కవిత్వం చదివినప్పుడల్లా జీవితం కనపడాలనుకుంటా…

నా పేరు గోవర్ధన్.
మాది రంగారెడ్డి జిల్లా, కడ్తాల్ మండలంలోని పల్లెచెల్కతండా. మా ఊరికి సమీపంలోని కందుకూరు పాఠశాలలో చదువుతున్నప్పుడు గురువు కుమార్ గారి ప్రోత్సాహంతో చిన్న చిన్న చందోబద్ద పద్యాలు రాస్తుండగా తెలుగు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది.పదోతరగతి పూర్తి అయ్యాక యాచారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతుండగా నాలోని సాహిత్య ప్రతిభను గుర్తించి నన్ను కవిగా మలిచిన గురువు గుగులోత్ కృష్ణ గారి కృషి, ప్రోత్సాహం ఎనలేనిది. సాహిత్యంలోనే కాకుండా నా జీవితానికి ఓ చక్కని మార్గనిర్దేశాన్ని చూపించే గురువు కృష్ణ గుగులోత్ గారంటే ఎనలేని ప్రేమ,అభిమానం, గౌరవం కూడా.
చుట్టూ సాగుతున్న జీవితాన్ని కవిత్వం చేసి నలుగురి మార్పుకై పరితపిస్తాను. కవిత్వం చదివినప్పుడల్లా జీవితం కనపడాలని ఆరాటపడతాను.
ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని ప్రజ్ఞా‍ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజిలో డైట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను.
ఆకలి తొవ్వలు
~
గరమంటే అద్దాలమేడలు
కానీ కుంచించుకపోయిన
మనసుల్ని మరగబెడితే  చితికినబతుకులు కానొస్తయి
దినాం బుక్కెడుబువ్వకై
తండ్లాడే కొందరు, తిన్నదరగని
ఆయాస అనకొండలు మరికొందరు
రాలిన ఆశలు‌ –
కాలిన కడుపులుగా
కొన్ని రోడ్ల-బస్సుల చూర్లకు నిస్సత్తువగా ఏలాడుతుంటరు
కడుపు కర్సుకొని ఏడ్చిన
దినాలే కోకొల్లలు, కానీ
గుండెనిండుగా నవ్విన రోజోకటుందా వాళ్ళకసలు?!
బతుకంటే కష్టాల మూటల్ని
బాధ్యతగా మోయడమేనని
ఎరిగినోళ్ళు, కరుణ కటాక్షిస్తే
సంతసపు రెక్కలు తొడుక్కునే సీతాకోకలౌతారు.
లేదంటే
తొవ్వలకు
కన్నీటిగీతాల్ని నేర్పే ఆకలిజోలేలౌతారు.
*
Avatar

గోవర్ధన్ ఇస్లావత్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తొవ్వలకు ఆకలి గీతాల్ని నేర్పే..’ కవిత బాగుంది. ప్ర ” భావ చిత్రకారుడి వి ” అవుతావు. కీపిత్ అప్ గోవర్ధన్!

  • తొవ్వల కు ఆకలి గీతాలు నేర్పడం.. కవిత బాగుంది. ప్ర ” భావ చిత్రకారుడివి ” అవుతావు. కీపిట్ అప్ గోవర్ధన్!

  • తొవ్వలకు
    కన్నీటిగీతాల్ని నేర్పే ఆకలిజోలేలౌతారు… బావుంది కవిత!!

  • చాలా బాగుంది ఆకలి బాదల్ని స్పర్శించే మనసు చమ్మగా అన్పించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు