అమెరికాలోని బర్కిలీ నగరంలో నా చిన్ని గదిలో, యథావిధిగా college లో ఒక గంట లాటిన్, రెండు గంటలు సంస్కృతం చదివి వచ్చిన తర్వాత విశ్రాంతి తీస్కుంటున్న పూట అది. రోజూ విశ్రామం కోసం చూసే mainstream తెలుగు చిత్రాల ‘comedy scenes’ మధ్య ఒక call తీసుకోవలసి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక పిన్ని. Call మధ్యలో “ఇంతకు నువ్వు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ పేరు విన్నావా రా?” నా డెస్క్ మీద అమితావ్ ఘోష్ రాసిన ‘In an Antique Land’ రా.చిం. డేరే గారి మరాఠీ పుస్తకం మధ్య ఉన్న అనంతకృష్ణ శర్మ గారి ‘వేమన’ ప్రతి వంక చూసి, నవ్వుకోని “నాకు ఎందుకు తెలీదు పిన్ని!?” అని అన్నాను. ఆవిడ “నువ్వు ఇండియా కి వచ్చినప్పుడు వీలు చూసుకొని బెంగళూరులో అక్క ఇంట్లో ఆయన పుస్తకాలను చూడాలి రా” అని అన్నారు.
తీరా కొన్ని నెలల తరవాత జూన్ లో జరిగిందీ అదే. విద్యాభ్యాసం అంతా ఇంగ్లీష్ లో, హైదరాబాద్ లో సాగాక, భారతదేశ చరిత్ర అధ్యయనం చేయడం కోసం ఇప్పుడేదో ప్రయాస పడి అమెరికాలో సంస్కృత కావ్యాలు చదవడానికి ప్రయత్నిస్తున్న నాకు ఈ అవకాశం దక్కడం ఏమిటి? తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు ఈ క్షణానికి పూర్వ రంగంగా ఒక శతాబ్దపు చరిత్ర నిలిచింది నా ముందు – మా కుటుంబపు పయనాలు అన్ని దోహద పడినాయి అని ప్రస్ఫుటంగా వ్యక్తమయినది.
-౦-౦-
కథ మా తాత చేట్లూరు వేణుగోపాలచార్యులుగారి తోనే (అమ్మ వాళ్ళ నాన్న) మొదలవ్వాలి.
మా కుటుంబంలో ప్రతి రెండో వ్యక్తి వలె ఆయన పుట్టిందీ నేటి అన్నమయ్య జిల్ల రాజంపేట సమీపంలో ఉన్న కంపసముద్ర అగ్రహారంలో. కనుకనే మా ఇంటి వారి విశ్వం ఆ పల్లె వద్ద కేంద్రీకృతమైనది. అందుచేత దగ్గరలో ఉన్న తిరుపతి నేటికి కూడా వారికి మహానగరమే, మద్రాసు (ఎప్పటికి మద్రాసే) అబ్బురుపరిచే వింత, హైదరాబాద్ ఎప్పటికీ పరాయిదే (అక్కడే ఉన్నా సరే). 1943లో పుట్టిన మా తాత గారు, వారింట్లో మూడో సంతానం. SSLC చదివిన ఒక schoolteacher కొడుకు. చదువు పట్ల ఆసక్తి ఉన్నా బాధ్యతలు, ఇంటి ఆర్థిక పరిస్థితులు ఎక్కువ దూరం వెళ్ళనివ్వలేదు. తరువాత మా అమ్మమ్మతో వివాహం అయినపుడు, చుట్టుపక్కల వారందరూ మా అమ్మమ్మను జాలిగా చూసారట – ఇదే మా తాత ఇంటివారి స్థితిగతులకు గొప్ప కొలమానము. అగ్రహారం తన ఊరయినా పై కారణం వల్ల, ఆ ఊరు తన జీవితంలో ఒక చుట్టం గానే వెలసింది. ‘ఐదో తరగతి మా మేనత్త వాళ్ళ ఊరు పుల్లంపేట లో చేశాను రా” అని పేర్కొన్నారు (ఈ family historyలో రాయలసీమ ఊర్లు ఆనంద తాండవం చేస్తాయని పాఠకులకు ఒక గమనిక).
ఆ తరువాత, high school మొత్తం అనంతపురంలో గుంతకల్లులో బాబాయి శ్రీనివాసాచార్యులు గారి ఇంట్లో ఉంటూ చేసారు. ఆ రోజులను, – toilet అంటే manual scavenging మాత్రమే తెలిసిన రోజులుగా నెమరవేసుకున్నాడు. తన మాటల్లో గుంతకల్లు పట్టణం, కోట చుట్టూ కుంటుకుంటూ నడిచే పాత గుంతకల్లు-రద్దీగా ఉన్న station చుట్టూరా పరుగులు తీసే కొత్త గుంతకల్లులగా చీలి రెండు విభాగాలు ఉన్న ఊరిగా తటస్థమైంది.
ఆ రోజుల గురించి, ఆ ఊరి గురించి ఈ వర్ణనలో మునకలేయడానికి కారణం, ఆ ఊరి గుంతకల్లు బాబాయే (ఆయన జీవిత ఉత్తరభాగంలో మా ఇంట్లో గుత్తి తాతగా ప్రసిద్ధం అవుతారు) మనల్ని అనంతకృష్ణశర్మ దగ్గరకు తీసుకువెళ్ళేది. చేట్లూరు శ్రీనివాసాచార్యులు గారు అగ్రహారం వారు ఐనప్పటికీ, గుంతకల్లులోని శ్రీ జగద్గురు పండితారాధ్య హై స్కూల్లో తెలుగు మాస్టారుగా ఉద్యోగం రావడం చేత ఈ ఊరిలో నివాసం ఉండవలసి వచ్చింది. తన అన్నగారికి భిన్నంగా ఈయన ఇంగ్లీషు చదువు ముట్టలేదు. కానీ తెలుగు, సంస్కృతంలో పాండిత్యమే సాధించగలిగారు. ఆయన మూడవ కుమారుడు డాక్టర్ చేట్లూరు శ్రీకాంత్ తన తండ్రిని చూస్తూ ఉభయ భాషల పట్ల ప్రావిణ్యం కాకపోయినా ఆసక్తి పెంచుకోవడం గుర్తుచేసుకున్నారు. ఈయన విదేశాల్లో scientist గా పని చేసినా, నేటికి అతనికి వేదాంతం పట్ల ఉన్న ఆసక్తికి అదే బీజం అన్ని నమ్ముతారు. వాళ్ళ తండ్రి పన్నెండో తరగతిలో తెలుగు గురువైనా, స్కూల్ మాస్టర్ కావుట చేత ఇల్లు కూడా బడి లాగానే సాగింది అని తలుచుకున్నారు.
శ్రీనివాసాచార్యులు గారి అభ్యాసం చిన్న వయసు నుంచి డిగ్రీ వరకు సాగింది తిరుపతిలో. అక్కడి ఉన్నతమైన విద్యాసంస్థ అయిన ఓరియంటల్ కాలేజీలో లోనే, వారి వసతి ద్వారా చదివారు. ఇక్కడే ఆయన గురువు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు. అనంతకృష్ణ శర్మ గారిలా అన్నమయ్య ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్ర పోషించిన గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు, మరియు మేఘసందేశానికి ప్రసిద్ధి గాంచిన పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఆయనకు ఈ కళాశాలలోనే seniors. వారి పట్ల గౌరవం, సహవాసం, స్నేహం తిరుపతిని అధిగమించాయి. శ్రీనివాసాచార్యులు విద్వాన్ పట్టా కోసం శ్రీపెరుంబుదూర్ లో వారాలు చేస్తూ చదువుకున్న తరువాతనూ, మరియు ఆయన అభ్యాసాన్ని మెచ్చి తెలుగు పండితునిగా గుంతకల్లు పందితరధ్యులుగారిచే వారి పాఠశాలలో నియమితులయినాకనూ ఈ సంబంధాలు కొనసాగాయి.
శ్రీకాంత్ “నాన్న రోజంతా స్కూల్ పనుల మీదే ఉండేవారు” అని చెప్పారు. తన వ్యక్తిగత జీవితం బడితో పెనవేయడంతో, తనకు దగ్గరయిన, తను గౌరవించే తిరుపతి పరిచయస్థులను బడికి అతిథులుగా ఆహ్వానించారు అట. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అప్పుడు హై స్కూల్ లో ఉన్న శ్రీకాంత్ గారిని పెన్నూ పేపరూ తెమ్మని చెప్పడం, పాఠశాల నుంచి ఇంటికి, ఇంటి నుంచి పాఠశాలకు తీసుకువెళ్ళమని అడగడం ఈయనకు జ్ఞాపకం ఉన్నది. అదే విధంగా ఈయన చాల చిన్న వయసులో ఉన్నప్పుడు వీరి తండ్రి అనంతకృష్ణశర్మ గారిని ఆహ్వానించడం కూడా గుర్తున్నది. అదే విధంగా రాళ్ళపల్లి వారిని అనంతపూరులో, హంపి దగ్గరి కమలాపురములో, లేదా తిరుపతిలో కలిసేవారు. చివరికి గుంతకల్లు శ్రీనివాసాచార్యులు గారికి రాళ్ళపల్లి వారి పట్ల ఉన్న అభిమానానికి తన మొదటి కొడుకుకు ఆయన పేరు పెట్టడమే స్పష్టమైన ప్రతీక. ఈ నేపథ్యం తెలియక “మిగుతా తాతల లాగ ‘చార్య’ అన్న తోక బదులుగా ‘శర్మ’ అని ఎందుకు ఉన్నదా” అని ఊరూరా ఆశ్చర్యపోయేవారట. ఏ కుమారుడికైతే గురువు మీద అభిమానంతో అనంతకృష్ణశర్మ అని పేరు పెట్టుకున్నాడో, అతడికే అనంతకృష్ణశర్మ మనవడు అల్లుడు కావడం యాదృచ్చికం.
-౦-౦-
రెండు కుటుంబాల వారికి తెలిసిన కమలాపురం మిత్రుల ద్వారా వీరి సంబంధం కుదిరింది అని మా పిన్ని (చేట్లురు అనంతకృష్ణశర్మ కూతురు) – నేను తొలుత పేర్కొన్న బెంగళూరు పిన్ని- చెప్పారు. పైగా ఈ సంబంధం కుదరడములోనూ రాళ్ళపల్లి వారి ప్రవృత్తి, ప్రేరణలు స్పష్టం అవుతాయి. అనంతపూరు జిల్లాలో జ్యోతిష్యానికి పేరు సంపాదించిన తన తమ్ముడు గోపాలకృష్ణమాచార్యులుతో పాటు అక్కడి ‘పెద్దింటి వారు’ అని పిలవబడే మిత్రులను చూడడానికి అనంతకృష్ణశర్మ గారు వెళ్ళేవారట. హంపి విజయదశమి ఉత్సవాలలో రామాయణ పారాయణ కూడా చేసేవారట.
మా పిన్నీ , రాళ్ళపల్లి మనుమడైన మా బాబాయి నందనందన్ గార్లు ఇప్పుడు బెంగళూరులో నివాసం ఉండడానికి బీజం కూడా అనంతకృష్ణశర్మ గారి భ్రమణకాంక్షయే. అనంతకృష్ణశర్మ విద్యాభ్యాసం పూర్వ భాగం మైసూరులో, చామరాజనగరులో సాగింది. 1949లో ఆయన పదవీ విరమణ తరువాత ఓరియంటల్ కాలేజీలో ఇది వరకే ప్రస్తావించినట్టు ఉపాధ్యాయునిగా పని చేసారు. తిరుపతిలోనే అన్నమాచార్య ప్రాజెక్ట్‌లో ప్రధాన పాత్ర పోషించే, మనం తరచూ వినే ఎన్నో కృతులను స్వరబద్ధం చేసారు. ఐతే ఆయన మైసూరు నివాసమే ఆయన వంశానికి, కుటుంబానికి పునాదిగా మారింది. కర్ణాటక వాస్తవ్యం మూలంగా గౌరీబిదనూరుకు చెందిన రుక్మిణమ్మ గారిని వివాహం ఆడారు. వారి పిల్లలు పుట్టింది కూడా మైసూరులోనే. ఆయన మనుమని ప్రకారం తరువాత తరములోనే భాషతో, తెలుగు సాహితీ సమాజముతో అంతగా సమ్మంధము లేకుండా పోయింది. అయినప్పటికీ మైసూరులో వారింటికి కన్నడ భాషా ప్రవీణులు, దిగ్గజులు, గొప్ప సంగీత కళాకారులూ, “చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉస్తా ఉంటిర”ని పంచుకున్నారు ఆయన మనుమడు, ఉదా: ఎమెస్ అమ్మ, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, డీవీ గుండప్ప, మాస్తి వెంకటేశ అయ్యంగార్ మొదలగు వారు.
వృద్ధాప్యం రెండవ బాల్యం కావడం మూలాన తిరుపతిలో అన్నమాచార్య ప్రాజెక్ట్ నిర్వహణ తరువాత ఆయన పెద్ద కుమారుని వద్ద ఉండడానికి బెంగళూరుకు మారారు. రాళ్ళపల్లి ఫనిశాయి గారికి సంస్కృతం, కర్ణాటక సంగీతం పట్ల మక్కువ, ఆసక్తి ఉన్నప్పటికీ అయన వృత్తి మాత్రం సైకాలజీలో నడిచింది. బెంగళూరు NIMHANSలో చదివి, చాలా కాలం మదురైలో పని చేసి, చివరికి బెంగళూరులో జయనగర్ National College కు principal గా 1982లో రిటైర్ అయ్యారు ఈయన. దానికి పది సంవత్సరాల ముందు కాలేజీ దగ్గరలో ఇల్లు కట్టించుకొని తండ్రిగారిని తన వద్ద పెట్టుకున్నారు. 1893లో ఆయన పుట్టిన రాళ్ళపల్లిని వదిలేసి దూరంగా తన చివరి దశకాన్ని ఇక్కడ గడిపారు అనంతకృష్ణశర్మ గారు (రాళ్ళపల్లిని వదిలే ముందు అనంతకృష్ణశర్మ పారంపర్యంగా వచ్చిన మూడు వేల ఎకరాలను, ఆయన కన్నుమూత తరువాత కుమారుడు ఫణి శాయి తక్కిన కొంత ఆస్తిని పేదలకు దానం చేయడంతో ఒక విధంగా ఆ ఊరితో రుణశేషాలు తీరినట్లు అయ్యింది). మనుమడు నందనందన్ గారు వైష్ణవులకు ఎంతో ప్రీతియైన ‘జ్ఞానానందమయం’ అన్న హయగ్రీవ శ్లోకం తాతగారు తనకు నేరిపించడం గుర్తు చేసుకున్నారు. అనంతకృష్ణశర్మ మైసూరు నుంచి తెప్పించుకున్న చెక్క బీరువా, ఆయన పడుకునే మంచం నేటికి వారింట్లో ఉన్న ఆయన జ్ఞాపకాలుగా స్మరించుకున్నారు.
-౦-౦-
ఈ సంవత్సరం జూన్‌లో ఈ ఇంటికే అప్పుడే మైసూరు నుంచి తిరిగి వస్తు నేను వెళ్లి, అనంతకృష్ణశర్మ గారి సాహితీ అవశేషాలను చూసింది. వర్షానికి తడవకుండా ఉండేలా నా పంచె అంచును కాస్త చేతిలో పట్టుకొని ఇంటిలోకి ప్రవేశించడానికి గేటు తెరిచాను. వైష్ణవ నామం ధరించి, మెడ చుట్టూ దట్టమైన ఉత్తరీయంతో ఉన్నఅనంతకృష్ణశర్మ గారి చిత్రం నా వైపు చూసింది. ఉందా లేదా అన్నట్టుగా ఉండే ఆయన నవ్వుని చూస్తూ, కాస్త ఉద్వేగం తో ముందుకు నడిచాను.
*
Well articulated Revanth.
I loved this sentence-వృద్ధాప్యం రెండవ బాల్యం.
Pl write a detailed article on Sirivennela Sita Rama Sastry.
బావుంది రేవంత్, తెలుగులో మరింత రాస్తూ ఉండు!
great .. I heard a lot about him
మహామహోపాధ్యాయ, మహాపండిత రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారి గురించి తెలియచేసే ప్రతి విషయం ఓ గొప్ప సంగతి.
రచయిత రేవంత్ ఉక్కళం గారికి కృతజ్ఞతలు.