కారా మాస్టారి వీలునామా!

ఎందుకో, ఈ పెద్దాయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

ఎలాగో ఒక లాగ, ఎక్కడో ఒక దగ్గర –అది చక్రాల  కుర్చీయో, మంచం మీదో, చదువుతూనో, పడుకునో, అపస్మారకమో ఎదో ఒక స్థితి లో, అతన్ని చూస్తే అదో బలం. అక్కడ ఉన్నారంటేనే అదో  సంతృప్తి. ఇప్పుడు ఆయన కుర్చీ చుట్టూ ఆయన వాడిన వస్తు సముదాయముంది. ఆయన ఏర్పరచిన వాతావరణముంది.

కానీ ఆ కుర్చీ లో ఆయన మాత్రం లేరు. చనిపోవడానికి ఆరు నెలలముందు, చూడడానికి  వెళ్తే – ‘ రా… రామచెంద్రా …’ ఓ పలకరింపు. నేను ఫోటోలవైపు చూస్తే – ‘…అదీ …నేను చిన్నప్పుడిది .’ మరికొంచెం పక్కకు చూస్తే – ‘ అది సీతమ్మగారు. నీకు తెలుసుగా. ఆ పక్కన, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు…’ అడగక పోయినా…ఇవన్నీ చెప్పేవారు. ఆయన కాళ్ళ వైపు చూస్తే మనం ప్రశ్నించినట్టే భావించి  –  ‘వాపులు… వృద్ధాప్యం లో ఇవన్నీ సహజమే… ఇలాగే ఒక్కొక్కటీ వస్తుంటాయి. తప్పదు.’ అడగక పోయినా – ఆయన కుడిచేతికి అందినంత దూరంలో ఉన్న చిన్న స్టూలు మీద ఫ్రేం కట్టుతో జత గా ఉన్న  ఫోటోలు చూపించి ‘ మా గురువులు… ఎవరు?’ కళ్ళెగరేసి అడిగేవారు.

‘కొకు, రావిశాస్త్రి’ అని చెప్పగానే, బుగ్గల్లో కనీ కనిపించని నవ్వు. ఆ ఫోటోలకు రెండు చేతులెత్తి నమస్కారం పెడుతూ – ‘మహానుభావులు…’ అని వారి గురించిన భోగట్టా ఇచ్చేవారు. ఆయన ముందున్న పుస్తకాల వైపు చూస్తే – ‘చదువుతున్నాను… అన్ని కథలూ  చదవడం అవ్వదు కదా. శీర్షికలు బట్టి కొన్నిటిని ఎంచుకొని చదువుతున్నాను. బాగుంటున్నాయి. ఇప్పుడు నాకు తొంబై ఏడు నడుస్తోంది. ఈ పక్కవి ఇంకా చదవాలి. నెమ్మదిగా అలా… మరో పని లేదుగా…’  ఇదిగో ఈ పక్కవి చదివీసినవి. పాపారావు వస్తే కథానిలయం లో పెట్టమని చెప్పాలి. నువ్వు చదువుతానంటే ఇవి పట్టుకెల్లు.’ ఇక మాటాడలేని పరిస్థితిలో ఉంటే – కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ ఉండిపోతారు.

అలా ఆ మహానుభావుడితో ఏదో ఒకటి కలబోత. అది ఒక కథల పుస్తకం  మీద చర్చ కావొచ్చు. ఒక సలహా లేదా సంప్రదింపు కావొచ్చు. కొత్తగా రాసి తెచ్చిన కథ మీద అభిప్రాయం కావొచ్చు. ‘ఎలా వున్నారు?’ అని చేత్తో  సైగ చేస్తే ‘ పరవాలేదు…ఇదిగో ఇలా వెళ్తోంది. వెళ్ళనీ. మనచేతిలో ఏముంది?’ అంటారు. ఆ మాటతో ఒక్కసారిగా మనసు బరువై పోతుంది. లేచి – ‘…సరే మాస్టారూ వెళ్ళొస్తాను…’ అని అంటే – మన చేతిని అందుకోడానికి చెయ్యి చాపుతూ, ‘రెండురోజులకొకసారి కనిపిస్తుండు నాయినా…దీవేస్తుంటాది…’ అంటారు.

ఆ మాటల్లోని  దైన్యతకో, వాత్సల్యపూరిత మైన ఆ స్వరానికో  మరెందుకో చెప్పలేను. గానీ – నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతాయి. ‘అలాగే మాస్టారూ తప్పకుండా వస్తాన’ని అనడం తప్ప సమాధానం లేక  తలదించు కొని వచ్చేస్తాను. పిల్లలమర్రి రఘు గారు ఒక టీ వీ ఛానల్ కోసం ఫిబ్రవరీ లో అనుకుంటా. మాస్టారితో అన్ ప్రిపేర్డ్ ఇంటర్వ్యూ చేసారు. ‘మాస్టారి చేత వీలయినంత మాట్లాడించండి…’ అన్నారు. ఇంట్లో నేనూ, అట్టాడ,గంటేడ,మల్లిపురం మాత్రమే  పాల్గొన్నాం . (కథానిలయం లో మాస్టారి గురించి మాట్లాడేటప్పుడు సుబ్బారావు ఉన్నారు. ) మాస్టారి బాల్యం గురించి, ఆయన కథల గురించి ఏవేవో కలగాపులగం ప్రశ్నలు వేశాం. మాస్టారు విసిగిపోలేదు, అలసిపోలేదు. ఎంతో ఉత్సాహంగా – వినబడిన మేరకు, అర్ధం చేసుకున్నమేరకు జవాబులిచ్చేరు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే ఆపేసాం.

ఎనబై కి.మీ దూరంలో నేను పనిచేస్తుండడం వలన తరచూ వెళ్ళలేక పోయేవాడిని. కోవిడ్ పరిస్థితుల రీత్యా రెండుచేతులతో నమస్కారం చేస్తే – ‘ఇదేమిటి కొత్తగా.’ అనేవారు. అక్టోబర్ 6, 2020 న నా కథల సంపుటి ‘అల్పపీడనం’ ఇంట్లోనే ఆవిష్కరించారు. అందులో- తల్లీ తండ్రీ గురువూ  దైవం అన్నీ అయిన, పూజ్యులు శ్రీ కాళీపట్నం రామారావు గారి పాదపద్మములకు భక్తితో… అని రాసేను. అది చదివి – దాని కిందనే,  ‘ఇలాంటి శిష్యులు పొందడం చూస్తే నా జీవితం ధన్యం అనిపిస్తోంది.’ అని స్వయంగా రాసి సంతకం చేసి ‘దాచుకో’ అని  నా చేతికిచ్చారు. చదవడానికి మరో పుస్తకం తీసుకున్నారు.

చనిపోడానికి కొద్ది రోజులు ముందు, ప్రసాద్ గారు,ఇందిరా గారు (వారి చిన్నబ్బాయి,కోడలు ) మాస్టారికి చేస్తున్న సేవలకు సాయంగా. తెగించి ఓ రోజు హాజరయ్యేను. అప్పుడు – అతని  నిస్తేజమైన  అరచేయిని  తడి గుడ్డతో తుడుస్తూంటే అనిపించింది.  – ఆ చేత్తోనే కదా  మాస్టారు ఇన్ని సంచలనాలు సృష్టించింది. అయినా డాబు లేదు. డాంబికం లేదు.

కానీ – జూన్ పదిహేడు రెండువేల ఇరవైఒకటి(వారు మరణించిన రోజు) తర్వాత – రాను రాను రోజులు గడుస్తున్న కొద్దీ- ఆయన, నిజంగానే లేరు అని గ్రహింపుకొచ్చేసరికి , ఆ వెలితి తలంపు కొచ్చేసరికి కడుపులో ఏదో మెలి తిరుగుతూ అవ్యక్తమైన సలుపు. ఆ అనివార్యత  జీర్ణం కావడం లేదు. నిజానికి ఇదొక శిక్ష. జ్ఞాపకాలు వెలిబుచ్చుకోలేని అశక్తత. ఆయన పరిచయం ఒక భాగ్యం. వెలకట్టలేని ఆ వాత్సల్యాన్ని కొలవడానికి, వ్యక్తపరచడానికి  నా దగ్గర ఏ సాధనమూ లేకపోవడం నా దౌర్భాగ్యం.

మాస్టారూ ! ఇప్పుడు  మీతో  మాట్లాడాలని ఉంది. మాస్టారూ! మాస్టారూ!!  అని గట్టిగా పిలవాలని ఉంది.

ఒక మహోన్నత సంకల్ప నిర్మాణంలోనూ, నడకలోనూ, నిర్వహణలోనూ మీతోబాటు నడిపించారు. ఎన్నో విషయాలు- కథానిలయం వ్యవహారంలో సాహిత్య సంభందీకులతో మెసిలే తీరుతెన్నులు చెప్పారు. వ్యక్తిగాను, వ్యక్తిపరంగాను జీవితంలో అత్యంత కీలకమైన సత్యం, నిజాయితీ ల గురించి ఆచరించి చూపారు. నడుస్తున్నప్పుడో ,కూచొని మాట్లాడుతున్నప్పుడో, కలిసి భోంచేసిన సందర్భాల్లోనో, కథల సేకరణా ప్రయణాల్లోనో, కథానిలయం లో పుస్తకాలు సర్దుతున్నప్పుడో!  ఎన్నో  జీవితాలకి సరిపడా అనుభవాలు కలబోసిన క్షణాలు మరుపుకు రావడం లేదు మాస్టారూ. అలవోకగా మీ  ‘ఆచరణ’ ని పాఠం గా చూపించారు. అనేకమందిని గురించి అనేక విషయాలు మాట్లాడేరే!

అయిష్టులు గురించి గానీ, నిష్టురులు గురించి గానీ ఒక్కమాట కూడా ప్రస్తావన చేయలేదు మీరు.  మీతో పాతికేళ్ళ ప్రయాణంలో శత్రుత్వం, శత్రువు  అనే పదాలు మీకు పలకడం మీకు చాతకాలేదు. ఒకరిద్దరు అక్కసుతో నోరెట్టుకు మీమీద  పడినా వారిని మరుచటి రోజే మరిచిపోయి మీ పనుల్లో మునిగిపోయేరు.  స్పర్ధ గురించి మాట్లాడారు గానీ,  ద్వేషం గురించి మాట్లాడలేదు. విరోధుల్ని పట్టించుకోలేదు. విరోధాన్ని ప్రోత్సహించనూలేదు. దాన్ని సంయమనంతో  నిరోధించారు. మీలాంటి  అజాత శత్రువు, అద్భుత వ్యక్తి మళ్ళీ  ఎక్కడైనా అవుపిస్తారా ? ఆ  సుద్దులూ, ఆ సూక్తులూ ఇకపై వినిపించవు కదా? ఆ ఇంటి మీదుగా వెళ్తుంటే ‘రామచెంద్రా’ అని పిలిఛినట్టుగా అనిపిస్తుంది. పలాయనవాదం పాటిద్దామనుకున్నా ఆ గొంతు నన్ను వెంటాడుతూ ఉంది. ‘అతను’ లేడు అని నా మనసు చెప్తున్నా- నా బుద్ధి, గడ్డి తిని తలెత్తి చూస్తాను. అక్కడేదో ఆకారం… కన్నుల్లో కదిలిన  మేఘాలు తొలగించి చూస్తే – అక్కడ, శూన్యంలో – శ్వేత  వస్త్రంలా అవుపిస్తారు. మా నాన్న కూడా ఇలా వెంటాడలేదు ! ఏ పాశం వేసి నన్ను బిగించారు మాస్టారూ … రాస్తుంటే అక్షరాలూ అలుక్కుపోతున్నాయి.

కథానిలయం తలుపు తెరిచి ఉంటే చాలు – నేను తొంగి చూడకుండా ఉండలేని  మందో, మాకో నాకు తినిపించారు. తీరా తొంగి చూస్తే- కుడికాలి బొటనవేలు కదుపుతూ ‘వచ్చావా! నీ గురించే చూస్తున్నాను…’ అంటారు. అంతే నేను ఒళ్ళు మరిచిపోయి మీతో బాటు పనిలో భాగమైపోతాను. ఆ  క్షణాల్లో… రాత్రి తొమ్మిది గంటలకి సీతమ్మగారు కబురు పెడితే – అప్పుడు,  ‘గురూ!  పద పదా… సీతమ్మ గారు దెబ్బలాడతారు…’ ఆవిడంటే గొప్పగా భయపడిపోయినట్టు హడావిడీ చేసేవారు. నా దేహం చుట్టూరా అతుక్కుపోయిన ఈ జ్ఞాపకాలు ఎలా విదుల్చుకోగలను. నేను కథానిలయానికి పనికి వస్తానని మీరు నమ్మినంతగా ఇంకెవరూ నమ్మలేదు. కథానిలయం విషయంలో మీ నమ్మకానికి సరిపడ్డ మనిషిగా నిలబడ్డానో లేదో నాకు తెలీదు. మీరు నమ్మారు. నేను పని చేసాను. అంతే.

మాస్టారూ ! నేను తెలిసో తెలియకో చేసిన ఒకటి రెండు తప్పులను క్షమించేరు. కాచుకున్నారు. నా కోపాన్ని ధర్మాగ్రహం గా సరిపెట్టుకున్నారు. మీరు వేల మందికి ఉత్తరాలు రాసారు. మీ పరిచయమయిన నుంచీ మీకు దగ్గరగా ఉండడం వల్ల, మీరు నాకు ఉత్తరం రాసే అవకాశమే లేకపోయింది. అందుకని ఒక్క మనవి.  ఇప్పుడు దూరంగా ఉన్నాను కదా. మిమ్మల్ని నేను ఎలా మరిఛిపోవాలో చెప్తూ ఉత్తరం రాస్తారు కదూ.  నేను ఆ ఉత్తరాన్ని పదిలంగా దాచుకుంటాను. అయినా అది నా భ్రమ … ఒకవేళ మీరు  ఉత్తరం రాసినా – అందులో నేను అడిగింది రాయరు. నాకు తెలుసు. చిరునామాలో నా పేరు రాసి కేరాఫ్ కథానిలయం అని రాస్తారు. ఉత్తరం నిండా  కథానిలయం గురించే రాస్తారు. నాకు బాగా తెలుసు మీ సంగతి.

మాస్టారూ నా మనసులో  మాట. ఎప్పుడు నుంచో చెప్పాలనుకుంటున్నాను.

మీ కథా నిర్మాణానికి ఒక జ్ఞానపీఠం చాలదు.

ఇక – మీ వ్యక్తిత్వానికీ, చిత్తశుద్ధికీ మాత్రం ఏ పురస్కారాలు తక్కెడలో నిలబడవు.

ఆ… ఇప్పుడు గుర్తొచ్చింది మాస్టారూ. మీరు  నాకే కాదు. ఎవరికీ ఉత్తరం రాయరు. మీరు మీ చివరి క్షణాల్లో ఓ లక్ష ఉత్తరాలకు సరిపడా ఒక వాక్యం రాసారు. అది మీ అపురూపమైన చేతినుండి జాలువారిన ఆఖరి అక్షర సముదాయం. .  (ఇందిరమ్మనడిగి మంచం మీదే గుప్పెడు కాగితాలు అట్టకు తగిలించి పక్కనే పెట్టుకున్నారు. పెన్ను, కాగితాలూ మోసం చేస్తాయేమోనని పలకా బలపం కూడా అట్టేపెట్టుకున్నారు.) “కథానిలయాన్ని వీలయినంత సంరక్షించండి..” అని రాసారు. కథానిలయమే మిమ్మల్నిఆవహించిందో; మీరే కథానిలయాన్నిఆవరించారో! తెలీదు గానీ- చివరి శ్వాస తో ఉబికిన  ఆ వాక్యం బహుశా కథకులందరికీ  వీలునామా లాంటిది. కథానిలయం సంరక్షణే మీకు సరైన నివాళి.

మాస్టారూ మరో మాట. ఏమనుకోకండి.

అక్కడే మన ట్రస్టు సభ్యులు యగళ్లరామకృష్ణ, ఎన్ రమణమూర్తి (బాబా) కవనశర్మ, కనుగుల వేంకటరావు లు ఉన్నారు. పని రాక్షసుడు చలసాని ప్రసాద్ కూడా ఉన్నారు కదా అని, మరో వ్యాపకం పెట్టుకోకండి. ఏముంది వాళ్ళు తలుచుకొంటే నిధులు బిల్డింగులూ ఏర్పాటు చేయగలరు. ప్లీజ్ … సీతమ్మగారి చెంతనే ఉండండి. ఆ తల్లికి ఇంతవరకూ మీరు పెట్టిన కవుకులు చాలు. ఎవరినైనా అడిగి పేకదస్తాలు తీసుకోండి. పేకాడుతూ, సీతమ్మగారు కట్టిచ్చిన కారా కిళ్ళీలు నముల్తూ కబుర్లతో కాలక్షేపం చేయండి.

-మీ పుత్ర సమానుడు దాసరి రామచంద్రరావు కన్నీటి నివాళి.

*

దాసరి రామచంద్రరావు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
  • చాలా ఆర్ద్రంగా రాసేరు. గుండె తడి ఉన్న నివాళి

  • కారా మాస్టారు గురించి మనసులో వేదనను నిరాశ తో బాధ తో మీలో భావాలను వ్యక్తం చేసారు. తండ్రి కొడుకుల బందం కంటే, గురు శిష్యుల బందం పవిత్రమైనది. జ్ఞాపకాలు ఆచరణకు మార్గదర్శకాలు,

  • ధన్యులు రామచంద్రరావు గారు.చదువుతున్నంతసేపు అలజడి మొదలయ్యింది నాలో.కలం పట్టి చాన్నాళ్లయింది.ఏమీ రాయలేకపోతున్నాను

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు