జానపద కళాకారులకు కేంద్ర ప్రభుత్వంనుండి పద్మ పురస్కారాలు లభించడం ఇదే మొదటి సారి కాదు. కానీ ఈ సారికి ఒక ప్రత్యేకత ఉంది. కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు పద్మశ్రీ ఇవ్వడానికి ఒక ప్రత్యేకత ఉంది. అది కిన్నెర వాద్యం ద్వారా మాత్రమే వచ్చిన ప్రత్యేకత కాదు. అతని కులం ద్వారా వచ్చిన ప్రత్యేకత కూడా. దళిత కులాలలోనే అత్యంత దళిత కులం డక్కలి కులం. డక్కలి కులం మాదిగలకు కథలు చెప్పే ఆశ్రిత కులం. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కిన్నెర కళాకారులు మాదిగలకు మాత్రమే కాక జన సామాన్యానికి కథలు చెప్పే వారు. డక్కలి వారిలోనే వేరే తెగ ఇది అనే చెప్పాలి. వీరు కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నారు. మొగిలయ్య డక్కలి లాంటి మరొక ఉపకులం మాదిగ మాష్టి కులానికి చెందినవాడు.
కిన్నెర వాద్యం ఈ కథా ప్రక్రియ అంతరించి పోయింది అని జానపద పరిశోధకులు అనుకుంటున్న తరుణంలో దాదాపు ముప్పైఐదు సంవత్సరాల క్రితమే జానపద సంచారి ఆచార్య జయధీర్ తిరుమల రావు ఈ కళారూపాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేసి దాని వ్యాప్తికి కారణం అయ్యారు. ఈ కళలో చెప్పిన చాలా చారిత్రక కథలను డాక్యుమెంట్ చేసి ఆరోజుల్లోనే జానపద చారిత్రక గేయగాథలు పేరుతో పుస్తకాన్ని తెచ్చారు.
కేంద్ర ప్రభుత్వం దాదాపు పది హేను సంవత్సరాల క్రితమే డక్కలి బాలయ్య అనే కిన్నెర కళాకారుడికి అవార్డు ప్రకటించింది. దురదృష్ట వశాత్తు ఆ పురస్కారాన్ని అందుకోకుండానే బాలయ్య కన్నుమూశాడు. కానీ ఈ రోజు ఈ కళకు వారసుడైన మొగిలయ్య పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం వల్ల ఈ కళకు మరింత జతవసత్త్వాలు పెంచినట్లు అయింది. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పది పన్నెడు కుటుంబాల వారు కిన్నెర ప్రదర్శించే కళాకారులు కనిపిస్తున్నారు. దీనికి కారణం ఆనాడు దీనికి లభించిన ప్రోత్సాహమే. ఇప్పుడు ఉన్న వారిలో మొగిలయ్య చాలా మంచి కథకుడు. ఈ పురస్కారానికి పూర్తిగా అర్హుడు. ఒకసారి తెలంగాణ సాంస్కృతిక సలహాదారు శ్రీ కే.వి రమణ గారింట్లో వారితో నేను మాట్లాడే సందర్భంలో అక్కడ ఈ మొగిలయ్య కలిసాడు. ఆతర్వాత కూడా సాంస్కృతికశాఖ కార్యాలయంలో కలుసుకున్నాం. ఆయనతో మాట్లాడిన కాస్సేపటికే ఆయన కథను వర్ణించే శక్తి అర్థమైంది. కిన్నెర కథని డక్కలి వారు మాత్రమే కాక, చెంచు వారు, మాదిగ మాస్టీలు కూడా చెబుతారు అని దాసరి రంగ అనే పరిశోధకుడు వివరించాడు. వీళ్ళు మాత్రమే కాదు నా పరిశోధనలో బయటికి తెచ్చిన విషయం, తోటి వారిలో ఒకరైన పాండవుల వారు కూడా కిన్నెర వాయిస్తారు. నేను 1986లోనె పాండవుల వారి మీద “తెలుగు వైజ్ఞానిక మాసపత్రిక” లో వ్యాసం రాశాను. కిన్నెర వాద్యం గురించి రాశాను. అది మరుగున పడిపోయింది. ఇతర పరిశోధకులు దాని మాట తీసుకురాకపోవడం తెలుగు పరిశోధన వాతావరణంలో ఉన్న దురదృష్టకర వాతావరణం.
పైన చెప్పిన నాలుగు తరగతులలో మొగిలయ్య మాదిగ మాష్టికులానికి చెందిన వాడు. అంతే కాదు మొగిలయ్య వాయించే కిన్నెర కూడా భిన్నమైనది. ఇది పన్నెండుమెట్ల కిన్నెర. ఏడు మెట్ల కిన్నెర భిన్నమైనది. తోటి వారిలో తెగ అయిన పాండవుల వారు వాయించేది ఇంకాస్త భిన్నమైన కిన్నెర. మొగిలయ్యను బయటి ప్రపంచానికి పరిచయం చేసి వ్యాప్తిలోనికి తెచ్చిన ఘనత మాత్రం డా. దాసరి రంగ అనే యువజానపద పరిశోధకునికే దక్కుతుంది. కిన్నెర కళ పైన పిహెచ్.డి చేసిన ఈ యువకుడు మొగిలయ్యపైన ప్రత్యేక దృష్టితో పరిశోధన చేసి అతనికి మాత్రమే కాకుండా పన్నెండు మెట్ల కిన్నెరకు కూడా మంచి పేరుతెచ్చాడు. దర్శనం మొగులయ్య పండుగ సాయన్న, మియ్యసావ్,బండ్లోల్ల కురుమన్న,కాపోల్ల వెంగల్ రెడ్డి కథ,వనపర్తి శంకరమ్మ, బలుమూరి మాలబాలమ్మ, కొమరయ్య,నాయినపల్లి మశమ్మ , కొల్లాపురం సురభి రాజుల కథ చెప్తాడు. మెగిలయ్యలో మంచి కవి ఉన్నాడు. ఆయన వర్ణనలు చాలా హృద్యంగా ఉంటాయి. మొగిలి పువ్వులో పరిమళం ఆయన కథాగానంలో ఉంటుంది.
పండుగ సాయన్న రాబిన్ హుడ్ లాంటి వీరుడు. ధనవంతులను దోచి పేదలకు పంచి పెట్టిన వీరుడు. బ్రిటిషు కాలంలో దొంగగా ముద్రపడి వారికే పట్టుబడి హతుడైన వీరుడు. సాయన్న సమాధి మహబూబ్ నగర్ జిల్లాలో నేటికీ పూజలు అందుకుంటూనే ఉంది. కందూరలు ఇవ్వడంఇక్కడి సంప్రదాయం. ఈ పండుగ సాయన్న కథ మొగిలయ్య నోట అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు ఈ కథతోనే అత్యంత గొప్పకళాకారుడుగా పేరుపొందిన వాడు డక్కలి బాలయ్య. ఈ కథని తిరుమల్ రావుగారు సేకరించి ప్రచురించారు. మొగిలయ్య చెప్పే మిగతా కథలు కూడాచాలా విననసొంపుగా ఉంటాయి. మొగిలయ్య కళారూపం ఆధునిక మాధ్యమాల ద్వారా జన సామాన్యానికి ఇప్పటికే చేరింది. ఈ పురస్కారంతో ప్రపంచం మొత్తం తెలియవచ్చింది. దీనితో మొగిలయ్యపైన బాధ్యత కూడా పెరిగింది. తన ప్రదర్శనలకు మరింత వ్యాప్తి వస్తుంది. మొగిలయ్య ఒక్కడే ఈ కళచేసేవాడు కనుక ఆయన మరొక తరాన్ని తయారు చేసి యవతరంలో దీన్ని వ్యాప్తి చేసి ఈ కళ వచ్చే కాలానికి అందించే బాధ్యత మొగిలయ్యపైన ఉంది. అలాగే పురస్కారాలుమాత్రమే కాకుండా ఈ కళని వచ్చే తరానికి అందించేలాగా వర్కుషాపులు నిర్వహించడానికి ప్రభుత్వాలు మొగిలయ్యకు ఆర్థిక సౌకర్యాన్ని కూడా అందించాలి. లేదా ప్రభుత్వమే ముందుకు వచ్చి అయనతో వర్కుషాపులు నిర్వహించి ఆసక్తి ఉన్న కళాకారులను తయారు చేయాలి. జానపద కళల భవిష్యత్తు అంతిమంగా జనం ఇచ్చే ఆదరణపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఆదరించినంత కాలమే యే జానపద కళ అయినా బతికి ఉంటుంది. ప్రభుత్వాలు ఎక్కువ కాలం వాటిని బతికించి ఉంచడం కూడా కష్టమే. కనుక ప్రజల అభిరుచిలో మార్పులు రావాలి. వారు దేశీయ కళలను అభిమానంతో ఆదరించాలి. మొగిలయ్య వారసత్వం కొనసాగాలి.
*
మంచి సమాచారం.. అభినందనలు
ఏ కళ నైనా ప్రభుత్వాలు బ్రతికించి ఉంచటం కష్టమే, ప్రజల అభిరుచి లో మార్పు రావాలి అన్న పులికొండ వారి అభిప్రాయం అక్షర సత్యం. మంచి సమాచారం అందించినందులకు రచయిత కు అభినందనలు.
వ్యాసం బాగుంది కళలను ప్రజలు ఆదరిస్తే అవి బతికి బట్ట కడతాయి వ్యాసకర్త కు ధన్యవాదాలు