కరుణ కన్నా గొప్ప మహిమ లేదు!

సూఫీల గొడుగు నీడలో-2

తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం సమీపంలో ఉన్న కొత్తలంకలో హజరత్ సయ్యద్ అహ్మదలీషా ఖాదర్ వలీబాబా గారి దర్గాతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి కొన్ని సంగతులు పంచుకోవాలనుకొంటున్నాను.

అవి 1930ల నాటి రోజులు.

మా మాతామహుని పేరు దొంతాభక్తుని సోమలింగం. యానాంలో నివసించేవారు.  వీరికి సంతానం లేదు. ఎన్నిపూజలు చేసినా ఫలించలేదు. “రేవు అవతల ఎవరో యోగీశ్వరుడు వచ్చారట, ఆయన అనేక మహిమలు చూపుతున్నారట.  వారిని దర్శించుకొన్నవారికి అనుకొన్నవి జరుగుతున్నాయట” అంటూ వారూ వీరూ చెప్పుకొనే మాటలను నమ్మి “సరే చూద్దాం ఏంజరుగుతుందో” అనుకొని ఒక రోజు మా తాతగారు  కొత్తలంక వెళ్ళారు.

కొబ్బరితోట మధ్యలో ఓ చెట్టునీడన  దిగంబరంగా కూర్చొని, బక్కపలచని శరీరంతో ఒక సాధువు, ఆయన చుట్టూ  పది పదిహేను  మంది భక్తులు.  అరటిపళ్ళు, తీపితినుబండారాలు ప్రసాదంగా సమర్పించుకొని ఒక్కొక్కరు ఆయనపాదాలను తాకి నమస్కరించుకొని వెళిపోతున్నారు.  కొంతమందితో ఆ సాధువు మాట్లాడుతున్నారు. మరికొందరిని  వెళ్ళిపొమ్మని సైగలు చేస్తున్నారు.  తెచ్చిన  ప్రసాదాలను అక్కడక్కడా తీసుకొని ఎంగిలిచేస్తున్నారు, మరికొందరివి వారికే ఇచ్చేస్తున్నారు.

మా తాతగారి వంతు వచ్చింది.   అరటిపళ్ళు ఆయన ముందు ఉంచి పాదాలకు నమస్కరించి లేస్తుండగా “ఏరా బ్రహ్మం, నీకు సంతానం ఉందిలే…. ఆడసంతానం” అని పలికి తలతిప్పి మరో వైపుకు చూస్తూ ఉండిపోయారట.

ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు మా అమ్మ పుట్టింది.  నెలల బిడ్డను తిరిగి బాబాగారి వద్దకు తీసుకు వెళ్ళారట మా తాతయ్య, అమ్మమ్మలు.   ఎవరో తన ఒంటిపై కప్పిన శాలువాను బాబా గారు  పొత్తిలిగా చేసి  పసిగుడ్డుగా ఉన్న మా అమ్మను ఎత్తుకొన్నారట.  సపోటా పండును వలిచి తొనలు నోటిలో పెడితే మా అమ్మ చప్పరించిందట.  “ఏంపేరు పెట్టమంటారు బాబా” అని మా తాతగారు అడగ్గా ” అమ్మాజి అని పెట్టరా” అన్నారట. కప్పిన శాలువాను తిరిగి ఇచ్చేయబోతే పట్టుకొనిపొండి అని బాబాగారు సైగ చేసారట. ఆ తరువాత 1948 లో కొత్తలంక బాబాగారు స్వర్గస్తులైనారు. కొత్తలంకలో వారి సమాధి వద్ద దర్గా నిర్మించారు.

అలా మా అమ్మ పేరు అమ్మాజి. మా అమ్మకు తోబుట్టువులు లేరు.   మా అమ్మ జీవితాంతం ఒక వైపు హిందువుగా అన్ని పూజలు, పండగలు, వ్రతాలూ ఆచరిస్తూనే,  బాబాగారిని కూడా ఎంతో భక్తితో  పూజించేది. అందరి దేవుడిపటాల సరసనా కొత్తలంక బాబాగారి ఫొటో కూడా ఉండేది. మేం ఆరుగురుం సంతానం.  మా అన్నయ్యలు ముగ్గురికీ హిందూ పేర్లు పెట్టారు.  నాకు మాత్రం మా అమ్మ పట్టు పట్టి కొత్తలంక బాబా గారి పేరు పెట్టించింది.  నా పూర్తి పేరు బొల్లోజు అహ్మదలీబాబా.   మా అందరికీ పుట్టువెంట్రుకలు కొత్తలంక దర్గావద్దే తీయించారు.

నాకు బాగా చిన్నప్పుడు కొత్తలంక వెళ్లాలంటే యానాంలో పడవకట్టించుకొని ముమ్మిడివరం రేవులో దిగి, అక్కడనుంచి సుమారు 4 కిలోమీటర్లు కాలవగట్టుపై నడుచుకొంటూ వెళ్ళేవాళ్ళం.

***
బాబాగారు ఇచ్చిన శాలువాని ఒక చెక్క పెట్టెలో వెండిపళ్ళెంలో  ఉంచి పూజించేది మా అమ్మ.  మాకెవరికైనా జ్వరాలొచ్చినా, చదువులకనో, పనులమీదో పొరుగూర్లు వెళుతున్నప్పుడూ  బాబాగారి శాలువాని తీసి మా తలపై ఉంచి అంతా మంచి జరగాలని ప్రార్ధించేది.

ఏడాదికి రెండు మూడు సార్లు రోజంతా ఉపవాసం ఉండి, ఆ శాలువాను బయటకు తీసి, దాని ఎదురుగా కొవ్వత్తులు, అగరొత్తులు వెలిగించి, సెంటు, గంధం పూసి  “కొత్తలంక బాబా నిను కోరి భజింతును, నిను చేరి సేవింతును” అనే పాటను పాడుకొంటూ పూజచేసుకొనేది మా అమ్మ. అలాగని మా అమ్మ బేల కాదు. మాహె, కారైకాల్ లాంటి సుదూరప్రాంతాలకు బదిలీలకారణంగా మా నాన్నగారు    దాదాపు పన్నిండేళ్ళ పాటు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, బంధువుల సాయం అర్ధించకుండా ఆరుగురుసంతానం ఉన్న కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపించింది. పాలు అమ్మి, కోళ్ళను పెంచి కోడిగుడ్లు అమ్మి, పెరట్లో కూరగాయలు పెంచి సంసారం నడిపి ఆర్ధిక ఇబ్బందులు తప్పించేది.  ఆ లోపలిధైర్యమేదో బాబాగారి నుంచి పొందిందనుకొంటాను.

***
మా నాన్నగారి సంవత్సరీకాలు అయిపోయాకా “కొత్తలంక వెళ్ళాలని ఉంది నువ్వు తీసుకెళ్తావా” అని ఒకటి రెండు సార్లు అడిగింది నన్ను. అప్పటికి మా అమ్మ వయసు డబ్బై  సంవత్సరాలు. అప్పట్లో నేను ఏలేశ్వరంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని.  పరీక్షల హడావిడి తగ్గాక వస్తానే అని చెప్పాను. ఆ తరువాత  ఒక రోజు ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ గుండుతో ఉండటం చూసి ఆశ్చర్యపడి,  ఎప్పుడు వెళ్లావే దర్గాకు అని అడిగితే, “ఏమోరా నేను ఇక వెళ్లగలనో లేదో అని- దర్గా ఉన్నదిక్కుకు తిరిగి జుత్తు బాబాగారికి అర్పించేసుకొన్నాను” అన్నది.  ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే మా అమ్మ కూడా గతించిపోయింది. ఇది జరిగి పదిహేనేళ్లయినా నా జీవితంలో మిగుల్చుకొన్న పెద్ద వెలితి అది ఏనాటికీ.

నేను పదో తరగతి నుంచి కొత్తలంక దర్గాకు సొంతంగా వెళ్లటం మొదలు పెట్టాను. పడవపై యానాం గోదావరి  దాటి, ఎదుర్లంకలో బ్రాంచ్ సైకిల్ అద్దెకు తీసుకొని మురమళ్ళవరకూ తొక్కుకుంటూ వెళ్ళి అక్కడ దాన్ని  ఇచ్చేసి నడుచుకొంటూ కొత్తలంక వెళ్ళేవాడిని అప్పట్లో.

నేడు మా ఇంట్లో అందరి దేవుళ్లపటాలతో పాటు కొత్తలంక బాబాగారి పటంకూడా ఉంటుంది.  నేటికీ ఏటా రెండు మూడుసార్లు  కొత్తలంక దర్గాను దర్శించుకొంటాను సకుటుంబంగా. రకరకాల చిక్కుముళ్ళలో చిక్కుకున్నప్పుడు, పెద్దపనులు ఏమైనా తలపెట్టినపుడు దర్గావద్దకు వెళ్ళి ప్రార్ధించుకొని రెండుమూడుగంటలు కూర్చొని వస్తూంటాం.   మా పిల్లలిద్దరి పుట్టువెంట్రుకలు  కొత్తలంక బాబాగారి దర్గా వద్ద తీయించాము.  రెండో సారి కేశాలు  తిరుపతిలో ఇచ్చాం.

 


నేను డిగ్రీ చదివేటపుడు ఏ కల్మషమూ లేని ఒక మిత్రుడు   “ఒరేయ్ మీరు కొత్తలంక బాబాగారిని ఇంతగా ఆరాధిస్తారు.  మా తాతగారిది కోనసీమే. ఆయన బాబాగారి సమకాలీనుడు.  ఎప్పుడైనా బాబాగారు మా ఇంటి అరుగుమీద కూర్చుంటే వెళ్ళిపో ఇక్కడనుంచి అని విసుక్కొనేవారట ఆయన.  ఒక వ్యక్తిని కొందరు దైవంలా పూజించటం, మరికొందరు తృణీకరించటం ఎందుకు జరుగుతుందీ?” అని ప్రశ్నించాడు.  ఆ ప్రశ్నకు సరైన సమాధానం నావద్ద  అప్పుడూ లేదు ఇప్పుడూ లేదు.

చుట్టూ ఉన్న విశాలమైన గోదావరి కారణంగా  కోనసీమ ప్రధానస్రవంతి చరిత్రకు  కొంచెం ఎడంగానే ఉంది. అలాగని చరిత్రలేని సీమకాదు. అశోకుని పుత్రిక సంఘమిత్ర నిర్మింపచేసిన ఆదుర్రు బౌద్ధ క్షేత్రం ఘనమైన గతకీర్తికి చిహ్నం. షాజహాను ఆస్థానపండితుడైన జగన్నాధపండితరాయలు ఇక్కడివాడే. ఇతను షాజహాను కూతురు లవంగికను పెండ్లాడాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఎన్నోశతాబ్దాల క్రితం  గోదావరిపై పడవలలో  పెద్దమొత్తంలో ముస్లిం వ్యక్తులు వచ్చి ఇక్కడి ప్రజలలో కలిసిపోయి జీవించసాగారు అని చెపుతారు.  లాస్ట్ బ్రాహ్మిన్ పుస్తకంలో  ప్రధాన పాత్ర తన ముస్లిమ్ మిత్రుడిని సమాదరణతో చూస్తుంది.  దళిత యోగిపుంగవుడైన ముమ్మిడివరం బాలయోగీశ్వరుని, కొత్తలంకబాబాగారిని పూజించినట్లుగానే కులమతాలకు అతీతంగా ఆనాటి కోనసీమ వాసులు ఆరాధించారు.

నా మిత్రుడు అడిగిన ప్రశ్నకు  ఒక్కటి మాత్రం  చెప్పగలను.  పశుపక్ష్యాదుల్ని సమాదరించటం, మనుషుల బాధల్ని తొలగించటం లాంటి విషయాలలో కొత్తలంక బాబా గారు చూపిన మహిమలను ఈ ప్రాంత ప్రజలు కథలు కథలుగా చెప్పుకొంటారు.

ఈ సృష్టిలోని జీవరాశి అంతా ఒకటేనని, సాటిమనిషి పట్ల కరుణ కలిగి ఉండాలి అనే మౌలిక జీవన సూత్రాలను కొత్తలంక బాబాగారు ఈ ప్రాంతంలో సంచరిస్తూ అనుచరిస్తూ, వెళ్ళిపోతూ మనకు ఇచ్చిన దైవసందేశం అనుకొంటాను.

*

బొల్లోజు బాబా

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • బొల్లోజు బాబా గారి పై రచన లో నా జీవితం లోని ఓ ఘటన తో సారూప్యం ఉంది. మా అమ్మ తన 94 వ ఏట రెండేళ్ళ క్రితం మరణించింది.మా అమ్మకు కాశీ కి వెళ్ళిరావాలని ఓ కోరిక. అది తీరకుండానే అశువులు బాసింది. తనను కాశీ కి తీసుకెళ్ళమని అడిగితే, ఓసారి ఫ్లైట్ లో టికెట్లు బుక్ చేసాను. వాతావరణం అనుకూలించక టికెట్ లు కాన్సల్ చేసుకోవాల్సి వచ్చింది. అమ్మ కోరిక తీర్చలేకపోయానే అన్న బాధ ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. పాఠకుడు కథలో తన్ను తాను చూసుకోవడమే మంచి కథ లక్షణం.

 • Bolloju Baba garu,

  Thanks for this article, I am familiar with the name Kotta lanka Baba. I heard from my grand mother that my dad’s aunt use to go there. My husband’s family are devotees of Tajuddin baba and Khadar baba. It is good to read other family who honors sufis. Thank you for sharing

 • ఈ మత భేదాలు ఈ మధ్యన వచ్చినవే. మా ఊళ్లలో సంప్రదాయిక కుటుంబాలు కూడా దర్గాలకు వెళ్లడము, దర్గాలలో ఏటా జరిగే ఉత్సవాలకు (ఉర్స్) ధాన్యం పంపించడము, చందాలివ్వడము పరిపాటిగా ఉండేది.

  సూఫీ సాధువులు నివసించిన చోటుననో, జీవసమాధి చెందిన స్థలం లోనో దర్గాలు పూజాస్థలాలూగా వెలసినవి
  సున్నీలు వీనిని గుర్తించక పోయినా, మన దేశంలో ఈ భేదం కనుపించదు.

 • ముమ్మిడివరం బాలయోగి అందరికి తెలుసు. కొత్తలంక బాబాగారి గురించి ఇప్పుడే చదివాను . ఎంతో విశిష్ఠమైన , మహిమాన్వితులైనగురువు గురించి తెలిపినందుకు అంజలి.

 • తమ్ముడు , మా నాన్నగారి పుట్టుక కూడా బాబా గారి ఆశిషులేనని మా నాన్నమ్మ చెల్లి గోపమ్మ చెప్పేది .నాకుతెలిసి మన యానాం నుండి చాలామంది కొత్తలంక దర్గా దర్శనానికి వెళ్తుంటారు , నేను కూడా కొత్తలంక వెళ్తుంటా . గొప్ప సందర్భాన్ని రికార్డ్ చేసావ్ .అభినందనలు తమ్ముడు

 • జీవమున్న జ్ఞాపకాలను పంచుకున్నారు. చాలా బావుంది.

 • నమస్తే బాబా గారు…
  మా అమ్మమ్మ గారిది కొత్తలంకే…
  నాకు ఆ దర్గా తో చిన్నప్పటి నుండి అనుబంధం ఉంది
  నేను అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ప్రతిసారి అక్కడి కజిన్స్ తో దర్గాకు వెళ్తుండేదాన్ని..ఇప్పటికీ ఆ ఊరు వెళ్తే దర్గా చూడకుండా రాను…
  నాకు దర్గా లో కాసేపు గడపడం చాలా ఇష్టం.. ప్రశాంతతకు అది నిలయంగా అనిపిస్తుంది..
  మీ ఆర్టికల్ నా చిన్ననాటి జ్ఞాపకాలను , అమ్మమ్మ ను , అక్కడి నా స్నేహితులను గుర్తుచేసింది…

 • మతం మానవత్వం దిశగా నడుపుతుంది. ప్రతి మతం అదే చెబుతుంది కానీ కొందరు పక్కదారి పట్టేస్తారు సైన్స్ లాగానే…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు