కొత్త తరానికి కాసింత బలం…

(జూన్ 1 న హైద్రబాదు రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్సు హాల్లో శీలావి రెండవ వర్ధంతి సభ జరుగుతున్న సందర్భంగా)

శీలా వీర్రాజు గారి ప్రథమ వర్థంతి నుండి ఏదైనా ఒకపని స్థిరంగా వుండేలా చేయాలనుకున్నారు శీలా సుభద్రాదేవి. నిజానికి ఆమె పదవీవిరమణ తర్వాత వచ్చిన డబ్బు నుండి – పురాస్కారాలు ఇవ్వటం మొదలుపెట్టాలకున్నారు. మొదట్లో పుస్తకాలు వేసుకోని వారికి ఒకపుస్తకం ప్రచురించి కాపీలు వారికి ఇవ్వాలని కూడా నిర్ణయించుకొని ఆవిధంగా మూడు పుస్తకాలు మూడు సంవత్స రాలు వేశారు కూడా. ఒక ఇద్దరివి డీటీపీ చేయించేసరికి ఆ రచయితలు చనిపోవటంతో అదీ ఆగిపోయింది. కానీ శీలావీ సంకల్ప బలం గొప్పది. అందుకే ఆయన కుటుంబ సభ్యులు అపారమైన ప్రేమతో ‘శీలావీ సాహిత్య చిత్ర కళా వేదిక’ స్థాపించారు. ఆ వివరాల కోసం సారంగ చేసిన మాటామంతీ పాఠకుల కోసం–

శీలావీ సాహిత్య చిత్రకళా వేదిక ఆవిర్భావ ఆలోచన గురించి చెప్పండి

శీలావీ సాహిత్యంలో దీర్ఘ కవిత, కథ, నవల మూడు ప్రక్రియల్లో తన కంటూ ఒక ముద్రవేసుకున్నారు. వీలునిబట్టి ఒక్కో ఏడాది ఒక్కో ప్రక్రియకు ఇవ్వచ్చనుకుంటున్నాం.   సాహిత్యానికి  సమాంతరంగా వీర్రాజుగారు చిత్రకళలో కూడా కృషిచేసారు. కనుక చిత్రకారులకు కూడా పురస్కారం ఇవ్వాలన్న ఉద్దేశ్యం కలిగింది. ఆవిధంగా శీలావీ సాహిత్య చిత్ర కళా వేదిక ఏర్పడింది.

వేదిక ముఖ్య ఉద్దేశ్యాలేమిటి ? 

వేదిక ద్వారా వీర్రాజుగారివి, నావి పుస్తకప్రచురణలు చేయాలని, సాహిత్యానికి,  చిత్రలేఖనం లోనూ కృషి చేసిన వారి కీ ప్రతీ ఏడాది పుర స్కారాలు ఇవ్వాలనే నిర్ణయించాము.

మీ పై శీలావి సృజన ప్రభావం ఎటువంటిది ?

నాపై అక్కయ్య  పి సరళాదేవి, మా అన్నయ్య కాశీపతి రావు ప్రభావమే ఎక్కువ . దీనికి  నేను చిన్నప్పటి నుండీ చదివిన సాహిత్యం దోహదం చేసింది. అయితే  వివాహానంతరం అప్పటికే కొద్దిగా రచనలు చేస్తున్న నాకు వీర్రాజుగారి సాహచర్యం మరింతగా ఉత్సాహాన్నీ ఇచ్చింది. ఆయనది వర్ణనాత్మక శైలి. నాకు సూటిగా రాయడం  అలవాటు. అయితే మాయిద్దరి సాహిత్య ధోరణులు కూడా వేర్వేరు.

ఈ సంవత్సరం పురస్కారాల ఎంపిక గురించి చెప్పండి.

ఉమ్మడిసెట్టి, ఇంద్రగంటి, శిఖామణి, రొట్టమాకురేవు ఇలా కవిత్వానికి చాలా పురస్కారాలున్నాయి. కుందుర్తి ప్రభావం చేత శీలావీ గారూ నేనూ దీర్ఘ కవితల మీద ఎక్కువ శ్రద్ద పెట్టాము. ఆవంత్స సోమసుందర్ గారు కూడా దేవులపల్లి రాజహంస –  కృష్ణశాస్త్రి పేరిట దీర్ఘ కవితలకి గౌరవం ఇచ్చేవారు. అది మా ఇద్దరికీ ఇవ్వడం జరిగింది.  సుమారు పాతికపైబడి దీర్ఘ కవితలను పరిశీలించాను. ఆసాంతం చదివించే శైలి,  సమకాలీనత, అంతర్లీనంగా ఒక కథ, చరిత్ర నిక్షిప్తం కావాలని ఆశించి 1818 రాసిన  శ్రీరాం కి ఈ పురస్కారం ఇవ్వాలనుకున్నాను.

శీలావీ చివరి రోజుల్లో అన్వర్ అంటే ఎంతో అభిమానించేవారు. తను కూడా శీలావీలాగే ఒక మారుమూల పల్లెటూరు నుండి వచ్చి ఇల్లస్ట్రేషన్స్ తో మొదలుపెట్టి  ఈరోజు తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకున్నాడు కనుక అన్వర్ ని ఎంపిక చేశాము. శీలావీ తన బొమ్మల మీద అన్వర్ ఒక వ్యాసం రాయాలని కోరుకున్నారు కూడా.

వేదిక భవిష్యత్ ప్రణాళిక ఏమిటి?

లబ్దప్రతిష్టులైన కవులకన్నా మా చూపు కొత్తతరం మీద ఎక్కువ ఉండాలనుకుంటున్నాం. కొంత ప్రయోగాత్మకత, నవీన దృక్పధం కావాలి. అలాగే   చిత్రకారుల పట్ల కూడా కొంత కొత్త చూపుతో వ్యవహరించాలన్నది మా సంకల్పం. రాజమండ్రి ఆర్ట్ గేలరీలో శీలావీ గారివి 78 చిత్రాలున్నాయి. అక్కడ కూడా  ప్రతియేడూ ఒకర్ని సత్కరించాలన్నది మా ఆకాంక్ష. అలాగే కష్టమైనా నష్టమైనా శీలావీ  స్కెచ్ బుక్క్స్ అచ్చులో తేవాలన్న ఆశయం నెరవేర్చాలి. ప్రస్తుతానికి ‘శీలావీ శిల్పరేఖలు’ తెస్తున్నాం. మరిన్ని తేవల్సి ఉంది.

ఈ పనిలో మీకు తోడున్న వారెవరు ?

ప్రస్తుతానికి నేను, మా అమ్మాయి పల్లవి, మనుమరాలు ఆశ్లేష ఉన్నాం. మమ్మల్నీ మా  ఆశయాల్నీ ఇష్టపడే మిత్రులున్నారు. ఆయిష్షు గల్గినంత మేర ఈ పని చేయాలి.

*

గతంలో సారంగ లో శీలా వీర్రాజు గారు:

 

ఫ్రీవర్స్ ఫ్రంట్ వల్ల కవిత్వానికి వేగం: శీలా వీర్రాజు

ఆ రంగుల టేబుల్ మీద కుంచె నేనే !

ఎడిటర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు