కల్ల కాని ఓ కల కథ- పడమట సంధ్యారాగం!

లలు ఎప్పుడైనా నిజమవుతాయా? అవి కేవలం కల్లలేనా? అసలు కలలు ఏవిటి?

కలలగురించి కాస్త రాద్దామనిపించి…ముందు కలం చేపట్టి, తరువాత కంప్యూటర్ మీద కూర్చున్నాను, ఓ అమృత వేళ.

ఆరోజు నాకొచ్చిన కల చాలా గమ్మతైనది. దాన్ని అసలు మర్చిపోకూడదనే కోరిక బలంగా వుంటంతోనే ఇది రాస్తున్నా!

                                              *

స్థలం: ఓ పది సంవత్సరాల క్రితం…బొంబాయి నగరం.

సన్నివేశం: సుప్రసిద్ధ సినీ నటుడు షారుఖ్, గౌరీఖాన్ ల పెళ్లి వార్షికోత్సవం!

అందులో నాపాత్ర: షారుఖ్ ఖాన్ కి సన్నిహితుడైన ఓ మితృడిది!

                                            *

నిజం చెప్పాలంటే షారుఖ్ ఖాన్ కీ నాకూ పరిచయం అసలు లేనే లేదు! అందుకే ఈ కల చాల గమ్మతైనదని ముందే చెప్పాను. షారుఖ్ ఖాన్ ‘బాలీవుడ్ కా బాదుషా’ అని ప్రసిద్ధికెక్కటం, నేను కూడా బొంబాయి నగరం లో కొన్నాళ్లు పని చేయటం… ఆ కలకి కొంత మటుకు సహజత్వాన్ని ఇచ్చాయి.

కలలో…

ఆరోజు జరగబోయే షారుఖ్ ఖాన్ పెళ్లి వార్షికోత్సవం కోసం సన్నాహాలు వడివడిగా జరుగుతున్నాయ్. స్టేజీని అలకరించటాలు, ఆడియో విజువల్ అమర్చుకోవటాలు, వగైరా వగైరా పనుల్లో వున్నారు పనివాళ్ళు.

బొంబాయి మహానగరం లోని బాలీవుడ్ నుంచి ఎంతో మంది సుప్రసిద్ధ నటీనటులు హాజరవబోతున్నారు కాబట్టి హడావుడిగా వుంది.

లోపల నేను, షారుఖ్ ఖాన్, మరి కొందరు మీడియా మనుషులు వున్నారు. గబుకున్ననావైపుకు తిరిగి, “మీర్ అబ్దుల్లా భాయ్…మీరు బాగా పాడతారు కదా…ప్రోగ్రాం మొదలు పెట్టే ప్రార్ధన గీతం మీరే ఎందుకు పాడకూడదు?”, అన్నాడు షారుఖ్ ఉర్దూలో.

బాత్రూంలోను, ఫ్రండ్స్ తో సరదాగా చేసుకునే కేరియోకే పాటలపార్టీలలోను నేను బానే పాడతాననే పేరు నాకైతే కాస్త వుంది. కానీ…ఇంత పెద్ద పార్టీలో…అందునా ప్రోగ్రాం మొదట్లోనే పాడాలన్న  ఆలోచన మాత్రం  ఇబ్బందిగా వుంది నాకు.

సాక్షత్తు ‘బాలీవుడ్ కా బాదుషా’ షారుఖ్ ఖాన్ అడుగుతుంటే కాదని ఎలా అనగలం?

‘సరే’ అని మనసులో అనుకుని మెంటల్ గా రెడీ అవటం మొదలు పెట్టాను.

అయితే ఏమిటి పాడాలి? అన్నది నా మైండ్ లోని పెద్ద ప్రశ్న. షారుఖ్ ముస్లిం అయినా, అతను ప్రేమించి పెళ్లిచేసుకున్న సతీమణి గౌరీ ఖాన్ మాత్రం హిందూ కుంటుంబం లో పుట్టి పెరిగినావిడే!

గబుక్కున నాకో ఐడియా వచ్చింది!

“శాంతాకారం భుజగ శయనం…పద్మనాభం సురేశం…” నాకొచ్చిన ఆ శ్లోకాన్ని రాగయుక్తంగా పాడేశాను.

*

చప్పట్లతో  నాకు మెలకువ వచ్చింది. కల ఆగిపోయింది.

అప్పుడు… సరిగ్గా అప్పుడే  అసలు నాకీ ఆలోచన వచ్చింది. కాస్త కలల గురించి పరిశోధించి, అలోచించి, ఇదిగో ఇలా…మిమ్మల్ని కాస్త బాదాలనే ఓ కోరిక కూడా కలిగింది!

అసలు కలల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతే ఉంటే, చాలా వుంది తెలుసుకోటానికి, మనం ఇక్కడ  చెప్పుకోటానికి! కానీ…మీకు మరీ బోరెత్తిపోకుండా, టూకీగా చెప్పాలంటే…

నిద్రలో వున్నప్పుడు నాకొచ్చిన షారుఖ్ ఖాన్  కలలాంటి సరదాకలలు అన్నీ నిజాలు కాకపోవచ్చు.

కానీ, శాస్త్రవేత్తల పరిశోధనా సారాంశం ప్రకారం, నిద్రలో లేనప్పుడు మనం కనే కలల్లో చాలా పవర్ వుంది!

‘ఈనాటి కలే రేపటి నిజం’ అని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు!

మనకున్న పరిధిని దాటి, మనం సాధించాల్సిన  వాటిని  గురించి కలలని  కంటూ, మన ప్రయత్న లోపంలేకుండా వాటి కోసం నిరంతరం శ్రమిస్తూవుంటే… నేటి కలలే రేపటి నిజాలవుతాయి!  మీరు ఊహించని వనరులు, ఏమాత్రం ఆశించని సహాయాలు మీ ముందు ప్రత్యక్షమవుతాయని, ఈ విశ్యమంతా మీకు సహాయకారి కూడా అవుతుందనీ అంటున్నారు!

న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, విజువలైజషన్, ఆటో సజెషన్ లాంటి టాపిక్కులని ఉపయోగించి ఎందరో లాభాలని పొందుతున్నారు కూడా!

“All Dreams Come True, if you have the courage to pursue them”.

అన్నాడు ఓ మహానుభావుడు (Walt Disney). అతని జీవిత చరిత్రని చూస్తే మీకే తెలుస్తుంది, కలల్లో…ఆ కలలకోసం నిరంతరం మనం పడే శ్రమలో ఎంత పవర్ ఉందో!

నాకూ అలాంటి కలే ఓసారి వచ్చింది,  నేను శుభ్రంగా మెలకువగా వున్నప్పుడే!

*

నేను బొంబాయి లో చదూకుంటున్న రోజులవి.

…నేను నా మిత్రులు కొంతమంది కలిసి ఓమంచి సినిమా తీస్తున్నాం…

…అందులో కాసిన్ని అమెరికా అందాలతో పాటు…

…మన తెలుగు జీవన విధానాన్ని కూడా మేళవించి…

…రవ్వంత రొమాన్సునీ, కాస్తంత హాస్యాన్నీ కలిపి…

…వీటన్నిటిలో ఓ సందేశాన్ని కూడా ఇరికించి…

…తీసిన ఆ సినిమాని తెలుగుదేశం లోని తెలుగువారు, తెలుగమెరికన్లు ఆదరిస్తున్నారు…

…అవార్డులు అభిమానాల వర్షాలు కురిపిస్తున్నారు…

అనుకోకుండా ఓరోజు నాకొచ్చిన కల అది!

*

ఆ కలకు ప్రతిరూపమే… మీర్-అభిమానించి, ఆదరించిన ఆ “పడమటి సంధ్య రాగం”!

*

మీర్ అబ్దుల్లా

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు