కలగంటున్నాను

దుఃఖాన్ని తలపై మోస్తున్నవాడ్ని
దిగూట్లో దీపం కొండెక్కి కూర్చుంది
కళ్లలో వేదనను వడగడుతున్నవాడ్ని
చూపుకు గమ్యం అందక తడబడుతోంది
గుండె బాధతో కొట్టుమిట్టాడుతున్నవాడ్ని
రక్తపోటు అందకుండా పరుగులు పెడుతోంది
మౌలికమైన మార్పు అంచున నిలబడ్డవాడ్ని
సమాజపు వొరిపిడికి తల్లడిల్లుతున్నాను
విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న పోరాటం
గిరిజనతండాలో జ్ఞానదీపమై వెలుగుతోంది
సిద్ధాంతం వెలిగించిన ఆరాటం
దండకారణ్యంలో దివిటీ వెలుగులో పదునుదేరుతోంది
తుపాకిగొట్టంలోంచి తొంగిచూస్తున్న బుల్లెట్లు బుసకొడుతున్నాయి
బూర్జువా రాజ్యాంగ ట్రిగ్గర్ నొక్కి విధ్వంసాన్ని సృష్టిస్తోంది
అణ్వాయుధ కోరలతో వికటాట్టహాసం చేస్తున్న సామ్రాజ్యవాద దేశాలు
ప్రపంచాన్ని గుప్పిట్లోకి తీసుకోవడానికి వ్యూహం పన్నుతున్నాయి
వ్యూహ ప్రతివ్యూహాల్లో పోరాటం దారితప్పుతోంది
బతుకుపైని విశ్వాసంతో రాజీపడలేని జీవయాత్ర
ఉదయించే భవిష్యత్తులోకి అడుగులు వేస్తూ పయనిస్తున్నది
చేతుల్లో వణుకుతున్న ఆవేశం
న్యాయంపైని నెత్తుటి మరకలను తుడిచేస్తున్నది
నమ్మకంలో చిమ్మిన రక్తంలో
హక్కులను కడిగి ముందుకు సాగుతున్నాను
ఆయుధాలను వాక్కుల్లా సంధిస్తున్నాను
అడవి శిరస్సు మీద విచ్చుకున్న సూర్యుడ్ని
నగరం మీంచి నడిచిపొమ్మని వేడుకుంటున్నాను
ఊపిరి బిగపట్టుకున్న గాలి
కళ్లు చిట్లించుకున్న వెలుతురు
నిర్ణయించే స్వేచ్ఛమీద అడుగులు వేయమని అభ్యర్థిస్తున్నాను
పీడిత ప్రజా హృదయాల్లో దుఃఖం ఆవిరైపోయి
వేదన కరిగిపోయి
గమ్యంవైపు చూపు సాగుతుందని కలగంటున్నాను
కలలో కర్తవ్యం కరవాలంగా దూస్తోంది
దుఃఖిస్తున్న దీపాన్ని చెరిపేసి
దిగూట్లో సూర్యుడ్ని వెలిగించాను
వెలుతురు పరుచుకున్న గదినిండా చైతన్యపు పరుగులు.
*

కోడం పవన్ కుమార్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఆయుధాలను వాక్కుల్లా సంధిస్తున్నాను

 • నమ్మకంలో చిమ్మిన రక్తంలో
  హక్కులను కడిగి ముందుకు సాగుతున్నాను
  ఆయుధాలను వాక్కుల్లా సంధిస్తున్నాను
  అడవి శిరస్సు మీద విచ్చుకున్న సూర్యుడ్ని
  నగరం మీంచి నడిచిపొమ్మని వేడుకుంటున్నాను

  Beautiful and sharp expression.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు