కూచిమంచి కిష్టుడిక్కడ – అటే పెవరూ….

మీకు భద్రిరాజు వెంకట గోపాల క్రిష్ణ గారు తెలుసా.. తెలీదు కదా..! నాకూ తెలీదు…! అందుకే ఆయన గురించి చెప్పడం లేదు.
మీకు కూచిమంచి కిష్టుడు గారు తెలుసా. తెలీదు కదా…! నాకు తెలుసు…! అందుకే ఆయన గురించి చెప్తా.
ధైర్యానికి తన పేరు మార్చుకోవాలని అనిపించిందనుకోండి. అది వెంటనే కూచిమంచి కిష్టుడు అని మార్చేసుకుంటుంది.
మొండితనానికి పరాకాష్ట ఎలా ఉంటుందో చూడాలని ఆ మొండితనానికే అనిపించిందుకోండి. అది వెంటనే కూచిమంచి కిష్టుడి గారి తలుపు తడుతుంది.
గ్రామ రాజకీయాలు ఎలా ఉంటాయో ఢిల్లీ స్థాయి పెద్దలకి అర్దం కావాలనుకోండి… కిష్టుడి గారి రాజకీయం గురించి తెలుసుకుని ” ఇలా ఉంటాయా రాజకీయాలు” అని ఆ ఢిల్లీ పెద్దలకి భయమేస్తుంది.
ఇన్నెందుకు కాని… ఓ పరిపూర్ణమైన నిండైన మనిషి కూచిమంచి కిష్టుడు గారు.
అమలాపురం మున్సిపాలిటీకి చైర్మన్ గా చేసిన ఏకైక బ్రాహ్మడు కూచిమంచి కిష్టుడు. ఆయనకు ముందు కాని, ఆయన తర్వాత కాని ఆ పదవిలోకి వచ్చిన బ్రాహ్మడు లేరు. లేరు అనే కంటే రానివ్వలేదు అనడం సబబు.
కూచిమంచి కిష్టుడు గారు ఇంకో ఐదారంగుళాలు పొడవుంటే రక్తకన్నీరు నాగభూషణం అనుకుంటారు. ఖద్దరు పంచె, ఖద్దరు చొక్కాతో ఎప్పుడూ తళతళా మెరిసిపోతూ ఉండేవారు. తలకి వీలున్నంత ఎక్కువ కొబ్బరి నూనె రాసుకుని ఒక్క వెంట్రుక కూడా చెదిరిపోకుండా వెనక్కి దువ్వేవారు. ఆయన జుట్టు నలుపు తెలుపుల కలనేత ఖద్దరు పంచెలా ఉండేది. కళ్ల జోడు అలంకారమే తప్ప వాడింది తక్కువే. లూనా బండి మీదే తిరిగే వారు. ఆయన రిక్షా ఎక్కారంటే ఒంట్లో నలతగా ఉన్నట్లే. తన లూనా మీద మున్సిపల్ ఆపీసు (ఆఫీస్) కి ఉదయం 8 గంటలకు బయలుదేరితే 11 గంటలకి చేరే వారు. ఇంతకీ వాళ్లింటికి, మున్సిపల్ ఆపీసుకి మధ్య దూరం రెండు కిలోమీటర్లే. రెండు కిలోమీటర్లకి మూడు గంటలు. అదీ బండి మీద. నడిచినా అరగంటే కదా… అనుకుంటున్నారా. ఇంటి దగ్గర లూనా స్టార్ట్ చేస్తే అగ్రహారంలో కనీసం పది మజిలీలు ఉండేవి. ఉదయం పూట కాలేజీకి వెళ్లే డిగ్రీ కుర్రాళ్లకి జాగ్రత్తలు చెప్పేవారు. అగ్రహారంలో ఓ నలుగురు కలిసి మాట్లాడుకుంటూంటే వారి దగ్గర తన బండి ఆపేవారు. “ఏరా.. ఏటీ కబుర్లు. ఇంట్లో అందరూ బాగున్నారా. ఇక్కడేం చేస్తున్నారు. అంతా బాగుందా” అని కుశలం అడిగేవారు. సిగరెట్లు కాలుస్తున్న కుర్రాళ్లు ఆయన్ని చూసి ఆ సిగరెట్ ని పడేస్తే “మళ్లీ ఇదో బొక్క. గౌరవం ఎందుకులే. డబ్బులు, వొళ్లు తగలేసుకోకండి” అని సున్నితంగా మందలించే వారు.
అగ్రహారం డీలక్స్ థియేటర్ తో ప్రారంభమైతే ముగింపు కూచిమంచి కిష్టుడి గారి ఇంటితో ఉండేది. ఇద్దరు అన్నదమ్ములు. కూచిమంచి వెంకటరత్నం గారు కిష్టుడి గారి అన్నయ్య. న్యాయవాది. పేరుకే కాదు నిజంగానే న్యాయవాది. ఆ ఇద్దరు అన్నదమ్ములు న్యాయం కోసం పుట్టారా అనిపిస్తుంది ఇప్పుడు.
కూచిమంచి వెంకటరత్నం గారు సౌమ్యులు. ఆయన తమ్ముడు కూచిమంచి కిష్టుడు గారు సగం సౌమ్యులు. మిగిలిన సగం అసౌమ్యులు. కోపం ముక్కు మీద కాదు. నరనరాల్లోనూ ఉండేది. ఆ కోపానికి పరమార్ధమూ ఉండేది.
కొత్తగా వచ్చిన ఎస్సై. పోతారెడ్డి. రాయలసీమ బిడ్డ. అమలాపురం చెడిపోతోందని, తాను దాన్ని బాగు చేయడానికి వచ్చానని పోతారెడ్డి విశ్వాసం. నమ్మకం. ఊరిలో ఒకరిద్దరికి మాత్రమే బుల్లెట్ మోటారు బళ్లు. అలాంటిది కొత్తగా వచ్చిన ఎస్సై పోతారెడ్డికి బుల్లెట్. డు… డు…డు…డూ అంటూ అది చేసే శబ్దమే ఓ భయానకపు నిశ్శబ్దం. అగ్రహారం చివరిలో క్రిష్ణమూర్తి వీధిలో పోతారెడ్డి నివాసం. ముమ్మిడివరం గేటు దగ్గర పోలీస్ స్టేషన్. ఉదయం ఏ ఎనిమిది గంటలకో స్టేషన్ కి బయలుదేరే వారు పోతారెడ్డి అగ్రహారం మీదుగా. ఆయన బుల్లెట్ అగ్రహారంలోకి రాగానే కాకులు అరుపులు మానేసేవి. పిల్లలు పరుగు పరుగున ఇళ్లలోకి పరుగులు తీసేవారు.
అగ్రహారాన్ని ఓ అకారణ భయం వెంటాడేది.
అగ్రహారాన్ని ఓ నియంత రాజ్యమేలుతున్నట్లుగా ఉండేది.
అగ్రహారాన్ని ఓ ఖాకీ కావరం కలవరపెట్టేది.
అగ్రహారాన్ని ఓ బుల్లెట్ శబ్దం గుబులు పుట్టించేది.
*** *** ***
“ఆయ్… రిచ్చాలు సమంగానే ఉన్నాయండి. అగ్గురోరంలో ఎవరికీ అడ్డుకాదండి. ఓ మూల ఎట్టుకున్నావండి. ఆయ్ ”
“పకాశం ఈది ఎదురుగా మీ తలం (స్థలం) దగ్గరే ఎట్టావండీ. ఆ ఎస్సై తీయండ్రారా అంటున్నాడండి”
“అగ్గురోరంలో ఉన్నాం. ఏడకెళ్తాం. నాలుగు డబ్బులు ఇక్కడే. ఆయనేమో రిచ్చాలు తీసేయండి దొంగ…. జి కొడుకుల్లారా అంటున్నాడండి. ఎల్లిపోమనచ్చు కాని బూతులేటండీ”
రిక్షా వాళ్లు కూచిమంచి కిష్టుడి గారికి ఫిర్యాదు చేశారు. కాదు… కాదు… వాళ్ల గోడు చెప్పుకున్నారు.
కూచిమంచి కిష్టుడు గారు విన్నారు. నవ్వేరు. విని నవ్వేరు. నవ్వి విన్నారు. ఏం మాట్లాడలేదు. తలని రెండు మూడు సార్లు కిందకి పైకి ఊపారు.
రిక్షా కార్మికులు ఏం మాట్లాడలేదు. మౌనంగా వెళ్లిపోయారు. వెళ్లిపోవడానికి ముందు కిష్టుడి గారి ఇంటి పనిమనిషి ఇచ్చిన టీ నీళ్లు తాగి వెళ్లిపోయారు.
తెల్లారింది……
కూచిమంచి కిష్టుడు గారు రిక్షా స్టాండ్ దగ్గర నేలపై కూర్చున్నారు. ఈ విషయం అలా అలా అగ్రహారం అంతా పాకింది. పదుల సంఖ్యలో అగ్రహారీకులు వచ్చేశారు. అది వందల సంఖ్యలోకి మారింది.
ఇలా వచ్చిన వాళ్లలో పెద్దవారున్నారు. మధ్య వయస్కులున్నారు. కుర్రాళ్లున్నారు. ఆడవాళ్లు ఉన్నారు. చిన్న పిల్లలం మేం ఉన్నాం.
శుభ్రంగా సాన్నం చేసి ఎప్పటిలాగే మిలమిల మెరిసి పోతున్న కూచిమంచి కిష్టుడు గారు కటిక నేల మీద కూర్చున్నారు. నినాదాలు లేవు. టెంటులు లేవు. మాటల్లేవు. మౌనం అక్కడ మహా మనిషిలా కూర్చుంది.
“ఏమైంది. మీరు ఇలా నేల మీద కూర్చోవడం ఏమిటీ. మాట్లాడండి.” అగ్రహారం పెద్దల్లో ఒకరు అడుగుతున్నారు.
“హఠాత్తుగా ఇదేంటి, చెప్పాలి కదా” మరొకరు
ఇలా అందరూ తలో మాట….
ఇలా అందరూ తలో ఆలోచన….
ఇలా అందరూ ఆందోళన…
ఇలా అందరూ ఆవేదన…
నేల మీద కూర్చున్న కిష్టుడు గారు ఏం మాట్లాడడం లేదు. మౌనమే నీ బాష ఓ మూగ మనసా అన్నట్లున్నారు.
“ఆయ్.. పోలీసోడు పోతారెడ్డి గారు విబ్బందులు పెడుతున్నారని, సానా కట్టంగా ఉందని నిన్న మేవంతా బాబుగారికి సెప్పావండి. అప్పుడేం అనలేదండి. తెల్లారి సూత్తే ఇదిగో ఇలాగండి” ఓ రిక్షా కార్మికుడు చెప్పాడు.
విషయం పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. ఊరంతా పాకింది. ఇతర ప్రాంతాల వాళ్లూ వచ్చారు. వస్తున్నారు.
అగ్రహారం అంతటా ఓ గందరగోళం….
అగ్రహారం అంతటా ఓ భయానక వాతావరణం..
అగ్రహారం అంతటా ఓ అనిశ్చితి…
అగ్రహారం అంతటా ఓ ఉత్సుకత…
*** *** ***
మధ్యాహ్నం ఒంటి గంట. భోజనానికి ఇంటికి వెళ్తున్న పోతారెడ్డి అగ్రహారంలో రిక్షా స్టాండ్ దగ్గర ఆగారు. అక్కడున్న జనాల్ని చూసారు. “ఏమిటిదంతా” అన్నారు….
“వెళ్లిపొండి” అంటూ హుకుం జారీ చేశారు…
“వెళ్లకపోతే తంతానొరే” అని కూడా అని హెచ్చరించారు.
ఇదంతా కూచిమంచి కిష్టుడు గారు మౌనంగా చూస్తున్నారు. చూస్తూ మౌనంగా ఉన్నారు.
ఎస్సై కిష్టుడి గారి దగ్గరకొచ్చాడు. ఇదేంటండీ అన్నాడు. రిక్షాల కారణంగా అగ్రహారంలో ఇబ్బంది కదా అన్నాడు. దీనికే మీరు ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించాడు. శాంతిభద్రతలకు మీరు సహకరించాలి కదా అన్నాడు. ఇంకా చాలా చాలా అన్నాడు.
కిష్టుడు గారు ఏం మాట్లాడలేదు. ఓ నవ్వు నవ్వారు.
ఎస్సై చాలా సేపు ఏవేవో చెప్పారు. అబ్బే అవేం వినలేదు. మాట్లాడనూ లేదు. సాయంత్రం అయ్యింది. వాతావరణం వేడిగా ఉంది. అనూహ్యంగా ఉంది. ఏదో వెలితిగా ఉంది. ఏదో ఆందోళనగా ఉంది.
ఎమ్మెల్యే వచ్చారు.
” ఏమైందండి” అన్నారు.
” ఏమిటీ వ్యవహారం ” అని అడిగారు.
” చెప్పండి నే మాట్లాడతా” అని కూడా అన్నారు.
ఇంకా చాలా చాలా చెప్పారు.
కిష్టుడు గారు ఏం మాట్లాడలేదు. కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని ఓ అమూర్త ఆనందంతో చూస్తున్న వటపత్ర సాయిలా చూసారు కిష్టుడు గారు.
ఎస్సై పోతారెడ్డి వచ్చారు. ఎమ్మెల్యేతో మాట్లాడారు
” అంటే రిక్షాల వల్ల ఇబ్బందని ” అంటూ చెప్పారు.
“అగ్రహారంలో ఇబ్బందులు రాకూడదని చెప్పా. అంతే ఇంకేం లేదు” అని వివరణ ఇచ్చారు.
“నేను తిట్టలేదు” అని కూడా అన్నారు.
ఇంత జరుగుతున్నా కిష్టుడు గారు ఏం మాట్లాడలేదు. చిరునవ్వుతో గుంభనంగా ఉన్నారు.
విషయం ఎమ్మెల్యేకి అర్ధం అయ్యింది. దీక్షా స్థలి పక్కనే ఉన్న శంకరమఠంలో ఎమ్మెల్యే, ఎస్సై మాట్లాడుకున్నారు.
ఎస్సై ముఖం వాడిపోయింది. పై అధికారి దగ్గర చివాట్లు తిన్న కింది అధికారిలా ముఖం వివర్ణమైంది.
ఎమ్మెల్యే, ఎస్ఐ మౌనంగా నడుచుకుంటూ రిక్షాస్టాండ్ దగ్గరికి వచ్చారు.
“కిష్టుడు గారు నన్ను క్షమించండి. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడను ” ఎస్ఐ పోతారెడ్డి వివరణ ఇచ్చారు.
కిష్టుడు గారు ఓ నవ్వు నవ్వారు. ఎస్సై భుజం మీద తట్టారు.
ఆ నవ్వులో విజయం కాదు… మనిషి మీద ప్రేమ కనిపించింది.
అధికారం కాదు… అందరూ బతకాలనే ఆశ కనిపించింది.
మనుషులం కదా… మనుషుల మీద ప్రేమ… జాలి ఉండాలనే సందేశం
వినిపించింది.
కిష్టుడు గారు లేచారు. నెమ్మదితనం తప్ప నిమ్మరసం లేదు.
చుట్టూ మానవులు తప్ప మహిలో ఇంకెవరూ లేరనిపించింది.
రెండొందల అడుగుల దూరంలో ఉన్న ఇంటికి విజయనగరం నుంచి వలస వచ్చిన సిమ్మాచలం (సింహాచలం) రిక్షాలో కూర్చుని ఇంటికి బయలుదేరారు. రిక్షా దిగి ఇరవై రూపాయల నోటు ఇచ్చారు.
” వద్దూ బాబూ. ఇక్కడే కదా… పొద్దేలా నుంచి మీరేటి తిననేదు కూడా. వీ డబ్బులొద్దు” సిమ్మాచలం అన్నాడు.
రిక్షా దిగి సింహాచలం భుజం మీద కొట్టి ఇంట్లోకి వెళ్లిపోయారు కిష్టుడు గారు.
*** *** ***
అమలాపురంలో మున్సిపల్ ఎన్నికలు. ఐదో వార్డు నుంచి కూచిమంచి కిష్టుడు గారు పోటీలో ఉన్నారు. ప్రత్యర్ధులూ బ్రాహ్మలే. ఉప శాఖలే వేరు. పోటీ రంజుగా ఉంది. కిష్టుడి గారి గెలుపు కోసం అగ్రహారం కుర్రాళ్లం రకరకాల ప్రచారం చేస్తున్నాం. వెళ్లిన ఇంటికే మళ్లీ వెళ్తున్నాం. ఏదో ఓ ఉన్మాదంలో ఉన్నాం. ఏదో అలౌకికానందంలో ఉన్నాం. గోడల మీద రాతలు, పోస్టర్లు, రిక్షాలో “మీ ఓటు కూచిమంచి కిష్టుడి గారికే” అంటూ ప్రచారాలు. కిష్టుడు గారు గెలవాలంతే. గెలిస్తే ఏమవుతుందో మాకు తెలీదు. గెలవాలంతే.
ఎన్నికల రోజు రిక్షాల మీద అగ్రహారం ఓటర్లను తరలించాం. ప్రత్యర్ధులూ అదే పని మీద ఉన్నారు. కాని వారికి రిక్షాలు లేవు. రిక్షా వాళ్లంతా కిష్టుడి గారి వైపే ఉన్నారు. ప్రత్యర్ధులకు తమ ఓటమి ఖాయమని తెలిసిపోయింది.
ఎన్నికలు ముగిసాయి. ఓట్ల లెక్కింపూ అయ్యింది. కూచిమంచి కిష్టుడు గారు గెలిచారు.
కిష్టుడు గారు మా గెలుపునకు సంకేతం
కిష్టుడు గారు మా కష్టానికి ప్రతిఫలం
కిష్టుడు గారు మా విజయానికి ప్రతీక
కిష్టుడు గారు మేం పిలిస్తే పలికే మా నాయకుడు
కిష్టుడు గారు మా ఆత్మాభిమానానికి నిలువుటద్దం
*** *** ***
వంద రూపాయలిచ్చారు.
గెలిచాం కదా.. సరదా చేసుకోండన్నారు.
సరదా చేసుకున్నాం.
ఒక బీరు 10 మంది కుర్రాళ్లు.
ఎలా తాగాలో తెలియదు. తాగితే ఏమవుతుందో కూడా తెలీదు. బక్కెట్టు నీళ్లలో బీరు పోసారు. దానికి స్టఫ్ నాలుగు పేట్ల ఇడ్లీ, గట్టి చెట్నీ.
అది ఉత్సవమో… ఉత్సాహమో తెలీదు.
అది ఆనందమో… అద్భుతమో తెలీదు.
అది తప్పో… ఒప్పో తెలీదు.
అది ఓ విజయ గర్వం… ఓ ఆనందపు గుళిక… ఓ ఉత్సాహపు కెరటం…

**** ****** *****
మున్సిపల్ ఆఫీసులో కౌన్సిలర్ల సమావేశం. వాడిగా.. వేడిగా ఉంది. అగ్రహారంతో పాటు మున్సిపాలిటీలో సమస్యల్ని కూచిమంచి కిష్ణుడుగారు ఏకరవు పెడుతున్నారు. ఊరు బాగోలేదని గగ్గోలు పెడుతున్నారు. “మనం ఎందుకున్నాం” అని నిలదీస్తున్నారు.
“ఊరు బాగుంటేనే మనం బాగుంటాం” అని చెబుతున్నారు.
ఫలానా వీధిలో బాగోలేదని, చిన్న చిన్న పిల్లలున్నారని, అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని వివరిస్తున్నారు.
ఇంకా చాలా చాలా చెబుతున్నారు.
కౌన్సిల్ మీటింగ్ లో కిష్టుడుగారి ప్రశ్నలు చైర్మన్ కి నచ్చడం లేదు.
“మనం బాగానే చేస్తున్నాంగా. మళ్లీ ఇదేమిటీ ” అన్నారు చైర్మన్. కులం ఆధారంగా నడిచే కోనసీమ రాజకీయాల్లో తన కులానికి చెందిన కౌన్సిలర్ల కారణంగా ఆయన చైర్మన్ అయ్యారు. ఇది బహిరంగ రహస్యం
ఇది ఇప్పటికీ అమలులో ఉన్న కుల రాజకీయం
ఇది ఎప్పటికీ అమలులో ఉండే కుల రాజ్యాంగం

*** *** ***
కౌన్సిల్ సమావేశం పతాక స్థాయికి చేరింది. మాటా మాటా పెరిగింది. కూచిమంచి కిష్టుడు గారికి మద్దతు పెరుగుతోందని చైర్మన్ గారికి అర్ధం అయ్యింది. కిష్టుడు గారిని సమావేశం నుంచి బహిష్కరించారు. అయినా కిష్టుడు గారిలో మార్పు రాలేదు. ఇక మార్షల్స్ ని రంగంలోకి దింపారు. బయటకి పంపేశారు.
సరిగ్గా ఆ సమయంలోనే….
కిష్టుడు గారు ఓ మాటన్నారు…
కిష్టుడు గారు ఓ ప్రతిన పూనారు…
కిష్టుడు గారు ఓ శపథం చేశారు…
ఇంతకీ అదేమిటంటే….
పదిహేను రోజుల్లో చైర్మన్ గారి కుమార్తె వివాహం. ఆ పెళ్లికి తాను వస్తానన్నారు. కొత్త దంపతులను ఆశీర్వదిస్తానన్నారు. భోజనం కూడా చేస్తానన్నారు.
దీంతో పాటు మరో మాట కూడా అన్నారు.
అదే… “మీ అమ్మాయి పెళ్లి మీరు చైర్మన్ హోదాలో చేయరు” అన్నారు.
“మిమ్మల్ని దించేస్తానన్నారు.”
“మీరు దిగిపోతారన్నారు”
“మీ కులం వాళ్లే మిమ్మల్ని దించేస్తారన్నారు”
ఆయన కోపాన్ని ప్రదర్శించలేదు. ఆయన ఆవేశాన్ని చూపించలేదు. ఆయన స్థిత ప్రజ్ఞత చూపించారు. మౌనంగా కౌన్సిల్ హాలు నుంచి
వచ్చేశారు.
ఇంట్లో కూర్చున్న కిష్ఠుడు గారు తన రాజకీయ చక్రం తిప్పడం ప్రారంభించారు. చైర్మన్ కులానికి చెందిన వైస్ చైర్మన్ తో మంతనాలు నెరిపారు. నిన్ను చైర్మన్ ని చేస్తానన్నారు. నీకు మా కౌన్సిలర్ల అండ ఉంటుందని అన్నారు.
వైస్ చైర్మన్ సరే అన్నారు.
తన అదృష్టానికి మురిసిపోయారు.
మీరు ఎలా చెబితే అలా అన్నారు.
పథక రచన ప్రారంభమయ్యింది. ఒక్కో కౌన్సిలర్ తోను చర్చలు జరిగాయి. ఎవరికి ఏం కావాలో అవన్నీ చకచక జరిగిపోయాయి. వైస్ చైర్మన్ తన ఐదారుగురి కౌన్సిలర్లతో ఓ హోటల్ లో కూర్చున్నారు. కాదు.. కాదు .. కిష్టుడు గారు కూర్చోబెట్టారు. వాళ్లంతా పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.
కిష్టుడు గారు తన దగ్గర ఉన్న కౌన్సిలర్లను తీసుకుని మున్సిపల్ ఆఫీసుకి వెళ్లారు. ఏం మంతనాలు చేసారో… ఏం రాజకీయం చేసారో,ఆనాటి కమీషనర్ కీ, కిష్టుడిగారికీ, పైనున్న దేవుడికే తెలియాలి.
కిష్టుడు గారు చైర్మన్ అయ్యారు.
అమలాపురం పట్టణానికి ప్రధమ పౌరుడయ్యారు.
ఆయన చెప్పిందే… శాసనం అయ్యింది.
ఆయన మాట వేదం అయ్యింది.
పాత చైర్మన్ కుమార్తె వివాహానికి కొత్త చైర్మన్ కిష్టుడు గారు వెళ్లారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. భోజనమూ చేసారు.
ఓ నవ్వు నవ్వారు. మంచి సంబంధం అన్నారు.
అమ్మాయి సుఖపడుతుంది అన్నారు.
మాజీ చైర్మన్ కి శుభాకాంక్షలు చెప్పి ఇంటికి వచ్చేసారు. అన్నట్టు అక్కడ వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. ఆయన ముఖం కత్తివాటుకు నెత్తురు చుక్క లేనట్టుగా ఉంది.
అమలాపురానికి తొలిసారిగా ఓ బ్రాహ్మణుడు చైర్మన్ అయ్యాడు.
అగ్రహారం ఆకాశం అంత ఆనందంగా ఉంది.
అగ్రహారం భూదేవతంత ధైర్యంగా ఉంది.
*** *** ***
1988 నవంబర్ 14. కార్తీక మాసం. పవిత్ర సోమవారం. జిల్లా పరిషత్ హై స్కూలులో అగ్రహారం క్రికెట్ టీం… సన్నీ క్రికెట్ క్లబ్…. కోనసీమ స్దాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ముందురోజు ఆదివారమే క్రికెట్ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేసేసాం. నేను, కూచిమంచి ఫణిగాడు, వాళ్ల తమ్ముడు ప్రసాద్, వసీరా తమ్ముడు వక్కలంక సత్తిబాబు, కోళ్ల ఫారం ప్రసాద్, వాడి తమ్ముడు ప్రకాష్ టోర్నమెంటు నిర్వాహణలో తలమునకలై ఉన్నాం. ఆదివారం రాత్రి ఆ మర్నాడు పొద్దునే జరిగే మొదటి మ్యాచ్ ఊహించుకుంటూ రాత్రి ఏ పదకొండు గంటలకో పడుకున్నాం. ఉదయం ఏడు గంటలకి కోళ్ల ఫారం ప్రకాష్ (దేవగుప్తాపు) మా ఇంటికి వచ్చాడు. తొలి మ్యాచ్ కి తాను ఉండడం లేదని, వేరే స్నేహితులతో కలసి కొమరగిరి పట్నం సముద్రం దగ్గరకు కార్తీక మాసపు వన భోజనానికి వెళ్తున్నట్లు చెప్పాడు. నేను కళ్లు తెరచి మాట్లాడక ముందే “బై రా” అని చెప్పి వెళ్లిపోయాడు.
మేం హైస్కూల్ గ్రౌండ్ కి చేరుకుని టోర్నమెంట్ నిర్వహణలో ఉన్నాం.
కొత్తపేట, ఎంసీసీ (మోబర్లీపేట) క్రికెట్ టీంకి మధ్య మ్యాచ్ మొదలైంది. సమయం ఉదయం పదిగంటలు. అగ్రహారం నుంచి ఎవరో పరిగెత్తుకు వచ్చారు. కొమరిగిరి పట్నం సముద్రంలో మా చెలికాడు దేవగుప్తాపు ప్రకాష్ గల్లంతయ్యాడని చెప్పారు.
అంతే… మ్యాచ్ ఆపేశాం. మైక్ లో సంఘటన గురించి చెప్పి కిట్లు సర్దేశాం. పరుగు పరుగున అగ్రహారం చేరుకున్నాం.
అప్పటికే అగ్రహారం అంతటా ఆందోళనగా ఉంది.
అప్పటికే అగ్రహారం అంతటా ఓ నిశబ్దం రాజ్యమేలుతోంది.
అప్పటికే అగ్రహారం అంతటా ఓ భయం వెంటాడుతోంది.
అగ్రహారంలో అందరూ ప్లీడరు కూచిమంచి మల్లపురాజు ఇంటికి చేరుకున్నారు. దేవగుప్తాపు ప్రకాష్ తల్లిదండ్రులతో సహా దాదాపు అగ్రహారం అంతా అక్కడే ఉంది.
పదకొండు గంటలకి కూచిమంచి క్రిష్ణుడు గారు తన బండి మీద మల్లపు రాజు గారి ఇంటికి వచ్చారు.
“ఏమైంది” అన్నారు.
“వాడూ చురుకైనోడు. వాడికేం కాదు”అన్నారు.
“ఏదో క్రికెట్ మ్యాచ్ అని…. తాతగారూ మీరు రావాలి అని పిల్చాడు కూడా” అన్నారు.
“వాడు మా అన్నయ్య కూచిమంచి ప్రకాశం పేరింటిగాడు. ఆయనంత ధైర్యం ఉన్నవాడు” అన్నారు.
“ఫర్వాలేదు మధ్యాహ్నానికి వచ్చేస్తాడు” అని ధైర్యం చెప్పారు.
“నేను అత్యవసర పని మీద కాకినాడ వెళుతున్నాను. మూడింటికి వచ్చేస్తాను.. ఈలోపు వాడు వచ్చేస్తాడు ” అన్నారు.
కూచిమంచి కిష్ణుడు గారు ఎక్కడికి వెళ్లినా తన బండి మీదే వెళ్తారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్లారు.
*** **** ***
మధ్యాహ్నం మూడైంది. అగ్రహారం ఆందోళనగానే ఉంది. భయంగానే ఉంది. ప్రకాష్ జాడ తెలియ లేదు. అగ్రహారంలో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. అగ్రహారంలో ప్రతి ఒక్కరు ప్రకాష్ గాడు క్షేమంగా తిరిగి రావాలంటూ దైవాన్ని కోరుకుంటున్నారు. వేడుకుంటున్నారు. పూజిస్తున్నారు.
అలాంటి సమయంలో మరో కబురు… మరో పిడుగు…. మరో ఉత్పాతం. కాకినాడ నుంచి తిరుగు ప్రయాణంలో తన బండిపై అమలాపురం వస్తున్న కూచిమంచి కిష్ణుడు గారు కోటిపల్లి రేవు దగ్గర బండిపై నుంచి పడిపోయారు. ఎవరిని గుద్దుకుని కాదు. కళ్ల ముందు ప్రపంచం కనబడక అమాంతం పడిపోయారు. చుట్టుపక్కల వాళ్లు స్దానిక డాక్టర్ని తీసుకుని వచ్చారు. డాక్టర్ నాడి చూసారు. డాక్టరు కూచిమంచి కిష్టుడి గారి గుండెల మీద తన చెవి పెట్టి విన్నారు.
“లాభం లేదు. అలా నేల మీద పడిపోవడం… ఇలా ప్రాణం పోవడం ఒకే సారి జరిగాయి. ఈయన ఏదో ఆందోళనగా ఉన్నారు.”
ఈ వార్త అగ్రహారానికి అందింది. ఒక్కసారిగా ఇదేమిటీ… ఇలా జరిగింది అని కంగారుగా ఉంది. బండి మీద దర్జాగా వెళ్లిన కూచిమంచి కిష్టుడు గారు కారులో నిర్జీవంగా పడుకుని అగ్రహారానికి వచ్చారు.
వైద్యులు వచ్చారు. విషయం తెలుసుకున్నారు.
బహుశా ఉదయం నుంచి కూచిమంచి కిష్టుడు గారిని ఓ ఆందోళన వెంటాడినట్టుంది అని అన్నారు.
బీపీ బాగా పెరిగిపోయినట్టుంది అని కూడా అన్నారు.
ఉదయం జరిగిన సంఘటన ఆయనకి తెలుసా అని అడిగారు.
అగ్రహారీకులు “అవును. ఇక్కడ నుంచే కాకినాడ వెళ్లారు. ఉదయం అంతా ఆందోళనగానే ఉన్నారు. పైగా ప్రకాష్ తిరిగి రావాలని, వాడు కళ్ల ముందే ఉన్నాడని అన్నారు. ” అని డాక్టర్లకి చెప్పారు.
డాక్టర్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
” అగ్రహారంలో జరిగిన సంఘటన కిష్టుడు గారిని బాగా కలచి వేసింది. దీనిని ఆ పెద్దాయన తట్టుకోలేక పోయారు. ఆ ఆలోచనలే ఆయన బ్రెయిన్ హెమరేజ్ కి కారణం అయ్యాయి ” అన్నారు.
అగ్రహారం మనుషులతో కూచిమంచి కిష్టుడు గారికి ఇంత అనుబంధమా అని సూర్యుడు పడమటి దిక్కున అస్తమించాడు.
ఇది జరిగిన రెండు రోజులకి మా బాల్య మిత్రుడు కోళ్ల ఫారం ప్రకాష్ కూడా అగ్రహారానికి నిర్జీవుడై వచ్చాడు.
రెండు రోజుల వ్యవధిలో అగ్రహారం చరిత్రను తిరగ రాసిన కూచిమంచి కిష్టుడు గారిని కోల్పోయింది. అగ్రహారం భవిష్యత్తు చిత్రపటాన్ని ఆకాశ మంత ఆవిష్కరిస్తాడనుకున్న కోళ్లఫారం ప్రకాష్ గాడిని కోల్పోయింది.
ఆ ఏడాది కార్తీక మాసం ఇక ఏ ఏడాది అలా ఉండకూడదనుకుని అగ్రహారం మౌనంగా రోధించింది.

*

ముక్కామల చక్రధర్

ముక్కామల చక్రధర్

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా బాగుంది నువ్వు రాసినట్లు క్రిస్టుడు గారు మహా మేధావి, ఆయనలాటి నాయకుడు న భుాతోనభవిష్యత్.దేవగుప్తాపు ప్రకాష్ లాంటి చురుకైన కుర్రాణ్ణి కోల్పవడం అగ్రహారానికి తీరనిలోటు. చాలా బాగా వివరించావు. అభినందనలు

 • కూచి అన్న పదానికి గారం, మమ కారం, మక్కువ అని అర్ధాలున్నాయి…
  కూచిమంచి కిష్టుడు కధ చదివాక ఒక మంచి వ్యక్తి గురించి తెలుసుకున్న భావన….
  కూచి అంటే రాజసం , రాజకీయం అని కోనసీమ డిక్షనరీ లో రాయడంలో తప్పు లేదనిపిస్తోంది….
  వారి జీవితంలో జరిగిన మరిన్ని సంఘటనలు పార్ట్ 2 లో రావాలని కోరిక…
  రచయితకు అభినందనలు

 • Thanks to mukkamala garu for reminding us about Kuchimanchi kistudu garu. Very nicely narrated. Our grand father Sri Gidugu suryanarayana garu, uncle Sri venkata rao we’re very close to Kuchimanchi family

 • This is just a glimpse of kishtudu garu. He used to go round all the four streets without shirt early in the morning with a towel around his neck. One has to experience his humor personally.. Thanks bujji, I am greatful to you for narrating our brother’s tragedy along with the tragedy of kishtudu garu.

 • చాలా మనసుని కుదిపేసే సంఘటలతో కూడుకున్నది ఈ ఎపిసోడ్.
  రవి కాంచని ది కవి చూస్తాడని వినికిడి. అలాగ అగ్రహారం లో పుట్టినప్పట్నుంచి 35 వయసు దాక అక్కడ గడిపిన నాకు, కిష్టుడు గారి గురించి నువ్వు చెప్పిన దాంట్లో పది శాతం కూడా తెలియక పోవడం ఆశ్చర్యమే. నేనెవరో, ఆయన ఎవరో ఒకళ్ళ కొకళ్ళు తెలిసినా ఎప్పుడూ మాట్లాడుకో లేదు. అయినా హైదరాబాద్ లో మరణించిన అమ్మ శరీరాన్ని అగ్రహారం లో ఇంటికి తీసుకు రాగానే, ఇంటికి వచ్చి పలకరించిన మొదటి వ్యక్తి కృష్ణుడు గారు. ఆయన వ్యక్తిత్వాన్ని నువ్వు ఆవిష్కరించి ఉండక పోతే ఎప్పటికి తెలిసేది కాదు
  1988. హైదరాబాద్ లో నల్లకుంట నుండి స్వంత ఇల్లు కట్టుకోవడానికి హబ్సిగూడ లో అద్దె ఇంటికి అప్పుడే మారాము. అనుకోకుండా చెల్లెలు మరుదులు అమలాపురం నుంచి వచ్చారు భోజనాలు చేస్తున్నాము. మాటల సందర్భంలో రెల్లుగడ్డ కరణం గారి అబ్బాయి సముద్రం లోకి వెళ్లి వెనక్కి రాలేదు అని మిగతా విషయాలతో మామూలు గా చెప్పారు. అయ్యో వాడు స్వయానా మా మేనమామ కొడుకు. మాకు తెలియదే అని లేచిపోయాను.. వాడు నీకు మిత్రుడని ఇప్పుడే తెలియడం.
  తెలియని వాళ్లు కూచిమంచి దుష్టుడని వేళాకోళం గా అనడం ఎంత అసత్యమో నీ కథనం చెబుతోంది.

  నీ రచనా సామర్థ్యం / కౌశలం, నేను కూడా రచయితనే అని చెప్పుకునే ధైర్యం లేని నాలో కొంచం అసూయ నాకు తెలియకుండా తొంగి చూసిందేమో
  మరిన్ని కథనాలు ఆశిస్తూ ఆశీర్వచనం.

 • రాజకీయంలో రాటు దేలిన కూచిమంచి కిష్టుడు కూడా కుల రాజకీయాలకు బలి కావడాన్ని అసలు సిసలైన గోదారి మాండలీకంలో తనదైన శైలితో ఆకట్టుకున్నాడు రచయిత చక్రధర్ (బుజ్జిగాడు) అభినందనలు Good going! All the best Bujji

 • చాలా బాగా రాస్తున్నారు.. మిత్ర‌మా…
  ప్ర‌తి ఎపిసోడ్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటున్న‌ది…

 • అగ్రహారపుకధలు….ఇందులో కూచిమంచి కృష్టుడు గారి ప్రస్థానం…అదో అద్భుత ప్రహసనం….ఒక్కసారిగా ఆయన నిలువెత్తు రూపం కళ్ళ ముందుకు వచ్చేసింది. పెద్ద పొడుగు కాదు కానీ గంభీర రూపం. పోతారెడ్డి గారు తెలుసు కానీ ఈ సంఘటన గురుంచి తెలియదు. పోతారెడ్డిగారి రూపం మా ఇంట్లో ఆగి టీ తాగుతున్న సన్నివేశాలు వరుసగా గుర్తుకువచ్చాయి, ఇంకా చెప్పాలి అంటే కళ్ళముందు కదిలాడాయి. ఇంక కూచిమంచి కృష్టుడుగారి చైర్మన్ అయ్యేటప్పటి ఒక సంఘటన నాకు మా ఇంట్లో జరిగింది ఈ సందర్భంగా చెప్పగలను. ఆయనను కలవాలని, ఉంటే వస్తానని లేదా ఆయనను మా ఇంటికి రమ్మని మా అన్నయ్య గోపాలకృష్ణ ద్వారా మా నాన్నగారు కృష్టుడు గారికీ కబురు పంపారు. అన్నయ్యవెళ్లి ఆయన్ను కలవగానే “ఒరేయ్ మీ నాన్న పిలిచాడు అంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది వాడు సామాన్యుడు కాడు ,గడియారం ముళ్ళు తిప్పడమే కాదు చక్రం తిప్పగలడు ” అంటూ నేనే వస్తాను అంటూ రావటం, వాళ్ళ మధ్య ఏదో సంగతి , సంభాషణ జరగటం అన్నీ జరిగిపోయాయి.మా నాన్నగారికి అప్పటి చైర్మన్గారికి ఉన్న స్నేహబంధం ఇక్కడ పనిచేసిందని, మా నాన్నగారి ద్వారా అమలాపురం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకుందని నాలుగు రోజులతరువాత గానీ మాకు తెలియలేదు. కూచిమంచికృష్టుడు గారు చైర్మన్ గా 13..5 ఓట్ల తేడాతో నెగ్గేసారు.అప్పుడు మనకు 18 వార్డులేఉండేవి. ఆయనను రిక్షాలో ఊరేగించిన రోజున మా ఇంటిదగ్గర ప్రత్యేకంగా ఆగి చెయ్యి ఊపిన క్షణం కూడా మరువ లేనిది.కానీ ఈ కృష్టుడు గారు చైర్మన్ గా ఉన్నది కొద్దీ కాలమే ఆయినా అమలాపురంలో అభివృద్ధి అంతా ఆయన వల్లే జరిగింది ,వీధి దీపాలు సందు సందుకు ఆయన వల్లే వచ్చాయి, రోడ్లు అన్నీ ఆయన దగ్గరే బాగుపడ్డాయి, రోడ్డు కాంట్రాక్టర్ ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఆయనది సరిగ్గాలేదని అక్కడికక్కడే కాంట్రాక్టు రద్దు చేసిన దమ్మున్న మగాడు. ఆయన అకాలమరణం అగ్రహారానికి ఒక దుస్వప్నం.అంతటి మహానుభావుడుకి నివాళులుఅర్పిస్తూ, ఆయన గురుంచి రాసి ఎన్ని ఏళ్ల తీపిగురుతులు మళ్లీ మా అందరికీ చవిచూపినందుకు నీకు కృతజ్ఞతలు..ఆద్యంతం అద్భుతంగా చెప్పావ్.

 • Excellent వేరే మాటలు ఏవి లేవు…కళ్ళకు చూపించావు రా బుజ్జి

 • K. Krishunudugaru telusu Kano aayana personality teliyadu loonameeda velladam telusu Kano eakkadiki velutunnaro teliyadu eppudu nee Katha valanatelisidi Prakash gurinchi vrasavu Chala badakaligindi arooju jarigindi Anta kallaku kattinatlu gurtukochi
  Neeku naa kangrats.next kasha kooraku eaiduru chustanu.mukkamala.surya.kumari.

 • Mukkamala Bujji, Kuchimanchi Krishnudu gari gurinchi chalaa baagaa raasharu. Naaku aayana naa 5 yrs vayasu nunchi thelusu. Aayanante.. Mukyamgaa kurrallaki bhayam. Yekkadainaa yevarainaa thedaa cheste kotti maatladevaaru. Vaallinti yedurugaa maro illu. Aadee vaallade. Daaniki vishaalamaina aarugu. Madyalo 10 adugula road. Schoolki velli vasthunnappudo, inti panula baruvulu mosthunnappudo aa arugu naaku majili. Aayana lopalli nunchi vachi “Yeraa Pemmaraju vari abbayi” ani kushalam adigevaaru.
  Aa kutumbaaniki maa Vakkalanka Ramakrishnagaadu atyamtha aathmeeyudu. Yedurintlo vaadiko room ichaaru, chaduvukodaaniki. Raathrullu bhupayya agraharam nunchi vachi vaadu akkada vunde vaadu. Vakkalanka, naynu, appari muali, kota sastry, kurella sastry gaadu raathrullu yekkuva samayam akkade vundevaallam. Kristudu gari peddammay Manikyamba garu maa andarikee Peddakkagaare. Aakhari ammayi Usha maaku junior. Aa kutumbam anthaa mammalni yentho baagaa chusevaaru.
  Kistudu gari Annagaru famous lawyer. Anna gari Law jnanamantha kistudi gari finger tips meeda vundedani cheppukunevaaru. Naynu desham meedaki vellipoyekaa, aayanatho naaku parichayam yekkuvayyimdi.
  Vichitram yemitante maa Naannagaru raajakeeyaallo jeevithantham Kuchimanchi Prakasam, Sriramamurty, Mallaparaju garla tho vunnaru. Naynu inter nunchi padaylla paatu maa Vakkalanka Ramamgaaditho kalisi Kistudugari aarugumeede gadipaam.
  Vadrevu Jaggaraju gari taravaatha avineethileni politician eeyane naa abhiprayam.
  Aayana valla pedda vupakaaram pondina vaarilo naynu kudaa okadinandoi.
  Bujjigaru, nannu kadipesaaru kudipesaru. Kistudu garni manchi chakkani kadhagaa marcheru. -Pemmaraju Gopalakrishna, Hyd

 • Kuchimanchi Krushnudu Garu, Apara Chanakyudu. Great Legend.

  Kunchiminchi Krushnudu Garu maa nannagarini Snehapurvakanga Anna Oka Mata gurthukochindi. ” Mee nanna watch chakralu / Amalapuram chakralu thipputhadu annaru.

  Okaroju maa Nannagaru , Iddaru Municipal Councillor friends maa inti daggara vunnaru. Nannu pilichi Kuchimanchi Krushnudu Garu vunnaro / ledo chudamani , vuntey rammanamani chepparu. Sumaru varam tharuvatha , Naa rayabharam phalichinadi , mana Krushnudu Garu Chairman ayyarani maa nanna Garu cheppatam gurthukochindi.

  Chairman ga goppa Peru vachinadi.
  100 percent Agraharam LEGEND Varu

  Super Supe vrasavu Bujji

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు