ప్రతి కథకీ ఒక సాఫ్ట్ వేర్…

కవిత కవిత కావటానికి కవితా నిర్మాణ వ్యూహాలు ఉన్నట్లే కధ కధ కావటానికీ, నవల నవల కావటానికీ, నాటకం నాటకం కావటానికీ వివిధ నిర్మాణ పద్ధతులు ఉంటాయి.

సిరీస్ లో కథ చరిత్ర గురించో దాని పరిణామక్రమాన్ని గురించో నేను వివరించబోవటం లేదు. వస్తువుగురించో, భావజాలంగురించో కధా రచయితల  దృక్పధాల గురించో ప్రత్యేక మానసిక ధోరణులగురించో విశ్లేషించే పనికి పూనుకోవటంలేదు.ఈరోజు కధ స్థితిగతులు ఎలావున్నాయో చర్చించటమూ ఈ కాలం లక్ష్యం కాదు. కథలోపలి కధ గురించి ముచ్చటించబోతున్నాను.

కథలోపలి కధ అంటే కథని కథగా మలిచే శిల్ప,నిర్మాణ తీరుతెన్నులు అనుకోవచ్చు. వస్తువు కథగా రూపొందడంలో ఇమిడివున్న కళా మాధ్యమం అనుకోవచ్చు. కధా కళకు చెందిన కీలకాలు అనుకోవచ్చు. కవిత కవిత కావటానికి కవితా నిర్మాణ వ్యూహాలు ఉన్నట్లే కధ కధ కావటానికీ, నవల నవల కావటానికీ, నాటకం నాటకం కావటానికీ వివిధ నిర్మాణ పద్ధతులు ఉంటాయి. అంటే సాహిత్యం సాహిత్యమయ్యేది సాహిత్య భాష అనే ప్రత్యేక డిపార్ట్మెంట్ వల్ల కాదు.ప్రత్యేక కళా నిర్మాణం వల్ల అనే బేసిక్ ప్రెమిసెస్ నుంచి నేను మాట్లాడబోతున్నా. మరి భాషకు సాహిత్య ప్రక్రియల్లో ప్రత్యేక పాత్ర ఉండదా అంటే ఉండదని అనలేము.ఏ సాహిత్య ప్రక్రియలోనైనా భాష అదనపు పాత్ర పోషిస్తుంది కానీ మౌలిక పాత్రను ఆ ప్రక్రియకే వర్తించే నిర్మాణత పోషిస్తుంది. ఇది కథకు ఎలా వర్తిస్తుందో కాంక్రీట్ గా చర్చించటం ఈ సిరీస్లో ఉంటుంది. ఈ క్రమంలో కధా కళలో ఇతర ప్రక్రియల ప్రమేయాలు ఏమేరకు పొడసూపుతాయో చూపించే ప్రయత్నమూ చేయబోతున్నా.

కంప్యూటర్ భాషలో చెప్పుకోవాలంటే కథ కథ కావటంలోని సాఫ్టువేరును రివీల్ చేసే పనికి నేనిక్కడ పూనుకుంటున్నానన్నమాట. ఈ పనిలో భాగంగా కథన రీతుల్నీ, నడకనీ, మొదలు, ముగింపుల్నీ, వాటిని కలిపే సూత్రాలనీ, వాతవరణాన్నీ, ఘటనల్నీ, సన్నివేశాల్నీ, పాత్రాల్నీ , వాటి ఇంటరాక్షన్ నీ, సంభాషణలనీ , వర్ణననీ అవసరం మేరకు చర్చిస్తూ ఉంటా. ఏదో ఒక కథ ఆధారంగానో కొన్ని కథల ఉపపత్తుల ద్వారానో నేను చేయబోయే ఈ పనిలో ప్రసిద్ధ కధకుల కధలే విశ్లేషణకి లోనవుతాయని అనుకోవాల్సిన పనిలేదు.ఎప్పటినుంచో రాస్తున్నవారి కధలే చర్చలో ప్రధాన చోటు పొందుతాయనుకోవటమూ కరెక్ట్ కాదు. ప్రస్తుతం వస్తున్న కధకుల కథలూ, ప్రసిద్ధత ట్యాగ్ కిందికి రానివారి కధలు కూడా ఖచ్చితంగా చర్చకు లోనవుతాయ్.

కధలు ఎక్కడినుంచో రాలిపడవ్. వస్తువు లాగే కథా నిర్మాణాలు కూడా పరిసరాల నుంచీ ,చుట్టూ వున్న జనం నుంచీ వస్తాయ్. మనుషులు కథల్లో పుట్టి కథల్లో పెరుగుతారని అందుకే అంటాడు జియో పాల్ సాత్ర. A man is always a teller of tales,he lives surrounded by his stories and the stories of others, he sees everything that happens to him through them. మనిషికీ కథకీ ఉన్న విడదీయరాని బంధాన్ని సార్త్ర గమనించినట్లే Ben Okri గూడా నొక్కి చెప్పాడు. ఒక జాతిని విషపూరితం చెయ్యాలంటే ఆ జాతి కధల్ని విషపూరితం చెయ్యాలంటాడు Okri.కథలకి వాటి శక్తి వాటి వస్తువుతో సమానంగా వాటి శిల్ప నిర్మాణాల వల్ల సమకూరిందనీ మతాలు మనుషుల్ని వాటి కథల ద్వారా ఆకట్టుకోవటంలో వీటి పాత్ర ఎక్కువ అనీ Okri మనకు చెబుతాడు. DH Lawrence ఒక చోట అన్నట్లు Trust the tale. The proper function of the critic is to save the tale from the artist who created it, అనే సూత్రీకరణ ను దృష్టిలో ఉంచుకుని కథా చర్చ చేయాలనేది ఇక్కడి ఉద్దేశం. కధకుల పేరు ప్రతిష్టలు కాకుండా కధ ఉన్నతిని దృష్టిలో ఉంచుకోవడం ఈ రీత్యా తప్పదు.

తెలుగు కథలోని విభిన్న నిర్మాణ పద్ధతుల్ని విశ్లేషిస్తూనే అవసరమైన ప్రతిసారీ ఇతర భాషా కధల్ని కూడా ప్రస్తావించడం నా స్కీంలో ఒక భాగం. వీలున్నంత వరకూ నిర్వచనాలనీ ప్రవచనాలనీ పక్కనబెడుతూ చర్చ ద్వారానే దీన్ని ఒక కొలిక్కి తేవాలని ప్రయత్నం.

గుంటూరు లక్ష్మి నర్సయ్య

గుంటూరు లక్ష్మి నర్సయ్య

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిసంగమం లో కవిత్వ నిర్మాణం, సారంగ లో కథా నిర్మాణం – ధన్యవాదాలు సర్, క్రమం తప్పకుండా చదువుతాను.

  • కొత్త కోణములో కథ విమర్శ, విశ్లేషణ కు తెర తీసినారు.. ఐ పాఠము ఇప్పుడు అవసరం.. అయినా అవసరమైన పనిని సరయిన సమయములో చేయడం మీకు సరదా అని తెలుసు. అభినందనలు,, ధన్యవాదాలు.

  • చాలా మంచి ఉద్దేశం. నాలాంటి సాహితి ప్రియులకు మీరు తలపెట్టిన ఈ కార్యక్రమం బాగా ఉపయోగిస్తుంది. “ఈ పనిలో భాగంగా కథన రీతుల్నీ, నడకనీ, మొదలు, ముగింపుల్నీ, వాటిని కలిపే సూత్రాలనీ, వాతవరణాన్నీ, ఘటనల్నీ, సన్నివేశాల్నీ, పాత్రాల్నీ , వాటి ఇంటరాక్షన్ నీ, సంభాషణలనీ , వర్ణననీ అవసరం మేరకు చర్చిస్తూ ఉంటా. ” ఎదురు చూస్తున్నాను .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు