కుర్రతులైన్ హైదర్ కథ “శిశిర స్వరం …”

కుర్రతులైన్ హైదర్ కథ “శిశిర స్వరం …”

మూలం: ఉర్దూ కథ, ‘పత్ ఝడ్ కి ఆవాజ్’,

   రచయిత్రి: కుర్రతులైన్ హైదర్ (జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత)

అనువాదం: డా. రూప్ కుమార్ డబ్బీకార్

సుప్రసిద్ధ  ఉర్దూ నవల, కథా రచయిత్రి.  20, జనవరి, 1927న  ఉత్తర్ ప్రదేశ్, అలీగఢ్ లో జన్మించారు.  తల్లి: నాజర్ జాహ్రా,  తండ్రి: సజ్జాద్ హైదర్ యిల్దరీమ్.  వీరిద్దరు కూడా  ప్రముఖ రచయితలే.  తన పదకొండవ ఏట నుంచే రచనా వ్యాసాంగం ప్రారంభించిన కుర్రతులైన్ హైదర్ పన్నెండు నవలలు, నాలుగు కథా సంపుటాలు  తీసుకొచ్చారు. ఈమె సుప్రసిద్ధ నవల  “ఆగ్ క దరియా”,  నాల్గవ శతాబ్దం నుండి భారత దేశ స్వాతంత్ర్యానంతరం వరకు జరిగిన అనేక చారిత్రిక సంఘటనలను చిత్రీకరించిన కాలనాళిక. బెంగాల్ సంక్షోభం- నక్సలైట్ ఉద్యమ నేపథ్యంతో వచ్చిన “ఆఖిర్ -ఏ- హమ్ సబ్ కె హంసఫర్” అనే నవలకు జ్ఞాన్ పీఠ్ పురస్కారం (1989) లభించింది. కథల సంకలనం – “పత్ ఝడ్ కి ఆవాజ్ ” కు  ఉర్దూ సాహిత్యరంగంలో గాను 1967 లో సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు.  పద్మశ్రీ , పద్మభూషణ్  అవార్డులతో పాటు సాహిత్య అకాడమి ఫెలోషిప్ కూడా  అందుకున్నారు.  21, ఆగస్టు, 2007న  నోయిడాలో మరణించారు.

కథలోని  ప్రధాన పాత్ర తన్వీర్ ఫాతిమా మొత్తం కథను నడిపిస్తుంది. కట్టుబాట్లు, కఠినమైన పరదా  నియమo వున్నసాధారణ జమీందారు కుటుంబ నేపధ్యం నుండి వచ్చిన  యువతి.  దేశ విభజన జరగడం, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన  వాతావరణం.  ఇండియా, పాకిస్తాన్ లోని పరిస్థితులను, అప్పటి ముస్లిం,  ఇతర మతాలకు  చెందిన యువత  ప్రత్యేకించి  మహిళల  వ్యక్తిత్వం, స్నేహాలు, కదలికలు, ఆలోచనలు, మానసిక స్థితిగతులను  చిత్రిక పట్టే కథ.  విద్యార్థి దశలో యువత  ప్రత్యేకించి మహిళల  అస్పష్టమైన ఆలోచనా విధానాలు, నిర్దిష్టమైన  లక్ష్యంలేని  నడత  దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం చేశారు రచయిత్రి.

*

తెల్లవారు జామున  వీధి వైపు దర్వాజ  దగ్గర నిలబడి కూరగాయల వాడితో గోబీ పువ్వు ధరను  తీసుకొని  చిన్న పాటి  జగడం సాగుతోంది.  పైన వంటగదిలో  బియ్యం, పప్పు వుడకటానికని  పొయ్యి మీద పెట్టి వచ్చాను. పనివాడు సరుకుల  కోసం బజారుకెళ్ళాడు.  స్నానాల గదిలో  పెద్ద పింగాణీ  పాత్ర  మీద వున్న మసకబారిన అద్దంలో మొహం చూసుకుంటూ  కూనిరాగాలు తీస్తూ  గడ్డం చేసుకుంటున్నాడు  వఖార్ సాహిబ్.  కూరగాయల  వాడితో నా వాగ్యుద్ధం జరుగుతూనే  వున్నా  మనసులో మాత్రం రాత్రి వంటలోకి   తినడానికి ఏం జేయాలా అన్న ఆలోచన  సతమతo చేస్తున్నది.   అంతలోనే  సడన్ గా  ఒక కారు ఎదురుగా వచ్చి నిలబడింది.  ఒకావిడ కారు కిటికీ నుండి  తొంగి చూసి తిరిగి కారు తలుపు తీసుకొని బయటికొచ్చింది.  నేను పైసలు లెక్కబెడుతూ  వుoడటంతో ఆమె రాకను  గమనించ లేకపోయా.  తాను ఒక  అడుగు ముందుకు వేసింది.  అంతలోనే నేను తల పైకెత్తి  ఆమె వైపు చూడటం జరిగింది.

“అరే .. నువ్వా ..!”  అంటూ చెప్పి అలాగే ఆశ్చర్యంతో  బిర్రబిగుసుకు  నిలబడిపోయింది.  ఆమె వాలకం చూస్తే నాకెలా అనిపించిందంటే  ‘ఎన్నో సంవత్సరాల  క్రితమే నేను చనిపోయాను అని నిర్దారించుకొని ఇపుడు నేను ఒక  దయ్యమై ఆమె ముందు నిలబడ్డాను’  – అన్న రీతిలో చూడసాగింది.  ఒక్క క్షణం ఆమె కళ్ళలో కనబడిన భయాన్ని చూసి నేను అర్ధంకాక  పిచ్చిదానిలా  వుండిపోయాను.  ఈమె  (ఆమె పేరు ఏ మాత్రం యాదికి రావడం లేదు.  ఇంకా నయం ఆశ్చర్యం నుండి తేరుకోలేక  ఆమె పేరు  అడగలేదు. లేకపోతె  ఎంత తప్పుగా  భావించేదో!)  నాతొ పాటే ఢిల్లీలోని  క్వీన్ మేరీలో చదివేది.  ఇరవై  సంవత్సరాల కిందటి మాట, అప్పుడు బహుశా నా వయస్సు పదిహేడేళ్లు వుండి వుంటాయి.  కానీ నా ఆరోగ్యం నన్ను నా వయస్సు కన్నా ఎక్కువ చూపేది.   అంతే కాదు, అందగత్తెనన్న పేరు మారుమ్రోగడం  మొదలయ్యింది.   ఆ సమయాన  ఢిల్లీలో ఒక వింత పద్దతి ఉండేది.  మగపిల్లలున్న వాళ్ళు,  అన్నదమ్ములున్న అమ్మాయిలూ, స్కూ లు  స్కూలు  తిరిగి  అమ్మాయిలలో  ఇష్టమైన వాళ్లను ఎన్నుకుంటూ వుండేవారు.  ఏ అమ్మాయి  ఐతే నచ్చుతుందో  ఆ అమ్మాయి ఇంటికి ఒక లెటర్  పంపించేవారు.  ఆ  క్రమంలోనే  నాకు తెలిసిందేమిటంటే  ఏ అమ్మాయి ఐతే నన్ను బాగుందని  సెలెక్ట్  చేసి ఆ అమ్మాయి తల్లి ,  ఖాలా  ఇంకా  వగైరా, వగైరా కూడా నన్ను ఇష్టపడ్డారని ( స్కూల్ డే  ఫంక్షన్ రోజు నన్ను చూసాక ), వారి ఇంటి కోడలుగా  చేసుకోవడానికి  పట్టుబట్టారని,  వీళ్ళు నూర్జహాన్  రోడ్డులో  ఉండేవారని, అబ్బాయి ఈ మధ్యనే  రిజర్వ్  బ్యాంకు  అఫ్ ఇండియాలో నూటాయాభై , రెండొందల  రూపాయల  జీతబత్తెంతో ఉద్యోగంలో చేరాడని.  వాళ్ళ సమ్మతిని  తెలియ జేస్తూ ఒక ఉత్తరం కూడా మా ఇంటికి పంపించారు. కానీ మా అమ్మీ జాన్  నా మీద పెద్ద ఆశలు పెట్టుకొనివుంది.  మా అబ్బు బయట మీరట్ లో వుండేవాడు.  అందుచే  అప్పుడే  నా పెళ్లి  ప్రసక్తి తలెత్తే ప్రశ్నే లేదు.  అప్పట్లో  ఆ విన్నపాన్ని మరో ఆలోచన  లేకుండా తిరస్కరించడం జరిగింది.  తర్వాత ఆ అమ్మాయి  నాతొ పాటే కొన్ని సంవత్సరాలు  అదే కాలేజీలో చదువు కొనసాగించింది.   పెళ్లి కూడా జరిగి  ఆమె కాలేజీ వదిలి వెళ్ళిపోయింది .   తిరిగి ఈ రోజు  ఇన్నేoడ్ల  తర్వాత లాహోర్ లోని  మాల్ రోడ్ లో,  వెనక వైపు చిన్న సందులో ఆమెతో నా భేటీ అయ్యింది .

” పైకి రండి .. చాయ్, వాయ్  తాగుతూ తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం”  అన్నాను ఆమెతో.

“నేను కాస్త  తొందరలో వున్నాను.  అత్తింటి వారి వైపు బందువుల ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ  ఈ సందులోకి వచ్చాను.  ఇన్షా అల్లాహ, మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండ వస్తాను”   అని అంటూనే అక్కడే నిలబడి  ఆదరా బాదరాగా అందరి పేర్లు, పాత దోస్తుల విషయాలు, ఎవరెక్కడ వున్నారు,  ఏం  చేస్తున్నారు ఏకరువు పెట్టింది.  సలీమా, బ్రిగేడియర్  ఫులాన్ ను పెళ్లిచేసుకుందని,  నల్గురు పిల్లలకు తల్లియని,  ఫ ర్కoద  మొగుడికి విదేశాలలో  ఉద్యోగం, ఆమె పెద్దమ్మాయి లండన్ లో చదువుతుందని, రెహానా – ఫులాన్ కాలేజీలో ప్రిన్సిపాల్,  సాదియా అమెరికాలో చదివి ఎన్నో డిగ్రీలు సంపాదించి కరాచీలో ఉన్నతోద్యోగంలో ఉంది;  కాలేజిలో చదివిన హిందూ అమ్మాయిల సంగతులు కూడా ఆమెకు  బాగా అందుబాటులో వున్నాయి.   ప్రభ భర్త  ఇండియన్ నేవీలో కమోడోర్ గా వున్నాడు.  ఇద్దరూ బొంబాయి లోనే నివసిస్తున్నారు.  సరళ  ‘ఆల్ ఇండియా  రేడియో’  లో స్టేషన్ డైరెక్టర్,  జునూబి  హింద్ లోనే ఎక్కడో  స్థిరపడింది. లతికా  మషూర్ ఆర్టిస్ట్ అయ్యింది.  ఢిల్లీ లోనే  ఆమెకు పెద్ద స్టూడియో  వుoది,  వగైరా వగైరా ఇలా అనేక విషయాలు బయట పెట్టింది.  ఇన్ని విషయాలు మాట్లాడుతున్నా ఆమె కళ్ళలో నాకు ఇంకా ఆ రోజుల్లో జరిగిన  సంఘటనతో  కలిగిన  విషాదపు జీర, నిరాశ  ఛాయలు సజీవంగా కనబడుతు మరవలేకుండా వున్నాను. “ నేను, సాదియా, రెహానా వగైరా కరాచీలో కలుసుకున్న ప్రతీసారీ తప్పకుండా నిన్ను యాద్  చేసుకుంటాము!”  అంది.

పేలవంగా నవ్వుతూ  “నిజమా..!” అన్నాను.  నా గురించి  వీళ్ళేం మాట్లాడుకుంటారో తెలుసు!  తిరుగుబోతులు .   అరే!  వీళ్ళెప్పుడైన  నా స్నేహితులుగా ఉన్నారా?  ఆడోల్లు నిజానికి మరో ఆడదానితో  కొరివి దయ్యంలా వ్యవహరిస్తారు. కపట బుద్ధి, భ్రష్టుతనం, కనీసం నాతో  అడగను కూడా అడగలేదు,  నేనిక్కడ ఓ మూలకు విసిరేసినట్లు పడివున్న సందులో, పాతబడిబోయిన కొంపలో,  చీకటి బతుకును గడుపుతున్న నేనెలా వున్నాను, ఏం జేస్తున్నానో! నని.  దానికి తెలుసు, ఆడోళ్ళ ‘ ఇంటలిజెన్స్ సర్వీస్’ ఎంత జబర్దస్త్ గా వుంటుందంటే  దాని ముందు ‘ఇంటర్ పోల్ ‘ కూడా  బలాదూర్. అటువంటిది  బహిరంగంగా వున్న నా బ్రతుకు గురించి తెలియకుండా ఉంటుందా ?!  నా స్థాయి ఒకరు  చర్చించుకునే దానికి  కూడా అర్హత లేనిది.  ఒక అనామకురాలిని.  అందుకే ఎవ్వరూ నన్ను  పట్టించుకోరు.  నామీద  నాకే అసహ్యం.

…                         …

నేను తన్వీర్  ఫాతిమాను.  అబ్బు మీరట్ లో వుండేవారు.  ఒక సాధారణ  జమీందారు.  మా కుటుంబంలో ‘పరదా ‘ చాలా కఠినంగా  పాటించే  పద్దతి వుండేది.  స్వయంగా  నాకు – బాబాయ్, మామ వరస వారితోనే గాక  అన్నల ముందు కూడా ‘పరదా’ పాటించాల్సి  వచ్చేది.  అతి  గారాబంగా  పెరిగినదాన్ని.  నేనంటే అందరూ ఇష్టపడేవారు.  స్కూల్ స్థాయిలో మంచి మార్కులు  తెచ్చుకోవడంతో  నన్ను మెట్రిక్ కోసం  ప్రత్యేకంగా ‘క్వీన్ మేరీ’ లో చేర్పించారు. ఇంటర్ కోసం అలీగఢ్  పంపించారు.  అలీగఢ్ మహిళా  కళాశాల లో గడిపిన రోజులు  నా జీవితంలో చాలా అద్భుతంగా గడిచిన రోజులని చెప్పుకోవచ్చు.  ఎలాంటి  కలలు గన్న రోజులవి.   భావోద్వేగంతో  చెపుతున్నానని కాదు కానీ ఆ రోజులు గుర్తుకు వస్తే, పార్కులో దారెంట ఎదిగిన ఎత్తైన గడ్డి పొదల మీద పడిన వర్షపు చినుకులు, నుమాయిష్  మైదానంలో నల్లని బురఖాలు ధరించి తిరిగే అమ్మాయిలూ, హాస్టల్  ముందు ఆ సన్నటి, ఇరుకు ఇరుకు వరండాలు, చిన్న చిన్న గదులు, అచ్చం ఇంటి పరిసరాలను గుర్తుకు తెచ్చే ఆ వాతావరణం,  అనుభవాలు గుర్తుకు వస్తే మనసు ఎక్కడికో తేలిపోతది.  ఎం.ఎస్ సి  కోసం నేను మళ్ళీ  ఢిల్లీ వచ్చేసాను.  ఇక్కడ  కాలేజీలో నాతో పాటు రెహానా, సాదియ, ప్రభ, ఫులాని దమాకి  అమ్మాయిలంతా చదువు సాగించే వారు.  ఎందుకో  అమ్మాయిలతో  స్నేహమంటే  నాకంతగా  ఇష్టం వుండకపోయేది.  నిజానికి  చాలా వరకు మనుషులంటే  అంతగా నచ్చక పోయేది.   చాలా మంది వ్యవహారాలూ, వారి వైఖరి  చికాకు కలిగించేవి.  నాకు గర్వం,  మంకుతనం ఎక్కువే.  అందం ఎటువంటిదంటే దానికి మనిషి  బుద్ధిని  భ్రష్టు పట్టించడానికి ఎoతో సమయం పట్టదు.  ఇక నేనైతే  లక్షల్లో ఒక్కదాన్ని.   అద్దంలా మెరిసిపోయే తెల్లటి ఒంటి రంగు,  బంగారు ఛాయతో తలవెంట్రుకలు,  అద్భుతమైన  బనారస్  చీరను సుతారంగా కట్టుకుంటే  అచ్చం ఏదో ఒక దేశపు మహారాణిలా వుoడే దానిని.  అది యుద్ధం జరుగుతున్న కాలం లేదా అదే సంవత్సరం యుద్ధం ముగిసిoదనుకుంటాను. అంతగా యాది లేదు కానీ ఢిల్లీకి ఒక పెద్ద వరదలా వచ్చింది.  కోట్లకు పడగలెత్తిన వ్యాపారస్తులు, భారత ప్రభుత్వపు పెద్ద పెద్ద హోదాలో వున్న అధికారుల అమ్మాయిలూ… హిందువులు, సిక్కులు, ముసల్మాన్లు…ఖరీదైన, పెద్ద కార్లలో విలాసంగా తిరుగుతూ రోజూ కొత్త పార్టీలు, జల్సాలు, హంగామాలు; ఈ రోజు ఇంద్రప్రస్థ కాలేజీలో డ్రామా ఉంటే, రేపు మిరాండా హౌస్ లో, ఎల్లుండి- లేడీ ఇర్విన్ కాలేజీలో కాన్సర్ట్, లేడీ హార్డింగ్, సెయింట్ స్టీఫెన్ కాలేజీ, చెమ్స్ ఫోర్డ్ క్లబ్, రోషన్ ఆరా, ఇంపీరియల్ జిమ్ ఖానా గారేజ్ చుట్టుపక్కల అలీఫ్ లైలాల గుంపులు చెల్లాచెదురుగా ఉండేవి.  ప్రతిచోటా యువ మిలిటరీ ఆఫీసర్లు, సివిల్ సర్వీస్ హోదాలో వుంటూ ఇంకా పెళ్లికాని యువతీ యువకులు తిరుగాడుతూ వుండేవారు.  ఒక సందడి వుండేది.  ప్రభ, సరళ  దగ్గర ఓ మారు, ఒక రోజు దిల్జీత్ కౌర్ దగ్గర. కౌర్ ఒక కోటీశ్వరుడైన కాంట్రాక్టర్ ముద్దుల పట్టీ.  కింగ్ ఎడ్వర్డ్ రోడ్ లో ఒక విలాసవంతమైన భవనంలో వున్న గార్డెన్ పార్టీ కోసం సమావేశం వుండే.  ఇక్కడే మేజర్ కుశ్వంత్ సింగ్ తో నా ములాఖాత్  అయ్యింది.  ఇతను ఝాన్సీ వైపు వుండే చౌహాన్ రాజ్ పుత్. ఒడ్డూ పొడుగు వుండి విశాలమైన ఛాతీ, బలమైన భుజాలు, పైకి మెలితిరిగి వున్న పొడవైన మీసాలు, మెరిసే తెల్లని అందమైన పలువరస. నవ్వితే ఒక అద్భుత దృశ్యంలా వుండేది.  గాలీబ్ కు వీరాభిమాని.  మాట మాటకి  షేర్- షాయరీ చెబుతూ కిలకిల నవ్వేవాడు. అతి మర్యాదగా వంగి వంగి పలకరిస్తూ అందరితో మాటలు కలిపే వాడు.  అతను పరిచయమైన రెండవ రోజే  సినిమా కెల్దామని ఆహ్వానించాడు.

సరళ,  ప్రభ వగైరా వీళ్లంతా తలతిక్క అమ్మాయిలు.  వారివి వింత  పోకడలు, విచిత్రమైన ఇష్టాలు.  అబ్బాయిలతో బయట తిరగడానికి  ఏ మాత్రం వెళ్లేవారు కాదు.  దిల్ జీత్ సోదరుడి  స్నేహితుడే కుశ్వంత్ సింగ్.  అతనికేం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.  అంతలో సరళ నెమ్మదిగా చెప్పింది – “కుశ్వంత్  సింగ్ వెంట సినిమాకు అస్సలు వెళ్ళకు.  పక్కా తిరుగుబోతు.“  నేను మౌనం వహించాను.  అప్పట్లో  న్యూ ఢిల్లీ లో ఒకరిద్దరు అమ్మాయిల విషయంలో వారి తిరుగుబోతు వ్యవహారాల చర్చలు, పుకార్లు చాలా ప్రచారంలో వుoడేవి.  దానితో నేను కాస్త ఆలోచిస్తూ భయం భయంగానే  వుoడే దాన్ని.  పరువు మర్యాదల కుటుంబాలలోని అమ్మాయిలు ఏ విధంగా తమ అమాయకులైన  తల్లిదండ్రుల కళ్ళలో దుమ్ముకొట్టి  ఎలాంటి వారితో విలాసాలు చేస్తూ విచ్చలవిడిగా తిరిగే వారో,  హాస్టల్ లో వున్నపుడు తరుచుగా ఇలాంటి అమ్మాయిల గురించి ఆరా తీసేవాళ్ళం.  వీళ్ళు చాలా చిత్ర  విచిత్రమైన మనస్తత్వాలు కలిగి వుండేవాళ్ళు.  మామూలుగా గమనిస్తే  అందరిలాగే  కనబడే వాళ్ళు.  చీరలు , సల్వార్లు ధరించి రకరకాల  మేకప్ లతో.  చదువుకున్న అమ్మాయిలే  మరి ..!

“మన సమాజం బద్నాం చేస్తది..”  సాదియా బుర్ర మీద జోరు వేసి గట్టిగా చెప్పింది .

“అంతగా  ఏముంది! అసలు మన సొసైటీకే బుద్దిలేదు.  చదువుకున్న అమ్మాయిలంటే ఏ మాత్రం సహించరు” – సరళ చెబుతోంది .

“అమ్మాయిలంటే  వాళ్లకు ఎలాంటి ఫీలింగ్స్ వుండవు” —  రెహానా తన అభిప్రాయం చెప్పింది .

ఏది ఏమైనా  మాతో పాటే తిరిగే మాలాంటి అమ్మాయిలలో కొందరు మాత్రం ఎంత భయంకరమైన చేష్టలు చేస్తారో వింటే అసలు నమ్మబుద్ది కాదు .

రెండవరోజు సాయంకాలం లేబొరేటరీ  వైపుకు వెళ్తుంటే నికల్సన్ మెమోరియల్ దగ్గర ఒక క్రిoసన్ రంగులోనున్న పొడవాటి కారు నెమ్మదిగా వచ్చి ఆగింది.  అందులోనుంచి కుశ్వంత్ సింగ్  తొంగి చూసాడు. ఆ మసక  చీకట్లో అతని అందమైన దంతాలు తెల్లగా మెరిసాయి. “అజీ హజరత్ ! ఇలా చెప్పండి, మీరు మీ అపాయింట్ మెంట్  మరిచారు!“

“ఆ.  అవును..”  కంగారుగా చెప్పాను.

“హుజూర్ – ఏ – వాలా, నడవండి నాతో వెంటనే! ఈ  సాయంకాలం వున్నది లేబొరేటరీలో దూరి కూర్చునేందుకు కాదు.  ఇంత చదివి ఏo చేస్తారు? ”

నేను ఎటూ తోచక అటూ ఇటూ  నాలుగు వైపులా చూసి  కార్లో దూరి కూర్చున్నాను.  అక్కణ్ణుంచి  కన్నాట్  ప్లేస్ వెళ్లి ఓ ఇంగ్లీష్  సినిమా చూసాము.  ఆ మరుసటి రోజు కూడా!  అలా ఆ వారం రోజులు అతనితో  షికార్లు చేస్తూ తిరిగాను. అతను ‘మేడిoజ్’ లో ఉండేవాడు.  ఆ వారం రోజులు చివరి వరకు మేజర్ కుశ్వంత్  సింగ్ కు మిస్ట్రెస్ లా వుండిపోయాను.

సాహిత్యం మీద అభిరుచి లేదు.  చైనీస్, జపానీస్, రష్యన్, ఆంగ్లం, ఉర్దూ కవిత్వం ఎన్నడూ చదివింది లేదు. సైకాలజీ ‘ఆదాబ్’  చదవడం నా దృష్టిలో సమయం వృధా చేయడమే.  పదిహేను సంవత్సరాల  వయసు వచ్చేసరికి నా దృష్టి, అభిరుచి అంతా  సైన్స్ మీదే.  తినడం, తాగడం అంతా  సైన్సే.  అతీత శక్తులు, మూఢ విశ్వాసాలు అంటే  ఏమిటో తెలియదు.  మిస్టిక్  ప్రభావం ఎంత?  కవిత్వం, ఫిలాసఫీ కోసమైతే  నా దగ్గర అప్పుడు  సమయమే లేకుండే.  ఇప్పుడూ లేదు.  నేను అస్పష్టత,  కారణం లేని  గుసగుసలు కూడా ఉపయోగించలేను. వెటకారపు మాటలు, మనసులో ఒకటి బయట ఒకటిగా  అర్ధం పర్ధం లేని మాటలు, చాడీలు చేయలేను.  అంతా సూటిదనమే.  కానీ, పదిహేను రోజుల్లోపల  కాలేజీ లో అందరికీ తెలిసిపోయింది.   నా లోపల ఏదో తెలియని  వింత ఆత్మ విశ్వాసం వుండేది.  ఎవ్వరినీ పట్టించుకునే  స్థితి దాటిపోయింది.  ముందు నుంచి కూడా ఎవ్వరితోనూ ఎక్కువగా  మాట్లాడే స్వభావం కాదు.  సరళ  వాళ్లంతా నన్నదోలా చూసేవారు.  అంగారక  గ్రహం నుండి దిగివచ్చానా?  లేక నా నెత్తిన కొమ్ములు  మొలిచాయా? అన్నట్లు వింతగా చూసేవారు.  నేను బయటికి వెళ్లిన తరువాత డైనింగ్ హాల్లో  నా గురించి కథలు కథలుగా గంటల తరబడి చర్చలు జరిపేవారు.  తమ ఇంటలిజెన్స్ సర్వీస్ నైపుణ్యంతో నా గురించి, కుశ్వంత్ సింగ్ గురించి  ప్రతి క్షణం, ప్రతి విషయం వారికి అందుబాటులోకి వచ్చేది.  సాయంకాలo  మేమెక్కడికెళ్ళాము,  రాత్రి న్యూ ఢిల్లీలో  ఏ  బాల్ రూమ్ కు  డాన్స్ కోసం వెళ్లి ఎంజాయ్ చేసాం (కుశ్వంత్ , మార్కె శైలి  నృత్య కారుడు. అతను నాకు డాన్స్ కూడా నేర్పించాడు), కుశ్వంత్  ఏయే దుకాణాల నుంచి ఏయే బహుమతులు కొనిచ్చాడు, అలా అన్ని సంగతులు ఆరా తీసేవారు.

కుశ్వంత్  నన్ను బాగా శారీరకంగా హింసించేవాడు.  అలాగే ప్రపంచంలో  ఏ మగాడు ఏ ఆడదాన్ని ప్రేమించనంతగా ప్రేమించేవాడు.  నెలలు గడిచిపోయాయి.  నా ఎం. ఎస్సి,  ప్రీవియస్  పరీక్షలు దగ్గర పడటంతో నేను చదువులో మునిగి పోయాను.  పరీక్షల తర్వాత తను అన్నాడు — “జానేమన్, దిల్ రుబా, నడు, ఏదైనా ప్రశాంతంగా వుండే హిల్ స్టేషన్ కెళదాం – సోలన్, డల్హౌసీ, లెన్స్ డౌన్..”

నేను కొన్ని రోజుల కోసం మీరట్ వెళ్లాను.  అబ్బాతో (అమ్మీ జాన్ నేను థర్డ్ ఇయర్ లో వున్నప్పుడే చనిపోయింది)  ఫైనల్ ఇయర్ కదా మనసు పెట్టి  బాగా చదవాలి అని చెప్పి తిరిగి ఢిల్లీ వచ్చేశాను.  షుమాలి  ఇండియా  హిల్ స్టేషన్ లో ఎక్కడైనా పరిచయస్తులు ఎదురయ్యే అవకాశం వుండటంతో దూరంగా వున్న జునూబ్ లో  ఊటీ కెళ్ళి అక్కడ నెల రోజులు గడిపాము.  కుశ్వంత్  సెలవులయిపోవడంతో  ఢిల్లీ తిరిగివచ్చి తిమార్ పూర్ లో ఒక బంగాళాలో మకాం చేసాం. కాలేజీలు తెరవడానికి ఒక  వారం రోజుల ముందు కుశ్వంత్ కు నాకు మధ్య పెద్ద  గొడవ జరిగింది .  అతను నన్ను బాగా చితక బాదాడు.  ఎంతగా కొట్టాడంటే నా మొహం అంతా రక్తసిక్తమై  పోయింది.  భుజాలు, కాలిపిక్కలు ఊదాగా కమిలిపోయాయి.  మా మధ్య జగడానికి కారణం అతని  ఆ కిరస్తానీ పీనుగు ‘మంగేతర్’  ఎక్కడ్నుంచి రాలిపడిందో తెలియదు గాని నా గురించి చేదుగా అందరి మనసులో విషం నింపసాగింది.  అవకాశం  దొరికితే  చంపాలనే కసి ఆమెలో కనబడేది.  అది ‘చార్ సౌ  బీస్.’  యుద్ధకాలంలో మిలట్రీ లో ఉండేది.   అక్కడే  బర్మాలో  యుద్దభూమిలో కుశ్వంత్ తో కలిసింది.   తెలియదు, ఏ పరిస్థితుల్లో కుశ్వంత్  ఆమెతో  పెళ్ళికి మాటిచ్చాడో!  కానీ నాతొ  స్నేహం కుదిరిన తరువాత ఆమె ఇచ్చిన ఉంగరాన్ని తిరిగి ఇచ్చేయడానికి మంకు పట్టుబట్టాడు.  ఆ రోజు రాత్రి  తిమార్ పూర్ సుంసాన్  బంగళాలో  నా ముందు  చేతులు జోడించి  అతన్ని పెళ్లి చేసుకొమ్మని  లేకుంటే చనిపోతానని చెపుతూ వెక్కి వెక్కి ఏడవసాగాడు. నేను గట్టిగానే  అతని విన్నపాన్ని నిరాకరించాను.  ఎట్టి పరిస్థితుల్లోనూ  పెళ్లి జరగని పని అని  సూటిగానే చెప్పాను.  ” సయ్యద్ ల వంశంలో పుట్టి ఒక ఉన్నత కుటుంబానికి చెందిన మహిళను నేను.  పొగాకు కట్టలా నల్లగా వున్న ఒక హిందూ జాట్ కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని నా వంశానికి, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చి కళంకితం చేస్తానా! అందం, సుకుమారం వున్న నన్ను ఆలస్యంగా నైనా సరే ఒక సంపన్న ముసల్మాన్ కుటుంబానికి చెందిన  వ్యక్తి అతి వైభవంగా బారాత్ తీసుకొని  వివాహమాడటానికి వస్తాడని కళలు కంటున్న దాన్ని.  మా  ‘ఆర్సి  ముసహఫ్  హోగా ‘ (ముస్లిం  పెళ్లిల్లలో  పెళ్లి కుమారుడు , అద్దంలో పెళ్లి కుమార్తె మొహం చూసే సాంప్రదాయం ).  తలపై  బాసింగాలతో, సాంప్రదాయబద్దంగా వీడ్కోలు, అప్పగింతలతో అతనింటికి పెళ్ళికూతురిలా బయల్దేరుతాను. విద్యుత్ అలంకారాలు సంగీత నృత్యాలు, ఆడపడుచులు దర్వాజ దగ్గర ఆపి వారి సోదరుడి నుండి శకునం రూపంలో డబ్బుకి సరదాగా పేచీ పెట్టుకోవడాలు, ‘మిరాసిన్లు’  (ముత్తైదువులు, కన్యలు) డోలక్ లు తీసుకొని నిలబడతారు. స్వయంగా నేను హిందూ, ముస్లింల మధ్య  పెళ్లిళ్లు జరిగి చివరికి ఏ గతి పట్టిందో ఎన్ని చూడలేదు.  ప్రేమ అనే మోజులో పడి, ఇష్టపడి భావోద్వేగంతో  పెళ్లిళ్లు చేసుకొని ఏడాది లోపే విడిపోయిన సంఘటనలు కోకొల్లలు. తరువాత  పిల్లల దుర్గతి ఏమైందో అది వేరే సంగతి.  ఎటూ కాకుండా పోతాయి జీవితాలు.  ‘నా ఘర్ కా, నా ఘాట్ కా’ చందాన మిగిలిపోతాయి.  అలా నేను కాదనేసరికి కుశ్వంత్ నన్ను తన్నిబాగా చితక్కొట్టి  పిప్పి పిప్పి చేసి మూడవ రోజే ఆ నల్ల దయ్యం క్యాథరీన్ ధరమ్ దాస్ తో ఆగ్రా వెళ్ళిపోయాడు.  అక్కడే ఆ కులం తక్కువ దానితో సివిల్ మ్యారేజ్ చేసుకున్నాడు.

కాలేజీలో కొత్త టర్మ్ ప్రక్రియ ప్రారంభమైంది.  ఈ స్థితిలోనే హాస్టల్లో చేరాను. తలమీద, ముఖం మీద బ్యాండేజీలు  కట్టి వున్నవి. అబ్బాజాన్ కు ఉత్తరం రాసాను. లాబొరేటరీలో ప్రయోగం చేస్తూ వుంటే భయంకరంగా పరికరం పేలి కొద్దిగా నా మొహం కాలిపోయిందని. ఇప్పుడు బాగానే వుంది, గాభరా పడాల్సింది ఏమిలేదని.

అమ్మాయిలకైతే  కథంతా ఇదివరకే తెలిసిపోయింది.  కావాలనే వారు నా యోగక్షేమాలు  కనీసం అడగను కూడా అడగలేదు.  ఇంత పెద్ద స్కాండల్  జరిగిన పిమ్మట  హాస్టల్ లో ఉండనిచ్చే  అవకాశం తక్కువ.  కానీ హాస్టల్ వార్డెన్ కు  కుశ్వంత్ సింగ్ తో మంచి దోస్తీ  ఉండేది.  అందుకే  అందరూ మౌనంగా వున్నారు.  ఇంతే కాకుండా ఎవరి దగ్గర కూడా ఎలాంటి సాక్ష్యం కూడా లేదు! ఆ లెక్కన  చూస్తే కాలేజీ అమ్మాయిలకు ఇతరులను బద్నాం చేయాలన్న ఆతృత ఎక్కువ.

నాకు ఆ  సంఘటన  నిన్న జరిగినట్లుగానే ఇంకా యాదికుంది.  ఉదయం పూట, పది  పదకొండు గంటల సమయం కావొచ్చు.   రైల్వే స్టేషన్ నుండి అమ్మాయిలను తీసుకొచ్చే ‘టాoగాలు’ పాఠక్  దాకా వచ్చి లోపలికెళ్తున్నాయి.  హాస్టల్ లోని  ‘లాన్’  మీద  మర్రిచెట్టు కింద  అమ్మాయిలు తమ తమ వస్తువులు తీసి పెట్టిస్తున్నారు.   అదే సమయంలో నేను  నా టాoగాను దిగాను.  అందరూ  కట్టు కట్టివున్న నా తెల్లటి మొహం చూసి వాళ్ళ కొంపేదో  మునిగి పోయిందన్నట్లు    ఆశ్చర్య పోతున్నారు.  నా సామాన్లను చౌకీదార్ నెత్తి మీద  పెట్టించి నా గది వైపు వెళ్ళిపోయాను. మధ్యాహ్న సమయంలో డైనింగ్  టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాను.  ఆ మహారాణులు  చాలా తెలివిగా, గుసగుసలు మొదలుపెట్టారు.  వాళ్ళ మాట తీరుతో  ఏం చెప్పదలుచుకున్నారంటే  ఈ సంఘటనకు  కారణం వాళ్లకు తెలుసన్నట్లుగా  లోకాభిరామాయణం చెప్పుకుంటూ,  పై పెచ్చు నాకు అనుమానం రాకుండా  ఆ విషయం సంగతే ఎత్తలేదు.  ఆ ఛండాలపు గుంపులో నుంచి ఒకతె ఆ  గుంపుకు గురువు,  నాయకురాలు అన్నీను.  రాత్రి భోజనం దగ్గర,  నాకు మదపిచ్చి, శృంగార వ్యామోహాలకు అలవాటు పడినదాన్నని, నిoఫో- మానియాక్ అని నిర్ణయించేసింది.  ఆరా తీసి, జాసూసి చేసే  స్నేహితురాలి ద్వారా  ఈ చర్చ  పై దాకా వెళ్లి పోయిందన్న  విషయం నాకు తెలిసిపోయింది.  నేను నా గదిలో కిటికీ దగ్గర కూర్చొని టేబుల్ లాంప్ వెల్తురులో చదువులో మునిగిపోయాను.   ప్రత్యేకించి  ఇలాంటి విషయాలు ఇక్కడ  సర్వసాధారణమై పోయాయి.  ఎలాగైతే  ఒక్క  చేప మొత్తం నీటిని పాడు చేసినట్లు, వీళ్ళు వాతావరణాన్ని అంతా కలుషితం చేస్తారు.  అందుకే అంటారు,  అమ్మాయిలకు హద్దు (పరదా ) లేకుండా విచ్చలవిడిగా తిరిగే  స్వేచ్ఛ ఎంత భయంకరంగా వుంటుందో అలాగే  పెద్ద చదువులు చదివే అమ్మాయిలు  ఎందుకు  బద్నాం  అవుతారో వగైరా వగైరా …

నా  హద్దులేమిటో నాకు బాగా తెలుసు.  దైవభీతి వున్నదాన్ని.  మంచి కుటుంబాల నుంచి  వచ్చిన అమ్మాయిలు  కూడా  పెద్ద చదువులు చదువుతూ  ఆవారాగా ఎందుకు మారుతారాయని ఆలోచిస్తూవుండే దాన్ని.  ఇంకా వారి ఐ క్యూ  ఇంత తక్కువగా ఎందుకు వుంటుందని.   విచక్షణ,  తెలివి వున్న వ్యక్తులు,  తెలిసి తెలిసి తమ నాశనాన్ని కోరుకుంటూ  చెడు మార్గం పై ఎందుకు నడుస్తారు!?  కానీ,  నేను స్వయంగా మంచి తెలివి, చురుకుతనం గల అమ్మాయిలను చూశా!  ఎలా  లోఫర్  పనులు చేస్తారో!  రెండవ కారణం – షికార్లు కొట్టడం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, విలాసవంతమైన జీవితం,  జీవితాన్ని ఆడంబరంగా గడపాలన్న అత్యాశ,  సాహసాలు చెయ్యాలన్న తపన, ఏదో సాధించాలన్న భావన లేదా  పరదా వెనక బందీఖానా లాంటి జీవితం నుండి ఒక్కసారిగా  పక్షుల్లా  స్వేచ్ఛావాతావరణoలోకి ప్రవేశించగానే తమ పాత జీవితాలను మర్చిపోవడం!  ఈ పరిస్థితులకు ఇవి కొన్ని కారణాలు మాత్రమే!  ఇవన్నీ చెప్పుకోవడం  అవసరమే  లేకపోతె ఇంకేం కారణాలుంటాయి?!

నేను ఫస్ట్ టర్మ్ పరీక్ష నుండి బయటపడ్డాను.  కుశ్వంత్, మర్యాదగా మళ్ళీ దగ్గరికి వచ్చాడు.  అతను లాబొరేటరీకి  ఫోన్ చేసి నన్ను సాయంకాలం ఆరుగంటలకు  ‘నరూలా’ వద్ద కలుసుకొమ్మని చెప్పాడు.  నేను అలానే చేసాను.  అతను  కాథరీన్ ను ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలి  సర్కార్ పనిమీద ఢిల్లీ వచ్చాడు.  ఈ సారి  విమానమెక్కి ఒక వారం రోజులకు బొoబాయి వెళ్ళాము.  దీని తరువాత  ప్రతి రెండు మూడు నెలలకోసారి కలవడం జరుగుతూ వుండేది.  ఏడాది గడిచి పోయింది.  ఈ సారి ఢిల్లీ వచ్చినపుడు అతను తన దగ్గరి స్నేహితుడొకడికి  కారు ఇచ్చి నన్ను తీసుకురావడానికి పంపాడు.  ఎందుకనగా కుశ్వంత్  లక్నోనుండి లాహోర్ వెళ్తూ పాలంపూర్ లో కొన్ని గంటలు వుండాల్సి వుంది.  ఆ స్నేహితుడు  ఢిల్లీ లోని ఒక పెద్ద ముసల్మాన్ వ్యాపారి కొడుకు. అతన్ని యువకుడు అని చెప్పడానికి లేదు. నలభైల వయస్సులో వుండి ఉంటాడు.  భార్యా పిల్లలతో.  తాటిచెట్టులా శరీరం. ఇంగ్లీషు అంతా తప్పుల తడకతో మాట్లాడేవాడు.  నల్లగా, వికారంగా అచ్చం పిట్టల దొరలా మొహం. గొప్ప క్యారెక్టర్.

కుశ్వంత్ ఈ సారి ఢిల్లీ వదిలి వెళ్లిన తరువాత మళ్ళీ తిరిగి రాలేదు.  ఎందుకంటే ఇప్పుడు నేను ఫారూఖ్ మిస్ట్రెస్ అయ్యాను.  ఫారూఖ్ తో నేను అతని ‘మంగేతర్‘ హోదాలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉన్నతమైన సొసైటీలో తిరుగుతున్నాను.

ముసల్మాన్లలో నాలుగు  పెళ్లిళ్లు చట్టబద్ధంగా అంగీకారమే. ఇందులో చెడుగాని, తప్పుగాని ఏమి లేదు. మతంలో వున్నఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోదలిచి తన చదువు రాని నడివయసు, మోటుమనిషి,  మొదటి భార్యను పరదాలో వుoచి, చదువుకున్న అమ్మాయితో మరో పెళ్లి చేసుకొని హుందాగా నలుగురిలో తిరగాలన్నది అతని కోరిక. శ్రీమంతుల కుటుంబాలలో అన్నీ సాగిపోతవి. ఇవన్నీ మా మధ్య తరగతి కుటుంబాలలోనే – ‘అలా చేయకు, ఇలా చేయకు’ అంటూ ఆంక్షలు.  కొన్ని రోజుల కాలేజీ సెలవుల్లో ఫారూఖ్ కూడా తనతోపాటు చాలా చోట్ల తిప్పాడు.  కలకత్తా, లక్నో, అజ్మీర్ అసలు అతను లేకుండా చూడటానికి ఏ ప్రదేశం మిగిలిందని. అతను నాకు వజ్రాల ఆభరణాలు, నగానట్రా ఎన్నో ఇచ్చాడు.  అబ్బాజాన్ కు ఉత్తరాలు రాసేదాన్ని- యూనివర్సిటీ తరఫు నుండి ఎడ్యుకేషనల్ టూర్ మీద తోటి విద్యార్థినులతో వెళ్తున్నానని లేదా సైన్స్ కాన్ఫరెన్స్ లో పాలుపంచుకోవడానికి నన్ను పిలిపించారని చెపుతూ వచ్చాను. కానీ అదే సమయంలో నేను నా చదువును నిర్లక్ష్యం చేయక మంచి మార్కులతో పాసవ్వాలన్న ధ్యాస కూడా వుండేది.  ఫైనల్ పరీక్షల్లో పేపర్లు సరిగా చేయలేకపోయాను.  పరీక్షలు అయిపోయిన వెంటనే ఇంటికెళ్లి పోయాను.

అదే సమయంలో  ఢిల్లీ లో అల్లర్లు చెలరేగాయి. ఫారూఖ్ మీరట్ లో వున్న నన్ను వెంటనే పాకిస్తాన్ వెళ్లిపొమ్మని  నేనక్కడే కలుస్తానని ఉత్తరం ద్వారా కబురంపాడు. నేను కూడా మొదటి నుండి అదే కోరుకున్నాను.  ఇప్పుడిక  ఇండియాలో ఉండడం కష్టమై పోయింది.  గౌరవ మర్యాదలున్న ముసల్మాన్ అమ్మాయిలు  ఇజ్జత్ తో బతకడం ప్రమాదంలో పడిందని అబ్బాజాన్ కూడా చాలా దిగులుగా వుండేవాడు.  పాకిస్తాన్ – ఇస్లాo ల ముల్క్.  అందుకే వేరే మాట చెప్పేందుకేముంది.  అబ్బు ఇక్కడ ఆస్తులుండటంచే వెంటనే దేశం మారాలి అన్న విషయం ఆలోచించలేదు.   అమ్మీజాన్ ఇంతెకాల్ తర్వాత నా ఇద్దరు చిన్న తమ్ముళ్లను హైదరాబాద్ దక్కన్ లో వున్న మా ఖాలాజాన్ దగ్గరికి పంపించారు.  పరీక్ష ఫలితాలు వచ్చాయి. నేను థర్డ్ డివిజన్లో పాసయ్యాను. దాంతో నా మనసు విరిగిపోయింది. కాస్త అల్లర్లు  సద్దుమణగగానే నేను విమానమెక్కి లాహోర్ కు వచ్చేసాను.  ఫారూఖ్ నా వెంట వచ్చాడు. ఒక ప్రణాళికతో వచ్చాడు. తమ వ్యాపారానికి సంబంధించి ఒక శాఖను పాకిస్తాన్ లో ప్రారంభించి లాహోర్ లో హెడ్ ఆఫీస్ ను  స్థాపించాలనుకున్నాడు.  అక్కడే నన్నుయజమానిగా చేసి వివాహమాడతానన్నాడు.  అతను పాకిస్తాన్ వలస పోవడం ఇష్టపడటం లేదు.  ఎందుకంటే  ఫారూఖ్ తండ్రి పాత ఆలోచనలు వున్నవాడు.  అతని పథకం ఎలా ఉందంటే ప్రతి  రెండు, మూడు నెలలకోసారి లాహోర్ కు వచ్చిపోతుంటాడు.  లాహోర్ లో పెద్ద సందడి, అలజడి మొదలయ్యింది. పెద్ద పెద్ద బంగళాలు, కోఠీలు అలాట్ అయ్యే అవకాశం వున్నది కానీ ఫారూఖ్ కు ఇక్కడెవరూ తెలియకపోవడంతో ఏదో విధంగా సంత్ నగర్ లో ఒక చిన్న ఇల్లు నా పేరు మీద అలాట్ చేయించి అక్కడ నన్ను వుంచాడు.  నాకు తోడుగా మంచి చెడు చూడటానికి తనకు దూరపు బందువైన  ఒక పెద్దావిడను నా దగ్గర వదిలాడు.  వీళ్ళు మహాజీర్లుగా లాహోర్ లో వచ్చి స్థిరపడి అనేక కష్టాలు ఎదుర్కొంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు.

నా జీవితoలో అనుకోకుండా జరిగిన ఈ మార్పులకు  విచలితురాలినై పోయా.  ఎటూ తోచక, ఏమీ అర్ధం కాక  ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాను అంటూ అయోమయానికి లోనయ్యాను.  ఎక్కడ- పరాయిదై పోయిన ఆ హిందుస్తాన్ నిండైన, ఇష్టమైన రంగారాంగ్ దునియా,  ఎక్కడ 1948 లోని ఈ లాహోర్ లో ఓ చిన్న ఇరుకైన ఇల్లు.  అల్లాహు  అక్బర్. నేను, గుండెలవిసిపోయే ఎలాంటి  సంఘటనలు చూడాల్సి వచ్చింది. ఇంతలా నా జీవితం శూన్యమై పోయింది.  చివరికి ఉద్యోగం వెతుక్కుందామన్న ఆలోచన కాని, ప్రయత్నం కూడా  చేయలేదు.  డబ్బుల కోసం ఎలాంటి చింత లేకుండే.  ఎందుకంటే ఫారూఖ్ నా పేరు మీద పదివేల రూపాయలు జమ చేసి వెళ్ళాడు. (కేవలం పదివేలు-అతను స్వయంగా కోట్లకు అధిపతియై వున్నాడు. అప్పుడు  నాకేమి అర్ధం కాకుండాపోయేది. ఇప్పుడు కూడా ఏమి అర్ధం కావడం లేదు) రోజులు గడుస్తూపోయాయి.  ఉదయం నుంచి సాయంకాలం దాకా ఫారూఖ్ బంధువు ఖాలా, అమ్మమ్మ  ఏమవుతుందో కానీ పెద్దావిడ!  ఆమె ద్వారా తను వలస వచ్చిన పరిస్థితులను కథలు కథలుగా చెబుతుంటే, కుటుంబ విషయాలు వింటూ పాన్ మీద పాన్ తినుకుంటూ కూర్చునేదాన్ని.  మెట్రిక్ చదివే ఆమె కూతురికి ఆల్జీబ్రా, జామెట్రీ  నేర్పిస్తూ కొంత సమయం గడపటం కూడా అయ్యేది.  ఆమె కొడుకు, ఫారూఖ్ పెట్టిన బిజినెస్ వ్యవహారాలు చూస్తూండే వాడు.  ఫారూఖ్ ఏడాదిలో ఓ ఐదారుసార్లు వచ్చి పోయేవాడు.  అతను వచ్చినపుడు ఆ కొన్ని రోజులు ఆనందంతో గడిచేవి.  అతని ‘ఖాలా’ ఎంతో  ఓపికగా అతనికిష్టమని ఢిల్లీ వంటకాలను వండిపెట్టేది.  నేను ‘మాల్’ లో వున్న హెయిర్ డ్రెస్సర్ దగ్గరికి వెళ్లి హెయిర్ సెట్ చేసుకొని వచ్చేదాన్ని.  సాయంకాలం మేమిద్దరం కలిసి జింఖానా క్లబ్ కెళ్ళి ఓ మూల టేబుల్ దగ్గర కూర్చునేవాళ్ళం.  బీరు గ్లాసు ముందు పెట్టుకొని ఫారూఖ్ ఢిల్లీ కబుర్లు, విశేషాలు ఏ మాత్రం అలసట లేకుండా ఏకధాటిగా చెప్పుకుంటూ పోయేవాడు.  అలా మాట్లాడుతూ ఒక్కసారిగా ఆగిపోయి లోపలికి వచ్చే కొత్తవాళ్లను చూస్తూ వుండిపోయేవాడు.  ఎప్పుడూ పెళ్లిమాట ఎత్తకపోయేవాడు.  నేనూ అడగలేదు. నేను కూడా పరిస్థితులతో అలసిపోయాను.  దేని మీద ఇష్టం వుoడేది కాదు.  ఇప్పుడేం జరిగినా ఏం లాభం! అతను ఢిల్లీ తిరిగి     వెళ్ళిపోగానే ప్రతి పక్షం రోజులకు ఉత్తరాల ద్వారా నా క్షేమ సమాచారాలు, అతని వ్యాపార విషయాలు తెలుపుతూ వుoడేవాడు.  అప్పుడప్పుడూ “ఈ సారి వచ్చేటప్పుడు కన్నాట్ ప్లేస్ లేదా చాందిని చౌక్ నుండి దుకాణాలలో మంచి మంచి పూల చీరలు తీసుకొని రమ్మని” రాసేదాన్ని.  ఎందుకంటే  పాకిస్తాన్ లో మంచి చీరెలు దొరికేవి కావు.  ఒకరోజు చాచా మియా నుండి ఉత్తరం వచ్చింది – ‘అబ్బాజాన్ కా ఇంతెఖాల్’ వార్తతో. ‘అహ్మద్-ఎ-ముర్సల్ నా రహే కౌన్ రహేగా’. అప్పుడు ఏదీ  శాశ్వతం కాదన్న భావనతో ఉద్వేగానికి  ఏమి లోను కాలేదు.  అలాంటి  స్వభావమే లేదేమో  నాలో?!  కానీ అబ్బు నేనంటే  ప్రాణమిచ్చేవాడు.  ఆయన  మరణం నాకు తీవ్ర వేదనను కలిగించింది.  ఫారూఖ్ ఎంతో  ప్రేమ, ఓదార్పు మాటలతో ఉత్తరం వ్రాయడంతో కాస్త నన్ను నేను సంభాళించుకోగలిగాను.  అతనిలా  వ్రాశాడు- “ నమాజు చదువుతూ వుండు. ఇది కష్ట సమయం.  సమాజం మీద చెడు  ప్రభావం పడుతోంది.  కాలాన్ని నమ్మలేం.”  వ్యాపారస్తులు అందరిలా  అతను కూడా చాదస్తుడు.  మూఢ నమ్మకాల మీద విశ్వాసం ఎక్కువ.  ఎంతో  నిష్టగా అజ్మీర్ దర్శిస్తాడు.  జ్యోతిష్కులు, పండితులు, మేధావులు,  పీర్ ఫకీర్లను సందర్శిస్తాడు.  మంచి చెడు శకునాలు, కలల్లో వచ్చిన విషయాలను అన్నింటిని  గుడ్డిగా, గట్టిగా నమ్మేస్తాడు.  ఒక నెల నమాజు చదివా కానీ నేను ‘సజ్దా’ లో వున్నప్పుడు గట్టిగా నవ్వాలని మనసు తహతహలాడేది .

ఇక్కడ  సైన్స్  టీచర్ల  పెద్ద డిమాండ్  వుండేది.  ఒక స్థానిక  కాలేజీ వారు నన్ను ఒత్తిడి చేయడంతో  నేను అక్కడ చదువు చెప్పడం ప్రారంభించాను.  నిజానికి  టీచర్  వృత్తి  అంటే  నాకెంత మాత్రమూ  ఇష్టం లేదు.  కొన్ని నెలల తర్వాత   దూరంగా విసిరివేయబడినట్లున్న ఒక  జిల్లాలో,  బాలికల కళాశాల వాళ్ళు పిలిస్తే వెళ్లాను.  కొన్ని సంవత్సరాలు  నేనక్కడ పనిచేసాను.  నా దగ్గర చదువుకునే అమ్మాయిలూ  తరుచుగా అడిగే వారు. ” హాయ్ అల్లాహ్! మిస్ తన్వీర్ – మీరు ఇంత అందంగా వున్నారు.  మీరు మీ కరోడ్ పతి  మంగేతర్ తో  వివాహమెందుకు చేసుకోలేదు”  అని.  ఈ  ప్రశ్నకు  నా దగ్గర జవాబు లేదు.  ఇక్కడ  కొత్త  ప్రదేశం, కొత్త మనుషులు,  కొత్త పరిచయాలు.  ఇక్కడెవరికీ  నా గతం గురించి తెలియదు.  ఎవరైనా ఒక మంచి  మనసు గల వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్దపడగలడు?  (కానీ మంచి మనసున్న వ్యక్తి,  సంస్కారవంతుడు, నవ్వుతూ వుండేవాడు, బుద్దిమంతుడు నా కసలు నచ్చకనే పోయేవాడు. నేనేమి జేసేది) ఢిల్లీ లోని కథలు ఢిల్లీలోనే వుండిపోయాయి.  అంతే కాదు, నేను స్వయంగా చూసాను కదా  ఒకర్ని మించి ఒకరు  శత్రువు,  ప్రతిద్వoద్విగా వ్యవహరిస్తారు. విచ్చలవిడిగా తిరిగిన అమ్మాయిలు ఇప్పుడు పవిత్రత, సచ్చరిత్ర తో వరస కట్టి వున్నారు.  స్వయంగా ఎడిత్  హరి రామ్, రాణి ఖాన్  ఉదాహరణలు నా ముందు సజీవంగా నిలుచున్నాయి.

ఇపుడు ఫారూఖ్ కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు.  కలిసినా ఎలా కలిసేవారమంటే  ఎన్నో సంవత్సరాలై  పాతబడిపోయిన  మొగుడు పెళ్ళాంలా.  ఇక  కొత్తలో వుండే వ్యామోహాలు, ప్రేమలు  ఐపోయాయి  అన్నట్లు వుండేది.  ఇప్పుడెలా వుండాలి  ప్రశాంతంగా, సుఖంగా, చీకూచింతా లేకుండా జీవితంలో  స్థిరపడి పోయి, సాగిపోయే సమయం . ఫారూఖ్  కూతురి  పెళ్లికూడా  ఈ మధ్య కాలంలోనే  ఢిల్లీలో జరిగిపోయింది .  అతని కొడుకు  ‘ఆక్స్ ఫర్డ్ ‘ వెళ్ళిపోయాడు . భార్య  చాలా కాలం నుండి  ఆస్త్మా రోగం తో బాధపడుతుంది.  ఫారూఖ్ తన వ్యాపారాన్ని పలుదేశాలలో శాఖలుగా  విస్తరింపజేసాడు.  నైనిటాల్ లో కొత్త  బంగాళా కట్టిస్తున్నాడు.  ఫారూఖ్ తన కుటుంబ విషయాలను, వ్యాపారం విషయాలను  చాలా వివరంగా విప్పి చెప్పేవాడు.  నేనతనికి  పాన్ కట్టి ఇస్తుండేదాన్ని.

      ఒకసారి  సెలవుల్లో కాలేజీ నుండి లాహోర్ వస్తే ఫారూఖ్ కు పాత దోస్త్ సయ్యద్ వఖార్ హుసేన్  ఖాన్ తో  భేటీ అయ్యింది.  ఇతను కూడా చాలా కాలం నుండి  ఒంటరిగానే వుంటున్నాడు.  ఏదో కోల్పోయినట్లు వుండే  వాడు.  సాధారణమైన సౌష్టవం,  ఒడ్డు పొడవు, ముదురు రంగు కలిగి దాదాపుగా నలభై ఐదు  సంవత్సరాల వయసులో వుoటాడు.  మంచి స్థాయిలో వున్నట్లు  కనబడతాడు.  ఇతన్ని నేను మొదటసారి  న్యూ ఢిల్లీ లో చూశా.  అక్కడ అతనికి ఒక  డ్యాన్సింగ్  స్కూల్ వుండేది.  ఇతను రామ్ పూర్ లో ఒక సాంప్రదాయక  కుటుంబం లో జన్మించాడు.  తల్లిదండ్రులకు ఒక్కడే  కొడుకు.  చిన్నప్పుడే ఇంటినుంచి పారిపోయి సర్కస్ ,  కార్నివాల్  లేదా థియేటర్  కంపెనీ వాళ్ళతో కలిసి ఊరూరూ, దేశదేశాలు  తిరిగేవాడు.   సింగపూర్, హాంగ్ కాంగ్ , షాoగై,  లండన్  ఎక్కడెక్కడో తిరిగాడు.  కులం, మతం జాతి, స్థానం తేడా చూడకుండా,  సమయాసమయాలు లేకుండా వివాహాలు చేసుకున్నాడు.   ప్రస్తుతం అతనితో భార్యగా వున్న ఆమె, ఒడిశాలోని మార్వాడి మహాజన్  కుటుంబానికి చెందిన  అమ్మాయి.  ఆమెను  కూడా కలకత్తా నుండి లేపుకు వచ్చాడు.  పన్నెండు,  పదిహేను  సంవత్సరాలకు  పూర్వమే  నేనామెను  ఢిల్లీలో  చూసాను.  చామన ఛాయ రంగు,  అమ్మాయి  భర్త పెట్టె బాధలు భరించలేక ఇంట్లోనుంచి పారిపోయేది.  కానీ కొన్ని రోజులు పోగానే  తిరిగి వచ్చేసేది. ఖాన్ సాహెబ్  కనాట్ సర్కస్ కు చెందిన  ఒక బిల్డింగ్ లో మూడవ  అంతస్తు పై  ఇంగ్లీష్  డ్యాన్స్  నేర్పించే స్కూల్ ఒకటి తెరిచాడు.  అందులో అతను, అతని భార్య, ఇద్దరు ఆంగ్లో – ఇండియన్  అమ్మాయిలు  స్టాఫ్ గా వుండేవారు.  యుద్ధ కాలంలో ఆ స్కూల్ మీద  కష్టాలు వచ్చి పడ్డాయి.  ఆదివారం రోజు  ఆ స్కూల్ లో ఉదయం ‘జిమ్ సెషన్’ నడిచేది.

ఒకసారి  నేను కూడా కుశ్వంత్  వెంట ఆ స్కూల్ కు వెళ్లాను. వఖార్ సాహెబ్  భార్య  పతివ్రతలా ప్రవర్తించేదని విన్నాను.  భర్త, బొద్దుగా, ముద్దుగా వుండే అమ్మాయిలతో  స్నేహం చేసి నమ్మించి వారిని  తన దగ్గరికి తీసుకురా  అని ఆజ్ఞలు  చేసేవాడు.  తాను కూడా అలాగే  పొల్లుపోకుండా చేసేది.  ఒకసారి మా హాస్టల్ కు వచ్చింది.  వచ్చి కొందరమ్మాయిలతో కలుపుగోలుగా కలిసిపోవడంతో వారంతా  ఆమెతో పాటు ‘ బారహా ఖంచా రోడ్’  కు వెళ్లి చాయ్ తాగారు.  (దేశ ) విభజన తరువాత వఖార్  సాహెబ్ మహాశయుడు  కిందా మీదపడి  చివరికి లాహోర్ వచ్చాడు.  మాల్ రోడ్డుకు  వెనకాల ఒక ఫ్లాట్  అలాట్  చేయించుకొని అందులో తన స్కూల్ ప్రారంభించాడు.  ప్రారంభంలో వ్యాపారం  కాస్త నెమ్మదిగానే కొనసాగింది. గుండెల్లో విషాదం గూడు కట్టుకొనివుంది .  నృత్యం, సంగీతం  మీద మనసు మళ్లడం లేదు. విభజనకు ముందు  అదే ఫ్లాట్ లో ఆర్య సమాజ్ వారి మ్యూజిక్ స్కూల్  వుండేది.  వుడెన్ ఫర్నిచర్ తో హాల్ పక్కనే రెండు చిన్న గదులు, స్నానాల గది, వంటగది,  ముందు  చెక్కతో చేయబడిన బాల్కనీ,  ఇంకా శిథిలమై వేళ్ళాడుతూ  ‘ హింద్ మాతా సంగీత్ మహా విద్యాలయ్’  అన్న పేరుతొ బోర్డు  ఇప్పటికీ వంకరగా  బాల్కనీ మీదవుంది.  దాన్ని తీసేసి “వఖార్స్ స్కూల్  ఆఫ్  బాల్ రూమ్  అండ్ ట్యాప్ డ్యాన్సింగ్ “  బోర్డు పెట్టేసారు.  అమెరికా  సినిమాలనుంచి  పోస్టర్లు ఎన్నుకొని  జేన్ కెల్లీ,  ఫ్రెడ్  ఆస్టర్,  ఫ్రాంక్ సినెట్రా,  డోరిస్ డే  వగైరా లాంటి వారి రంగు రంగుల పోస్టర్లు కట్ చేసి పాత గోడలపై న అంటించారు.  చివరికి స్కూల్ ప్రారంభమయింది.  కొన్ని రికార్డులు  జఖీరా ఖాన్ సాహెబ్  ఢిల్లీ నుండి వస్తూ వస్తూ తీసుకొచ్చారు.  గ్రామఫోన్ , సెకండ్ హ్యాండ్  ఫర్నిచర్,  ఫారూఖ్ నుండి అప్పు తీసుకొని  ఇక్కడే  కొనుగోలు చేసాడు.  అల్లరి చిల్లరగా  తిరిగే  కాలేజీ యువకులు,  శ్రీమంతుల  కుటుంబాలనుండి,  ఆధునిక  ఫ్యాషనబుల్  అమ్మాయిల గురించి చెప్పనక్కరలేదు  వీరంతా వచ్చేవారు.  అల్లాహ్ వారిని రక్షించు గాక! రెండు మూడు సంవత్సరాలలో వారి స్కూల్ బాగా వెలుగులోకి వచ్చింది .

ఫారూఖ్ తో  దోస్తీ కారణంగా నన్ను వదినగా  పిలిచేవాడు.  అతను తరుచూ నా క్షేమ సమాచారాలు తెలుసు కోవడానికి వచ్చేవాడు.  అతని భార్య గంటలకొద్దీ నా దగ్గర కూర్చొని  వంటలగూర్చి, కుట్టు పనుల గురించి మాట్లాడుతూ సమయం గడిపేది.  పాపం అమాయకురాలు  నాతో తను  తోడి కోడలుగా  వ్యవహరిoచే ప్రయత్నం చేసేది.  ఈ  పెళ్ళాం మొగుళ్ళు ఎవరికి వారే అన్నట్లుగా ఉండేవారు.  ఈ జంటకు  మొహాల మీద కళ వుండేది కాదు.  ఒకరికొకరు  పొసగక పరాయి వాళ్ళలాగా మసలేవారు.  సమాజం  ముందు మాత్రం భార్యాభర్తలు.  పిల్లలు లేరు. ఇటువంటి వారు కూడా  సమాజంలో వున్నారు!  కాలేజీలో కొత్తగా వచ్చిన అమెరికన్  ప్రిన్సిపాల్  కు ముక్కుమీద కోపం.  తలతిరుగుడు  దాని తోటి  ఓ సారి మాటా మాటా పెరిగింది.  కొంత  రభస జరిగింది.  అది ‘సేర్’ అంటే  నేను ‘సవా సేర్ ‘ వుంటి.  నేను స్వయంగా అబుల్ హాసన్  తానా షా  కన్నా తక్కువేమీ కాదు.  రాజీనామ పత్రాన్ని కాలేజీ కమిటీ మొహాన  కొట్టి తిరిగి లాహోర్ లోని సంత్ నగర్ కు  వచ్చేసాను.  చదువు  చెపుతూ చెపుతూ అలసిపోయాను.  స్టైపండ్  మీద ఎక్కడైనా  పి. హెచ్ డి  కోసం బయటికెళ్లే అవకాశాలు  వుండేవి.  కానీ రేపు మాపు అంటూ  దాటవేస్తూ వచ్చాను.  రేపు అమెరికన్ల  ఆఫీసుకెళ్తాను. ఎక్కడైతే  స్టైపండ్ ఇస్తారో!  మరునాడు బ్రిటిష్  కౌన్సిల్ కెళ్తాను.  మరుసటి రోజు  ఎడ్యుకేషన్  మినిస్ట్రీ కెళ్తాను.  స్కాలర్ షిప్  కోసం  దరఖాస్తు  చేసుకోవడానికి .

సమయం  దాటిపోయింది.  బయటికెళ్లి  ఇప్పుడేం చేస్తాను?  ఏం పొడిచేసేదుందని?  ఇప్పుడేం మిగిలిందని ఉద్దరించడానికి?  ఎందుకో తెలియదు! ఒక రోజు వఖార్ సాహెబ్  రొప్పుకుంటూ, ఆయాసపడుకుంటూ వచ్చాడు. వచ్చి –

“మీ వదినకు మళ్ళీ మతి భ్రష్టు పట్టింది.  ఆమె వీసా తీసి ఇండియాకు  వెళ్ళిపోయింది.  ఇక ఎప్పటికీ తిరిగి రాదు”   అని చెప్పాడు.

“ఎలా జరిగింది? ”  నేను కాస్త నిర్లక్ష్యం గానే  అడిగి అతని కోసం చాయ్ చేయడానికి స్టవ్  మీద నీళ్లు పెట్టాను.

“దాని నోరు పెద్దది.  ప్రతి క్షణం  టర్ టర్  – టర్ టర్;  అందుకే  ఆమెకు విడాకులిచ్చెయ్యాలని నిర్ణయమైంది!”  మళ్ళీ అతను ఎదురుగావున్న పాత మంచం మీద కూచొని  అందరి భర్తల మాదిరి భార్య మీద ఫిర్యాదులు చేస్తూ పెద్ద దుకాణమే తెరిచేశాడు.  తాను నిర్దోషి నంటూ తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి అనేక సాక్ష్యాలు, కారణాలు చూపడంలో, రుజువు  చేయాలనే ప్రయత్నంలో మునిగిపోయాడు .

అయిష్టంగానే  కథంతా విన్నాను.  జీవితంలో  ఈ మాటలన్నీ అర్ధం లేనివి.  అనవసరమైనవి.  అంతగా ప్రాముఖ్యం లేనివన్న  స్థితికి వచ్చేసాను.  కొన్ని నెలల తర్వాత  నా దగ్గరకొచ్చి గొణగసాగాడు. “నౌకర్లు  నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ మాత్రం సహాయం చేయలేవా!  ‘భాయ్’ ఇంటికొచ్చి మంచిచెడు,  క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి,  కాస్త సహాయం చేయడానికి,  పనివాళ్ల  చెవులు మెలేసి సరిచేయడానికి కుదరదా?! “

“స్కూల్ ను నడిపించాలి,  ఇటు ఇల్లు చూసుకోవాలి ”  – అతను ఫిర్యాదు చేసే తీరు ఎలా వుందంటే ఆ మనిషి , ఆ ఇంటి అవసరాలు అన్నీ చూసే బాధ్యత నాది అన్న రీతిలో వుంది!  కొన్ని రోజుల తర్వాత నా సామాన్లు సర్దుకొని వఖార్ సాహెబ్ గదికి వెళ్ళా.   అంతటితో ఆగక  డ్యాన్స్ నేర్పించడానికి  అతని అసిస్టెంట్  కూడా అయిపోయా!  నెల రోజుల పిమ్మట ఒక ఆదివారం వఖార్ సాహెబ్ ఒక మౌల్విని పిలిపించి తనకు తెలిసిన ఇద్దరు జులాయిగాళ్ళను సాక్ష్యాలుగా వుంచి ‘నిఖా ‘ చదివించేసాడు.   ఇపుడు నేను రోజంతా ఇంటి పనుల్లో మునిగిపోయి వుంటున్నాను.  నా అందం , సౌకుమార్యం  అంతా గత చరిత్ర  పుటల్లోకి  వెళ్లిపోయింది.  గందరగోళ o,  పెద్ద పెద్ద ధ్వనులతో కూడిన పార్టీలు ఎంత మాత్రం ఇష్టం వుండవు. కానీ ఇంట్లో ప్రతిక్షణం  ‘బాబా ‘,  ‘ క్లిప్స్లో ‘  ఇంకా  ‘రాక్ అండ్ రోల్స్’  తో రణగొణధ్వనులతో ఇల్లాంతా నిండిపోయేది.  ఏది ఏమైనా  ఇప్పుడు ఇదే నా ఇల్లు.

అలా సాగిపోతున్న సమయంలో కెమిస్ట్రీ చదువు చెప్పడానికి ఎన్నో కాలేజీల నుండి ఆఫర్లు వస్తున్నాయి.  కానీ ఇంటి పనులతో తీరిక ఎక్కడిది?  ఇక నౌకర్ల  సంగతి  చెప్పనఖ్ఖర్లేదు.  ఈ రోజు వస్తే రేపు మాయమవుతారు.

నేను కూడా జీవితంలో ఎక్కువ  ఏమీ ఆశించలేదు. కేవలం ఇంతే కోరుకున్నాను – ఒక మంచి ఇల్లు ఉండాలి . అవసరానికి  ఎక్కడికైనా  వెళ్ళడానికి, తిరగడానికి కారు వుండాలి.  నలుగురు అతిధులు  వస్తే కూర్చోబెట్టి  వారికి మర్యాద చేయడానికి సదుపాయాలూ, సౌకర్యాలు వుండాలని మాత్రమే ఆశించా!

ఇపుడు మాకు వెయ్యిన్నరా,  రెండువేలు నెలసరి ఆదాయం వుంది.   భార్య భర్తలిద్దరికి అవసరానికి  మించే అని చెప్పాలి.  మనిషి  తన అదృష్టం తో  రాజీపడితే అన్ని కష్టాలు వాటంతట  అవే సమసిపోతాయి.  పెళ్ళైన తరువాత ఆడదానికి నెత్తిమీద  ఒక నీడ దొరుకుతుంది.  ఈ కాలపు అమ్మాయిలు  ఏ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారో తెలియదు. ఏ విధంగా చేయి దాటి పోతున్నారో తెలియదు!  ఎంత ఆలోచిస్తే  అంత హైరానా, ఆశ్చర్యం  కలుగుతుంది .

నేనైతే ఎప్పుడు కూడా ఎవ్వరితోనూ కనీసం  ‘ఫ్లర్ట్ ‘ కూడా చేయలేదు.  కుశ్వంత్ ,  ఫారూఖ్  మినహా నా భర్తతో తప్ప మరో మగాడిని  నేనెరుగను.  నేనెలా వుండేదాన్నో,  నేనెలా వుంటున్నానో  కానీ అంత బద్మాష్  దాన్నైతే  కాదు.  రిహానా, సాదియా,  ప్రభ  ఇంకా ఈ అమ్మాయి.  నన్ను చూడగానే  ఆమె కన్నులు ఎంతగా బెదిరిపోయాయో?!  బహుశా నా గురించి  నా కన్నా తనకే ఎక్కువ  తెలుసనుకుంటాను.

ఇపుడు కుశ్వంత్ ను  జ్ఞప్తికి  తెచ్చుకోవడంలో  ఏం లాభం?  సమయం  దాటిపోయింది.  ఇప్పుడతను  బ్రిగేడియర్    గానో,  మేజర్ జనరల్ గా హోదా  పొందివుంటాడు.  అస్సాo  సరిహద్దుల్లో  చైనీయులకు  వ్యతిరేకంగా మోర్చా వేసి వుంటాడు లేదా హిందుస్తాన్ లో  పచ్చని పచ్చిక మైదానాల్లో  ఏ  ‘మెస్’ లోనో కూర్చొని గంభీరంగా  మీసాలు దువ్వుకుంటూ,  నవ్వుకుంటూ వుండి వుంటాడో,  బహుశా  అతను  కాశ్మీర్  సమస్యతో యుద్ధంలోనో ,  ఎదురు కాల్పుల్లోనో చనిపోయివుంటాడో , ఎవరికీ తెలుసు?!

చీకటి రాత్రుల్లో  నేను కళ్ళు తెరిచి అలా  శూన్యంలోకి చూస్తూ  వుండిపోతూ వుంటాను.   సైన్స్ ఈ  ప్రపంచంలో దాగి వున్న అనేక రహస్యాలను పరిచయం చేసింది.  రసాయన శాస్త్రం మీద  లెక్కలేనన్ని పుస్తకాలు చదివాను.  భవిష్యత్తు గురించి ఎన్ని ఆలోచనలు చేసాను.  ఎంత  ధైర్యంగా  అడుగులు వేసాను.  కానీ  చాలా భయం వేస్తుంది.  చీకటి  రాత్రుల్లో నాకు చాలా భయం వేస్తుంది .

“కుశ్వంత్ సింగ్,  కుశ్వంత్ సింగ్ ,  నీకిప్పుడు  నాతో  ఏం పని?  ఏం అవసరం? ”

***

రూప్ కుమార్ డబ్బీకార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు