కాంతారా సినిమాని ఎలా చదవాలి?

మన హీరోలు వారి పరిధులు, మార్కెట్ లెక్కలు, ప్రేక్షకుల మనోభావాలు, ఇలా ఎన్నో కారణాలతో మన కథలను మనమే చంపేసుకుంటున్నాం.

ప్రస్తుతం భారతదేశంలో చర్చలన్నీ మత ఆధారంగా జరుగుతున్నాయి. అది క్రికెట్టు గాని, రాజకీయాలు గాని, సినిమాలలో ఐతే మరీ ముఖ్యంగా. ఇటీవల విడుదలై దిగ్విజయంగా ఆడుతున్న కన్నడ సినిమా కాంతారా చుట్టూ కూడా మతపరమైన చర్చలు చుట్టుకున్నాయి. అది హిందూమత ఆచారాల్ని భోదిస్తుంది అని కొందరు, అవును అయితే ఏంటి అనేవారు మరికొందరు. ఈ ప్రచారం వివిధ సామజిక మాధ్యమాల్లో చాలా తీవ్రంగా జరుగుతుంది. హిందుత్వ వాదులు, లౌకిక వాదులు-కమ్యునిష్టులు, రెండు క్యాంపులుగ  మారి కొట్టుకుంటున్నారు. ఈ ఇరువురి అభిప్రాయంలో యెంత నిజముంది అనే విషయం పక్కన పెట్టి ముందుగా ఈ సినిమా కధ గురించి తెలుసుకుందాం, సంక్షిప్తంగా. అష్టైష్వర్యాలు, అందమైన కుటుంబం, పరిపాలించడానికి ఒక రాజ్యం, ఇలా అన్ని ఉండి కూడ మనశ్శాంతి లేక ఊరూరు తిరుగుతున్న రాజుకు ఆదీవాసులు పూజించుకుంటున్న ఒక రాయి (totem) దగ్గర మనసు కుదుట పడుతుంది. అందుకని అతను ఆ రాయిని అడగగ, ప్రతిగా వాళ్ళ అరుపు (కాంతారా అరుపుగ ప్రసిద్ధికెక్కింది) ఎంతవరకు వినిపిస్తాదో అంత భూమి వాళ్ళకీయమని అడుగుతారు. దానికి రాజు అంగీకరిస్తాడు కాని ఆ తర్వాత తరం ఎదురు తిరిగి ఆ భూమి లాక్కోవడానికి ప్రయత్నాలు, దానికి ఆదివాసులు స్పందన, మద్యలో పోలీసులు (రాజ్యం తరఫున) రావటం జరుగుతుంది. ఎలా ఎదురు తిరిగారు అనేది సినిమా. 

ఎదురు తిరిగే సమయంలో భూతకోళ ఆవహించడం వలన ఇది హిందు ఆధారిత సినిమా అని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా హిందూ మత ఆధారిత సినిమానా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. అయితే మత ప్రస్తావన ఉందా అంటే ఉంది. అరసు కులస్తులైన వడేయర్లు పరిపాలించిన ప్రాంతమిది. వీరు టిప్పు సుల్తాన్, ఆ తర్వాత బ్రిటిష్ వారి కింద సామంతులుగా మైసూర్ ప్రాంతాన్ని పరిపాలించారు. అందువలన హిందూ మత ఆనవాళ్లు చాల ఎక్కుగగానే కనిపిస్తాయి. మైసూర్ అనే పేరు, మాహిషాసుర అనే పేరు నుండే వచ్చింది. ఆదివాసుల మత సంప్రదాయాల గురించిన సినిమా. అయితే ఈ సినిమాలో ప్రధాన అంశం భూమి, సినిమా మొత్తం దాన్ని చుట్టూ తిరుగుతుంది. ఆదివాసుల సంభందాలు భూమితో గట్టిగా ముడిపడి ఉన్నాయి. ఆ సంబంధాలు సామాజికమైనవే తప్ప ఆర్ధిక సంబంధాలు కావు. భూమి ఆదివాసీల జీవితాలతో పెనవేసుకోబడ్డ ఒక బంధంగ, వారి జీవితాలు ప్రకృతిలో భాగస్వామ్యం అయి, ప్రకృతి- మనిషి మధ్య జరుగుతున్న మార్మికమైన సంభాషణ (ఉదా: కాంతారా అరుపు). ఇది కేవలం ఆదివాసీల జీవితాలలోనే జరుగుతుంది. భూమి, ఆదివాసుల జీవితాల్లో ఇంకా commodity (వస్తువు) గ మారలేదు. దానిని వారు ప్రకృతిలో ఒక భాగంగా, వారు దానికి కేవలం సంరక్షులుగా మాత్రమే ఉన్నామనే భావనలో ఉన్నారు. ఈ భావనకు మతం ఒక గొంతుక మాత్రమే. ఈ సంభాషణ, సంభంధాల ద్వారా ఏర్పడిన కొన్ని ఆచారాలు, గుర్తులు (symbols) మత రూపం తీసుకున్నాయి. ఈ మతాలు ఆధునిక మతాలంత క్లిష్టమైనవి కావు. వీరి మతాలని సామజిక శాస్త్రవేత్త ఎమిలీ దుర్ఖేయుమ్ (Emile Durkhiem) సులభమైన (సింపుల్), ప్రాచీన (ప్రిమిటివ్), ఆదిభూతం (ఎలిమెంటరీ) మతాలుగా పేర్కొన్నాడు. ఇంకా ఆధునిక మతాలంటే హిందూ మతం, ఇస్లాం, క్రిస్టియన్ అని చెప్పుకోవచ్చు. ఇవి క్లిష్టమైన (కాంప్లెక్స్) మరియు ఆధునికమైనవి (మోడరన్). కొన్ని దశాబ్దాలుగా ఆదివాసులకు, హిందూ మత ప్రచారకులకు మధ్య మతపరమైన విషయాలలో తీవ్రమైన ఘర్షణ జరుగుతున్నది. ఆదివాసుల మత అచారాలన్నీ హిందూ మతములో భాగమని వారు వాదిస్తున్నారు, అది భౌతిక హింస వరకు దారితీసింది. సమీకరణ (assimilation) పేరుతో హిందుత్వ వాదులు, అనుసంధానం (integration) పేరుతో రాజ్యం, ఆదివాసుల మీదుగ అజమాయిషీ చలాయించే ప్రయత్నం కొన్ని తరాలుగా జరుగుతుంది.

కాంతారా సినిమా విషయంలో కూడా అదే జరిగింది. అయితే అతివాద-మితవాద వర్గాలు ఈ సినిమాని హిందూ మత దృష్టి కోణంలో చూడడం జరుగుతుంది. హిందుత్వ వాదం పైన వచ్చిన సినిమాలు- కష్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలో ఒక మతం ఇంకొక మతానికి వ్యతిరేకంగా చూపించారు, కాంతార సినిమాలో మాత్రం సంఘం (community) తన పరిధిలో లేని అంశాల వలన ఎలా ప్రభావితం అవుతుంది అనే విషయం మాత్రమే చూపించారు. అంటే మారుతున్న పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుంది అని చూపించారు. అలా చూపించడం వలన వచ్చిన లాభాలు మరియు సమస్యల గురించి మనం ఆలోచించాలి. దానికి ముందు నాకు తెలిసిన ఒక కథ గురించి చెప్పాలి.

మా ఊరు చెన్నూరులో (అప్పటి నెల్లూరు ఇప్పటి తిరుపతి జిల్లా) కటాలమ్మ గుడి ఉంది. యానాది తెగకు చెందిన కటాలమ్మ ఆ గుడిలో దేవత. ఆమె దేవత అవ్వడం వెనక ఒక లెజెండ్ ఉంది. ఎన్నో ఏళ్లకింద ఒకరోజు చెన్నూరు చెరువు కట్ట తెగిపోయి నీళ్లన్నీ పోతావుంటే ఆ చెరువు కట్టకింద వ్యవసాయం చేసుకుంటున్న రైతులందురు, ముఖ్యంగా రెడ్లు వచ్చి కట్టని మట్టితో, ఇసుకతో పూడుస్తాఉన్న, బలమైన నీటి శక్తిముందు ఆనట్లేదు. ఇంతలో వాళ్ళ రెడ్డికి (ఆసామికి) సద్దన్నం తెచ్చిన కటాలమ్మ అదంతా చూసి ఆ రెడ్డితో ఓమాట అంటుంది.  “అయ్యా, కట్ట పూడ్చడం అయ్యేట్టుగా లేదు, నీళ్లన్ని పోతే మాకు బువ్వ ఉండదు, మేఁవంత చచ్చిపోతాం, దానికి బదులు నేనే పోత. నేను ఆ నీళ్ల మధ్యలో నిలబడతా, నీ చేతులతో మూడు పిడికెడులు మట్టి నా తలా మీద యెయ్యండి, ఆ తర్వాత అందరు కలిసి కట్ట పూడ్చేయండి. అయితే కట్ట పూడ్చేలోపట నాకొక చిన్న గుడి కట్టి అందులో ఓ జ్యోతి ఏలిగించండి” అని అని వెనక్కి తిరిగిచూడకుండా, రెడ్డి సమాధానం వినకుండా,నడుచుంటా పొయ్యి ఆ కట్టతెగిన మధ్యలో నిలబడతాది. ఆ తర్వాత రెడ్డి మట్టి చల్లడం, కట్ట పూడ్చటం, గుడి కట్టడం (చాల చిన్నది, అంటే ఒక మనిషి చేయి పట్టే అంత గుడి) జ్యోతి వెలగడం చక చక జరిగిపోతాయి. అయితే ఇప్పుడు ఆ గుడి పెత్తనం రెడ్లు చేస్తా ఉంటే, పూజారి పనులు బాపనయన చేస్తే, యానాదులు మాత్రం గుడికి బయట కాపలాదారులుగా మిగిలిపోయారు. యానాదుల ఆచారాలు ఏంటి, బ్రాహ్మణాల ఆచారాలు ఏంటి, గుడి ఎందుకు రెడ్ల అజమాయిషీలో ఉంది, యానాదులు ఎందుకు గుడి బయట మిగిలిపోయారు లాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయ్ కానీ ఇక్కడ, ఇది సందర్భం కాదు.

ఇప్పుడు కాంతారా సినిమా గురించి మాట్లాడదాం. ఆదివాసీల టోటెమ్ (totem) ద్వారా కలిగిన మనశాంతిఁ కి బదులుగా తనకు చెందిన భూమి ఆదివాసుల చేతుల్లో పెడతాడు రాజు. ఆధునికత వాసన చుసిన తన తర్వాతి వారసులు, భూమి యొక్క ప్రస్తుత విలువను  తెలుసుకొని, దానికి కొత్త అర్దాలను ఆపాదించి తమ పూర్వీకుల భూమిని తిరిగి పొందడానికి  రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నంలో ఒకసారి భూమిని తిరిగి ఇచ్చేయమని అడిగితే సమాధానంగ “మేమిచ్చిన మనశాంతి మాకు తిరిగి ఇచ్చేయండి, మీ భూమి మీకు ఇచ్చేస్తాం” అని ఆత్మ ఆవహించుకున్న ఒక ఆదివాసీ అంటాడు. ఈ సంభాషణ ద్వారా మనకు అర్ధం అయింది ఏంటంటే ఒకరు దానిని వస్తువుగా (commodity), ఇంకొకరు దానిని abstract గ చూడడం. భూమికి ఉన్న అతిగొప్ప క్లిష్టమైన గుణమే ఆ చిక్కుముడి. దానిని నిర్వచించే వారిని బట్టి దాని అర్ధం మారుతుంది. 

 రాజ్యం , మతం పనిముట్లుగా మారి ఈ చిక్కుముడిని విప్పడానికి గాని, అర్ధం చేసుకోవడానికి కొన్ని తరాలుగా ప్రయత్నించాయి గాని అవ్వలేదు. అదే విషయం ఈ సినిమాలో కూడా చెప్పారు. ప్రకృతి మాత్రమే ఈ ముడిని విప్పగలదు. సినిమా చివరిలో భూస్వామి మరియు పోలీస్ ఆఫీసర్ ఇద్దరికీ ఆ విషయం అర్ధం అవుతుంది. సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర అడివిని రక్షించే పాత్రలో కనిపించిన, యదార్థంలో రాజ్యం అంత మంచిగా ఏమి లేదు. అడివిని కాపాడే ముసుగులో రాజ్యం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రూపంలో ఒక వ్యవస్థను తయారుచేసి అప్పటివరకు అడవిలో ఉంటూ దానికి సంరక్షకులుగా ఉన్న ఆదివాసులను ఆడవి నుండి తరిమి వేసే ప్రయత్నం జరిగింది. ఆ ప్రక్రియ స్వాతంత్రంనకు ముందు ఆ తర్వాత కూడా కొనసాగింది. అందులో భాగంగా రాజ్యం చేసిన హింస అంతా ఇంతా కాదు. పోయిన సంవత్సరం మోదీ ప్రభుత్వం వ్యాపారాన్ని సులువు చేసే ప్రయత్నంలో, మరియి అభివృద్ధి పేరు మీద Forest Conservation Act, 1980 లోని చాల అంశాలకు సవరణలు చేసింది. దీన్ని వలన ప్రధానంగా నష్టపోయేది ఆదివాసులు మరియు గ్రామప్రాంత నివాసులు.

ఎప్పుడైతే భూమిని ఒక వస్తువు లాగా కాకుండా, అది మన దైనందిక జీవితంలో భాగంగా, దానికి మనం పరిరక్షకులం మాత్రమే అని చూస్తామో అప్పుడే మనకు భూమి మనిషి మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే భూమికి మనిషికి మధ్య ఉన్న సంభందం తల్లికి బిడ్డకి మధ్య ఉన్న పేగుబంధం లాగా ఉండాలి. ఒక వేరు బంధం లాగా ఉండాలి. భూమి చుట్టూ ఉండవలసిన సామజిక సంబంధాలు కనుమరుగై ఆర్ధిక రాజకీయ సంభందాలు రావడం మూలంగా వచ్చిన సంఘర్షణను కాంతారా చాల బాగా అర్ధం చేపిస్తుంది. కేశవరెడ్డి మూగవాని పిల్లనగ్రోవి నవలలో అప్పులబాధ తక్కుకోలేక తాకట్టుపెట్టిన భూమిని వొదిలేసుకున్నపుడు రైతు పడిన ఘర్షణ, చివరికి ఏదైతే అమ్మిన భూమి ఉందో, అందులోనే చనిపోవడం జరుగుతుంది. ఇటువంటి సన్నివేశాలు రాయడం యెంత కష్టమో తెరకెక్కించడం ఇంకా కష్టం. అందులో రిషబ్ శెట్టి చాల వరకు విజయం సాధించాడు.

దక్షిణ కన్నడ ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని శెట్టిలు కొన్ని సంవత్సరాలగ వైవిధ్య భరితమైన కథలను చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. బంట్ (Bunt) కులానికి చెందిన వీరు చారిత్రకంగా అవసరమైనప్పుడు యుద్దాలు చేస్తూ మిగతా సమయాలలో వ్యవసాయం చేసుకునేవారు. అంటే మన తెలుగు ప్రాంతాల్లో ఉన్న రెడ్లు, కమ్మలు, కాపులు ఎలాగో, అలాగా. RRR గ పిలవబడే రిషబ్, రాజ్, రక్షిత్ ముగ్గురు, దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన కథలను నిజాయితీగ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమాని వాస్తవానికి దగ్గరగా మరియు వాణిజ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని కథను ఒక ప్రాంతంలో locate చేయడం వలన చూసే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వగలుతున్నారు. local is now global అనే విధానం ఎక్కువగా తమిళ సినిమాలలో కన్పిస్తున్నది, ఉదాహరణకు మధురై ప్రాంత ఆధారిత కథలు, లేకపోతే తెలంగాణలో situate ఐన కథలు గురించి చెప్పుకోవాలి.

గంగవల్లి, చంద్రగిరి నదుల మధ్య ఉన్న తుళు ప్రాంత కట్టుబాట్లు, అక్కడి సంస్కృతీ, భూత కొళ, పులి, వరాహ వేష ధారణ, కోళ్లు, ఎద్దుల పోటీలు, ఈ ప్రాంతాలకు ప్రత్యేక చిహ్నాలు. ఇవన్నీ, వ్యవసాయం, ప్రకృతి, పంటలు, ఆహారం లాంటివి వారి దైనందిక జీవితాల్లో కొన్ని తరాలనుండి భాగమైనవి. వీటిని cinematic తీరులో కాకుండా నిజానికి చాలా దగ్గరగా చూపించడం జరుగుతుంది. మంగళూరు ప్రధాన కేంద్రంగా అప్పట్లో దక్షిణ కెనరాగ పిలవబడే ఇప్పటి దక్షిణ కన్నడ ప్రాంతానికి రైత్వారీ వ్యవస్థను ప్రతిపాదించిన సర్ థామస్ మున్రో తొట్టతొలి కలెక్టర్ గ నియమించబడ్డాడు.  వలసవాద వ్యవస్థలోనే భూమి గుంపుల నుండి వ్యక్తుల సొంతమైనది. ఈ రైత్వారీ విధానం భూస్వామ్య వ్యవస్థ యొక్క మూలాలను ప్రశ్నించింది. 

అయితే ఇలాంటి లెజెండ్ కథలు మన తెలుగులో లేవా అంటే, చాలానే ఉన్నాయ్ అని చెప్పాలి, మరి మన సినిమా పరిశ్రమ ఈ కథల ఆధారంగా సినిమాలను తీసిందా అంటే తీసింది అనే చెప్పాలి. కానీ ఆ కథలను చెప్పే విధానంలోనే సమస్య, మన హీరోలు వారి పరిధులు, మార్కెట్ లెక్కలు, ప్రేక్షకుల మనోభావాలు, ఇలా ఎన్నో కారణాలతో మన కథలను మనమే చంపేసుకుంటున్నాం.

*

సతీష్ చెన్నూర్

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • “మేమిచ్చిన మనశాంతి మాకు తిరిగి ఇచ్చేయండి, మీ భూమి మీకు ఇచ్చేస్తాం” అని ఆత్మ ఆవహించుకున్న ఒక ఆదివాసీ అంటాడు. ఈ సంభాషణ ద్వారా మనకు అర్ధం అయింది ఏంటంటే ఒకరు దానిని వస్తువుగా (commodity), ఇంకొకరు దానిని abstract గ చూడడం. భూమికి ఉన్న అతిగొప్ప క్లిష్టమైన గుణమే ఆ చిక్కుముడి. దానిని నిర్వచించే వారిని బట్టి దాని అర్ధం మారుతుంది. రి వ్యూ చాలా బాగుంది అన్న

 • ఇప్పటి సామాజిక పరిస్తులను గమనంలో పెట్టుకొని కాంతారా చిత్రాన్ని చాలా బాగా విశ్లేషణ చేశారు. మానవ సమాజం ప్రగతిలో భూమి పాత్ర ఎంత ముఖ్యమన్న సంగతిని దానిని ప్రకటన చేయడంలో మానవ సంబంధాలు ఎలా ముడిపడి వుంటాయో, ముఖ్యంగా మూఢ నమ్మకాలు, కనిపించని దేవతలు, దయ్యాల బాంధవ్యం గురించి చిత్రంలో చూపిన విధానం, ప్రేక్షకులు ఆదరించిన సంగతి బాగా వివరించారు

 • సినిమా బాగుంది
  తెలుగు లో అటువంటీ‌ Down to earth ‌‌ సినిమా లు రావు
  మన సినిమా pan Indian…hero కి50 కోట్లు.. డైరెక్టర్ కు 25,ఉత్తరాది నాయిక కు10, మ్యూజిక్ డైరెక్టర్ కు 5….
  టికెట్ ధర 200/500/1000…
  ప్రజ ల నుంచి ఎలా దోచుకోవాలో తెలుసు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు