కరాళ కాలంలో…కథ 2020

కథానిర్మాణం మీద, శిల్ప వైవిధ్యం మీద శ్రద్ధ తగ్గు తుందనిపిస్తుంది.

పుట్టీ పుట్టగానే కొవిడ్‌-19 నామకరణం చెయ్యబడిన ఒకానొక అణువంత సూక్ష్మజీవి మనకు బ్రహ్మాండమైన అనుభవం తెచ్చిపెట్టింది. మనిషి మనిషిని సమీపించటానికి కూడా బెదిరిపోయే స్థితిలోకి నెట్టి మానవ సంబంధాలను పునర్నిర్మించుకొమ్మంది. ఎనభై లక్షల జీవరాశుల్లో ఏ ఒక్క జీవికీ అపకారం చెయ్యకుండా అంతులేని ప్రాణభయం కలిగించి మానవ బలహీనతని బహిర్గతం చేసింది. స్వీయ కేంద్రమై సమస్తాన్నీ ధ్వంసం చేస్తున్న మానవాళికి ప్రకృతితో సహజీవన సారాంశం తెలియపరిచింది. ఈ తెలివిడి ప్రతిఫలనాలు 2020లో వచ్చిన  కథల్లో చాలా కనిపిస్తాయి.

*

ఇంతటి విషాణు సంక్షోభంలో సైతం రాజ్యవ్యవస్థ మేలుకోకుండా తన అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి బలమైన సామాజికవర్గాన్ని బలహీన సామాజికవర్గం మీదికి ఉసిగొల్పటం విచిత్రం. అంతా తనవైపు చూస్తుంటే నేరం నాది కాదని అటువైపు వేలు చూపిస్తుంది. అయితే, ‘మర్కజ్‌కి వెళ్లి వచ్చాక అందరి దృష్టిలో నేను యెవరినో అయిపోయాను,’ అనే వ్యక్తి వేదన చూపుడు వేలు (అఫ్సర్‌) ఎటువైపు తిప్పాలో చూపిస్తుంది.

‘కరోనా కాలం, కదలకురా మొగుడా అంటే విన్నావా,’ అంటుంది సహచరి. కానీ గోధుమపిండి కోసమో, కొబ్బరినూనె కోసమో బయటికి పోక తప్పదు. లారీÄదెబ్బలు తినకా తప్పదు. ఈ అవస్థని హాస్యవ్యంగ్యాలతో మిళాయించింది రాజువయ్యా మహరాజువయ్యా! (బమ్మిడి జగదీశ్వరరావు) కథ. మనిషి ఒంటరి ఖైదు ఎక్కువ కాలం భరించలేడని సారాంశం.

తెలుగువారికి తెలియని అస్సాం శివగంగ తేయాకు తోటల్లోకి తీసుకెళ్లి, కరోనా కష్టకాలంలో ఒకానొక కుటుంబ విషాదం గురించి, ఆపై కూలీల హక్కుల గురించి ఆలోచింపజేస్తుంది మళ్లీ తేయాకు తోటల్లోకి... (కుప్పిలి పద్మ) కథ.

లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులది నరకయాతన. సొంత ఊరికి తిరిగి వెళ్లటానికి వేల మైళ్లు నడవాల్సిన దుస్థితి. పగిలిన పాదాలు. బొబ్బలెత్తి  పుళ్లు పడిన పాదాలు. దారిలోనే రాలిపోయే ప్రాణాలు. అయినా ఊరికే పోవాలి (అద్దేపల్లి ప్రభు). ‘ధర్మరాజు వెంట శునకము వలె మన వెనక మరణము విడువకుండా వస్తున్నది.’

ఇది బాహ్య సంక్షోభం. ఈ కరాళకాలంలో మనిషి అంతస్సంక్షోభాన్ని ఆవిష్కరించింది గబ్బిలం (పాపినేని శివశంకర్‌). ఒంటరితనంలో జీవనభీతిని విడమరిచింది.

*

స్త్రీ పురుష సంబంధాల్ని విశ్లేషించిన అయిదు కథలు ఈ సంకలనంలో ఉన్నాయి.

ఇవాళ సాహిత్యరంగంలో సాహిత్యేతర విషయాలు కూడా ముందు కొస్తున్నాయి. అందులో రచయితలకి సాటి రయిత్రులతో లేదా పాఠక మహిళ లతో ఎలాంటి నెయ్యం ఉంటుందనేది ఒకటి. రచయితలు కూడా మనుషులే. బలహీనతలకి అతీతులు కారు. అయితే సమాజానికి ఏదో చెప్పేవాళ్లు ఎట్లా ఉండాలో కూడా తప్పక ఆలోచించుకోవాలని నా అభిప్రాయం. దీనిని బలపరిచే సున్నితమైన కథ నీలం మంట (మెహెర్‌). ‘ఏదో గుడ్డివాంఛ అక్షరాల వెనక తారాడే ఈ అమ్మాయి వైపు గుంజింది,’ అనుకొంటాడు రచయితగా ముఖ్యపాత్ర. ఆ గుడ్డివాంఛకు ప్రతీక నీలం మంట.

హాయిగా అల్లుకున్న పూలదండలైనా తెల్లారికి వాడిపోతాయి. అనుభూతులైనా అంతే. కాలం గడిచేకొద్దీ ‘యౌవన ప్రాదుర్భావవేళ’లోని ‘ఆ తాజాదనం, ఆ అమాయకత్వం, ఆ సున్నితం- అవన్నీ ఏవీ, ఏమైపోయాయి,’ అనే వగపు మిగులుతుంది. అదే నిన్నటి మల్లెదండ (వాడ్రేవు వీరలక్ష్మీ దేవి).

పౌరాణిక పునర్‌ వ్యాఖ్యాన కథలు చాలానే వచ్చాయి. అయితే పౌరాణిక కల్పనలు వేరు. ఊర్మిళాదేవి నిద్ర పాత జానపద కల్పన. దానికి మారుగా కచ్చప సీత (తల్లావజఝల పతంజలిశాస్త్రి) మరో కల్పన. ‘కాలాన్నీ చైతన్యాన్నీ తన అధీనంలో ఉంచుకొనే’ కచ్చపం (తాబేలు) తనలోకి తాను ముడుచుకొనే తీరులో భర్త దూరమైన ఊర్మిళకు ఉపశమనం కలిగిస్తుంది.

‘ఎంత కరువైతే మాత్రం ఆడమనిషి మనిషి గాకుండా పోతుందా?’ అంటూ అనుబంధాల్ని శాసించే ఆర్థిక పరిస్థితుల గూర్చి ఆలోచింపజేస్తాయి అప్పగింతలు (డా|| కే.వి. రమణరావు). ఇక చిన్నపిల్లాడి వైపు నుంచి చూస్తూ (సభ్యత చెడకుండా) భర్త వల్ల సంక్రమించిన సుఖవ్యాధి కంటే ఎక్కువ బాధించే మగతనపు దురహంకారం గురించి ఎరుక కలిగిస్తుంది ఆపా (మహమ్మద్‌ ఖదీర్‌బాబు).

ఇట్లా ఉంటే, ఇచ్చోటనే (రిషి శ్రీనివాస్‌) దేశీయ వ్యాపార (మార్కెటింగ్‌) ప్రపంచాన్ని ప్రదర్శిస్తే, సెకండ్‌ ఛాన్స్‌ (సి. మృణాళిని) అమెరికాలోని వ్యాపార ప్రపంచాన్ని పరిచయం చేసింది. నేరానికి శిక్ష అనుభవించినాక పశ్చాత్తాపంతో మంచి దారిలో నడవటానికి రెండో అవకాశం ఇచ్చే సామాజిక ధోరణి ఆ దేశంలో ఉందని తెలుస్తుంది. అదే సమయంలో మన దేశంలో, ‘నా మాటల్ని (చేతల్ని) వక్రీకరించారు,’ అనే తెగింపు తప్ప పశ్చాత్తాపమే కనపడకపోవటం గమనార్హం.

రచయితల ప్రత్యక్ష జోక్యం లేని, పాత్రలమీద ‘దాడి’ లేని మేలైన కథలివి. కాగా కథాశీర్షికల్లో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులుంటాయి. నీలం మంట, నిన్నటి మల్లెదండ, కచ్చప సీత, చూపుడు వేలు, గబ్బిలం- ఇవన్నీ సూచ్యార్థ సూచన గల శీర్షికలు.

ఆడ-మగ (లైంగిక) సంబంధాల మీద, సబంధాల విచ్చిన్నత మీద విరివిగా వస్తున్నాయి కథలు. బ్రతుకులో ఎదురయ్యే చిన్నచిన్న సన్నివేశాలు కూడా వస్తువులవుతున్నాయి. సామూహికత్వం కన్న వైయక్తికత్వం ప్రాధాన్యం వహిస్తుంది. ప్రత్యేకించి కథానిర్మాణం మీద, శిల్ప వైవిధ్యం మీద శ్రద్ధ తగ్గు తుందనిపిస్తుంది. దృశ్య, సామాజిక మాధ్యమాల ద్వారా సంక్రమించిన విశృంఖలత కూడా తరచుగా కనిపిస్తుంది. అక్కడక్కడ రచయితలు నిస్సం కోచంగా వాడుతున్న లైంగిక పరిభాష/బూతులు సభ్యత హద్దు మీరుతున్నా యని చెప్పక తప్పదు. సాహిత్యలోకం జాగ్రత్త పడాల్సిన సందర్భం.

గుంటూరు, 18 డిసెంబర్‌ 2021

పాపినేని శివశంకర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • >> పుట్టీ పుట్టగానే కొవిడ్‌-19 నామకరణం చెయ్యబడిన…

    ఇది నిజం కాదు. 2019 డిసెంబర్ కి ముందు దాదాపు రెండు మూడు నెలల ముందు నుండి ఇది పుట్టి పెరుగుతున్నట్టు గుర్తించారు. అయితే ఏ పేరు పెట్టాలా అనేదానికి మల్లగుల్లాలు పడ్డారు(ట). మరీ స్పానిష్ ఫ్లూ అన్నట్టు పెడితే ఎవరి “మనోభావాలు” దెబ్బతింటాయో, ఏ దేశంలో ఎవరికి కోపతాపాలు వస్తాయో అని ఆలోచించి దాదాపు 2020 జనవరిలో ఈ నామకరణ మహోత్సవం జరిపించారు. ఇది గూగిల్ వారి భోగట్టా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు