఆపి నీరజ వైపు చూశాడు ఆయన .

“అవునండీ చుట్టూ జాగా ఉందనే ఈ ఇల్లు తీసుకున్నాము.”  అంది నీరజ.

“ఇల్లు చిన్నగా కట్టు కోవడానికి కారణం నాకు అప్పుడు వున్న డబ్బు ఇబ్బంది కూడా. ఏమైనా చివరగా నాకొడుక్కి ఇచ్చిన ఆస్తి ఇదే నమ్మా” అంటూ లోపలి నడిచి వచ్చారు ఇద్దరూ..

ఇంత వరకూ ఆయన కు కాఫీ కూడా ఇవ్వలేదన్నది జ్ఞాపకం వచ్చి

“బాబాయి  గారూ, కూర్చోండి కొంచెం కాఫీ ఇస్తాను” అంటూ వంటింట్లోకి వెళ్ళింది నీరజ.

ఒక ప్లేట్   లో కొంచెం మురుకులూ, స్వీట్ పెట్టుకుని , కాఫీ తీసుకుని వచ్చి ఆయన ముందు టీపాయి మీద  పెట్టి “తీసుకోండి “అంది

స్వీట్ నోట్లో వేసుకుని కాఫీ కప్పు తీసుకుంటూ “ అమ్మా, నీవేమీ అనుకోనంటే ఒక సారి బెడ్ రూమ్ చూడాలని వుంది…”ఇబ్బందిగా అన్నాడు.

“పరవాలేదు చూద్దురు గానీ రండి…”అంటూ బెడ్ రూమ్ లోకి నడిచింది.

మంచాలు దాటి తూర్పు వైపున వున్న కాస్త ఖాళీ జాగాను చూపుతూ

‘ఇక్కడే పడుకునే వాళ్ళం. మంచాలు లేవు అప్పుడు. నేలనే పడుకునే వాళ్ళం..” అని వెనుదిరిగి హాలులోకి వచ్చాడు ఆయన.

“అమ్మా, నేను ఎందుకు వచ్చానో చెప్పాలని వుంది..”అన్నాడు మెల్లిగా.

“చెప్పండి బాబాయి గారూ..”అంది ఆసక్తిగా నీరజ.

“అమ్మ ఈ ఇంట్లో ఉన్నప్పుడే చని పోయింది. నేనూ, నాభార్యా నా రిటైర్మెంట్ తరువాత ఈ ఇల్లు అద్దెకు ఇచ్చి కొడుకు దగ్గరకు వెళ్లి పోయినాము. సంవత్సరం క్రితం నా భార్య జబ్బు పడింది. పెరాలిసిస్ వచ్చింది దానితో పాటు షుగర్ లెవల్ ఎక్కువై కళ్ళు దెబ్బతిని కనిపించకుండా పోవటం చాలా దురదృష్టం. కానీనా కొడుకూ ,కోడలు నేను అందరం ఆమె అవసరాలను విసుక్కోకుండా  చేస్తున్నాము..ఒక  రోజు మైల్డ్ హార్ట్ ఎటాక్ కూడా వచ్చింది. సరి అయిన టైం కు హాస్పిటల్ లో చేర్చాము…నా భార్య చాలా కుంగిపోయింది. “ బతకడం ఇష్టం లేకపోయినా, ఇలా వివిధ రోగాలతో దేవుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడు?”అనేది.

నిజమే మా ఇద్దరికీ బతకాల్సిన అవసరం లేదు అని మేము అనుకున్నా భగవంతుడు కరుణించాలి కదా. డాక్టరు కూడా “ జాగ్రత్తగా చూసుకోవాలి..ఆవిడను హ్యాపీ గా ఉండేలా చేసుకోండి”అని  చెప్పి డిశ్చార్జ్ చేసినాడు…అప్పుడు నా భార్య కమల  ఒక కోరిక కోరింది.

“నేను ఎక్కువ రోజులు బతక నండీ. నాది ఒక కోరిక…మన ఇంటికి ఒక సారి వెళ్లి రావాలని వుంది తీసుకు వెడతారా ? “అని అడిగితే , ఆరు నెలల క్రితం ఆస్పత్రి ఖర్చులు తట్టుకోలేక ఇల్లు అమ్మకానికి పెడితే , అక్కడ flats కట్టడానికి ఆఫర్ రావడం తో సంతోషపడి , ఒప్పుకుని అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్నాము. కమలకు ఈ విషయాలు తెలియదు. ఇప్పుడు కమల కోరిక ఎలా తీర్చాలి? అని తర్జన భర్జన పడినాము. ఆమెను ఇంత దూరం ప్రయాణం చేయించడం కూడా కష్టం అందుకని నాకొడుకు రమేష్ ఒక ఐడియా చెప్పినాడు అమ్మను కారులో తీసుకెళ్ళి అదే వూరిలో వున్న ఫ్రెండ్ ఇంటికి పోయి తీసుకు వచ్చేద్దాం. ఎలాగూ అమ్మకు కనిపించదు  కదా..అమ్మ కోరికా తీరుతుంది, ఎక్కువ శ్రమ కూడా వుండదు’ అని.

అలాగే నని ఒక రోజు అలాగే తీసుకు వెళ్లాం. ‘మన గదిలో ఒక సారి పడుకోబెట్టండి’ అని కోరింది. సరే’ నని వాళ్ళ బెడ్ రూమ్ లో ఒక వైపు మేము తెచ్చు కున్న పరుపు వేసి పడుకో బెట్టినాము.. చేతితో నేలమీద తడిమి ‘మన ఇల్లేనా? కింద చల్లగా వుంది. టైల్స్ వేసారా?” అని అడిగింది. నేను గాబరా పడినా వెంటనే

“రమేష్ ఇంటికి టైల్స్ వేయించినాడు…”అని చెప్పినాను.

కొంచెం సేపు తరువాత ‘ఇల్లు బాడుగకు ఇచ్చినాము కదా..ఎక్కువసేపు వుంటే బాగుండదు’అని చెప్పి వాపసు తీసుకు వచ్చినాము. ఇది జరిగిన తరువాత ఒక వారం లోపలే కమల చనిపోయింది.

అబద్దాలు చెప్పి దాని చివరి కోరిక తీర్చినా నాకు చాలా గిల్టీగా అనిపించింది…కమల పోయి మూడు  నెలలు గడిచాయి. నాకు ఆరోగ్యం క్షీణిస్తూ వుంది. కమల కోరిక తీర్చలేక పోయాను కానీ నేనైనా ఈ ఇల్లు పడగొట్టే లోపు ఒకసారి చూసి రావాలనిపించి వచ్చాను” అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ.

ఎదురుగా కూర్చున్న నీరజ అప్రయత్నంగా కొంగుతో కళ్ళు తుడుచుకుంది. దృశ్యమానం అయిన ఆ సంఘటన, ఆయన చెప్పిన తీరు నీరజను కదిలించి వేసింది.

భోజన సమయం అని చెప్పి ఆయనకు వంటింట్లో పీటవేసి భోజనం పెట్టింది.వడ్డిస్తూనే ఆయన వివరాలు కనుక్కుంది. ఆయన భోజనం అయ్యేలోపు భర్త సురేష్ కు ఫోను చేసి ఆఫీసు అటెండర్ ను పంపమని రామా రావు గారిని వూరికి తోడుగా పంపడానికి ఏర్పాట్లు చేసింది.

భోజనం తరువాత ‘కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి బాబాయ్ గారూ…’ అంటే

“అమ్మ నీవేమీ అనుకోనంటే మీ రూమ్ లో తూర్పున వున్న ఖాళీ జాగాలో ఒక చాప వేస్తే అక్కడ పది నిముషాలు పడుకుని లేస్తాను…’అన్నాడు.

నీరజకు కోపం రాలేదు. చాప వేసి పెడితే నిశ్చింత గా పడు కున్నాడు.

అరగంట తరువాత అటెండర్ తో పాటు వెడుతున్న రామారావుని తృప్తి గా పంపింది నీరజ.

కొత్తవాళ్ళను ఇంట్లోకి రానివ్వడం డేంజరస్ అని చెప్పే సురేష్ కి ఏవిధంగా చెప్పాలో తెలియలేదు ఎంత ఆలోచించినా . రాజారావు జీవితం లోనే కాదు తన కు కూడా అపురూపంగా నిలిపిన అనుభూతిని పదిలంగా దాచుకుంది నీరజ ఆరోజు అతని కోరికను తీర్చినందుకు !!

తరువాత ఒక నెలరోజులలో రామారావు చనిపోయాడన్న విషయం నీరజకు తెలియకపోవడమే మంచిదయింది.

డా. లక్ష్మీ రాఘవ

 

 

 

 

డా.లక్ష్మీ రాఘవ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • చాలా హృద్యమైన కథ. మనం కట్టుకునే ఇళ్ళు, ఊళ్లు, మన అనుబంధాలకి నిదర్శనాలు అనే నిజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. మారుతున్న కాలాలు, మారుతున్న నగరాలు కొన్ని గతాలని, అనుభవాలని కాల గర్భంలోకి తీసుకుపోతున్నాయన్న విషయం సున్నితంగా రాశారు. ఇవి మన నగరాలలో మనందరి దైనందిక అనుభవాలు. మీకు అభినందనలు.

  • పెద్దవాళ్లు జ్ఞాసపకాలతోనే మలి జీవితాన్ని గడిపేస్తూ వుంటారు.కష్టపడి కట్టుకున్న ఇంటితో వారు పెంచుకున్న అనుబంధాన్ని ఎంత హృద్యంగా చెప్పారో! ముగింపు బావుంది..రచయిత్రికి అభినందనలు👌💐💐

  • ఇల్లు , పెరడు,అమ్మతో భోజనం…. కంటతడి పెట్టించారు. ఒక నాన్న కుటంబాన్ని పెంచి, ఇల్లు కట్టడానికి 30ఏళ్ళు పడుతోంది. ఊరు అనే పదానికి దూరమైన చనాళ్ళకి ఒక మంచి ఊరు మనుషుల కథ చదివాను. (ఇక్కడ ఊరు మనుషులు అంటే నాగరికత తెలియకపోవడం కాదు, విలువలు తెలిసిఉండటం.)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు