ఒక మార్మిక వాస్తవికతలోకి……ఐ

శ్రీనివాస్ బందా స్వరంలో వినండి అఫ్సర్ కథ “ఐ”

 

“సందేహాలూ, సందిగ్దాలూ, సాన్నిహిత్యాలూ–

వీటికి రూపాన్నిచ్చే ప్రయత్నం జీవితంలో ఎప్పుడూ జరుగుతూనే వుంటుంది.
అలాగే ప్రపంచమూ – నిరంతరం వలలు విసురుతూనే వుంటుంది.

ఒడ్డున పడేసేది ఏది?

అఫ్సర్ సృష్టించిన మిస్టిక్ రియాలిటీ… “ఐ”

 

స్వరం, కూర్పు: బందా శ్రీనివాస్ 

కథ: అఫ్సర్ 

1

“పారిపోతున్నానా? కొన్ని చోట్ల నిలవ నీరై మిగిలి వుంటున్నానా?”

ఆ చివరి వాక్యంతో ఆ రాత్రికి నోట్ బుక్ మూసేశాడు వినీల్.  అలాంటి  వాక్యాలు రాయడం అతనికేమీ ఇష్టం వుండదు. ఆ మాటకొస్తే,  “రాయడం” అనేది అతనికి పెద్దగా నచ్చదు. అది ఏ రకమైన రాత అని కాదు, అసలు  రాయడం అనే చర్యలోనే  ఏదో మోసం వుందని అనుకుంటాడు. ఇప్పుడైతే మనుషులతో మాట్లాడడం కూడా అలాంటిదే అనే నిర్ణయానికి కూడా  వచ్చేశాడు, మనీషతో ఆ చివరి సంభాషణ తరవాత-

ఆ వొక్క వాక్యం రాశాక, డెస్క్  మీద కాసేపు వినీల్  చూపులు నిలిచిపోయాయ్. టేబుల్ అద్దం కింద వొకనాటి మిత్రుడు రాహుల్  అప్పుడెప్పుడో రాసిన వుత్తరం అందంగా పలకరిస్తోంది. ఆ అక్షరాల కింద ఇప్పటికీ రాహుల్ గొంతు వినిపిస్తూనే వుంటుంది. డెస్క్ మీద వొక వైపు  అమ్మానాన్నతో కలిసి దిగిన ఫోటో ఫ్రేమ్ లోంచి నిన్నటి జ్నాపకాలు. టేబుల్ మీద అంతకంటే ఎక్కువేమీ పెట్టుకోడు, అతని  మనసులానే- చిన్న ప్రపంచమే ఇష్టం అతనికి! మనీషతో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్న ఫోటో కూడా పెట్టాలని మొదట్లో  కొన్ని సార్లు అనుకున్నాడు. కానీ, ఆ ఫ్రేమ్ తయారయ్యే లోపే మనీష దూరమవుతూ వచ్చింది.

“విన్నీ, నాకు తెలిసీ నువ్వు ఎప్పటికప్పుడు భలే తప్పించుకు తిరుగుతూ వుంటావ్. వాస్తవాన్ని ఎదుర్కోవడం అంటే చాలా భయం నీకు. అది బంధాల విషయంలో కానీ, ప్రొఫెషన్ విషయంలో నీ మాటల్లోని  సున్నితత్వం కింద తెలియని భయాలున్నాయనిపిస్తుంది. నువ్వు నాకు ఇంకా ఇంకా దగ్గిరయ్యే కొద్దీ నువ్వు వొక చోట ఇరుక్కుపోయి, ఎగరలేని పక్షిలాగా కనిపిస్తూ వున్నావ్. అమ్మ నుంచి రాహుల్ దాకా నువ్వు షేర్ చేసుకునే మాటల్లో ఏదో ఇమాజినరీ లోకంలో మాత్రమే బతుకుతున్నావనే తెలుస్తుంది తప్ప ఇంకో అడుగు ముందుకు వేసేది  కనిపించడం లేదు.  ఎందుకంటే, వాళ్ళ జ్నాపకాల కింద వర్తమానాన్ని దాచేయడంలో నీకేదో తృప్తిలాంటిది వుందనిపిస్తోంది,” అని మహావేగంతో చెప్పేసింది.

ఆ సుదీర్ఘమైన ఫిర్యాదుతో  మొదలయిన కాఫీ సంభాషణ చాలా దూరమే వెళ్లింది.  మనీషకి కూడా తను అర్థం కాలేదు, కాలేదు అని  వినీల్ అనుకున్నాడు.  అంతే! ఆ ఇద్దరి మధ్య దాదాపు పాతికేళ్ళ  స్నేహం పుటుక్కున తెగిపోయింది.

ఈ రాత్రి అవన్నీ నెమరేసుకోవడం అతనికి ఇష్టం లేదు.

ముసురుకొస్తున్న ఆ జ్నాపకాలన్నీ  పక్కకి తోస్తూ, వూరికే మరోసారి నోట్ బుక్ చేతుల్లోకి తీసుకున్నాడు వినీల్.  రెండు మూడు పేజీలు తిరగేసి, బెడ్ మీద కూర్చుండిపోయాడు. ఎదురుగా అద్దంలోంచి నాన్న కనిపిస్తున్నాడు. నాన్నకి ముందు  అట్లా ఎప్పుడు అద్దంలో చూసినా అతనికి అమ్మ కనిపించేది. పదేళ్ళ కిందట అమ్మ అనారోగ్యం వల్ల మంచానికి అతుక్కుపోయి, వుండిపోయినప్పుడు కూడా జీవం లేని అమ్మ కళ్ళు అతన్ని ప్రతిక్షణం గైడ్ చేసేవి. అమ్మకి వినిపిస్తుందో లేదో తెలియకపోయినా, అన్నీ పూసగుచ్చినట్టు ఆమెకి చెప్పుకొని, ఆమె చూపుల్ని బట్టి అర్థం చేసుకునేవాడు. అమ్మ పోయాక నెమ్మదిగా ఆ స్థానంలోకి నాన్న వచ్చాడు. నెలలో సగం రోజులు నాన్న హైదరబాద్ వచ్చి అతనితోనే వుండేవాడు. వినీల్ మాత్రమే లోకం అన్నట్టే  వుండేవాడు. వినీల్ గురించి ఏదో భయం వెంటాడుతూ వున్నట్టే వుండేవాడు.

ఇప్పుడు అద్దంలో నాన్న— ఎప్పట్లానే అతనికి ఏదో చెప్తున్నట్టే వుంది. ఏడాది కిందట నాన్న కూడా పోయాడు. వెళ్తూ వెళ్తూ ఈ అపార్ట్మెంట్ కి కావాల్సినవన్నీ సమకూర్చి వెళ్లిపోయాడు, కొన్ని పుస్తకాలతో సహా!

“నేను పుస్తకాలు చదవడం మానేశా, నాన్నా అంటే—లేదు, మళ్ళీ చదువుతావ్. చదవాలని అనిపిస్తుందిలే!” అని చెప్పడం వినీల్ కి బాగా గుర్తుంది.

వొకసారి అపార్ట్మెంట్ కి వచ్చినప్పుడు మనీష ఆ పుస్తకాలు కొన్ని తిరగేసి, “మంచి పుస్తకాలే ఇవన్నీ. నేనూ చదవాలి” అన్నప్పుడు కూడా నిరాసక్తంగా వుండిపోయాడు.

మూడు గదుల ఈ అపార్ట్మెంట్ లో ఎటు తిరిగినా ఎక్కడ కూర్చున్నా నాన్నే. అదిగో, ఆ ఎదురుగా కనిపించే అద్దం, ముందు గదిలో ఫర్నీచర్, వంటింట్లో ప్రతీదీ. ఈ బెడ్. దాని పక్కన లాంప్. ఈ కిటికీలకు కర్టెన్లు. అన్నీ! చాలా కాలం వినీల్ వాటితో మాట్లాడుతూనే వుండిపోయాడు నాన్నతో మాట్లాడుతున్నట్టే! అట్లా మాట్లాడుకోవడం అసహజం అంటుంది మనీష.

“అమ్మా నాన్న లేరు అన్నది వాస్తవం. రాహుల్ కూడా మన దరిదాపుల్లో లేడు. వాళ్ళ జ్నాపకం మనం వదిలేసి వచ్చిన  ఆ చిన్న టౌన్ బతుకు మాదిరి  నాస్తాల్జియ నీకు- అది  ఇప్పుడు కనిపించని ఇంకెక్కడికో లాక్కుంటూ వెళ్తుంది. అట్లా దానివెంట కుక్కపిల్లలా వెళ్లిపోవడం నీకు సౌకర్యంగా వుంటుంది. నువ్వు ఇప్పుడు ఇక ఈ వాస్తవంలో బతకడం నేర్చుకోవాలి” అని వో రోజు చాలా నిక్కచ్చిగా చెప్పేసింది.

ఆ రోజుకి అదే నిజమే అనిపించి,  అతని అద్దంలో నాన్నని replace చేసింది మనీష రూపం. అదంత హడావుడిగా ఏమీ జరగలేదు,  చాలా నెమ్మదిగానే  తనకేమీ ఆనవాలు దొరక్కుండానే జరిగిపోయింది.  ఆ క్షణం నుంచి వినీల్ ప్రతి మాటా అద్దంలో మనీష ప్రతిబింబంతో  చెప్పుకోవడం మొదలు అయింది.

“పిల్లలు ఆటబొమ్మల్లో ఏం వూహించుకొని కబుర్లు చెప్పుకుంటారో అదీ వీళ్ళంతా నీకు!” అంటుంది మనీష.

నాన్న నిజంగా లేడు అన్నది వినీల్ కి వాస్తవంగా అనిపించడం కూడా అప్పుడే మొదలైంది.

మనీష కి వినీల్ అంటే ఏమిటో అర్థమైనట్టుగా ఆరు నెలల కిందట వొక నోట్ బుక్  తెచ్చి ఇచ్చింది.  “ఇందులో ఏదో వొకటి రాస్తూ వుండు. నీతో నువ్వు మాట్లాడుకోవడం అలవాటు చేసుకో. అద్దంలో ఇమాజినరీ రూపాలతో కాదు!” అంది ఆ రోజు మనీష.

“ఆ అలగా తో ఏంట్రా నీకు? మనవాళ్లే దొరకలేదా కబుర్లకీ, కాఫీలకూ?” అని సురేన్ ఎన్ని సార్లు వెక్కిరించాడో!

సురేన్ మంచి స్నేహితుడే అనిపిస్తాడు కానీ, ప్రతి దానికీ ఈ కులం గొడవ అవసరమా అనిపిస్తుంది. అదే మాట ఎదురంటే- “మన కులమే మనకి పెద్ద  పెట్టుబడి. దాన్ని వాడుకోవడం నీకు చాతకావడం లేదు. చివరికి నీకు పనికొచ్చేది మనోళ్లే!ఈ అలగా బ్యాచీ కాదు. బాస్ కి నువ్వంటే సాఫ్ట్ కార్నర్ ఎందుకూ…ఎందుకంటే, వాడు కూడా మనోడే కాబట్టి!”

ఆ “మనోడు” అనే కాన్సెప్ట్ వినీల్ మనోలోకంలో అర్థం లేనిది. సురేన్ తో అతని  స్నేహం ఎక్కడిదాకో తెలిసినట్టే అనిపిస్తుంది చాలా సార్లు. ఆ మాటకొస్తే, చిన్నప్పటి నుంచీ అతని కుటుంబంలో దాదాపూ కలిసిపోయిన రాహుల్ కూడా వాడి దృష్టిలో మనోడు కాదు.

“వాడేంట్రా, ఆ రాజకీయాల్లో పడి, ఫ్యూచర్ చెడగొట్టేసుకున్నాడు! అయినా, ఆ అలాగా జనాలకు  అంతకంటే దిక్కేముందిలే!” అని ఎన్ని సార్లు అన్నాడో లెక్క లేదు.

సురేన్ దృష్టిలో వాళ్ళిద్దరూ అలగా. అంతకంటే వేరే వ్యక్తిత్వాలూ,కెరీర్లూ ఏమీ లేవు వాళ్ళకి. అతని దృష్టిలో మనవాళ్లు కానివాళ్ళంతా అలగా వాళ్ళే!

నోట్ బుక్ ఇచ్చాక మళ్ళీ మనీషని చూడలేదు.  కాఫీ షాప్ లో చివరి సంభాషణ.. ఈ లోపు కొవిడ్  యుగం ప్రవేశించి, మనీష కూడా కనిపించడం మానేసింది. కనిపించదలచుకుంటే, ఏదో వొక రకంగా కనిపించవచ్చు. ఇప్పుడున్న మానసిక స్థితిలో ఏదో రోజు మనీషని కలుస్తాడన్న నమ్మకం కూడా అతనికి లేదు. ఆమె తానే వచ్చి అవి చదువుతుందన్న ఆశ కూడా లేదు. ఎవరైనా చదువుతారన్న ఆలోచన కూడా వినీల్ కి ఆట్టే నచ్చదు. మనీష కూడా చదవక్కర్లేదు. ఆ మాట అనుకున్న రోజు ఆమె ఇచ్చిన నోట్ బుక్ పక్కన పడేసి, పనిమాలా బుక్ స్టోర్ కి వెళ్ళి, ఎంతో ఇష్టమైన లేతాకుపచ్చ రంగు కవరున్న వేరే నోట్ బుక్ తెచ్చుకున్నాడు వినీల్. ఆ పేజీలలో అతని కోసమే అయిన ఏదో పరిమళం పలకరించడం మొదలుపెట్టి, రోజూ వొక్కటే వొక్క లైను రాయడం మొదలు పెట్టాడు.

ఈ మధ్య మనీష కూడా ఎవరో అన్న ప్రశ్న అతన్ని కొన్ని నెలలుగా తొలుస్తోంది, అదేదో పురుగు మెదడులోకి జొరబడి, మొత్తం తినేస్తూ పోతున్నట్టు- అతను కోరుకుంటున్న అతితీవ్రమైన ఏకాకితనానికి కోవిడ్ ఇంకాస్త బలం ఇస్తూ వచ్చింది. ఆ తరవాత మనీష అద్దంలో మనిషిగా మాత్రమే వుండిపోయింది.

“అంతే, ప్రతి స్నేహానికీ అట్లాంటి చివరి కాఫీ సమయం వొకటి గ్యారంటీగా వుంటుంది” అని ఆ రోజు రాత్రి నోట్ బుక్ లో రాసుకున్నాడు.

2

నిజానికి –మనీష అంటే అతనికి ఇప్పటికీ ఇష్టమే. ఆరునెలల కిందట అయితే ప్రాణమే. ఆ మాట తానే literal గా చెప్పాడు పనికట్టుకొని- అట్లా చెప్పినందుకు తనే మళ్ళీ రిగ్రెట్ అయ్యాడు ఆ తరవాతి వారం రోజుల్లో- వాళ్ళు వొకే కాలేజీలో చదువుకున్నారు హైదరబాద్ కి వంద మైళ్ళ దూరంలో చిన్నపాటి పట్టణంలో- ఆ పట్టణం ఇంకాస్త పెద్దది అయి వుంటే తమ జీవితాలూ కెరీర్లూ ఇంకోలా వుండేవి అనుకున్నారు చాలా సార్లు.

“అది నిజమేనా?” అని మనీష వొకసారి అడిగినప్పుడు వెంటనే అన్నాడు –

“అంతే అనిపిస్తుంది. ఎంత కాదనుకున్నా ఈ హైద్రాబాద్ లో పోష్ కాలనీల్లో పెరిగిన/ చదువుకున్న వాళ్ళ దగ్గిర వొక్క ఇంగ్లీషు ముక్క పెగలదు నీకైనా, నాకైనా! వాళ్లలాగా కొత్త డ్రెస్ సెన్స్ అనేది అలవాటు కానే కాదు మనకి!  అందుకే, వాళ్ళ కెరీర్ గ్రాఫ్ లో డ్రాప్ అంటూ వుండదు.”

“ఏమీ కాదు! డీల్ చేసేది భాషతోనో, డ్రెస్ తోనో  కాదు, ఆలోచనలతో! మనం పాత ఆలోచనల్లో ఖైదీలుగా పడివుంటున్నామేమో ప్రతిసారీ చెక్ చేసుకోవాలి. ఈ కార్పొరేట్ లోకంలో అయితే, ప్రతిక్షణం…!” అంది మనీష.

“కాదు. కానే కాదు.”

“అది కేవలం నీ ఆలోచనల సోమరితనం!” అని టక్కున అనేసింది మనీష. అంటే, తనని సోమరి అనేసిందా?! తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంతైనా ఆమె కంటే తక్కువే.  అందుకే, మనీష అంటే వొకప్పుడు చాలా ఇష్టంగా వుండేది వినీల్ కి!

హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే నాలుగేళ్ల కిందట వాళ్ళు ప్రతివారం కలుసుకునేవాళ్ళు. అదే కాఫీ షాప్ లో, అదే టేబుల్ మీద! “అంతకుముందు మనం ఏదైనా పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు పనికట్టుకొని ఇరానీ చాయ్ కోసం వెతుక్కొని వెళ్ళి, అది ఎక్కడుంటే అక్కడే కూర్చునే వాళ్ళం గంటల తరబడి. ఇప్పుడు ఆ ఇరానీ  చాయ్ పోయి, ఐస్ కాఫీలూ మోకాలూ వచ్చేశాయ్! కాఫీ షాప్ అన్నది మన క్లాస్ సింబల్ ఇప్పుడు, ” అంది ఇంకో సారి మనీష. అది మంచి గమనింపు. నిజమే! అట్లాంటివి గమనించి, మాటల్లో పెట్టడం   వల్ల కూడా మనీష అంటే అతనికి మహా ఇష్టంగా, ఆకర్షణగా వుండేది.

ఆరునెల్ల కింద – వొక వారం తరవాత- కచ్చితంగా అట్లాంటి కాఫీ షాపులోనే మనీష చివరిసారి కలిసింది. కబుర్ల మీద కబుర్లు, కథల మీద కథలు చెప్పుకునే మూడ్ –ఆ  magical mood- చచ్చిపోయింది “వినీల్, మొన్నటి వర్క్ షాప్ తరవాత బాస్ కి నీ మీద నమ్మకం చచ్చిపోయింది.  అసలు వొక్క వర్క్ షాప్ కి కూడా నువ్వు రాలేదు. వుద్యోగం విలువ నీకు అర్థమైందా?!” అంటూ మొదలైన కాఫీ సంభాషణ చాలా దూరమే వెళ్లింది. చాలా మంది మిలీనియల్ కుర్రాళ్ళ లాగే వినీల్ smart అని ఆమెకి తెలుసు. కానీ, ఏదో అతనికి అడ్డుపడుతోంది. అదేమిటో ఆమెకి తెలిసినంతగా వినీల్ కి తెలియడం లేదు. వొక ప్రవాహంలో కొట్టుకుపోవడం అతనికిష్టం. ఆ ప్రవాహం ఏమిటీ అన్నది మాత్రం అతనికి తెలీదు. ప్రస్తుతం అది వొక్కో దశలో వొక్కో మనిషిలా అతన్ని ఆవహిస్తోంది, అంతే!

ఈ లోపు కోవిడ్ మహమ్మారి వల్ల  చాలా మార్పులు. వర్క్ ఫ్రమ్ హోమ్- “ఎవరినీ కలవక్కర్లేదు, అమ్మయ్య!” అనుకున్నాడు. ఆ చివరి మీటింగ్ తరవాత మనీష  కంగారుపడి రెండు మూడు మెసేజులు పెట్టింది. దేనికీ అతను జవాబివ్వలేదు. కనీసం, ఆ మెసేజులు చూసినట్టు సింబల్స్ కూడా వదల్లేదు. కానీ, నోట్ బుక్ లో రాసుకున్నాడు: “మరీ ఎక్కువ చనువు ఇవ్వకూడదు ప్రాణ స్నేహితులకు కూడా!” ప్రాణ స్నేహితులు సరే, అసలు స్నేహితులు అంటూ వున్నారా ఈ కాలంలో—అని ఆ మరునాడు ఇంకో లైను దానికి కలిసింది చాలా ఆలోచనల తరవాత! ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు డోర్ లాక్ ఇంకాస్త గట్టిగా రెండు మూడు సార్లు చెక్ చేసుకొని మరీ వేసుకున్నాడు. అంతకుముందు డోర్ లాక్ చేస్తే చేసేవాడు, లేకపోతే లేదు! మామూలుగా మనీష గానీ, సురేన్ గానీ తలుపు తోసుకుని వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో అది అంతగా నచ్చడం లేదు. రాత్రి అద్దంలో మళ్ళీ వినీల్ కి నాన్న కనిపిస్తున్నాడు. ఏదో చెప్తూనే వుంటాడు. ఏదో వింటున్నట్టే వుంటాడు. ఏం జరుగుతుందో తెలీదు.

పొద్దున్న ఆలస్యంగా నిద్రలేవడం అతనికి అనుభవంలో లేదు. ఎవరైనా అట్లా లేస్తే “లేట్ లతీఫ్” అని అతనే ఏడిపిస్తూ వుండే  వాడు. ఆ మరునాడు మాత్రం ఆలస్యంగా కాదు, మధ్యాన్నం దాకా మొద్దు నిద్ర అతన్ని వదల్లేదు. “వినీల్, వర్క్ లాగిన్ అవ్వు ….!” అని మధ్యాన్నం తరవాత మనీష కాదు, సురేన్ మెసేజ్ పెట్టాడు. గబుక్కున లేచి కూర్చున్నాడు తప్ప లాగిన్ అవ్వాలని అనిపించలేదు. వుద్యోగం—ఎవరు విధించిన శిక్ష! ఇంకో దారి లేదా భుక్తికి?!

నాన్న అనేవాడు- “ఒరేయ్, నీ బతుక్కి నువ్వే దారి వెతుక్కోవాలి. వొక తండ్రిగా నిన్ను ఇంజినీరింగ్ దాకా చదివించాను. నువ్వూ బాగా చదువుకున్నావ్. మంచి కంపెనీలో వుద్యోగం సాధించుకున్నావ్. నీ స్నేహితుడు రాహుల్ లాగా దారితప్పుతావని ఎప్పుడూ భయపడుతూనే వుండిపోయా. అట్లా జరక్కపోవడం వరకూ నాకు తృప్తి!” తన కొడుకు బతుకులో విఫలం అయిపోతాడన్న కంగారు నాన్నకి వుండేదా అనిపిస్తుంది వినీల్ కి చాలా సార్లు!

రాహుల్ దారి తప్పాడని ఎవరైనా అంటే వినీల్ కి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే, లోపలెక్కడో రాహుల్ చేసిందే సరయింది అనే  నమ్మకం ఏదో వుంది. రాహుల్ కీ, అతనికీ కనీసం పదేళ్ళ  తేడా. తనూ ఇంజినీరింగ్ చదువుకున్నాడు. స్టూడెంట్ పాలిటిక్స్ వల్ల అతని దారి వేరే అయిపోయింది. ఆ స్టూడెంట్ పోలిటిక్స్ ఏమిటో వినీల్ కి తెలీదు. టేబుల్ మీద కూర్చోగానే రాహుల్  ఉత్తరం కనిపిస్తుంది. రాహుల్ ఇంజినీరింగ్ కోసం వరంగల్ వెళ్ళినా,  ప్రతివారం వుత్తరాలు రాసే వాడు. ఈ ఉత్తరం మాత్రం అతనికెందుకో తరచూ రెఫరెన్సులాగా కనిపిస్తూ వుంటుంది.

విన్నీ,

తరాల అంతరం అనేది పెద్ద మాట. ఈ కాలంలో పెద్ద పెద్ద మార్పులన్నీ కొద్ది సమయంలోనే జరిగిపోతున్నాయ్. మనిద్దరి మధ్యా వున్న వయసు అంతరం పదేళ్ళు . కానీ, అందులోంచి తలెత్తిన/ లేదా మన చుట్టూ సమాజంలోంచి తలెత్తిన సమస్యలూ సంక్షోభాలూ చిన్నవి కాదు. నా కాలేజీ రోజుల రాత్రులు గోడ మీది రాతలతో తెల్లారేవి అని ఇప్పుడు చెప్పబోతే నీకు కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. కానీ, ఇవాళ ఈ వుత్తరం రాస్తూ నీకో విషయం చెప్పాలనిపిస్తోంది.   నేనూ ఇంజినీరింగ్ చదివాను. నువ్వూ అదే దారిలోకి వచ్చావ్. కానీ, నా ఇంజినీరింగ్ నాకు వరంగల్ లో వేరే దారులు చూపించింది. నీ దారి వేరే అయి, నువ్వు సైబరాబాద్ వాసివి అయ్యావ్. మధ్యలో గౌరవమో భయమో కలిగించే  మీ నాన్న ప్రాక్టికల్ వాదమూ, మీ అమ్మగారి అచ్చమైన ప్రేమా , ఆ తరవాత నన్ను అమితంగా ప్రేమించే నీకు నా సామాజిక వాదమూ ఎంత గందరగోళంలో పడేసి వుంటాయో వూహించుకోగలను. చూస్తూ వుండగానే, మనిద్దరి అనుభవాలూ వాటి డైలమాలూ రెండు భిన్న ధృవాలై పోయాయి. ఈ వుత్తరాలు నీ నుంచి ఏదో ఆశించి రాయడం లేదు. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో, అదేమీ తప్పు కాదు. దాన్ని గురించి regrets లేని జీవితాన్ని నువ్వు ఆహ్వానించు. ఆ బతుకు ఎట్లా ఎదురైనా రెండు చేతులా ప్రేమించు. నాకు తెలిసీ నువ్వు నువ్వుగా వుండాలి ఎప్పుడూ. అమ్మా నాన్నా, రాహుల్ కొంతకాలమే నీతో వుంటారు. ఆ తరవాత నువ్వే వుండాలి. నువ్వే, కచ్చితంగా నువ్వే! నా దృష్టిలో అదీ స్పష్టమైన విముక్తి.  నా ఈ అజ్నాత జీవితం తరవాత మనం కలుస్తామో లేదో తెలియదు. నీ మీద ప్రేమతో ఈ నాలుగు మాటలూ రాస్తున్నా.

  • రాహుల్

రాహుల్ నుంచి తనదాకా ఎంత దూరం?! తను రాహుల్ కాలేకపోయాడు. నాన్నలాగా ఏదో చిన్నా చితకా వుద్యోగానికి కుదురుకొని, వున్న టౌన్ లోనే వుండలేకపోయాడు. ఈ సిటీకి రావాలనుకున్నాడు. వచ్చాడు.  ఇప్పుడు పొరపాటు చేశాడేమో అనుకుంటాడు చాలా సార్లు. బయటికి వెళ్లాలంటే విసుగు. మనుషుల్ని కలవడంలో ఏదో  అసహనం.

ఆమాటకొస్తే, మనీషకో, సురేన్ కో తను ఎంత దగ్గిరా?! ఏమో?! అమ్మ వొక్కటే తన మనిషిలా అనిపిస్తుంది. నాన్నా, రాహుల్, సురేన్, మనీష—వీళ్లెవరో అంతుపట్టని పాత్రల్లా అనిపిస్తారు.

3

ఆ వుత్తరం టేబుల్ మీద ఎందుకూ అని తరవాత వినీల్ చాలా సార్లు తనని తాను నిలదీసుకున్నాడు. అది రాహుల్  రాసిన ఉత్తరం అనా? లేకపోతే, అందులో నిక్షిప్తమైన సందేశం ఏదో తనకెప్పుడైనా అవసరం అనా!? అవన్నీ ఆలోచించుకోలేదు. కానీ, చాలా సార్లు ఆ వుత్తరంలోంచి ఏదో రిలీఫ్. బహుశా అందులోని గతం ఏదో మెరుస్తూ  కనిపిస్తూ వుందేమో అనుకుంటాడు కొన్ని సార్లు.

రాహుల్ వినీల్ కంటే పదేళ్ళు పెద్ద. వినీల్ కి పెద్దన్న లేని లోటు అనిపించేవాడు. అతను అజ్నాతవాసంలోకి వెళ్ళే ముందు తమ సొంత కొడుకే అడవిపాలు అవుతున్నట్టు అమ్మా నాన్న ఎంత బాధపడ్డారో, నాన్న ఎంత మండిపడ్డారో ఆ దృశ్యాలన్నీ వినీల్ కి ఎప్పుడూ గుర్తుంటాయి.

“నువ్వు ఎంత చదువుకున్నావో ఆ చదువూ ఏమైపోయిందిరా! ఏమిటీ వుద్యమాల గొడవ!?” అని నాన్న రాహుల్ ని గట్టిగానే నిలదీశారు. ఆ వుద్యమాల కాలం అయిపోయిందని వినీల్ తండ్రి వాదన.

అమ్మకి అవేమీ తెలియదు. కానీ,  ఆ రోజు అమ్మ కన్నీళ్లు చూశాక, అమ్మని తను ఎప్పుడూ అంతగా బాధించకూడదు అని పదిసార్లు వొట్టు వేసుకున్నాడు వినీల్. అది జరిగాక అమ్మ  ఎంతోకాలం వుండలేదు. నాన్న వొంటరి అయిపోవడం వినీల్ ని వుద్యోగ జీవితంలో తప్పనిసరిగా కుదురుకునేట్టు చేసింది. కానీ, అంత చదువుకొని కూడా నాన్నకి తెలిసిన వాళ్ళ కంపెనీలో తప్ప తనకి వుద్యోగం దొరక్కపోవడం అదొక బాధ. ఆ నాన్న  కూడా పోయాక అతన్ని విపరీతంగా క్రుంగదీసింది వొంటరితనమే! ఎవరూ లేరు, ఎవరూ మిగలరు అనేదేదో ఖాయమై పోయిందనుకున్న రోజుల్లో మనీష…సురేన్ దృష్టిలో అలగా మనిషి. కింది కులం. సురేన్ పదేపదే హెచ్చరించిన “మిగలని స్నేహం”.

రాహుల్  వుత్తరం ఇంకోసారి చదువుకొని, వో రెండు మూడు కన్నీటి చుక్కల్ని దిగమింగుకునేటప్పుడు, మళ్ళీ సురేన్ మెసేజ్: “ఒరేయ్, లాగిన్ అవ్వు. బాస్ ఇక్కడ అగ్గి మీద గుగ్గిలం!”

వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సరిపోయింది. లేకపోతే..ఆ ఆఫీస్ దృశ్యం వూహించుకోవడం ఇంకో నరకం! ఇప్పుడున్న మానసిక స్థితిలో అవేమీ పట్టించుకునే వోపిక లేదు వినీల్ కి. తెగని ఆలోచనల మధ్య వూగిసలాటలో ఆ మధ్యాన్నం చాలా ఆలస్యంగా సాయంత్రంలోకి కుంటుకుంటూ వెళ్లింది.

4

ఆ మధ్యాన్నపు కునుకు, ఆ తరవాతి స్నానమూ కాస్త మనసుని రీఛార్జ్ చేశాక, మొబైల్ చూస్తే, పది మెసేజులు సురేన్ నుంచి.

మనీష కనీసం వొక లైను రాస్తే బాగుండేది కదా! అనుకున్నాడు. తానే రాయచ్చు కదా..అనుకోవడమే ఆలస్యం, వెంటనే “ఎక్కడున్నావ్, మనీషా!?” అని వొక లైన్ పెట్టాడు. బహుశా, ఇంత క్విక్ గా తను వొక పని చేయడం ఈ మధ్యకాలంలో ఇదే అనుకున్నాడు కూడా. అంత క్విక్ గా ఆ ఆలోచన రావడం, దాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా implement చేసెయ్యడం అతనికే బాగా నచ్చింది. అది అతనికి “ఆహా” మూమెంట్!

ఇప్పుడు మనీష సమాధానం కోసం ఎదురుచూడడం వొక అశాంతి. అపార్ట్మెంట్ లో వుండలేక, బయటపడాలనుకున్నాడు. హడావుడిగా రెడీ  అయి బయటపడ్డాడు. అది చాలా ప్రశాంతంగా వుండే ఏరియా. పైగా, తన అపార్ట్మెంట్ కొంచెం సందులాంటి ప్రాంతంలో వుంటుంది కాబట్టి కార్ల సందడి కూడా వుండదు.

మామూలుగా అయితే సందు తిరగ్గానే మలుపు దగ్గిర చిన్న చాయ్ కొట్టు సందడిగానే వుంటుంది.  చిన్నదే కానీ, క్వాలిటీ బాగా maintain చేస్తాడు రాము. ఎప్పుడూ సంతోషంగా పలకరిస్తాడు. అది బాగా అనిపిస్తుంది చాలా సార్లు. పొద్దునా, సాయంత్రమా అని కాదు. అతని పలకరింతలో తేడాలుండవు. అట్లా అని అసహజంగా కూడా వుండదు. ఆ పలకరింతా, చిరునవ్వూ ఎప్పుడూ వినీల్ కి పెద్ద పజిల్. బహుశా, తానెప్పుడో అట్లాంటివి మరచిపోయి వుంటాడు. కార్పొరేట్ బతుకు పుస్తకంలో అట్లాంటి పేజీలు తొరతొరగా చిరిగిపోతాయి. మనీష కూడా అదే ఫీల్ అవుతుందా?! కాకపోవచ్చు. ఇది తన ప్రత్యేకమైన సమస్యే కావచ్చు. పోనీ, సురేన్?! సురేన్ కి ఎస్కేప్ రూట్స్ చాలా వుంటాయి. వీకెండ్ పార్టీలూ, వూరికూరికే మారిపోయే గర్ల్ ఫ్రెండ్సూ, చెత్త జోకులూ…వాడికొక వేరే లోకమేదో వుంది.

మళ్ళీ మొబైల్ చూసుకున్నాడు. మనీష మెసేజ్ లేదు!

రాము టీకొట్టు కూడా తెరిచిలేదు. డబ్బాల తలుపులు మూసి వున్నాయి. వెనక్కి తిరిగి మళ్ళీ గేటు దగ్గిరకి చేరుకున్నాడు. సెక్యూరిటీ వాడి ముఖం కనిపించడమే లేదు, నవ్వుదామనుకున్నా! అతని ముఖమ్మీద పెద్ద మాస్కు, గ్లాస్ కవరూ. ఆ ముఖం అతనిదో కాదో.

“సాబ్…మాస్క్ యాద్ నై…?! మాస్క్ లేపోతే జనం భయపడతారు” అన్నాడు నవ్వుతూ. “అవునేమో, ఏదో వొక మాస్క్ కావాలేమో…కోవిడ్ వున్నా లేకపోయినా…” అనుకున్నాడు వినీల్ లోపల్లోపల.

“ఓహ్, నిజమే!”అని వెనక్కి పరిగెత్తి ఎలివేటర్ దగ్గిర కొచ్చాడు. ఎలివేటర్ ముందు ఇద్దరు తొమ్మిదీ పదేళ్ళ పిల్లలు అతని ముఖం పరీక్షగా,అనుమానంగా చూశారు. మాస్క్ లేని ముఖం..భయం వాళ్ళ కళ్ళల్లో!

“సారీ!” అనేసి, మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు.

ఈలోపు మొబైల్ మోగింది. గొప్ప వుత్సాహం. మనీష అయి వుంటుదనుకున్నాడు. చూస్తే, ఏదో స్పామ్  మెసేజ్.. వొక్కసారిగా నీరసం– వొంట్లో నెత్తురు జారిపోయినట్టు. వొళ్ళు కట్టెగా మారిపోయినట్టు-

రాదు… మనీష..కూడా రాదు!

ఎదురుగా మెట్లు కనిపించడం లేదు వినీల్ కి!

*

(ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక)

చిత్రం: చారి

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు