కడుపులో భయం పెట్టుకు బతకాల!

“ఇట్టాటియన్నీ ఇంక జరగవులే టీచరుగారూ” అంది నాకు భరోసా ఇస్తూ.

సరా సెలవులు పూర్తై పిల్లలంతా క్లాసులకొస్తున్నారు. ఎప్పటిలాగే సెలవులు తర్వాత మొదటిరోజు హాజరు తక్కువగానే ఉంది. క్లాసులో పదిమంది కూడా లేరు. శ్రావ్య వచ్చి తన క్లాసుమేట్లు రోజా, నాగలక్ష్మిలని పిల్చుకొస్తానని వెళ్లింది. ఆరోజుకి ఇక పాఠం చెప్పటం కుదరదు. కూర్చున్నాను.

మనోజ్ తన కొత్త చొక్కా చూబించాడు. “టీచర్, నేను పదిరోజుల్లో ఐదు ఊళ్లు వెళ్ళొచ్చాను.” అన్నాడు గొప్పగా. ఏయే ఊళ్లల్లో ఎవరెవరున్నారో, ఏంచేసేడో చెప్పుకొచ్చాడు. వాడి సంబరం చూస్తున్న దినేష్ అడిగేసేడు, “సెలవుల్లో ఇచ్చిన హోం వర్క్ చేసేవా లేదా?”

“ఇంకా కొంచెం ఉంది, ఇప్పుడు చేస్తాగా.” అన్నాడు తన మాటలకి అడ్డుతగిలిన దినేష్ ని చూస్తూ.

“మరి ఈ రోజు హోం వర్క్ చూపియ్యకపోతే టీచర్ ఊర్కున్నారా?” దినేష్ రెట్టించాడు.

“సోషల్ టీచర్ ఈరోజు రాలేదుగా.” మనోజ్ జవాబు విని,

“నేనూ ఇంకా కొంచెం హోం వర్క్ చెయ్యాలిలే” అంటూ దినేష్ ఒప్పుకున్నాడు.

సుమంత్ వచ్చాడు. సెలవుల్లో మామయ్య పిల్లలు వచ్చారని, వాళ్లతో బాగా ఆడుకున్నానని చెప్పాడు.

“టీచర్, కిశోర్ సెలవుల్లో కూడా చదువుకున్నాడంట.” అన్నాడు.

“మరి ఆడుకోలేదా?” మిగిలిన హోంవర్క్ చేసుకుంటున్న దినేష్, మనోజ్ వెంటనే అడిగేసారు.

“లేదు, వాళ్లమ్మతో మట్టి పనికి వెళ్లారంట రమ్య, వాడు” సమాచారమంతా చెప్పాడు సుమంత్.

ఇంతలో రానే వచ్చారు కిశోర్, రమ్య.

దినేష్ వెంటనే అడిగేసాడు, “ఏంట్రా, సెలవుల్లో కూడా చదువేనా నీకు?” అంటూ.

“అవును, చదువుకుంటే ఏమైంది?” కిశోర్ అడిగాడు.

“మట్టి పనికెళ్లావంటగా” మనోజ్ నిలదీస్తున్నాడు.

“మా అమ్మతో చెల్లి, నేనూ కూడా వెళ్లాం.” సంచీలోంచి పుస్తకాలు తీస్తూ చెప్పాడు.

కిశోర్ ని దగ్గరకి పిలిచాను. “నువ్వు మట్టిపని చెయ్యగలవా?” అంటే,

“ఉహు, అమ్మ చేస్తుంది. చెల్లి, నేను అక్కడ చెట్టుకింద కూర్చుని చదువుకుంటాం. చెల్లికి కథల పుస్తకం కూడా చదివి చెప్పా.” అన్నాడు.

వాణ్ణి చూస్తే ముచ్చటేసింది.

“పనికోసం ఎక్కడికి తీసుకెళ్లింది అమ్మ?”

“రోజూ బస్సెక్కి వెళ్లాలి. రమ్యకి, నాకు బస్సుపాసులు కూడా ఉన్నాయి” అంటూనే గబగబా సంచీ తీసి మెరుస్తున్న కళ్లతో పాసులు చూబించాడు. ఎప్పటిలాగే భుజం మీదుగా వదులుగా వేలాడుతున్న చొక్కా, వెలిసిపోయిన నిక్కరు. వాడి ముఖం మాత్రం వెలుగుతోంది. “గుడ్” అన్నాను. రమ్య దగ్గరగా వచ్చి నన్నే చూస్తోంది నవ్వుముఖంతో. తనని దగ్గరగా తీసుకుని, “నీ పరికిణీ, జాకెట్టు భలే ఉన్నాయి. అమ్మ కొందా?” అన్నాను.

“కాదు, అమ్మమ్మ. ఇంకా బోలెడున్నాయి. అన్నయ్యకైతే కొన్నే” అంది అరచేతులు దగ్గరగా చూబిస్తూ. కిశోర్ మాత్రం నిబ్బరంగా చెప్పాడు, “నాకు సంవత్సరానికి మొత్తం నాలుగు జొతలు కొంటుద్దిగా అమ్మ”.

వాళ్లిద్దరూ అన్ని మాటలు మాట్లాడింది అదే మొదటిసారి.

***

ఆరేళ్ల కిశోర్ ఎందుకో వయసుకి మించి పెద్దవాడిలా కనిపిస్తాడు. అందరిలా క్లాసులో అల్లరి చెయ్యడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. నిశ్శబ్దంగా కూర్చుని హోం వర్క్ చేసుకుంటాడు.

ఎందుకో, అలా వాడిని చూస్తుంటే నాకు నచ్చదు. అందరిలా వాడూ క్లాసులో టీచరు వచ్చేలోపు పరుగు లెత్తాలి, ప్రక్కవాళ్లతో తగువులు పెట్టుకోవాలి. అల్లరి చెయ్యాలి. వాడు బాల్యాన్ని మరిచిపోయిన మునిలా కూర్చుంటే నాకు బావులేదు. కానీ ఎలా చెప్పను.

కిశోర్ ని ఏదో ఒక విషయానికి రోజూ క్లాసులో పలకరించటం మాత్రం చేస్తాను. తనతో పాటు చెల్లి రమ్యని తీసుకొస్తాడు పదిలంగా. ఆ అమ్మాయి కూడా అన్నకి తగినట్టే శాంతంగా ఉంటుంది. క్లాసు అయిపోయాక మిగిలిన వాళ్లంతా అరుచుకుంటూ, ఒకరినొకరు తోసుకుంటూ పరుగులెడుతున్నా ఈ అన్నాచెల్లెళ్ళిద్దరూ మౌనంగా, నిశ్శబ్దంగా బయలుదేరతారు.

ఆ గూడెమంతా ఎప్పుడో ఊరవతలి పనికిరాని భూమంటూ పేదలకోసం పంచినదే. అక్కడ ఇళ్లు కట్టుకుని, పదిహేనేళ్లుగా పన్నులు కూడా కడుతూండటంతో వాళ్లంతా ఇప్పుడా ఇళ్లకి స్వంతదారులే. ఇప్పుడున్న భూమి ధరలు, పెరుగుతున్న ఊరు వాళ్ల ఇళ్లకి మంచిధరని తెచ్చిపెట్టాయి. ఆర్థికంగా వాళ్ల జీవితాలకి మరింత భద్రత దొరికింది. అక్కడ అందరూ రోజూవారీ కూలీ పనులకి వెళ్లేవాళ్ళే. వాళ్ళు తలదాచు కుందుకు కనీసం గట్టి నీడ ఉండటం నాకు సంతోషంగా అనిపిస్తుంది.

ఆరోజు కిశోర్ ఇంటిముందు జనం నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంటిముందు చిందర వందరగా బట్టలు, కొన్ని సామానులు విసిరేసినట్టున్నాయి. నేను క్లాసుకి రావటం చూసి అందరూ తలోవైపు తప్పుకున్నారు.

క్లాసు మొదలయ్యాక దాదాపు అరగంటకేమో కిశోర్, రమ్య వచ్చారు. ఇద్దరి ముఖాలు ఎప్పటిలాగే ఉదాశీనంగా ఉన్నాయి. పుస్తకాలు తీసి వాళ్ల హోమ్ వర్క్ చేసుకున్నారు. ఉన్నట్టుండి రమ్య ఎందుకో గట్టిగా ఏడ్చింది. క్లాసులో అందరం ఉలిక్కిపడ్డాం. కిశోర్ రాసుకుంటున్న వాడల్లా పుస్తకాలు పక్కన పెట్టి చెల్లిని చిన్న గొంతుతో సముదాయిస్తున్నాడు.

లేచి వెళ్లి అడిగాను, “ఏమైంది రమ్యా?” కిశోర్ గబుక్కున లేచి నిలబడి, “ఏంలేదు టీచర్, ఊర్కే ఏడుస్తాంది” అన్నాడు. వాడి గొంతు నిశ్శబ్దంగా ఉన్న క్లాసులో ఖంగున మోగింది. అరుదుగా వినిపించే ఆ గొంతుని, వాడిని అందరూ విచిత్రంగా చూస్తున్నారు.

రమ్య మాత్రం దుఃఖం ఆపుకోలేకపోతోంది. రమ్య దగ్గరగా కూర్చుని విషయం ఏమిటో తెలుసుకోబో

యాను. కానీ కిశోర్ నన్ను అడ్డుకుని, “ఏమీలేదు టీచర్, ఏడవదులే” అంటూ చెల్లి దగ్గరగా కూర్చుని ఆమెకి మాత్రమే వినిపించేలా ఏదో చెప్పే ప్రయత్నం చేసాడు. అంతలో,

“ఒక్క నిముషం” అంటూ నాకు చెప్పి చెల్లిని క్లాసు బయటకు తీసుకెళ్లాడు. నిముషం తర్వాత కళ్లు తుడుచుకున్న రమ్య అన్న చేతిని పట్టుకుని క్లాసులోకొచ్చింది.

పిల్లలందరూ తమ వర్క్ చేసుకుంటున్నారు. కిశోర్ నా దగ్గరగా వచ్చి, “సారీ టీచర్” అని చెప్పాడు.

వాడి పెద్దరికం, ఆత్మగౌరవం నాకు ఆశ్చర్యం కలిగించాయి.

“ఇంటికి వెళ్ళిపోతారా?” అని అడిగాను.

“క్లాసు అయ్యాకే వెళ్తాం” అన్నాడు వాడు.

క్లాసు ముగించి, రూమ్ తాళం వేస్తుంటే కిశోర్ తల్లి వస్తూ కనిపించింది. పిల్లలు అప్పటికే ఇళ్లదారి పట్టారు.

“అప్పుడే బడి అయిపోయిందా?” అందామె. ఆమెని చూసి ఒక్క అడుగు వెనక్కి వేసాను. జుట్టు చెదిరి, కట్టుకున్న చీర కూడా చిందరవందరగా చుట్టుకున్నట్టుంది. కిశోర్, రమ్య ముందు నడుస్తున్నారు.

“రమ్యకి ఒంట్లో బావులేదా? ఎప్పుడూ లేనిది క్లాసులో ఏడ్చిందీరోజు” అన్నాను. ఆమె నడక ఆపి,

“ఏడ్చిందా?” అని ముందు వెళ్తున్న పిల్లల్ని పిలిచింది. ఇద్దరూ ఆగారు. చెల్లి భుజం మీద రక్షగా కిశోర్ చెయ్యి అలాగే ఉంది.

“క్లాసులో ఏడ్చేవంటగా…” తల్లి ప్రశ్నకి రమ్యకి దుఃఖం పొంగుకొచ్చింది. ఒక్క ఉదుటున పిల్లమీదకి దూకి కొట్టబోతున్న ఆమెను అడ్డుకున్నాను. ఏమిటీవిడ చేస్తున్నపని?

“ఒక్క పూట తిండి తినకపోతే ఏడ్చేస్తావా? నీకుమల్లేనే అన్న ఏడ్చేడా?” అంది ఆవేశంగా.

“అయ్యో, ఏమీ తినకుండా వచ్చేరా, ఆలస్యమైనా వాళ్లు తిన్నతరువాతే పంపండి, చిన్నపిల్లలు కదా, ఉండలేరు.” అన్నాను.

“ఇంటికాడ తినేందుకేముందని. ఆళ్ల నాన్న తాగుడికే ఎంతడబ్బూ చాలదు. ఇప్పుడీ ఇంటి మీద అప్పెట్టి తాగుతున్నాడు. అదేమని అడిగేనని రాక్షసుడల్లే నామీద పడి కొట్టాడు. మీకు చెప్పకేంలే. నన్ను, పిల్లల్ని ఇంట్లోంచి పొమ్మన్నాడు. ఉన్న ఈ ఆదారాన్ని అప్పులోళ్లకి కడితే నాపిల్లలు, నేను ఎక్కడికెళ్లాల?…”

ఒక్కక్షణం ఆగింది, ఆపాటికి పిల్లలిద్దరూ తల్లిని అర్థం చేసుకున్నట్టు నడక సాగించేరు.

కంఠం రుద్ధమవుతుంటే, “బయటికెళ్లి ఎక్కడుండాలో తెలవక ఈబతుకు బతుకుతున్నా. ఇల్లు వొదిలి ఎక్కడికి పోవాల? అయినా ఇయన్నీ మాకు మామూలేలే టీచరుగారూ” అంటూ తేలికగా నవ్వే ప్రయత్నం చేసింది.

ఇంటి ముందుకొచ్చాక, పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని, “కడుపులో భయం పెట్టుకు బతకాల. ఆకలేస్తే ఏడ్చేయటమేనా? ఇంకోసారి ఇట్టా జరిగిందో ఊర్కోను” అంది పిల్లలవైపు ఉగ్రంగా చూస్తూ.

“ఇట్టాటియన్నీ ఇంక జరగవులే టీచరుగారూ” అంది నాకు భరోసా ఇస్తూ.

ఇంటివైపు నడుస్తున్నాను. “కడుపులో భయం పెట్టుకు బతకాల” ఆమె మాటలు చెవిలో ప్రతిధ్వ నిస్తున్నాయి.

భయం! భయం ఎందుకు వేస్తుంది? అసహాయత వల్లనా? అజ్ఞానం వల్లనా? పిల్లలకి నేర్పవలసిన విషయమా ఇది? భయాన్ని ఎదుర్కొమ్మని కదూ నేర్పవలసింది! చీకటిని చూసి భయపడే చిన్నారికి ధైర్యం కదా నేర్పవలసింది! కిశోర్ తల్లిని పిలిచి చెప్పాలనిపించింది. ఇది సమయం కాదు. కానీ ఆమెకి తప్పక చెప్పాలి.

రమ్య నాలుగేళ్ల పసిపిల్ల. ఆకలిని దాచుకోలేక, ఓర్చుకోలేక ఆపూట ఏడ్చింది క్లాసులో. తలుచుకుంటే ఊపిరి అందనట్టుగా అనిపించింది. ఇలాటి పరిస్థితుల్ని దాటి వీళ్లు జీవితాల్లో గెలవాలి. గెలిచేందుకు చదువుని మించిన మంత్రం ఏముంది? నేను చెయ్యగలిగే సాయం అదొక్కటే. నా మనసులో నిశ్చయం మరింత దృఢపడింది.

***

 

Avatar

అనురాధ నాదెళ్ళ

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • కడుపులో భయం పెట్టుకు బతకాలా? భయం కడుపులో పెట్టుకు బతకాలా? కథ ముగింపులో నిర్ణయం బాగుంది. సాహిత్యానికీ జీవితానికీ ఉన్న కనెక్ట్ అది – ఆ చివరి మూడు వాక్యాల్లోనూ ఒదిగి, కథ అయిపోయిన తర్వాత కూడా ప్రవహించింది.

 • Very nice story Anuradha garu, it was really heart touching & thought provoking to younger generation on how to handle the situation. Your stories will always inspires me. Thank you!

 • Yes, education will improve their lives. But what is the solution in the short term? Why do these kids have to suffer because of parents faults? First parents need to be educated, alchohol is not the solution if they have problems in life. If there is better understanding and communication in the family, they can overcome atleast these kind of sufferings.
  Story revealed how kids are suffering in their day to day lives.

 • Very sad and moving story. Food is the basic need. If gudem kids are still not getting basic needs fulfilled, mostly because of illiteracy of parents, writer’s conclusion makes it feel much better. I am sure education is the key for Kishore and Ramya to have their kids well fed. Thanks Anu radha garu for such powerful story.

 • The writer attempted a simple story with a strong subject in a subtle way .
  It’s a reality in below poverty line families Which many of us donot know .
  I appreciate the writer to find time In her busy schedule and take up the noble cause of teaching and inculcating Some values In them thereby encouraging those children to do well in their lives . Best wishes to the writer .

 • […] రమ్య నాలుగేళ్ల పసిపిల్ల. ఆకలిని దాచుకోలేక, ఓర్చుకోలేక ఆపూట ఏడ్చింది క్లాసులో. తలుచుకుంటే ఊపిరి అందనట్టుగా అనిపించింది. ఇలాటి పరిస్థితుల్ని దాటి వీళ్లు జీవితాల్లో గెలవాలి. గెలిచేందుకు  […]

 • నాకు తెలియకుండానే చిన్నగా కంటి తడి ఏర్పడింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు