“కనీసం వాళ్లకైనా ఈ కథ అర్థం అయింది”

ది లాటరీ/The Lottery [1948]

షర్లీ జాక్‌సన్/Shirley Jackson [14.12.1916 – 08.08.1965]

తొలి ప్రచురణ: ది న్యూ యార్కర్ పత్రిక, 26 జూన్ 1948

*

ది న్యూ యార్కర్ పత్రికకి మంచికథలను ప్రచురించే పత్రికగా మొదటినుంచీ పేరుంది. అలాగే, ఆ పత్రిక ప్రచురించిన కథలు అడపాదడపా సంచలనాలు కూడా రేకెత్తించాయి. ఆ కథలు రేపిన దుమారాల్లో ‘ది లాటరీ’ మొట్టమొదటిది. అ రెండో దుమారం (‘Cat Person’, 2017) రేగడానికి మరో డెబ్బై ఏళ్లు పట్టింది. 1948 జూన్‌లో ఒకే ఒక్కరోజున, ఏకబిగిన ఓ రెండుమూడు గంటల్లో ఈ కథని రాసిన షర్లీ జాక్‌సన్ మరుసటిరోజు ఫెయిర్ కాపీ చేసి తన ఏజెంట్‌కి పంపడం, ఆవిడ దాన్ని న్యూ యార్కర్‌కి పంపడం అన్నీ చకచకా జరిగిపోయాయి. కథ మీద ఏజెంట్ ఏదైనా అభిప్రాయం చెబుతుందేమో అని కదిపి చూసారట షర్లీ జాక్‌సన్. “నా పని కథని అమ్మడమే కానీ, చదవడం కాదు,” అని అటునించి నిర్మొహమాటమైన సమాధానం వచ్చింది! ఆ తర్వాత కొద్దిరోజులకే, న్యూ యార్కర్ పత్రిక ఫిక్షన్ ఎడిటర్ నుంచి ఫోన్ వచ్చింది. కథ పట్ల ఆయనకీ పెద్ద అభిప్రాయం లేదని అర్థమవుతూనే ఉంది కానీ, ఆ కథని వాళ్లు ప్రచురించబోతున్నట్టు చెప్పారు. అయితే, ఒక్క మార్పు మాత్రం చేస్తామన్నారు. కథ ప్రారంభంలో జాక్‌సన్ ప్రస్తావించిన తారీకు కాకుండా, పత్రిక సంచిక తేదీతో మాచ్ అయ్యేట్టుగా ఆ తారీకుని మారుస్తామన్నారు. షర్లీ జాక్‌సన్ సరే అన్నారు. తర్వాత సందేహిస్తూనే ఆ ఫిక్షన్ ఎడిటర్ ఒక ప్రశ్న అడిగారు- ‘ఈ కథకి ప్రత్యేకమైన తాత్పర్యం ఏదైనా ఉందా,’ అని. ఎందుకంటే ఆ పత్రిక ఎడిటర్ (హెరాల్డ్ రాస్) కి కథ అర్థం అయ్యీ కానట్టుగా ఉందట. అందుకని కథని కొంచెం మారుస్తారా అని అడిగాడు. నో అన్నారు జాక్‌సన్. ‘అదికాదు, ఈ కథ అందరికీ అర్థం కాకపోవచ్చు కదా, అలాంటి పాఠకులు ఫోన్ చేసినా, ఉత్తరాలు రాసినా వాళ్లకి చెప్పవలసిన మాటలుగా ఏమైనా మీరు చెప్పగలరా,’ అని మిస్టర్ రాస్ కనుక్కోమన్నారు అన్నాడు ఆ ఫిక్షన్ ఎడిటర్. మళ్లీ నో అన్నారు జాక్‌సన్! ఆ విధంగా ఈ కథ ఒకే ఒక్క మార్పుతో 26 జూన్ 1948 సంచికలో ప్రచురించబడింది.

ప్రచురించాక, ఈ కథ కలిగించిన సంచలనం అంతా యింతా కాదు. పత్రిక ఆఫీస్‌కి వందలాది ఉత్తరాలు, ఫోన్ కాల్స్, చందాలు రద్దు చేసుకుంటామని బెదిరింపులు. ఆ ఉత్తరాలన్నీ జాక్‌సన్‌కి బట్వాడా చేయబడ్డాయి. విమర్శించేవాళ్లూ, నిందించేవాళ్లూ, తప్పుబట్టేవాళ్లూ – అన్ని రకాలవాళ్లూ ఉన్నారు. కథని మెచ్చుకుంటూ రాసినవాళ్లు లేకపోలేదు కానీ, వాళ్లకి కథ అర్థం అయిన విధానం పట్ల రచయిత్రికి అంతగా సంతృప్తి ఉన్నట్టు కనిపించదు.

ఆ తర్వాత ఈ కథ అనేక సంకలనాల్లో చోటు సంపాదించుకుంది. ఈ కథని అమెరికన్ స్కూళ్లల్లో చాలా ఏళ్ల పాటు సిలబస్‌లో ఉంచారు (ప్రస్తుతం ఉందో లేదో తెలీదు). ఒక్క సౌత్ ఆఫ్రికా మాత్రం ఈ కథని పాఠ్యపుస్తకాలలోకి చేర్చడానికి నిరాకరించారట. ఆ విషయం విన్న షర్లీ జాక్‌సన్ “కనీసం వాళ్లకైనా ఈ కథ అర్థం అయింది,” అన్నారట!

మామూలుగా కథల్లో మనం చూసే exposition, rising action, climax, falling action, resolution లాంటి భాగాలు విడివిడిగా ఈ కథలో మనకి కనిపించవు. సాధారణమైన పాత్రలు, తటస్థమైన కథనం – యిలా సాగుతుంది. చివరికి ఈ కథలో ఒక ప్రొటాగనిస్ట్ కూడా లేరు. మరయితే, ఏమిటి ఈ కథలో ఉన్న ఆ ప్రత్యేకత, ఆ సంచలనం? అది తెలుసుకోవాలంటే ముందు కథని చదవాలి. దానికి రెండు పద్ధతులున్నాయి:

 • ఒకటి – కథని యథాతథంగా ఇంగ్లీష్‌లో చదవడం. ఇది ఉత్తమమైన పద్ధతి.

లింక్:https://www.newyorker.com/magazine/1948/06/26/the-lottery[/su_permalink]

 • రెండు – కథని తెలుగులో చదవడం. ఈ వ్యాసం చదివేవారి సౌకర్యార్థం అనువాదం నేనే చేసాను- అనువాద అనుభవం ఇప్పటివరకూ లేకపోయినా. చాలావరకు స్వేచ్ఛానువాదం, అక్కడక్కడా యథాతథానువాదం. ఇది అత్యద్భుతమైన అనువాదం అని చెప్పను కానీ, ఈ వ్యాసంలో ఉదహరించే విశేషాలన్నీ అనువాదపు పాఠంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ అనువాదం ఇక్కడ చదువుకోవచ్చు: 01 The Lottery (Shirley Jackson) Translation

పై లింక్స్ లో ఏదో ఒక చోట కథని చదివేసి, ఆ తర్వాత మాత్రమే ఈ మిగతా వ్యాసాన్ని చదవండి!

కథాభీభత్సం

The less there is to justify a traditional custom, the harder it is to get rid of it.

 • Mark Twain

ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మొదలైన కథ, ఎవరో లాటరీ గెలవబోతున్నారన్నట్టుగా మొదలై, చాలా మామూలుగా అతి సాధారణంగా నడుస్తూ, చివరికి ఒక షాక్ కలిగిస్తూ ముగుస్తుంది. జరుగుతున్నది కనిపిస్తున్న విషయం కాకుండా మరేదో కావడం కథలోని ఐరనీ. కథ ఆహ్లాదకరమైన వాతావరణంలో మొదలై, అనూహ్యకరమైన పరిణామంతో ముగియడం మరో ఐరనీ అయితే, చాలా మామూలు కంఠస్వరంతో సాగే కథ, హఠాత్తుగా ఉలిక్కిపడేలా చేసి నైతికతల మీద ప్రశ్నలని సంధించడం ఇంకో ఐరనీ. బిల్ హచిన్‌సన్ చేతిలో నల్లచుక్క ఉన్న చీటీ ఉందని కథలో తెలిసాక, ‘ఇది న్యాయం కాదు’ అని ఆవిడ అరిచాక, అప్పుడు మాత్రమే పాఠకుడికి మొదటిసారిగా అర్థం అవుతుంది- మామూలుగా బహుమతులు ఇచ్చే లాటరీ కాదు ఇది అని. కానీ, మరేమిటో అప్పటికి మనకి ఇంకా తెలియదు. చివరికి, ఈ లాటరీ గెలుపుని అందించేది కాదు, మరణాన్ని లిఖించేదీ అంటూ భీభత్సరసాన్ని చిమ్ముతుంది. ఈ గ్రామస్తులు ఎన్నుకునేదేమీ ఉండదు; ఎంపిక కాబడటం తప్ప. ఎంచుకునేదీ ఏదీ లేదు, చావుని తప్ప. అదీ కథలోని విషాదం.

వ్యక్తిగత స్థాయిలో ప్రేమని పంచగల శక్తి ఉన్న మనిషి, సమూహంతో ఉన్నప్పుడు విచక్షణ కోల్పోయి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. మనుషుల్లో అంతర్గతంగా దాగివుండే హింసాప్రవృత్తిని ఈ కథ చూపిస్తుంది. మనిషి సంఘజీవి అనే హోదాని సంపాదించడానికి కొంత మూల్యం చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. చివరికి సమాజాన్ని కట్టిపడేసి ఉంచేవి ఒక భయమూ, సామూహిక హింసా తప్పించి ప్రేమ, కరుణా కావా?

ఒక వ్యక్తికి ఉండే చైతన్యపు స్పృహ కన్నా ఒక గుంపుకి ఉండే చైతన్యస్పృహా, విచక్షణా తక్కువ. ఇక్కడ టెస్సీకి జరిగినదాన్ని ఒక వ్యక్తి చేస్తే దాన్ని హత్య అంటారు. అదే ఒక సమూహం చేస్తే దాన్ని ఆచారం అంటున్నారు. ఇవాళ్టి సమాజాల్లో సరీగ్గా ఇలాంటివే జరుగుతున్నాయని చెప్పలేం కానీ, మనిషికి సంఘజీవిగా ఉండవలసిన అవసరమూ, ఆ సంఘానికి ఆచారాల పట్ల విశ్వాసమూ ఉన్నంతకాలం ఇలాంటివి జరగవూ అని కచ్చితంగా చెప్పలేం. హింస కన్నా హింస జరగవచ్చునన్న భయం మరింత హింసకి దారితీయడం అనేది ఒక విషాదం.

కథలోని మరో కోణం మనుషుల్లోని దంద్వ ప్రవృత్తి. మార్పు కోరుతున్నట్టు కనిపించేవారే, అవకాశం దొరికినప్పుడు అవన్నీ మరిచిపోయి తన మామూలు స్థితికన్నా కూడా దిగజారిపోయి ప్రవర్తించడం ఈ కథలో చూడవచ్చు. ఈ లాటరీ మిగతా గ్రామాల్లో ఆపేస్తున్నారు అని వాదించిన మిస్టర్ ఆడమ్స్, రాళ్లు విసిరే సమయానికి అందరికంటే ముందుంటాడు. టెస్సీ హచిన్‌సన్‌కి బాగా తెలిసిన మహిళ మిసెస్ డెలక్రాయ్. అసలు టెస్సీ ఈ సమావేశానికి రాగానే మొట్టమొదటగా మిసెస్ డెలక్రాయ్ తోటే మాట్లాడుతుంది. ఈ లాటరీ అన్యాయం అని టెస్సీ ప్రతిఘటిస్తున్నప్పుడు- “Be a good sport, Tessie,” అని ఊరుకోబెట్టే అన్యాయపు ప్రయత్నం చేసేది ఈవిడే. రాళ్లు విసిరే సమయం ఆసన్నమైనప్పుడు, తన శక్తికి మించిన పెద్దరాయిని రెండు చేతులతోనూ తీసుకునేదీ ఈవిడే. పైకి మామూలుగా, స్నేహపూర్వకంగా ఉన్నా లోపల్లోపల అందరికంటే పెద్దరాయిని తీసుకొని విసరాలన్న పైశాచికత ఈ మహిళలో కనిపిస్తుంది.

టెస్సీని రాళ్లతో కొట్టి చంపింది ఎవరు? మామూలు మనుషులు. సరదాగా, మంచిగా ఉండే సాటి గ్రామస్తులు. కానీ అలాంటివాళ్లే, ఆచారాల పేరిట హింసాత్మక క్రూరత్వంలోకి సైతం దిగిపోగలరు. మనుషుల్లో చెడ్డతనం ఉంటుందని చెప్పిన మొదటి రచయిత/త్రి షర్లీ జాక్‌సన్ కాకపోవచ్చు. కానీ, కనిపించే ఒక సాధారణ విషయం అసాధారణ సత్యంగా ఎలా మారగలదో చూపించారు. ఈ ప్రపంచం గురించి ఆవిడ పరిశీలనని మన కథానుభవంగా మార్చగలిగారు. ఒక కొత్తప్రపంచంలోకి పాఠకుడిని తోసేసి, ‘నువ్వు మామూలుగా ఉంటుందనుకుంటున్న ప్రపంచం ఇలా కూడా ఉంటుంది, చూడు,’ అని తెలియజెప్పారు.

ఈ లాటరీ ఉద్దేశం ఏమిటి? జనాభా నియంత్రణా? సంవత్సరానికి ఒకరు మరణించడవల్ల అలా జరిగే అవకాశమే లేదు. జనాలకి ఉద్వేగభరితమైన వినోదం కలగజేయడమా? రాళ్లతో కొట్టి చంపడం ఎవరికైనా ఇష్టం ఉంటుందని అనుకోలేం. ఈ లాటరీకి ఏ కారణమూ లేదు- ఒక్క ఆచారం అనే ముసుగు తప్ప. ఈ కథలో విక్టిమ్ ఎంపిక గుడ్డి ఎంపిక. చంపడం వెనక ద్వేషమూ లేదు, ఒక నిరసనా లేదు. చనిపోయాక దుఃఖమూ లేదు. ముగింపు చెప్పని నీతికథ లాంటి ఈ కథని అనేక సందర్భాలకి అనువర్తింపజేయవచ్చు. బహుశా, నాగరికత అభివృద్ధి చెందిన సమాజాలలో కూడా కొద్దిమందిని బాధించడం ద్వారా చాలామంది సుఖంగా ఉంటారన్న ఎరుక స్థిరపడిపోయిందేమో! అందుకే ఈ బలిపశువులూ, బీద దేశాలూ, బీద జనాలూ, లింగ వివక్ష అలా కొనసాగుతూనే ఉన్నాయి. పీడకులు, పీడితులు అనే వర్గాలను సృష్టించగలిగిన లాటరీలు సందర్భానికి తగినట్టు రూపాలు మార్చుకుని చెలామణి అవుతూ వుంటాయి.

పితృస్వామ్యం ఎన్నిరకాలుగా విస్తరించుకుని ఉంటుందో కథలో కనిపిస్తుంది. తల్లి మాట వినని కొడుకు, తండ్రి అరిస్తే కిక్కురుమనకుండా వస్తాడు. మగవాళ్లు లాటరీని ‘నిర్వహిస్తారు’! పిల్లలులేని స్త్రీ ‘గయ్యాళి’. అదే మగవాడయితే అతని మీద జాలి. కథలో అలాంటి మగవాడు సమ్మర్స్ పైగా మర్యాదస్తుడు కూడా!

ఒక ప్రాణాన్ని బలి ఇవ్వడం అన్న సంప్రదాయం మనుషుల్ని క్రూరంగా తయారుచేయలేదు. క్రూరత్వం అనే సన్నటి ముసుగు ఆ గ్రామస్తులు వేసుకుని ఉన్నారు కాబట్టే ఆ సంప్రదాయం సజీవంగా కొనసాగుతోంది. మొదట్నుంచీ కూడా ప్రేమపూర్వక సంబంధాలు ఉన్న సమాజంలాగా ఈ ఊరు కనిపించదు. మిసెస్ డెలక్రాయ్ చేతిని తట్టి టెస్సీ ముందుకు వెళుతున్నప్పుడు – ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే అవకాశం బహుశా ఒక గంట తర్వాత ఉండకపోవచ్చు (లాటరీ ముగిసాక విక్టిమ్ ఈ ఇద్దరిలో ఒకరు కాగల అవకాశం ఉంది) అని తెలిసికూడా – ఎలాంటి ఉద్వేగాన్నీ ప్రదర్శించరు. లాటరీలు వదిలేయాలి అన్నట్టు మాట్లాడిన స్టీవ్ ఆడమ్స్ రాళ్లు విసిరే సమయానికి అందరికంటే ముందుంటాడు. టెస్సీ ప్రవర్తన కూడా కుటుంబప్రేమ అన్నది ఒక మిథ్య అని నిరూపిస్తున్నట్టు ఉంటుంది. హచిన్‌సన్ కుటుంబం మొదటి రౌండ్‌లో ఎంపిక కాబడినప్పుడు, బతకాలనే ఆశ టెస్సీని ఎంత అధమస్థాయికి తీసుకుని వెళ్తుందంటే, తరువాతి రౌండ్‌లో తను ఎంపిక కాకుండా ఉండే అవకాశం మెరుగుపరుచుకోవడానికి, ఆ రౌండ్‌లోకి తన కూతుర్నీ అల్లుడ్నీ కూడా లాగుదామని ప్రయత్నించేటంతగా. “ఇది న్యాయం కాదు,” అంటుంది- ఎంపికయింది తమ కుటుంబం కాబట్టి. బిల్ కూడా “విచారంగా” అంగీకరిస్తాడు- ఫైనల్ రౌండ్‌లో తనుకూడా ఎంపికయ్యే అవకాశం ఉంది కాబట్టి. చివరికి ఆ కుటుంబంలోని పిల్లలు – బిల్ జూనియర్, నాన్సీ – కూడా కుటుంబం పట్ల ఎలాంటి ఆరాటమూ లేకుండా సొంత స్వార్థంతో ప్రవర్తిస్తారు.

ఈ కథ నచ్చని పాఠకులలో కొంతమంది అసలు ఇలాంటి లాటరీ ఎక్కడ జరుగుతోందో చెప్పండి, మేం కూడా వెళ్లిచూస్తాం అని వెటకారంగా అన్నారట. సరీగ్గా, అలాంటి కొంతమందిని ఉద్దేశించి రాసిన కథే ఇది. ఉదాహరణకి అస్తవ్యస్తమయిన కుటుంబాలకి పంచాయితీలు నిర్వహించే ఇప్పటి టీవీ కార్యక్రమాలు తీసుకుందాం. గతితప్పిన వాళ్ల జీవితాలని సరిదిద్దాలనే సదుద్దేశమే ఆయా టీవీ చానెళ్ల వారికి ఉంటే, ఆ పనిని బహిరంగంగా చేయాల్సిన అవసరం లేదే!? అంటే, అలాంటి వేదనలని చూసి ఆనందించే ప్రేక్షకులు ఉంటారన్న విషయం టీవీ వారికి తెలుసన్నమాట. నేరాలు-ఘోరాలు లాంటి వాటిని ప్రోగ్రాముల ద్వారా ప్రేక్షకులకి చేరవేయడం ద్వారా ఏ సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఏ న్యూస్ పేపర్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ చూసినా- నేరాలు, అవినీతి కలాపాలూ, అక్రమ సంబంధాలూ, ఆత్మహత్యలూ. వీటన్నింటినీ సొమ్ము చేసుకునే పత్రికలూ, టీవీ చానెళ్లూ ఉన్నాయంటే, వాటిని పోషించే పాఠకులూ, శ్రోతలూ ఉన్నట్టేగా!? ఈమధ్యన వింటున్న లించింగ్ మాటేమిటి? నాలుగు మామిడికాయల దొంగతనం ఆరోపణ మీద ఒక మనిషిని చంపేయడం ఏమిటి? ఇవన్నీ చూస్తుంటే ఈ కథారచయిత్రి డెబ్భై యేళ్ల క్రితమే భవిష్యత్తులో చాలా ముందుకి తొంగిచూసి ఈ కథని రాసినట్టుగా అనిపిస్తుంది. లేదూ, మానవ ప్రవృత్తి ఆనాడూ ఈనాడూ మౌలికంగా ఒకే రకంగా ఉండటం వల్ల ఈ కథకి ఇంకా ప్రాసంగికత మిగిలివుంది.

 

కథలోని శిల్పం

నల్లపెట్టె ఒక ప్రతీక. అది మాసిపోయి విరిగిపోయి ఉన్నా దాన్నే పట్టుకుని వేలాడటం అనేది మనుషులు మారడానికి సిద్ధంగా లేరు అని తెలియజేస్తుంది. పేర్ల విషయంలో కూడా ఈ ప్రతీకాత్మకతని రచయిత్రి పాటిస్తారు. సమ్మర్స్ అనే పేరు వేసవి తాలూకు ఆహ్లాదాన్నీ, గ్రేవ్స్ అనే పేరు జరగబోయే సంఘటనలోని తీవ్రత/ట్రాజెడీని, డెలక్రాయ్ అనే పేరు (ఫ్రెంచ్‌లో) శిలువనీ సూచిస్తాయి. ఆడమ్స్ పేరు, మొట్టమొదటి మానవుడిలాగా ఒక పెనుమార్పుకి ప్రారంభం కాబోతున్నదన్న భ్రమ కలిగించి (లాటరీలు వేరే ఊళ్లల్లో నిషేధిస్తున్నారట అని చెప్పేది ఈ పాత్రే), చివరికి రాళ్లు విసరడానికి అందరికంటే ముందు నిలుచుని దానికి ఆద్యుడయ్యాడు.

కథకుడి స్వరాన్ని (tone) గమనిస్తే, ఆ ప్రథమ పురుష కథనం చాలా తటస్థంగా, ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది. పాత్రల ఉద్వేగాలు, వర్ణనలు, అంతరంగాలు, సంఘర్షణలూ రేఖామాత్రంగా చూపటమే తప్పించి వాటిపై ఎలాంటి వ్యాఖ్యానమూ ఉండదు. గాఢత ఉన్న కథాంశానికి, గాఢత ఉండే కంఠస్వరం ఉండి తీరాలని రచయిత్రి భావించలేదు. ఇలాంటి అభావమైన తటస్థ కథనం వల్ల, చివర్లో జరిగే అరాచకమైన సంఘటన అనంతమైన వైరుధ్యంతో కుదిపేసి పాఠకులని ఒక్కసారిగా షాక్ చేస్తుంది.

కథాసంవిధానం చాలా మామూలుగా, కొంతమందికి అస్సలు ఆసక్తి కలిగించని విధంగా ఉంటుంది. సంఘర్షణ అనేది కథ ఎంతసేపు నడుస్తున్నా ఎదురుకాదు. కనిపించే శక్తుల మధ్య ఘర్షణో, నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితో, మంచీచెడుల్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సిన అగత్యమో- ఇలాంటివి కనిపించవు. మానవ ప్రయత్నం, పోరాటం కనిపించవు. జీవించడమో లేక మరణించడమో కేవలం కథలో కేవలం కాకతాళీయం మాత్రమే. మరణించబోయే ఆ దురదృష్టవంతుడు/రాలు ఎవరు అన్న సస్పెన్స్ కూడా, పాత్రల స్వరూప స్వభావాలు కథలో ఎక్కడా చెప్పకపోవడం వల్ల, ఆ పాత్రలపట్ల పాఠకుడికి ఎలాంటి సహానుభూతి స్థిరపడకపోవడం వల్ల పెద్దగా ఆందోళన రేకెత్తించదు. అలాంటి ఫ్లాట్‌నెస్ వల్లనే, చెప్పదలచుకున్నది మరింత సూటిగా చదువరిని తాకుతుంది. ఈ కథలోని ముగింపు విభ్రాంతికరంగా ఉండాలంటే, ముగింపుకి ముందు ఉన్న కథంతా నమ్మశక్యంగానూ, వాస్తవికంగానూ, సున్నితంగానూ, మామూలు రోజూవారీ వ్యవహారంలానూ ఉండాలి. అప్పుడే ఆ భీభత్సపు ముగింపు విభ్రమని కలిగిస్తుంది.

 

కథ నేపథ్యం

ఈ కథ ఎప్పుడు జరిగిందీ ఎక్కడ జరిగిందీ అన్న విషయమై కథలో ఆధారాలు లేవు (తను ఉంటున్న నార్త్ బెన్నింగ్‌టన్ ఊరి నేపథ్యాన్నే కథ రాసేటప్పుడు తన దృష్టిలో పెట్టుకున్నానని షర్లీ జాక్‌సన్ తర్వాత చెప్పారు). స్థలకాలాలని పూరించకుండా వదిలేయడంతో ఈ కథ ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చునన్న సూచన ఉంది. ఈ కథ ప్రచురింపబడింది 1948లో. రెండో ప్రపంచ యుద్ధం తాలూకు భీభత్సం (హోలోకాస్ట్, ఆటమ్ బాంబ్స్) తర్వాత కోలుకుంటున్న సమయం. శ్రేయస్సు అనే నెపంతో సమాజంలో మూకుమ్మడి ఊచకోతలు కూడా జరగగలవని హోలోకాస్ట్ స్పష్టం చేయగా, విచక్షణారహితమైన వినాశనానికి కూడా సభ్యసమాజాలు ఒడిగట్టగలవని హిరోషిమా, నాగసాకి బాంబుల ఉదంతాలు స్పష్టం చేసాయి. ఈ సంఘటనల పట్ల విముఖతని ఈ కథ పరోక్షంగా ప్రకటించింది. నలభైయ్యవ దశకం చివర్లో అమెరికాలోని కమ్యూనిస్ట్ల మీద మొదలైన ఏరివేత కార్యక్రమం తాలూకు ప్రభావం కూడా ఈ కథ మీద ఉండివుండవచ్చు. 1947లో కమ్యూనిస్ట్స్‌గా అనుమానిస్తూ 300 పేర్లతో ఒక హాలీవుడ్ బ్లాక్‌లిస్ట్ తయారుచేసింది ఆ ప్రభుత్వం. రింగ్ లార్డ్నెర్, చార్లీ చాప్లిన్, లీ గ్రాంట్, ఆర్థర్ మిల్లర్‌లాంటి వాళ్లంతా ఆ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చబడ్డారు (చూ. హాలీవుడ్ బ్లాక్‌లిస్ట్, వికీపీడియా).

ఈ కథ ఏ రోజున జరిగిందనే ఒక్క విషయం మాత్రం కథలో చెప్పబడింది. అది జూన్ 27. ఉత్తరాయణం (జూన్ 21)కి సమీపంలో ఉన్న తేదీ. ఆ రోజుల్లో ఇలాంటి బలులు ఇవ్వడం క్షేమకరం అన్న ఆదిమజాతి మూఢనమ్మకాల దృష్ట్యా ఈ తేదీకి ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, ఇటు ఉత్తరాయణానికీ (జూన్ 21), అటు అమెరికన్ స్వాతంత్ర్య దినానికీ (జులై 4) సరీగ్గా మధ్యలో ఉన్న రోజు. అంటే, అటు మూఢనమ్మకాలకీ, ఇటు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకీ మధ్యన ఉన్న రోజు!

 

కథ గురించి మరిన్ని పరిశీలనలు:

హింసలో జెండర్ పాత్ర

పెద్దవాళ్లలో ఏ మగపాత్ర కూడా రాళ్లు పట్టుకున్నట్టు కథలో చూపించలేదు. ఇద్దరు ఆడవాళ్లు రాళ్లు పట్టుకున్నారు. మగపిల్లలు కూడా రాళ్లు పట్టుకున్నారు, కానీ ఆడపిల్లలు దూరంగా ఉంచేయబడ్డారు. ఆలోచిస్తే, పితృస్వామ్య వ్యవస్థలో ఈ బలికార్యక్రమాన్ని మొదలుపెట్టేది మగవాళ్లు. ఎందుకు? పంటలు బాగా పండాలి కాబట్టి. ఇక మిగిలిన తతంగం స్త్రీలు చేయాలి. ఈ ‘పండటం’ అనేది స్త్రీ (మాతృ) స్వాభావిక కార్యక్రమం కాబట్టి ఇక స్త్రీలు పూనుకొని, బలికి సంబంధించిన పూజలు, పునస్కారాలు, ఇతర కార్యక్రమాలూ (ఈ కథలో లాగా రాళ్లతో కొట్టడం కూడా) నిర్వహించాలి. అందుకే ఈ రక్తం చిందే కార్యక్రమంలో స్త్రీలకీ, తెలిసీతెలియని పిల్లలకీ ఉన్నంత ఉత్సాహం మగవాళ్లకి ఉండదు. రాళ్లగుట్టల్ని కాపాడుకుంటూ మగపిల్లలు, ఆడపిల్లల్ని అసలు ఆ ఛాయలకే రానివ్వలేదు. గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇప్పటి మగపిల్లల చైల్డిష్ ఉత్సాహం కొన్నేళ్లయ్యాక వాళ్ల నాన్నల అభావం కింద మారుతుంది. ఇప్పుడు అమాయకంగా ఒక పక్క నిలుచుని ఉన్న అమ్మాయిల నిశ్శబ్దం కొన్నేళ్లకి వాళ్ల వాళ్ల అమ్మల హింసాత్మక ప్రవృత్తిలాగా మారుతుంది.

మూఢనమ్మకాల పునాదులు

పంటలు పండించడం అంటే పురాతన సంస్కృతుల్లో ఒక జీవనచక్రం లాంటింది. దురదృష్టవశాత్తూ, అది చావుతో మొదలవుతుంది. ఒక విత్తనాన్ని భూమిలో ‘నాటడం’ అలాంటిదే. బహుశా అది మొలకెత్తకపోవచ్చు కూడా. అలాంటి మృత్యంశతో మొదలయ్యే ఒక గింజ, వెలుతురూ నీరూ ఆధారాలుగా మొలకెత్తడం ప్రారంభిస్తుంది. ఇది పునర్జన్మ. ఈ పునరుత్థాన ప్రక్రియ సజావుగా జరగడానికి, తాము చేసిన పాపాలని ఒక మనిషికో జంతువుకో బదిలీ చేసి ఆ వ్యక్తిని/జంతువుని అర్పణం కావించడం ద్వారా, తాము చేసిన పాపాల ఫలితాలేవీ ఈ పునరుత్థానంపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపించవూ అనే నమ్మకంతో ఈ బలులు ప్రారంభం అయ్యాయి. చివరికి జరుగుతోంది ఏమిటి? మనం ఆ అజ్ఞానపు కాలాలనుంచి బయటపడినా, ఆ అజ్ఞానంలోనుంచి మాత్రం బయటపడలేకపోతున్నాం. ఆచారం తాలూకు చిహ్నాలన్నీ చెదిరిపోయినా, రాళ్లు విసరడం మాత్రం గుర్తుపెట్టుకున్నాం.

లాటరీ-సంభావ్యత

రిచర్డ్ హెచ్. విలియమ్స్ అనే విమర్శకుడు ఈ కథలో ప్రస్తావించిన లాటరీ పద్ధతిలో ఒక లోపం ఉందని వివరణాత్మకంగా రాసాడు. అలాకాకుండా, ఊరిలోని ప్రతివ్యక్తికీ ఒకే సంభావ్యత ఉండేలా నిర్వహించగలిగిన పద్ధతిని విలియమ్స్ సూచించాడు. సంభావ్యతా సిద్ధాంతాల ప్రకారం అది బానేవుంది కానీ, ఈ పరిశీలనని అందరూ నిరసించారు. సభ్యత ఉన్నవారెవరైనా అసలు ఈ లాటరీ పద్ధతినే ఖండించాలి కానీ, ఎక్కువ న్యాయం జరిగేలా బలిపశువుని ఎన్నిక చేయడమేమిటని వాళ్ల అభ్యంతరం. కానీ, ఈ పరిశీలననుంచి కూడా మనం గమనించగలిగిన అంశం ఒకటుంది. టెస్సీ ‘ఇది న్యాయం కాదు’ అని గగ్గోలు పెడుతోందంటే, ఆవిడకి మాత్రమే అర్థమవుతున్న అన్యాయం ఒకటుందన్నమాట. అది, ఒక్క విక్టిమ్‌కి మాత్రమే తక్షణం అర్థమయ్యే అన్యాయం. అన్యాయం అనేది జరుగుతోందని విక్టిమ్‌కి అర్థమయినంతగా, ఒడ్డున కూచున్న మిగతావారికి సహజంగానే అర్థం కాదు.

ఈ ఆచారం కొనసాగించడంలో మరో కుట్ర ఉంది. టెస్సీ ఈ లాటరీనుంచి బయటపడగల సంభావ్యత పెరగాలంటే, ఆ కుటుంబం సైజ్ పెద్దదిగా ఉండాలి. ఉదాహరణకి ఐదుమంది ఉన్న కుటుంబంనుంచి ఒక వ్యక్తి ఎన్నిక కాబడటానికి సంభావ్యత 1/5 (0.20). అదే కుటుంబంలో పదిమంది ఉంటే, ఒక వ్యక్తి ఎన్నిక కాబడటానికి సంభావ్యత 1/10 (0.10). అందరికీ ఈ సంభావ్యతని పెంచాలనే ఉంటుంది కాబట్టి, కుటుంబాన్ని విస్తరించాలనే కోరిక ఆ తల్లితో సహా ఆ కుటుంబసభ్యులందరికీ ఉంటుంది. అంటే, ఇంకోలా చెప్పాలంటే, పితృస్వామ్య వ్యవస్థ తాలూకు అధికారాన్ని స్త్రీలచేత వాళ్లకి తెలీకుండానే అంగీకరింపజేయించే కుట్ర ఇది.

 శిక్షాస్మృతి అమలు

కథ శీర్షిక – ‘లాటరీ’ – మన జీవితాలతో విధి ఆడుకునే ఆటలు అన్న అర్థాన్ని సూచించినా, ఈ సమాజాల్లో న్యాయం అనేది – ముఖ్యంగా మరణశిక్షల విషయంలో – లాటరీయే! మరణశిక్షల అమలులో లెక్కలు సరీగ్గా తేల్చని ఇండియాలాంటి దేశాల్లో ఈ విషయం మీద విశ్లేషణ చేయడం కష్టమే కానీ, అమెరికా లాంటి దేశాల్లో మరణశిక్షని అమలు చేయడం జాతి/వర్గం/జెండర్/ప్రాంతీయత/మీడియా వైఖరి/రాజకీయ జోక్యాలు అనే అంశాల మీద ఆధారపడి ఉన్నాయి. మరణశిక్ష విధించబడిన ప్రతి ఒక్కరూ ఆ శిక్ష అమలుకి గురికావడం లేదు. ఇలా ఇష్టానుసారంగా శిక్షలని అమలుపరచడానికి వ్యక్తుల్ని ఎన్నుకోవడం కూడా ఈ కథలోని లాటరీ లాంటిదే కదా! దోషుల్లో తెల్లవారికంటే నల్లవారికి శిక్ష అమలయ్యే సంభావ్యత ఎక్కువ. ఇంకా విచిత్రం ఏమిటంటే, ఈ సంభావ్యత దోషి జాతిమీదే కాకుండా, విక్టిమ్ జాతిమీద కూడా ఆధారపడి ఉంటుంది. తెల్లవాళ్లని చంపిన నల్లవాళ్లు మరణశిక్షని అనుభవించడానికి అత్యధిక సంభావ్యత ఉంటుంది. పైన చెప్పినట్టు ఇది ప్రాంతీయత మీద కూడా ఆధారపడివుంటుంది. అమెరికాలోని దక్షిణాది ప్రాంతాలకి చెందిన నిందితులకి మరణశిక్ష విధింపబడటానికి ఎక్కువ ఆస్కారం ఉండగా, అది అమలు కావడానికి ఉత్తర ప్రాంతానికి చెందిన దోషుల కంటే మూడు రెట్ల ఎక్కువ సంభావ్యత ఉంటుంది! అలాగే, జెండర్ విషయానికి వస్తే శిక్ష అమలయ్యేది ఎక్కువగా మగవారికే. ఆడవాళ్లకి ఈ శిక్షని అమలుచేయడం దాదాపు అరుదు. మీడియా, రాజకీయాల జోక్యం ఉన్న కేసుల్లో విచారణనుంచి శిక్షల దాకా ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఊహించవచ్చు. ధనికవర్గానికి చెందిన నిందితులు నాణ్యమైన లాయర్లని పెట్టుకుని తమ కేసులు వాదించుకోగల శక్తిగలవారై ఉండటం, పేదవర్గానికి చెందిన నిందితులకి అలాంటి అవకాశం లేకపోవడం వల్ల కూడా శిక్షలు ఎలా పడతాయో ఊహించుకోగలం. అందుకే ఇంగ్లీష్‌లో ఒక పాతసామెత ఉంది: If you don’t have the capital, you get the punishment! మరణశిక్షలు ఆపేయడం అంటే, చట్టాన్ని నీరుకార్చడం, నైతికతని ధిక్కరించడమేనని వాటిని సమర్థించేవారు అంటారు కానీ, ఆ శిక్షలు, వాటి అమళ్లే నిజానికి వాటిని ప్రశ్నించే విషయాలుగా ఉన్నాయి! ఈ మరణశిక్ష అనే ఆచారాన్ని, ఈ కథలోని గ్రామస్తులు గుడ్డిగా లాటరీని పాటిస్తున్నట్టు పోషించుకుంటూ వస్తున్నాం కానీ, దానిగురించి ఒక పునస్సమీక్ష ఏదైనా ఉందా? కథ చివర్లో టెస్సీ ఆక్రోశం (“ఇది న్యాయం కాదు! ఇది సరి కాదు!!”) తాలూకు ప్రతిధ్వనులు మన సమాజంలో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి కదా!?

చెప్పని కథ

ఇది జరిగిన కథని ఊహించడానికి చేసే ప్రయత్నం. ఇలాంటి పరిశీలనలని పాఠకులకి వదిలిపెట్టడం కోసమే కథల్లో క్లుప్తత పాటించాలనే సూత్రం ఏర్పడిందనుకుంటాను- ఆ మేరకు కథలో పాఠకుడికి భాగస్వామ్యం కల్పించే అవకాశం కోసం!

డన్‌బర్ కుటుంబ పెద్ద రాలేదని మిస్టర్ సమ్మర్స్ గ్రహించి ఆ విషయం అడిగాక జేనీ తను వచ్చానంటుంది. ఎదిగిన అబ్బాయి ఎవరూ లేరా అని సమ్మర్స్ అడుగుతాడు. బహుశా, అంతకుముందు సంవత్సరం బలి యిచ్చింది వాళ్ల ఎదిగినఅబ్బాయినే అయివుండవచ్చు. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీని చూసే శక్తి ఆ కుటుంబపెద్దకి ఉండివుండకపోవచ్చు. అతని కాలు విరగడం యాదృచ్ఛికం కూడా అయివుండకపోవచ్చు. బహుశా అందువల్లనే జేనీ కొంత ఆరాటంగానూ, కొంత అసహనంగానూ ఉండివుండవచ్చు (“వీళ్లు దీన్ని తొందరగా పూర్తి చేస్తే బావుణ్ణు,” అంది మిసెస్ డన్‌బర్ కొడుకుతో. “దాదాపు పూర్తయినట్టుంది,” అన్నాడు కొడుకు. “పరిగెత్తుకెళ్లి నాన్నకి చెప్పటానికి రడీగా ఉండు,” అంది ఆవిడ కొడుకుతో.) బహుశా అందువల్లనే, చివర్లో రాళ్లు విసరడానికి మిసెస్ డెలక్రాయ్ వెళుతూ జేనీని పిలిచినప్పుడు “నేను పరిగెత్తలేను. నువ్వు ముందు వెళ్లు, నేను వెనకగా వస్తాను,” అంటుంది జేనీ. బహుశా, ఈ దుష్టసంప్రదాయంలో కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లి, ఈ సంప్రదాయాన్ని పెంచిపోషించే ఆసక్తిని కోల్పోయి కూడా ఉండొచ్చు. రాళ్లు వేయడానికి అసలు ఆవిడ వెళ్లికూడా ఉండకపోవచ్చు. ఇదొక్కటీ కథలోని ఆశావహమైన అంశం.

డన్‌బర్ కుటుంబం గురించి పైన చెప్పినట్టు సమ్మర్స్ చర్చించిన తరువాత వాట్సన్ కుటుంబం నుంచి చీటీ ఎవరు తీస్తున్నారు అని అడుగుతాడు. లాటరీ ప్రారంభానికి ముందే ఇవన్నీ చర్చించబడటం మనం గమనించాలి. “వాట్సన్ వాళ్ల అబ్బాయి ఈసారి లాటరీ తీస్తున్నట్టేనా?” అని అడుగుతాడు గుంపునుద్దేశించి. పొడుగ్గా ఉన్న ఒక అబ్బాయి చెయ్యి పైకెత్తి, “ఇక్కడ…” అంటాడు. గుంపు అతనివైపు ప్రశంసాపూర్వకంగా చూస్తుంది. “జాక్ మంచి పిల్లవాడు. కుటుంబానికి ఒక మగదిక్కుగా నిలబడుతున్నాడు,” అని వాళ్లు అభినందిస్తూ ఉండగా, ఇబ్బందిగా కళ్లు తాటించి తలదించుకుంటాడు ఆ అబ్బాయి జాక్. మొదటి రౌండ్ పూర్తయ్యాక, “ఎవరు?,” “ఎవరికి వచ్చింది?,” “డన్‌బర్ ఫామిలీనా?,” “వాట్‌సన్సా?” అని గుంపులో చిన్న కలవరం రేగుతుంది. వీటినిబట్టి, వాట్సన్ కుటుంబంలోని పెద్ద, బహుశా ఇంతకుమునుపు లాటరీలలోని విక్టిమ్ అని మనం అర్థం చేసుకోవచ్చు.

 మార్క్సిస్ట్ ఫెమినిస్ట్ విమర్శ

ఈ కథ వెనక ఉన్న సామాజిక కారణాలని పీటర్ కొసెంకో రాసిన విమర్శ బాగా పట్టుకోగలిగింది. ఈ విమర్శకుడి పరిశీలనలు సూటిగానూ, చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలిగిన స్థాయిలోనూ ఉన్నాయి. ఈ విమర్శ ఏం చెబుతుందో చూద్దాం:

కథలోని ఊరు చిన్నదే కానీ, ఇక్కడా ఒక బాంక్ ఉంది. ఒక పోస్టాఫీస్ ఉంది. ఒక కిరాణా దుకాణం, బొగ్గు కంపెనీ ఉన్నాయి. ఆడవాళ్లు అందరూ గృహిణులు, ఎవరూ బయట పనిచేసి సంపాదిస్తున్నవారు కారు. మగవాళ్లు శ్రామికులు; ట్రాక్టర్లూ, టాక్సులూ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరు చిన్నదే కానీ, ఒక పెట్టుబడిదారీ సమాజానికి నమూనాలాగా ఉంటుంది. ఊళ్లోని ప్రముఖమైన వ్యక్తి – మిస్టర్ సమ్మర్స్ – బొగ్గు కంపెనీ అధిపతి; సహజంగానే సంపన్నుడు. చాలా “సమయమూ, శక్తీ” ఉన్నవాడు. తరువాతి ప్రముఖవ్యక్తి మిస్టర్ గ్రేవ్స్ ఒక గవర్నమెంట్ అధికారి, పోస్ట్‌మాస్టర్. తరువాతి ప్రముఖ వ్యక్తి ఒక వ్యాపారి- మిస్టర్ మార్టిన్. ఊరిని ఆర్థికంగానూ, రాజకీయంగానూ శాసించగల వ్యక్తులు ఈ ముగ్గురే. ఈ ముగ్గురే లాటరీని కూడా నిర్వహిస్తూంటారు. ఈ లాటరీని నిర్వహించే అధికారి మిస్టర్ సమ్మర్స్ కాగా, అతని చేత ప్రమాణస్వీకారం చేయించేది మిస్టర్ గ్రేవ్స్. మిస్టర్ మార్టిన్ దీనికి సహాయకారి. లాటరీ రోజున తప్పించి, మిగతా రోజుల్లో ఆ నల్లపెట్టె ఈ ముగ్గురిలోనే ఎవరో ఒకరి దగ్గరే ఉంటుంది. ఊరిని శాసించగలిగినవాళ్లకే ఈ లాటరీమీద కూడా పూర్తి కంట్రోల్ ఉందన్నమాట. లాటరీ ఎక్కడ జరుగుతోంది? ఆ ఊళ్లో పోస్టాఫీసుకీ, బాంక్‌కీ మధ్యనున్న ఖాళీస్థలంలో. అధికార, ఆర్థిక శక్తుల మధ్య, ఆ శక్తుల ప్రతినిధులు లాటరీని నిర్వహిస్తున్నారు.

లాటరీ ప్రజాస్వామికంగా ఉందని ప్రజలని నమ్మించడానికి అధికారంలో ఉన్న ముగ్గురూ కూడా లాటరీలో పాల్గొంటారు. తద్వారా, తామేమీ మిగతావారికన్నా అధికులం కాము (లాటరీ వాళ్ల అధీనంలో ఉన్నంతకాలం అది అబద్ధం) అనే భ్రమని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. నల్లపెట్టె తన అసలు రంగుని బహిర్గతపరుస్తున్నట్టు, వీళ్ల అసలు రంగులు, వర్గస్వభావం కూడా మనకి తెలిసిపోతూనే ఉంటాయి. మిస్టర్ సమ్మర్స్, తానుకూడా ఒక శ్రామికుడేనని చూపుకునేందుకు ఒక బ్లూ జీన్స్ వేసుకున్నా, అతని తెల్లటి చొక్కా అతని వర్గాన్ని తెలియజేస్తుంది. “ఎవరన్నా ముందుకొచ్చి కొంచెం సహాయం చేస్తారా?” అని మిస్టర్ సమ్మర్స్ అడిగాక ముందుకొచ్చింది మూడో ప్రముఖవ్యక్తి. నిజానికి అది చాలా నిరర్థకమైన ప్రశ్న. సమాధానం ముందే తెలిసిన ప్రశ్న. ఈ వర్గవిచక్షణ కూడా ప్రజల మనసుల్లో ఎక్కడో అంతర్లీనంగా వాళ్లకి తెలియకుండానే జీర్ణమైపోయి ఉంది. అందుచేత ‘ఎవరన్నా’ అంటే దాని అర్థం ‘ఎవరైనా సరే’ అని కాదని వాళ్లకి తెలీకుండానే తెలుసు.

ముసలాయన వార్నర్ (పేరులోనే ప్రమాదఘంటికలున్నాయి) ఈ అధికారత్రయానికి ప్రచారకర్తలాంటి వాడు. ‘జూన్‌లో లాటరీ అంటే, లాభాల పంటే’ అనే పాటపాడే ఈ ముసలాయన, నిరసన గళాలని నీరుకార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదంతా సక్రమమైన ప్రక్రియే అని చెప్పటానికి ఉదాహరణగా తను డెబ్భై యేడు సార్లు ఈ లాటరీలో పాల్గొన్నట్టు చెబుతూంటాడు. ప్రచారకర్త హోదాలో, తగిన ప్రతిఫలం అతను లాటరీ నిర్వాహకుల దగ్గరనుంచి పొందుతూ ఉండివుండచ్చు. డెబ్భై యేడు సార్లు లాటరీలో పాల్గొన్నా అతను ఇంతవరకూ విక్టిమ్ కాలేదంటే, వెనక ఏదో రహస్య ఎజెండా ఉందని మనం అనుమానించడానికి ఆస్కారం ఉంది.

మరో ముఖ్యమైన అంశం- లాటరీలో టెస్సీ ఎందుకు ఎంపిక అయింది?

 • కారణాలు ఏవైనా, లాటరీకి ఆలస్యంగా రావడం అధికారులకి ఆవిడ నిరసనగానే అనుమానం కలిగించివుండవచ్చు.
 • ఇంటిపని సకాలంలో పూర్తిచేసుకోలేకపోవడం, తనకు కేటాయించబడిన శ్రమపట్ల గౌరవం చూపకపోవడం. గిన్నెలన్నీ వదిలేసి రమ్మంటావా అని టెస్సీ అన్నప్పుడు, జనాల్లోనుంచి ఒక ఇబ్బందికరమైన నవ్వు వినిపిస్తుంది. టెస్సీ చూపించిన అగౌరవాన్ని గుర్తించిన నవ్వు అది.
 • మొదటి రౌండ్‌లో టెస్సీ కుటుంబాన్ని పిలిచినప్పుడు, “అదిగో.. వెళ్లు, బిల్!” అంటుంది మిసెస్ హచిన్‌సన్. ఇంకో పొరపాటు. మగవాళ్లని ఆడవాళ్లు హెచ్చరించడం ఏమిటి? (జనాల్లో ఓ ఇబ్బందికరమైన సన్నటినవ్వు- ఆ పొరపాటుని గుర్తించినట్టుగా.)
 • చివరి తప్పు- లాటరీ విధివిధానాలని ప్రశ్నించడం. కూతురి కుటుంబాన్ని కూడా తమతో చేర్చమనడం.

పై పొరపాట్లన్నీ టెస్సీనే చివరికి విక్టిమ్ కావడానికి సహకరించాయి. టెస్సీ ఈ పొరబాట్లన్నీ తెలీకుండానే చేసిందని ఆవిడ చివరి ఆక్రందనలు వింటే తెలుస్తుంది. లాటరీ నిర్వహించడం పట్ల టెస్సీకి అభ్యంతరం లేదు- కేవలం తను విక్టిమ్ అవడం పట్ల తప్పించి. మరొకరెవరైనా ఎంపిక కాబడి వుంటే, బహుశా టెస్సీ అభ్యంతరం చెప్పివుండకపోవచ్చు.

జనాల్లో కూడా ఈ లాటరీ పట్ల అవ్యక్తమైన నిరసన ఉండివుండాలి. మిస్టర్ ఆడమ్స్, మిసెస్ ఆడమ్స్, టెస్సీ దాన్ని వ్యక్తపరచగా, జనాల ఇబ్బందికరమైన నవ్వుల్లో అలాంటి నిరసన సూచన ఒకటుంది. ఈ తిరగబడాలనే కోరిక తీరక, అది రగిల్చిన ఆగ్రహాన్ని చూపించడానికి టెస్సీ దొరికింది. టెస్సీ చేతిలో ఉన్న కాగితాన్ని చూపించమని బిల్‌ని అడిగినప్పుడు అతను దాన్ని తీసుకుని పైకెత్తి అందరికీ చూపిస్తాడు. ఆడవాళ్లమీద మగవారికి ఉన్న అధికారాన్ని మిస్టర్ సమ్మర్స్ ప్రదర్శింపజేయించాడు. అంతేకాదు, అవిధేయత చూపిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తాను చూపించడమే కాకుండా, సాక్షాత్తూ బిల్ దాన్ని అందరికీ చూపించేలా, అందరిముందూ అంగీకరించేలా చేసాడు.

ఇలాంటి సాంఘిక కుట్రలోకి లాగబడిన గ్రామస్తులు, దీని వెనక కారణలని పసిగట్టలేక, ఆ కుట్ర చట్రంలోనే ఒదిగిపోతూ ఉంటారు. చివరికి చిన్నపిల్లలు సైతం ఆ చట్రంలో భాగంగా రాళ్లు పోగుచేసుకుంటూ ఉత్సాహంగా ఉంటారు. ముందు ఆ పనిని ప్రారంభించేది అధికారత్రయంలో ఉన్న మిస్టర్ మార్టిన్ కొడుకు (మిస్టర్ సమ్మర్స్‌కీ, మిస్టర్ గ్రేవ్స్‌కీ అబ్బాయిలు లేరు). అవేవో డబ్బుమూటలయినట్టు వాటికోసం పోటీపడుతున్న అబ్బాయిల్ని, అక్కడే ఉన్న అమ్మాయిలు మౌనంగా గమనిస్తూంటారు. భవిష్యత్తులో వాళ్ల పాత్ర అలా మౌనంగా పక్కన నిలబడటం, వాళ్లమీద ఆధారపడటమూ కాబట్టి. పిల్లలు ఇదంతా ఎక్కడినుంచి నేర్చుకుంటున్నారు? కచ్చితంగా వాళ్లవాళ్ల పెద్దవాళ్ల దగ్గర్నుంచే. పిల్లలు సహజంగా అలాంటి క్రూరత్వం సంతరించుకుని పుట్టినవాళ్లు కాదని చెప్పటానికి, కథలో ఒక అమాయకపు పిల్లవాడిని (డేవ్ హచిన్‌సన్) రచయిత్రి కథలో ఉంచారు. చీటీ తీసిన తర్వాత డేవ్ “అబ్బురంగా” చూసుకుంటూ నిలబడతాడు. అలానే, టెస్సీ ఎంపిక అయ్యాక, ఆ పిల్లవాడికి వేరే ఎవరో రాళ్లు ఇవ్వాల్సి వస్తుంది- తన తల్లినే చంపడంలో భాగస్వామి కావడానికి. ఎందుకు చేస్తున్నారో అర్థం కావడానికి ముందే ఎలా చేయాలో కొత్తతరానికి నేర్పే ప్రయత్నంలో ఉంది ఆ గ్రామం. అలాగని ఆ పిల్లవాడు తనంతట తానే ఏతావాతా అది నేర్చుకోకుండా ఉంటాడని కాదు.

జాగ్రత్తగా చూస్తే కథలో మరికొన్ని విశేషాలు కనబడతాయి. కుటుంబాన్ని ఒక ప్రాథమిక ప్రమాణంగా చేయడం ద్వారా, ప్రజల స్వార్థాలని వాళ్ల వాళ్ల కుటుంబాలకే పరిమితం చేయడం ద్వారా, ఈ ఊరు ఎలాంటి సంఘాలనీ ఏర్పరచుకోలేదు. శ్రమ ద్వారా చివరికి దోపిడీకి మాత్రమే గురయ్యే పురుషవర్గానికి తమ స్త్రీల మీద ఆధిక్యాన్ని ఇవ్వడం ద్వారా ఈ చట్రం మగవారికి కొంత ఓదార్పు ప్రసాదిస్తోంది. శ్రామికులు, శ్రామికులు కానివారూ అనే వర్గాలు సృష్టిస్తోంది. శ్రామికుల మధ్యే వైషమ్యాలు కలగజేస్తుంది. మనుషుల్లోని హింసా ప్రవృత్తికి నిదర్శనంగా ఈ కథ నిలుస్తోంది అన్న మన తొలిస్పందనకి విరుద్ధంగా, మనుషులు ఒక చట్రంలో ఎలా బిగించబడుతున్నారూ, వాళ్ల ఆలోచనావిధాలు ఏ రకంగా నియంత్రించబడుతున్నాయీ, ఒక పెద్ద ఆటలో వీళ్లకి తెలీకుండానే వీళ్లు ఎలా పావులూ అనే విషయాలని పై నేపథ్యంలోనుంచి పరిశీలిస్తే, కథ గురించి మన అవగాహన మారుతుంది!

కొసమెరుపు!

ఈ కథ ప్రచురించబడినాక రచయిత్రికి వచ్చిన అసంఖ్యాకమైన ఉత్తరాల్లో కాలిఫోర్నియా నుంచి ఒకరు రాసిన ఉత్తరం వచ్చింది. ఉత్తరం రాసిన వ్యక్తి పేరుని షర్లీ జాక్‌సన్‌కి ఆ పేరు తెలిసినట్టుగానే ఉంది కానీ, రెండుమూడు రోజులయినా పూర్తిగా గుర్తురావడం లేదు. ఉత్తరం రాసిన వ్యక్తి ఒక రచయిత అయివుండాలని మాత్రం అనిపిస్తూ ఉంది. అతను రాసిన పుస్తకమో, లేక ఆ పుస్తకం తాలూకు సమీక్షో చదివినట్టు, లేదా అతని కథేదో ఓ పత్రికలో చదివినట్టూ లీలగా జ్ఞాపకం. లేదూ, చిన్నప్పటి హైస్కూలు ఫ్రెండా? సరే, ఉత్తరానికి సమాధానం ఇవ్వాలి కాబట్టి, మర్యాదగా నాన్-కమిటల్‌గా ఒక జవాబిచ్చి ఊరుకున్నారు. ఇది జరిగిన కొద్దిరోజులకే కాలిఫోర్నియాలో ఉండే ఆవిడ స్నేహితులు ఆవిడని కలవడానికి వచ్చినప్పుడు కాలిఫోర్నియా నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఉత్తరం చూపించారు. అమ్మో! నిజంగా అతని దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరమేనా అని ఆ స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం సరే కానీ, ఎవరా వ్యక్తి అని షర్లీ అడిగారు. అతను తెలియకపోవడమేమిటి, అతని గురించి కాలిఫోర్నియా, న్యూ యార్క్ పేపర్ల నిండా ఆ మధ్య వచ్చింది కదా అని వాళ్ల సమాధానం. ఇంతకీ అతను ఎవరయ్యా అంటే, తన భార్యని అత్యంత కిరాతకంగా ఒక గొడ్డలితో హత్యచేసి, ఆ కేసునుంచి ఎలాగో బయటపడ్డ నిందితుడు! ఈ విషయం కలిగించిన కంపరంతో, అసలు అతని ఉత్తరానికి తను ఏమని జవాబిచ్చిందో ఓసారి షర్లీ చూసుకున్నారు: “నా కథగురించి నాలుగు మంచివాక్యాలు రాసినందుకు ధన్యవాదాలు. మీ వర్క్ కూడా నాకు చాలా ఇష్టం!”

**

చాలా ఏళ్ల క్రితం చదివిన ఈ కథ ఇప్పటికీ నన్ను ఆలోచింపజేస్తూ ఉంటుంది. ఈ కథమీద నాకు కలిగిన అవగాహనని సమర్థించే వ్యాసాలూ, ఆ అవగాహనని మరింత విస్తృతపరచిన వ్యాసాలూ చాలా ఉన్నాయి. ఈ క్రింది విమర్శకులకి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు: A.R. Coulthard • Amy A. Griffin • Charles E. May • Cleanth Brooks & Robert Penn Warren • Donald Barr • Edna Bogert • Fritz Oehlschlaeger • Gayle Whittier • Granville Hicks • Guy Davenport • Harold Bloom • Helen E. Nebeker • Ian Singleton • James Egan • James Hilton • James M. Gibson • Jay A. Yarmove • Jennifer Hicks • John G. Parks • Lenemaja Friedman • Linda Wagner-Martin • Mary Kittredge • Nathan Cervo • Patrick J. Shields • Peter Kosenko • Richard H. Williams • Richard Pascal • Robert L. Kelly • Seymour Lainhoff • Shirley Jackson • Stanley Edgar Hyman.

 

ఎ.వి. రమణమూర్తి

ఎ.వి. రమణమూర్తి

సాహిత్యం, ముఖ్యంగా కథాసాహిత్యం అంటే అభిమానం. వాటికి సంబంధించిన విమర్శ కూడా!
ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి ఐ.టి. మేనేజర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. గత ఐదారేళ్లుగా వర్తమాన కథాసాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలో భాగంగా కథాసాహితి వారి కథ-2015 కి గెస్ట్ ఎడిటర్‌‌గా వ్యవహరించారు. శ్రీకాకుళం 'కథానిలయం' కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

29 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • వొళ్ళు గగుర్పొడిచే కథ. ఓసారి ఇంగ్లీషు మూలం చదవాలసిందే.

  • థాంక్యూ! ఇంగ్లీష్ వెర్షన్ కూడా చదవండి!

 • అద్భుతం. నాకేదో పాఠం నేర్చుకుంటున్నట్టు అనిపించింది‌. అదీ మంచి గురువు దగ్గర. చివర్లో ఆమె రాసిన ఉత్తరం భలే ఉంది. (మీ వర్క్ కూడా నాకు ఇష్టం.)

  • మీ అభిమానానికి కృతజ్ఞతలు, సుజాత గారూ! ఈ కథ గురించి షర్లీ జాక్‌సన్ Biography of a story అని ఓ వ్యాసం రాసారు. అందులో ఉంది మీరు ఉదహరించిన పిట్టకథ… 🙂

  • చాలా యేళ్ల తర్వాత మళ్లీ ఈ కథ చదివినప్పుడు – షాక్ కాదు గానీ, విపరీతమయిన బాధ కలిగింది. అది అనువాదం చేస్తున్నప్పుడయితే మరీనూ…

 • భారతంలో , ఏకచక్ర పురం లో బకాసురునికి రోజుకొకరు ఆహారంగా పంపబడిన కథ…
  ఒకరోజు ఒక కుటుంబం అంతా చేస్తున్న ఆక్రందనలు.
  కుంతీ మాత మహా నిబ్బరంగా తన కొడుకు ను పంపడానికి తానే సిద్ధం కావడం… పెద్దన్న గారు నువ్వు తల్లి వేనా? ఇలా ఎలా పంపుతున్నావ్.. అని అడగడం.
  చిన్నపిల్లవాడుగా ఉండగా అతడు కింద పడితే రాయి వల్ల అతడికి దెబ్బ కాదు కదా రాయే బద్దలు అయినట్టు తల్లి చెప్పడం.
  ఆ తరువాత బలిపశువుగా వెళ్లిన వ్యక్తి ఆ రాక్షసుని సంహరించుట, దానిలో కాలపు శక్తి స్వరూపుడు అయిన మరొక పురుషుడు…” ఇది ఒక మహా సంగ్రామం ఐదుగురు ఒకటే నక్షత్రంలో పుట్టిన వారు … వారిలో ఎవరు ముందుగా మరొకరిని చంప గలరో వారే ఇతరులను చంపగలరు”… అనే ఒక సంక్లిష్టమైన ముడిని విప్పుతూ చేసిన ప్రకటన…
  ఇవన్నీ ఆలోచనలో దొర్లాయి.
  అవును… కథ కాళ్ళు లేనిది. అయితే కథ ఎంత అస్తిత్వం కలిగి ఉంటుందో! ఈ కథను చదివి ఆ తరువాత వచ్చిన విమర్శలను గురించి చదివినప్పుడు అర్థమైంది. ఒకే లాంటి కథలు పలుమార్లు చదివినప్పుడు… చెప్పిన విధానం, వారు చెప్పదలుచుకున్న నిజం, అంతర్లీనమైన జీవిత సత్యం, బోధ పడుతూ ఉంటాయి.
  నిజం చెప్పాలంటే చదివిన ప్రతిసారీ , మరొక కొత్త కోణం తెలుస్తుంది.
  విమర్శలు చదివి విమర్శనాత్మకంగా ఆలోచించడం కొత్తగా నేర్చుకుంటున్న ఈ ప్రక్రియ నా పాత మెదడుకు మంచి మేత రమణ మూర్తి గారు.
  నిజమే. ఇది యుద్ధ వాతావరణపు నేపథ్యం. ఈ కథ వ్యవస్థల మీద తిరుగుబాటు. వివక్షకు కత్తిపోటు .
  వయసుపైబడిన కొద్దీ సాగిపోతున్న మాంసపు కండలతో ఉన్న దేహాన్ని రకరకాల బట్టలతో ఎలా మూసిమొ ,… అలా మనసులో లోపలి పొరల్లోని అనేక స్వార్థాల ను బయటకు పెట్టి , సూచనా మాత్రంగా తెలియజేసే ఓ గొప్ప కథ.
  ఏసు అందుకే అన్నాడేమో మీలో పాపం చేయని వారే మొదటి రాయి ఆమెపై వెయ్యండి ! అని కళ్ళనీళ్ళు జారుతున్నాయి.
  ఎన్నో చీకటి కోణాలను వెలుగులోకి తెస్తోంది. కథను ఎప్పుడో చదివిన గుర్తు ఉన్నా, మరొకసారి మూలాన్ని , దానిపై వచ్చిన అనేక విమర్శలను మీరు ఒక చోట క్రోడీకరించడం, అది చదవడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ….
  ధన్యవాదాలతో…..

  • <> నిజమే! అసలు ఈ కథని Joshua 7 లోని ఒక కథతో పోలుస్తూ (దానికీ, దీనికి వస్తువులో పోలికలు ఉన్నాయి. కానీ, చెప్పిన విధానంలోనూ, చెప్పదలచుకున్న సందేశం విషయంలోనూ బోలెడన్ని తేడాలు ఉన్నాయి. విస్తరణభీతి చేత, ఆ వివరాలు నా వ్యాసంలోనుంచి ఎడిట్ చేసాను… 🙂

   <> సాంకేతికంగా, దీనిని ‘థీమ్’ అంటారు. వస్తువు ఒకటే అయినా, భిన్నరచయితలు భిన్నకోణాలని చూపించగలగడం అన్నమాట.

   <> చాలా అవసరమైన పని. అది రాసేవాళ్లకే కాకుండా, చదివేవాళ్లకీ చాలా ఉపయోగపడుతుంది. కథని అస్వాదించే పద్ధతీ, స్థాయీ మారతాయి.

   వ్యాసం మీకు నచ్చి, సవివరంగా మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు శైలజ గారూ!

 • ముందుగా మీకు ధన్యవాదాలు.
  కథ షాకింగ్ గా ఉన్నా , విశ్లేషణ చదివాక కొంత అర్థమైంది.

  • ఈ వ్యాసం ఉద్దేశం సరీగ్గా అదే, లోకేష్ గారూ! థాంక్యూ…

 • నాకు కొడవటిగంటి కుటుంబరావు రాసిన బకాసుర, గుర్తు కు వచ్చింది.సాధారణం గా కనిపించే పాశ్చాత్య కథా సాహిత్యాన్ని వారి విశ్లేషణ లతో సాహిత్య విమర్శకులు ఎంతో ప్రోత్సహించేవారు.ఉన్నతంగా కనిపించేట్లు చేయగలిగేవారు.మన కి ఇక్కడ ఆ చర్చలు విశ్లేషణ లు తక్కువ. మీ పరిచయం విశ్లేషణ చాలా బాగుంది.ఇప్పటీ so called మూకదాడుల లోని mob psychology కూడా గుర్తు వస్తోంది.కథకులు, విమర్శకులు అందరూ చదవాల్సిన ఫీచర్ ఇది.

 • మీ దృష్టికోణం తెలుసుకోవాలని తప్ప ఈ కథ రెండో సారి చదివే ఉద్దేశ్యం లేదు నాకు :-). పగ, ద్వేషం వున్నచోట – అవతలి వ్యక్తితో ఎలాంటి అనుబంధం లేనిచోట – హింసలో జాలి కనపడదు. తప్పనిసరి ఆచారం అయి పార్టీసిపేట్ చేయాల్సి వచ్చినా, భర్త మరి ఒకరిద్దరు స్నేహితురాళ్ళ సింపతీని కానీ, కనీసం కన్న పిల్లల దుఃఖము, బాధని కానీ లీలామాత్రంగానయినా చూపించలేదు రచయిత్రి. ఆవిడ కావాలనే అలా రాసినా – వుండాల్సిన చోట కనీస ఎంపతీ లేక పోవడం అతి పెద్ద కారణం ఈ కథ అనేక సవాళ్లని ఎదురుకోడానికి అని నా అబిప్రాయం. మీ అనువాదం కథకి న్యాయం చేసింది :-).

  • అలాంటి ఎంపతీ లేకపోవడం మీరన్నట్టు కథ స్కీమ్‌లో భాగమే. ఇలాంటి ఆచారాలు పెంచిపోషించే ఉన్మాదాన్ని పాఠకులు, విమర్శకులు అర్థం చేసుకున్నట్టే అనిపిస్తుంది. అందుకనే దానిగురించి ప్రత్యేకమైన విముఖత చూపించినట్టుగా కనిపించదు. అనువాదం మీకు నచ్చినందుకు థాంక్స్, విజయ గారూ!

 • ధన్యవాదాలు రమణమూర్తి గారూ! మీ వల్లే నాకు Shirley Jackson’s “The Lottery” కధ, దానిలోని అంతర్గత సూత్రం అర్ధం అయ్యాయి .

  ” మనుషులు ఒక చట్రంలో ఎలా బిగించబడుతున్నారూ, వాళ్ల ఆలోచనావిధాలు ఏ రకంగా నియంత్రించబడుతున్నాయీ, ఒక పెద్ద ఆటలో వీళ్లకి తెలీకుండానే వీళ్లు ఎలా పావులూ ” అనే కుట్రను హైలైట్ చేసినందుకూ . యీ సామూహిత రుగ్మత ఇండియాకు మాత్రమే పరిమితం కాదు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రపంచమంతా ఉన్నది అని సరిపెట్టుకోలేను.

  సమాజంలో అంతర్గతంగా దాగిఉన్న యీ సామూహిక క్రూర, నేరపూరిత మనస్తత్వం నుంచి ప్రజలు బయటపడటానికి విద్య, మార్క్సిస్ట్, ఫెమినిస్ట్ ఫిలాసఫీలు, తార్కిక దృష్టితో ప్రశ్నించటం నేర్పించే హేతువాదం, ప్రచార మాధ్యమాలు ఇలా ఏవేవి కావాలి రమణమూర్తి సామీ ?

  • థాంక్యూ, రామయ్య గారూ! ఆలోచనల స్థాయికే పరిమితమైపోతున్న ఎంపతీ, ఆచరణల్లోకి రాకపోవడం బహుశా ఈ పరిస్థితులు అలానే కొనసాగడానికి కారణమై ఉండవచ్చు…

 • రమణమూర్తి సామీ! మీరు ఇంత క్లారిటీఇచ్చినా, మళ్లీ నేను కట్ అండ్ పేస్ట్ పనులకు తెగబడుతున్నానంటే అదీ ఓ రకమైన మానసిక జాడ్యమే నంటారా ? ( స్వగతం లాంటి సొంతడబ్బా.. నాకూ కొ.కు. నాయనంటే, ఆయన రచనలంటే మాసెడ్డ ఇష్టం ).

  Shirley Jackson’s story “The Lottery” was first published in the The New Yorker in June 26, 1948 issue and is about the residents of an unidentified American village participate in an annual rite of stoning to death a person chosen among them by drawing lots, and quickly become one of the best known and most frequently anthologized short stories in English.

  The most mail the New Yorker magazine had ever received in response to a work of fiction numbered more than three hundred were dominated by three main themes: “bewilderment, speculation, and plain old-fashioned abuse.” Readers wanted to know where such lotteries were held, and whether they could go and watch; they threatened to cancel their New Yorker subscriptions; they declared the story a piece of trash.

  For the rest of her life, Shirley Jackson would receive letters demanding an explanation for “The Lottery.” She reportedly told one friend that it was based in anti-Semitism, and another that all the characters were modeled on actual people in North Bennington ( an incorporated village in the town of Bennington, Vermont, United States ).

  “The Lottery” takes the classic theme of man’s inhumanity to man and gives it an additional twist: the randomness inherent in brutality. It anticipates the way we would come to understand the twentieth century’s unique lessons about the capacity of ordinary citizens to do evil—from the Nazi camp bureaucracy, to the Communist societies that depended on the betrayal of neighbor by neighbor and the experiments by the psychologists Stanley Milgram and Philip Zimbardo demonstrating how little is required to induce strangers to turn against each other.

  In 1948, with the fresh horrors of the Second World War barely receding into memory and the Red Scare just beginning, it is no wonder that the story’s first readers reacted so vehemently to this ugly glimpse of their own faces in the mirror, even if they did not realize exactly what they were looking at.

  Nelson Olmsted, a producer at NBC, wrote to Shirley Jackson that he was interested in using the story on television. “I deal with hundreds of stories every year, but it has been a long time since I have seen one create as much interest and discussion as ‘The Lottery,’ ” he wrote.

  His own interpretation was that “humanity is normally opposed to progress; instead, it clutches with tenacity to the customs and fetishes of its ancestors.”

 • కథ నడుస్తున్నంత సేపూ ఏదో ఉన్మాదపు చర్య జరగబోతోంది అన్న భయం నాకు కలిగింది..రాళ్లు తీసుకోవడం , లాటరీ ఏమిటో చెప్పక పోవడం , అయితే ఇలాంటి ఎండింగ్ మటుకు ఊహించలేదు.ఆ బ్రేవిటి ,క్లుప్తత ఈ కథకి ఆయువుపట్టు..
  పిల్లలు పుట్టాక పోవడానికి కారణాలు ఇద్దరిలో , ఎవరికైనా ఉండొచ్చు కానీ , గొడ్రాలు అనే బిరుదు నిచ్చి ఆమె ని మాటలనే రాళ్లు తో హింసించే లాటరీ కి అంతటా అంగీకారం సంపాదించిన పురుషాధిక్య సమాజం కళ్ళ ముందు నిలిచి ఒళ్ళు గగుర్పాటు చెందింది.

  స్త్రీ ల మీద హింస ఇలాగే , అదో వినోద కార్యక్రమం లాగా , అందరి అంగీకారం తోనే జరగడం మనం చూసే ఉన్నాం..చూస్తూనే ఉన్నాం

  గొప్ప కథ ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు..🙏🙏🙏.

  • మీ స్పందనకి ధన్యవాదాలు, వసంత గారూ!

 • చాలా ,మంచి అనే మాట వాడడానికే భయం వేస్తోంది ,ఆసక్తికరమైన కథ .నా చిన్నప్పుడు ఇలియడ్ ఇంగ్లీషులో చదివినప్పుడు , అనుకూలమైన గాలులు వీచడానికోసం అగామెమ్నాన్ తన కూతురు ఇఫిజీనియాను బలి ఇచ్చిన సన్నివేశాన్ని చదివినప్పుడు ఇలియడ్ ని హీరోయిక్ ఎపిక్ అని ఎందుకంటారని అతలాకుతలం అయ్యాను .ఇవాళ మళ్లీ అంత ఆవేదన కలిగింది .
  మీ విశ్లేషణ సమగ్రంగా ఉంది

  • కథని రాసిన విధానం వల్ల, దీని ప్రభావం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ధన్యవాదాలు, కల్యాణి గారూ!

 • కథ చదవడం పూర్తయ్యే సరికి బాణామతి చేస్తున్నదనే నెపంతో దళిత మహిళను గ్రామస్తులంతా కలసి కొట్టి చంపిన సంఘటన గుర్తచ్చింది.
  కథ గురించిన విశ్లేషణ చదివాక ఇలాంటి సంఘటనల వెనక ఉన్న లోతు మరింతగా అర్థమయింది.
  గొప్ప కథను పరిచయం చేస్తూ వివిధ కోణాల్లో చేసిన మీ విశ్లేషణ మరింత ఆకట్టుకుంది.

  • ఈమధ్య వింటున్న లించింగ్ సందర్భాలన్నింటి వెనకా ఉన్నది ఈ మూకుమ్మడి హింసాప్రవృత్తే శాంతిప్రబోధ గారూ! అందుకే ఈ కథకి ఇప్పటికీ ప్రాసంగికత ఉంది. వ్యాసం/కథ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

 • అనేకానేక కారణాల వల్ల మనిషిలోలోపల క్రూరత్వం, కర్కశత్వం పేరుకుంటాయి. మనుషులు మూకలుగా మారినప్పుడు అవి బయటపడతాయి. సంప్రదాయం పేరుతోనో, విప్లవాల చాటునో, ‘ కేవలం ఆదేశాలను అమలు చేస్తున్నాం’ అనే మిషతోనో చరిత్రను రక్తసిక్తం చేసిన అమానుషమైన దారుణాలను లెక్కించడం అసాధ్యం. అదే ఈ కథ మనకు షాకింగా, ఒక మారుమూల జరిగిన సంఘటన రూపంలో తెలియజేసింది. కథను ఎలా చదవాలి? ఏయే కోణాలనుండి రచనలను విశ్లేషించవచ్చు? అనే ప్రశ్నలకు జవాబు మీ వ్యాసం. మీ ఈ ప్రయత్నం మూలంగా తెలుగు కథకీ, సాహిత్యానికీ గొప్ప మేలు జరుగుతుందని నా నమ్మకం. అభినందనలు! ఈ శీర్షిక క్రింద వెలువడబోయే వ్యాసాలకై ఎదురు చూస్తూ –

  • మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సుధాకర్ గారూ! ఆసక్తి చూపించేవారుంటే, ఎంత శ్రమ తీసుకునయినా ఆనందంగా చేయదగ్గ పని ఇది. మీ నమ్మకాన్ని నిలబెట్టగలననే నమ్ముతున్నాను! 🙂

 • ఈ మధ్యకాలంలో ఇంత ‘మంచి’ (అనకూడదేమో) కధని చదవలేదు. ఒక విధమైన jombie వాతావరణం సృష్టించడం లో రచయిత్రి ప్రతిభ కనబడుతుంది. అంతే కాదు ‘మంద/ మూక’ మనస్తత్వం ఎంత దారుణంగా ఉంటుందో కూడా చూపించింది. మరీ ముఖ్యంగా మన చుట్టూ ఇప్పుడు కనిపిస్తున్న కొన్ని అమానుషాలా సందర్భం లో ఈ కధ చదవడంతో ‘కుదుపు’ కు లోని కాని పాఠకుడుండకపోవచ్చు. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం, ప్రతి మాట, ప్రతి చర్య ని పకడ్బందిగా పొదిగి వ్రాసిన కధ.

  Thank you once again for sharing this story. By the way, sorry, I read the English version alone and did not even peep into the Telugu link. 🙂

  • Thanks, Anil garu! Good to know that you liked the story, and its relevance.

   It’s no problem. Telugu version is only for those who feel more at home with the translation. It’s perfectly all right! 🙂

 • తమిళంలో భారతీ రాజా తీసిన సినిమా తెలుగులో తూర్పువెళ్లేరైలుగా బాపూ రమణలు యధాతధంగా తీసేరు. అందులో ఊరిక్షేమం కోసం ఒక కన్య నగ్నంగా కాగడాపట్టుతుని ఊరంతా తిరగాలి. ఊరిపెద్దలు లాటరీ ద్వారా చేసిన తీర్పు. ఇలాంటి దుర్మార్గపు ఆచారాలకి మూలాలు ఇంత బలంగా ఉన్నాయనమాట

  రమణమూర్తి గారు మంచి పని చేస్తున్నారు అభినందన ధన్యవాదాలు

  • ధన్యవాదాలు, వీరలక్ష్మీదేవి గారూ!
   (తూర్పు వెళ్లే రైలు సినిమాలో ఆ సన్నివేశం లీలగా గుర్తుంది కానీ, దాని వెనకాల ఉన్న కారణాలు గుర్తులేవు…)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు