కవిత్వం కాలాన్ని రచిస్తుంది…

విత్వంలో కాలం వుంటుంది.

అది వర్తమాన కాలమో, భూత కాలమో , భవిష్యత్ కాలమో, లేక ఒకటిని మించిన కాలమిశ్రమమో!  అది కవి ఎంచుకునే వస్తువు మీదా , అతని చూపు మీదా  ఆధారపడి వుంటుంది.

మనిషి జీవితాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని అపారమైన కవిత్వం వచ్చింది. వస్తున్నది. ముందు ముందు ఇంకా రాగలదు కూడా. జీవితమన్నపుడు దాన్ని వెన్నంటే కాలం వుంటుంది. ఏ కాలంలో మనిషి జీవితం ఎట్లా వుందో కవులూ చెబుతూ  వచ్చారు.

ప్రాచీన కాలంలో ప్రధానంగా కథాకావ్యాలు వచ్చాయి. కథానుసారంగా కాలం వ్యక్తమయింది నాటి కావ్యాల్లో.

ఆధునిక కవిత్వానికి మనిషి కేంద్ర బిందువు. మనిషి జీవన విధానమూ , అతని సంబంధాలూ, అతని ప్రయాణమూ , కలలూ, చింతనలూ , వాటి పర్యవసానంగా అతను పడే బాధలూ, పొందే సుఖాలూ – ఇవన్నీ కవిత్వంలో ప్రధానాంశాలైనాయి.

ఆధునిక కవులు స్థూలంగా త్రికాలాల్ని పట్టించుకున్నప్పటికీ, వర్తమానమే వారిని బలంగా ఆకర్షిస్తుందనేది సత్యం. అయితే వర్తమానం గురించి మాత్రమే ప్రస్తావిస్తే  అది అన్ని వేళల్లో పూర్ణ సత్యాన్ని ఆవిష్కరించలేదు. వర్తమానానికి గతమూ, ఆగతమూ వుంటాయి. ఒక ప్రస్తుత సమస్యను గురించి చెప్పేటప్పుడు, దాని మూలాలు గతంలో ఎక్కడున్నాయో చూసినప్పుడే కవి ఆ సమస్య అసలు స్వరూపాన్ని తాను అర్థం చేసుకోగలడు, లోకానికి చెప్పగలడు. అట్లాగే ఆ సమస్య వర్తమానంలో పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో అది ఏ  రూపం దాల్చనున్నదో చూడ్డం కూడా అవసరం అవుతుంది.

అయితే కవికి ఎవరూ సిలబస్ ను నిర్ణయించలేరు. అతను తాను ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తాడు. ఒక కవి కేవలం వర్తమానం మాత్రమే చెప్పి వూరుకోవచ్చు. దాన్ని ఆ కవి కళాత్మకంగానూ తీర్చి దిద్దొచ్చు. మరొక కవి వర్తమానాన్ని చెబుతూనే అటు గతాన్నో , లేక భవిష్యత్తునో లేక రెంటినో చెప్పొచ్చు కూడా!

అట్లాగే ఒక గతాన్ని గురించి చెప్పేటప్పుడు కవి దానికే పరిమితం కావొచ్చు. అట్లా కాక దాని కొనసాగింపు ఎలా వుందో చెబుతూ వర్తమానానికి అనుసంధానం చేయొచ్చు.

ఒక సంఘటన జరిగినప్పుడు దానికి వెంటనే స్పందిస్తూ చాలా మంది తెలుగు కవులు కవితల్ని రాస్తారన్నది ఒక వాస్తవం. ఒక రకంగా ఇది మంచిదే. ఆ కవిత్వం మూలాన సంఘటనకు సంబంధించిన కొన్ని ఆలోచనలు సమాజంలో చర్చకు వస్తాయి. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి ఆ కవిత్వం దోహదం చేయొచ్చు. అయితే సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలు తెలిసిన కవులు రాసే కవిత్వంలో లోతూ , విస్తృతీ కనపడతాయి. దాని ప్రయోజనం గుణాత్మకంగా వుంటుంది. అట్లా కాక సంఘటన మాత్రమే తెలుసుకుని, దాని ముందూ వెనకలను తెలుసుకోకుండా హడావిడిగా కవిత్వం రాసే కవుల రచనలు చాలా వరకు అసమగ్రంగా వుండే అవకాశం వుంది. అంతే కాక వాటిలో అపరిపక్వత కొట్టొచ్చినట్లు కనపడుతుంది.

భాష, వాక్యం రాసే ఒడుపూ, అలంకరణలూ తెలిసినంత మాత్రాన కవి  ఏ వస్తువు మీదైనా కవిత్వం రాయగలడని చెప్పలేము. ప్రకృతిని వర్ణిస్తూ రాయడానికి సమాజావగాహన వుండనక్కర్లేదు. కానీ సామాజిక అంశం మీద కవిత్వం రాయడానికి భాషా పరికరాలు మాత్రమే సరిపోవు. కవి తన చుట్టూ వున్న సమాజం గురించి ఒక అవగాహన కలిగి వుండాలి. దాని గతి శీల స్వభావాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వుండాలి. కార్య కారణ సంబంధాన్ని గుర్తెరుగాలి. కాలిక స్పృహ అవసరమవుతుంది.

అందుకే ఒక కవి తన రచనలో ఒక వస్తువును గురించి చెప్పేటప్పుడు దానిలో ఏ కాలాన్ని ప్రవేశపెడతాడన్నది  ఒక కీలకాంశం. ఒకటి కంటే ఎక్కువ కాలాల్ని ప్రవేశపెడితే వాటిని ఎట్లా అన్వయించి చెబుతాడో కూడా ముఖ్యం. ఈ కాల నిర్వహణ సరిగా లేకపోతే ఆ రచన అర్థవంతంగా వుండదు.

ఒక నది పక్కన నిల్చుని అదెట్లా ఆ సమయంలో కదులుతున్నదో చెబుతూ కవి ఓ కవిత రాస్తే దానిలో వర్తమానమే వుండొచ్చు. మరో కవి అదే  నది పక్కన నిల్చుని, నదిని చూస్తూ నీటితో తన అనుబంధం ఎపుడు మొదలయిందో నెమరేసుకుంటూ తన గతానుభవాల్ని చెప్పుకుంటూ వచ్చి ప్రస్తుతానుభవాన్నీ వాటితో ముడేసి చెప్పొచ్చు. అపుడు ఆ గతంలో అతని గతమూ, వర్తమానమూ వుంటుంది. ఈ ఇద్దరు కవుల కవిత్వాలూ వేటికవే ప్రత్యేకంగా వుండొచ్చు.

సమాజంలో జరిగే ఘటనల్ని చూసే విషయం లోనూ కవుల చూపు ఒకేలా వుండదు. ఉదాహరణకు కరోనా మీద గత సంవత్సరం (2020) కవులు విస్తారంగా కవిత్వం రాసారు. అందరూ ఒకేలా రాయలేదు. కొందరు కేవలం వర్తమానం మీద ధ్యాస పెట్టి కరోనా వల్ల మనిషి ఎట్లా బాధ పడుతున్నారో చెప్పారు. మరి కొందరు కరోనాకు పూర్వం మనిషి జీవితం ఎంత సంరంభంతో వుండేదో చెబుతూ ప్రస్తుతం అతను గృహబందీ అయిన  తీరును చెప్పారు. వీరి కవితల్లో వర్తమానంతో పాటు గతమూ వుంది. కరోనా తర్వాత భవిష్యత్తులో మనిషి తన మనుగడ కోసం చుటూ వున్న  ప్రకృతితో ఎలాంటి సంబంధాల్ని కలిగివుండాలో దార్శనికతతో మరి  కొందరు కవిత్వం చెప్పారు.

అయితే వర్తమాన వస్తువు అయిన కరోనా మీద రాసినంత మాత్రాన  ప్రతి కవితా గుణాత్మకంగా విశిష్టమైనదవాలని లేదు. కాలేదు కూడా. ధ్యాసా ధ్యానం లేక యాంత్రికంగా రాసిన కవితలు చాలానే వున్నాయి. అవి కాలక్రమంలో కనుమరుగవుతాయి. వందల సంఖ్యలో వచ్చిన కరోనా కవితల్లో ఏవో కొన్ని మాత్రమే  భవిష్యత్తులో నిలబడేంత బలంగా వున్నాయి. అయితే ఇది కరోనా కవితలకే కాక ఇతర సామాజిక కవితలకూ వర్తించే విషయం.

ఎప్పుడూ ఒకే ఒక్క కాలం మీదనే కేంద్రీకరించి దీర్ఘకాలం పాటు  సృజన చేసే వారి రచనల్లో చాలా పరిమితులు వుండడానికి వీలు వుంది. అట్లా కాక ఒక స్థిర బిందువు మీద నిల్చుని వున్న కవి , చూపు ద్వారా ఆ బిందువు నుంచి  బహు కాలాల్లోకి ప్రయాణించి వస్తువును దర్శించి కవిత్వం రాసినపుడు, అతని కవిత్వంలో విస్తృతి వుండే వీలుంది. ఇది సామాజిక కవిత్వానికి ఎక్కువగా వర్తిస్తుంది.

కవిత్వంలో కాలం వుంటుంది. కవిత్వం కాలాన్ని రచిస్తుంది. యే యే కాలాల్లో మనిషి ఎన్ని ఉద్వేగాలకు గురయ్యాడో రికార్డ్ చేస్తుంది.

చరిత్రకారుడు చరిత్రను రాస్తాడు. వాస్తవాలే అతని ముడి సరుకు. కవి వాస్తవానికి వూహను జోడిస్తాడు. అతను సమాంతర చరిత్ర కారుడు. చరిత్రకారుడి పని లాగానే కవి పని కూడా  బాధ్యతాయుతమైంది. కాలం చెప్పిన, చెబుతున్న వాస్తవాల్ని పట్టించుకోవడం ఆ బాధ్యతలో భాగం. అందుకే కవిత్వం ఒక బాధ్యత.

*

దర్భశయనం శ్రీనివాసాచార్య

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు