ఓ రచయితా, నేను నిన్ను నమ్మను…!

“నువ్వూ నేను చదివిన పుస్తకం ఒకటే ననుకోను” అని ఒక మిత్రుడు నేను వెలిబుచ్చిన అభిప్రాయం విని అన్నాడు. నేను మరీ పెడసరంగా, రెటమతంగా మాట్లాడుతున్నానని వాడి ఉద్దేశ్యం! ముందు కొంచెం నమ్మకపోయినా, తర్వాత నేను కూడా గమనించాను — ఒకే పుస్తకం చదివినా నాకు నేను నా మిత్రులు చదివిన విషయాలకంటే వేరే విషయాల మీద శ్రద్ధ ఎక్కువ. బాగా పెద్దయినాక, ఏ ఇద్దరూ ఒకే పుస్తకం చదవరు అని కూడా వాదించాను. అది నిజమే అవ్వచ్చు గాక! కానీ, ఆ విషయం  తెలియందేమీ చెప్పదు! అందుకని, నేను పుస్తకం చదివే పద్దతి గురించి కొంచెం రాస్తాను. 

నేను రాసిన మొదటి భాగంలో పుస్తకాలు నాకు కొత్తలోకం చూపెట్టాయని రాసాను. రెండవ భాగంలో, పుస్తకాల మూలాన, నాలాంటి పాఠకులతో ఒక ప్రపంచాన్ని ఏర్పరుచుకొన్నానని రాసాను. మరి, ఇప్పుడు మిగిలిన పాఠకులలాగ కాకుండా, ఉలిపికట్టె లాగ మరీ విపరీతార్థాలు తీస్తూ చదువుతున్నాను? 

ఈ విధంగా చదవడం తొమ్మిదో తరగతిలో మొదలయింది. అప్పటి వరకూ నేను “వినదగు నెవ్వరు చెప్పిన” అని ఎవరు చెప్పిన కథయినా చదివెయ్యడమే కాకుండా, పూర్తిగా రచయిత తో సహానుభూతి పొంది మరీ అర్థం గ్రహించడానికి చూసేవాడిని. బహుశా, నాకు చదువుకున్న వాళ్ళు తక్కువ గా కనబడటంతో, వాళ్ళ ఆమోద ముద్ర పొందడానికి కావచ్చేమో! అందుకే, నేను అందరు టీచర్లు నాకు నచ్చినవారే, అందరు రచయితలూ అభిమాన రచయితలే! 

పధ్నాలుగు ఏళ్ళు వచ్చే సరికి, నాకు సందేహాలు రావడం మొదలయింది. రచయిత చెప్పింది ఎందుకు నమ్మాలి? ఆయనకేం ఎక్కువ తెలుసు? పోనీ, ఎక్కువ తెలిసినా, ఆయన జీవితానుభవం నాకెందుకు యథాతథం గా పనికి వస్తుంది? నాకు గుర్తున్నంత వరకు, అడివి బాపిరాజు నవలలు చదవడంతో నాకు ఈ జ్ఞానోదయం కలిగింది. అలాగని నేను ఆ రచనలు ద్వేషించలేదు — అవి నాకు నచ్చలేదు అని మాత్రం తెలుసుకున్నాను. 

అప్పుడు అలాగ మొదలయింది ఇప్పుడు చదవడం నాకు నేతి వాదం లాంటిది. అంటే, న+ఇతి — ఇది కాదు, ఇది కాదు అని చదవడం అన్న మాట. నేను ఏ శాస్త్ర వ్యాసం అయినా చదివే ముందు అనుకుంటాను “ఓ రచయితా, నేను నిన్ను నమ్మను. ఎలా నమ్మిస్తావో చూస్తాను”. చివరకి నా అభిప్రాయం మారే వచ్చు గాక — కానీ, ముందు రచయిత ని ఉన్నత స్థానంలో ఉంచి చదవను. నేను నిరంతర సందేహ జీవిని. 

ఇది మరీ నిరాశావాదం లాగా ఉందే? జీవితం మరీ నిస్సారంగా, విశ్వాస రహితంగా ఉంటుందే? అని మీరనవచ్చు. కానీ, ఇది ఎప్పుడు ఎలాగ మనకి ఉపయోగ పడుతుందో చెబుతాను. 

చిన్నపుడు రచయిత ఉన్నత స్థానాన్ని (కనీసం ఆ రచన విషయంలో నయినా) ఒప్పుకొని చదవడం లో ఒక ఉపయోగం ఉంది. ప్రపంచాన్నే తీసుకోండి. అది మన భావాలకి అతీతంగా, ఇక రూపంలో ఉంటుంది. మనం దాని ఒక పార్స్వాన్నే చూడగలం. దానికి శతకోటి లక్షణాలుంటే, ఏదో ఒక డజను మాత్రమే చూస్తాం.  నిజానికి, ఏ రచన అయినా  అంతకు మించి చూపలేదు. అంటే, మనం హైద్రాబాదు గురించి రాసినా, అది నిజమైన హైదరాబాదు గురించి కాదు. అది ఒక మన వ్యక్తిగతమైన, అంతర్భావంగా ఉన్న నగరం. 

నా పుస్తకాలు నిజమైన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి అని కొందరు రచయితలు అంటారు. అయ్యో పాపం! ఎలాగ ఉందనుకుంటే, ఫోటో చూపించి, ఇదే మనిషి అన్నట్లుంటుంది. అది ఒక విషయాన్ని చూపెడుతుంది నిజమే! ఫోటో చూసి, ఊపిరి తిత్తుల్లో నెమ్మ చూడలేనట్లే, “ప్రతిబింబించడం” కేవలం కొంచెం మాత్రమే చూపెడుతుంది. అయితే, అది ఆ రచయిత చెప్పదలుచుకున్న విషయానికి అవసరమైనంత వరకు చూపెట్టవచ్చు. అది సరిపోతుందా? మనం ఒప్పుకోనక్కర్లేదు. నిజానికి నాకు ఈ విషయంలో చాలా మంది రచయితలతో గొడవలు వచ్చాయి. 

అసలు ప్రపంచం చూపించడం ఎందుకు? సినిమా కోసం వస్తే న్యూస్ రీల్ చూపించినట్లు — లేదా డాక్యుమెంటరీ సినిమా వేసినట్లు. ప్రపంచాన్ని యథాతథంగా చూడదలుచుకుంటే, కిటికీ తెరిస్తే చాలు. మనకి కావలసింది యథాతథంగా కాదు — ఒక విధమైన రూపాంతరీకం చేసి కావాలి. కొన్ని కప్పి, కొన్ని విప్పి, మరి కొన్ని విషయాలు భూతద్దం పెట్టి చూపించడం కావాలి. అందుకే అంటాను: యథార్థ్యం సృజనాత్మక రచనలకి బద్ధ విరుద్ధం. 

మనం కాల్పనిక ప్రపంచపు రచనలు చదినప్పుడు, ఆ కథలు మన ప్రపంచంలోకి తర్జుమా చేసుకుంటాం. ఇబ్బంది ఎప్పుడు వస్తుందంటే, ఏ రచయితైనా తన ప్రపంచం నిజమైందని, అది నేర్పే పాఠాలు ఉన్నవి ఉన్నట్లు ఉపయోగించుకోవచ్చు అన్నపుడు! మనం ప్రతిదీ కార్య కారణ సంబంధంగా చూస్తాం. కానీ ప్రపంచం చాలా క్లిష్టమైందని శాస్త్ర విజ్ఞానం చెబుతుంది. కథల పాఠాలు మనం అన్వయించుకోవాలి తప్ప పూర్తిగా నిజం కావు. 

ఏ రచన చదివినా, ఆ రచన నుంచి ఎక్కువ గ్రహించాలంటే, ఆ అంతర్భావాన్ని చూడగలగాలి. ఉదాహరణకు, భట్టి విక్రమార్కుల చరిత్ర చదువుతున్నామనుకోండి — సాలభంజికలు ఎలా మాట్లాడుతాయి? భేతాళుడనే వాడుంటాడని నమ్మను అన్నామనుకోండి. అలాగ ఆదిలోనే హంసపాదు పడింది. అప్పుడు కథ మనకి అసలు ముందుకు సాగదు!  కథ చదవగలగాలంటే, మనం కొన్ని సందేహాలు పక్కన పెట్టాలి. ఇంగ్లీషు లో దీన్ని సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ (అనగా తాత్కాలికంగా అపనమ్మకాలు నిలిపివేయడం) అంటారు. “ఓ రచయితా, నువ్వు సృష్టించిన ఈ లోకాన్ని నేను కాసేపు నమ్ముతున్నాను. నీ కథ చెప్పు” అని అన్న మాట! 

ఏ రచయితయినా, రచనైనా, సంభాషణ అయినా, సూచించే అంతర్భావమైన ప్రపంచం రెండు కాళ్ళ మీద ఉంటుంది. ఒకటేమో, దత్తాంశాలు కాబట్టి స్వయంసిద్ధాలు అంటే, ఉన్నది ఉన్నట్లు చెప్పిన అన్నమాట. ఆ కథలో సుజాతకి ఇద్దరు పిల్లలు అంటే, మనం కాదు అనటానికి లేదు. సాధారణంగా కథ సన్నివేశం బట్టి ఈ దత్తాంశాలు ఉంటాయి. ఉదాహరణకి రెండు సూర్యులు ఉన్నట్లు రాయచ్చు — అది సైన్స్ ఫిక్షన్ అవుతుంది! 

మరి ఎటువంటి స్వయంసిద్ధాలయినా ఉండవచ్చా? అంటే, వచ్చు. మరి ఆ రచయిత ధనవంతుడిని పీడించే బీదవాళ్ళ గురించో, మంచివాడైన పెట్టుబడి దారీ వాడి గురించో రాసాడనుకోండి. అప్పుడు మీరేమంటారు? ఒకటి, అది అసహజం, లేదా, స్టాటిస్టికల్ గా చూస్తే అటువంటిది జరగదు అనవచ్చు.  కానీ అది మీరు పొరపాటు చేస్తున్నారు. కథలు సగటు మనుషుల మీద, మెజారిటీ మీద ఉండవు. మనం దాని ద్వారా, ఏమయినా కొత్త విషయం చెప్పగలుగుతున్నాడా, లేక ఏదయినా ఆలోచనలు రేకెత్తిస్తున్నాడా, ఏదయినా వినోదాన్ని కలిగిస్తున్నాడా అని చూసుకోవాలి. అంటే, దాని మూలాన కథకి న్యాయం జరుగుతుందా అని చూడాలి. 

ఇక్కడ నాకు ఒక పిట్టకథ గుర్తుకు వస్తుంది. సల్మాన్ రష్దీ ఒక పుస్తకం, మూర్స్ లాస్ట్ సైహ్, రాసాడు. మన దేశంలో అతి తక్కువగా ఉన్న మైనారిటీ, యూదులు. తర్వాత పారసీలు. వీరిద్దరికీ పుట్టిన వాడు, దేశంలో అతి చిన్న మైనారిటీ — అంటే ఒక్కళ్ళే ఉంటారు. ఇది స్టాటిస్టికల్ గా, సహజంగా అసంభవం. అయినా, ఈ కోణం నుంచి దేశ చరిత్ర చెప్పాడు. 

ఇక స్వయంసిద్ధాల తర్వాత, ప్రపంచాన్ని నిర్థారించేవి సూత్రాలు, న్యాయాలు, నియమాలు. అంటే, ఆ ప్రపంచంలో మంత్రాలు ఉండవచ్చు. లేదా, దేవుళ్ళు మనుషులకి వరాలివ్వవచ్చు. రిక్షావాళ్లు పరమ గ్రాంథికంలో, దాసరి సినిమాలోలాగా మాట్లాడవచ్చు. ఈ కథ చదివినంత సేపూ మనం ఆ లోక నియమాలకు కట్టుబడే చదువుతాం. 

అయితే, రచయిత కావాలంటే కొత్త నియమాలు పెట్ట వచ్చు — అయితే, అవన్నీ అసంబద్ధంగా కాక, కన్సిస్టెంట్ గా ఉండాలి. రచయిత ఆ నియమాలు హఠాత్తుగా ఉల్లంఘిస్తే, అది నమ్మబుల్ గా లేదు అని అంటాం. సాంఘిక సినిమాలలో ఉన్నట్లుండి ఎస్వీ రంగారావు మాయల మరాఠీ లాగా వస్తే, ఆయన మనకి ఎంత ఇష్టమైనా ఇది అసహజం అంటాం. 

అన్ని రచనలకీ ఇది వర్తించినా, ముఖ్యంగా ఇది అద్భుతకల్పనలు, పురాణాలు, ఇతిహాసాలు, సైన్స్ ఫిక్షన్ లాంటి రచనలని అర్థం చేసుకోవడానికి బాగా అవసరం. ఇందులో రచయిత నేర్పు ఏముంటుంది అని అనవచ్చు — ఈ నియమాలు ప్రపంచాన్ని ఇంకా ఎక్కువ భావోపేతంగా  చూపవచ్చు. అన్ని ప్రపంచాలూ మన నియమాలతో నడవవు అని తెలుసుకోవడం, మనిషి కి ఒక మానసిక వైశాల్యం! నాకు ఉప్పు లేని సల్-చాక్-తొక ప్రపంచం, బెంగాలీ నవలల ప్రపంచం, చలం ప్రపంచం, ఇటువంటివి వేరే నియమాలతో నడుస్తాయి అని తెలుసుకోవడం ఒక పాఠం!

ఈ నియమాలు తెలుసుకోవడం, వాటి పరిణామం ఊహిచుకోవడం, మిగిలిన పాఠకులతో పంచుకోవడం — ఇటువంటివే కొన్ని రచనలకి  ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చాయి. ఇది పుస్తకాలకే కాదు ఏ సమాజానికయినా వర్తిస్తుంది. ఉదాహరణకి రాజ్యాగం, చట్టం, ఇటువంటివంటివి అన్నీ సాహజిక న్యాయాలు కావు! పుస్తకాలకొస్తే,  హేరీ పాటర్ పుస్తకాలు చూడండి! లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చదవండి! మహాభారతం వ్యాఖ్యానం వినండి! స్టార్ వార్స్ టీవీ చూడండి! మార్వెల్ ప్రపంచాన్ని గమనించండి! వేటి నియమాలు వాటికి ఉంటాయి. 

మీకు కోపం వచ్చిందను కుంటాను — మహాభారతాన్ని, మార్వెల్ విశ్వాన్ని ఒక గాటన కట్టివేసి నందుకు. గూడార్థంలో చూస్తే, నేను కేవలం ప్రపంచ నియమాలు, ఆ నియమాలకు కట్టుబడి ఉన్న పాత్రలు, కథలు — వీటి గురించే మాట్లాడుతున్నాను. నిజంగా ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్నాయనుకుంటే, లేదా ఐరన్ మాన్ ఉన్నాడు అని అనుకుంటే, మీ నమ్మకాన్ని నేనేమాత్రం వ్యతిరేకించను!

మరి ఎటువంటి న్యాయాలయినా, నియమాలయినా వాడి రాయవచ్చా? వచ్చు — కానీ, వీటి మీద మనం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాం. అంటే, తర్క విరుద్ధంగా ఉంటే ఒప్పుకోము. అంతకు ముందు గాలిలోకి ఎగరగలిగిన వాడు ఇప్పుడు ఎందుకు ఎగరలేదు అని అడుగుతాం. పురాణాలలో తర్క విరుద్ధంగా ఉండకుండా చాలా ప్రక్రియలు ఉంటాయి. మనకైతే, వరాలు, శాపాలు, ఒకే సారి వాడగలిగే మంత్రాలు చాలా తగులుతాయి. గ్రీకు పురాణాలలో, దేవుళ్ళు దిగివచ్చి సమస్యలు పరిష్కరిస్తారు. సినిమాల్లో కాన్సర్ వచ్చి రెండో హీరోయిన్ త్యాగం చేస్తుంది. డికెన్స్ నవలల్లో, అనాథకు దూరపు బంధువు అన్ని డబ్బులూ రాసి పోతాడు. 

ఇంత వరకు నేనేం చెప్పాను? రచయిత ప్రపంచం ఎలాగ అర్థం చేసుకోవాలి అని. అందులో స్వయంసిద్ధాలు ఏమిటి, నియమాలు ఏమిటి అని చూసుకొంటాం. అవి పరస్పర విరుద్ధంగా లేకుండా ఉన్నాయా ఎన్ని చూస్తాం. చదివిన దాన్ని ఎలాగ అన్వయం చేసుకోవాలి అన్న ప్రశ్న ఇక చూద్దాం. అందులో నేను మొదట చెప్పినట్లు, రచయితకి ఎగస్పార్టీ లాగ ఎందుకు ఉంటానో తెలిసి వస్తుంది. 

ఏమాత్రం రచనా నైపుణ్యం తెలిసిన వాడు మంచి ప్రపంచమే సృష్టించగలడు. కానీ, అంత మాత్రం చేత అది మంచి కథ అవుతుందా? దానికి, ఆ ప్రపంచం నుంచి మనకి తెలిసిన ప్రపంచంతో ఎలా అన్వయం చేసుకుంటాం అనే దాని మీద ఆధార పడుతుంది. 

టాల్ స్టాయ్ మహానుభావుడన్నాడు: సంతోషమైన కథలన్నీ ఒకే విధంగా ఉంటాయి. దుఃఖితమైన కథల్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి అని. (ఆయన కుటుంబాల గురించి అన్నాడు — అది కథలకి కూడా వర్తిస్తుంది). బొత్తిగా నమ్మవద్దు. అన్ని కథలూ కొన్ని మూసల్లో ఉంటాయి. కన్నీళ్ల  కథలయినా, వేన్నీళ్ళ కథలయినా కొన్ని మూసల్లో పడక తప్పదు. నేను ప్రోటో స్టోరీస్ అన్న భావనలో చెప్పడంలేదు. ఏ విషయాన్ని చదివేటప్పుడయినా మనం ఈ మూసలని చదువుతాం. ఇదే శాస్త్ర పరిశోధనకు పునాది. 

అయితే, దీనికి వ్యతిరేక భావం కూడా నిజమే. ప్రతి కథా వినూత్నమే. చదివిన కథే మరోమారు చదివితే తేడాగా ఉంటుంది. ఈ సారూప్య వైరూప్యాల మధ్య మనం కథలు అర్థం చేసుకుంటాం. 

ముందు కాసిని ఉదాహరణలు ఇద్దాం. ఉదాహరణకి ఒక కథ చదివామనుకోండి: అందులో ఒక బుగ్గ మీసాల విలన్, హీరోయిన్ అక్కను హత్య చేస్తాడు. హత్య తప్పు అని మనకి రచయిత చెబుతాడు. లేదా, కొంచెం చెయ్యి తిరిగిన రచయితయితే మనమే ఆ హత్య తప్పు అనుకునేలా చేస్తాడు. 

కానీ కొంచెం ఆలోచించండి: సూర్యుడు రేపు తూర్పున ఉదయించును — అని చదివితే మీ జ్ఞానం పెరుగుతుందా? అందరూ ఒప్పుకునేది, అందరికీ తెలిసింది చదవడమెందుకు? అది అసలు రాయడమెందుకు? కాలక్షేపం కోసం అనుకోవచ్చు — తెలుగు సినిమా లాగ. లేదా, రొమాన్స్ పుస్తకాల లాగ. కానీ, అది తీవ్రమైన సాహిత్యం (సీరియస్ లిటరేచర్ కి వచ్చిన గ్రహచారం!) అంటారే? 

అందుకని మనకి సందిగ్థత కలిగించడానికి కొంచెం మెలుపు వేద్దాం. పోనీ, ఒక పాల బుగ్గల పిల్లవాడు పెద్ద కుటుంబం ముత్తైదువ ని హత్య చేసాడని రాశామని కొండి. అందునా, కథ ఆ పిల్లవాడి తరపు నుండి చెప్పమనుకోండి. దానవీరశూర కర్ణ చూసి దుర్యోధనుడి మీద ఇష్టం పెరిగినట్లు, మనం పిల్లవాడి మీద కోపం పెట్టుకోలేం. ఇంకా కాస్త తగిలిద్దాం — వాడికి ఆవిడ తీవ్రమైన అవమానం చేసింది. పోనీ, కష్ట నష్టాలు కలిగించింది. మరి అప్పుడో? 

ఇలాగ ఆలోచించు కుంటూ పోతే, మన నమ్మకాల అంచులు కనబడతాయి. సత్యానికి, అసత్యానికి ఉన్నది సరిహద్దు కాదు — రెండూ ఒకే ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఉంటాయి అని తెలుస్తుంది. నియమాలకు ఉండే మినహాయింపులు, వాటికి ఉండే నియమాలు ఇలాగ సత్యానికి ఉండే విస్తారమైన, సంక్లిష్టమైన రూపం కనబడుతుంది. 

ఈ అవధులు దాటటమనేది ఏదో నీతుల గురించి మాత్రమే కాదు. ఇది రచనల ప్రయోజనం మీద, రచనల పధ్ధతి మీద, రచన అనే మౌలికమైన అంశం మీద అవధులు చూడటం ద్వారా, వాటిని అర్థం చేసుకుంటాం. ఏదయినా ఆకారాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని పరిధులు చూడాలి. 

ఇదే మన ప్రపంచపు అవధులు పెరగడమంటే! ఇతిహాసపు చీకటి కోణాలు చూడటమంటే ఇదే! 

ఇంతకు ముందు, అందరికీ తెలిసింది ఎందుకు అన్నాను. అంత మాత్రం చేత కొత్తదైనంత మాత్రాన, అది మనకి కొత్తదేమన్నా తెలుపుతుందా? అది తప్పు, అంటే మనకి తెలిసిన, మనం నమ్మిన, మనకి రుజువైన సత్యాలకి విరుద్ధం కావచ్చు. లేదా, పైపైన ఉన్న కొత్త మెరుగులు తీసి వేస్తె, అది కొత్తది కాకపోవచ్చు కూడాను. అందుకే, నాకు షాక్ వేల్యూ ఉన్న రచనలు చదువుతుంటే, ఆ బంగారు మెరుగులు కింద ఉండే సీసం కనబడుతుంది. 

ఇంత వరకూ చదివినందుకు, నేను ఎలాగ చదువుతానో చెబుతాను. ఏ రచన తీసుకున్నా, అంతకు ముందు కంటే ఏమిటి తేడా అని చదువుతాను. అప్పుడు, ఎక్కువ చదివిన కొద్దీ, తొందరగా చదవగలం. రచయిత ప్రపంచం గురించి అర్థం చేసుకుంటాను. రచయిత చెప్పిన నియమాలలో ఉన్న వైరుద్ధ్య భావాలు గమనిస్తాను. తాను చెబుతున్న కార్య కారణభావం  నిజమేనా, లేక మనం మన ప్రపంచం లోకి అనువదించుకుంటే గణాంక వివరాలు కుదురుతాయా అని ఆలోచించుకుంటాను.  మొదటి సారి చదివినప్పుడు పూర్తిగా ఆ ప్రపంచాన్ని ఒప్పుకొని చదివినా, రెండో సారి మటుకు అసలు దాని ప్రమాణత్వం ఒప్పుకోకుండా చదువుతాను. కొన్ని సార్లు నేను, రెండవ సారి చేసే పని మొదటి సారి చదివేటప్పుడే చేస్తాను. 

మరో పిట్ట కథ:  నా బ్యాచ్ మేట్  కేశవ్ అని బెల్ లాబ్స్ లో సహోద్యోగి, పేపర్ ఎలాగ చదవడం అని రాసాడు (http://ccr.sigcomm.org/online/files/p83-keshavA.pdf) — అందులోవిషయాలు ఇక్కడ కూడా చాలావర్తిస్తాయి.

ఈ సారి కథలు చెప్పటానికి ముఖ్యమైన సాధనం, భాష, గురించి ముచ్చటించుకుందాం. 

*

రామారావు కన్నెగంటి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • Suspension of disbelief ,and world building…both are very much needed to understand sci fi at least.
  But in social fiction too a story or incident can never be “natural” or “real ” but only attempts to make the reader feel the writer’s perspective …it may be the socialist,Marxist ,utopian,or existentialist ,
  religious or simply any philosophy .
  You hear background music and exaggerated colours even in movies…but do they exist in real life ? These are only used to convey a story and inner meaning that’s all.
  Mirroring society is literature ,they say but your article throws extremely logical light on the writer’s work from the readers point of view.
  Fiction is fiction and always is surreal
  in my view.
  If there is no style description or imagery or backgroundmusic and colour ful shots …it just becomes reportage.
  Or the “natural ” real ” music , background or description would be just dry and repulsive if there is no inner meaning as deciphered by the writer.And the reader must have some philosophy of his own to “connect” to it.The connection makes great literature , whatever the form it belongs to.
  Excellent article by you .Looking for more.

 • రామా,
  మీ పాఠకప్రయాణం ఆవురావురుమంటూ చదువుతున్నవారిలో నేనూ ఒకణ్ణి. ఈ భాగంలో మీరు మొదటి అయిదారు పేరాల్లో ముచ్చటించిన విషయాలు సమంజసంగా ఉన్నాయి.ఆఖరి పేరాల్లో అస్పష్టత చోటుచేసుకుంది, సల్మాన్ రష్దీ ఉదాహరణ తరువాత రాసిన పేరాలు. నేను రెండుసార్లు చదవనిదే దేనిమీదైనా అభిప్రాయం ఏర్పరుచుకోను. ఏతదభిప్రాయాన్ని నలుగురితో పంచుకోను. మీ ప్రయాణం నలుగురికీ వీలయినంత ఉపయోగపడాలనే ఈ comment రాస్తున్నాను. ఇటువంటివి కాస్త didactic గానే రాయాలేమో! ఉదాహరణలు ఇంకాస్త illustrative గా ఉండాలేమో! high and dry!
  -వాసు-

 • రచయిత నునమ్మిన, నమ్మక పోయినా,. కొన్ని రచనలను మాత్రం పూర్తి ఇష్టం తో చదవుతాము! ఆ రచనలని గుర్తు పెట్టు కొంటాం. ఆ రచయిత ఎలాంటి వారు అయిన సరే! మీ write up బాగుంది sir.ధన్యవాదాలు!

 • బాగా రాశారు, రామారావు గారూ ! మీ విశ్లేషణ పాఠకులకి ఎంతో సహకరించేదిగా ఉంది. మూసల ప్రసక్తి ఆసక్తికరం. షాక్ ట్రీట్మెంటు కొత్తమూస ద్వారానే రావాలేమో !

 • మా నాన్న అనేవారు.. ఏ పుస్తకం చదివినా ఒకటి గుర్తుపెట్టుకో you are only reading a writer’s mind అని. అది గుర్తుకొచ్చింది.
  అలాగే నేతి.. నేతి లాటి అనుభవం అందరికీ ఉంటుంది. ఇది కాదు అనే discerning గుణం మొదట్లో నే వచ్చేస్తుంది.
  చాలా ఆసక్తికరంగా ఉందండీ మీ రైటప్..

 • ఎవరైనా, వారికి వుండే సామాజిక దృక్పథం నుండి రచనలు చదువు తారు. అంటే అభిరుచి మేరకు. ఆ అభిరుచి కూడా వారు ఏర్పరుచుకున్నదే! ఒక రచన చదవాలా వద్దా అనేది కూడా వారి అభిరుచి ( దృక్పథం) నిర్ణయిస్తుంది. వాస్తవ దృక్పథం అనేదాన్నే శాస్త్రీయ దృక్పథం అంటారు. ఆ దృష్టిలో ఏర్పడక ముందు యండమూరి వీరేంద్రనాథ్ అయినా ఒకటే, రావిశాస్త్రి అయినా ఒకటే . అందరూ ఒక్కలాగే కనిపిస్తారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు