ఒక బ్లాక్ విద్యార్థి ఆక్రోశం ఈ కథ!

ఆంగ్లభాషకి ఉన్న ఒక ప్రత్యేకత హోమోనిమ్స్ – అంటే, ఒకేలాగా ఉచ్చరింపబడినా అర్థాలు వేరేగా ఉండే పదాలు ఉండడం. “know,” “no” రెండూ కూడా “నో” అనే పలకబడడం వాటికి ఒక ఉదాహరణ. ఒకదానితో వేరొకదానికి సంబంధం ఉండే పదాలని “cognates” అని కూడా అంటారు. అలాంటి సంబంధంతో ముడిపడ్డ కథ ఈ నెల పరిచయం చేస్తున్న False Cognates (1991). రచయిత్రి లాడీ హబ్బర్డ్.

దాదాపుగా అందరూ తెల్లవాళ్లు ఉన్న ప్రిపరేటరీ బడిలో వైవిధ్యం కోసమని కావచ్చు, చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ఐదుగురు నల్లవాళ్లని జేర్చుకున్నారు స్కాలర్షిప్పులని ఇచ్చల్లా. ఆ బడి నడవాలో చేతిలో బక్కెట్టూ, చీపిరీ పట్టుకుని తిరగని నల్లవాళ్లు ఈ అయిదుగురే! విలియమ్ జెంకిన్స్ వాళ్లల్లో ఒకడు. అతని తండ్రి హాంక్ ఒకప్పుడు లాయర్. కానీ, విధి వక్రించి బార్ నుంచీ సస్పెండ్ చెయ్యబడి రాబడి లేని పరిస్థితిలో ఉన్నాడు. కథ మొదలయ్యేటప్పటికి అతను అసిస్టెంట్ డీన్ మోరిస్ ఆఫీసు గదిలో ఆయన ముందు కూర్చున్నాడు. ఆ సంవత్సరంలో అప్పటిదాకా “మీ పిల్లవాడి చదువు గూర్చి మాట్లాడాలి, రమ్మన” మన్న అయిదుసార్లల్లో హాంక్ జెంకిన్స్ అక్కడకు రావడం అది మొదటిసారి.

హాంక్ ముందర కొడుకు విలియమ్ రాసిన వ్యాసాన్ని పెట్టి, అందులోని తప్పులని ఎత్తి చూపిస్తాడు డీన్ మోరిస్. అన్నీ కూడా కాగ్నేట్స్ కి సంబంధించినవే! night కు బదులు knight, peace కు బదులు piece, raised కు బదులు razed, hear కు బదులు here వంటివి దాన్నిండా ఉన్నాయి. అంటే, ఉచ్చరిస్తే వినేవాళ్లకి ఆ వాక్యాలలో ఉండవలసిన పదాలే వినబడతాయి. కానీ, చూసి చదువుతున్నప్పుడు మాత్రం తప్పులన్నీ కొట్టొచ్చినట్లు కనిపిస్తా యన్నమాట. ఆంగ్ల భాషని వేరే భాషగా చదివేవాళ్లే గాక అది మాతృభాష అయిన అమెరికన్లు కూడా ఈ తప్పులు చేస్తారు. వీటికి తోడు your కు బదులు youre అని రాయడం కూడా. విలియమ్ కావాలనే అలా చేసివుంటాడని, శ్రద్ధపెట్టి చదివితే అభివృధ్ధిలోకి వస్తాడనీ డీన్‌కి నమ్మకమే! అయితే, విలియమ్ చేత ఆ వ్యాసాన్ని మళ్ళీ రాయించడానికి అవకాశా న్నిస్తే అది మిగతా పిల్లలకి అన్యాయం చేసినట్లవుతుం దని డీన్ నమ్మకం. (నిజజీవితంలో ఉపాధ్యాయుడి పాత్రని పోషించే వాళ్లందరికీ ఈ పరిస్థితి సుపరిచితమే! అందరికీ ఒకే నియమం వర్తించాలి గదా మరి?) అందువల్ల అప్పటిదాకా అతను చూపిన ప్రతిభని మాత్రమే గణనలోకి తీసుకుని స్కాలర్షిప్పుని కోసేయడం ఆయనకు అందిన మార్గం. స్వంతంగా డబ్బులు పెట్టుకుని చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే దాన్ని తిరిగి ఇవ్వచ్చన్నది ఆయన ప్రతిపాదనే గానీ నిజంగా ఆ కుర్రవాడు మంచిమార్గంలో పడతాడని ఆయనకు నమ్మకం లేదు. మిగతా ఉపాధ్యాయు లయితే ఆయన చూపిస్తున్న మాత్రం కరుణని కూడా చూపకుండా అతని అల్లరి భరించలేకపోవడంవల్ల ఎంత తొందరగా అతణ్ణి వదిలించుకుందామా అని ఎదురుచూస్తున్నారు. స్వంతంగా డబ్బు కట్టి చేరినా గానీ విలియమ్ త్వరలోనే అక్కడినుండి వెళ్లవలసివస్తుందని డీన్ నమ్మకం.

డబ్బు కట్టయినా సరే విలియమ్‌ని అదే బడిలో కొనసాగనివ్వాలని హాంక్ పట్టుదల. ఉద్యోగం లేని అతనికి డబ్బు ఎక్కణ్ణించీ వస్తుంది? అతని తండ్రి పేరున్న బాక్సర్. ఆయన పోయిన తరువాత అతని తల్లి వాళ్ల ఇంటినీ ఆయన వస్తువులనీ భద్రంగా చూసుకుంటోంది. వాటిల్లో కొన్నింటిని అమ్మితే డబ్బు సమకూరుతుందని హాంక్ నమ్మకం. అంతేకాక, అత్యవసర పరిస్థితులు ఎదురయినప్పటికోస మని తల్లిదండ్రులు ఇంట్లో డబ్బు దాచుకునే స్థలం అతనికి చిన్నప్పటినించీ బాగా ఎరుకే. ఇంటికొచ్చి పైనవున్న బెడ్రూంలోకి వెడుతుంటే కొడుకు విలియమ్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు. తరువాత ఆ మాట్లాడుతున్నది డీన్ మోరిస్ తో నని, ఆయన తనకి సత్తా వున్నదని, శ్రద్ధపెట్టి చదివితే అభివృద్దిలోకి వస్తావని, విలియమ్  ఒక గణాంకంగా మిగిలిపోవడం తనకి ఇష్టం లేదని ఆయన అన్నాడనీ అతను  తండ్రికి  చెబుతాడు. ఇక్కడ ఆ “గణాంకం” కి అర్థం, చదువు వంటపట్టక లేదా అందులో శ్రద్ధ చూపకపోవడం వల్ల రోడ్డు మీద బలాదూర్ తిరుగుళ్లు తిరిగి, చెడ్డ అలవాట్లకి లోనయి, జైలుకీ బయటకీ తిరిగే నల్లవాళ్ల సంఖ్యకు తోడవడం అన్నమాట.

ఆ మాటలు హాంక్ చేత కొడుకుకి “ఒక్కోసారి తెల్లవాళ్లకి మన నల్లవాళ్ల సత్తా గూర్చి కొన్ని విపరీతమయిన అభిప్రాయా లుంటాయి. నువ్వు వాటిని నిజం చెయ్యడంకోసం నీ వ్యాసం అలా రాశావా? నువ్వు అలాంటి డ్రగ్ డీలర్స్ తోనూ గాంగ్‌స్టర్లతోనూ తిరగవు. నేను నిన్నలా పెంచలేదు. నీ సత్తా నాకు తెలుసు గనుక అన్ని తప్పులు రాయడం నువ్వు కావాలనే చేసివుంటావని నా నమ్మకం,” అని చెప్పడానికి దారితీయిస్తాయి. నిజానికి ఆ ప్రిపరేటరీ బడికి తను వెళ్లదలచుకోలేదనీ తమవాళ్ళు ఎక్కువగా ఉండే దగ్గరి బడికే వెడతాననీ విలియమ్ తండ్రికి చెబుతాడు. అంతేకాక తనని తీసుకువెళ్లడానికి వచ్చే తల్లితో కూడా అదే చెబుతానంటాడు. హాంక్ కి తన పరిస్థితి తేటతెల్ల మవుతుంది. కెరీర్ నాశన మయింది. భార్య అతన్ని విడిచి వెళ్లింది. పేరున్న ప్రిపరేటరీ బడిలో వాళ్లు స్కాలర్‌షిప్ ఇచ్చల్లా చదివిస్తారు గదా, చదువుకోరా అనే తన మాటని కొడుకు విన నంటున్నాడు.  దీనికంతటికీ కారణభూతం, చూసింది చూసినట్టుగా, అబద్ధం ఆడకుండా చెప్పిన అతని నిజాయితీ. తల్లిదండ్రుల గదిలోకి వెళ్లి మంచం క్రింద వున్న డబ్బాని తెరిచి అందులో పక్కనే ఉన్న తుపాకీని పట్టించుకోకుండా డబ్బు మాత్రం తీసుకుని కిందకు వచ్చి అక్కడున్న తమ్ముడు డారెల్ తో గొడవపడతాడు.

అసలు తను ఈ పరిస్థితికి రావడానికి అతను కారణమని హాంక్ నమ్మకం. బార్ లో అతనితో ఉన్నప్పుడు నీ భార్య ఇక్కడ లేదు, నువ్వు వర్క్ లోనూ లేవు, ఎలాగయినా మనం అన్నదమ్ములం, ఆనందిద్దాం అని డారెల్ జేబులోంచి పైప్ తీసి అందులోని డ్రగ్స్ ని హాంక్ చేత పీల్పించాడు. తర్వాత అక్కడ బాత్‌రూం చెడిపోవడంతో మూత్రవిసర్జనకోసం హాంక్ తప్పు ద్వారం గుండా బయటపడి తప్పు సందులోకి తిరిగి – అక్కడ పోలీసులు కిందపడివున్న ఒకతన్ని కొట్టడం చూశాడు. తను ఎంత లాయర్ అయినా గానీ మందు ప్రభావం లేకపోతే మాట్లాడకుండా తన మానాన్న తను తప్పుకునేవాడేమో గానీ అప్పుడు మాత్రం “నేల మీద పడిపోయి ప్రతిఘటించని వాణ్ణి ఇంకా ఎందుకు కొడుతున్నారు?” లాంటి కొన్ని మాటలన్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. స్టేషన్ కు తీసుకువెళ్లి అతనిలో డ్రగ్స్ ఉన్నయ్యని కూడా నిర్ధారించి మూణ్ణెల్ల జైలు శిక్ష వేశారు. అందులో అధికభాగం అతను గడిపింది సైకియాట్రీ వార్డులో. భార్య అతణ్ణి విడిచి వెళ్లిపోయింది. బడిలో డీన్ మోరిస్ చూపిన వ్యాసంలో విలియమ్ తండ్రిని “అంకుల్” అంటూ డ్రగ్స్ డీలర్ లాగా చూపిస్తాడు. అంటే హాంక్ జైలులో ఉన్న సమయంలో తండ్రి అందుకని జైలు కెళ్లాడని విలియమ్ కి డారెల్ చెప్పాడన్నమాట. నిలదియ్యగా, డారెల్ “ఏమో, చెప్పివుంటా నేమో” ననడం హాంక్ అతనిమీద కలబడడానికి దారితీస్తుంది.

తండ్రి బాధని అర్థంచేసుకున్న విలియమ్, డీన్ మోరిస్ ఇంటి తలుపు తట్టి, “మీరన్నట్టుగానే కృషిచేస్తాను, నా ట్యూషన్ ఫీజు కట్టడానికి ఇది పనికొస్తుం దంటారా?” అని అమాయకంగా చూపిన వస్తువు కూడా ఫాల్స్ కాగ్నేట్ అవుతుందా అన్న ప్రశ్నని పాఠకుని మెదడులో జొనిపి రచయిత ఆపేస్తాడు. అంటే విలియమ్ చూపినఆ వస్తువుని చూసి డీన్ ఆనందిస్తాడా లేక భయపడతాడా? పర్యవసాన మెలా వుంటుంది?

అమెరికాలో చట్టాన్ని అమలుపరుస్తున్నవాళ్ళకి ఉన్న జాతి వివక్ష గూర్చి జరుపుతున్న బ్లాక్ లైవ్స్ మాటర్ ప్రతిఘటనల్లో ఎంతో కాలంగా ఆఫ్రికన్ అమెరికన్లకు జరుగుతున్న అన్యాయాలను వెలుగులోకి తెచ్చి న్యాయం ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించడం జరుగుతోంది. అలాంటి అన్యాయాన్ని కళ్ళతో చూసిన ఒక నల్లజాతికి చెందిన ప్రత్యక్ష సాక్షి నోరు విప్పడంవల్ల తన జీవితంలో అనుభవించిన పర్యవసానాల గూర్చిన కథ ఇది. కీలకమయిన ఒక సంఘటనలోని ఇద్దరు పోలీసులు తప్ప డీన్ తో మొదలుపెట్టి ప్రతి ఒక్క పాత్రా తాను చిక్కుకున్న పరిధిలోనే అసమ్మతితోనే అయినా గానీ తన విధులని నిర్వర్తిస్తూంటుంది. ఈ కథ చదివిన తరువాత “వన్ ఫ్లూ ఓవర్ కుకూస్ నెస్ట్” (సినిమా; నవల ఆధారంగా తీసినది) గుర్తుకొచ్చింది. అందులోనూ సంఘం నెలకొల్పిన నియమాల పరిధిలో నిర్వహిస్తున్న ఒక సైకియాట్రిక్ హాస్పిటల్లో మతి బాగో లేనట్లు నటించిన ఒక వ్యక్తి వచ్చి అక్కడి పేషంట్లు అందరూ అమాయకులని గ్రహించి వాళ్లకి సహాయం చెయ్యబోయి ఆ నియమాల కరెంటులో చిక్కుకుపోతాడు. ప్రేక్షకులకు జరుగుతున్న తప్పేదో తెలుస్తుంది గానీ, అక్కడున్న నర్స్ రేచెడ్ నిబంధనల కనుగుణంగానే ప్రవర్తించిందని అనగలరు గానీ, ఆమె వాటిని అతిక్రమించిందని అనలేరు. అయితే, దానికీ, ఈ కథకీ తేడా ఇందులో పోలీసుల అనుచిత ప్రవర్తన. అది ఈ కథకి కీలకమే అయినా దాన్ని సూచనప్రాయంగా మాత్రం చెప్పి మిగిలిన కథని దాని పర్యవసానంగా తీర్చిదిద్దడంలో కనిపిస్తుంది రచయిత్రి ప్రతిభ.

రచయిత్రి పరిచయం:

వివిధ  పురస్కారాలనీ బహుమతులనీ అందుకున్న ప్రతిభావంతురాలు లాడీ హబ్బర్డ్. అమెరికాలో పుట్టారు. ప్రస్తుతం న్యూ ఆర్లీన్స్ లో నివసిస్తున్నారు. ఆమె బయోగ్రఫీ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

*

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు