కోయ గుండె ‘మూగబోయిన శబ్దం’

భూమి లోలోపలికి పాకుతూ పాతుకుపోయిన వేర్లు ఒక్కటొక్కటీ తెగిపోతున్నపుడు చెట్టు కార్చే కన్నీటి ధారను మీరెప్పుడైనా చూశారా? తల్లివేరు కూడా తెగిపోయిన చివరి క్షణాన ఒరిగిపోతూ పొగిలిపొగిలి ఏడ్చిన ఏడుపును మీరెప్పుడైనా విన్నారా?

అయితే, పద్దం అనసూయ ‘మూగబోయిన శబ్దం’ వినడానికి చెవి ఒగ్గండి.

‘లోకం శోకమంతా రూపుకడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు’ తీతుగుంపు నుంచి వచ్చిన పెద్దయ్య. కుటుంబాన్ని మోసే పెద్ద కొడుకు కన్నుమూసినపుడు అట్లాగాక ఇంకెట్లా ఉంటాడు ఏ తండ్రి అయినా! తీతుగుంపు అంటే ఒక కోయగూడెం. ఆ కోయగూడెంలో కాస్త చదువుకుని టీచరు అయిన అమ్మాయే పద్దం అనసూయ. అన్న కర్మక్రియల కోసం పాల్వంచ నుంచి బయలుదేరించి ఆమె, తీతుగుంపు జ్ఞాపకాలను ఒలుచుకుంటూ. దట్టమైన అడవి. ఎటు చూసినా ఎదురుపిడెం వనాలు. బస్సు దిగి దట్టంగా అలుముకున్న మంచులో అడవి మధ్యనుంచి అదే కాలిబాటలో నడుస్తోంది ఆమె. ‘గాలి ఊగినప్పుడల్లా చెట్ల రాపిడికి కిర్రున శబ్దం వస్తోంది. కారంగి చెట్టుమీద ముకుజారుడు పిట్టొకటి టకటకమని ముక్కుతో పొడుస్తున్నది. పచ్చటి, బుల్లిబుల్లి ఆకుల మధ్య చిలకముక్కులాంటి ఎర్రటి నెక్కరపండ్లు నోరూరిస్తున్నాయి.’ అంత ఆహ్లాదకర వాతావరణమూ ఇప్పుడెందుకో ఆమెకి హాయిగా అనిపించలేదు. తొలిసారి అడవిలో ఒంటరిగా ఉన్నానని అనిపించింది. అడవికి దూరమై పోయాక బహుశా ఇలాగే ప్రతి శబ్దమూ ఉలికిపాటుకు గురిచేస్తుందేమో!

ఆడబిడ్డను చూడగానే వదిన గుండెలు బాదుకుంటూ చుట్టుకుపోయింది. దుఃఖం ఒకరి నుంచి ఒకరికి అల్లుకుంటూ ఆ ఇంటిని కన్నీటిలో ముంచేసింది. కానీ, ఏదో తేడా ఉంది. చావింటి నిండా మనుషులు లేరు. గుంపు పెద్దల జాడ లేదు. డోళ్లు మోగడం లేదు. తెలియని గాంభీర్యం యేదో తీతుగూడెం అంతా ఆవరించి ఉంది. కర్మకాండ జరిపించవలసిన డోలోళ్లు ఇంకా రానేలేదు. అలికిన గోడ మీద సున్నం, పసుపుతో అనల్‌పేర్లు గీయాలి. నేల మీద జొన్నలు పోసి ఆనముంత నిలబెట్టాలి. బైట గాబునిండా కలిపి పెట్టిన పసుపునీళ్లతో మంచం పట్టినవాళ్లకు స్నానం చేయిచాలి. పూనకాలతో ఊగే ఆడవాళ్లు లేరు. బలివ్వాల్సిన కోడి లేదు. ఆ రాత్రి డోలోళ్ల కథాగానంలో గుంపు గుంపంతా మునిగిపోవాలి కదా. అప్పుడే కర్మకాండ పూర్తవుతుంది. మరి డోలోళ్లు ఏరీ?

పెద్దయ్యని అడిగింది.

‘ఏమో.. అది మీ చిన్నన్నకే ఎరుక’ అన్న సమాధానంలో ఏదో దుఃఖపు జీర ధ్వనించింది.

చిన్నన్ననే అడిగింది.

‘వాళ్లు రారు’ అని కరకుగా జవాబు వచ్చింది.

ఆ మాటతో కళ్లలో సుళ్లు తిరుగుతున్న నీళ్లను అదుపు చేసుకుంటున్న పెద్దయ్యను అడిగింది.

‘మరి కర్మ ఎవరు చేస్తారు?’

ఆ ప్రశ్నకు చిన్నన్నే సమాధానం ఇచ్చాడు ఉరుములా.

‘ నేను మతం తీసుకున్నాను’

అతని మెడలో తళుక్కున మెరిసింది సిలువ.

ఇదీ కథ. అవును ఇదే కథ! ఈ కథలోనే ఎంతో వ్యథ ఉంది. అది సిలువను మోసిన క్రీస్తు అనుభవించిన బాధ వంటిదే.

మాయమైంది డోలోళ్లు మాత్రమే కాదు. ఒక ఆచారం. కొండలా ధైర్యాన్నిచ్చే ఒక నమ్మకం. దాసరిపాములా చప్పుడు చేయకుండా ‘మతమే లేని కోయ జాతి’నే మింగేసింది మతం. మతం ఏదైనా మింగడమే దాని లక్షణం.

తెల్లగౌను వేసుకున్న వ్యక్తి ప్రార్ధన మొదలవగానే ఎవరో మెడబట్టి తీతుగూడెం నుంచి బయటకు గెంటేస్తున్నట్టు అనిపించింది ఆమెకు. ‘అప్పటికే పెద్దయ్య నడిరోడ్డు మీద నిలబడి ఉన్నాడు.’

పద్దం అనసూయ గానం చేసిన కోయజాతి దుఃఖగాథ ఇది. ‘కోయలకో చరిత్ర ఉందనే తెలియని బయటి ప్రపంచానికి’ ఆమె ఎలుగెత్తి చేసిన ప్రకటన ఇది. అడవిని మింగడమంటే, చెట్టూ చేమా చదును చేయడం మాత్రమే కాదు. అడవికి బిడ్డల్ని దూరం చేయడం కూడా. ఆచారాలు, విశ్వాసాలతో పెనవేసుకున్న బలమైన అడవి బంధాన్ని తెంచాలంటే నమ్మకాలమేద వేటు వేయాలి. పదునుదేలిన మతం మాత్రమే ఆ పని చేయగలదు. ఆచారాలమీద కొడితే డోలోళ్లు పోతారు. డోలోళ్లు పోతే పోయేది కర్మకాండల ఆచారం మాత్రమే కాదు.  కర్మ జరిగిన రాత్రి తెల్లవార్లూ డోలోళ్లు పాడేది తరతరాలుగా గుండెల్లో దాచుకుని కాపాడుకుంటున్న కోయ చరిత్రను. చరిత్రకే సమాధి కట్టారు. కడుతూనే ఉన్నారు.

ఈ వేదనను ‘మూగబోయిన శబ్దం’ కథలో పద్దం అనసూయ చాలా బలంగా నమోదు చేశారు. కోయతూర్‌ కోయలిపిలో తొలి వాచక రచయిత అనసూయ. కోయజాతి గురించి పాటలు, కవిత్వం రాసిన ఆమె 2009లో ఈ కథ రాశారు. పద్దం అనసూయ రాసిన నాలుగు కథలతో ‘చప్పుడు’ అనే సంపుటం 2019లో వెలువడింది. తెలుగు కథ గంతలు విప్పి అడవిబాటలో నడిపించి కోయగుంపు దగ్గరకు చేర్చిన పద్దం అనసూయకు వందనాలు.

గిరిజన, సంచార జాతుల గురించిన కథలు తెలుగులో చింతా దీక్షితులు నుంచే మొదలైనా అది దూరపు చూపే. అది రూపాన్ని మాత్రమే చూపుతుంది. తీతుగుంపులోంచి పుట్టిన పద్మం కాబట్టే ఈ కథల పరిమళం కూడా మనకు అందుతుంది. కోయజనం మాట్లాడుకునే అందమైన తెలుగు మాటలెన్నో మాలగట్టి ఇచ్చింది పద్దం అనసూయ. రకరకాల వేళలకు ఆమె వాడిన మాటలు ఇవీ… బొమ్మెత్తు వేళ, మధ్య సిత్రం వేళ, సేవడి వేళ, గాంధారీ వేళ. తెలుగు భాష ఖజానాలో మెరిసే మాటల మాణిక్యాలు ఇవన్నీ. డోలోళ్లలో అరవై ఏళ్లున్న కన్నప్ప వర్ణను చూడండి.. ‘ అతని చూపు లేడిపిల్ల చూపు. అతను మాట్లాడుతుంటూ గొంతులో నుంచి జలపాతాల హోరు. తెలుగు వాక్యానికి అడవి పూల పరిమళాలు అద్దింది పద్దం అనసూయ. అయిదు పేజీల చిన్న కథలో కోయ ఆచారాలు చెప్పింది. వాటి మీద దాడిని చిత్రించింది. అడవి అందానికి పటం గట్టి చూపింది. అడవికి దూరమైన అభద్రతను వెల్లడించింది.  కోయల మారని జీవితాన్ని ఒక చిన్న దృశ్యంతో  ఆమె చిత్రించిన తీరు అద్భుతం. కోయగూడేనికి నడచి పోతున్న ఆమెకు ఒకరి తర్వాత ఒకరు జోలెను మోసుకు వస్తున్న సమూహం ఎదురైంది. ఒళ్లంతా రక్తంతో తడిసిపోయి, కండలు తెగి వేలాడుతూ బాధతో విలవిలలాడుతున్న నడివయసు మనిషి జోలెలో ఉన్నాడు. ‘ఏమైంది?’ అని ఆందోళనగా అడిగింది. ‘ఎలుగ్గొడ్డు కొట్టింది’ అని యధాలాపంగా చెప్పారు వాళ్లు, ఆమెను దాటిపోతూ.

పద్దం అనసూయ, పాల్వంచ ప్రాంతంలోని సుబ్బనపల్లి కోయగూడెం అడవి బిడ్డ. ఆమె నుంచి మరిన్ని అడవి కథల కోసం తెలుగు కథ ఆత్రంగా ఎదురుచూస్తోంది.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఈ.పుస్తకం ఎక్కడ దొరుకుతుందో లింక్ ఇస్తే బాగుంటుంది. మంచి పరిచయం.

 • మతం ఏదైనా మింగడమే దాని లక్ష్యం.చాలా చక్కగా విశ్లేషించారు . ఇవి కులమతాల గొడవలు కావు. సంస్కృతి సంప్రదాయాలు మీద దాడి.

 • మతం జాతిని, సంస్కృతిని కూడా మింగేస్తుంది. మంచి కథను పరిచయం చేశారు. సంపుటి కొరకు. … ప్రచురణ కర్త, లేదా ఫోన్ నంబర్ ప్లీజ్

 • మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.
  ధన్యవాదములు.
  పుస్తకం ఎలా పొందగలను సార్

 • కథ కథగానే ఉంటూ… చెదిరి చెరిగిపోతున్న, సాంస్కృతిక, జీవన

  విధ్వంసాన్ని ఎలా పట్టి చూపాలో రూపించిన కథను పరిచయం

  చేసినందుకు ధన్యవాదాలు సార్. మీ మాటల్లో ఆ విధ్వంసం మరింత

  చిక్కగా గుండెను పట్టేసింది.

 • కథ కథగానే ఉంటూ… చెదిరి చెరిగిపోతున్న, సాంస్కృతిక, జీవన
  విధ్వంసాన్ని ఎలా పట్టి చూపాలో రూపించిన కథను పరిచయం
  చేసినందుకు ధన్యవాదాలు సార్. మీ మాటల్లో ఆ విధ్వంసం మరింత
  చిక్కగా గుండెను పట్టేసింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు