కుటుంబ హింసకు పరాకాష్ఠ ‘బక్రి’

“జహీరాబీకి పెళ్లై తొమ్మిదేండ్లు కూడా  కాలేదు ఏడుగురు పిల్లల తల్లి. పిల్లగానికి పిల్లగానికి కనీసం సంవత్సరమైనా ఎడం లేదు. అట్లంటే చాలా అన్యోన్యమైన దాంపత్యమని, భార్యా భర్తలిద్దరు చిలకా గోరింకల్లా ముద్దు ముచ్చట్లతో సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారనుకోవడానికి లేదు. ముగ్గురు బిడ్డలు, నలుగురు కొడుకులు. ఎప్పుడు కడుపులో నలుసు పడుతుందో తెలీదు. ఆమెకు ఇన్ని ప్రెగ్నెన్సీలు ఎలా వచ్చాయో తెలీదు. “

హిందూ స్త్రీలకన్నా ముస్లిం స్త్రీలు మరింత కష్టాల కడలిలో కొట్టుకుపోతుంటారు. ఆ పరదాల వెనుక, ఆ చీకటి నిండిన నాలుగు గోడల మధ్య వాళ్ళు పడే కష్టాలు అసలు వెలుగు చూడనే చూడవు. హిందూ స్త్రీలు పొందుతున్న స్వేచ్చతో పోలిస్తే ముస్లిం స్త్రీలు పొందే స్వేచ్చ అతి తక్కువ. పేదరికం, నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పట్ల విముఖత, పురుషాధిక్యత, మత ఛాందసాలు వెరసి ఇవన్నీ ముస్లిం స్త్రీని కనిపించని సంకెళ్లతో బంధించివేస్తున్నాయి. తిరుగుబాటు చేయడానికి కానీ, ఉన్న దుర్భర పరిస్థితి నుండి పారిపోవడానికి కానీ అవకాశం లేదు. కుక్కిన పేనులా చచ్చుకుంటూ అన్నీ పంటి బిగువున భరించాల్సిందే. ఈ పీడననంతా మన గుండెకు కూడా ప్రసరించే ఒక మంచి కథ ‘బక్రి’.

బక్రి కథ బక్రి చదవండి.

“యాకూబ్ మియా ఇంట్లో ఉన్నంత సేపు భార్యను తిట్టుకుంటూనో, కొడుతూనో ఏదో ఒక లొల్లి చేస్తూనే ఉంటాడు. పిల్లల్ని తిట్టడం, కొట్టడం ఆయనకో అలవాటు. ఇదొక సామ్రాజ్యమని, ఈ సామ్రాజ్యానికి తానే పహేన్ షా అన్నట్లుంటుంది యాకూబ్ మియాకు. ఒక మాట చెప్పింతరువాత కూడా తన పని కాలేదో ఇంట్లోనే ఓ నరకాన్ని సృష్టిస్తాడు. అన్నీ అలవాటు చేసుకుంది జహీరాబీ. శారీరక, మానసిక నరకాల్ని అనుభవిస్తున్న జహీరాబీ భర్తలో లేదనుకున్న ప్రేమను, దయా గుణాన్ని ఈ మధ్యనే చూస్తోంది. అదీ ముఖ్యంగా యాకూబ్ మియా తాను పెంచుతున్న ఒక మేక మీద ఇవన్నీ చూపించడం. దీన్ని భరించలేక పోతుంది జహీరాబీ.”

యాకూబ్ మియాకు మేకే లోకమైపోయింది. మేక కోసమే ఇంటికి తొందరగా వస్తాడు. వస్తూ వస్తూ దానికి కూరగాయలు, చెట్ల ఆకులు తీసుకొస్తాడు. దానికి నీళ్ళు, మేత పెట్టారా లేదా అని ఆరా తీస్తాడు. నిద్ర కూడా పోకుండా మేకను ముద్దు చేస్తాడు. అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ఏ అర్ధ రాత్రో, తనకు కావాలనుకున్నప్పుడో పెద్ద గూడ్స్ లారీ రోడ్డు మీద పడ్డట్టు జహీరాబీ మీద పడేవాడు యాకూబ్ మియా. మేక రాకతో ఇది కొంత తగ్గింది. ఇంత పావురంగా పెంచుకున్న ఆ మేక చివరికి ఏమైంది? జహీరాబీకి మళ్ళీ కష్టాలు ఎలా మొదలయ్యాయి అనేది తెలుసుకోవాలంటే మనం ‘బక్రి’ కథ చదవాల్సిందే.

ఇదొక రెండు పొరల కథ. పై పొర అంతా మేక గురించిన కథలా కనిపిస్తుంది. కింది పొర అంతా ఒక ముస్లిం స్త్రీ యొక్క దయనీయ కథ వినిపిస్తుంది. కథంతా మేక చుట్టూ తిరుగుతున్నట్టే తోస్తుంది  కానీ వాస్తవానికి ఇది జహీరాబీ కథ. కుటుంబమనే ఇరుసులో పడి ఎంత మంది స్త్రీలు ‘బక్రా’లవుతున్నారో కథకుడు చాలా ధ్వన్యాత్మకంగా చెప్తాడు. మేకకు, స్త్రీకి అభేదం పాటించి ఇద్దరూ కుటుంబం కోసం ఎలా బలవుతున్నారో చాలా ఆర్ద్రంగా చిత్రించాడు కథకుడు.

మేక పిల్లకున్న విలువ కూడా స్త్రీకి లేదని, ముస్లిం స్త్రీ పురుషాధిపత్యం వల్ల లారీ టైరు కింద పడిన కుందేలులా నలిగిపోతోందని చెప్పడంలో కథకుడు నూటికి నూరు పాళ్లూ సఫలీకృతుడయ్యాడు.  ఇది ప్రతి ముస్లిం స్త్రీ కథ. ప్రతి ఇంటింటికో ‘బక్రీ’ ఉందని అర్థమవుతుంది. ఎంతో ఆప్యాయంగా పెచ్చుకున్న మేకను చివరికి అందరూ కలిసి పోగులు వేసుకొని, కుప్పల కింద పంచుకున్నట్లుగానే ముస్లిం స్త్రీని కూడా ఈ సమాజం, తల్లిదండ్రులు, భర్త, పిల్లలు, కుటుంబం పోగులు వేసుకొని పంచుకుంటున్నారని, ముస్లిం స్త్రీకి ఏ విధమైన స్వతంత్ర ప్రతిపత్తి లేదని చాలా నర్మగర్భంగా చెప్తాడు కథకుడు.

కథలో ప్రధాన పాత్రలు మూడే. అవి జహీరాబీ, యాకూబ్ మియా, మేక. అప్పుడప్పుడు మరికొన్ని పాత్రలు తెర మీదికి వచ్చిపోతుంటాయి కానీ వాటి ప్రాధాన్యత తక్కువ. జహీరాబీ ఇవాళ్టి ప్రతి ముస్లిం స్త్రీకి ప్రతిబింబమైన పాత్ర. ఇట్లాంటి జహీరాబీలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏ ముస్లిం కుటుంబంలో చూసినా కనిపిస్తారు. తన దేహం మీద సంవత్సరాలుగా లైంగికంగా, శారీరకంగా హింసాత్మక దాడులు జరుగుతున్నా జహీరాబీ మౌనంగా భరిస్తుంది. కసాయి వాని కర్కశత్వానికి బలైపోయిన ‘బక్రి’లాగే తన జీవితం కూడా బలి కాబడుతుంది. జుగుప్సాకరమైన భర్త ప్రవర్తనను చూసి ‘బక్రీకి వచ్చింది మౌత్, వీనికి రాకపాయె’ అని అనుకుంటుంది. కుటుంబమనే చెరుకు మిషిన్ లో చెరుకు కట్టెలా నలిగిపోయే పాత్ర.

యాకూబ్ మియా కుటుంబమనే సామ్రాజ్యానికి తానే చక్రవర్తిననుకుంటాడు. అతడు ఇంట్లో ఉన్నంత సేపు భార్య, పిల్లలు బిక్కు బిక్కుమని భయపడుతూ ఉండాల్సిందే. ఏ చిన్న పొరపాటు జరిగినా నరకం చూపిస్తాడు. పిల్లల్ని కాస్తంత దగ్గరికి తీసి గారాబం చేయాలని, భార్యకు ఒక మూర మల్లె పూలు తేవాలని కూడా తెలియని, సున్నితత్వం అసలే లేని మొరటు మనిషి. కోరిక కలిగితే భార్య మీద పడి ఎగబాకడమే తెలుసు కానీ భార్య ఫీలింగ్స్ ని ఏ మాత్రం అర్థం చేసుకోని మూర్ఖుడు. కనీసం మేకకు ఇచ్చినంత విలువ కూడా భార్యకు ఇవ్వడు. పైగా మేకను సరిగా చూసుకోలేదని భార్యకు తన్నులు, గుద్దులు. తాను పురుషుడినని, తానేమి చేసినా చెల్లుతుందని నరనరాన అహం నిండిన కర్కోటకుడు.

మేక పాత్ర ద్వారానే కథకు మరింత జిగి, బిగి వచ్చింది. మేక యాకూబ్ మియాను బాగా ఇష్టపడుతుంది. ఎందుకంటే తనను గారాబంగా చూడడమే కాకుండా తనకు మేలిమి కూరగాయలను, చెట్ల ఆకులను తెచ్చి తినిపిస్తాడు. కానీ చివరికి స్త్రీలాగే కుటుంబానికి బలవుతుంది. నిజానికి ఇది కూడా ఇంకో స్త్రీ పాత్రను సంకేతించినట్లుగా కనిపిస్తుంది.

కథకుని విజయమంతా కథను మలిచిన శిల్పంలోనే దాగుంది. అయితే  కథ సర్వసాక్షి (Third Person)  కథనంతో మొదలై మధ్యలో అనుకోకుండా ఉత్తమ పురుష (First Person)లోకి మలుపు తిరుగుతుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే బావుండేది. ఉర్దూ కలిసిన భాష వాడడం వల్ల శైలి ఆకట్టుకుంటుంది.

ముస్లిం స్త్రీ జీవితానికి ఎత్తిన పతాకలాంటి ఈ కథను రాసింది అన్వర్.  నిరంతర చలనశీల రచయిత అయిన అన్వర్‌ కలం నుండి ఇప్పటిదాకా తలవంచని అరణ్యం, ముఠ్ఠీ, సవాల్‌, ఖ్లుల్లంఖుల్లా అనే కవితా సంపుటాలు, బక్రీ కథల సంపుటి, జమీలాబాయి నవల జాలువారాయి. 1969 వరంగల్‌ అమర వీరులు, ఆత్మబలిదానాలు (2009`2011), అజా తెలంగాణ కవిత వెలువడ్డాయి. ఇవేగాక తెలుగు కవిత్వంలోనే బృహత్తరమైన ‘నాయిన’ కవితా సంకలనానికి అన్వర్‌ సంపాదకత్వం వహించారు. ఇంకా పలు పుస్తకాలకు ఇతరుతో కలిసి సంపాదకత్వం వహించారు. కవిగా, కథకునిగా, నవలాకారునిగా, సంపాదకునిగా, ఉద్యమకారునిగా బహుముఖీన ప్రతిభను కనబరుస్తూ సాగిపోతున్న అన్వర్‌ సాహిత్యంలో తెలంగాణ తనం, ముస్లింవాదం, ప్రగతిశీ భావం ఈ మూడు పురులు పెనవేసుకుని ఉంటాయి. ప్రత్యేక తెంగాణ ఉద్యమం జరుగుతున్నన్నినాళ్లు ఆ ఉద్యమంతోపాటు  ఉపనదిలా ప్రవహించి విస్తృతంగా తెంగాణ ఉద్యమ కవిత్వాన్ని వెలువరించారు. దీనితో పాటు అన్వర్‌ సాహిత్యం నిండా పరుచుకున్న ప్రగతిశీల భావాలు సమస్త సమాజాన్ని ఒక వినూత్న ఆలోచనా సముద్రంలో ముంచుతాయి.

*

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • నిజమే, చాలామంది ముస్లిం మహిళల జీవితాలు శ్రీ శ్రీధర్ గారన్నట్టు ‘ చెరుకు మిషన్ లో పెరిగే చెరుకుగడల’ లాంటివే. ముఖ్యంగా ఎక్కువ శాతంగా ఉన్న నిరుపేద ముస్లిం కుటుంబాలోని మహిళల జీవితాలు అధ్వాన్నంగా, దయనీయంగా ఉంటున్నాయి. శ్రీ అన్వర్ గారు ఆ కుటుంబాల్లోని పురుషాధిపత్యాన్ని కళ్లకు కట్టినట్లు రచించారు. కథ పేరు చూడగానే మనకు సగం కథ అర్థమైపోతుంది. అయినా కథ మనల్ని చివరిదాకా చదివింపజేస్తుంది. అలాగే, శ్రీ శ్రీధర్ గారు కూడా కథలోని ఆర్థతను మన మనసులు చెమ్మగిల్లేలా విశ్లేషించారు. ఇరువురికి అభినందనలు.

 • స్త్రీ జీవితమే కష్టాల మయం. అందులో ముస్లీమ్ స్త్రీల జీవితాలు ఇంకా భయంకరమైన వి. అని విన్నాం ఈకథ వాళ్ళ కష్టాలను కళ్ల ముందు నిలిపి హృదయాన్ని మెలిపెట్టింది. రచన, దానికి శ్రీధర్ గారి విశ్లేషణ ఇంకా బాగుంది.

 • బక్రీ కథ సాఫీగా ప్రారంభం అయి ఆలోచనాత్మాకంగా ముగిసిన కథ. కథలో యాకూబ్ పాత్రకు జీవ కారుణ్య లక్షణం బలంగా చెప్పి చివరికి అది అవసరానికే అన్నట్టుగా ఉంటుంది. అంతటి కారుణ్యాన్ని మేక పట్ల చూపిన యాకూబ్ పాత్ర హఠాత్తుగా మారి మేకను చంపిన చిత్రీకరణ ఆలోచన రేకేత్తిస్తుంది. పరదా మాటున దుర్భర ముస్లిం స్త్రీల జీవితాలను ప్రతీకాత్మాకంగా చెప్పారు.

  ఇక సమీక్ష విషయానికి వస్తే… ఈ కథను పాఠకులకు చదివిన తరువాత సమీక్ష చదవడంవలన మెదడు రెట్టింపు వేగంతో పనిచేస్తుంది. మదిలో తర్కిస్తారు. పాత్రల స్వభావాన్ని కథ ఇతివృత్తాన్ని నేపథ్యాన్ని చారిత్రక సత్యాన్ని, పాఠక దృష్టితో, రచయిత దృష్టితో కథలో ఉన్న రెండు పొరలను సమగ్రంగా వివరించారు.

  రచయిత రాసిన భాషలో ఉర్దూ తెలుగుమాధుర్యాన్ని పట్టి ప్రత్యేకంగా వివరించారు. అంతేగాక కథలో ఉన్న సాంకేతిక సవరణలు కూడా సున్నితంగా చెప్పారు.

  ఎప్పటిలాగే వెల్దండ గారి సమీక్ష చదివాక కథను మరోసారి చదివాను. కథ గమనాన్ని, ముగింపును సవివరంగా వివరిస్తూ కథకు సమీక్ష బలాన్ని అందించింది అని భావిస్తున్నాను. ఈ వేదిక ద్వారా చక్కని సమీక్షతో మంచి కథను అందించారు. రచయితకు, సమీక్షకులకు ఇరువురికీ అభినందనలు.

 • థాంక్స్ అన్న గారు.
  కథను, కథలోని మూల సూత్రాన్ని, కథ యొక్క ఇతివృత్తాన్ని పూర్తిగా పట్టుకొని పొరలు పొరలుగా సున్నితంగానే గొప్పగా విశ్లేషించారు.
  . కథలోని దుఃఖాన్ని, దాని ఘాడతను, నిగూఢంగా మోస్తున్న వేదనను, దాని పర్యవసాన పీడనను , ముస్లిం సమాజంలోని స్త్రీల త్యాగాల పరంపరను ఒడిసి, పొదిమి పట్టుకున్నరు.
  . ఈ కథను కథకుడు చెప్పే అంతఘర్షణను అర్ధం చేసుకుంటే కానీ ‘ బలౌతున్న బక్రీ’ ల బాధ తెలుస్తుంది. ఆ పనిని మీరు గొప్పగా చేశారు.
  రెండు పేజీల ఈ కథ అలా ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్ లలో కొనసాగడం వల్లనే ఆ కథ అలా మనల్ని జహీరాబి చుట్టూతా తిరిగేలా, ఆ దుఃఖమంతా మన దుఃఖమని ఫీల్ అయ్యేలా చేస్తుంది.
  . కథ రాసి, పత్రికలో వచ్చి 21 సంవత్సరాలవుతుంది. మీ విశ్లేషణ వల్ల, కొత్త పాఠకులు చదవడం వల్ల నాకూ ఇంకా మంచి కథలు రాయాలన్న ఊపు వచ్చేస్తది.
  . దిల్ సే సలాం, శుక్రియా అన్న గారు.

 • అవునండి చక్కటి విశ్లేషణతో బక్రీ కథను చదవాలనిపించారు. ముస్లిమ్ కుటుంబాలతోపోల్చదగ్గవి అంతగాకాకపోయిన…హిందూవులలో ..రాజులకుటుంబాలలోకూడా పరదాల వెనుక గాథలు వున్నాయి అంటే అతిశయోక్తికాదండి. ఆకుటుంబాలలో లైంగికదాడులుకాదుగాని అంతగ ఘోషా పద్దతులకి నలిగి, మరిగిపోయిన జీవితాలు,పురుషుని ఆథిపత్యానికి, పరువు పొగరూకి, భేషిజానికి, అగరోత్తిలాకాలిపోయిన జీవితాలు ఏన్నో…ఆర్టికదుర్బలత్వంకూడా ఓకారణం. దాట్ల నారాయణమూర్తిరాజుగారికథలొను, కె.వియస్ .పతంజలిగారికథలలోనూ, కాస్త పాతతరంలొ ఎక్కువలెండి ఈ దోరణిలు ఇపుడు నిజానికి అంతగలేవు అనిచెప్పవచ్చు…చదువులొకపక్క నేర్చుకుని స్థితిపరూలై…స్థిరపడుటకూడాకారణం..ముస్లిమ్ కుటీంబాలలో ఇప్పటికి అక్షరాస్యత తక్కువే…
  అయినా అన్వర్ గారు, కవియాకూబ్ గారు, స్కైబాబగారు, భాషాగారు, షహజానాగారు , రెహానాగారు, యింకాఇలాంటివారిరచనలు వారి మతస్టులలో స్త్రీ వెనుకబాటుతనాన్ని పారద్రోలేలాంటికథలు ,కవితలురాస్తున్నారు.
  ముదావహం.
  బక్రీ కథ ఆకుట్టుకుంది అంటే శిల్పప్రత్యేకత .జమిమీయా, లాంటివాళ్ళు ఇప్పటికి చాలామంది. మరి పురుషాథిక్యతను ఎపుడుకాస్తయిన అథిగమించి…వెలుగును అనుభవించే దుస్థితిమరెపుడో…

 • మంచి కథ రాసిన అన్వర్ గారికి, పరిచయం చేసిన శ్రీధర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎంతో సహజంగా ముస్లిం మహిళల జీవితాన్ని, నిస్సహాయతను అన్వర్ గారు కథలో చూపారు.

 • బక్రి కథపై మీ సమీక్ష బాగుంది. అంతకుమించి కథాంశం నేటికీ ఆ సమాజంలో జరుగుతున్న వాస్తవ ప్రతిబింబమే. రచనా శైలి ప్రత్యేకమైంది. అంతా బాగుంది కానీ మీ పోలికే బాగాలేదు. ముఖ్యంగా ముస్లిమ్ స్త్రీల స్వేచ్చను హిందూ స్త్రీల స్వేచ్చతో పోల్చిన విధానం ఆక్షేపించదగినది. ఎవరి కట్టుబాట్లు వారివి. ప్రత్యేకంగా హిందూ సమాజాన్నే టార్గెట్ చేసినట్లుగా సమీక్షించడం బదులు పారదర్శకంగా అన్ని మతాలతో పోల్చడం లేదా ఆ మతంలో ఉన్న చాందసవాదాన్ని ఎత్తి చూపిస్తే సరిపోతుంది కదా. హిందూ స్త్రీలకు ఎన్ని కట్టుబాట్లు ఉండేవో మీకు తెలియదా.. ఒక మతాన్ని టార్గెట్ చేస్తేనే హైలెట్ అవుతామా.. ఆలోచించండి

 • చక్కని చిక్కని సమీక్ష అందించారు వెల్దండి సార్. బక్రీ కథలు చదివాను.

 • గొఱ్ఱె ఎవరిని నమ్మకూడదో వారినే నమ్ముతుంది.అన్న వాక్యానికి వ్యాఖ్యానం ఈ కథ.నేటి సమాజంలో , తల్లి జీవితాన్ని చూసి కూడా, కూతురు జీవితం మీద ఒక కోరికను, ఆశను పెంచుకుంటుంది.భ్రమల్లో బ్రతుకుతుంది.ముస్లిం మహిళ జీవితమే కాదు, దాదాపుగా ప్రతి స్త్రీ , ఏదో ఒక కోణంలో అమాయకంగానో,అయిష్టంగానో వ్యతిరేక భావజాలం కలిగిన భర్తనే అనుసరించాల్సి వస్తుంది.తన వ్యక్తిత్వాన్నో ప్రాణాన్నో పణంగా పెడుతూనే ఉంటుంది.మళ్లీ అమాయకంగాఈ స్త్రీ తన బిడ్డ ను ఓ అయ్య చేతిలో పెట్టాలని అనుకుంటుంది. ఆమె ఎప్పటికీ,ఆనాటికాలానికైనా,ఈనాటికాలానికైనా బలి పశువేనని, రచయిత
  కథ ద్వారా చెబుతారు, ఆధునిక కాలంలో కూడా స్త్రీల జీవితాల్లో రావలసినంత మార్పు రాలేదని అక్షరసత్యం.వ్యాఖ్యానానికి ఈ కథను ఎన్నుకున్నందుకు శ్రీధర్ గారికి అభినందనలు

 • ముస్లిం మహిళల అంతర్గత న్ని అత్యద్భుతంగా విశ్లేషణ చేసి వెలికితీసిన వెల్దండి శ్రీధర్ గారికి అద్భుతమైన కథ రాసిన అన్వర్ గారికి అభినందనలు

 • ముస్లిం స్త్రీల జీవితాల్లో దాగిన బయటి ప్రపంచానికి కనబడని సంవేదనల్ని అన్వర్ తన ‘బక్రి’కథ ద్వారా అత్యంత ప్రతిభావంతంగా చెప్పాడు.పోగులేసుకొని తిన్న మేక,పోగులు పోగులైపోతున్న స్త్రీల జీవితాల మధ్య నున్న సామీప్యతను ఆసక్తి కరమైన కథనంతో కథగా మలిచాడు.అన్వర్ సృజనకు,శ్రీధర్ విశ్లేషణకు అభినందనలు..

 • కథ మొత్తం చదివాను. ఇక్కడ ఈ విశ్లేషణా చదివాను. నిస్సందేహంగా అన్వర్ ఒక మంచి కథకుడు, కవీ కూడా! కొన్ని సార్లు ఇవి రెండూ ఒకదానిపరిధిలోకి మరోటి వచ్చిచేరుతుంటాయి. అలానె ఈ కథ కూడా. ఏక పక్షంగా సాగిన ఈ కథలో ఎప్పట్లానే యాకూబ్ మియాపై అసహ్యం, జహీరాబీ పై సింపతీ తప్పదు. ఐతే తర్వాతేంటి? ఇలాంటి కథలు ఇంతకుముందు కూడా చాలానే వచ్చినయ్ కదా. ఈ కథ గురించి ఏం చెప్పాలి అంటే– కథ పాతదే, కథనం కొత్తది. పాఠకులని కథ మొదలు నుంచీ చివరివరకూ తనదైన రస్తాలోకి తీసుకుపోయి చివరికి ఊహించినట్టుగానే ముగించటం మాములుగానే జరిగే ప్రక్రియ. అలా కాకుండా అన్వర్ ఈ కథకు మరోలా ముగింపు ఇచ్చి ఉంటే వేరే గా ఉండేదేమో. ఉదాహరణగా : వారి సంభాషణ విన్న జహీరా ఆ మేకని ముందురోజు రాత్రే విముక్తి చేసి ఉంటే రెండు రకాలుగా ముగింపు ఉండేది. ఒకటి –మేకకు విముక్తి రెండు — తనకి తాను శృంఖలాలనుంచి విడుదల. ఇలా నాలంటి ఓ మాములు పాఠకుడు ఆశించి కదా కథ చదూతాడు. ఎనీవే అన్వర్ భాయ్ కి శుభాభినందనలు .—వాసుదేవ్

 • పురుషాధిపత్యాన్నికి బలవుతున్న ముస్లిం మహిళల జీవితాన్ని, నిస్సహాయతని ఎలుగెత్తి చూపుతూ ” బక్రి ” కథ రాసిన అన్వర్ గారికి, అత్యద్భుతంగా విశ్లేషణ చేసిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు.

  కులం, మతం, వర్గం, జాతులు, ప్రాంతాలు అని భేదం లేకుండా స్త్రీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, లైంగికంగా, కుటుంబపరంగా పురుషాధిపత్యం చేతిలో అణచివేయబడుతున్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళ అనేక కష్ట నష్టాలను ఎదుర్కుంటున్నది.

  ఇందుకు కారణాలు : ముస్లింలలో పేదరికం దేశ సగటుకన్నా ఎక్కువ. ముస్లిం సముదాయంలో ఆదాయం, ఖర్చు, వినియోగాల విషయానికొస్తే, వారు దళితులు, ఆదివాసుల తర్వాత మూడో స్థానంలో ఉన్నారు. ముస్లింలకు ఉద్యోగాలు కూడా చాలా తక్కువ లభిస్తాయి. సగటు తలసరి ఖర్చులో కూడా వారిది జాతీయ సగటుకన్నా చాలా తక్కువ. భారతీయ ముస్లింలకు అతిపెద్ద దెబ్బ, రాజకీయంగా వారి ఓట్లకు ప్రాధాన్యం లేకుండా పోతుండడమే. ఆల్కహాలిజం కూడా మహిళల మీద హింసతో ముడిపడి ఉంది.

  నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. 1970 చివరిలో భారతదేశంలో స్త్రీవాద ఉద్యమం ఊపందుకుంది. ఆడ శిశు భ్రూణ హత్యలు, లింగ వివక్ష, మహిళా ఆరోగ్యం, స్త్రీ అక్షరాస్యతవంటి అంశాలమీద మహిళా ఉద్యమకారులు ఏకమయ్యారు. మారుతున్న యీ పరిణామాల స్పూర్తితో భారతీయ ముస్లిం మహిళ కూడా ఇంకా మెరుగైన జీవికను అందుకుంటుందని ఆశిద్దాం.

 • శ్రీధర్ సార్ ఏ కథను ఎంచుకుని సమీక్ష చేసిన ఆ కథకు, ఒక మనసు, హృదయం, అద్రత కలగలిసి ఉంటాయి. ఉండాలి కూడా. ఒక కొత్త సినిమా కోసం ఎలా ఎదురుచూస్తారో ఈ సారంగ పత్రికలో శ్రీధర్ సార్ రాసే సమీక్ష కోసం ఎదురుచూస్తాను. ఎందుకంటే ఒక మంచి సమీక్ష గుండెకాయ లాంటిది. బక్రి కథ ద్వారా అన్వర్ సార్ ముస్లిం స్త్రీలు ప్రతి రోజు ఎదుర్కొనే సమస్యలు, ప్రతి సెకండ్ ఎదుర్కొనే మానసిక ఒత్తిడి చెప్పలేనిది. స్త్రీలందరి కష్టాలు ఒకటే అయినా, మరి ముఖ్యంగా ముస్లిం స్త్రీల కష్టాలు, నష్టాలు ఒక్కింత ఎక్కువనే. జాహిరబీ, యాకుబ్ మియా పాత్రల ద్వారా ముస్లింలలో నిరక్షరాస్యత, మతం ప్రాధాన్యత, వీటికి తోడు పురుషుల కర్కశత్వం ఎక్కువ. ిిఈనాటికి ఆపరేషన్ చేయించుకొని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మారని, మార్పు ఒప్పుకొని ముస్లింలు ఉన్నారు. మళ్ళీ మద్యం, మదం తో స్త్రీలను క్షోభ పెడతారు. నేను వెండి మేఘము, ఎడారి పూలు, సలీమ్ సార్ రచనల్లో చదివాను ముస్లిం స్త్రీల జీవితాల గురించి, మళ్ళీ ఇప్పుడు అన్వర్ సార్ కథ హృదయాన్ని కదిలించింది. కవి ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ టార్చిలైట్ లాగా ఆ చీకటిని తొలగించాలి. నేటికి ముస్లింల సమాజంలో రావాల్సిన మార్పు గురించి, గుర్తించి రచయితలు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని రచనలు అన్వర్ సార్ కలం నుండి వెలువడాలని మనసారా కోరుకుంటున్నాను.

 • స్పందించిన సహృదయులందరికీ ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు