కొత్త కథా వస్తువులకు కొదువ

కథకులకు, కథావిమర్శకులకు ఆహ్వానం

ఈ కింది ప్రశ్నలకు మీ సమాధానాలు  కూడా పంపించండి. చర్చలో పాల్గొనండి. మీ సమాధానాలు పంపించాల్సిన ఈ-చిరునామా: editor@saarangabooks.com

ఈ సంచికలో వెంకట్ ఈశ్వర్ సమాధానాలు చదవండి.

 

2010 నుంచి 2023 వరకు వచ్చిన కథలపై వస్తుపరంగా, శిల్పపరంగా మీ అభిప్రాయాలు..

2010 నుంచి ఇప్పటి వరకూ నేను రెగ్యులర్‌గా కాకపోయినా అప్పుడప్పుడైనా మ్యాగజైన్స్‌లో వచ్చే కథలు చదువుతుంటాను. ఆ కథల్లో కథావస్తువులు కేవలం ఇరవై శాతం మాత్రమే మిగిలిన కథల కంటే విభిన్నంగా ఉంటున్నాయి. మిగతావన్నీ చాలా వరకూ చెప్పిన వాటి గురించే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలు పట్టించుకోని వృద్ధుల గురించీ, మానవ సంబంధాల్లో అపార్థాల గురించి.. ఇలా ఒకే రకమైన అంశాల మీద కథలు వస్తున్నాయి. సంతోషించిదగ్గ విషయం ఏంటంటే వీటిలో శిల్పపరంగా కాస్తంత వైవిధ్యం ఉండనే ఉంటోంది. కాకపోతే తీసుకునే వస్తువు కూడా వైవిధ్యంగా ఉంటే బాగుండుననిపిస్తుంది. కొత్త పాత్రలు, కొత్త కథావస్తువులు ఎల్లప్పుడూ కథ శిల్పాన్ని కొత్తగా నిర్ధేశిస్తాయనేది నా అభిప్రాయం. అందుకే కొత్త కథా వస్తువుల మీద రాయడంలో ఇంకా మనం కొంచెం వెనుకబడే ఉన్నామనిస్తుంది నాకు.

మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా –

నాకు ఈ మధ్య బాగా నచ్చిన కథల్లో ఇండ్ల చంద్రశేఖర్ రాసిన ‘మేజిక్ ఇఫ్’ అనే కథొకటి. అందులోని పాత్రలు అన్నీ కొత్తగా ఉండడం, అది కూడా కథ కరోనా టైంలో జరగడం, కథావస్తువు సూక్ష్మంగా మనిషిలోని విభిన్న పార్శ్వాలని తాకుతూ ముందుకు వెళ్ళడం.. ఇవన్నీ ఆ కథ శిల్పాన్ని కొత్తగా మార్చేసి, చదివినంతసేపు చాలా ఉత్సాహాభరితంగా సాగుతుంది. ఇంకొకటి ఆంధ్రజ్యోతిలోనో, సాక్షిలోనో వచ్చిన ‘అస్థిమితం’ అనే కథ. అందులో సాదాసీదా మనిషి తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా నిజమైన ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకునే పరిమాణ క్రమాన్ని చాలా బాగా రాశారు. 

ఇవి కాక ‘ఊర్మిళక్కతో సెక్స్’, ‘కోటమామ కూతురు’ లాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక నచ్చని కథలు కూడా ఉన్నాయి. వాటి గురించి బహిరంగంగా మాట్లాడ్డం కంటే ఆయా రచయితలతో చర్చించడం బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక కథ బాగా లేదు అని ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పాల్సిన పని లేదు. అది రాసిన రచయితతో సహా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకు బాగా రాలేదని తర్కించుకోవాల్సిన అవసరం పాఠకుల బాధ్యత కాదు, రచయితదే. అప్పుడే ఇంకో కొత్త తరహా కథ రాయడానికి దారి కనిపిస్తుంది.

మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు –

    చాలా మంది కొత్త కథకులు నా దృష్టిలో ఉన్నారు. వాళ్ళందరూ కొత్త వాళ్లు అని చెప్పలేను. వాళ్ళలో ‘రైటింగ్’ అనే ప్రక్రియ ఇప్పుడు రాస్తున్న వాళ్ళకంటే ముందు నుంచే మొదలై ఉండొచ్చు. కేవలం కథ బయటికి వచ్చి, ఆ కథ పాపులర్ అయిన రోజు నుంచీ మాత్రమే రైటర్ అనడం నాకు నచ్చదు. ఎవరూ ఉన్నట్టుండి రైటర్లు అయిపోరు గదా! కొత్త, పాత రైటర్లు అని కాకుండా నేను చదివిన కథల గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాను. వాళ్ళది మొదటి కథ, చివరి కథ, ఎప్పటి నుంచి రాస్తున్నారు అనేది అనవసరం అని నా వ్యక్తిగత అభిప్రాయం.

తెలుగు కథాసాహిత్యంలో గత రెండు దశాబ్దాలుగా  వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించగలిగాయా?

స్పృశిస్తున్నాయి కానీ అనుకున్నంత లోతుగా స్పృశించడం లేదనేది నా ఉద్దేశ్యం.

మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

అందరిలాగే మ్యాగజైన్స్, ఈమాట, సారంగ,  కొత్తకథల  పుస్తకాలు, కొత్త సంకలనాలు ఏమైనా వచ్చాయేమోనని ఫ్రెండ్స్‌ని అడుగుతుంటాను, దొరకని స్టోరీస్ లేదా అందుబాటులో లేనివి కథానిలయంలో దొరుకుతాయేమోనని చూస్తుంటాను.

రెండు దశాబ్దాలుగా కథా విమర్శ నాకు తృప్తినిచ్చింది. ఇంతకుముందు రమణమూర్తి గారు ప్రతినెలా పబ్లిష్ అయ్యే కథలు గురించి ఒక పోస్టు రాస్తుండేవారు. అది చాలా ఉపయోగపడేది. ఆయనెందుకు రాయడం మానేశారో తెలియడం లేదు.

కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏ విధంగా దోహదపడుతున్నాయి?

రాసిన ప్రతి ఒక్కరు తమ కథల్ని రికార్డు చేసుకోవాలి. అప్పుడే అది ఆయా రచయితలకు, ముందు తరాల వారికి ఇంకొంచెం మెరుగ్గా రాయడానికి చాలా ఉపయోగపడుతుంది.

మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?

ఇతర భాషల కథలు చాలా బాగుంటేనే అనువాదంగానో, లేదా ఆ భాష పూర్తిగా తెలిసి దాన్ని చదివేవాళ్లో సూచిస్తే మనదాకా వస్తున్నాయి. ఇతర భాషల్లో అంతగా ఆకట్టులేని కథలు లేకపోలేదు. మనవి కూడా ఇతర భాషల్లోకి అనువాదం అవుతున్నాయి. నిన్న గాక మొన్న అల్లం శేషగిరిరావు కథలు తమిళంలోకి అనువదించారని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది.

*

వెంకట్ ఈశ్వర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు