కొ. కు. కథ “కుక్క” వినండి

విశ్వాసానికి మారుపేరుగా కుక్కనే ఎందుకు పేర్కొంటారో? విశ్వాసాన్ని గుర్తించలేకపోవడం ఎందుకని? అది మనిషితనమా? పశుత్వమా?

https://youtu.be/eLXW5Do-PhA

క్కడెక్కడో తిండి తిని ఆ కుక్క ఎప్పుడూ మా ఇంటిముందే పడి ఉంటుంది, మా ఇంటి మీద ఈగ వాలనివ్వదు.

ఇంటిముందుకు బిచ్చగాణ్ని చేరనివ్వదు. మా తలవాకిలి బండ మీద పడుకుని మా ఇంట్లోవాళ్లెవరన్నా లోపలికి వచ్చినా, బయటికి వెళ్ళినా, కళ్లు మాత్రమే పైకెత్తి చూసి తోక రాతిమీద అటూ ఇటూ పొర్లిస్తుంది. దానికి ఏ జన్మానా ఇంత అన్నపు కరుడు పెట్టి ఎరగం.

“విశ్వాసమంటే అట్లా ఉండాలి,” అనేవాడు మా నాన్న. ప్రతిఫలం కోరకుండా చూపించేదే విశ్వాసమని ఆయన తాత్పర్యం. అటువంటి విశ్వాసం ఉంచినందుకా కుక్కను చూసి మా నాన్న మెచ్చుకునేవాడు.

కానీ మా తాతకు ఆ కుక్కలో ఏమీ విశేషం కనిపించేది కాదు. “ఏ జన్మానో మన సొమ్ము తిని ఉంటుంది. ఈ జన్మలో ఋణం తీర్చుకుంటున్నది,” అని ఆయన చెప్పేవాడు.

ఆ కుక్క మా ఇంట్లోకి అడుగుపెడితే మా నాన్నా కొట్టేవాడు, మా తాతా కొట్టేవాడు. అందుచేత వాళ్లు చూడనప్పుడు నేను తలవాకిటి దగ్గర దానితో ఆడుకునేవాణ్ని. దాని వంటిమీద చెయ్యి వేస్తే మొదట్లో బాగుండేది. కానీ రాను రాను బాగా ఉండేది కాదు. ఒకసారి నా చేతికి దాని కురుపులు కూడా తగిలాయి. తరువాత దాన్ని ముట్టుకోవటం మానేశాను.

నాకు కురుపులు లేస్తే చాలా మందులు వేశారు. కుక్కకు కురుపులు లేస్తే ఎవరూ మందు వెయ్యరు. మందు వేస్తే కుక్క కురుపులు కూడా నయమై దాని వళ్లు మళ్లీ వెనకటి లాగా అవుతుందేమో.

ఒకసారి ఆ కుక్క మాకు గొప్ప ఉపకారం చేసింది. అది వేసంకాలం. అందరం, ఇంటిల్లిపాదీ, బయట పడుకున్నాం. చీకటి రాత్రి. ఒక రాత్రివేళ తలవాకిలి తలుపు దగ్గిర కుక్క గట్టిగా మొరిగి, కాళ్లతో గీరసాగింది. మా నాన్న లేచాడు. మా తాతా, అందరమూ లేచాం. మేం లేవటం చూసి దొంగవాడు గోడ దూకి పారిపోయినాడు. వాడు గోడ ఎక్కి లోపలికి దూకటం కుక్క చూసి ఉండాలి.

ఆ కుక్క చేసిన మేలు గురించి నాన్న ఎంతమందితో చెప్పాడో లెక్కలేదు, “దానికి మేమెన్నడూ పట్టెడన్నం పెట్టి ఎరగం! విశ్వాసమంటే అట్లా ఉండాలి,” అనేవాడు మా నాన్న.

వెనకటినే మా తాత, “ఆఁ, ఏ జన్మలోనో మన సొత్తు తిని వుంటుంది. ఇప్పుడు ఋణం తీర్చుకుంటున్నది,” అని అందుకునేవాడు.

ఏమైనా మా నాన్న మాత్రం కొంత చలించాడు. కుక్కను లోపలికి రానివ్వసాగాడు. ఎప్పుడన్నా – రెండుమూడు రోజులకోసారి – అన్నం మిగిలితే అందరూ తిన్న తరువాత ఇంత పెట్టించేవాడు.

కానీ ఏం లాభం? మా నాన్న అనుగ్రహం దానిమీద ఎంత పెరిగిందో మా తాత ఆగ్రహం దానికి రెండింతలు పెరిగింది. మెట్లమీదికి వచ్చి కూచుందని ఒకరోజు మా తాత దాన్ని కర్ర తీసుకుని చావగొట్టాడు. ఇంకోరోజు వంటయింటి వాకిలి దగ్గిరికి వచ్చిందని చావగొట్టాడు. పైపెచ్చు మా నాన్నను చివాట్లు పెట్టాడు.

“వెధవ కుక్కకు నువ్వే నేర్పావు. దానికి అన్నమెందుకు వెయ్యాలి? తలవాకిటి దాటి లోపలికి అడుగుపెట్టనిదాన్ని లోపలికెందుకు రానివ్వాలి? చూడు ఎట్లా నెత్తికెక్కుతున్నదో!”

మా నాన్న నీళ్లు నములుతూ, ఆ రోజు కుక్క నిద్ర లేపకపోతే దొంగలు ఇల్లు దోచుకునేవాళ్లనీ బయట పడుకున్న వాళ్లకు ఏమీ తెలిసి ఉండేది కాదనీ గొణిగాడు.

మా తాత గోండ్రించాడు. ఈ వెధవకుక్క గాంగా ఇల్లు రక్షించింది లెమ్మన్నాడు. ఈ శని నెత్తిన ఎక్కే కన్నా దొంగలుపడి దోచుకుపోయినా బాగుండేదన్నాడు.

లోపలికి వచ్చి వరండా మెట్లమీద పడుకున్నందుకే, వంటింటి తలుపు దగ్గిర నిలబడి లోపలికి చూసినందుకే మా తాత కుక్కను చావబాదితే మరో రోజు అది ఇంకా గొప్ప అత్యాచారం చేసింది – ఎక్కణ్నుంచో అన్నపు కరుడు తెచ్చుకుని మా తలవాకిలి పక్కగా ప్రహరీగోడ దగ్గిర పెట్టుకు తింటున్నది. ఇది మా తాత కంటపడింది. ఆయన చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. అది వంటింట్లోనుంచే అన్నం కరుడు ఎత్తుకొచ్చిందన్నాడు. తలవాకిలి తలుపు మూసి దుడ్డుకర్ర తీసుకొని దాని వెంటపడ్డాడు. అది కరుడు మాత్రం నోట కరుచుకొని ఆయన్ను దొడ్డి చుట్టూ తిప్పింది. కర్ర విసిరేస్తే తప్పించుకున్నది. చివరకు మా నాన్నే తలవాకిలి తలుపు తెరిచి దాన్ని తప్పించుకుపోనిచ్చాడు.

తీరా విచారిస్తే అది వంటింట్లో అడుగు పెట్టనే లేదు. వంటింటి తలుపు భద్రంగా వేసి ఉంది. అన్నం గిన్నె చక్కగా మూతపెట్టి ఉంది.

కానీ ఆ కుక్క మళ్లా మాకు కనిపించలేదు. మా దొడ్లోకి అడుగుపెట్టలేదు. మా తలవాకిలి దగ్గర పడుకోలేదు.

అది వెళ్లిపోయిన నెలరోజుల్లోగానే మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా తాత కోరిక ఫలించింది.

ఎందుకో నాకూ ఆనందమే కలిగింది.

*

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు