కుడికాల వంశీధర్ కవితలు మూడు

1
నిజమైన సముద్రం

చతురతతో సముద్రాన్ని కోసి
చతురస్రాకారపు గాజు పాత్రలో నింపాడు.
బహుశా
కెరటాలను మరచిపోయి నట్టున్నాడు.
అందుకే ఆటుపోట్లు లేకుండా
నిశ్చలంగా ఉంది.
అది ప్రశాంతత కాకపోవచ్చు.

లోపల బడబాగ్నితో
ఇన్నాళ్లూ పైకి గంభీరంగా ఉన్నా
తడి చేతులు ముడుచుకొని
ఇప్పుడు గుంభనంగా కనిపిస్తుంది.

తడారిన ఎడారి గుండెలోంచి
కొంత ఇసుక తెచ్చాడు
తీరాన్ని కత్తిరించి నప్పటి
గవ్వలు అతికించాడు.
అందులో
రెండు చేపలు చేర్చాడు.
ఇప్పుడు వాటి కొత్త ఇల్లు అది!
కాదు
సరికొత్త నివాసం.

వాటికి రెక్కలున్నాయి
ఎగిరిపోతాయేమో!
బయట పడలేదు కాని భయపడ్డాడు.
తన భయాన్ని
బంగారు రంగు పిల్లి బొమ్మలో
భద్రం చేసి అక్కడే కాపలా పెట్టాడు.

పై నుండి ఒక మూత,
సూరీణ్ని దారంతో కట్టినట్టు
బల్బుని వైరుతో దానికి అమర్చాడు.
నియాన్ ధగధగల్లో
నిట్టూర్పుల కాంతి ప్రసరిస్తుంది.

అక్వేరియంలో
అంతా కృత్రిమంగా ఉంది.
అవి
ఒంటరిగా ఉన్నా జంటచేపలు.
ఇక
వాటి ప్రయాణమూ, గమ్యమూ ఒక్కటే.

నాచుతో దోబూచు లాడుకున్న
ఆ నాటి రోజులు గుర్తుకొచ్చాయి.
సజల దృశ్యంగా వాటి కనుపాపలు,
అతని కిప్పుడు
నిజమైన సముద్రం కనిపిస్తుందనుకుంటా!
*

అసంపూర్ణ కవిత


సాయంత్రం
సాగర తీరాన నడుస్తున్నప్పుడు
తడి తడి గాలులు
మనసుని గాఢంగా నిమురుతాయి.అలల ఆశ్వాలను
ఏ అదృశ్య రౌతు
నడిపిస్తూ నాకు దగ్గరౌతున్నాడో!
ఏ జలకన్య
వలపు లేఖ అందించనున్నాడో!!అంతలోనే
వీర రసాన్ని ప్రదర్శిస్తూ
తీరాన్ని పరాక్రమించాలని
విరుచుకు పడుతుంటాయి అలలు
కానీ
ఇసుక రేణువుల కోతకు
వాటి తలలు విరిగి పోతాయి.ఈ కలల సముద్రం
కొత్త కాదు నాకు
చిన్నప్పటి నుండి
ఇక్కడికి వచ్చిన ప్రతిసారి
ఎన్నెన్ని గులకరాళ్లతో పలకరించానో!

అయితే ఒకటి
ఎగసి పడుతూ లేచిన కెరటం
తీరం చేరకుండానే విరిగి పోయినప్పుడు
పూర్తి కాని నా కవితలాగా అనిపిస్తుంది.
===

3

ఆశ

పగలంతా వెలుగుని
దిగుబడిగా ఇచ్చిన సూరీడు
పడమటి సంద్రం లాగుతుంటే
దిగబడి పోతున్నాడు!
శ్రమతో చెమట పట్టిన
దేహాన్ని కడగాలని
రేపు మరోసారి
తేజరిల్లిన వెలుగుని పంచాలని.

రేయంతా హాయిని
ఇబ్బడిగా ఇచ్చిన చంద్రుడు
అమావాస్య అద్దం లాగుతుంటే
ప్రతిమై పోతున్నాడు!
ప్రేమతో దిష్టి తగిలిన
అందాన్ని కాపాడాలని
రేపు మరోసారి
తెప్పరిల్లే హాయిని పంచాలని.

*

కుడికాల వంశీధర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • నేను రాసిన “నిజమైన సముద్రం”, “అసంపూర్ణ కవిత” & “ఆశ” కవితలను 1 నవంబర్ 2022 సంచిక “ఏరువాక” (Featured Poet Series) శీర్శికలో ప్రచురించిన సారంగకి హృదయపూర్వక ధన్యవాదాలు.

  🙏🏽
  — కుడికాల వంశీధర్

 • ఒంటరిగా ఉన్న జంట చేపలు…వాటి ప్రయాణమూ, గమ్యమూ ఒకటే👌
  సజల దృశ్యంగా వాటి కంటిపాపలు👌

  జంట జీవుల ఒంటరితనాన్ని,కృత్రిమత్వాన్ని
  చక్కగా పోల్చారు.
  అభినందనలండీ💐💐💐💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు