కత రాస్తే నా కడుపులో ఆరాటం చల్లారుతుంది!

“నా చదువు ఓనమాల కాడ ఆగిపోయింది.నా భాష,నేను మాట్లాడే భాష నాకు తెలుసు.వేరే భాష నాకు రాదు.”

ఎండపల్లి భారతి తన మొదటి పుస్తకం ‘ఎదారి బతుకులు’ తోనే తెలుగు కథా ప్రపంచంలో బలమైన అడుగు వేశారు. దళిత స్త్రీల జీవితాలపై ఆమె ఒక కొత్త కథా వెలుగు ప్రసరించారు. ఆధునిక సమాజానికి తెలియని కొన్ని దళిత స్త్రీల బతుకు వెతలను ఆమె జాయిగా కథలుగా చెప్పారు.  జాలారి పూలు ఆమె మూడవ పుస్తకం.చాలా వేగంగా తన జీవిత శకలాలను కథలుగా మలచారు.కథలకు వున్న,స్త్రీ కథకురాళ్ళకు వున్న అనేక అడ్డంకులను,పొరలను ఆమె అవలీలగా అవతలకు తన్నేసారు. అంతగా ఎవరూ తాకని వస్తువుని స్వీకరించడం,శషబిషలు లేని పల్లె భాష,చక్కటి చదివించే శైలి ఆమెను మిగిలిన కథకుల కన్నా కాస్త భిన్నంగా నిలిపాయి.
భారతి గారి తాజా పుస్తకం ‘జాలారి పూలు ‘మనల్ని మదనపల్లె లోని దళిత పల్లెల్లోకి వేలుపట్టుకు తీసుకెళుతుంది. హాసినీ రామచంద్ర ఫౌండేషన్ (ఖమ్మం), దాసరి శిరీష పురస్కారం పొందిన సందర్భంగా ఎండపల్లి భారతి  రాస్తున్న కథల పట్ల ఆమె మనసులో వున్న కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఇది.
రైతువారీ శ్రామిక మహిళగా వున్న మీరు కథా రచనలోకి ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు?
నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలా. నేను ఊహించనివే జరిగాయి.అలాగే నా జీవితంలో కిరణకుమారి మేడంగారు రాబట్టి ఈ కథలోకి నేను అడుగుపెట్టడానికి దావను ఆమె మలిచారు.నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి,నాటకాలు సినిమాలు,కథలు అంటే ఆ కథలో నేను లీనమైపోయేదాన్ని .నేను రాసిన మొట్టమొదటి కథ సావు బియ్యం.ఆ కథను చూసి అందరూ మెచ్చుకోవడంతో నాకు ఉన్న బాధలు మర్చిపోవడానికి ఇది ఒక దారి అనిపించి పెన్ను,పేపరు కొంగుకు ముడి వేసుకోవడం జరిగింది.
ఏ పుస్తకాలు చదవకుండా,ఏ రచయితా పరిచయం లేకుండా సరాసరి కథా రచనలోకి వచ్చేసారు.కథలు ఎలా రాయగలిగారు?ఇందుకు స్ఫూర్తి ఎవరైనా వున్నారా?
నేను చదివింది ఐదో తరగతి. ఒక పేపర్ నా చేతికిచ్చి చదవమంటే కూడి,కూడి అక్షరాలు మింగతా చదవతా ఉండేది. మారుమూల పల్లిలో నా ఈడు పిల్లోళ్లల్లో ఐదు చదివింది నేనే.ఇంకా చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు.గిజిగాడే కతం పొలిమి అంతా తిరిగి గడ్డిదెచ్చి గూడు అల్లినట్టు ఈ సంసారాన్ని ఈదడం సగపెట్టడమే సరిపోతుంది.ఆటికి కిరణ్ మేడం వాళ్ళ ఇంటికి పోయినప్పుడు..పెద్ద పెద్ద రైటర్స్ బుక్కులు ఒక 60,70 నాకు ఇచ్చింది.వాటిని భద్రంగా దాచుకున్నా.ఏదైనా ఒక బుక్కు బాగా నచ్చి చదవదామనుకుంటే కనీసం రెండు నెలలు పడుతుంది.మేడం గారు ఆడికి కొన్ని మంచి కథలు వస్తే ఫోన్లో చదివి వినిపిస్తారు.పుట్టు మూగకు,35 సంవత్సరాలకు మాట్లాడడానికి గొంతు వస్తే,తను చిన్నప్పటినుండి చెప్పాలని చెప్పలేకపోయినవి ఎన్ని ఉంటాయో.అందుకే ఇప్పుడు నేను రాయవలసినవి రాసేసి, టైం దొరికినప్పుడు చదవదామని అన్ని రకాల బుక్కులు భద్రంగా దాచుకున్నాను.
మీ కథల్లో యాస,భాష పట్ల అభ్యంతరాలు ఏమైనా వచ్చాయా?వాటి పట్ల మీ స్పందన ఏమిటి?
యాస,భాష అభ్యంతరాలు వచ్చాయి.నీ భాష అర్థం కాలేదు అన్నారు,బూతులు పెట్టకూడదు అన్నారు,మీరు రాసే కథల వల్ల ఏమి మార్పు కోరుకుంటున్నారు అన్నారు.ముందుగా నా చదువు ఓనమాల కాడ ఆగిపోయింది.నా భాష,నేను మాట్లాడే భాష నాకు తెలుసు.వేరే భాష నాకు రాదు.బూతులు అవి మా బతుకులో భాగమే.నాకు తెలిసిన రీతిలో చెప్తేనే కదా మీకు అర్థం అవుతుంది.అట్లే నాకు కూడా అర్థం అవుతుంది.
ఒక కథా వస్తువు శైలి మీకు సహజంగా వస్తుందా?మీరు ఎన్నుకుంటారా?కథ రాసేప్పుడు మీరు ఏవి దృష్టిలో పెట్టుకుంటారు?
మీరు చెప్పిన శైలులు,వస్తువు,ఇంకా అవేవి ఉన్నాయో అవి ఏవి నాకు తెలియదు. నా కడుపులో, నా తలకాయలో, ఒక బాధ గురించో,ఒక సంతోషం గురించో ఇది చెప్పాలా అన్న ఆరాటం కలిగిందే కథ అనుకున్న.నేను కథ రాసే చోట ఉండను. నా శరీరం మాత్రమే ఆడుంటుంది.నేను కథ కాడే ఉంటా.
చాలా తక్కువ సమయంలో మూడు పుస్తకాలు వెలువరించారు.తెలుగు కథా ప్రపంచంలో మీదైన గుర్తింపు పొందారు.ఈ గుర్తింపు మీ కథలకు వస్తుందని మీరు ఊహించారా?దానివల్ల మీరు అనుకున్న ప్రయోజనం నెరవేరిందా?
నాకు ఈత రాదు. మనిషి పడితే లెయ్యలేని అంత లోతులో సంసారం అనే ఒక కొమ్మ ఉంది. ఆ కొమ్మను నేను రెండు చేతులతో రెండు కాళ్లతో పెనేసుకున్న. గాలి వచ్చినా, వాన వచ్చినా కొమ్మ ఊగిపోతుంది. గాలివాన రాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే నిలకడగా ఉంటుంది.ఆ సమయంలో మాత్రమే రాయగలుగుతున్నా.నేను చూసే ప్రతి దాని గురించి రాయాలంటే నాకంటే బాగా రాయగలిగే కోటి మంది రైటర్స్ రాయగలిగే అంత ఉంది.ఒక ఆకుపైన ఒక మనిషికి జీవితకాలం సరిపోతుంది.నేను ఊరికే పై పైన రాస్తున్నానంతే.గుర్తింపులు,ప్రశంసలు పక్కనపెడితే నా కడుపులో ఆరాటం చల్లారుతుంది.అదొక్కటే నాకు తెలుసు.
దళిత స్త్రీల వెతలను కథలుగా మలచారు.ఆ కథల పట్ల మీ సాటి స్త్రీల స్పందన ఏమిటి?మీ కథల వల్ల వారి జీవితాల్లో ఏమైనా స్వల్ప మార్పులు వచ్చాయని అనుకుంటున్నారా ?
నా చేతులు కాలినయి.ఆ బాధను నేను రాస్తే అది నాకంటే ఎదుటివారికే ఎక్కువ ఉపయోగపడుతుంది. చేతులు కాలని వారికి,కాల్చుకోకుండా ఉండడానికి ఈ కథలు.నేను దళిత కుటుంబంలో పుట్టినాను కాబట్టి దళిత స్త్రీల వెతలు అంటున్నారు. నేను వేరే కులంలో కుటుంబంలో పుట్టినా ఆవేదనలని అలాగే రాసి ఉంటాను.ఆకలి,సంతోషం,బాధ, ప్రేమ,ఇది ఒక వర్గానికి చెందినది కాదు.మార్పు అనే మాట మీరు పాలకులను అడిగితే బాగుంటుంది.వారి వలనే మనిషి జీవితాలలో మార్పులు వస్తాయి.నేను చేస్తుంది కేవలం ఫోటోలు తీసి ఇవ్వడమే.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి ?
భవిష్యత్తు ప్రణాళిక..ఇది మాత్రం చాలా గట్టిగా ఉంది. తెలుగు,ఇంగ్లీష్,హిందీ ఈ మూడు భాషలు చదవడం, రాయడం,తప్పులు లేకుండా పూర్తిస్థాయిలో నేర్చుకోవాలి. కథలు ప్రణాళిక ప్రకారం రాయను. వస్తే రాస్తా.
*

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కని ఇంటర్వ్యూ జీవితమెప్పుడూ కొత్తగానే ఉంటుంది… ఇరువురికి సారంగ వెబ్ మ్యాగజైన్ యాజమాన్యాకి హృదయపూర్వక అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు