కొత్త ఆలోచనలవైపు రచయితలు మళ్లాలి

కేంద్ర సాహిత్య అకాడమి అనువాద ప్రక్రియ అవార్డు గ్రహీత పి. సత్యవతి గారితో ముఖాముఖి

బాలాంత్రపు ప్రసూన: నమస్కారం . ముందుగా కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డ్ అందుకున్నందుకు మీకు హృదయపూర్వక అభినందనలు .

పి. సత్యవతి : థాంక్స్ అండి .

బా. ప్ర .: మీరు స్వయంగా రచయిత్రి అయి ఉండి , ఉత్తమ సాహిత్యంగా ఎంచదగ్గ ఎన్నో కథలు రాసారు. మీకు అనువాదానికి అవార్డ్ రావడం పై మీ స్పందన ?

పి.స. : ( నవ్వుతూ ) నో కామెంట్స్ .

బా.ప్ర.: మీరు అనువాద ప్రక్రియ ఎప్పటినుంచి మొదలు పెట్టారు ?

పి.స.: నేను దాదాపు యాభై సంవత్సరాలునుండి కథలు వ్రాస్తున్నాను. వ్రాసిన కథల సంఖ్య తక్కువ. తర్వాత కాలంలో అనువాదాలు చేయడం మొదలు పెట్టాను. నేను మొదట అనువాదం చేసినది ఆదివాసి లకై పని చేసిన జాను స్వీయ చరిత్ర ‘మదర్ ఫారెస్ట్ ‘. నా అంత నేనే పబ్లిషర్ ఫోన్ చేసి నేనూ అనువాదం చేస్తానని అడిగాను . అది నా మొదటి అనువాదం ‘ అడవి తల్లి ‘.

బా.ప్ర.: ఈ మధ్యే మీరు తోట అపర్ణ వ్రాసిన ‘ పూర్ణ ‘ అనే పుస్తకాన్ని అనువాదం చేసారు కదా . అదీ ఇంగ్లీష్ నుండి తెలుగుకే . ఇప్పుడు అవార్డ్ వచ్చిన ‘ ఒక హిజ్రా ఆత్మ కథ ‘ కూడా ఇంగ్లీష్ నుండి తెలుగుకే .

పి.స.: అవునండి

బా.ప్ర.: రెండిటి లోను మీరు చూసిన తేడా ?

పి.స.: ‘ పూర్ణ ‘ హిమాలయాలు ఎక్కిన ఒక సాహసికురాలు కథ . అందులో టెక్నికల్ పదాలు ఎక్కువగా ఉన్నాయి .అవి జాగ్రత్తగా గమనించి వ్రాయవలసి వచ్చింది . ఈ పుస్తకం అలా కాదు .మనం చూసే విషయాలే . మనస్సును కదిలించే సంఘటనలు .. ఇది సాఫిగా సాగిపోయింది .

బా.ప్ర.: ఈ పుస్తకం ఎంచుకున్న కారణం ?

పి.స.: గీతా రామస్వామి గారు ఈ పుస్తకం పంపి దీనిని తెలుగులోకి అనువాదం చేస్తారా , మీకు నచ్చుతుంది అని అడిగారు . అప్పటికే ఈ పుస్తకం గురించి విన్నాను . ఈ పుస్తక రచయిత రేవతి గారు , నిజాయితీగా తన జీవితంలోని ఎన్నో సంఘటనలు మన ముందు ఉంచారు అనిపించింది . అందుకనే వెంటనే ఒప్పుకున్నాను . హిజ్రా జీవితం లో కష్టాలు మనకు ఎదురుగా కనపడవు .వారు ఎదుర్కునే వివక్ష చాలా ఎక్కువ . ఇది అందరికి తెలియజేయవలసిన అంశం . ఆమె ఆ పుస్తకం లో చెప్పినట్లు హిజ్రాలు రోడ్ల పై అడుక్కుంటారని , వ్యభిచారులని సమాజం నిందిస్తుంది . కాని వారికి ఆ పరిస్తితులు ఎందుకు వచ్చాయని ఆలొచించము . వారికి ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. కిరాణ షాపులో పొట్లాలు కట్టడానికి , హొటల్స్ లో బేరరుగా పని చెయ్యడానికి కూడా ఒప్పుకోరు. హిజ్రాలుగా మారడం వారు కోరి తెచ్చుకున్న సమస్య కాదు . వీరి విషయంపై సానుభూతి , అవగాహన లేకుండా సమాజం వారిని దుర్భర పరిస్తితులోకి , అట్టడుకి నెట్టివేస్తోంది . ఇది ఈ 21 వ శతాబ్దం లో స్పందించవలసిన విషయం .

బా.ప్ర.: అవునండి .రేవతి గారు ఈ నవల తమిళంలో రాసారు . అది ఇంగ్లీషు లోకి అనువాదం అయ్యింది . మీకు మాతృక ఇంగ్లీష్ అయ్యింది .

పి.స.: నాకు తమిళం రాదు. అందుకు ఇంగ్లీష్ తీసుకున్నాను .

బా.ప్ర.: మరి దీని వలన ఒరిజినల్ లో ఉండే భావం , అర్థం మారిపోయే అవకాశం ఉందా ?

పి.స.: ఉండవచ్చు . తమిళం నుండి ఆంగ్లం కి ఎంతవరకు న్యాయం జరిగిందో నాకు తెలియదు . కాని ఇంగ్లీష్ నుండి తెలుగుకి నేను పూర్తి న్యాయం చెయ్యాలనే ప్రయత్నం చేసాను . అయితే మీరు ఇంగ్లీష్ నవల చదివితే మీకు ఏది అసందర్భంగా కాని , లింక్ లేనట్లు కాని , భాష పరంగా కూడా అర్థం లేనట్లుగా కాని ఉండదు . అందువలన తమిళం నుండి ఇంగ్లీషు కు కూడా బాగానే ఉండి ఉంటుంది .

బా.ప్ర.: సరియైన విషయం ప్రస్తావించారు . అనువాద ప్రక్రియ తేలికైనది కాదు .

పి.స.: అవును అనువాదప్రక్రియ తేలికయినది కాదు . అనువాదం అంటే మాటకు మాట అనువాదం చెయ్యడం కాదు. ఒక మాటకు డిక్షనరీ లో అర్థం వేరే ఉండవచ్చు . కాని వాడుకులో వేరే అర్థంతో ఉపయోగించవచ్చు . ఇది అర్థం చేసుకోకుండా అనువాదం చేస్తే రచయిత భావం పాఠకులకు చేరదు .

బా.ప్ర.: అనువాదం చేసేటప్పుడు సందర్భాన్ని బట్టి మీ స్వంత అభిప్రాయం చేర్చే అవకాశం ఉంటుందా ?

పి.స.: లేదండి . అలా చేస్తే అనువాదానికి న్యాయం చేసినట్లు కాదు . ఒరిజినల్ లో ఉండే భావం , సామెతలు , మాండలికాలు — ఇంగ్లీష్ లో ఇడియంస్ అంటాము — ఇవి అర్థం చేసుకోవాలి . ఏ భాష కుండే సొగసు దానికి ఉంచుతూనే భావం సరిగ్గా అందచెయ్యాలి . రెండు భాషల సొగసు , అందం , రంగు , రుచి – ఏదీ పోగూడదు .

బా.ప్ర.: అవునండి.

పి.స.: ఈ పుస్తక రచయిత్రి రేవతి గారికి ఎవరో ఫోన్ చేసి తెలుగు అనువాదానికి అవార్డ్ వచ్చిందని చెప్పారుట. ఎలాగో కష్టపడి నా ఫోన్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసారు . ఆమెకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు . నాకు తమిళం రాదు . ఆమె కొన్నాళ్ళు ముంబాయి లో ఉన్నారుట , అందుకని కొంచం హింది వచ్చు . ఆమె హింది , తమిళ్ కలిపి మాట్లాడితే , నేను హిందీ , తెలుగు కలిపి మాట్లాడాను . అవార్డ్ వచ్చినందుకు ఆమె నన్ను అభినందిస్తూ , తన పుస్తకానికి గౌరవం వచ్చినందుకు సంతోషించారు . నేను కూడా ఈ పుస్తకం ఇంకా పదిమందికి చేరి , మనందరి ఆలొచన పరిధి విస్తృతం అవుతుందని ఆనందపడ్డాను .

బా.ప్ర.: తెలుగులో అనువాద ప్రక్రియ ప్రస్తుత పరిస్తితి పై మీ అభిప్రాయము ?

పి.స.: తెలుగులోకి అనువాదాలు జరగాలి. అలాగే తెలుగు కథలు కూడా అనువదించబడాలి . ఎందరో మంచి తెలుగు కథకులున్నారు. వీరి గురించి దేశమంతా తెలియజేయవలసిన అవసరం ఉంది . అనువాదకులతో పాటు మంచి ఎడిటర్లు ఆవశక్యత ఉంది . ఇంగ్లీష్ సాహిత్యం లో ఏ నవలైనా ఎడిటర్ చేతిలో చిత్రిక పట్టకుండా బయటకు రాదు. మన తెలుగులో ఆ అవకాశం లేదు . మంచి ఎడిటింగ్ వల్ల రచయితలు లబ్ధి పొందుతారు .

*

Avatar

ప్రసూన బాలాంత్రపు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది. సత్యవతి గారికి అభినందనలు.

  • అవును . అనువాదం క్లిష్టమైన ప్రక్రియ. వేరొకరి చెప్పుల్లో కాళ్ళు పెట్టి నడవటం లాంటిది. సత్యవతి గారికి మంచి అనువాదాలు చేసినందుకు. గొప్ప అవార్డు అందుకున్నందుకు అభినందనలు. అలాగే రచయిత్రిగా కూడా మీరు అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నాను.

  • చివరి సమాధానం కీలకం. క్రైయింగ్ నీడ్. తెలుగు సాహిత్య వాతావరణంలో కష్ట మైన పనికూడా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు