కథాప్రపంచానికో “బ్రేకింగ్ న్యూస్”

ఇవి చిన్న కథలే కానీ గట్టి కథలు!

తెలుగు కవిత్వంలో “దుర్గాపురం రోడ్”పై రెండవ జెండా ఎగరేసిన దేశరాజుగారు సుమారు 1991 నుండి అప్పుడప్పుడు కథగా కూడా తళుక్కుమన్నారు. అలా 1991 ప్రాంతంలో కథగా కలం కదిపిన ఆయన ఒక సుదీర్ఘ విరామం తీసుకుని ఉన్నట్టుండి విజృంభించి 2020 నుండి రాసిన కథలతో పద్ధెనిమిది కథలను సంపుటిగా తీసుకురావడం సాహితీ లోకానికి “బ్రేకింగ్ న్యూస్”. ఆ విరామంలో కవిత్వాన్ని గట్టిగా హత్తుకున్నారు. కవితను కథను జోడుగుర్రాలుగా స్వారీ చేస్తూ తనదైన ముద్రను సాధిస్తున్న ఆయన ఈ సంపుటిలో తన యవ్వనంలోని గిలిగింతలు పెట్టిన ప్రేమ నుండి సామాజిక సమస్యల వరకూ ఎన్నో పార్స్వాలను కథలలో స్పృశించారు. సంవత్సరాలు గడిచేకొద్దీ సమాజంలోని మార్పులను నిశితంగా పరిశీలించి అల్లిన ఈ కథలు,  చుట్టూ దృష్టి సారిస్తే నిత్యం మన కళ్ళకు  కనబడేవే.

ఆయన తొలి కథ “వానముద్దు” – “కాలువలో వారి నీడలు వెండి కాన్వాసుపై కలువపువ్వు కుంచెతో వెన్నెల రంగులో ముంచి వేసినట్లుగా కౌగిలించుకుంటున్నాయి” వంటి ఆకట్టుకునే వాక్యాలతో కవితాత్మకంగా సాగిన ప్రేమ కథ. తొలి ప్రాయంలోనే దేశరాజుగారు తన రచనా నైపుణ్యాన్ని చూపించారు. కథ ఆసాంతం చదివిస్తూ తొలికథ అనే ఆలోచనే మనలో కలుగనీయదు. అప్పుడే రాసిన “నీ కోసం నేను లేనూ” కథ కమ్యూనిస్టు ఉద్యమ నేపధ్యంతో కూడిన ప్రేమ కథ. ఈ కథ నుంచి ఆయన తన కథల్లోని ఏ పాత్రలకు పేర్లు పెట్టకుండా ఒక కొత్త ప్రయోగం చెయ్యడంలో ఆయన సఫలమయ్యారు. 1992లో రాసిన “అన్నయ్య రావాలి” కథలో సైతం  ఎర్రజెండా ఛాయలు కనబడతాయి. బహుశా దేశరాజుగారు తన ఇరవై ఏళ్ళ వయసులో ఎరుపురంగు వైపు ఆకర్షితులై ఉండి ఉంటారు.

నేడు సమాజాన్ని పట్టి కుదిపేస్తున్న సమస్య ‘చదువులు, చావులు’. చదువుల పరుగులలో పడి పిల్లలు విపరీతంగా మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడడం మనకు తెలిసిందే. అయినా తల్లిదండ్రులందరూ అదే బాటలో నడుస్తూ ఆ పరుగుల ప్రపంచంలోకి పిల్లలను బలవంతంగా తోసి ర్యాంకులంటూ ఒత్తిడి చెయ్యడంతో, అటు అమ్మానాన్నల కోరికలు తీర్చలేక ఇటు చదువు భారాన్ని మొయ్యలేక విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆ ఇతివృత్తాన్నే దేశరాజుగారు “టపటపలాడుతున్న రెక్కలు” అంటూ ఒక తండ్రి చదువు బందిఖానాలో చిక్కుకున్న తన కూతురు కోసం పడే దుఃఖపూరిత ఆరాటాన్ని, ఎగరలేని అసహాయతతో రెక్కలు టపటపలాడిస్తున్న పావురంతో పోల్చారు. సాధారణంగా కథకులు కథలలో తల్లి ప్రేమనే ఎక్కువగా చూపుతారు  కానీ తండ్రి కోణంలోంచి రచయిత  కథను చక్కగా నడిపించారు. ఈ కథ చదువరులను ఆలోచింపజేస్తుంది.

ఇప్పటి చదువుల నేపధ్యంలోనే రాసిన మరో కథ “ఫారమ్ కోడిపిల్ల”. ఫార్ములాలూ ఈక్వేషన్లు బట్టీ పట్టి వందకు వందకు మార్కులు తెచ్చుకునే  పిల్లలు, ఆ మార్కులు చూసి గర్వంతో కాలర్ ఎగరేసే తల్లిదండ్రులకు పెట్టిన మెత్తని చురక ఈ కథ. రోజూ కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తీసుకెళ్ళే తండ్రి ఒక రోజు రాలేకపోతే, ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలియని ఆ అబ్బాయి ఏం చేసాడు, చివరకు ఇల్లు చేరాడా? ఇది ఆసక్తితో చదివించే కథ. చదువు తప్ప లోకజ్ఞానం లేకపోతే పిల్లల పరిస్ధితి ఏమిటో తెలియజెబుతూనే అందరి మనసులను ఛెళ్ళున చరుస్తూ మేల్కొలుపుతుంది.

నవంబర్, 2016లో సర్కారు ప్రకటించిన నోట్లరద్దు వార్త దేశం మొత్తాన్ని ఒక్క కుదుపు కుదిపింది. ఐదువందలు, వెయ్యినోట్లు చెల్లవనగానే ప్రజలు ఉలిక్కిపడి ఏటిమ్‌లు, బ్యాంకుల వద్ద పడ్డ పడిగాపులు  మరవాలన్నా మరచిపోలేం. ఆ రోజులను తలచుకోగానే అప్పటి దృశ్యాలన్నీ సినిమారీళ్ళలా కళ్ల ముందు కదలాడతాయి. ఏ కుటుంబమూ ఈ కష్టానికి మినహాయింపు కాలేదు. ఆ సమయాన్ని, కష్టాల్నీ దృష్టిలో పెట్టుకుని రాసిన కథే “డీహ్యూమనైజేషన్”. నోట్లను చెల్లించడానికి, చిల్లర కోసం ప్రయత్నించడానికి ఒక కుటుంబంలోని భార్యాభర్తలు, పెద్దావిడతోసహా పడ్డ పాట్లను మంచి కథగా మలిచారు రచయిత. కథ చదువుతున్నంతసేపూ పాఠకుడికి  తన కుటుంబం పడ్డ కష్టం తప్పక జ్ఞప్తికి వస్తుంది. అలాగే కథ చివరలో “ఆమె మృతదేహంలా లేదు, మహాలక్ష్మిలా ఉంది” అన్న కొసమెరుపు వాక్యాన్ని చదివినపుడు మన పెదవులపై ఒక విషాదపు చిరునవ్వు తప్పక ఉదయిస్తుంది.

చిన్న తలనెప్పికో, కాస్తంత జ్వరానికో డాక్టర్ దగ్గరకు వెడితే వంద టెస్టులు, వేల బిల్లులతో ఆరోగ్యకరమైన మనిషిని కూడా పేషెంటుగా మార్చడం హాస్పిటల్స్‌కు అలవాటని మనకో, మనకు స్నేహితులకో అనుభవమయ్యే ఉంటుంది. కానీ ఏకంగా ఆపరేషన్ అంటూ ఊదరగొట్టి ఒక కుటుంబాన్ని అల్లకల్లోలం చేసిన ఒక డాక్టర్ కథే “బ్రేకింగ్ న్యూస్”. కడుపునెప్పి అని డాక్టర్ దగ్గరకు వెడితే, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చెయ్యాలని చెప్పడంతో భార్యాభర్తలిద్దరూ తల్లడిల్లిపోతారు. అటువంటి క్లిష్ట సమయంలో ఒకరంటే ఒకరికి గుండెల్లో ఎంత ప్రేమో దాగుందో  బయటపడుతుంది. చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే కథ మొత్తం చదవాల్సిందే.

ఇప్పుడు అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలే అనడంలో సందేహం లేదు. ఇక మొగుడూపెళ్ళాలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇంటి పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని ఇళ్ళు అవసరమైన వాటితో పాటు, అక్కర్లేని సామాన్లతో కిక్కిరిసిపోయి ఊపిరాడనట్టు ఉంటాయి. ఇంటి నిండా ఖరీదైన సామాన్లు ఉన్నా, ఇల్లంతా బూజులు వేళ్ళాడుతూ, ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే దొర్లుతూ చిందరవందరగా ఉంటాయి. మనుషుల మధ్య పెద్దగా మాటలు లేకుండా, పిల్లలకు మంచి పోషణ లేకుండా బతుకు చప్పగా నడుస్తుంటుంది. అలాంటి ఒక తీరువ లేని ఇంట్లో ఒక పెద్దజంట పెద్దరికంతో కొడుకూ కోడలుకు ఇచ్చిన మంచి సందేశమే “గృహమేగా స్వర్గసీమ”.

సీరియస్ కథలే కాకుండా హాస్యకథలు రాయడంలో కూడా రచయిత సఫలమయ్యారు అని తెలియ జెబుతాయి “దెయ్యాలపండుగ”, “డబుల్ రోస్ట్” కథలు. హాస్యమే కాకుండా అదృశ్యంగా ఒక సందేశం కూడా ఇస్తాయి. సరైన చదువు లేదని, పల్లెటూరిబైతని భార్యను చిన్నచూపు చూసిన భర్తకు భార్య ఎలా బుద్ధి చెప్పిందో “దెయ్యాల పండుగ” చదివితే తెలుస్తుంది. ఈ రెండు కథలూ మోడ్రన్ సిటీలైఫ్‌ను ప్రతిబింబించే కథలు. సెల్ ఫోన్ మన శరీరంలో ఒక అవయవంగా మారిపోయాక, వాట్సాప్ వాడని వారెవరూ ఉండరేమో? సోషల్ మీడియో అలవాటైన ప్రతివారు వాట్సాప్‌లో తనకొచ్చిన మెసేజ్‌లను, ఉచిత నీతులను ఫార్వార్డ్ చేయడమే కాక అందులోని జ్ఞానాన్ని మెదడు నిండా పొంగి పొరలేలా నింపుకోవడమూ చూస్తూనే ఉంటాం. ఆ నేపధ్యంలో సెటైరికల్ గా రాసిన కథ “జ్ఞానగుళిక”. ఇక “ఆశల రెక్కలు”, “పునరుజ్జీవం” మొదలైన కథలన్నీ ఫీల్ గుడ్ కథలు. ఈ సంపుటిలో ఏ కథను పట్టుకున్నా చివరి వరకూ ఆసక్తిగా చదివిస్తాయి.

‘ధర్మపత్నులు నైటీలు వేసుకోకూడదనే రూలేం లేదని మీరిక్కడ గుర్తుంచుకోవాలి”, “ఆమె నెట్‌లో దొరికిన ఫోటోలకుగానీ, బాల్కనీలో పూలమొక్కల ఫోటోలు తీసిగానీ చక్కని కాప్షన్‌లు పెడుతుంది. చిన్నచిన్న కవితలు రాసి ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పెడుతుంది”వంటి ఎన్నో వాక్యాలు కథలలో చదివినపుడు రచయిత మెట్రో లైఫ్‌ను కాప్చర్ చేసిన తీరు మనకు గమనింపుకొస్తుంది. మూస పద్ధతిలో కాకుండా నవ్యతకు పెద్దపీట వేసి, కొత్త నిర్మాణ పద్ధతులను అన్వేషిస్తూ రాసిన ఈ పద్ధెనిమిది కథల సమాహారం దేశరాజుగారిని మంచి కథకులుగా నిలబెట్టాయనడంలో  సందేహం లేదు. “బ్రేకింగ్ న్యూస్” ను వినండి.. కాదు కాదు తప్పక చదవండి. మిమ్మల్ని నిరాశ పరచదు. ఇవి చిన్న కథలే కానీ గట్టి కథలు అని గట్టిగానే బల్లగుద్ది మరీ చెప్పవచ్చు.

ప్రతులకు:

ఈ పుస్తకాలు విజయవాడ బుక్ ఫెయిర్ లోని విశాలాంధ్ర పల్లవి స్టాల్స్ లో లభిస్తాయి. అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంటాయి.

*

పద్మావతి రాంభక్త

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు